![Supreme Court to Hear Pleas Regarding Party Defections in Telangana](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/supreme%20court.jpg.webp?itok=xxnKxte3)
ఢిల్లీ: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ సోమవారం సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
ఇంతకు ముందు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును బీఆర్‌ఎస్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లో చర్యలు తీసుకోవాలని గతంలోనే తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
కేటీఆర్ రిట్ దాఖలు
ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్‌ఎ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ నడుస్తోంది. ఈ క్రమంలో.. ఈ రెండు పిటిషన్లను కలిపి 10వ తేదీన విచారణ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.
బీఆర్‌ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్,అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్‌లు కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు.
మరో పిటిషన్‌లో..
ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సహా పలువురు స్పెషల్ లీవ్ పిటిషన్(SLP) వేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను శుక్రవారం(జనవరి 31న) విచారణ జరిపింది. ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని కిందటి ఏడాది మార్చి తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని, అయితే కోర్టు ఆదేశాలను తెలంగాణ స్పీకర్ ధిక్కరించారని, కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని పాడి కౌశిక్‌రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే.. సంబంధిత ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారని అసెంబ్లీ సెక్రటరీ, తెలంగాణ స్పీకర్ తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఫిరాయింపుల వ్యవహారాల్లో స్పీకర్ తొందరపాటు నిర్ణయాలు సరికాదని గతంలో సుప్రీం కోర్టు చెప్పడాన్ని ఆయన బెంచ్ ముందు ప్రస్తావించారు. కాబట్టి, స్పీకర్ నిర్ణయానికి తగు సమయం కావాలని ఆయన కోరారు.
అయితే.. ఇంకెంత కాలం ఎదురుచూస్తారని, మహారాష్ట్రలో లాగా ఎమ్మెల్యేల పదవికాలం అయ్యేదాకా ఎదురు చూస్తారా? అని సుప్రీం కోర్టు తెలంగాణ స్పీకర్‌పై అసహనం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ అడిగి చెప్తానని లాయర్ రోహత్గి చెప్పడంతో విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. రేపు (ఫిబ్రవరి 10న) కౌశిక్ రెడ్డి ఎస్‌ఎల్‌పీ, కేటీఆర్ రిట్ పిటిషన్‌లను కలిపి సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.
Comments
Please login to add a commentAdd a comment