సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందున, కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖ లైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలుకు ఆదేశించింది.
బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ల తరఫున అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ పి.మోహిత్‌రావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఓటుకు కోట్లు సంబంధిత కేసులను తెలంగాణలోని ఏసీబీ కోర్టు విచారణ జరుపుతోందని తెలిపారు. రేవంత్‌రెడ్డి సీఎంగా ఉన్నందున రాష్ట్రంలో న్యాయపరమైన విచారణ సాధ్యం కాదని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ లేదా ఛత్తీస్‌గఢ్‌ల్లోని తత్సమాన కోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్ధ దవే, దామా శేషాద్రినాయుడులు వాదనలు విన్పించారు.
...వారినే విచారించాల్సిన పరిస్థితి
తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అనుకూలంగా ఓటు వేసేందుకు గాను నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి రూ.కోట్లు లంచం ఆశ చూపి అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇవ్వజూపారనేది ప్రధాన ఆరోపణ అని తెలిపారు. రేవంత్‌రెడ్డి మాజీ బాస్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. అయితే స్టీఫెన్‌సన్‌కు లంచం ఇస్తుండగా తెలంగాణ పోలీసులు, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా రేవంతర్‌రెడ్డి తదితరుల్ని పట్టుకున్నారని, స్టీఫెన్‌సన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
కాగా తదనంతర పరిణామాల్లో భాగంగా రేవంత్‌రెడ్డి 2017లో కాంగ్రెస్ పార్టీ లో చేరారని తెలిపారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, ఈ కేసులో నిందితుడైన రేవంత్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని, కీలకమైన హోంశాఖ కూడా ఆయన వద్దే ఉందని వివరించారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో న్యాయపరమైన విచారణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఏసీబీ అధికారులు ఎవరి నియంత్రణలో ఉంటారో, ఎవరికి సమాధానం చెప్పాలో వారినే విచారించాల్సిన పరిస్థితి ఉందన్నారు.
రేవంత్‌పై పెండింగ్‌లో 88 కేసులు
తెలంగాణలోని వేర్వేరు కోర్టుల్లో రేవంత్‌రెడ్డిపై 88 కేసులు విచారణలో ఉన్నాయని, ఆయన నేర నేపథ్యం ఎక్కువగా ఉన్నట్లు వీటిని బట్టి స్పష్టమవుతోందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక తేల్చుకుంటామంటూ తెలంగాణలోని సీనియర్ పోలీసు అధికారుల్ని రేవంత్‌రెడ్డి అనేక సందర్భాల్లో బెదిరించారని కోర్టు దృష్టికి తెచ్చారు. అంతేకాకుండా విచారణ జాప్యం చేయడానికి నిందితులు ఏదో ఒక సాకుతో 2015 నుంచి పలు పిటిషన్లు వేశారని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఓటుకు కోట్లు కేసు విచారణను తెలంగాణ వెలుపల మధ్యప్రదేశ్ లేదా ఛత్తీస్‌గఢ్‌లకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలమని, రేవంత్ మాజీ బాస్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా ఈ కేసులో ఆరోపణలు ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఈ పిటిషన్ ఎందుకు విచారించకూడదో తెలియజేయాలంటూ సీఎం రేవంత్‌సహా ఇతర ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment