
అన్నీ తమకే తెలుసనుకుంటారు
మనల్ని పాత తరంగా భావిస్తారు
యూట్యూబర్ తీరుపై సుప్రీం కన్నెర్ర
మేమేం చేయగలమో తెలిసినట్టు లేదు
పశ్చాత్తాపపడుతున్నారనే ఆశిస్తున్నాం
రణ్‌వీర్, రాణాలపై కోర్టు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశమంతటా రచ్చ అయిన ‘ఇండియా హాజ్ గాట్ టాలెంట్’ యూట్యూబ్ షో వివాదం తాలూకు మంటలు ఇంకా చల్లారడం లేదు. ఆ షోలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి ప్రముఖ యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా చిక్కుల్లో పడటం తెలిసిందే.
మెదడులోని చెత్తనంతా వాంతి రూపంలో బయట పెట్టుకున్నారంటూ సుప్రీంకోర్టు ఆయనకు తీవ్రంగా తలంటింది కూడా. ఈ వ్యవహారంలో రణ్‌వీర్‌తో పాటు సదరు షో హోస్ట్ సమయ్ రైనా కూడా పలు కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. ఇంతటి రగడకు కారణమైన ఆ వివాదాస్పద ఎపిసోడ్‌పై ఇటీవల కెనడాలో నిర్వహించిన ఒక షోలో సమయ్ వ్యంగ్యాస్త్రాలు విసిరి తాజాగా మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురయ్యారు.
‘‘బాగా ఫన్నీగా ఏవేవో చెప్పి నవ్విస్తానని అనుకుంటున్నారేమో! బీర్‌బైసెప్స్ (రణ్‌వీర్ అలహాబాదియా)ను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి! బహుశా నా టైం బాగా లేనట్టుంది. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి. నా పేరే సమయ్’’ అని ప్రేక్షకులను ఉద్దేశించి రైనా వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ షో టికెట్లు కొనడం ద్వారా నా కోర్టు ఖర్చులను భరించినందుకు కృతజ్ఞతలు’’ అంటూ ముక్తాయించారు. సోమవారం అలహాబాదియా పిటిషన్‌పై విచారణ సందర్భంగా రైనా తాజా వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ వాటిపై కన్నెర్ర చేసింది.
‘‘ఈ అతి తెలివి కుర్రాళ్లు తమకే అన్నీ తెలుసనుకుంటారు. మనల్ని బహుశా పనికిరాని పాత తరంగా భావిస్తారేమో తెలియదు! వీళ్లలో ఒకరు కెనడాకు వెళ్లి మరీ ఆ పనికిమాలిన ఎపిసోడ్‌ను మరోసారి పనిగట్టుకుని ప్రస్తావించారు. ఈ కోర్టు న్యాయపరిధి ఎంతటిదో, తలచుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోగలదో బహుశా వీళ్లకు తెలిసినట్టు లేదు’’ అంటూ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా హెచ్చరించారు.
‘‘కాకపోతే ఎంతైనా వాళ్చ్లు కుర్రాళ్లు. మేం అర్థం చేసుకోగలం. అందుకే అలాంటి చర్యలేవీ తీసుకోదలచలేదు’’ అని స్పష్టం చేశారు. చేసిన తప్పులకు వాళ్లు ఇప్పటికైనా పశ్చాత్తాపపడుతున్నారని ఆశిస్తున్నట్టు చెప్పారు.
హక్కులతో పాటే బాధ్యతలు
అలహాబాదియాకు కూడా ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ గట్టిగా చురకలు వేశారు. ‘‘కొందరు గిరాకీ లేని వ్యక్తులు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరిట పనికిరాని వ్యాసాలు రాసి వదులున్నారని మాకు తెలుసు. వారిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా బాగా తెలుసు. ప్రాథమిక హక్కులు తమ సొత్తని ఎవరైనా భావిస్తే పొరపాటు.
మన దేశంలో ఎవరికైనా సరే, బాధ్యతలతో పాటు హక్కులు వర్తిస్తాయి. హక్కులను ఆస్వాదించాలంటే వాటితో పాటుగా రాజ్యాంగం కల్పించిన బాధ్యతలను నిర్వర్తించి తీరాల్సిందే. దీన్ని అర్థం చేసుకోని వారిని ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు’’ అని హెచ్చరించారు. రణ్‌వీర్ యూట్యూబ్ షోపై విధించిన నిషేధాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం ఎత్తేసింది. ఇకపై నైతిక ప్రమాణాలకు లోబడి పద్ధతిగా వ్యవహరించాలని హెచ్చరించింది. ఈ మేరకు హామీ పత్రం సమర్పించాల్సిందిగా ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment