
సాక్షి,ఢిల్లీ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతకు (MLAs Disqualification) సంబంధించిన కేసు కొనసాగుతున్న తరుణంలో సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాను పార్టీ ఫిరాయించలేదని,కాంగ్రెస్‌లో చేరలేదంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ అఫిడవిట్‌లో తాను ఇప్పటికీ బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచాక మర్యాదపూర్వకంగా తాను సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని స్పష్టం చేశారు. మీడియా వక్రీకరించిందని, తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని పేర్కొన్నారు.
తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ అంశంపై బీఆర్‌ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమ పార్టీమీద గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై చివరి సారిగా (మార్చి 4,మంగళవారం) జరిగిన విచారణలో ఎమ్మెల్యేల అన్హత విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది.
ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్
బీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పార్టీ మారి నెలలు గడుస్తున్నా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాప్యం చేయడంపై తీవ్రంగా పరిగణించింది. విచారణలో ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెండ్ డెడ్’ ధోరణి సరైంది కాదని వ్యాఖ్యానించింది.
తదుపరి విచారణ(మార్చి 25)లోగా వివరణ ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు, తెలంగాణ ప్రభుత్వం, స్పీకర్ కార్యాలయం, తెలంగాణ శాసనసభ కార్యదర్శి, భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. విచారణను మార్చి 25కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment