సామాజిక పరివర్తనే సంఘ్‌ లక్ష్యం | Sakshi Guest Column On RSS Reaching hundred years | Sakshi
Sakshi News home page

సామాజిక పరివర్తనే సంఘ్‌ లక్ష్యం

Published Fri, May 13 2022 12:20 AM | Last Updated on Fri, May 13 2022 12:21 AM

Sakshi Guest Column On RSS Reaching hundred years

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) స్థాపితమై నూరేళ్లకు చేరువవుతోంది. అప్పటి నుంచీ అనేక వ్యతిరేకతలు, అవరోధాలు, సమస్యలను అధిగమించి విస్తరిస్తూనే ఉంది. నేడు సంఘ్‌ కార్యకలాపాలు ‘శాఖ’ రూపంలో 90 శాతం బ్లాకులకు చేరుకున్నాయి. 35కు పైగా సంస్థలు సమాజ జీవనానికి చెందిన వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్నాయి. ‘దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌లో స్వయంసేవక్‌ను అయ్యాను’ అనే ప్రతిజ్ఞను స్వయంసేవక్‌ చేస్తారు. సంఘ్‌ కార్యాచరణ దిశగా ముందుకు సాగుతూ సంఘ్‌ కార్యాన్ని సంపూర్ణత్వం వైపుకు తీసుకువెళ్ళడమే శతాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి ఉపకరించే ఉత్తమ మార్గం అవుతుంది.

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) స్థాపన జరిగి 100 సంవత్సరా లకు చేరువ అవుతున్నది. 1925లో నాగపూర్‌లో సంఘ్‌ స్థాపన జరిగింది. ఈ సంవత్సరం విజయదశమి నాటికి సంఘ్‌ ప్రారంభమై 97 సంవత్సరాలు పూర్తవుతాయి. కార్యకర్తల కృషి, త్యాగం, బలి దానాల ఫలితంగా... అనేక వ్యతిరేకతలు, అవరోధాలు, సమస్యలను అధిగమించి విస్తరిస్తున్నది. ఈ కారణంగానే అంతటా సంఘ్‌ గురించిన చర్చ జరుగుతున్నది. సంఘ్‌ తన శతాబ్ది వేడుకలను ఎలా జరుపుకుంటుందనే ఆసక్తి సైతం ప్రజల్లో నెలకొంది. నిజానికి సంఘ్‌ శతాబ్ది వేడుకలు నిర్వహించాలనే ఆలోచన లేదు.

సంఘ్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ హెడ్గేవార్‌ దృష్టి చాలా స్పష్టమైనది. సంఘ్‌ సమాజంలో ఒక సంస్థ మాత్రమే కాదు, యావత్‌ సమాజాన్ని సంఘటితం చేసేది. సంఘ్‌ ఒక సంపూర్ణ సమాజం. సంఘ్‌ సాధనను సమాజమంతటా విస్తరింపజేయడం లక్ష్యంగా ఉండాలి. సంఘ్‌ రజ తోత్సవం సైతం జరుపుకోరాదని హెడ్గేవార్‌ చెబుతుండేవారు. అంతకుమునుపే కార్యాన్ని పూర్తి చేయాలనే ఆశయంతో పూర్తి శక్తి యుక్తులతో నిమగ్నమయ్యారు. కానీ వారికి కేవలం 15 సంవత్సరాల సమయం మాత్రమే లభించింది. కనుక శతాబ్ది సంవత్సరానికి ముందే సంఘ్‌ కార్యాన్ని పూర్తి చేయడమే లక్ష్యమై ఉండాలి.

సంఘ్‌ కార్య విస్తరణ యాత్రలో నాలుగు దశలు ఉన్నాయి. సంఘ్‌ స్థాపన నుంచి స్వాతంత్య్రం వచ్చే వరకు మొదటి దశగా భావిం చాలి. ఈ దశలో ఏక చిత్తంతో, ఏకాగ్రతతో కేవలం ‘సంఘటన’పై మాత్రమే దృష్టి పెట్టింది. ఎందుకంటే హిందూ సమాజం సంఘటి తమవుతుంది; ఒకే మనస్సుతో, ఒకే స్వరంతో భారత్‌ గురించి, హిందుత్వ గురించి మాట్లాడగలము అనే ఒక విశ్వాసాన్ని పాదు గొల్పడం అప్పుడు ముఖ్యం.

అందుకనే ఆ లక్ష్యం కోసమే యావత్‌ కార్యం సాగింది. ‘స్వ’ ప్రేరణగా కొనసాగిన స్వరాజ్య ఉద్యమం ఆధారంగా... విద్య, విద్యార్థి, రాజకీయం, కార్మికులు, వనవాసీ సమాజం, వ్యవసాయం తదితర రంగాల్లో భారతదేశపు శాశ్వతమైన జాతీయ దృక్పథానికి ప్రభావితమై వివిధ సంస్థలు ఆవిర్భవించాయి. నేడు సంఘ్‌ కార్యకలాపాలు ‘శాఖ’ రూపంలో 90 శాతం బ్లాకులకు చేరుకున్నాయి. 35కు పైగా సంస్థలు సమాజ జీవనానికి చెందిన వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్నాయి. 

సంఘ్‌ కార్యకలాపాల అభివృద్ధి యాత్రలో మూడవ దశ డాక్టర్‌ హెడ్గేవార్‌ జయంతి శతాబ్దిని పురస్కరించుకొని 1990లో ఆరంభ మైంది. యావత్‌ సమాజం ఆత్మీయత, ప్రేమ ప్రాతిపదికన సంఘ టితం కావాలి. అందుకు సమాజంలో వంచితులు, దుర్బలులు, వెనుకబడిన వర్గాలు, కనీస సౌకర్యాలకు నోచుకోకుండా జీవించే వారిని చేరుకొని వారికి సహాయం, సేవ చేయడాన్ని ఒక బాధ్యతగా భావించాలి; వారి సమగ్రాభివృద్ధి ధ్యేయంగా 1990లో ‘సేవా విభాగ్‌’ ఆరంభమయ్యింది.

‘దేశపు సర్వతోముఖాభివృద్ధి కోసం రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌లో స్వయంసేవక్‌ను అయ్యాను’ అనే ప్రతిజ్ఞను స్వయంసేవక్‌ చేస్తారు. ఈ సర్వతోముఖాభివృద్ధి కార్యాన్ని కేవలం స్వయంసేవక్‌లు మాత్రమే చేయడం లేదు; వారితో మాత్రమే అది సాధ్యం కాదు; సమాజంలోని అనేక మంది ప్రభావశీలురు, సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఆకాంక్షించేవారు కూడా స్వచ్ఛందంగా చేస్తున్నారు. సమా జంలో అలాంటి ప్రభావశీలుర లక్షణాలు, వారి క్రియాశీలత లాంటి సమాచార సేకరణకు... సంఘ్‌ భావజాలం, కార్య కలాపాల గురిం చిన సమాచారాన్ని వారికి చేరవేసే దిశగా 1994లో ‘సంపర్క్‌ విభాగ్‌’ ఆరంభమైంది.

సంఘ్‌లో సభ్యులు కాకున్నా కొన్ని విషయాల్లోనైనా మాతో సారూప్యం ఉన్నవారిని కలిసి ఆలోచనలను పంచుకుంటాం.  2008–09 మధ్యకాలంలో ‘గో–గ్రామ యాత్ర’ మొదలైనప్పుడు అనేక ప్రాంతాల్లోని సర్వోదయ కార్యకర్తలు యాత్రలో పాల్గొన్నారు. అన్ని విషయాల్లోనూ సంఘ్‌ భావజాలం, దృక్పథంతో ఏకీభవించక పోయినా అంశాలవారీగా సంఘ్‌ కార్యకలాపాల్లో పాలుపంచు కుంటున్నారు. 

అదే విధంగా వివిధ ప్రసార మాధ్యమాలను వినియోగించడం ద్వారా సంఘ్‌ జాతీయ భావజాలాన్ని సమాజంలో విస్తరింపజేయడం కోసం, సంఘ్‌పై జరుగుతున్న దుష్ప్రచారానికి దీటుగా జవాబు చెప్పడం కోసం, సంఘ్‌కు చెందిన సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం కోసం, సంఘ్‌ సత్‌ కార్యాలను సమాజానికి తెలియపరిచే ఉద్దేశ్యంతో 1994లో ‘ప్రచార్‌ విభాగ్‌’  ఆరంభమయ్యింది. సంఘ్‌కు చెందిన ఈ మూడు విభాగాలూ (సేవ, సంపర్క్, ప్రచార్‌) సుదూర ప్రాంతాల ప్రజలకు సంఘ్‌ను చేర్చడం  ద్వారా సమాజాన్ని మేల్కొ లిపే కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. 

ఇదే సమయంలో ‘ధర్మజాగరణ్‌ విభాగ్‌’ ద్వారా హిందూ సమాజాన్ని వేరే మతంలోకి మార్చడాన్ని అడ్డుకోవడంతో పాటుగా, మత మార్పిడికి గురైన ప్రజలకు తిరిగి వారిదైన సంస్కృతిలోకి తీసుకు రావడానికీ కార్యక్రమం మొదలైంది. ప్రభుత్వంపై ఆధాపడకుండా ప్రజలందరూ కలిసికట్టుగా తమ గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసుకునే లక్ష్యంగా ‘గ్రామ్‌–వికాస్‌’ కార్యక్రమం కూడా ఆరంభమైంది. 

ఏకత్వంతో కూడుకున్న హిందూ సమాజం వివిధ కులాలుగా మనుగడ సాగిస్తున్నందున... వారిలో అందరూ ఒకటే అనే భావాన్ని తీసుకురావడానికి కృషి చేయాలనే ఉద్దేశ్యంతో ‘సామాజిక్‌ సద్భావ్‌’ పేరిట వరుస సమావేశాలు ప్రారంభమయ్యాయి. మన సమాజంలోని అంటరానితనం పేరిట కొన్ని వర్గాలకు విద్య, సౌకర్యాలు, గౌరవ మర్యాదలు దురుదృష్టవశాత్తూ తిరస్కరణకు గురయ్యాయి. ఇది చాలా అన్యాయమైనది. ఈ అన్యాయాన్ని నివారించి, అందరినీ కలిసి కట్టుగా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో భాగంగా ‘సామాజిక్‌ సమరసత’ పని మొదలైంది. 

భారతీయ దేశీ గోవుల నుంచి మనం పొందే ఉత్పత్తుల్లో ఔషధీయ విలువల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం, భారతీయ దేశీ గోవుల సంరక్షణ, సంవర్ధనతోపాటూ ఆవు పేడ ఆధారిత సేంద్రీయ వ్యవసాయం చేపట్టే దిశగా రైతుల శిక్షణ, పర్యవేక్షణ కోసం ‘గోసేవ–గోసంవర్ధన్‌’ కార్యక్రమం కూడా విజయ వంతంగా సాగుతున్నది. భారతీయ ఆధ్యాత్మిక దృష్టికోణంలో ‘నేను నుంచి మనం వరకు సాగించే ప్రయాణంలో’ కుటుంబానిది తొలి అడుగు అవుతుంది.

వారానికి ఒకసారైనా కుటుంబ సభ్యులందరూ ఒకచోట కూర్చొని సంస్కృతి వారత్వాలు, సామాజిక పరిస్థితులను జాతీయ దృక్కోణంలో విశ్లేషించుకుని... తమ కర్తవ్యాన్ని నిర్ణయిం చుకోవడానికి సహకరించే ‘కుటుంబ్‌ ప్రబోధన్‌‘ కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ప్రజల భాగస్వామ్యాన్ని వృద్ధి చేయడం ద్వారా దెబ్బ తిన్న ప్రకృతి సంతులతను పునరుద్ధరించడానికి ‘పర్యావరణ్‌ సంర క్షణ్‌’ కార్యక్రమం ప్రారంభమైంది. స్వయంసేవక్‌లు ఈ పనులన్నిం టినీ ‘గతివిధి’ పేరుతో సమాజం ముందుంచి ఆరంభించారు. సంఘ్‌ కార్యకలాపాల అభివృద్ధి యాత్ర మూడవ దశలో ఇది ఒక భాగం.

ప్రస్తుతం సంఘ్‌ కార్యకలాపాల అభివృద్ధి యాత్ర  నాల్గవ దశ సాగుతున్నది. దేశం సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రతి స్వయం సేవక్‌... సంఘ్‌  కార్యకర్తగా పనిచేస్తాడు. అందువల్ల ప్రతి ఉద్యోగి స్వయంసేవక్‌ సామాజిక మార్పు కోసం తన ఆసక్తి, సామర్థ్యానికి అనుగుణంగా ఏదైనా రంగంలో సామాజిక పరివర్తన, మార్పు కోసం చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించడమైనది. ప్రస్తుతం ప్రతి ఒక్క స్వయంసేవక్‌ సమాజ పరివర్తనలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలి. వీటన్నింటి ద్వారా సంఘ్‌ కార్యాచరణ దిశగా ముందుకు సాగుతూ సంఘ్‌ కార్యాన్ని సంపూర్ణత్వం వైపుకు తీసుకువెళ్ళడమే శతాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి ఉపకరించే ఉత్తమ మార్గం అవుతుంది.

వ్యాసకర్త సహ సర్‌ కార్యవాహ, ఆర్‌ఎస్‌ఎస్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement