సాక్షి, జోగిపేట(అందోల్): అనాదిగా వివక్షతకు గురవుతున్న మహిళలకు భారత రాజ్యాంగం భరోసా కల్పించింది. వివక్షతో అనగదొక్కబడుతున్న అబలలు ఎన్నికల్లో పాల్గొనేలా రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 50 శాతం సీట్లు వారికి కేటాయించారు. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం పురుషుల ఆధిపత్యమే కొనసాగుతుంది. ప్రజాప్రతినిధి మహిళే అయినా పెత్తనం మాత్రం పతులే చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నచోట వారి భర్తలు, కుటుంబ సభ్యుల పెత్తనం కొనసాగుతుందనే విమర్శలు లేకపోలేదు. కొన్ని చోట్ల అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆజమాయిషీ చెలాయిస్తున్నారు. మహిళా ప్రజాప్రతినిధులను నామమాత్రం చేస్తూ వీరు పెత్తనం కొనసాగిస్తున్నారు.
ఉల్లంఘిస్తే చర్యలు...
అధికారిక కార్యక్రమాలు, సభలు, సమావేశాల్లో మహిళా ప్రజాప్రతినిధికి బదులు భర్తలు, బంధువులు కూర్చుంటే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ప్రోత్సహించిన సంబంధిత అధికారులపై పంచాయతీరాజ్ చట్టం –2018 సెక్షన్ 37(5) ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. వారిని అధికారిక సమావేశానికి అనుమతిస్తే పంచాయతీ కార్యాదర్శి, మండల పరిషత్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారులు మున్సిపల్ కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.
పాలనలో పారదర్శకత...
పట్టణాలు, గ్రామాల్లో మహిళా ప్రజాప్రతినిధులకు బదులు వారి భర్తలు పాలనలో జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మహిళలకు పాలనాపరమైన అన్ని విషయాలు తెలియాలి. కానీ కొన్ని చోట్ల వారికి అవకాశం లేకుండా పోతుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పక్కాగా అమలు చేస్తే పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరగనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా గ్రామాలు, వార్డుల్లో జరిగే అభివృద్ధి పనుల్లో అవినీతికి ఆస్కారం లేకుండా పకడ్బందీగా, నిర్ణీత సమయంలో పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం పట్ల మహిళా లోకం హర్షం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో మహిళలు పాలనపై పట్టు సాధిస్తారని పలువురు భావిస్తున్నారు.
జిల్లాలో పలు ఘటనలు
స్థానిక సంస్థల అభివృద్ధిలో భాగంగా ప్రతినెలా మండల సర్వసభ్య సమావేశాలు కొనసాగుతుంటాయి. అయితే మహిళా ప్రతినిధులకు బదులు వారి భర్తలు, కుటుంబ సభ్యులు, బంధువులు హాజరైన ఘటనలు పలు మండలాల్లో చేసుకుంటున్నాయి. అందోలు మండలంలో జరిగే ప్రతి సర్వసభ్య సమావేశానికి భర్తలు హాజరుకావడమే కాకుండా అధికారులపై ప్రశ్నల వర్షం, నీలదీసిన సందర్భాలు ఉన్నాయి. అధికారులకు ప్రజాప్రతినిధి భర్త అని తెలిసినా వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంపై తోటిప్రజాప్రతినిధులు తప్పుబట్టారు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా పలుసార్లు ఎన్నికైన మహిళా ప్రతినిధులే సమావేశాలకు హజరు కావాలని సూచించిన సందర్భాలున్నాయి.
మహిళా ప్రతినిధుల్లో మార్పు రావడం ఖాయం
భార్యకు బదులుగా భర్తలు, కుటుంబ సభ్యులను ప్రోత్సహించకూడదన్న ప్రభుత్వ ఉత్తర్వుతో మహిళా ప్రతినిధులల్లో మార్పు వస్తుంది. జిల్లా పరిషత్‌లో ఉన్న 13 మంది మహిళా జెడ్పీటీసీలు మాత్రం సొంతంగా వ్యవహరిస్తున్నారు. స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్‌లల్లో కూడా ఈ విషయాన్ని చెబుతున్నాం. గ్రామ స్థాయిలో మహిళా సర్పంచ్‌లు ఉన్న చోట భర్తల పెత్తనం జరుగుతున్నట్లు తెలుస్తుంది. అలా జరగకుండా మహిళా సర్పంచ్‌లే స్వేచ్ఛగా వ్యవహరించేలా చూడాలని అధికారులకు కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాబోయే రోజుల్లో మహిళా ప్రతినిధుల్లో చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఈ ఉత్తర్వులతో మరో నాలుగేళ్ల పాటు మహిళా ప్రతినిధులు స్వేచ్ఛగా వ్యవహరించే పరిస్థితి వస్తుంది. –మంజుశ్రీ, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, సంగారెడ్డి
పకడ్బందీగా అమలు చేస్తాం
భార్యలకు బదులుగా భర్తలను ప్రోత్సహించకూడదన్న ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నికైన ప్రజాప్రతినిధులే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. తాము కూడా భర్తలను, కుటుంబ సభ్యులను ప్రోత్సహించం. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా వ్యవహరిస్తాం. మహిళా ప్రతినిధులు సైతం మున్సిపల్ చట్టం పట్ల అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళా ప్రజాప్రతినిధులకు పూర్తి స్వేచ్ఛ కల్పించి, పరిపాలనలో అభివృద్ధిలో వారినే పూర్తిగా భాగస్వాములను చేస్తాం.
–కేశురాం, కమిషనర్, జోగిపేట మున్సిపాలిటీ
Comments
Please login to add a commentAdd a comment