తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తమవుతున్నారు. ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ తనకు ప్రధాన ప్రత్యర్ధి అవుతుందేమోనన్న అంచనా కానివ్వండి.. బీజేపీ పెరిగితే తనకే ఎక్కువ రాజకీయ ప్రయోజనం అన్న భావన కానివ్వండి.. లేదా జాతీయ రాజకీయాలలో తన ప్రభావం చూపడానికి ఒక అవకాశం అన్న ఉద్దేశం కానివ్వండి.. ఇంతకాలం ఆయన బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీపై కూడా విమర్శలు కురిపించేవారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనని అనేవారు. ఇప్పటికీ ఆయన తన వైఖరి మార్చుకోకపోయినా, తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణలను ఆయన గమనించి తన రూట్ మార్చారు.
ఇప్పుడు బీజేపీపై కన్నా కాంగ్రెస్‌పై దాడి చేస్తున్నారు. తెలంగాణలో తాను చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివిధ సభలలో వివరిస్తున్నారు. పలు జిల్లాలలో నిర్మించిన కలెక్టరేట్ భవనాలను ఆయన ప్రారంభిస్తున్నారు. ఆ సందర్భంగా జరిగే సభలలో ఎన్నికల ప్రచారానికి తగిన విధంగా మాట్లాడుతున్నారు. ప్రజలు ప్రతిపక్షాల వైపు చూడకుండా ఉండడానికి ఎన్ని యత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ అంశాన్ని పెద్ద సమస్యగా మార్చుతోంది.
పేదల భూములు కొట్టేయడానికే ధరణి పోర్టల్ తెచ్చారని, తాము అధికారంలోకి వస్తే ఆ పోర్టల్‌ను బంగళాఖాతంలో కలుపుతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని ధరణి పోర్టల్ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని, అవినీతి అరికడుతుందని, దీనిని అడ్డుకునేవారిని బంగళాఖాతంలో కలపాలని ఆయన పిలుపు ఇస్తున్నారు. మొత్తం ధరణి అంశం ప్రభుత్వాన్ని కాస్త ఇబ్బందిపెడుతున్నట్లుగానే ఉంది. వివిధ నీటిపారుదల ప్రాజెక్టులు, రాష్ట్రంలో కరెంటు సరఫరా, తాగునీటి సరఫరా మొదలైన అభివృద్ది అంశాలను పదే,పదే ప్రస్తావిస్తూ మరోసారి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన కోరుతున్నారు.
మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన బాగా యాక్టివ్ అయినట్లు కనిపిస్తుంది. మరో వైపు కేటీఆర్ తనదైన శైలిలో ప్రచారం చేస్తుంటే, కేసీఆర్ జరుగుతున్న రాజకీయాలకు అనుగుణంగా ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ తెలంగాణలో హైదరాబాద్ కాకుండా మిగిలిన జిల్లాలలో బీఆర్ఎస్‌పై కాస్త నెగిటివ్ ఉందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. దానిని తగ్గించడానికి ఆయన ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
కొన్ని చోట్ల ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు. కారణం ఏమైనా సెటిలర్లలో ఎక్కువమంది బీఆర్ఎస్ పట్ల సానుకూలంగా ఉంటే, తెలంగాణలో పుట్టి పెరిగినవారిలో ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్న కథనాలు, ఇంటర్వ్యూలు తరచుగా మీడియాలో వస్తున్నాయి. ఒక్క హైదరాబాద్ లో వంతెనలు నిర్మిస్తే సరిపోతుందా.. జిల్లాల సంగతేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెబుతుంటే, దానినే ఆయనకు మైనస్ చేయడానికి ఆయా రాజకీయ పక్షాలు ,తెలంగాణవాదులు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పుంజుకుంటే బీఆర్ఎస్‌కు అది చేటు తెస్తుందని గమనించి కేసీఆర్ కాంగ్రెస్‌పై దాడి పెంచారు. అంతేకాక బీజేపీలో మొదట ఉన్న జోష్ ఇప్పుడు లేదన్న భావన ప్రబలింది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆ వాదనను కొట్టిపారేస్తున్నా, కర్నాటక ఎన్నికల తర్వాత బీజేపీ ఊపు తగ్గిందన్నది వాస్తవం. దీనివల్ల బీజేపీ కన్నా బిఆర్ఎస్ కు ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. బీజేపీ, కాంగ్రెస్‌లు సమానంగా ఓట్లు తెచ్చుకుంటే బీఆర్ఎస్ గెలుపు సులువు అవుతుంది. అలాకాకుండా ఏదో ఒక పార్టీనే ప్రత్యర్ధిగా మారితే అది టైట్ ఫైట్‌గా మారవచ్చు. కర్నాటకలో మాదిరి ముస్లిం ఓట్లు తెలంగాణలో కూడా కాంగ్రెస్ వైపు మెగ్గు చూపితే మాత్రం అది బీఆర్ఎస్‌కు బాగా నష్టం చేసే అవకాశం ఉంటుంది.
చదవండి: ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?.. కేసీఆర్ ఏమంటారో!
మామూలుగా అయితే ఇక్కడ ముస్లిం ఓట్లు హైదరాబాద్ పాతబస్తీ మినహా మిగిలినచోట్ల టీఆర్ఎస్ వైపే ఉంటారు. కాని బీజేపీని అడ్డుకోవడానికి వారు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారితే అది బీఆర్ఎస్‌కు కూడా చికాకు కలిగించవచ్చు. వీటన్నిటిని అంచనా వేసుకున్న కేసీఆర్ జిల్లాల పర్యటనల వేగం పెంచి, బీఆర్ఎస్ చెక్కు చెదరకుండా చూడడానికి అన్ని యత్నాలు చేస్తున్నారు. మరో వైపు కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత తెలంగాణలో ఆ పార్టీకి కాస్త జోష్ వచ్చింది. సంస్థాగతంగా కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ , టీఆర్ఎస్‌కు ప్రధాన పోటీదారు కాంగ్రెస్సే అన్న భావన కొంతమేర తేగలిగారు.
దానికి తగ్గట్లుగానే ఆయా నేతలు బీజేపీలో కన్నా కాంగ్రెస్‌లో చేరడానికే సుముఖత చూపుతున్నారు. అదే పెద్ద ఇండికేషన్ అని చెప్పాలి. ఖమ్మం జిల్లాలో స్ట్రాంగ్ మాన్ గా పేరొందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాని, మాజీ మంత్రి , నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు వంటివారు కాని కాంగ్రెస్ లో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. వారిని ఆకర్షించడానికి బీజేపీ యత్నించినప్పటికీ, వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వారు ఆ పార్టీలో చేరలేదు. సొంతంగా పార్టీ పెట్టడం కన్నా బీఆర్ఎస్‌ను ఓడించడానికి కాంగ్రెస్‌లో చేరితే బెటర్ అన్న అభిప్రాయానికి దాదాపుగా వచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.దామోదరరెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరవచ్చని చెబుతున్నారు.
చదవండి: చంద్రబాబు కొత్త ట్రిక్కు.. ఆ భయంతోనేనా?
అది జరిగితే నాగర్ కర్నాల్ ప్రాంతంలో కాంగ్రెస్ బలం పుంజుకుంటుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం వంటి జిల్లాలలో కాంగ్రెస్ పుంజుకుంటే అది బీఆర్ఎస్ కు గట్టిపోటీనే ఇస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీతో పోల్చితే నియోజకవర్గాలలో బలమైన క్యాడర్, నాయకత్వం కాంగ్రెస్‌కే ఉంది. పార్టీ విజయం సాదించే అవకాశం ఉందన్న నమ్మకం కుదిరితే వారంతా తీవ్రంగా కృషి చేస్తారు. బీజేపీ కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలు ఏర్పాటు చేస్తోంది.
బీజేపీ అధికారంలోకి తేవడానికి వారి ప్రయత్నాలు వారు చేస్తారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాదన్న భావన నెలకొంటే, హంగ్ వచ్చేంత బలాన్ని అయినా పొందడానికి యత్నిస్తారు. అదికాకపోతే కాంగ్రెస్ నైతే అధికారంలోకి రావాలని వారు కోరుకోరని, అది జరిగితే దేశ వ్యాప్తంగా కొంత ప్రభావం పడుతుందని వారు భావించవచ్చని చెబుతున్నారు. అప్పుడు బీఆర్ఎస్‌కే వారు ఎంతో కొంత సాయపడవచ్చన్న ప్రచారం కూడా ఉంది. మామూలుగా అయితే కేసీఆర్‌కు నల్లేరు మీద బండిలా గెలుపు రావాలి. కాని ఆయన వ్యవహార శైలి, వివిధ కారణాల వల్ల పోటీని ఎదుర్కునే పరిస్థితి తెచ్చుకున్నారనిపిస్తుంది. ఏది ఏమైనా రాజకీయం ఎప్పుడూ ఒకరి సొంతం కాదు కదా!
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment