పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో బీఆర్‌ఎస్ యోచన
హైకోర్టు తాజా తీర్పుపై స్పీకర్ వైఖరిని బట్టి భవిష్యత్తు పోరాటంపై నిర్ణయం
మహారాష్ట్ర, హిమాచల్‌లో ఫిరాయింపులు.. స్పీకర్లు, కోర్టుల స్పందనపై అధ్యయనం
మహారాష్ట్రలో రెండేళ్లుగా నలుగుతున్న అనర్హత అంశం
హిమాచల్‌ప్రదేశ్‌లో అనర్హులుగా ప్రకటించిన స్పీకర్..
స్టేకు సుప్రీం నిరాకరణతో ఉప ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో అసెంబ్లీ స్పీకర్ నుంచి సానుకూల స్పందన రాని పక్షంలో మరోమారు కోర్టును ఆశ్రయించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. ఫిరాయింపులపై పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద వేసిన రిట్ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు సోమవారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. స్పీకర్ నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్ అనుసరించే వైఖరిని బట్టి తమ భవిష్యత్తు న్యాయ పోరాటం ఉంటుందని బీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్‌రావు (భద్రాచలం), కడియం శ్రీహరి (స్టేషన్ ఘనపూర్)పై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఈ ఏడాది మార్చిలో స్పీకర్‌కు బీఆర్‌ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. స్పీకర్ స్పందించకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా కోర్టు తీర్పు నేపథ్యంలో.. ఇటీవలి కాలంలో ఇదే తరహాలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఆయా రాష్ట్రాల స్పీకర్లు అనుసరించిన వైఖరిని బీఆర్‌ఎస్ పరిశీలిస్తోంది. మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఫిరాయింపులు, ఆయా సందర్భాల్లో స్పీకర్, కోర్టులు స్పందించిన తీరును అధ్యయనం చేస్తోంది.
మహారాష్ట్ర, హిమాచల్‌లో ఏం జరిగింది?
మహారాష్ట్రలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశం సుమారు రెండేళ్లుగా అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. 2022 జూన్ 21న ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కొందరు శివసేన ఎమ్మెల్యేలతో సొంత గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో కొందరు ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు కూడా షిండే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో చేరారు. షిండే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ అప్పట్లో సీఎంగా ఉన్న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే డిప్యూటీ స్పీకర్ (స్పీకర్ పదవి ఖాళీగా ఉండటంతో)కు పిటిషన్లు సమరి్పంచారు.
మరోవైపు తమదే అసలైన శివసేన అంటూ షిండే వర్గం అనర్హత పిటిషన్లు ఇచి్చంది. అయితే కొత్త స్పీకర్ ఈ అనర్హత పిటిషన్లపై స్పందించకపోవడంతో విషయం సుప్రీంకోర్టుకు చేరింది. తొలుత 2023 డిసెంబర్ 31లోగా అనర్హత పిటిషన్ల అంశాన్ని తేల్చాలని స్పీకర్‌కు గడువు విధించిన సుప్రీంకోర్టు.. ఆ తర్వాత మరో పది రోజులు పొడిగిస్తూ ఈ ఏడాది జనవరి 10వరకు గడువు విధించింది. అయితే స్పీకర్.. షిండే, ఉద్ధవ్ వర్గాలు ఇచ్చిన అనర్హత పిటిషన్లను తిరస్కరించారు.
దీంతో అనర్హత వేటు అంశం మరోమారు సుప్రీంకోర్టుకు చేరింది. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర స్పీకర్ ఈ ఏ డాది ఫిబ్రవరి 29న అనర్హత వేటు వేశారు. అయితే తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉపఎన్నిక నిర్వహించవద్దని అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఈ అంశంలో స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఉప ఎన్నికలు జరిగాయి.
మరో ఏడుగురు ఎమ్మెల్యేలపైనా వేటు వేయాలి
హిమాచల్ తరహాలో ఉప ఎన్నికలు జరిగేలా చూడాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్, తెల్లం వెంకట్‌రావు, కడియం శ్రీహరితో పాటు మరో ఏడుగురు ఎమ్మెల్యేలపై ఇచ్చిన అనర్హత పిటిషన్లపైనా స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరుతోంది. కాంగ్రెస్‌లో చేరిన అరికెపూడి గాం«దీ, ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, గూడెం మహిపాల్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కూడా అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పిటిషన్లు సమరి్పంచింది. కోర్టు తీర్పులో పేర్కొన్న ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఈ ఏడుగురు ఎమ్మెల్యేలను కూడా అనర్హులుగా ప్రకటించని పక్షంలో కోర్టుకు వెళ్లాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment