న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా.. కవిత బెయిల్ తీర్పుపై ఆయన చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం ప్రస్తావించింది.
ముఖ్యమంత్రి బాధ్యతగా ఉండాలి కదా
ఇలా ఎలా మాట్లాడతారు ?
రాజకీయ నాయకులను సంప్రదించి మేము ఆదేశాలు ఇస్తామా ?
మేము ఎవరి వ్యాఖ్యలు పట్టించుకోం
మేము మా విధి నిర్వహిస్తాం
మేము ప్రమాణ పూర్వకంగా పని చేస్తాం
మేము ఎవరి పనుల్లో జోక్యం చేసుకోం
సర్వోన్నత న్యాయస్థానం అంటే గౌరవం లేదా ?
వ్యవస్థల పట్ల గౌరవంగా ఉండాలి
ఇలాంటి ప్రవర్తన ఉంటే ఓటుకు నోటు విచారణ రాష్ట్రం బయటే నిర్వహిద్దాం.. అని జస్టిస్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అంతకు ముందు.. తెలంగాణ ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్నఈ కేసులో సుప్రీం కోర్టు కీలకాదేశాలు జారీ చేసింది. ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ గవాయి ధర్మాసనం.. విచారణకు స్పెషల్ ప్రాసిక్యూటర్‌ను నియమిస్తున్నట్లు తెలిపింది. మధ్యాహ్నాం మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం.. స్వతంత్ర ప్రాసిక్యూటర్‌ను నియమించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే రేవంత్ తాజా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు విచారణ సోమవారానికి సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.
కవిత బెయిల్‌పై రేవంత్ ఏమన్నారంటే..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ పరిణామంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ‘‘కవిత బెయిల్ కోసం ఎంపీ సీట్లు బీఆర్ఎస్ త్యాగం చేసింది నిజం. బీఆర్ఎస్ – బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చింది. సిసోడియా, కేజ్రీవాల్‌కు రాని బెయిల్ 5 నెలల్లోనే కవితకు ఎలా వచ్చింది? మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో బీజేపీకి మెజారిటీ ఇచ్చింది నిజం కాదా? ఏడు చోట్ల డిపాజిట్ కోల్పోయి, 15 చోట్ల మూడవ స్థానం వచ్చేంత బలహీనంగా బీఆర్ఎస్ ఉందా?” అని రేవంత్ అన్నారు.
ఓటుకు నోటుపై పిటిషన్‌లో..
తెలంగాణలో 2015 ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఓటుకు నోటు వ్యవహారం నడిచింది. ఈ కేసులో పట్టుబడ్డ రేవంత్ రెడ్డి అరెస్టై జైలుకు వెళ్లారు కూడా. అయితే.. రేవంత్ ఇప్పుడు సీఎంగా ఉండడంతో ఈ కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
పిటిషనర్ వాదనలు
కేసులో నిందితుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్నారని, దర్యాప్తు సంస్థ ఏసీబీ చూసే హోం శాఖ కూడా ఆయన వద్దే ఉందని జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా మహబూబ్ నగర్‌లో జరిగిన ర్యాలీల్లో పలుమార్లు పోలీసులపై బెదిరింపు ధోరణి ప్రదర్శించారని జగదీష్ రెడ్డి తరుఫు న్యాయవాది తెలిపారు. సీఎంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తేనే కేసుపై ప్రభావం ఎలా ఉందో తెలుస్తుందని, ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ అఫిడవిట్‌లో కూడా వైఖరి మారిందన్నారు.
జస్టిస్ గవాయ్ ఏమన్నారంటే..
కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే మన న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుంది. ట్రయల్ జరిగే విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున.. ఈ కేసు విచారణకు ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ ని నియమిస్తాం. విశ్వసనీయతను పెంచేందుకే స్వతంత్ర ప్రాసిక్యూటర్‌ను నియమిస్తాం. 2024 ఎన్నికల తర్వాతే మీరు కోర్టుకు వచ్చారు.. ఎందుకు?. మా న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. అందరి అనుమానాలను నివృత్తి చేసేందుకు స్పెషల్ ప్రాసిక్యూటర్ నియమిస్తాం. ఏపీ లేదంటే తెలంగాణ నుంచి ఒకరిని స్పెషల్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తాం. ప్రతి ఒక్కరి మనస్సులో విశ్వాసం ఉండేలా, మీకు అభ్యంతరం లేకుండా ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తాం. తెలంగాణకు చెందిన మా సహచరులను సంప్రదించి.. ఈ నియామకాన్ని మేమే పర్యవేక్షిస్తాం. ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ని నియమించే వ్యవహారాన్ని సుప్రీం కోర్టు నిర్ణయిస్తుందని జస్టిస్ గవాయ్ అన్నారు.
కుదరని ఏకాభిప్రాయం
ఓటుకు నోటు పిటిషన్‌పై మధ్యాహ్నాం మరోసారి విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రత్యేక ప్రాసిక్యూటర్ నియామకం కోసం ప్రయత్నించింది. ఇరు వర్గాల నుంచి ఇద్దరి పేర్లను తీసుకుంది. అయితే ఉమామహేశ్వర్‌రావు, అశోక్ దేశాయ్ పేర్లపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో సోమవారం విచారణ నాడే ఆ ప్రక్రియను ధర్మాసనం పర్యవేక్షించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment