
కుర్చీని కాపాడుకోవడానికే బీజేపీపై రేవంత్ విమర్శలు
కొడంగల్‌లో సీఎం మళ్లీ గెలిచే పరిస్థితి లేదు
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి మతి స్థిమితం లేకుండా, బాధ్యతారహి తంగా మాట్లాడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం తన కుర్చీని కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీని మెప్పించడానికి ప్రధాని మోదీని, బీజేపీని టార్గెట్ చేశారన్నారు. తెలంగాణను రాహుల్ పాదాల వద్ద రేవంత్ తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. రేవంత్ చెబుతున్నట్టుగా తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వడం కాదని.., హామీలు అమలు చేయనందుకు ప్రజలే రాహుల్‌ని ఇక్కడ అడుగుపెట్టనివ్వరని వ్యాఖ్యానించారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొడంగల్‌లో మళ్లీ పోటీ చేస్తే రేవంత్ గెలిచే పరిస్థితి లేదని, అక్కడ ఆయన రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో కొడంగల్‌లో అసెంబ్లీ ఎన్నికల కంటే కాంగ్రెస్‌కు 23 వేల ఓట్లు తగ్గాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అక్కడ రేవంత్‌ని ఓడించేది బీజేపీనే. ఉప ఎన్నిక వస్తే అక్కడ ఆయన బీజేపీ చేతిలో ఓడిపోవడం ఖాయం.
సొంత సీటులోనే గెలిచే సత్తా లేని రేవంత్.., తెలంగాణ నుంచి బీజేపీని ఖతం చేస్తామనడం బుడ్డర్ ఖాన్ మాటలే’అని అన్నారు. ‘హామీలు అమలు చేయకుండా అహ్మదాబాద్‌లో గొప్పలు చెప్తావా? గ్యారంటీలపై చర్చకు సిద్ధమా? రాహుల్ గాంధీకి తెలంగాణకు వచ్చేందుకు ముఖం లేదు. దమ్ముంటే హెచ్‌సీయూలో రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టగలరా?’అని మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. తన పదవికి కౌంట్ డౌన్ మొదలైందని భావిస్తున్న రేవంత్‌రెడ్డి, ఎలాగైనా దానిని కాపాడుకోవాలనే ఎత్తుగడలో భాగంగానే మోదీ, బీజేపీలపై విమర్శలు సంధిస్తున్నారన్నారు.