‘అనర్హత’అంశంపై హైకోర్టులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వాదనలు
తదుపరి విచారణ 11కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపుల అంశంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీళ్లకు విచారణార్హత లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు వాదించారు. ‘పదవ షెడ్యూల్‌ను ఉల్లంఘించిన వ్యక్తులను అనర్హులుగా ప్రకటించాలనే రాజ్యాంగ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటే, ఫిర్యాదు చేసిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో స్పీకర్ ముందు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా లోక్‌సభ, శాసనసభల జీవితకాలం ఐదేళ్లు మాత్రమే. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత సమయంలో తీర్పు వెలువరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ఇక్కడ 8 నెలలైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు..’అని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి (స్టేషన్‌ఘన్‌పూర్), తెల్లం వెంకట్రావు (కొత్తగూడెం) దానం నాగేందర్ (ఖైరతాబాద్)లను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్లు దాఖలు వేశారు. అలాగే దానంను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యా దు చేసేందుకు ప్రయత్నించినా స్పీకర్ సమ యం ఇవ్వడం లేదంటూ బీజేపీ పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై విచారణ షెడ్యూల్‌ను నాలుగు వారాల్లోగా ఖరారు చేయాలని సెప్టెంబర్ 9న సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి గత నెల హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్ రావు ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు విన్పించారు.
గడువులోగా నిర్ణయం తీసుకోవాలి..
‘ఎమ్మెల్యేగా గెలిచిన ఓ నేత పార్టీ మారడమే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఆయనను ప్రజలు ఓడించారు. మహారాష్ట్ర, మణిపూర్ కేసులలో సుప్రీంకోర్టు వెలువరించిన రెండు తీర్పులను పరిశీలిస్తే.. తమ ముందు పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై నిరీ్ణత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రూల్ 6, 7 ప్రకారం స్పీకర్ నడుచుకోవడం లేదు. వెంటనే నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలి..’అని మోహన్‌రావు కోర్టును కోరారు. కాగా ఏలేటి తరఫున న్యాయవాది జె.ప్రభాకర్ వాదనల కోసం తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment