issues notice
-
మా ముందు హాజరై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ఓ భవన నిర్మాణ అనుమతికి సంబంధించి తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదో చెప్పాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ కె.విద్యాధర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో నోటీసులు జారీ చేసింది. నవంబర్ 22న విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. దుండిగల్ మున్సిపాలిటీలోని దొమ్మరపోచంపల్లి గ్రామంలో 40 అడుగుల వెడల్పుతో లోపలి రహదారికి ఆనుకొని నిర్మిస్తున్న భవన నిర్మాణ అనుమతులను పునః పరిశీలించాలని గతంలో కోర్టు ఆదేశించినా అధికారులు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదంటూ అక్షయ డెవలపర్స్ హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ టి.వినోద్‌కుమార్ విచారణ చేపట్టారు. తదుపరి విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. -
అజారుద్దీన్ కు ఈడీ నోటీసులు.. ఎందుకంటే?
-
రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేసిన నార్సింగి పోలీసులు
-
ఆరుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు..
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యులుగా ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పలు పిటిషన్లకు సంబంధించి కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి గెలిచిన ముగ్గురు, ఒక సీపీఐ ఎమ్మెల్యేకు హైకోర్టు శుక్రవారం వేర్వేరుగా నోటీసులు జారీ చేసింది. వారంతా వచ్చే నెలలోగా స్పందించి కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చేనెల (ఏప్రిల్ 16, 18, 19 తేదీలకు) వాయిదా వేసింది. అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ (బీఆర్ఎస్), జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ (బీఆర్ఎస్), ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మి (బీఆర్ఎస్), మహబూబ్‌నగర్ నుంచి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్), దేవరకద్ర నుంచి జి.మధుసూదన్‌రెడ్డి (కాంగ్రెస్), కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు(సీపీఐ) విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఓడిన ప్రత్యర్థులు కొందరు వీరి ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వారు ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారని, సరైన సమాచారం ఇవ్వలేదని వాటిలో పేర్కొన్నారు. ఆ ఎమ్మెల్యేల ఎన్నికను కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ సూరేపల్లి నందా తదితరులతో కూడిన వేర్వేరు ధర్మాసనాలు శుక్రవారం విచారణ చేపట్టారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేశాయి. ఎవరెవరిపై పిటిషన్లు..? మహబూబ్‌నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిటిషన్ వేశారు; జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్, నవీన్‌యాదవ్..; కొత్తగూడెం నుంచి సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ఎన్నికను సవాల్ చేస్తూ కొత్తగూడెం పట్టణానికి చెందిన నందూలాల్ అగర్వాల్..; ఆసిఫాబాద్ నుంచి బీఆర్ఎస్ నేత కోవ లక్ష్మి ఎన్నికను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్..; ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్ (ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు) ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి పి.విజయారెడ్డి..; దేవరకద్ర నుంచి కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన జి.మధుసూదన్‌రెడ్డి ఎన్నిక రద్దు కోరుతూ బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. -
ఓటుకు కోట్లు కేసులో సీఎం రేవంత్‌కు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందున, కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖ లైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలుకు ఆదేశించింది. బీఆర్ఎస్ మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ల తరఫున అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ పి.మోహిత్‌రావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఓటుకు కోట్లు సంబంధిత కేసులను తెలంగాణలోని ఏసీబీ కోర్టు విచారణ జరుపుతోందని తెలిపారు. రేవంత్‌రెడ్డి సీఎంగా ఉన్నందున రాష్ట్రంలో న్యాయపరమైన విచారణ సాధ్యం కాదని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ లేదా ఛత్తీస్‌గఢ్‌ల్లోని తత్సమాన కోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్ధ దవే, దామా శేషాద్రినాయుడులు వాదనలు విన్పించారు. ...వారినే విచారించాల్సిన పరిస్థితి తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అనుకూలంగా ఓటు వేసేందుకు గాను నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రేవంత్‌రెడ్డి రూ.కోట్లు లంచం ఆశ చూపి అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇవ్వజూపారనేది ప్రధాన ఆరోపణ అని తెలిపారు. రేవంత్‌రెడ్డి మాజీ బాస్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. అయితే స్టీఫెన్సన్కు లంచం ఇస్తుండగా తెలంగాణ పోలీసులు, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా రేవంతర్‌రెడ్డి తదితరుల్ని పట్టుకున్నారని, స్టీఫెన్సన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కాగా తదనంతర పరిణామాల్లో భాగంగా రేవంత్‌రెడ్డి 2017లో కాంగ్రెస్ పార్టీ లో చేరారని తెలిపారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, ఈ కేసులో నిందితుడైన రేవంత్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని, కీలకమైన హోంశాఖ కూడా ఆయన వద్దే ఉందని వివరించారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో న్యాయపరమైన విచారణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఏసీబీ అధికారులు ఎవరి నియంత్రణలో ఉంటారో, ఎవరికి సమాధానం చెప్పాలో వారినే విచారించాల్సిన పరిస్థితి ఉందన్నారు. రేవంత్‌పై పెండింగ్‌లో 88 కేసులు తెలంగాణలోని వేర్వేరు కోర్టుల్లో రేవంత్‌రెడ్డిపై 88 కేసులు విచారణలో ఉన్నాయని, ఆయన నేర నేపథ్యం ఎక్కువగా ఉన్నట్లు వీటిని బట్టి స్పష్టమవుతోందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక తేల్చుకుంటామంటూ తెలంగాణలోని సీనియర్ పోలీసు అధికారుల్ని రేవంత్‌రెడ్డి అనేక సందర్భాల్లో బెదిరించారని కోర్టు దృష్టికి తెచ్చారు. అంతేకాకుండా విచారణ జాప్యం చేయడానికి నిందితులు ఏదో ఒక సాకుతో 2015 నుంచి పలు పిటిషన్లు వేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఓటుకు కోట్లు కేసు విచారణను తెలంగాణ వెలుపల మధ్యప్రదేశ్ లేదా ఛత్తీస్‌గఢ్‌లకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలమని, రేవంత్ మాజీ బాస్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా ఈ కేసులో ఆరోపణలు ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఈ పిటిషన్ ఎందుకు విచారించకూడదో తెలియజేయాలంటూ సీఎం రేవంత్‌సహా ఇతర ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. -
చికోటి ప్రవీణ్ కు ఐటీ శాఖ నోటీసులు
-
పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్, నోటీసులు జారీ
-
పెగసస్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసు
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. అయితే, ఇందులో దేశ భద్రత, రక్షణకు సంబంధించిన గోప్యమైన సమాచారం ఏదైనా ఉంటే ప్రభుత్వం బయటపెట్టాలని తాము కోరడం లేదని తెలిపింది. పెగసస్‌పై వస్తున్న ఆరోపణల విషయంలో సమగ్ర అఫిడవిట్ దాఖలు చేస్తే వచ్చే సమస్య ఏమిటని కేంద్రాన్ని ప్రశ్నించింది. పెగసస్‌పై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ కొనసాగించింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఓఎస్ గ్రూప్ అభివృద్ధి చేసిన పెగసస్ స్పైవేర్‌ను భారత్‌లో అసలు ఉపయోగించారా? లేదా? అనే విషయం దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారమని చెప్పారు. ‘‘తమ ఫోన్లపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టినట్లు పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. వీరిలో ప్రముఖులతోపాటు సామాన్య పౌరులు కూడా ఉన్నారు. ఫోన్లు హ్యాక్ అయ్యాయని చెబుతున్నారు. పౌరుల ఫోన్లను హ్యాక్ చేయడానికి నిబంధనలు అంగీకరిస్తాయి. అయితే, సంబంధిత ప్రభుత్వ సంస్థ(కాంపిటెంట్ అథారిటీ) అనుమతితోనే ఫోన్లను హ్యాక్ చేయాల్సి ఉంటుంది. అనుమతితో చేస్తే ఎలాంటి తప్పు లేదు. అలాంటప్పుడు పెగసస్‌పై కోర్టులో సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయడానికి కాంపిటెంట్ అథారిటీకి సమస్య ఏమిటి?’’ అని ధర్మాసనం నిలదీసింది. దేశ భద్రత, రక్షణకు సంబంధించి ఒక్క పదమైనా అఫిడవిట్లో ఉండాలని తాము ఆశించడం లేదని స్పష్టం చేసింది. కోర్టు నుంచి దాచలేం... పెగసస్‌పై ఎవరికీ ఏమీ చెప్పబోమంటూ కేంద్రం ఇప్పటిదాకా అనలేదని తుషార్ మెహతా గుర్తుచేశారు. అయితే, ఈ విషయాన్ని బహిరంగం చేయకూడదన్నదే తన ఉద్దేశమని వివరించారు. ఏ దేశ ప్రభుత్వమైనా ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తోందో బయటకు చెబితే దేశ శత్రువులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు దాన్నొక అవకాశంగా మార్చుకునే ప్రమాదం ఉందన్నారు. వారి రహస్యాలు బయటపడకుండా ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌ను అడ్డుకోవానికి ముష్కరులు తమ వద్ద ఉన్న సాఫ్ట్వేర్లలో మార్పులు చేసుకొనే ముప్పు పొంచి ఉందని చెప్పారు. ఏ సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నాం, ఏది వాడడం లేదు అనేది జాతి భద్రతకు సంబంధించిన అంశమని, దాన్ని కోర్టు నుంచి దాచలేమని పేర్కొన్నారు. వచ్చే సోమవారం ప్రభుత్వం సమగ్ర అఫిడవిట్ దాఖలు చేస్తుందని, పెగసస్‌పై తన వైఖరిని అందులో స్పష్టం చేస్తుందని తుషార్ మెహతా తెలిపారు. ఇప్పటికే దాఖలు చేసిన అఫిడవిట్లో కేంద్రం తన ప్రతిస్పందనను తెలిపిందని, తటస్థ నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిందని, దేశ అత్యున్నత న్యాయం ముందుకు ప్రభుత్వం వచ్చిందని గుర్తుచేశారు. పెగసస్‌పై దాచడానికి ఏమీ లేదని కేంద్రం వెల్లడించిందని అన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని తటస్థ నిపుణుల కమిటీకి అందజేస్తామని, ఆ కమిటీ విచారణ జరిపి, నివేదికను నేరుగా సుప్రీంకోర్టుకు సమర్పిస్తుందని చెప్పారు. దీంతో తదుపరి విచారణకు ధర్మాసనం 10 రోజుల పాటు వాయిదా వేసింది. దేశ రక్షణ ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో ప్రజలకూ అంతే ముఖ్యమని పిటిషనర్ల తరపున వాదించిన సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. దేశ రక్షణకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం బహిర్గతం చేయాలని తాము కోరడం లేదని అన్నారు. -
నిమ్స్ ఆసుపత్రికి లోకాయుక్త నోటీసులు
లక్డీకాపూల్: నిమ్స్ ఆస్పత్రికి తెలంగాణ లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. వార్షిక ఆదాయ వ్యయాలపై లెక్కలు సరిగా లేవని, ఆడిటింగ్‌కు సహకరించడం లేదని ఆడిట్ శాఖ ఈమేరకు లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. దీంతో నిమ్స్ లెక్కలపై డొల్లతనం బయటపడుతోంది. ♦ నిమ్స్‌లో ఆదాయం-వ్యయాలపై యాజ మాన్యం ఆజమాయిషీ ఉండడం లేదు. దీంతో చెల్లింపులు అడ్డగోలుగా జరుగుతున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ మేరకు ఒక అధికారికి ఒకే నెలలో రెండుమార్లు వేతనం జమ అయినట్లు తెలుస్తోంది. ♦ లాగే ఓ కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన రూ.5 లక్షలు రెండుమార్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ♦ మ్యాన్‌పవర్ ఏజెన్సీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా సరిగా ఉండడం లేదు. ఇప్పటికి నాలుగుసారు ఈ–టెండర్లు పిలవడం..రద్దు చేయడం ద్వారా వృథా ఖర్చులు పెంచుతున్నారు. ♦ ఇక వార్షిక గణాంకాలను సక్రమంగా నిర్వహించని కారణంగా టీడీఎస్ రూపంలో నిమ్స్ ఖజానాకు గండి పడుతోంది. సరైన లెక్కలు చూపిస్తే.. ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో 10 శాతం నిధులు టీడీఎస్ రూపంలో మిగిలే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. ♦ ఆస్పత్రికి ఏటా రూ.250 నుంచి 280 కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. ఈ నిధుల ఖర్చుపై నియంత్రణ లేదు. ఆజమాయిషీ..రోజు వారి లెక్కలు చూసే నాథుడే లేడు. ♦ క్రమం తప్పకుండా లెక్కలు చూపితే.. టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం ఉండదని, వాస్తవానికి ఆస్పత్రులకు టీడీఎస్ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని, నిమ్స్‌లో మాత్రం టీడీఎస్ చెల్లిస్తున్నారని ఓ సీనియర్ అధికారి వాపోయారు. ♦ ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆడిట్ శాఖ లెక్కల విషయంలో నిమ్స్ అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా పరిగణించింది. ఆడిట్ నిర్వహణకు అధికారులు సహకరించడం లేదని ఆడిట్ అధికారిగా వ్యవహరిస్తున్న పి.కోటేశ్వరరావు యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. దానిపై ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన (ఫిర్యాదు నెం.1771/14/బి1) లోకాయుక్తను ఆశ్రయించారు. దీంతో వచ్చే నెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు జమాఖర్చుల నివేదికతో హాజరు కావాల్సిందిగా నిమ్స్ యాజమాన్యానికి లోకాయుక్త నోటీసు(నెం.1771/2014/బి1/లోక్/5571/2021) జారీ చేసింది. ఆడిట్ అధికారుల వైఫల్యమా? ఇదిలా ఉండగా ఆడిట్ అధికారుల వైఫల్యం కారణంగానే నిమ్స్ లెక్కల వ్యవహారం అస్తవ్యస్థంగా తయారైందని ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన ఓ అధికారి ఆరోపించారు. ఆడిట్ చేసేందుకు ముందుకు రాకుండా నిమ్స్ లెక్కలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, ఇది ఎంత వరకు న్యాయమని ఆ అధికారి నిలదీయడం గమనార్హం. -
ఇకపై కుటుంబ సభ్యులు పాల్గొంటే క్రిమినల్ కేసులు
సాక్షి, జోగిపేట(అందోల్): అనాదిగా వివక్షతకు గురవుతున్న మహిళలకు భారత రాజ్యాంగం భరోసా కల్పించింది. వివక్షతో అనగదొక్కబడుతున్న అబలలు ఎన్నికల్లో పాల్గొనేలా రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 50 శాతం సీట్లు వారికి కేటాయించారు. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం పురుషుల ఆధిపత్యమే కొనసాగుతుంది. ప్రజాప్రతినిధి మహిళే అయినా పెత్తనం మాత్రం పతులే చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నచోట వారి భర్తలు, కుటుంబ సభ్యుల పెత్తనం కొనసాగుతుందనే విమర్శలు లేకపోలేదు. కొన్ని చోట్ల అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆజమాయిషీ చెలాయిస్తున్నారు. మహిళా ప్రజాప్రతినిధులను నామమాత్రం చేస్తూ వీరు పెత్తనం కొనసాగిస్తున్నారు. ఉల్లంఘిస్తే చర్యలు... అధికారిక కార్యక్రమాలు, సభలు, సమావేశాల్లో మహిళా ప్రజాప్రతినిధికి బదులు భర్తలు, బంధువులు కూర్చుంటే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ప్రోత్సహించిన సంబంధిత అధికారులపై పంచాయతీరాజ్ చట్టం –2018 సెక్షన్ 37(5) ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. వారిని అధికారిక సమావేశానికి అనుమతిస్తే పంచాయతీ కార్యాదర్శి, మండల పరిషత్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారులు మున్సిపల్ కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. పాలనలో పారదర్శకత... పట్టణాలు, గ్రామాల్లో మహిళా ప్రజాప్రతినిధులకు బదులు వారి భర్తలు పాలనలో జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మహిళలకు పాలనాపరమైన అన్ని విషయాలు తెలియాలి. కానీ కొన్ని చోట్ల వారికి అవకాశం లేకుండా పోతుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పక్కాగా అమలు చేస్తే పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరగనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా గ్రామాలు, వార్డుల్లో జరిగే అభివృద్ధి పనుల్లో అవినీతికి ఆస్కారం లేకుండా పకడ్బందీగా, నిర్ణీత సమయంలో పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం పట్ల మహిళా లోకం హర్షం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో మహిళలు పాలనపై పట్టు సాధిస్తారని పలువురు భావిస్తున్నారు. జిల్లాలో పలు ఘటనలు స్థానిక సంస్థల అభివృద్ధిలో భాగంగా ప్రతినెలా మండల సర్వసభ్య సమావేశాలు కొనసాగుతుంటాయి. అయితే మహిళా ప్రతినిధులకు బదులు వారి భర్తలు, కుటుంబ సభ్యులు, బంధువులు హాజరైన ఘటనలు పలు మండలాల్లో చేసుకుంటున్నాయి. అందోలు మండలంలో జరిగే ప్రతి సర్వసభ్య సమావేశానికి భర్తలు హాజరుకావడమే కాకుండా అధికారులపై ప్రశ్నల వర్షం, నీలదీసిన సందర్భాలు ఉన్నాయి. అధికారులకు ప్రజాప్రతినిధి భర్త అని తెలిసినా వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంపై తోటిప్రజాప్రతినిధులు తప్పుబట్టారు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా పలుసార్లు ఎన్నికైన మహిళా ప్రతినిధులే సమావేశాలకు హజరు కావాలని సూచించిన సందర్భాలున్నాయి. మహిళా ప్రతినిధుల్లో మార్పు రావడం ఖాయం భార్యకు బదులుగా భర్తలు, కుటుంబ సభ్యులను ప్రోత్సహించకూడదన్న ప్రభుత్వ ఉత్తర్వుతో మహిళా ప్రతినిధులల్లో మార్పు వస్తుంది. జిల్లా పరిషత్‌లో ఉన్న 13 మంది మహిళా జెడ్పీటీసీలు మాత్రం సొంతంగా వ్యవహరిస్తున్నారు. స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్‌లల్లో కూడా ఈ విషయాన్ని చెబుతున్నాం. గ్రామ స్థాయిలో మహిళా సర్పంచ్‌లు ఉన్న చోట భర్తల పెత్తనం జరుగుతున్నట్లు తెలుస్తుంది. అలా జరగకుండా మహిళా సర్పంచ్‌లే స్వేచ్ఛగా వ్యవహరించేలా చూడాలని అధికారులకు కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాబోయే రోజుల్లో మహిళా ప్రతినిధుల్లో చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఈ ఉత్తర్వులతో మరో నాలుగేళ్ల పాటు మహిళా ప్రతినిధులు స్వేచ్ఛగా వ్యవహరించే పరిస్థితి వస్తుంది. –మంజుశ్రీ, జిల్లా పరిషత్ చైర్పర్సన్, సంగారెడ్డి పకడ్బందీగా అమలు చేస్తాం భార్యలకు బదులుగా భర్తలను ప్రోత్సహించకూడదన్న ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నికైన ప్రజాప్రతినిధులే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. తాము కూడా భర్తలను, కుటుంబ సభ్యులను ప్రోత్సహించం. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా వ్యవహరిస్తాం. మహిళా ప్రతినిధులు సైతం మున్సిపల్ చట్టం పట్ల అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళా ప్రజాప్రతినిధులకు పూర్తి స్వేచ్ఛ కల్పించి, పరిపాలనలో అభివృద్ధిలో వారినే పూర్తిగా భాగస్వాములను చేస్తాం. –కేశురాం, కమిషనర్, జోగిపేట మున్సిపాలిటీ -
బోధన్ ఏఈ సస్పెన్షన్, కలెక్టర్ ఉత్తర్వులు జారీ
సాక్షి, బోధన్(బోధన్): బోధన్ పట్టణంలోని పాండుఫారం శివారులో నూతనంగా నిర్మించిన తెలంగాణ బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడిన ఏఈ నాగేశ్వర్‌రావ్‌ను నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి సస్పెండ్ చేశారు. గురువారం తెలంగాణ బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల కాంప్లెక్స్‌ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. చేపట్టిన పనులకు మెజర్మెంట్ బుక్‌లో రికార్డు చేసిన పనులకు మధ్య వ్యత్యాసాన్ని పరిశీలించి గుర్తించారు. రికార్డులను నమోదు చేసిన తెలంగాణ రాష్ట్ర ఈడబ్ల్యూఐడీసీ నిజామాబాద్ డివిజన్‌కు చెందిన ఏఈ ఎన్. నాగేశ్వర్‌రావ్‌ను సస్పెండ్ చేయాల్సిందిగా ఆ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తిచేసిన పనులకు సంబంధించిన కొలతల్లో భారీగా వ్యత్యాసం చూపుతూ రికార్డులు నమోదు చేయడం, అధికారులను తప్పుదోడ పట్టించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈని సస్సెండ్ చేసి విచారణకు ఆదేశాలు జారీచేశారు. అధికారులు తమకు కేటాయించిన విధుల పట్ల బాధ్యతాయుతంగా ఉంటూ అధికారుల ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. -
28వేల ఓట్ల తొలగింపు.. హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 28వేల ఓట్లను తొలగించడంపై ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. మురళి వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. అంతేకాక దీనిపై కంటోన్మెంట్ బోర్డుకు హైకోర్టు నోటిసులు జారీ చేసింది. రెండు వారాల్లో వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. -
సల్మాన్ ఖాన్ కు సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2002 హిట్ అండ్ రన్ కేసులో శుక్రవారం ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సల్మాన్ నిర్దోషిగా విడుదల కావడాన్ని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించింన కోర్టు నోటీసులు ఇచ్చింది. దీంతో 13 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో నిర్దోషిగా విడుదలైన ఊపిరి పీల్చుకున్న ఈ భజరంగి భాయిజాన్ కి మళ్లీ కష్టాలు మొదలైనట్టయింది. కాగా ముంబైలో సల్మాన్ ఖాన్ 2002లో కారును నిర్లక్ష్యంగా నడిపిన సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు సల్మాన్‌కు విధించిన ఐదు సంవత్సరాల శిక్షను బొంబాయి హైకోర్టు గత ఏడాది కొట్టివేసింది. సల్మాన్ నిర్దోషిగా తీర్పు చెబుతూ అతనిపై ఉన్న అన్ని కేసులను కొట్టివేసిన సంగతి తెలిసిందే. -
రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసుల జారీ
న్యూఢిల్లీ: అంధులైన ఇద్దరి విద్యార్థులపై జరిగిన లైంగిక దాడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని ఎన్హెచ్ఆర్సీ తప్పు పట్టింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ కమిషనర్‌కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది.ఈ విషయమై మీడియాలో వచ్చిన కథనాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సుమోటాగా స్వీకరించింది. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని సాంఘిక సంక్షేమ విభాగం సెక్రటరీ, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను కోరింది. ఎన్హెచ్ఆర్సీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నవంబర్ 14(బాలల దినోత్సవం) 2013న పశ్చిమ ఢిల్లీలోని అమర్ కాలనీలో ఉన్న ఓ అంధుల సంస్థలో ఇద్దరు విద్యార్థులపై లైంగిక దాడి జరిగింది. ఆ ఇద్దరు విద్యార్థులు 3వ తరగతి చదువుకొంటూ ఆ సంస్థ వసతి గృహంలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో వారిని ఉపాధ్యాయుడే లైంగిక దాడికి పాల్పడ్డాడు. కానీ అతడు ఎవరో అంధులైన గుర్తించ లేకపోయారు. కానీ సహచర విద్యార్థుల సహాయంతో వైస్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని స్కూల్ అధికారులు గోప్యంగా ఉంచారు. పోలీసులు సంబంధిత టీచర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసినప్పటికీ ఎలాంటి ఎఫ్ఐఆర్ను నమోదు చేయలేదు. ఈ ఘటన సమాచారాన్ని మీడియా ద్వారా ఎన్హెచ్ఆర్సీ తెలుసుకొని పరిశీలించింది. ఇందులో వాస్తవాన్ని గ్రహించింది. బాలల మానవ హక్కులను ఉల్లంఘించిన తీవ్ర సమస్యగా ఎన్హెచ్ఆర్సీ పరిగణించింది. ఈ మేరకు తక్షణమే సమాధానం చెప్పాలని సంబంధిత అధికారులను కోరుతూ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసినట్లు ఎన్‌హెచ్‌సీ పేర్కొంది. -
కేసీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
రాష్ట్ర విభజన ఆపాలని కోరుతూ న్యాయవాది ఎమ్ఎల్ శర్మ శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయంతో రాష్ట్ర విభజన చేసిందని, ఆ నిర్ణయాన్ని నిలవరించాలని శర్మ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్ ) దాఖలు చేశారు. గతంలో దాఖలైన పిటిషన్లకు ఆ పిల్ జత చేయాలని సుప్రీం కోర్టు శర్మను ఆదేశించింది. అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. విభజనపై ఇది వరకే కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సంగతిని ఈ సందర్బంగా సుప్రీం గుర్తు చేసింది. నోటీసులపై కేంద్రం నుంచి సమాధానం వచ్చిన వెంటనే విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే శర్మ దాఖలు చేసిన పిల్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను నాలుగో ప్రతివాదిగా చేర్చారు. దాంతో కేసీఆర్‌కు సుప్రీం నోటీసులు జారీ చేసింది.