మహారాష్ట్ర స్పీకర్ మాదిరి వ్యవహరిస్తారా?
ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
ఎంత సమయం కావాలో అడగడానికి హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం
పది నెలలుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న పిటిషనర్ల న్యాయవాదులు
సాక్షి, న్యూఢిల్లీ: ‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు? అసలు మీకెంత సమయం కావాలి? అసెంబ్లీ కాలపరిమితి ముగిసేంత సమయం కావాలా?’అంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మీకెంత సమయం కావాలో చెప్పండంటూ ఆదేశించింది. బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచి, పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా శాసనసభ స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఈనెల 15న సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ పేర్లతో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్పి)ను దాఖలు చేసింది. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాం«దీలపై బీఆర్‌ఎస్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరుల పేర్లతో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎస్‌ఎల్పిపై శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మసిహ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది.
పది నెలలుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు
పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై పది నెలలుగా స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు దామ శేషాద్రి నాయుడు, పొనుగోటి మోహిత్‌రావు సుప్రీంకోర్టుకు తెలిపారు. తమ పిటిషన్లపై హైకోర్టు ఉత్తర్వులు వచ్చి ఏడు నెలలైనా స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని నివేదించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారని స్పీకర్ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ చెప్పగా.. ఫిర్యాదులపై నోటీసులు ఇచ్చేందుకు స్పీకర్ కార్యాలయానికి పది నెలల సమయం పట్టిందా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది.
రీజనబుల్ టైం అంటే ఎంత?
పార్టీ ఫిరాయింపులపై స్పందించేందుకు స్పీకర్ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఎంత అని న్యాయవాది రోహత్గీని జస్టిస్ గవాయి ప్రశ్నించారు. ఇందుకు రోహత్గీ బదులిస్తూ.. స్పీకర్ నిర్ణయానికి సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతంలో ఇచి్చన తీర్పును చదివి వినిపించారు. నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ ఎమ్మెల్యేలకు తగిన సమయం ఇవ్వాలని ఆ తీర్పులో ఆదేశాలు ఇచ్చిందన్నారు.
జస్టిస్ గవాయి జోక్యం చేసుకుని ‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ కాలపరిమితి ముగింపు దశలో నిర్ణయం తీసుకుంటారా? అనర్హత విషయంలో మహారాష్ట్ర స్పీకర్ మాదిరిగా వ్యవహరిస్తారా?’అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపులపై స్పందించేందుకు ఎంత సమయం కావాలో అసెంబ్లీ సెక్రటరీ కనుక్కుని చెప్పాలని ధర్మాసనం సూచించింది. ఇందుకు మీకెంత సమయం కావాలో చెప్పాలని ధర్మాసనం రోహత్గీని అడగ్గా.. రెండు వారాలు కావాలని బదులిచ్చారు. రోహత్గీ విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ.. ‘ఈ అంశం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరమైతే లేదు. ఫోన్ కాల్ సరిపోతుంది’అంటూ జస్టిస్ గవాయి చమత్కరించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి ధర్మాసనం వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment