
వరుసగా రెండో ఏడాది కూడా ఆరు గ్యారంటీలకు నిధులు లేవు
బీజేపీ ఎల్పినేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు పాతరేసే రీతిలో రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం శాసనసభలో జరిగిన సాధారణ చర్చలో మహేశ్వర్‌రెడ్డి బడ్టెట్ తీరుతెన్నులను ఎండగట్టారు. ఇది కమీషన్ల ప్రభుత్వమంటూ తీవ్ర విమర్శలు చేశారు. ‘తెలంగాణలో ప్రజల బతుకులు బాగుపడతాయని భావిస్తే అప్పుల కుప్పగా చేశారు. గత పాలకుల అవినీతిని కక్కిస్తామని హడావుడి చేసి 14 నెలలుగా ఎవరిపైనా కేసులు, రికవరీలు లేవు. ఆరు గ్యారంటీలకు నిధుల కేటాయింపు అసమగ్రంగా ఉంది.
అనేక పథకాలకు వరుసగా రెండో బడ్జెట్‌లోనూ ఎలాంటి కేటాయింపులు లేవు. కేవలం ఏడాదిన్నరలోపే రూ.1.63 లక్షల కోట్లు అప్పు తెచ్చి పురోగతి ఎలా సాధ్యమో చెప్పాలి. రుణమాఫీకి రూ.42వేల కోట్లు అవసరం కాగా, రేవంత్ కటింగ్ మాస్టర్ అవతారం ఎత్తి రూ.29వేల కోట్లు ఎగవేశారు. మూసీ ప్రక్షాళనపై డీపీఆర్‌లో అంచనాలు పెంచుతూ జేబు నింపుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూ భారతి మార్గదర్శకాలు విడుదల చేయడంతోపాటు ధరణి అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి.
రూ.2.50 లక్షల కోట్ల విలువ చేసే అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైనట్టు గతంలో ఆరోపణలు చేసిన కాంగ్రెస్ వివరాలు బయట పెట్టాలి. రాజీవ్ యువ వికాసం కింద 35 లక్షల మంది యువత ఉంటే 10 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారు. పదిశాతం జనాభా ఉన్న మైనారిటీ బీసీలకు రూ.3,500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం హిందూ బీసీలకు రూ.11వేల కోట్లు మాత్రమే కేటాయించి మోసం చేస్తోంది’అని మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వస్తున్న తనను స్పీకర్‌కు సమాచారం ఇవ్వకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మహేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. నిర్మల్ నియోజకవర్గ పరిధిలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీతో ఎస్‌ఆర్‌ఎస్‌పీ ఆనకట్టకు ప్రమాదం పొంచి ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు.
ప్రధానమంత్రి దగ్గరకు తీసుకెళ్లండి.. కలిసివస్తాం : ఏలేటికి మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్
రాష్ట్రాభివృద్ధి విషయంలో కేంద్రం నుంచి నిధుల సాధనకు చర్చించేందుకు పీఎం నరేంద్రమోదీ దగ్గరకు తీసుకెళ్లాలని, తాము ఎలాంటి భేషజాలు లేకుండా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అసెంబ్లీలో ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావుకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. హామీల అమలు పక్కన పెట్టి..మూసీ ప్రాజెక్టు ఎందుకు ముందు వేసుకున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు కల్పించుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని పెద్దలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment