
విశ్లేషణ
దేశమాత సేవలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) నూరు వసంతాలను పూర్తిచేసుకుంటున్న తరుణంలో, ఈ మైలు రాయిని సంఘ్ ఏ విధంగా పరిగణిస్తుందో అనే విషయంలో ఒక స్పష్టమైన జిజ్ఞాస ఉంటుంది. ఇలాంటి సందర్భాలు... ఉత్సవాల కోసం కావని, ఆత్మపరిశీలన చేసుకుని, లక్ష్యసాధనకు పునరంకితం కావడానికి వీటిని అవకాశంగా తీసుకోవాలన్నది సంఘ్ స్థాపించినప్పటి నుండి సుస్పష్టమైన విషయం.
అదే సమయంలో, ఈ మహోద్యమానికి మార్గదర్శకులైన మహనీయ సద్గురువులు, నిస్వార్థంగా ఈ మార్గంలోకి ప్రవేశించిన స్వయంసేవకులు, వారి కుటుంబాల స్వచ్ఛంద సహకారాన్ని స్మరించుకునేందుకు ఇదొక అవకాశం. ప్రత్యేకించి, సంఘ్ స్థాపకులైన డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ జయంతి సుదినమే హిందూ కాలదర్శినిలో మొదటి రోజైన వర్ష ప్రతిపద కూడా అయిన తరుణంలో... ఈ నూరు సంవత్సరాల ప్రయాణాన్ని పునర్దర్శనం చేసుకునేందుకు, సమరసతతో కూడిన సమైక్య భారతావని దిశగా సంకల్పం చేసుకునేందుకు ఇంతకు మించిన అనువైన సందర్భం మరేముంటుంది?
దేశం కోసం జీవించేలా...
డాక్టర్ హెడ్గేవార్‌లో భారతదేశం పట్ల అహంకార రహితమైన ప్రేమ, అఖండమైన అంకితభావం చిన్నతనం నుంచే కనపడింది. కోల్‌కతాలో తన వైద్య విద్యను పూర్తిచేసేనాటికే, సాయుధ విప్లవం నుంచి సత్యాగ్రహం వరకూ భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి విముక్తిని కలిగించేందుకు చేపట్టిన అన్ని రకాల ప్రయత్నాలతోనూ ఆయనకు అనుభవం ఉంది.
అదే సమయంలో దైనందిన జీవితంలో దేశభక్తి లేకపోవడం, సంకుచిత ప్రాంతీయ విభేదాలకు దారితీసేలా ఉమ్మడి జాతీయ వ్యక్తిత్వం పతనం కావడం, సామాజిక జీవితంలో క్రమశిక్షణరాహిత్యం వల్ల భారతదేశంలో బయటివారి దురాక్రమణ సంభవించి వీరి స్థానం సులభతరమైందని ఆయన గ్రహించారు. ఎడతెగని దురాక్రమణలతో మన ఘనచరిత్రకు సంబంధించిన సామాజిక జ్ఞాపకాలను ప్రజలు మరచిపోయారని ఆయనకు అనుభ వానికి వచ్చింది. ఫలితంగా మన సంస్కృతి, జ్ఞాన సంబంధమైన సంప్రదాయం పట్ల నైరాశ్యభావం, ఆత్మన్యూనతాభావం చోటు చేసు కున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఎవరో కొద్దిమంది నాయకుల నేతృత్వంలో జరిగే రాజకీయ కార్యకలాపాలు మన ప్రాచీన దేశపు సమస్య లను పరిష్కరించలేవన్న నిశ్చయానికి వచ్చారు. అందుకే, దేశం కోసం జీవించేలా ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు నిరంతర ప్రయత్నా లతో కూడిన ఒక పద్ధతిని రూపొందించాలని నిర్ణయించారు. రాజ కీయ పోరాటానికి అతీతంగా దార్శనిక దృష్టికోణంతో ఆయన చేసిన ఆలోచన ఫలితమే శాఖా పద్ధతి ఆధారంగా వినూత్నమైన పద్ధతిలో నడిచే సంఘం ఆవిర్భావం.
ఈ ఉద్యమం, సిద్ధాంతాల క్రమబద్ధమైన పురోగతి ఒక అద్భు తానికి ఎంతమాత్రం తక్కువ కాదు. హెడ్గేవార్ ఈ భావజాలాన్ని సిద్ధాంతంగా రూపొందించలేదు, కానీ ఆయన ఒక కార్యాచరణ ప్రణాళికను విత్తన రూపంగా ఇచ్చారు, అది ఈ ప్రయాణంలో చోదక శక్తిగా నిలిచింది. ఆయన జీవితకాలంలో, భారతదేశంలోని అన్ని ప్రాంతాలకూ సంఘ కార్యం విస్తరించింది.
శాఖోపశాఖలుగా ‘శాఖ’
మనం స్వాతంత్య్రాన్ని పొందినప్పుడు, అదే సమయంలో భారతమాతను మతం ఆధారంగా విచ్ఛిన్నం చేసినప్పుడు, పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ జనాభాను రక్షించి వారికి గౌరవ, మర్యాద లతో కూడిన పునరావాసాన్ని కల్పించడంలో సంఘ్ స్వయంసేవ కులు తమ అంకితభావాన్ని కనబరిచారు. సమాజం కోసం బాధ్యత, కర్తవ్యభావాలతో ముడిపడిన స్వయంసేవక్ అనే భావన విద్య, కార్మిక రంగం, రాజకీయరంగాల వంటి చోట తన శక్తిని ప్రదర్శించడం మొదలుపెట్టింది.
రెండవ సర్‌సంఘ్‌చాలక్ అయిన శ్రీ గురూజీ (మాధవ సదాశివ గోల్వాల్కర్) మార్గదర్శక శక్తిగా ఉన్న ఈ దశలో ప్రతి విషయం జాతీయ సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని పునర్వ్యవస్థీ కరించబడాలి! దేశంలో అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు రాజ్యాంగంపై క్రూర దాడి జరిగిన కాలంలో ప్రజాస్వామ్య పునరు ద్ధరణకు జరిగిన శాంతియుతపోరులో సంఘ్ స్వయంసేవకులు కీలక పాత్ర పోషించారు.
రామజన్మభూమి విముక్తి వంటి ఉద్యమాలు సాంస్కృతిక విమోచనం కోసం భారతదేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలను అనుసంధానించాయి. జాతీయ భద్రత నుంచి సరిహద్దుల నిర్వహణ వరకు, పాలనా భాగస్వామ్య వ్యవస్థ నుంచి గ్రామీణాభి వృద్ధి వరకు, సంఘ్ స్వయంసేవకులు స్పృశించని అంశం లేదు.
ప్రతి విషయాన్నీ రాజకీయ దృష్టికోణంతో చూసే ధోరణి ఉన్నప్పటికీ, సంఘ్ ఇప్పటికీ సమాజపు సాంస్కృతిక జాగరణపైన, సరైన ఆలోచనలు గల వ్యక్తులు – సంస్థలతో బలమైన అనుసంధాన వ్యవస్థను సృష్టించడంపైన దృష్టి పెట్టింది. సామాజిక పరివర్తనలో మహిళల భాగస్వామ్యం, కుటుంబ వ్యవస్థ పవిత్రతను పునరుద్ధరించడంపై గత కొన్ని సంవత్సరాలుగా సంఘ్ దృష్టి సారించింది.
లోక మాత అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది వేడుకల సందర్భంగా సంఘ్ పిలుపుతో దేశమంతటా 27 లక్షల మందికి పైగా వ్యక్తులతో సుమారు 10 వేల కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. మన దేశ నాయకుల విషయంలో మనమంతా కలిసి ఎలా వేడుక చేసుకుంటున్నామో ఇది సూచిస్తుంది. సంఘ్ తన నూరవ సంవత్సరంలోకి ప్రవేశించినప్పుడు బ్లాక్, గ్రామ స్థాయి వరకూ జాతి నిర్మాణం కోసం వ్యక్తి నిర్మాణ కార్యాన్ని కీలకంగా చేపట్టాలని సంఘ్ నిర్ణయించింది.
గత ఏడాది కాలంలో పటిష్ఠమైన ప్రణాళికతో మరో పది వేల శాఖలను జోడించేలా కార్యాచరణ చేయడమన్నది అంకితభావానికి, అంగీకారానికి చిహ్నం. అయితే, ప్రతి గ్రామానికి, బస్తీకి చేరుకోవడ మనే లక్ష్యం ఇంకా ఒక అసంపూర్ణంగా ఉంది. దీనిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాబోయే సంవత్సరాలలో పరివర్తనకు ఉద్దేశించిన పంచ్ పరివర్తన్ అనే ఐదంశాల కార్యక్రమం ప్రధానంగా కొనసాగుతుంది.
శాఖ నెట్‌వర్క్‌ను విస్తరించే క్రమంలో పౌరవిధులు, పర్యా వరణహితమైన జీవనశైలి, సామాజిక సమరసతా వర్తన, కుటుంబ విలువలు, స్వీయత్వ స్పృహపై ఆధారపడిన దైహికమార్పుపై దృష్టిని ఉంచింది. తద్వారా ప్రతి ఒక్కరూ ‘పరం వైభవం నేతు మేతత్ స్వరాష్ట్రం’ – మన దేశాన్ని మహావైభవ స్థితికి తీసుకువెళ్లే బృహత్ ప్రయోజనం కోసం తమ వంతు కృషి చేస్తారు.
గత వంద సంవత్సరాలలో, సంఘ్ ఒక జాతీయ పునర్నిర్మాణ ఉద్యమంగా ప్రయాణించింది. ఎవ్వరినైనా వ్యతిరేకించడం పట్ల సంఘ్‌కి నమ్మకం లేదు. అలాగే, ఈ రోజున సంఘ్ పనిని వ్యతిరే కిస్తున్నవారు కూడా సంఘ్‌లో భాగమవుతారనే విశ్వాసాన్ని కలిగి ఉంది. ప్రపంచం పర్యావరణ మార్పుల నుంచి హింసాత్మక ఘర్షణల వరకు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో సత్వర పరిష్కా రాలను అందించే సామర్థ్యాన్ని భారతదేశపు ప్రాచీన, అనుభవ ఆధారిత జ్ఞానం కలిగివుంది.
ఈ అతి పెద్దయిన, అనివార్యమైన కార్యం ఎప్పుడు సాధ్యమవుతుందంటే, భారతమాత పుత్రులందరూ తమ పాత్రను అర్థం చేసుకుని, ఇతరులు సైతం అనుసరించేలా ప్రేరేపించే దేశీయ నమూనాను నిర్మించడంలో తమ వంతు కృషి చేసినప్పుడే! ఇందుకోసం సజ్జన శక్తి నాయకత్వంలో సమరసతతో కూడిన సంఘటిత భారతీయ సమాజంలో ఆదర్శవంతులమై నిలిచే సంకల్పంతో ఏకమవుదాం!
దత్తాత్రేయ హోసబాళె
వ్యాసకర్త ఆర్‌ఎస్‌ఎస్ సర్ కార్యవాహ్ (జాతీయ ప్రధాన కార్యదర్శి)