టార్గెట్‌ కాంగ్రెస్‌!.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రత్యేక వ్యూహం | BJP special strategy On Congress in Lok Sabha elections | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ కాంగ్రెస్‌!.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రత్యేక వ్యూహం

Mar 21 2024 12:38 AM | Updated on Mar 21 2024 5:41 PM

BJP special strategy On Congress in Lok Sabha elections - Sakshi

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రత్యేక వ్యూహం 

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సీట్లు తగ్గేలా.. 

బీజేపీకి మెజార్టీ సీట్లు దక్కేలా కార్యాచరణ

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను నిలువరించే లక్ష్యంలో భాగంగానే.. 

ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నుంచి రాష్ట్ర కీలక నేతల దాకా హస్తం పార్టీపైనే విమర్శలు 

వచ్చే ఐదేళ్లలో కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని ఆరోపణలు 

ఇచ్చిన హామీల అమలుపై మభ్యపెడుతోందంటూ బీజేపీ ప్రచారం 

‘ప్రశ్నిస్తోంది తెలంగాణ’ పేరిట వరుస కార్యక్రమాలు 

వివిధ వర్గాల సమస్యలను ఎత్తిచూపుతూ నిరసనలు 

అభివృద్ధి జరగాలంటే బీజేపీ అభ్యర్థులనే గెలిపించాలని విజ్ఞప్తులు 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో ‘టార్గెట్‌ కాంగ్రెస్‌’ వ్యూహంతో బీజేపీ ముందుకెళుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలిచిన, ఇటీవలి వరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ కంటే కూడా కాంగ్రెస్‌పైనే ప్రధానంగా ఫోకస్‌ చేసింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాల నుంచి రాష్ట్ర ముఖ్యనేతలు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌ తదితరుల దాకా అంతా హస్తం పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీ లకు లోక్‌సభ ఎన్నికలు కీలకంగా మారిన నేపథ్యంలో.. రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు సీట్లు తగ్గేలా, అదే సమయంలో తాము మెజార్టీ స్థానాల్లో గెలిచేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. క్రమంగా విమర్శల దాడిని పెంచుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి మూడున్నర నెలలు అవుతోందని.. ఆ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రైతు భరోసా, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలు ఏమైందంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. 

‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’.. పేరిట క్యాంపెయిన్‌! 
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ను నిలదీసేందుకు, వ్యతిరేక ప్రచారం చేసేందుకు.. ఆరు గ్యారంటీలు, వాటి అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వపరంగా, కాంగ్రెస్‌ పార్టీపరంగా చేసిన ప్రకటనలనే బీజేపీ వినియోగించుకుంటోంది. కాంగ్రెస్‌ పార్టీ డిక్లరేషన్లు, గ్యారంటీలు పేరిట తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందంటూ.. ప్రత్యేకంగా ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ..’ పేరిట ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఇటీవలే ప్రారంభించింది. మహిళలు, విద్యార్థులు, యువత, రైతులు, వ్యవసాయ కూలీలు.. ఇలా వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలైన పింఛన్ల పెంపు, గొర్రెల పంపిణీ, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలు తీరును ప్రశ్నిస్తోంది.

కాంగ్రెస్‌ గ్యారంటీల అమలు కోసం ఒత్తిడి చేస్తూ.. ఆయా పథకాల కింద లబ్ధి ఆశిస్తున్న వారిని సమీకరిస్తోంది. వారి ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా కార్యాచరణను అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌ల ఆధ్వర్యంలో ఇప్పటికే ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి కొనసాగింపుగా ‘ప్రశ్నిస్తున్న రైతు..’ కార్యక్రమాన్ని కె.లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ‘ప్రశ్నిస్తున్న మహిళ.. ప్రశ్నిస్తున్న నిరుద్యోగి.. ప్రశ్నిస్తున్న వ్యవసాయ కూలీ..’ అంటూ కాంగ్రెస్‌ డిక్లరేషన్లు, గ్యారంటీలు, మేనిఫెస్టోలలో పొందుపరిచిన అంశాలను ఎత్తిచూపేలా ప్రణాళికలను బీజేపీ రూపొందించింది. 
 
ఘాటు విమర్శలతో దాడి 
తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలవబోతోందని తమ సర్వేల్లో వెల్లడైందని హైదరాబాద్‌లో జరిగిన పార్టీ అంతర్గత భేటీలో అమిత్‌షా వెల్లడించారు. 12న ఎల్‌బీ స్టేడియంలో పోలింగ్‌ బూత్‌ కమిటీలు, ఆపై అధ్యక్షులతో నిర్వహించిన విజయ సంకల్ప సమ్మేళనంలో రైతులు, ఓబీసీలు, యువత, మహిళలు, పేదల అభ్యున్నతి గురించి కాంగ్రెస్‌కు ఏమాత్రం పట్టదంటూ విరుచుకుపడ్డారు. ఇక ఈనెల 4న ఆదిలాబాద్‌లో, 5న పటాన్‌చెరులో, 16న నాగర్‌కర్నూల్‌లో 18న జగిత్యాలలో జరిగిన సభల్లో ప్రసంగించిన ప్రధాని మోదీ కూడా.. కాంగ్రెస్‌ లక్ష్యంగా ఘాటు విమర్శలు చేశారు.

‘‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య తెలంగాణ నలిగిపోయింది. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టులతో దోపిడీకి పాల్పడితే.. ఇప్పుడు కాంగ్రెస్‌ సర్కార్‌ భూములు, ఇతర ఆస్తుల కైంకర్యానికి దిగుతోంది. తెలంగాణను మళ్లీ నాశనం చేసేందుకు కాంగ్రెస్‌కు ఐదేళ్లు చాలు..’’ అని ఆరోపణలు చేయడం గమనార్హం. అంతేకాదు దేశవ్యాప్తంగా బీజేపీని 400 సీట్లలో గెలిపిస్తే.. కాంగ్రెస్‌ పార్టీ ఇష్టానుసారం చేయడం సాధ్యం కాదని, తెలంగాణలోని అన్ని ఎంపీ సీట్లలో బీజేపీ కమలం పువ్వును వికసించేలా చేయాలని కూడా పిలుపునిచ్చారు.  

డబుల్‌ డిజిట్‌ ఇవ్వాలంటూ 
రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు 15 చోట్ల అభ్యర్థులను బీజేపీ ఇప్ప టికే ప్రకటించింది. అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. రాష్ట్రంలో గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై  విమర్శలు చేస్తూనే.. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్‌ సర్కారు హామీల అమల్లో విఫలమైందంటూ ఎండగడుతున్నారు. బీఆర్‌ఎస్‌ ఎంపీ సీట్లు గెలిచి జాతీ య స్థాయిలో చేసేదేమీ లేదని.. కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ అవి నీతి, అక్రమాల పాలన వస్తుందని ఆరోపిస్తున్నారు.

బీజేపీని అత్యధిక స్థానాల్లో గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో గత ఎన్నికలప్పుడు బీజేపీ ఓట్ల శాతాన్ని ప్రజలు రెండింతలు చేశారని.. ఈసారి డబుల్‌ డిజిట్‌లో ఎంపీ సీట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి కనీసం పది ఎంపీ సీట్లను కచ్చితంగా గెలుచుకోవాలని రాష్ట్ర పార్టీకి బీజేపీ జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. అదనంగా మరో రెండు స్థానాల్లో గెలిచేలా కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement