కోల్‌సిటీ, న్యూస్‌లైన్: గోదావరిఖని వద్ద సమ్మక్క జాతరకు వచ్చిన ఓ యువకుడు గోదావరినదిలో మునిగి చనిపోయాడు. మహారాష్ట్ర గుగ్గూస్‌లోని ఇందిరానగర్‌కు చెందిన పోగుల రతన్(18), మెదక్‌లో బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్టియర్ చదువుతున్నాడు. గోదావరిఖని ద్వారకానగర్‌లో ఉంటున్న పెద్దన్నాన్న, పెద్దమ్మ అరికిల్ల పీరయ్య-మల్లమ్మ ఇంటికి రెండ్రోజుల క్రితం వచ్చాడు. గురువారం రాత్రి పీరయ్య కుటుంబసభ్యులు సమ్మక్క జాతర కోసం స్థానిక గోదావరినది దగ్గరకు మొక్కులు తీర్చుకోవాడికి వచ్చి రాత్రి అక్కడే బసచేశారు. శుక్రవారం ఉదయం పీరయ్య కొడుకు కిషోర్, రతన్ కలిసి జాతరకు వచ్చారు.
గోదావరిలో స్నానం చేసి వస్తామంటూ కిషోర్, రతన్ నదిలో దిగారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ప్రమాదవశాత్తు ఇద్దరూ మునిగిపోయారు. కిషోర్ భయంతో అరుపులు వేయడంతో పక్కనే ఉన్న లింగాల రవి అనే యువకుడు అతడిని కాపాడాడు. అప్పటికే రతన్ నీటిలో గల్లంతయ్యాడు. సింగరేణి రెస్క్యూ బృందం, గజ ఈతగాళ్లు మూడు గంటలపాటు గాలించి రతన్ మృతదేహాన్ని వెలికితీశారు. ఈ సంఘటనతో బంధువులు గుండెలవిసేలా రోదించారు.
రతన్ చిన్నప్పుడే తండ్రి మైసయ్య చనిపోయాడు. తల్లి సుగుణ అన్నీ తానై నలుగురు పిల్లలను పెంచి పెద్ద చేస్తోంది. రతన్ పెద్దన్నయ్య ప్రవీణ్‌కుమార్‌కు మార్చి 5న పెళ్లి జరగనుంది. ఇంట్లో అందరు పెళ్లి ఏర్పాట్లలో ఉండగా, ఈ దుర్ఘటన జరిగింది. ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని మహారాష్ట్రలోని స్వగ్రామానికి తరలించారు. మృతుడి పెద్దనాన్న పీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు.
జాతరకు వచ్చి జాడలేకపాయె..
హుజూరాబాద్, న్యూస్‌లైన్ : పదో తరగతిలో అత్యధిక మార్కులు రావాలని, తన కుటుంబం సల్లంగ ఉండాలని సమ్మక్క, సారక్క ఆశీర్వాదం కోసం జాతరకు వచ్చిన ఆ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. హుస్నాబాద్ మండలం అక్కన్నపేటకు చెందిన రాగినేని రాములు హమాలీ పని నిమిత్తం తిమ్మాపూర్ మండలం అల్గునూరుకు వలస వెళ్లాడు. అక్కడ కామధేనువు రైస్‌మిల్లులో హమాలీగా పని చేస్తున్నాడు. రాములు ఒక్కగానొక్క కొడుకు వెంకటేష్(15) అల్గునూరులో పదో తరగతి చదువుతున్నాడు.
హుజూరాబాద్‌లోని రంగనాయకుల గుట్ట వద్ద జరిగే సమ్మక్క జాతరకు గురువారం సాయంత్రం కుటుంబంతో వచ్చాడు. జాతరలో బసచేసి, శుక్రవారం ఉదయం బహిర్భూమి కోసమని తన మేనమామతో కలిసి ఆటోలో హుజూరాబాద్ శివారులోని కొత్తపల్లి కాకతీయ కాలువ వద్దకు వెళ్లాడు. కాలువలోకి దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడ్డాడు. నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటంతో గల్లంతై ఆచూకీ లేకుండా పోయాడు. ఈ సంఘటనతో తల్లిదండ్రులు లక్ష్మి, రాములులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాలువకు నీటి విడుదల ఆపాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని బంధువులు తెలిపారు. నీటిని ఆపితేనే మృతదేహం దొరికే అవకాశముంది.
సమ్మక్కకు చివరి మొక్కు..
ఓబులాపూర్(సిరిసిల్లరూరల్), న్యూస్‌లైన్: అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో నేత కార్మికుడు సమ్మక్క-సారక్కలను దర్శించుకొని జాతరలోనే ఆత్మహత్యకు పాల్పడడం మండలంలోని ఓబులాపూర్‌లో విషాదాన్ని నింపింది. సిరిసిల్ల పట్టణం శాంతినగర్‌కు చెందిన నేత కార్మికుడు బొల్లి రామరత్నం(47)కు ఇద్దరు భార్యలు ఉండగా, కుమారుడు, కుమార్తె సంతానం. సాంచాలు నడిపే రామరత్నం కుటుంబ పోషణ కోసం అప్పులు చేశాడు.
దీనికితోడు రెండు నెలల క్రితం కుమార్తె మానస(23) ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో మనస్తాపం చెందిన రామరత్నం శుక్రవారం ఉదయం 9గంటలకు ఓబులాపూర్‌లోని సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లాడు. అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత జాతరలోనే మద్యంసీసాలో నైట్రాప్ వేసుకొని తాగినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దీంతో రామరత్నం కూర్చున్నవాడు కూర్చున్నట్లే మరణించాడు. సిరిసిల్ల టౌన్ సీఐ నాగేంద్రచారి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
జాతరలో విషాదం
Published Sat, Feb 15 2014 2:56 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement