
హైదరాబాద్,సాక్షి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు.
గుజరాత్‌లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన అఖిల భారత కాంగ్రెస కమిటీ సదస్సు ‘న్యాయ్‌పథ్’లో.. బ్రిటిషర్ల కంటే బీజేపీ నాయకులు చాలా ప్రమాదకమైన వారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు, గాంధీ ఆలోచనలను రాహుల్ గాంధీ ముందుకు తీసుకెళుతుంటే ప్రధాని మోదీ గాడ్సే విధానాలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడారు. రేవంత్ మతి స్థిమితం లేకుండా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. రాహుల్ మెప్పు కోసం మాట్లాడారు. రేవంత్ తెలంగాణను రాహుల్ గాంధీ పాదాల వద్ద తాకట్టు పెట్టారు. రాజ్యాంగేతర శక్తి మీనాక్షి నటరాజన్ సెక్రటేరియేట్‌లో అడుగు పెట్టారు. సీఎం లేనప్పుడు అజ్ఞాత వ్యక్తి సెక్రటరియేట్‌లో రివ్యూ చరిత్రలో లేదు.
రేవంత్ నీ స్థాయిని మించి మోదీపై మాట్లాడటం మానుకో. ప్రధాని పదవి కోసం నెహ్రూ దేశాన్ని ముక్కలు చేశారు. దేశ విభజనకు కారణం కాంగ్రెస్. రేవంత్ చరిత్ర మర్చిపోయిన దేశ ప్రజలు మర్చిపోలేదు. హామీలు అమలు చేయకుండా అహ్మదాబాద్‌లో గొప్పలు చెప్తావా?గ్యారంటీలపై చర్చకు సిద్దమా? రాహుల్ గాంధీపై తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.
హామీలు అమలు చేయనందుకు ఆయన్ను రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వరు. దమ్ముంటే హెచ్‌సీయూలో రాహుల్ గాంధీ మీటింగ్ పెడతారా? త్వరలో కాంగ్రెస్ ముక్త్ భారత్ రాబోతుంది. రేవంత్ ఇచ్చిన హామీలు నెరవేర్చననే నమ్మకం ఉంటే రాజీనామా చేసి ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?’ అని ప్రశ్నించారు.