సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రూ.వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని.. 2 రోజుల్లో ప్రభుత్వ అవినీతి కుంభకోణాన్ని బయటపడపెడతానంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ, కుంభకోణంలో మంత్రుల హస్తం ఉందని.. పూర్తి అధారాలతో కుంభకోణాన్ని బయటపెడతానన్నారు.
‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. అయినా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. కనీసం కొత్త సంవత్సరం అయినా గుర్తు తెచ్చుకుని నెరవేర్చాలి. ఏడాది పాటు ప్రజలను ఇబ్బందులు పెట్టి కనీసం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడంలేదు. ఈ దుర్మార్గాలను ఇకనైనా వీడి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. గత ఏడాది ఎగవేతల నామ సంవత్సరంగా ముగిసింది’’ అని మహేశ్వర్‌రెడ్డి చెప్పారు.
గత ఖరీఫ్‌లో రైతు భరోసా ఇవ్వలేదు.. ఇప్పుడు రబీ సీజన్‌లో అయినా ఇస్తారా?. మాయమాటలతో మోసం చేయడం తప్పా.. వారికి మంచి చేసే ఆలోచన కాంగ్రెస్‌కు ఉందా?. ఉప ముఖ్యమంత్రి భట్టి స్వయంగా రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు ఇస్తామని మాట ఇచ్చారు.. ఆ మాట ఇచ్చి డిసెంబర్ 28తోనే ఏడాది దాటిపోయింది. వారికి ఇవ్వకుండా ఆయన్ను అడ్డుకునేది ఎవరు?. లేదా ఆ డబ్బులు మరెవరికైనా కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు దాచారా?. మంత్రి పొంగులేటి కూడా ఇదే మాట ఇచ్చారు.. ఏమైంది?’’ అంటూ మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.
‘‘రైతు భరోసాపై కమిటీ ఏర్పాటు చేసి 15 రోజుల్లో నివేదిక ఇస్తామన్నారు.. ఈ కమిటీ ఏర్పడి 4, 5 నెలలు దాటింది. అయినా దానికి సంబంధించిన విధి విధానాలు ఎందుకు ఇవ్వలేకపోయారు. 4వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో రైతు భరోసాపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఎప్పటిలోగా ఇస్తారో తేదీ కూడా అదే రోజు ప్రకటించాలి. 15 వేల చొప్పున ఇవ్వాలంటే ఒక్క సీజన్‌కు 23 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. రెండు సీజన్లకు కలిపి 46 వేల కోట్లు బకాయి ఉంది. కానీ సర్కార్ బడ్జెట్‌లో 15 వేల కోట్లు మాత్రమే కేటాయించింది. మిగిలినవి ఎలా ఇస్తారో కాంగ్రెస్ సర్కార్ సమాధానం చెప్పాలి’ అని మహేశ్వర్‌రెడ్డి నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment