కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్‌ఎస్ నుంచి ముగ్గురు, ఒక సీపీఐ ఎమ్మెల్యేకు జారీ
వారి ఎన్నికను సవాల్ చేస్తూ.. మూడు బెంచ్‌ల వద్ద ఏడు పిటిషన్ల విచారణ
కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం.. వచ్చే నెలలో వేర్వేరుగా విచారణ
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యులుగా ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పలు పిటిషన్లకు సంబంధించి కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరు, బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ముగ్గురు, ఒక సీపీఐ ఎమ్మెల్యేకు హైకోర్టు శుక్రవారం వేర్వేరుగా నోటీసులు జారీ చేసింది. వారంతా వచ్చే నెలలోగా స్పందించి కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చేనెల (ఏప్రిల్ 16, 18, 19 తేదీలకు) వాయిదా వేసింది.
అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ..
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ (బీఆర్‌ఎస్), జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ (బీఆర్‌ఎస్), ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మి (బీఆర్‌ఎస్), మహబూబ్‌నగర్ నుంచి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్), దేవరకద్ర నుంచి జి.మధుసూదన్‌రెడ్డి (కాంగ్రెస్), కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు(సీపీఐ) విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఓడిన ప్రత్యర్థులు కొందరు వీరి ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
వారు ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారని, సరైన సమాచారం ఇవ్వలేదని వాటిలో పేర్కొన్నారు. ఆ ఎమ్మెల్యేల ఎన్నికను కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ సూరేపల్లి నందా తదితరులతో కూడిన వేర్వేరు ధర్మాసనాలు శుక్రవారం విచారణ చేపట్టారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేశాయి.
ఎవరెవరిపై పిటిషన్లు..?
మహబూబ్‌నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిటిషన్ వేశారు; జూబ్లీహిల్స్ నుంచి బీఆర్‌ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్, నవీన్‌యాదవ్..; కొత్తగూడెం నుంచి సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ఎన్నికను సవాల్ చేస్తూ కొత్తగూడెం పట్టణానికి చెందిన నందూలాల్ అగర్వాల్..;
ఆసిఫాబాద్ నుంచి బీఆర్‌ఎస్ నేత కోవ లక్ష్మి ఎన్నికను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్..; ఖైరతాబాద్ నుంచి బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్ (ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు) ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి పి.విజయారెడ్డి..; దేవరకద్ర నుంచి కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన జి.మధుసూదన్‌రెడ్డి ఎన్నిక రద్దు కోరుతూ బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment