సీఎం రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశం
ఏసీబీ డీజీ ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు
ట్రయల్ కోర్టు పారదర్శకంగా విచారణ జరపాలి
భవిష్యత్తులో సీఎం జోక్యంపై ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లొచ్చునని స్పషీ్టకరణ
కేసును వేరే కోర్టుకు బదిలీ చేయడానికి నిరాకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసు విచారణలో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవద్దని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణకు సంబంధించి ఏసీబీ డైరెక్టర్ జనరల్ ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వరాదని, ఆయనకు రిపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు పారదర్శకంగా విచారణ జరపాలని సూచించింది.
ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి భోపాల్‌కు బదిలీ చేసేందుకు నిరాకరించింది. ఓటుకు నోటు కేసు విచారణను హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ కోర్టుకు బదిలీ చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది.
నిష్పక్షపాత విచారణ సాధ్యం కాదన్న పిటిషనర్లు
రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణలో ఈ కేసుపై నిష్పక్షపాత విచారణ సాధ్యం కాదని పిటిషనర్లు పేర్కొన్నారు. వారి తరఫున సీనియర్ న్యాయవాది సీఏ సుందరం వాదనలు వినిపిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్నందున ఏసీబీ కేసులు నేరుగా ఆయన అ«దీనంలోనే ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కేసు విచారణను తెలంగాణ నుంచి భోపాల్‌కు మార్చాలని విన్నవించారు.
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి దీనిని పర్యవేక్షించేలా ఆదేశాలివ్వాలని కోరారు. అయితే ఈ పిటిషన్ రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని రేవంత్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణ సగంలో ఉందని.. విచారణను గత ప్రభుత్వంలో నియమించిన ప్రాసిక్యూటరే నిర్వహిస్తున్నారని చెప్పారు.
సుప్రీం విశ్రాంత జడ్జి పర్యవేక్షణకు నో
వాదనల అనంతరం కేసు విచారణపై సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి పర్యవేక్షణను జస్టిస్ గవాయ్ ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసులో విధంగానూ జోక్యం చేసుకోకూడదని రేవంత్‌రెడ్డిని ఆదేశించిన ధర్మాసనం..భవిష్యత్తులో ఈ కేసు విచారణలో రేవంత్‌రెడ్డి జోక్యంపై ఆధారాలుంటే కోర్టుకు వెళ్లొచ్చునని సూచించింది. రాష్ట్ర హోంశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న రేవంత్‌రెడ్డికి ఏసీబీపై ప్రత్యక్ష నియంత్రణ ఉంటుందని, బ్యూరో డైరెక్టర్ నేరుగా ఆయనకు జవాబుదారీగా ఉంటారన్న పిటిషనర్ల ఆందోళనను పరిగణనలోకి తీసుకుంటున్నామని, ప్రాసిక్యూషన్ పనితీరులో ఏ విధంగానూ జోక్యం చేసుకోవద్దని రెండవ ప్రతివాదికి ఆదేశిస్తున్నామని బెంచ్ తెలిపింది. ఒక విచారణను ఉపసంహరించుకోవాలని ఆయన (రేవంత్‌రెడ్డి) ప్రాసిక్యూషన్‌ను ఆదేశిస్తే, అప్పుడు తాము జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది.
కోర్టు ఆదేశాలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి
అంతకుముందు ఈ కేసును విచారిస్తున్న సమయంలోనే, ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసినప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తాము గమనించామని ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ విషయంలో రేవంత్‌రెడ్డి ఇప్పటికే తమ ముందు క్షమాపణలు చెప్పినందున ఈ అంశంలో మ రింత ముందుకు వెళ్లాలని తాము భావించడం లేదని తెలిపింది. రాజ్యాంగంలోని మూడు విభాగాలు ఒకరి పనితీరు పట్ల మరొకరు పరస్పర గౌరవాన్ని చూపించాలని సూచించింది. తీర్పులపై న్యాయమైన విమర్శలను ఎప్పుడూ స్వాగతించవచ్చని, అయితే పరిమితులను అతిక్రమించరాదని స్పష్టం చేసింది. కోర్టులు జారీ చేసే ఆదేశాలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు తగినంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment