అభిప్రాయం
ఏ సంస్థకైనా, పార్టీకైనా స్థాపించినపుడు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. అధికారానికి వచ్చినట్లయితే ఆ సిద్ధాంతానికి భిన్నమైన లక్ష్యాలు ఏర్పడతాయి. అది క్రమంగా ఒక వైరుద్ధ్యంగా మారుతుంది. అధికార పరిష్వంగంలోకి వెళ్లినవారు ఎంత నిష్ఠాగరిష్ఠులైనా, దాని ఆకర్షణలకు లొంగకుండా ఉండటం చాలా అరుదు. వారికి తమ లక్ష్యాల సాధనకు సిద్ధాంతం ఒక పెద్ద ఆటంకంగా తోస్తుంది. అపుడు దానిని అనివార్యంగా ధిక్కరిస్తారు. ప్రస్తుతం ఆరెస్సెస్, మోదీ మధ్య జరుగుతున్నది అదే. స్వాతంత్య్రానంతరం గాంధీ ఆదర్శాల దారి ఏమిటో, కాంగ్రెస్‌వాదుల అధికార పోకడలు ఏ విధంగా ఉన్నాయో చూసిందే. మార్క్సిజానికి త్రికరణ శుద్ధిగా కట్టుబడినామనే కమ్యూనిస్ట్ పార్టీలలో సైతం ఈ వైరుద్ధ్యాలు చోటు చేసుకున్నాయి.
ఆరెస్సెస్ సైద్ధాంతికతకూ, బీజేపీ అధికార కాంక్షకూ మధ్య ఒక స్పర్థ ఏర్పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ సూచనలు గతంలోనూ ఉండేవిగానీ, ఇటీవలి ఎన్నికల తర్వాత అందుకు స్పష్టత ఏర్పడుతున్నది. ఎన్నిక లలో బీజేపీ అంతిమంగా అధికారానికి వచ్చినా అనుకోని విధంగా కొన్ని ఎదురుదెబ్బలు తిన్నది. ఆ వెంటనే ఆరెస్సెస్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్... ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై, బీజేపీపై విమర్శలు చేశారు.
ఆరెస్సెస్ అధికార పత్రిక ‘ఆర్గనైజర్’ కూడా మరికొన్ని విమర్శలతో ఒక వ్యాసాన్ని ప్రచురించింది. ఇదంతా జూన్ ప్రథమార్థంలో జరిగిన విషయం. ఆ విధమైన విమర్శలు బీజేపీ ప్రత్య ర్థుల నుంచి వచ్చి ఉంటే అందులో విశేషం లేదు. కానీ ఆ పని చేసింది బీజేపీ మాతృ సంస్థ కావటం, ఆ విమర్శలు కూడా బహిరంగంగా చేయటం సంచలనాన్ని సృష్టించింది.
అటువంటి ఎదురు దెబ్బలు, సంచలనాత్మక విమర్శల దృష్ట్యా మోదీ తీరు, బీజేపీ పద్ధతులు కొంతైనా మారగలవని అనేకులు అభిప్రాయపడ్డారు. కానీ, ఆ జూన్ ప్రథమార్థం నుంచి ఇప్పటికి గడిచిన రెండు మాసాల కాలంలో మనకు ఎటువంటి మార్పులు కనిపించటం లేదు. ఇందుకు రెండు తాజా ఉదాహరణలలో ఒకటి, లవ్ జిహాద్ కేసులలో జీవిత ఖైదు విధించే చట్టం చేయగలమన్న అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి ప్రకటన కాగా, రెండవది మోదీ ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల బిల్లును ప్రతిపాదించటం.
ఈ వివరాలలోకి వెళ్లే ముందు ఒక విషయం చెప్పుకోవాలి. ఆరెస్సెస్ ఒక సైద్ధాంతిక సంస్థ. ఆ సిద్ధాంతంతో ఎవరైనా ఏకీభవించ కపోవచ్చుగాక. కానీ వారికి తమ సిద్ధాంతాలు ఉన్నాయి. సంస్థ వయస్సు వందేళ్లు. దాని నాయకత్వాన ఇతర ప్రధాన సంస్థలు, ఉప సంస్థలు కలసి కొన్ని డజన్లు ఉన్నాయి. అన్నింటిని కలిపి సంఘ్ పరివార్ అంటున్నారు. వీటిలో భారతీయ జనసంఘ్ (1951) మొదటి రాజకీయ పార్టీ. తర్వాత అది బీజేపీ (1980)గా రూపాంతరం చెందింది.
ఆరెస్సెస్ సిద్ధాంతం 1951 వరకు కూడా హిందూ రాజ్య స్థాపన కోసం సాంస్కృతిక రంగంలో, మతపరంగా కృషి చేయటం తప్ప రాజకీయాలలోకి అసలు ప్రవేశించరాదన్నది! తర్వాత కొన్ని పరిస్థితులలో మొదట జనసంఘ్, తర్వాత బీజేపీ ఏర్పాటుకు సమ్మ తించినా, ఆ పార్టీలు పూర్తిగా ఆరెస్సెస్ నిర్దేశాలకు లోబడి పనిచేస్తూ పోయాయి.
బీజేపీ అధికారానికి వచ్చిన రాష్ట్రాలలోగానీ, వాజ్‌పేయి నాయకత్వాన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పరచినపుడుగానీ, ముఖ్యమైన పరిపాలనా విధానాలకు కూడా ఆరెస్సెస్‌తో చర్చలు జరుగుతుండేవి. అపుడపుడు భిన్నాభిప్రాయాలు తలెత్తినా చర్చల ద్వారా ఏకాభిప్రా యానికి వచ్చేవారు. ఆరెస్సెస్‌ను బీజేపీ నాయకత్వం ధిక్కరించటం జరిగేది కాదు.
మోదీ నాయకత్వాన అది మొదటిసారిగా జరుగుతుండటమన్నది గమనించవలసిన విశేషం. మోదీ ధిక్కార ధోరణి వాస్తవా నికి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండిన (2001–14) కాలంలోనే మొదలై ఇప్పటికీ కొనసాగుతున్నది. జూన్ ప్రథమార్థం నాటి భాగవత్, ఆర్గనైజర్‌ల బహిరంగ విమర్శలను ఆయన లెక్క చేయక వ్యవహరించటం ఇందుకు కొనసాగింపు మాత్రమే.
ఇప్పుడు అసలు చర్చలోకి వెళదాము. ఏ సంస్థకైనా, లేక పార్టీ కైనా వాటిని స్థాపించినపుడు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. తర్వాత అవి అధికారానికి వచ్చినట్లయితే ఆ సిద్ధాంతానికి భిన్నమైన లక్ష్యాలు ఏర్పడతాయి. పూర్తి భిన్నం కాకున్నా పరిస్థితులను బట్టి వేర్వేరు స్థాయిలలో ఏర్పడుతాయి.
అటువంటపుడు ఆ సిద్ధాంతాలకు, అధి కార లక్ష్యాలకు మధ్యగల భిన్నత్వం క్రమంగా ఒక వైరుద్ధ్యంగా మారు తుంది. లక్ష్యాల స్వభావాన్ని బట్టి, ఆ వ్యక్తుల స్వభావాన్ని బట్టి వైరుధ్య తీవ్రత ఉంటుంది. మరికొద్ది ఉదాహరణలను కూడా చెప్పు కొని ఆరెస్సెస్, బీజేపీల విషయానికి మళ్లీ వద్దాము.
కాంగ్రెస్ పార్టీ 1885లో ఏర్పడింది. ఆ పార్టీ 1923లో చీలి కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ ఆవిర్భవించింది. ఎన్నికలలో పాల్గొనేందుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాగా, పాల్గొనాలన్నది స్వరాజిస్టుల వాదన. అప్పటినుంచి 1947లో స్వాతంత్య్రం లభించే వరకు, దేశ విభజన విషయంలో సైతం పార్టీలో పలువురు ప్రముఖులు గాంధీజీని వ్యతి రేకిస్తూ పోయారు. బ్రిటిష్ వారి హయాంలోనే ప్రభుత్వాలలోనూ చేరారు.
ఆ వివరాలలోకి ఇక్కడ వెళ్లలేముగానీ, గుర్తించవలసింది సిద్ధాంతానికీ, అధికార కాంక్షలకూ మధ్య వైరుద్ధ్యాలు ఏర్పడటం. ఇక స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ సిద్ధాంతాలు, గాంధీ ఆదర్శాల దారి ఏమిటో, కాంగ్రెస్‌వాదుల అధికార పోకడలు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నదే. చివరకు మార్క్సిజానికి త్రికరణ శుద్ధిగా కట్టుబడినామనే కమ్యూనిస్ట్ పార్టీలలో సైతం ఈ వైరుధ్యాలు చోటు చేసుకున్నాయి. వారు స్వయంగా అధికారాలు నెరపిన దేశాలలోనూ, భారతదేశంలోని రాష్ట్రాలనూ చూసినపుడు ఇది స్పష్టంగా తెలుస్తుంది.
వారి అధికార పతనాలకు గల ప్రధాన కారణాలలో ఇది కూడా ఒకటి. అధికారం నిజంగానే ప్రజల మేలు కోసం పరిమితమయితే ఈ పరిస్థితి తలెత్తదు. కానీ విషాదకరమైన వాస్తవం ఏమంటే, అధికార పరిష్వంగంలోకి వెళ్లినవారు ఎంత నిష్టాగరిష్ఠులైనా, దాని ఆకర్షణలకు లొంగకుండా ఉండటం చాలా అరుదు. వారికి తమ లక్ష్యాల సాధనకు సిద్ధాంతం ఒక పెద్ద ఆటంకంగా తోస్తుంది. అపుడు దానిని అనివార్యంగా ధిక్కరి స్తారు. ప్రస్తుతం ఆరెస్సెస్, మోదీల మధ్య జరుగుతున్నది అదే.
ఇటువంటి పరిస్థితులలో సర్వసాధారణంగా జరిగే క్రమం ఒకటు న్నది. ఒక సైద్ధాంతిక సంస్థకు అనుబంధంగా ఉండే కొందరు ఒక రాజకీయ పార్టీని నెలకొల్పడమంటే అధికార సాధన కోసం మాత్రమే. అటువంటపుడు ఒకవైపు తమ సిద్ధాంతంతో సంబంధం ఉన్నవారిని, లేనివారిని కూడా వీలైనంత విస్తృతంగా పార్టీలో చేర్చుకోవలసి ఉంటుంది. వారి ప్రయోజనాల కోసం కూడా పని చేయవలసి ఉంటుంది. మరొకవైపు ఆ క్రమంలో తాము అనేక అధికార ప్రయోజ నాల ఆకర్షణకు లోనవుతారు.
ఈ రెండింటి ప్రభావం వారిని తమ సైద్ధాంతికతకు దూరం చేస్తుంది. సిద్ధాంతాలు గుర్తు చేసేవారిని ధిక్కరించేట్లు చేస్తుంది. కాంగ్రెస్, సోషలిస్టులు, కుల పార్టీలు, ప్రాంతీయ పార్టీల వంటివే కాదు... కమ్యూనిస్టులు, మతవాద పార్టీల వంటి నిష్టాగరిష్ఠత గల సైద్ధాంతిక, కేడర్ పునాది పార్టీలకు సైతం ఈ మాట వర్తిస్తుంది. అది మనం ప్రత్యక్షంగా చూస్తున్నదే. మరొక మాటలో చెప్పాలంటే ఇవన్నీ సైద్ధాంతిక పతనాలు.
సిద్ధాంతానికీ, అధికారానికీ మధ్య స్పర్థ. మనం చూసినంతవరకు ఇందులో అధికా రానిదే పైచేయి అవుతూ వస్తున్నది. అధికారానికి వచ్చినవారు భరించ లేకుండా తయారై, ప్రజల తీవ్ర ఆగ్రహాలకు గురై, వారి చేత పరా భవం పొంది, తిరిగి ప్రజలు సిద్ధాంతాల వైపు మళ్లితే తప్ప, పరిస్థి తులు ఈ విధంగానే ఉంటాయి.
అయితే ఆరెస్సెస్‌కు సంబంధించిన అభిప్రాయాలు కొన్ని ఉన్నాయి. పార్టీ ఏర్పాటును 1951 వరకు వ్యతిరేకించిన వారు జన సంఘ్ స్థాపనకు, తర్వాత బీజేపీ అవతరణకు ఎందువల్ల సమ్మతించినట్లు? రాజకీయ శక్తిగా మారి అధికారం కూడా సాధించినట్లయితే దానిని ఉపయోగించుకుని హిందూ రాష్ట్ర స్థాపన లక్ష్యాన్ని ముందుకు తీసుకు పోవచ్చునన్నది ఆలోచన.
యథాతథంగా అది మంచి వ్యూహమే కావచ్చు. కానీ పైన చెప్పుకున్నట్లు, రాజకీయ శక్తులు, వారి ప్రయోజనాల వలలో చిక్కుకుని అది దారి తప్పింది. ఆరెస్సెస్ నాయ కత్వం స్వయంగా బలహీన పడుతుండటంతో రాజకీయ నాయకత్వం బలం పెరిగింది.
ఇంతేకాదు, సాక్షాత్తూ సంఘ్ పరివార్‌లోని కొన్ని వర్గాలు కూడా అధికార ఆకర్షణలకు లోబడటం మొదలైందనే మాటలు కొంత కాలంగా వినవస్తున్నాయి. ఇటువంటి పరిణామాల మధ్య జరిగేదేమిటి? మోదీ, బీజేపీల అధికార ఆయుధానికి పదను పెరుగుతుంది. ఆరెస్సెస్ సైద్ధాంతిక నిష్ఠ క్రమంగా మొద్దుబారుతుంది. ఈ స్పర్థలో మొగ్గు ఎవరిదో కనిపిస్తున్నదే.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
Comments
Please login to add a commentAdd a comment