![Live Updates On Supreme Court To Hear Party Defections In Telangana](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/supreme%20court.jpg.webp?itok=_UpWh5i7)
ఢిల్లీ: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణ ఫిబ్రవరి 18కి వాయిదా పడింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఇవాళ (సోమవారం) సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సమయంలో తెలంగాణ స్పీకర్ తరుఫున ముకుల్ రోహ్గతి వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. తమకు వాదనలు వినిపించేందుకు రెండు మూడు రోజులు సమయం కావాలని కోరారు. రోహ్గతి విజ్ఞప్తిపై స్పందించిన అత్యున్నత న్యాయ స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంటరీ ప్రక్రియను ఫ్రస్ట్రేషన్‌కు గురి చేయొద్దు. ప్రజాస్వామ్యంలో పార్టీలకు హక్కులు ఉంటాయి. తగిన సమయం అంటే ఏంటి? అని ప్రశ్నించింది. పార్టీ మారి పది నెలలు అవుతుంది. ఇది రీజనబుల్ టైం కాదా? అని వ్యాఖ్యానించింది. అందుకు సుప్రీం కోర్టు ఇచ్చిన టైం ప్రకారం.. రీజనబుల్ టైం అంటే మూడు నెలలే అంటే బీఆర్‌ఎస్ తరుఫు న్యాయవాది తన వాదనల్ని వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణను వాయిదా వేసింది.
బీఆర్‌ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్,అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్‌లు కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు.
ఇంతకు ముందు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును బీఆర్‌ఎస్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లో చర్యలు తీసుకోవాలని గతంలోనే తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/30_40.png)
Comments
Please login to add a commentAdd a comment