బీజేపీ, ఆరెస్సెస్‌పై రాహుల్ విసుర్లు
రాజ్యాంగాన్ని సావర్కర్ విమర్శించారు
మనుస్మృతి ప్రకారమే దేశం నడవాలన్నారు
లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చలో ధ్వజం
న్యూఢిల్లీ: ‘‘బీజేపీకి, ఆరెస్సెస్‌కు రాజ్యాంగంపై విశ్వాసం లేదు. అవి కేవలం మనుస్మృతినే చట్టంగా భావిస్తున్నాయి. దానికే మద్దతిస్తున్నాయి’’ అని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ మన దేశం రాజ్యాంగం ఆధారంగానే నడుస్తుంది తప్ప మనుస్మృతి ప్రకారం కాదని తేలి్చచెప్పారు. ‘‘పాలక పక్షానికి సుప్రీం నేత అయిన వినాయక్ దామోదర్ సావర్కర్ రాజ్యాంగాన్ని విమర్శించారు.
అందులో భారతీయతే లేదన్నారు. మనుస్మృతి ప్రకారమే దేశం నడవాలని కోరుకున్నారు. ఇప్పుడు బీజేపీ పెద్దలు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడడం ద్వారా వారి సుప్రీం లీడర్‌ను నవ్వులపాలు చేస్తున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. రాజ్యాంగ వజ్రోత్సవాలపై లోక్‌సభలో జరుగుతున్న ప్రత్యేక చర్చలో రెండో రోజు శనివారం రాహుల్ పాల్గొన్నారు. బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. పేదలను కాపాడుతున్న రాజ్యాంగంపై బీజేపీ నిత్యం దాడులు చేస్తోందని ధ్వజమెత్తారు.
బ్రిటిషర్లతో రాజీపడ్డ సావర్కర్
బీజేపీ సుప్రీం లీడర్ సావర్కర్ మాటలతోనే ప్రసంగం ప్రారంభిస్తానని రాహుల్ అన్నారు. ‘‘వేదాల తర్వాత అత్యంత ఆరాధనీయ గ్రంథం మనుస్మృతి అని సావర్కర్ చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, అలవాట్లు, ఆలోచనలకు మనుస్మృతే ఆధారమన్నారు. మన ఆధ్యాతి్మక, దైవిక మార్గాన్ని అది నిర్దేశించిందని చెప్పారు. మను స్మృతి ఆధారంగానే దేశం నడుచుకోవాలంటూ రచనలు, పోరాటం చేశారు. ఇప్పుడు మీరేమో (బీజేపీ) రాజ్యాంగాన్ని కాపాడాలని మాట్లాడు తున్నారు.
అంటే మీ నాయకుని బోధలకు మద్దతిస్తున్నట్టా, లేదా? మీరు రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడటమంటే సావర్కర్‌ను మీరు అవమానిస్తున్నట్లే. హేళన చేస్తున్నట్టే. కించపరుస్తున్నట్టే. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కూడా సావర్కర్‌ను ప్రశంసించారంటూ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి సావర్కర్ బ్రిటిషర్లతో రాజీపడ్డారని ఇందిర ఆరోపించారు. గాం«దీజీ, నెహ్రూ స్వాతంత్య్ర పోరాటంలో జైలుకెళ్తే సావర్కర్ మాత్రం బ్రిటిషర్లకు క్షమాపణ లేఖ రాసి మరీ జైలు నుంచి బయటపడ్డారని అప్పట్లో ఇందిర విమర్శించారు’’ అని చెప్పారు.
ప్రతి రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం
కురుక్షేత్ర యుద్ధంలో మాదిరిగా నేడు దేశంలో రెండు పక్షాలు ఇరువైపులా మోహరించాయని రాహుల్ అభిప్రాయపడ్డారు. ‘‘ఒకటి రాజ్యాంగాన్ని కాపాడే పక్షం. మరొకటి దాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్న పక్షం. మేం ప్రతి రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం. మాకు తమిళనాడులో పెరియార్, కర్ణాటకలో బసవన్న, మహారాష్ట్రలో పూలే, అంబేడ్కర్, గుజరాత్‌లో గాంధీ ఉన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో హథ్రాస్‌ను సందర్శించా. సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన యువతి కుటుంబాన్ని పరామర్శించా. బాధిత కుటుంబం అవమానంతో ఇంటికి పరిమితమైతే నిందితులేమో యథేచ్ఛగా తిరుగుతున్నారు. బాధిత కుటుంబం ఇంటికే పరిమితం కావాలని రాజ్యాంగంలో రాసుందా? అది కేవలం మీ (బీజేపీ) పుస్తకంలోనే రాసుంది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం సురక్షితమైన చోటికి మార్చకపోతే మేమే ఆ పని చేస్తాం. సంభాల్ హింసాకాండలో ఐదుగురు అమాయకులు బలయ్యారు. సమాజంలో బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోంది’’ అంటూ దుయ్యబట్టారు. కులం, మతం, వర్గం పేరిట ప్రజలను విడగొట్టాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు.
బలహీన వర్గాల బొటనవేళ్లు నరికేస్తున్నారు
‘‘ఏకలవ్యుడు గురుదక్షిణ కింద బొటనవేలు నరికి ద్రోణాచార్యుడికి సమరి్పంచాడు. నేడు మోదీ ప్రభుత్వం యువత, కార్మికులు, వెనుకబడిన తరగతులు, పేదల బొటన వేళ్లను నిస్సిగ్గుగా నరికేస్తోంది. వారి నైపుణ్యాలను, జీవనోపాధిని దెబ్బతీస్తోంది’’ అంటూ రాహుల్ దుయ్యబట్టారు. ‘‘అగి్నపథ్ తెచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రైతులపై బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. పదవుల భర్తీకి లేటరల్ ఎంట్రీ విధానం తెచ్చారు. పేపర్ లీకేజీలు కొనసాగిస్తున్నారు. ఇలా అన్ని వర్గాల ఉసురు పోసుకుంటున్నారు’’ అని ఆరోపించారు. మోదీ దన్నుతో అదానీ సామ్రాజ్యం దేశంలో కీలక రంగాల్లోకి విస్తరించిందన్నారు. ‘‘మేం అధికారంలోకి వస్తే దేశమంతటా కులగణన నిర్వహిస్తాం. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగిస్తాం’’ అని పునరుద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment