పదేళ్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ హరియాణాలో ‘ప్రభుత్వ (ప్రజా) వ్యతిరేకత’ను ఎదుర్కొంటోంది. ఫలితంగా కొన్ని బలమైన వర్గాలు పార్టీకి క్రమంగా దూరమౌతున్న సంకేతాలున్నాయి. ఇటీ వలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, పలు సర్వే సంస్థలు రాబట్టిన సమాచార వివ రాలు ఇదే విషయాన్ని నొక్కి చెబు తున్నాయి. కాంగ్రెస్ ఆధిక్యతను ప్రధాన సర్వే సంస్థలన్నీ చెప్ప కనే చెబుతున్నాయి. కానీ, ప్రజాక్షేత్రం కొన్నిసార్లు గోప్యంగా, గుంభనంగా ఉండటం రాజకీయాల్లో సహజం. క్షేత్ర సమాచారం, సంకేతాలు, మేధావుల విశ్లేషణలు ప్రతికూలంగా ఉన్నా తమ ప్రయత్నాలు మాత్రం మానకుండా పార్టీలు కొనసాగి స్తాయి. ప్రస్తుతం బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది.
2014, 2019 ఎన్నికల్లో పదికి పది లోక్‌సభ స్థానాలు గెలిచిన బీజేపీ, ఈసారి 5 చోట్ల ఓడిపోయింది. చేసిన తప్పులు దిద్దుకునే పనిలో బీజేపీ ఉంటే, అవన్నీ తప్పులనీ సదరు తప్పుడు విధానాలన్నీ తాము అధికారంలోకి రాగానే పక్కన పెడతామని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ప్రజలు ఎవరిని నమ్ముతారన్న దాన్ని బట్టే వారి మొగ్గు ఎన్నికల్లో ప్రతిబింబించే అవకాశముంది. కేంద్ర, రాష్ట్ర సర్కార్లపై హరియాణా ప్రజానీ కానికి కోపం ఎందుకు? మహిళా రెజ్లర్ల అవమానాలు, రైతు పంటకు ఎమ్మెస్పీ దక్కకపోవడం, మూడు వ్యవసాయ చట్టాలు పరోక్షంగా తొంగిచూడటం, కోటాల వివాదం, నిరుద్యోగం, అగ్నివీర్... వంటి విధాన వ్యవహార పరమైన అంశాల రీత్యా ప్రజావ్యతిరేకత పెరుగుతూ వస్తున్నట్టు ‘పీపుల్స్ పల్స్’ క్షేత్ర పరిశీలనలో వెల్లడవుతోంది.
వీటికి తోడు, ఎలక్ట్రానిక్ పాలనకై బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చొరవ, చివరకు అమలు లోపాల వల్ల వికటించింది. రైతుల పేరిట ఈ–అకౌంట్లు తెరిపించి, సబ్సిడీలు, పంట నష్టపరిహారాలు, ఇతర ప్రయోజనాలను నేరుగా వారికే అందేట్టు ఏర్పాటు చేసిన (మేరా ఫసల్ మేరా బయోరా – ఎమ్మెఫ్‌ఎంబీ) పథకం ఆచరణలో విఫలమైంది. సరైన శిక్షణ లేక, అవగాహన కల్పించక రైతులు దీన్ని వాడక పోగా చీదరించుకున్నారు. అటువంటిదే, ‘పరివార్ పహచాన్ పత్ర్’ (పీపీపీ) కూడా ప్రజలకు పెద్దగా నచ్చలేదు. మరోపక్క, ‘పోర్టల్ సర్కార్...’ అని విమర్శించిన కాంగ్రెస్ నేత హుడా, తాము అధికారంలోకి రాగానే ఇందులో చాలా పద్ధతులు, విధానాలను ఎత్తివేస్తామని చెబుతున్నారు.
పంజాబ్‌తో విడిపోయి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత హరి యాణా వికాస్ పార్టీ, భారతీయ క్రాంతిదళ్, హరియాణా జన సభ, భారత జాతీయ లోక్‌దళ్, జననాయక్ జనతా పార్టీ... ఇలా పలు ప్రాంతీయ పార్టీలొచ్చాయి. కొన్ని పొత్తులు ఎన్నికల ముందు కుదిరితే, మరి కొన్ని ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు సమయాల్లో కుదిరిన దాఖలాలున్నాయి. ఇప్పుడు హరియాణాలో ప్రధాన ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్‌కు ఎవరి తోనూ పొత్తు లేదు. ఎన్నికల ముందు మాత్రం ఐఎన్‌ఎల్డీ మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో జట్టుకట్టింది. వీరు చూపే ప్రభావం, ఆ యా నియోజకవర్గాల్లో చీల్చే ఓట్లను బట్టి జాట్‌లతో పాటు దళిత ఓటర్ల మొగ్గులో తేడాలు రావచ్చు. బయటకు కనిపించే దాన్ని బట్టి, అది విపక్షమైన కాంగ్రెస్‌కే దెబ్బగా పరిణమించొచ్చు. ఇటువంటి పరిస్థితే జేజేపీ–ఎఎస్పీ (కాన్షీరావ్‌ు వర్గం) జోడీ వల్ల కూడా ఎదురయ్యే ఆస్కార ముంది.
సంఖ్యాపరంగా జనాభాలో జాట్‌లు (25 శాతం), దళి తులు (20 శాతం) అధికులుగా ఉండటమే ఈ సమీకరణాల ఆలోచనలకు కారణం. 2019 ఎన్నికల్లో తాను గెలిచిన 10 అసెంబ్లీ స్థానాలతో మద్దతు ప్రకటించి, బీజేపీతో సంకీర్ణ సర్కా రులో భాగమైన జేజేపీ ఇప్పుడు వారితో లేదు. అందుకు కారణం లేకపోలేదు. జాటేతర వర్గాల్లో పట్టుపెంచుకోవాలనే కోరిక బీజేపీది. అందుకే, మెజా రిటీ వర్గంగా, అంటే 30 శాతం జనాభాగా ఉన్న ఓబీసీలపై కన్నేసింది. జేజేపీకి రెండు కారణా లున్నాయి. ఒకటి, భాగస్వామిగా ఉన్న తమనే బీజేపీ కకావి కలు చేసిందని కోపం.
గెలిచిన 10 మందికి గాను ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే జేజేపీలో మిగిలారు. ప్రజా వ్యతిరేకత బలంగా ఉన్న బీజేపీతో అంటకాగటం వల్లే తమ ఉనికి, నిన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ప్రశ్నార్థకమైందని జేజేపీ ఆందోళన చెందుతోంది. ‘ఇండియా’ కూటమి భాగస్వామి ‘ఆప్’ ఇక్కడ విడిగా పోటీ చేయడం కాంగ్రెస్‌కు నష్టం కలిగిం చేదే! ‘ఎవరికీ మెజారిటీ రాదు, చివరకు మేమే కీలకం అవుతాం’ అని జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా ఇప్పటికే ప్రకటించారు.దాదాపు నేరుగా తలపడుతున్న ప్రధాన ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, బీజేపీల్లో అంతర్గత కుమ్ములాటలున్నాయి. పదేళ్ల పాలకపక్షంగా 2014–19 కాలం కన్నా 2019–24 లోనే పార్టీ సంస్థాగతంగా ఇబ్బందులెదుర్కొంటోంది.
మాజీ ముఖ్య మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రధాని మోదీ మనిషి. అయినా... ప్రజా వ్యతిరేకత గుర్తించి, ఇంకోపక్క ఓబీసీల్లో పట్టు పెంచుకునే క్రమంలో, 2024 ఎన్నికల ముందు ఆయన్ని దింపి నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రి చేసుకున్నారు. అయినా... ఆశించిన ఓట్లు రాలలేదు. నాటి పరిస్థితిని మించి, ఇప్పుడు ఖట్టర్‌ను కేంద్ర మంత్రిని చేస్తే ఆయన మళ్లీ హరి యాణా ప్రజల ముందుకు వచ్చారు. ఏ మేర వారు ఆదరిస్తారో చూడాలి. 2019 ఎన్నికల్లో లభించిన 28.5 శాతం ఓటు వాటా నుంచి నిన్నటి (2024) ఎన్నికల్లో 43.67 శాతానికి ఓటు వాటా పెంచుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా అంతర్గత లుకలుకలతో రగు లుతోంది.
‘పార్టీ పునరుద్ధరణలో... మేమూ హక్కుదారులమే!’ అనే సంకేతాలతో పోటీ ర్యాలీలు జరుపుతూ, అసెంబ్లీ బరిలో పోటీకి ఆసక్తి కనబరచిన షెల్జాకుమారి, రణ్‌దీప్ సూర్జేవాలా... వంటి వారి అత్యుత్సాహానికి అధిష్టానం అడ్డుకట్ట వేసింది. పార్టీ నాయకత్వ పరంగా, ప్రజాదరణ పరంగా చివరకు భూపీందర్ హుడానే కాంగ్రెస్‌కు రథ సారథిగా నిలుస్తున్నారు. పార్టీ ఎంపీ లెవరూ అసెంబ్లీకి పోటీ చేయబోరని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టత నిచ్చింది. ప్రజల దృష్టిలో బలమైన ప్రాంతీయ పరిక ల్పనలు, ఆశలు, ఆకాంక్షలుండే హరియాణాలో రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రత్యరు్ౖథలై ఒకరిపై ఒకరు ఏ మేరకు ఆధిపత్యం సాధిస్తారనేదే రేపటి ఎన్నికల ఫలితం!
వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ
దిలీప్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment