
హైదరాబాద్ : బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజాసింగ్ తో బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో ఎన్ గౌతంరావు అభ్యర్థిత్వాన్ని రాజాసింగ్ వ్యతిరేకించడంతో బండి సంజయ్ రంగంలోకి దిగారు. అయితే గౌతంరావును గెలిపించడానికి కృషి చేస్తానని బండి సంజయ్ కు రాజాసింగ్ స్పష్టం చేశారు. పార్టీ లైన్లలోనే పని చేస్తానని రాజాసింగ్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలలో కార్పొరేటర్లతో కో ఆర్డినేషన్ చేస్తానని రాజా సింగ్ తెలిపారు.

ఈ క్రమంలోనే గౌతంరావును అక్కడకు రప్పించి రాజాసింగ్ తో కరాచలనం చేయించారు బండి సంజయ్. దీనిలో రాజాసింగ్, గౌతంరావులు పరస్పరం శాలువాలతో సత్కరించుకున్నారు. అదే సమయంలో పార్టీలో ఇబ్బంది లేకుండా చూసుకుంటానని రాజాసింగ్‌కు బండి సంజయ్ కూడా భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ పోటీలో ఉండాలని బండి సంజయ్ పట్టుబట్టి మరీ అక్కడ అభ్యర్థిని నిలబెట్టారు. దీనిలో భాగంగా హైదరాబాద్ లోనే తిష్టవేసిన బండి సంజయ్.. కార్పోరేటర్లతో కూడా సమావేశమయ్యారు.
హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తో భేటీ సందర్భంగా ముందుగా పాతబస్తీలోని ఆకాష్ పురి హనుమాన్ దేవాలయానికి బండి సంజయ్ చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయానికి చేరుకునే క్రమంలో రాజాసింగ్.. బండి సంజయ్‌కు స్వాగతం పలికారు.
కేటీఆర్ పై విమర్శలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు బండి సంజయ్. హెచ్ సీయూ భూముల అంశానికి సంబంధించి బీజేపీ ఎంపీ ఉన్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ‘ బీజేపీ ఎంపీ ఉంటే పేరు ఎందుకు బయటపెట్టడం లేదు. కేటీఆర్ కళ్లు, చెవులు దొబ్బినాయ్.. వాడు, వీడు అని మాట్లాడుతున్నాడు. HCU భూముల కోసం కోట్లడింది మేము. ఎబివిపి కార్యకర్తలు ఇప్పటికీ జైల్ లో ఉన్నారు. HCU భూముల అమ్మకుండా కోర్టు అడ్డుకుంటుందని మాకు నమ్మకం ఉంది. రాజా సింగ్ బీజేపీ ఎమ్మెల్యే, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీలో ఎటువంటి విభేదాలు లేవు’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.