అభిప్రాయం
పదవిని కాపాడుకోవడం కోసం ప్రతిపక్ష నాయకులను ఇందిరాగాంధీ అరెస్టు చేశారు. మీడియా మీద ఆంక్షలు విధించారు. అందుకే ఎమర్జెన్సీ ఎత్తివేయగానే దేశంలో ఒక పౌరహక్కుల ఉద్యమం ముందుకొచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు దేశంలో పౌరహక్కులను కాపాడవలసిన అవసరముందని మాట్లాడాయి. ఆ ఒక్క దశలోనే బీజేపీ నాయకులు కూడా పౌరహక్కుల ఉద్యమాన్ని బలపర్చారు. కానీ ఎమర్జెన్సీ కంటే రాజ్యాంగపు తిరగరాత మరింత ప్రమాదకరమైనది. 2024 ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. అయితే ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం అప్పుడే పూర్తిగా తొలగిపోలేదు. దేశం మొత్తంగా ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రక్షించుకునే చైతన్యం పెరగాలి.
18వ లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘అబ్ కీ బార్ 400 పార్’ అని, ఈ ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు గెలవాలని నినాదమిచ్చారు. దాని తరువాత ఆయన మోదీ గ్యారెంటీ నినాదమిచ్చారు. ప్రపంచ ఎన్నికల చరిత్రలో పార్టీని పక్కకు పెట్టి వ్యక్తి గ్యారెంటీ మ్యానిఫెస్టో రాయించారు. ఇది మామూలు విషయం కాదు. ఆ వెనువెంటనే ఆరెస్సెస్, బీజేపీ లీడర్లు కొంతమంది 400 సీట్లు రాగానే దేశ రాజ్యాంగాన్ని తిరగ రాస్తామని ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టారు.
అలా తిరగరాత సిద్ధాంతం ఉన్న ఆరెస్సెస్ నాయకులెవరు ఇటువంటి ప్రకటనలను ఖండించలేదు. ఆనాటికి గానీ, ఇప్పుడు గానీ ఎన్డీఏలో ఉన్న పార్టీలవారికి... అనుకున్న 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని తిరగరాసే ప్రక్రియను ఎదుర్కొనే శక్తి లేదు. వారికి అధికారం తప్ప బలమైన సిద్ధాంతం కూడా లేదు. వాళ్ళ పార్టీ అధికారం తప్ప దేశం ఎటుపోయినా ఫర్వాలేదు.
ఈ స్థితిలో ఇండియా కూటమి ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణను ప్రధాన అంశాన్ని చేసింది. ఎన్నికల తర్వాత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని, అంబేడ్కర్ బొమ్మనీ బహిరంగ సభల్లో చూపిస్తూ తిరిగారు. ఎన్నికల పోరాటమంతా రాజ్యాంగం చుట్టూ తిరిగే స్థితి మొదటిసారి వచ్చింది. ప్రపంచ పత్రికలు కూడా ఒక దేశం రాజ్యాంగ రక్షణ అంశం ఇంత పెద్దఎత్తున ఏ దేశ ఎన్నికల్లో కూడా చర్చనీయాంశం కాలేదని రాశాయి. టీవీలు, సోషల్ మీడియా మాట్లాడాయి.
ఐతే ఎన్నికల సమయంలో ఒక మోదీ తప్ప ఆరెస్సెస్ ప్రధాన నాయకుడైన మోహన్ భాగవత్ సహా రాజ్యంగాన్ని తిరగరాసే ఆలోచన లేదని చెప్పలేదు. మోదీ మాత్రం మేమే ఈ రాజ్యాంగ రక్షకులమని కొన్ని సభల్లో మాట్లాడారు. కానీ ఆరెస్సెస్, బీజేపీ నాయకులంతా సైలెంట్‌గా ఉన్నారు. దానికి ప్రధాన కారణమేమిటంటే, ఈ రాజ్యాంగం పరిధిలో పార్లమెంట్, ఇతర సంస్థలపై సంపూర్ణ పట్టు సాధించి తరువాత ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేది వారి ఆలోచన. ఈ ఆలోచన ఇప్పటిది కాదు.
ఇప్పుడున్న రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండే దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దీనికి మనుధర్మ శాస్త్ర లక్షణాలు ఏ మాత్రం లేవనేది వారి ప్రధాన వాదన. వాళ్ళ అవగాహనలో భారతీయ చట్ట సంస్కృతి అంటే మనుధర్మ శాస్త్ర చట్ట సంస్కృతి. దాంట్లో ప్రధానమైన వర్ణ–కుల వ్యవస్థనీ, స్త్రీ అసమాన జీవితాన్నీ కాపాడటం. సమాజ అసమానతలు భారతీయ సంస్కృతిలో భాగం అని వారి భావన.
అదృష్టవశాత్తు బీజేపీకి 240 సీట్లు మాత్రమే రావడం, దానికి రాజ్యాంగ రక్షణ డిబేట్ దోహదపడటం జరిగింది. అయితే రాజ్యాంగ పర చర్చ ప్రజల జీవనంలోకి చొచ్చుకుని పోకుండా ఉండటానికి ఆరెస్సెస్, బీజేపీ ఒక ఎత్తుగడ వేశాయి. అది 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమస్యను ముందుకు తేవడం! ఎమర్జెన్సీలో చాలా అట్రాసిటీలు, అరాచకాలు జరిగిన మాట నిజమే కానీ అది మొత్తం రాజ్యాంగాన్ని మార్చేటటువంటి ప్రమాద ఘట్టం కాదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాకు తెలిసి ఎంతోమంది యువకులు ఎమర్జెన్సీలో ఎదురు కాల్పుల పేరిట చంపబడ్డారు. ఐతే రాజ్యాంగానికి వచ్చేవరకు ఆ కాలంలో చేసిన రెండు సవరణలు: ప్రియాంబుల్‌లో ‘సోషలిజం’ అనే పదం చేర్చడం; రెండవది ఫండమెంటల్ రైట్స్‌కు కొంత అఘాతం కలిగించే ఫండమెంటల్ డ్యూటీస్‌ని రాజ్యాంగంలో చేర్చడం. ఆరెస్సెస్, బీజేపీ సోషలిజం అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడాన్ని వ్యతిరేకించాయి. కానీ ఫండమెంటల్ డ్యూటీస్‌ని రాజ్యాంగంలో చేర్చడాన్ని బలపర్చాయి.
బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్ నుంచి విడగొట్టి, పాకిస్తాన్‌ను యుద్ధంలో ఓడించినందుకు ఇందిరాగాంధీని దుర్గాదేవిగా వర్ణించిన వారిలో ఆరెస్సెస్, బీజేపీ వారు ఉన్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణాల రద్దు వంటి ఆమె నిర్ణయాలను వ్యతిరేకించారు. ఈ మూడు సిద్ధాంతకర మార్పులు సోషలిస్టు సిద్ధాంత ప్రభావంతో ఇందిరాగాంధీ చేస్తున్నారని వాజ్‌పేయి, ఎల్‌కె అద్వానీ వంటి నాయకులు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణాల రద్దు... శ్రమ జీవులకు, ఉత్పత్తి కులాలకు మేలు చేశాయి.
ఈ క్రమంలో ఆమె భూ సంస్కరణల చట్టం చెయ్యడానికి శ్రీకారం చుట్టారు. 1972లో దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక బలమైన భూ సంస్కరణల చట్టం వచ్చింది. ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి 27 ఎకరాల తరి, 57 ఎకరాల ఖుశ్కి భూమి కంటే ఎక్కువ ఉండటానికి వీలు లేదని చట్టం తెచ్చింది ఆమెనే. ఆ చట్టాన్ని ఎమర్జెన్సీలో భూస్వాములపై ఒత్తిడి తెచ్చి కొంత అమలు చేశారు. నేను 1980లో ఈ చట్టం అమలుపై ఎంఫిల్ «థీసిస్ కోసం చాలా గ్రామాల్లో ల్యాండ్ రిఫామ్ ఎలా జరిగిందో పరిశీలించాను.
భూస్వాములు భూములను బినామీ పేర్లమీద మార్చి చాలావరకు కాపాడుకున్నప్పటికీ ఎమర్జెన్సీలో కొంత భూమి పంచబడింది. ఆ కాలంలో తన పదవి కాపాడుకోవడం కోసం ప్రతిపక్ష నాయకులను ఇందిర అరెస్టు చేశారు. మీడియా మీద ఆంక్షలు విధించారు. నిజమే. అందుకే ఎమర్జెన్సీ ఎత్తివేయగానే దేశంలో ఒక పౌరహక్కుల ఉద్యమం ముందుకొచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు దేశంలో పౌరహక్కులను కాపాడవలసిన అవసరముందని మాట్లాడాయి. ఆ ఒక్క దశలోనే బీజేపీ నాయకులు కూడా పౌరహక్కుల ఉద్యమాన్ని బలపర్చారు. తర్వాత వాళ్లు పౌరహక్కుల రక్షణ జోలికి పోలేదు.
కనుక ఎమర్జెన్సీ అనేది రెండువైపుల పదునున్న కత్తిలా పని చేసింది. కానీ ఆరెస్సెస్, బీజేపీ ఈ రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని నిర్మించాలనుకున్న ఆలోచనలో శూద్రుల, దళితుల, ఆదివాసుల పక్షపాత ఆలోచనలు ఉండే అవకాశం ఏమాత్రం లేదు. వాళ్లు అనుకున్నట్టు నిజంగానే 400 సీట్లు వచ్చి ఉంటే వాళ్లు కొత్త కాన్‌స్టిట్యుయెంట్ అసెంబ్లీని స్థాపిస్తే దాంట్లో ఎటువంటి మేధావి వర్గం ఉండేవారు? ఆ రాజ్యాంగ పరిషత్ కుల అసమానతలను, అంటరానితనాన్ని, బీదరికాన్ని తొలగించే గట్టి ప్రతిపాదనలు చేసే అవకాశం ఉండేదా! నిజానికి బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దుపై చర్చ జరుగుతున్నప్పుడు ఆరెస్సెస్, బీజేపీ నాయకుల వాదనలు; రాజరిక వ్యవస్థ పట్ల జమీందారీ హక్కుల పట్ల వాళ్లు ఎంత అనుకూలంగా ఉన్నారో తిరిగి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు రాజ్యాంగంలోని ప్రియాంబుల్‌లో ఉన్న ‘సోషలిజం’ అనే పదాన్ని వాళ్లు తొలగించాలనుకునేది భారతీయ కష్ట జీవుల పక్షాన ఉండటానికా? పెట్టుబడిదారుల పక్షాన ఉండటానికా?
2024 ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక పెద్ద ప్రమాదం
నుంచి కాపాడాయి. ఐతే ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం అప్పుడే పూర్తిగా తొలగిపోలేదు. చంద్రబాబు, నితీష్‌కుమార్ వంటి సిద్ధాంత రహిత ప్రాంతీయ నాయకులు కూడా ఈ భవిష్యత్ ప్రమాదం నుండి దేశాన్ని కాపాడలేరు. దేశం మొత్తంగా ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రక్షించుకునే చైతన్యం పెరగాలి. ఓటు రాజ్యాంగ రక్షణ ఆయుధాలలో కీలకమైంది. ఐతే దాన్ని ప్రజలు, ముఖ్యంగా యువకులు నిరంతరం ఇప్పుడున్న రాజ్యాంగంతో ముడేసి చూడాలి. ఈ ఎన్నికల్లో రాజ్యంగం పట్ల కలిగిన కొత్త చైతన్యాన్ని తగ్గించేందుకు ఆరెస్సెస్, బీజేపీలు ఎమర్జెన్సీ అంశాన్ని ముందు పెట్టి చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాయి.
జూన్ 25న వి.పి. సింగ్ జయంతి సభ ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో జరిగింది. మాట్లాడటానికి నేను ముఖ్య అతిథిగా వెళ్ళాను. అందులోనే చాలా పెద్ద హాలులో రైట్‌వింగ్ ఆలోచనాపరులు ఎమర్జెన్సీలో జె.పి. మూమెంట్‌పై మీటింగ్ పెట్టారు. ఎందుకో తెలుసా? రాజ్యాంగ మార్పు కంటే ఎమర్జెన్సీ ప్రమాదకరమని చెప్పడానికి!
ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment