kancha ilaiah
-
ఏఐలో చైనాతో పోటీ పడగలమా?
లియాంగ్ వెన్ఫెంగ్ అనే 39 ఏండ్ల చైనా యువకుడు తన నూతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ– కృత్రిమ మేధ) కంపెనీలో అతి తక్కువ ఖర్చుతో ఒక అద్భుతం చేశాడు. అతను డీప్‌సీక్ అనే కొత్త చాట్ బాట్ యాప్‌ను కనిపెట్టి ప్రపంచ మార్కెట్లో ప్రవేశపెట్టాడు. జనవరి చివరి వారంలో ప్రవేశపెట్టిన ఈ సెర్చ్ ఇంజిన్ ఒక్కరోజులోనే అమెరికాకు ఒక ట్రిలియన్ డాలర్లు, అంటే ఒక లక్ష కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్‌లు తయారుచేసే కంపెనీలు భారీ నష్టాన్ని చవి చూశాయి.సులభంగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు ప్రపంచ సమాచార సెర్చ్ అంతటినీ గూగుల్ కంపెనీ గుప్పిట్లో పెట్టుకొని ఉంది. అంతేకాకుండా ఇతర యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ మొదలైనవన్నీ అమెరికన్ల పరిశోధనలో రూపుదిద్దుకున్నవే. ఈ రంగంలో చైనా వారు కూడా ఈ అమెరికా టెక్నాలజీని తీసుకొని తమ దేశ అవసరాలకు అప్లై చేసుకుంటున్నారు. లియాంగ్ ఒక ఇంట ర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం, చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ ఇప్పటివరకు జరుగలేదు. ఆధార ఏఐ సైన్సును లియాంగ్ ఇన్నోవేటివ్ సైన్సుగా మార్చాడు.హేతుపూర్వక సమాజంఐతే చైనా చాలా ఇతర రంగాల్లో ఇన్నోవేషన్లు చేస్తూ వస్తున్నది. అది కమ్యూనిస్టు దేశంగా మారకముందే తమ దేశంలోని అగ్రి కల్చరిజం అనే ఫిలాసఫీని కన్ఫ్యూషియనిజం, బుద్ధిజంతో జతపర్చి సమాజాన్ని ఒక హేతుపూర్వక సమాజంగా మారుస్తూ వచ్చింది. మతతత్వానికంటే ముందే వారు వ్యవసాయ తత్వానికి పాఠశాలల్లో ఉన్నత స్థానమిచ్చారు. పిల్లల్ని బడి నుండి పొలానికి, పొలం నుండి బడికి పంపి... పని, పాఠాలు కలగలిపి నేర్పించారు. చైనా పాఠశాల విద్యా విధానం వందల సంవత్సరాల శ్రమ జీవన పాఠాలతో ముడిపడింది. ఆ దేశంలో మతాన్ని, హేతుబద్ధతను ముడేశారు. దాన్ని పిల్లలకు నేర్పే అగ్రికల్చరిజం ఫిలాసఫీతో అనుసంధానించారు. భూమికి, ఆకాశానికి, ప్రకృతికి, వానకు, గాలికి గల సంబం«ధాన్ని మెటీరియలిస్ట్ ఆధ్యాత్మికతకు అనుసంధానించడం వల్ల చిన్న ప్పటినుండే పిల్లల మెదళ్లలో క్రియేటివ్ దైవవాదం ఏర్పడింది. ఈ విధానాన్ని సభ్య సమాజమంతటికీ అనుసంధానించారు. తద్వారా వారి దైవం ఉత్పత్తిలో భాగమయ్యాడు లేదా అయింది.అందుకే గన్ పౌడర్, కాగితం, కంపాస్, అచ్చు యంత్రం, సిస్మోమీటర్ (భూకంపాల అధ్యయన మిషన్) ముందు వాళ్ళే కనిపెట్టారు. సిస్మోమీటర్ను 1880లో బ్రిటిష్ జాన్ మిల్నే కను క్కున్నాడని రాసుకున్నప్పటికీ అది మొదలు చైనా కనిపెట్టిందే. ఆ సైన్సు తరువాత జపానుకు పాకి వారిని చాలా భూకంపాల నుండి కాపాడింది.డెంగ్ షియావోపింగ్ కాలంలో ప్రపంచ ఆధునిక సైన్సుతో తమ సైన్సును అనుసంధానం చేస్తున్నప్పుడు, మావో ధరించే ‘బంద్ గలా కోటు’ తమదేనా లేదా ‘టై అండ్ సూట్’ తమదా అని చర్చ జరిగింది. ఐతే టై–సూట్ చైనా డిస్కవరీ అని చారిత్రక ఆధారాలు దొరికాయి. దాంతో అధ్యక్షుడి నుండి కిందిస్థాయిల వరకు టై– సూట్‌ను అధికార డ్రెస్‌కోడ్‌గా మార్చుకున్నారు.ఇండియా పరిస్థితి ఏమిటి?చైనా యువకులు గత ముప్పయి సంవత్సరాలుగా యూరో– అమెరికా డిస్కవరీస్తో పోటీ పడాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మావో కల్చరల్ రెవల్యూషన్ కాలంలో ఇచ్చిన నినాదం ‘మాయా వాదాన్ని బద్దలుకొట్టి, ప్రకృతిని పఠించు’. ఆయన యునాన్ రిపోర్టులో ఆ దేశంలోని అగ్రికల్చరిజం తత్వభూమికను బాగా అర్థం చేసుకున్నాడు. ఈ మొత్తం పరిణామ క్రమమే చైనాలో సైన్సు,మతం, నైతికత జాగ్రత్తగా అనుసంధానం కావడం. ఆ సామాజిక చైతన్యం నుండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వాళ్ళు అమెరికాను తలదన్నే మార్గంలో ఉన్నారు. అందులో భాగమే డీప్‌సీక్. మరి మన దేశం స్థితి ఏమిటి? రుగ్వేద రచనా కాలంలోనే ఇక్కడి అగ్రికల్చరిజం ఫిలాసఫీని చంపేశారు. ఉత్పత్తి రంగంలో శాస్త్రీయ శ్రమ చేస్తున్న శూద్రులను (దళితులూ అందులో భాగమే) బానిసలుగా మార్చి, శ్రమశక్తి అజ్ఞాన మని నిర్వచించారు. ఈ ఆలోచనను బలోపేతం చెయ్యాలని ఆరెస్సెస్–బీజేపీ నాయకత్వం సైన్సు నుండి మతాన్ని సంపూర్ణంగా విడగొట్టాలనే భావనతో పయనిస్తోంది. చైనా డీప్‌సీక్ కనిపెట్టి అమెరికాను అతలాకుతలం చేసిన రోజులలోనే కుంభమేళాపై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఖర్చవుతున్నాయి. ఉత్పత్తికీ, ఆధునిక సైన్సుకూ పూర్తిగా దూరంగా ఉండేవారికి మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. వీటి ప్రభావం లక్షలాది మంది స్కూలు, కాలేజీ పిల్లల మీద పడి దీన్నే భారతదేశ మార్గంగా భావించే దశకు తీసుకెళ్తున్నారు. ఉత్పత్తితో ముడిపడినవారికి స్తుతి చెయ్యట్లేదు. కూర్చొని తినేవారికి రాజ్యం గౌరవ పీఠం వేస్తుంది.ఇంగ్లిష్ వ్యతిరేక ప్రచారం, పురాతన దుస్తులు ధరించాలనే ప్రచారం యువకులను కచ్చితంగా సైన్సు వ్యతిరేకులను చేస్తుంది. ఈ దేశపు యువతను సీరియస్ యూనివర్సిటీ పరిశోధ కులను చెయ్యనివ్వకుండా మూఢ నమ్మకస్తుల్ని చేస్తుంది.ప్రశ్నించే తత్వం ముఖ్యంచైనాలో అది మతరంగంలోగాని, ఉత్పత్తి రంగంలో గాని, యూనివర్సిటీలోగాని ప్రశ్నించే తత్వాన్ని బాగా నేర్పుతారు. మావో ‘వంద ఆలోచనలు ఘర్షణ పడనివ్వు, వంద పువ్వులు వికసించనివ్వు’ నినాదం వాళ్ళ సంఘర్షణల చరిత్ర నుండి వచ్చింది. కానీ ఇండియాలో స్కూళ్లు, యూనివర్సిటీల్లో మతరంగాన్ని, అంతకంటే ముఖ్యంగా ఉత్పత్తి రంగాన్ని ఆలోచనల ఘర్షణలకు బయట నడవాలనే సంప్రదాయాన్ని ప్రచారం చేస్తున్నారు. మోహన్ భాగవత్ ఉత్పత్తికీ, దేవుడికీ మధ్య సంబంధం, ఘర్షణ గురించి ఒక్క ఉప న్యాసం ఇవ్వగా మనం చూడలేదు. మోదీ కూడా నెహ్రూ లాగా సైన్సు మీద ఒక్క సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వలేదు. చైనాతో సమానంగా ఉన్న ఇంత పెద్ద జనాభాను సైన్సుకు శత్రువులను చేస్తే కొత్త ఆలోచనలు యువతకు ఎక్కడి నుండి వస్తాయి?నేను ఇంతకుముందు వ్యాసంలో చెప్పినట్లు... కులం, ఏకవృత్తి, మూఢ నమ్మకాలు వేల ఏండ్లుగా మన మెదడు చిప్‌ను లాక్ చేసిన స్థితి ఉన్నది. ఆరెస్సెస్/బీజేపీ ప్రయత్నం ఈ లాక్ చెయ్యబడ్డ చిప్‌ను ఓపెన్ చెయ్యడం వైపు లేదు. వారి రాజకీయ మూఢ నమ్మకం ఈ లాక్‌ను తుప్పు పట్టించింది. అది పగల కొడితే తప్ప ఓపెన్ కాదు. కానీ అలాంటి ప్రయత్నం మన విద్యా రంగంలో ఎవరు మొదలు పెట్టినా వారిని దేశద్రోహులు, సనాతన వ్యతిరేకులు అని ముద్ర వెయ్యడం, భయభ్రాంతులకు గురి చెయ్యడం మామూ లైంది. ఈ స్థితిలో చైనాతో పోటీపడే డిస్కవరీస్ ఇక్కడ ఎలా జరుగుతాయి? కొత్త డిస్కవరీలు జరగడానికి డబ్బు ఒక్కటే సరి పోదు. సైంటిస్టును అభివృద్ధి చేసే సామాజిక, గృహ, మార్కెట్, మత పునాది ఉండాలి.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు -
సునోజి మేరగాన – కహాతా రహే తెలంగాణ..
సంగంరెడ్డి సత్యనారాయణ (Sangam Reddy Satyanarayana) పేరు తెలంగాణ పాత తరానికి బాగా పరిచయం. కొత్త తరానికి ఆయన అంతగా తెలియదు. వరంగల్ జిల్లాలోని ముచ్చర్ల (Mucherla) గ్రామంలో 1933 జనవరి 21న పుట్టిన ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మూలమైన ‘నాన్–ముల్కి’ ఉద్యమం 1950లో ప్రారంభమైనప్పుడు దానికి సాహిత్య ప్రాణం పోసిన తొలి విద్యార్థి మేధావి. హన్మకొండలోని మల్టీ పర్పస్ హైస్కూల్ అధ్యక్షుడిగా ఆ స్కూల్లోని ఆంధ్ర టీచర్లు, తెలంగాణ భాషను అవమానిస్తుంటే తిరుగుబాటును ఆర్గనైజ్ చేశాడు. అప్పటినుండే పాటలు రాయడం, ఉపన్యాసమివ్వడం, నాటకాలెయ్యడంలో దిట్టగా ఎదిగాడు.‘పచ్చని చెట్ల పైట రెపరెపలాడంగ; పాడిపంటలనిచ్చి కడుపునింపే తల్లి చల్లని మా తల్లి ముచ్చర్ల గ్రామం’ వంటి పాటతో మొదలెట్టి, నాన్ –ముల్కీ పోరాటంలోనే ‘తెలంగాణ సోదర తెలుసుకో నీ బతుకు; మోసపోతివ నీవు గోస పడతావు’ అనే పాట రాసి, పాడి ఉర్రూత లూగించాడు. తన గ్రామంపై పాట రాసినందున ఆయనను ముచ్చెర్ల సత్యనారాయణ (Mucherla Satyanarayana) అనేవారు. ఊరి నుండి బడికి రోజూ 12 మైళ్ళు నడిచొచ్చే, బట్టలు కూడా సరిగా లేని ఆయన 12వ తరగతి ఫెయిల్ అయ్యాడు. సప్లమెంటరీ రాసి పాసై హైదరాబాద్‌కు వచ్చిసంగీత కళాశాలలో చేరాడు. ఉండటానికి చోటు లేక గూటి కోసం వెతగ్గా రవీంద్ర భారతి పక్కన బీసీ హాస్టల్ (BC Hostel) ఉందని తెలిసి సంగం లక్ష్మీబాయమ్మను కలిసి పాట పాడి ఆమెను మెప్పించి అడ్మిషన్ తెచ్చుకున్నాడు.ఒక సంవత్సరంలో హిందూస్థానీ, కర్ణాటక సంగీతం నేర్చుకొని సత్యనారాయణ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో (Osmania Arts College) బీఏ తెలుగు, సంస్కృతం, ఎకనామిక్స్ చదువుకున్నాడు. 1956లో తెలంగాణ స్టేట్ ఆంధ్రలో కలిసి ఆంధ్రప్రదేశ్ కావడంతో సత్యనారాయణ, ఆయన మిత్రులు నాన్– ముల్కీ ఉద్యమాన్ని ఆంధ్ర వ్యతిరేక ఉద్యమంగా మార్చారు. ఆ ఉద్యమ మొదటి పాట ఆయన రాసి పాడిందే. అదీ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మీద.‘అయ్యయ్యో రామరామ సంజీవరెడ్డి మామ / సునోజి మేరగాన – కహాతా రహే తెలంగాణ /..... / ఛోడోజీ తెలంగాణ – భలే జావో రాయలసీమ’... ఈ పాట ఆ కొత్త ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. 1948 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి 1956 మధ్యలో అటు ఆంధ్ర నుండి, ఇటు మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుండి బ్రాహ్మణ మైగ్రేషన్ బాగా జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రమంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లిష్ డిగ్రీలు సంపాదించిన బ్రాహ్మణ మేధావులు ప్రొఫెసర్లు అయ్యారు. దాదాపు 1960 నాటికి ఇక్కడి రెడ్లు, వెలమలు ఎంఏ, ఎమ్మెస్సీ పట్టాలు పొందినవారు లేరు.1953–56 మధ్య సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలనే చర్చల్లో తెలంగాణ ప్రాంతం బ్రాహ్మణ మేధావులు ఉన్నారు. ఇప్పుడు వరంగల్‌లో ఒక హెల్త్ యూనివర్సిటీ పేరు, ఒక కళాక్షేత్రం పేరు పెట్టిన కాళోజీ 1969 వరకు సమైక్యవాదే. సత్యనారాయణ నాన్–ముల్కీ పోరాటం స్కూలు ప్రెసిడెంట్‌గా నడిపినపుడు జయశంకర్ ఆయన క్లాస్మేట్. ఇద్దరు కలిసి నాటకాలు వేశారు. కానీ సత్యనారాయణ లాగా మిలిటెంట్ నాన్– ముల్కీ వ్యతిరేక ఉద్యమంలో ఆయన ఉన్న దాఖలాలు లేవు. సత్యనారాయణ గొల్ల (యాదవ) కులంలో పుట్టినందున ఒక క్రియేటివ్ కవిగా, పాటగాడిగా ఆయనకు రావలసినంత గుర్తింపు రాలేదు. 1950 దశకంలో ఉస్మానియాలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన గ్రామానికి పోయి గ్రామ ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్, ఆ తరువాత 1970లో హన్మకొండ సమితి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆనాటి మొట్ట మొదటి దళిత్ కలెక్టర్ కాకి మాధవరావుతో దోస్తీ చేసి గ్రామాలకు అభివృద్ధి పథకాలను తీసుకెళ్లాడు.చదవండి: ప్రపంచానికి ఏం రాసి పెట్టి ఉంది?1983 ఎన్టీఆర్ టీడీపీ రాగానే అందులో చేరి ఎమ్మెల్యేగా హయగ్రీవాచారిని చిత్తుగా ఓడించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయ్యాడు. అయితే అనతి కాలంలోనే వరంగల్ జిల్లాలో మైగ్రేట్ కమ్మ నాయకుడు శివాజిని, కమ్మ డాక్టర్ కల్పనాదేవిని ఆయనపై అజమాయిషికి పెట్టడంతో ఎన్టీఆర్ మీద ఆయన తిరుగుబాటు మొదలైంది. ఆయన ఎన్టీఆర్ మీద కోపంతో నాదెండ్ల భాస్కర్ రావు క్యాంపులో చేరి చివరికి పదవి కోల్పోయాడు. ఆ తరువాత మళ్ళీ కడవరకు అంటే 2016లో చనిపోయే వరకు ప్రత్యేక తెలంగాణ కోసం రకరకాల కార్యక్రమాలు చేపట్టాడు. 2001లో కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ పెడితే దానిలో చేరి కొంతకాలం పనిచేశాడు.చదవండి: ఓబీసీల వర్గీకరణతో సమన్యాయంఆయన చనిపోయి 8 సంవత్సరాలు అయినా ఆయనకో విగ్రహంగానీ, ఆయన పోతే వరంగల్ ప్రాంతంలో ఏ సంస్థనూ ఎవరూ పెట్టింది లేదు. ఆయనతో పని చేసిన జయశంకర్‌కు, కాళోజీకి, కొండా లక్ష్మణ్‌కి చాలా గుర్తింపు దొరికింది. జీవితంలో సుదీర్ఘకాలం బీదరికంలో బతికిన ఆయన మనకో ఆదర్శాన్ని మిగిల్చాడు.- ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు(జనవరి 21న సంగంరెడ్డి సత్యనారాయణ జయంతి) -
రాజ్యాంగ రక్షణే అత్యవసరం
పదవిని కాపాడుకోవడం కోసం ప్రతిపక్ష నాయకులను ఇందిరాగాంధీ అరెస్టు చేశారు. మీడియా మీద ఆంక్షలు విధించారు. అందుకే ఎమర్జెన్సీ ఎత్తివేయగానే దేశంలో ఒక పౌరహక్కుల ఉద్యమం ముందుకొచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు దేశంలో పౌరహక్కులను కాపాడవలసిన అవసరముందని మాట్లాడాయి. ఆ ఒక్క దశలోనే బీజేపీ నాయకులు కూడా పౌరహక్కుల ఉద్యమాన్ని బలపర్చారు. కానీ ఎమర్జెన్సీ కంటే రాజ్యాంగపు తిరగరాత మరింత ప్రమాదకరమైనది. 2024 ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. అయితే ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం అప్పుడే పూర్తిగా తొలగిపోలేదు. దేశం మొత్తంగా ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రక్షించుకునే చైతన్యం పెరగాలి.18వ లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘అబ్ కీ బార్ 400 పార్’ అని, ఈ ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు గెలవాలని నినాదమిచ్చారు. దాని తరువాత ఆయన మోదీ గ్యారెంటీ నినాదమిచ్చారు. ప్రపంచ ఎన్నికల చరిత్రలో పార్టీని పక్కకు పెట్టి వ్యక్తి గ్యారెంటీ మ్యానిఫెస్టో రాయించారు. ఇది మామూలు విషయం కాదు. ఆ వెనువెంటనే ఆరెస్సెస్, బీజేపీ లీడర్లు కొంతమంది 400 సీట్లు రాగానే దేశ రాజ్యాంగాన్ని తిరగ రాస్తామని ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టారు. అలా తిరగరాత సిద్ధాంతం ఉన్న ఆరెస్సెస్ నాయకులెవరు ఇటువంటి ప్రకటనలను ఖండించలేదు. ఆనాటికి గానీ, ఇప్పుడు గానీ ఎన్డీఏలో ఉన్న పార్టీలవారికి... అనుకున్న 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని తిరగరాసే ప్రక్రియను ఎదుర్కొనే శక్తి లేదు. వారికి అధికారం తప్ప బలమైన సిద్ధాంతం కూడా లేదు. వాళ్ళ పార్టీ అధికారం తప్ప దేశం ఎటుపోయినా ఫర్వాలేదు. ఈ స్థితిలో ఇండియా కూటమి ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణను ప్రధాన అంశాన్ని చేసింది. ఎన్నికల తర్వాత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని, అంబేడ్కర్ బొమ్మనీ బహిరంగ సభల్లో చూపిస్తూ తిరిగారు. ఎన్నికల పోరాటమంతా రాజ్యాంగం చుట్టూ తిరిగే స్థితి మొదటిసారి వచ్చింది. ప్రపంచ పత్రికలు కూడా ఒక దేశం రాజ్యాంగ రక్షణ అంశం ఇంత పెద్దఎత్తున ఏ దేశ ఎన్నికల్లో కూడా చర్చనీయాంశం కాలేదని రాశాయి. టీవీలు, సోషల్ మీడియా మాట్లాడాయి. ఐతే ఎన్నికల సమయంలో ఒక మోదీ తప్ప ఆరెస్సెస్ ప్రధాన నాయకుడైన మోహన్ భాగవత్ సహా రాజ్యంగాన్ని తిరగరాసే ఆలోచన లేదని చెప్పలేదు. మోదీ మాత్రం మేమే ఈ రాజ్యాంగ రక్షకులమని కొన్ని సభల్లో మాట్లాడారు. కానీ ఆరెస్సెస్, బీజేపీ నాయకులంతా సైలెంట్‌గా ఉన్నారు. దానికి ప్రధాన కారణమేమిటంటే, ఈ రాజ్యాంగం పరిధిలో పార్లమెంట్, ఇతర సంస్థలపై సంపూర్ణ పట్టు సాధించి తరువాత ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేది వారి ఆలోచన. ఈ ఆలోచన ఇప్పటిది కాదు. ఇప్పుడున్న రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండే దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దీనికి మనుధర్మ శాస్త్ర లక్షణాలు ఏ మాత్రం లేవనేది వారి ప్రధాన వాదన. వాళ్ళ అవగాహనలో భారతీయ చట్ట సంస్కృతి అంటే మనుధర్మ శాస్త్ర చట్ట సంస్కృతి. దాంట్లో ప్రధానమైన వర్ణ–కుల వ్యవస్థనీ, స్త్రీ అసమాన జీవితాన్నీ కాపాడటం. సమాజ అసమానతలు భారతీయ సంస్కృతిలో భాగం అని వారి భావన. అదృష్టవశాత్తు బీజేపీకి 240 సీట్లు మాత్రమే రావడం, దానికి రాజ్యాంగ రక్షణ డిబేట్ దోహదపడటం జరిగింది. అయితే రాజ్యాంగ పర చర్చ ప్రజల జీవనంలోకి చొచ్చుకుని పోకుండా ఉండటానికి ఆరెస్సెస్, బీజేపీ ఒక ఎత్తుగడ వేశాయి. అది 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమస్యను ముందుకు తేవడం! ఎమర్జెన్సీలో చాలా అట్రాసిటీలు, అరాచకాలు జరిగిన మాట నిజమే కానీ అది మొత్తం రాజ్యాంగాన్ని మార్చేటటువంటి ప్రమాద ఘట్టం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాకు తెలిసి ఎంతోమంది యువకులు ఎమర్జెన్సీలో ఎదురు కాల్పుల పేరిట చంపబడ్డారు. ఐతే రాజ్యాంగానికి వచ్చేవరకు ఆ కాలంలో చేసిన రెండు సవరణలు: ప్రియాంబుల్‌లో ‘సోషలిజం’ అనే పదం చేర్చడం; రెండవది ఫండమెంటల్ రైట్స్‌కు కొంత అఘాతం కలిగించే ఫండమెంటల్ డ్యూటీస్‌ని రాజ్యాంగంలో చేర్చడం. ఆరెస్సెస్, బీజేపీ సోషలిజం అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడాన్ని వ్యతిరేకించాయి. కానీ ఫండమెంటల్ డ్యూటీస్‌ని రాజ్యాంగంలో చేర్చడాన్ని బలపర్చాయి. బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్ నుంచి విడగొట్టి, పాకిస్తాన్‌ను యుద్ధంలో ఓడించినందుకు ఇందిరాగాంధీని దుర్గాదేవిగా వర్ణించిన వారిలో ఆరెస్సెస్, బీజేపీ వారు ఉన్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణాల రద్దు వంటి ఆమె నిర్ణయాలను వ్యతిరేకించారు. ఈ మూడు సిద్ధాంతకర మార్పులు సోషలిస్టు సిద్ధాంత ప్రభావంతో ఇందిరాగాంధీ చేస్తున్నారని వాజ్‌పేయి, ఎల్‌కె అద్వానీ వంటి నాయకులు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణాల రద్దు... శ్రమ జీవులకు, ఉత్పత్తి కులాలకు మేలు చేశాయి. ఈ క్రమంలో ఆమె భూ సంస్కరణల చట్టం చెయ్యడానికి శ్రీకారం చుట్టారు. 1972లో దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక బలమైన భూ సంస్కరణల చట్టం వచ్చింది. ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి 27 ఎకరాల తరి, 57 ఎకరాల ఖుశ్కి భూమి కంటే ఎక్కువ ఉండటానికి వీలు లేదని చట్టం తెచ్చింది ఆమెనే. ఆ చట్టాన్ని ఎమర్జెన్సీలో భూస్వాములపై ఒత్తిడి తెచ్చి కొంత అమలు చేశారు. నేను 1980లో ఈ చట్టం అమలుపై ఎంఫిల్ «థీసిస్ కోసం చాలా గ్రామాల్లో ల్యాండ్ రిఫామ్ ఎలా జరిగిందో పరిశీలించాను. భూస్వాములు భూములను బినామీ పేర్లమీద మార్చి చాలావరకు కాపాడుకున్నప్పటికీ ఎమర్జెన్సీలో కొంత భూమి పంచబడింది. ఆ కాలంలో తన పదవి కాపాడుకోవడం కోసం ప్రతిపక్ష నాయకులను ఇందిర అరెస్టు చేశారు. మీడియా మీద ఆంక్షలు విధించారు. నిజమే. అందుకే ఎమర్జెన్సీ ఎత్తివేయగానే దేశంలో ఒక పౌరహక్కుల ఉద్యమం ముందుకొచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు దేశంలో పౌరహక్కులను కాపాడవలసిన అవసరముందని మాట్లాడాయి. ఆ ఒక్క దశలోనే బీజేపీ నాయకులు కూడా పౌరహక్కుల ఉద్యమాన్ని బలపర్చారు. తర్వాత వాళ్లు పౌరహక్కుల రక్షణ జోలికి పోలేదు. కనుక ఎమర్జెన్సీ అనేది రెండువైపుల పదునున్న కత్తిలా పని చేసింది. కానీ ఆరెస్సెస్, బీజేపీ ఈ రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని నిర్మించాలనుకున్న ఆలోచనలో శూద్రుల, దళితుల, ఆదివాసుల పక్షపాత ఆలోచనలు ఉండే అవకాశం ఏమాత్రం లేదు. వాళ్లు అనుకున్నట్టు నిజంగానే 400 సీట్లు వచ్చి ఉంటే వాళ్లు కొత్త కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీని స్థాపిస్తే దాంట్లో ఎటువంటి మేధావి వర్గం ఉండేవారు? ఆ రాజ్యాంగ పరిషత్ కుల అసమానతలను, అంటరానితనాన్ని, బీదరికాన్ని తొలగించే గట్టి ప్రతిపాదనలు చేసే అవకాశం ఉండేదా! నిజానికి బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దుపై చర్చ జరుగుతున్నప్పుడు ఆరెస్సెస్, బీజేపీ నాయకుల వాదనలు; రాజరిక వ్యవస్థ పట్ల జమీందారీ హక్కుల పట్ల వాళ్లు ఎంత అనుకూలంగా ఉన్నారో తిరిగి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు రాజ్యాంగంలోని ప్రియాంబుల్‌లో ఉన్న ‘సోషలిజం’ అనే పదాన్ని వాళ్లు తొలగించాలనుకునేది భారతీయ కష్ట జీవుల పక్షాన ఉండటానికా? పెట్టుబడిదారుల పక్షాన ఉండటానికా?2024 ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. ఐతే ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం అప్పుడే పూర్తిగా తొలగిపోలేదు. చంద్రబాబు, నితీష్‌కుమార్ వంటి సిద్ధాంత రహిత ప్రాంతీయ నాయకులు కూడా ఈ భవిష్యత్ ప్రమాదం నుండి దేశాన్ని కాపాడలేరు. దేశం మొత్తంగా ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రక్షించుకునే చైతన్యం పెరగాలి. ఓటు రాజ్యాంగ రక్షణ ఆయుధాలలో కీలకమైంది. ఐతే దాన్ని ప్రజలు, ముఖ్యంగా యువకులు నిరంతరం ఇప్పుడున్న రాజ్యాంగంతో ముడేసి చూడాలి. ఈ ఎన్నికల్లో రాజ్యంగం పట్ల కలిగిన కొత్త చైతన్యాన్ని తగ్గించేందుకు ఆరెస్సెస్, బీజేపీలు ఎమర్జెన్సీ అంశాన్ని ముందు పెట్టి చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాయి. జూన్ 25న వి.పి. సింగ్ జయంతి సభ ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో జరిగింది. మాట్లాడటానికి నేను ముఖ్య అతిథిగా వెళ్ళాను. అందులోనే చాలా పెద్ద హాలులో రైట్‌వింగ్ ఆలోచనాపరులు ఎమర్జెన్సీలో జె.పి. మూమెంట్‌పై మీటింగ్ పెట్టారు. ఎందుకో తెలుసా? రాజ్యాంగ మార్పు కంటే ఎమర్జెన్సీ ప్రమాదకరమని చెప్పడానికి!ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఇంగ్లీషు మీడియం కొనసాగేనా?
మొత్తం దేశ చరిత్రనే మార్చే పథకం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీషు విద్య. ఆ విద్యా విధానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా, ఆపేస్తుందా అనేది ప్రశ్న. గత ఐదేండ్లుగా ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలో వచ్చిన మార్పులు గణనీయమైనవి. ఆ మార్పులను అనిష్టంగానైనా కొత్త ప్రభుత్వం కొనసాగిస్తే రానున్న ఐదేండ్లలో విద్యారంగంలోని మార్పులు పాతుకు పోతాయి. అలాకాకుండా మళ్ళీ పాత పద్ధతిలోకి విద్యావ్యవస్థను నెడితే ప్రజలు ఏం చెయ్యాలనేది చాలా కీలకమైంది. అందుకే స్కూళ్ళలో పిల్లల భవిష్యత్తును కొత్త ప్రభుత్వం వెనక్కి నెట్టకుండా చూడాల్సిన బాధ్యత వైసీపీ రాజకీయ శక్తులతో పాటు, పిల్లల తలిదండ్రుల మీద కూడా ఉంది.ఎన్నికల సమయంలో చండీగఢ్‌లో జరిగిన రాజ్యాంగ రక్షణ సదస్సుకు నేను వక్తగా వెళ్ళాను. అది ఆఖరి ఘట్టం ఎన్నికల ముందు. చివరి ఘట్టంలో పంజాబు రాష్ట్ర ఎన్నికలు జరిగాయి. ఆ సదస్సు మే 22న జరిగింది. మరుసటి రోజు అక్కడి మేధావులు పంజాబు గ్రామాల్లో నాకోసం సమావేశాలు ఏర్పాటు చేశారు. నేను మూడు గ్రామాల్లో జరిగిన మూడు మీటింగుల్లో పాల్గొని మాట్లాడాను. మీటింగులో ఆడా, మగా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పంజాబులో ప్రభుత్వ పాఠశాల విద్య పంజాబీ భాషలోనే బోధిస్తారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టు ఒక్క సబ్జెక్టు మాత్రం ఇంగ్లీషులో ఉంటుంది. అయితే అక్కడ కూడా ప్రైవేట్ స్కూళ్లు ఇంగ్లీషు మీడియంలో నడుస్తాయి. పంజాబీలు ఇతర దేశాలకు ఎక్కువ వలసపోతారు కనుక వారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఉండాలని డిమాండ్ చేస్తున్నారా అని నేను అడిగాను. వాళ్ళు లేదు అన్నారు. అప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీషు మీడియం గురించీ, అది గ్రామాల్లోని పిల్లల్లో తెస్తున్న మార్పుల గురించీ వివరించాను. ‘మా పిల్లలకు కచ్చితంగా అటువంటి ఇంగ్లీషు మీడియం విద్య కావాలి; వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల ముందు ఈ డిమాండ్ పెడతా’మని వాళ్లు తీర్మానించుకున్నారు. మొత్తం దేశ చరిత్రనే మార్చే పథకం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు విద్య. ఆ విద్యా విధానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా, ఆపేస్తుందా అనేది కీలకమైన ప్రశ్న. చంద్రబాబు నాయుడు క్యాబినేట్ ప్రమాణ స్వీకారం రోజు వేదిక మీద ఉన్నవారంతా గ్రామీణ పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియం చదువు నేర్చుకోవడాన్ని వ్యతిరేకించినవారే. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి శాసించే అమిత్ షా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం చదువుకు బద్ద వ్యతిరేకి. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు స్కూళ్ళను స్థాపించి ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసిన నారాయణ మళ్ళీ మంత్రి అయ్యారు. కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళు చంద్రబాబు ప్రైవేటీకరణలో భాగంగా ఎదిగాయి.ప్రభుత్వ రంగంలో ఇంగ్లీషు మీడియం విద్య ఒక సంక్షేమ పథకం కాదు. ప్రపంచంలోని అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో పాఠశాల విద్య ప్రభుత్వ రంగంలోనే ఉన్నది. కానీ, భారతదేశంలో ప్రైవేట్ పాఠశాల విద్య ప్రభుత్వ రంగ విద్యను సర్వనాశనం చేసింది. అటువంటి విద్యావిధానం నుండి గ్రామీణ విద్యార్థులను కాపాడే విద్యావిధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసి మళ్ళీ పాత పద్ధతిలోకి విద్యావ్యవస్థను నెడితే ప్రజలు ఏం చెయ్యాలనేది చాలా కీలకమైంది. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం, 2024–25 ఎకడమిక్ సంవత్సర స్కూళ్ల ప్రారంభం ఏకకాలంలో జరిగాయి. అయితే ఈ సంవత్సరానికి కావలసిన బైలింగ్వల్ బుక్స్(ఉభయ భాషా పుస్తకాలు), పిల్లలకిచ్చే డ్రెస్సులు, బూట్లు ఈ ప్రభుత్వం సకాలంలో ఇస్తుందా అనేది ప్రశ్న. గత ఐదేండ్లుగా ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలో వచ్చిన మార్పులు గణనీయమైనవి. ఆ మార్పులను అనిష్టంగానైనా కొత్త ప్రభుత్వం కొనసాగిస్తే రానున్న ఐదేండ్లలో విద్యారంగంలోని మార్పులు పాతుకుపోతాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలో బీదవారు, అగ్రకులాలలో బీదవారి పిల్లలకు 2029 ఎన్నికల నాటికి ఈ విద్యావ్యవస్థ తమకు ఎటువంటి భవిష్యత్తును ఇవ్వనుందో అర్థమయ్యే దశ వస్తుంది. కానీ ఇప్పుడు స్కూళ్ళలో పిల్లల భవిష్యత్తును కొత్త ప్రభుత్వం వెనక్కి నెట్టకుండా చూడాల్సిన బాధ్యత అటు వైసీపీ రాజకీయ శక్తులతో పాటు, ఇటు పిల్లల తలిదండ్రుల మీద ఉంది. ఇప్పటి నుండి గ్రామాల్లో పిల్లల తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియం విద్యా పరిరక్షణ కమిటీలు వేసుకోవలసిన అవసరం ఉంది. గ్రామాల్లో ప్రజలు తమ రాజకీయ అభిప్రాయాలను అధిగమించి విద్యారంగ పరిరక్షణ కోసం కమిటీలు వేసుకుని గ్రామంలోని పిల్లలందరి భవిష్యత్ కాపాడవలసిన బాధ్యత ఉంది. గ్రామాల్లో కూడా ధనవంతులున్నారు. వారి పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళలో విపరీతంగా డబ్బులు ఖర్చుపెట్టి చదివించగలిగేవారూ ఉన్నారు. ఇటువంటివారు, ఉద్యోగులు, పట్టణాల్లోని ధనవంతులు... బీద బక్క పిల్లలందరికి ఇంగ్లీషు వస్తే తమ పిల్లలు వారితో పోటీ పడాల్సి వస్తుందని భావించి ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకించే అవకాశం ఉంది.జగన్ ప్రభుత్వాన్ని ఉద్యోగస్థులు, కొంత మంది ఉపాధ్యాయులతో పాటు ఇతర ధనవంతులు వ్యతిరేకించడంలో తమ పిల్లల భవిష్యత్ స్వార్థం పనిచేసింది. ఈ స్వార్థం కులాలకు అతీతంగా ఉంటుంది. ప్రతి రిజర్వేషన్ కేటగిరిలో డబ్బున్నవారు తమ పిల్లలను ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో చదివించి, ప్రభుత్వ తెలుగు మీడియం పిల్లలు తమ పిల్లలతో పోటీ పడకుండా ఉండాలనే స్వార్థం ఓటు వేసే దగ్గర కూడా పనిచేస్తుంది. ఈ స్వార్థపు వేళ్లను తెంపడం చాలా కష్టం. మార్పు తెచ్చే ప్రభుత్వాలను దింపెయ్యాలనే ఈ ధనిక వర్గం ఓటు వ్యవస్థను తమకు అనుకూలంగా తిప్పుకుంటుంది. ప్రపంచీకరణ యుగంలో వర్గం, హోదా, ఆధిక్యత... నాణ్యమైన ఇంగ్లీష్ విద్యతో ముడిపడి ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నిర్మాణాల్లో కూడా ఈ విధంగా ఆలోచించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మార్పు తమ వర్గ శత్రువు అనుకునే శక్తులు వీరు. వీరు గ్రామాల్లో ఉన్నారు, పట్టణాల్లో ఉన్నారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా స్కూలు విద్య ఎన్నికల్లో చర్చనీయాంశం కాలేదు. ఈసారి ఆంధ్ర ఎన్నికల్లో అది చర్చనీయాంశం అయింది. బహిరంగ సభల్లో సైతం స్కూలు పిల్లలు ఇంగ్లీషు, తెలుగులో వాగ్దాటితో మాట్లాడటం, అదీ బీద కుటుంబం నుంచి వచ్చిన వారు మాట్లాడటం ఆ యా గ్రామాల్లో, పట్టణాల్లో ధనవంతులు జీర్ణించుకోలేని విషయం. మార్పును అంగీకరించదల్చుకోని విషయం. ఇది వైసీపీ ఓటమికి కొంత దోహదపడి ఉండవచ్చు. ఈ ధోరణిని తిప్పి కొట్టాలంటే ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లల తల్లిదండ్రుల తిరుగుబాటు మాత్రమే పనిచేస్తుంది. భారతదేశంలో విద్య మీద గ్రామీణ స్థాయిలో చర్యలు, పోరాటాలు జరగలేదు. కమ్యూనిస్టులు కూడా ఇటువంటి పోరాటాన్ని జరపలేదు. ఈసారి ఆంధ్ర ఎన్నికల్లో కొత్త విద్యావిధానాన్ని ఓడించడానికి కమ్యూనిస్టులు కూడా సహకరించారు. ఆ విధంగా వీరు బీజేపీ భావజాలానికి మద్దతిచ్చారు. అందుకే రానున్న ఐదేండ్లలో సమాన భాష, పురోగామి భావజాల పాఠశాల విద్య కోసం బలమైన పోరాటం జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈ పోరాటానికి నేతృత్వం వహించాల్సి ఉంది.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఎన్నికల నైతికత నెలకొనేనా?
ఎన్నికల రంగంలో సాధారణంగా జరగాల్సిన నైతిక ప్రచారం... తమ పార్టీ గెలిస్తే ఏం చెయ్యబోతోందో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం. జగన్ తన పార్టీ బహిరంగ సభల్లో తను గత ఐదేండ్లు చేసిన పనులు, గెలిస్తే చెయ్యబోయే పనులు చెబుతూ తిరిగారు. అనైతిక భాషను ఎవరి మీదా వాడటం కనిపించలేదు. కానీ చంద్రబాబు గానీ, ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో మీటింగుల్లో పాల్గొన్న మోదీ గానీ ఆ నైతికతను పాటించలేదు. ఎదుటి నాయకుడిని నిందించే నైతికతను మాత్రమే పాటించారు. ఎన్నికల కమిషన్‌కు కూడా ఎన్నికల్లో ఏ చర్చ నీతివంతమైనది, ఏది కాదు అనే అంశంపై స్పష్టత లేదు. ఎన్నికల మొరాలిటీ, ప్రచారంలో వాడాల్సిన భాష మొదలగు అంశాలపై ఇంకా చాలా చర్చ జరగాల్సి ఉంది.ప్రపంచంలో ఓటు ద్వారా ప్రజలు తమ పాలకులను ఎన్నుకోవడం మొదలైన దగ్గరి నుండి సమాజ నైతిక జీవనంలో గణనీయంగా మార్పు వచ్చింది. అంతకుముందు గుంపు నైతికతను మతం బోధించే ప్రయత్నం చేసింది. కానీ ఆ నైతికతకు జవాబుదారీతనం అనేది ఏమీ లేదు. రాజ్యవ్యవస్థలో రాజులు, నియంతలు ప్రజలకు జవాబుదారీగా లేరు. కండబలం– అంటే నిర్మిత సైన్యబలం, ప్రజల మధ్య కల్పించిన భయ వాతావరణం రాజ్యాలను నడిపించాయి. భారతదేశంలో మతం–కులం ఒకదానికొకటి అండగా ఉండటం వల్ల, మత వ్యవస్థ ఎన్నడూ ఇక్కడ సోషల్ మొరాలిటీ(సామాజిక నైతికత)ని ప్రజల మధ్య ప్రచారం చెయ్యలేదు. కులాధిపత్యాన్ని, మతాధిపత్యాన్ని తద్వారా కుల మొరాలిటీని ప్రజలమధ్య ప్రచారం చేసి, ఉత్పత్తి శక్తులకు విద్య, మానవ సమానత్వం అందకుండా చాలా జాగ్రత్తగా నీతి రహిత సమాజ నిర్మాణాన్ని దైవ సృష్టి నిర్మాణంగా కొనసాగించారు. ఈ విధమైన నీతి రహిత సమాజ జీవనాన్ని ఎలక్షన్ మొరాలిటీ (ఎన్నికల నైతికత) ద్వారా మార్చవచ్చు అని అంబేడ్కర్ భావించారు. ఆ మార్పునకు మూలం రాజ్యాంగం.అయితే భారతదేశంలో 1952 నుండి చాలాకాలం కాంగ్రెస్, కమ్యూనిస్టు– సోషలిస్టుల మధ్య ఎన్నికల పోరాటం జరిగింది. కాంగ్రెస్ దేశంలో చాలా సులభంగా ఎన్నికల్లో గెలవడం వల్ల, కమ్యూనిస్టులు అసలు రాజ్యాంగం మీదనే నమ్మకం లేని ఎన్నికల పోరాటంలో ఉన్నందువల్ల ఎన్నికల మొరాలిటీపై అసలు చర్చ జరగలేదు. ఈ దశ అంతా కూడా ఉత్పత్తి కులాల్లో బాగా చదువుకున్న యువకులు ఎక్కువగా లేనందున ఎన్నికల మొరాలిటీపై పత్రికల్లో కూడా చర్చ జరగలేదు. కమ్యూనిస్టులలో సిద్ధాంత పట్టు ఉన్నప్పటికీ, శ్రమ జీవుల పట్ల ప్రేమ ఉన్నప్పటికీ ఎన్నికల ద్వారా రాజకీయ నైతికతనీ, సామాజిక నైతికతనీ సమాజంలో పెంచవచ్చని వారు భావించలేదు. కాంగ్రెస్‌కు ప్రతిపక్షంగా ఆర్ఎస్ఎస్ పునాదిగా ఎదుగుతూ వచ్చిన జనసంఘ్/బీజేపీ ఎన్నికల వ్యవస్థను మతాధిపత్య రాజకీయంతో ముడెయ్యడం వల్ల దేశంలో కాంగ్రెస్, బీజేపీ నాయకత్వాల మధ్య ఎన్నికల మొరాలిటీపై చర్చ జరగలేదు. ఈ క్రమంలో విభిన్న రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. జాతీయ స్థాయి ఎన్నికల మొరాలిటీపై చర్చ చేసే అవకాశం వాటికి అంతగా లేదు. కానీ రాష్ట్రాల స్థాయిలో ఉత్పత్తి కులాల నుండి వచ్చిన ప్రాంతీయ పార్టీల నాయకులు ఎదిగాక, ఎన్నికల నైతికతపై కొంత చర్చ మొదలుపెట్టారు. అయితే ఈ ఎన్నికల మొరాలిటీ, ప్రచారంలో వాడాల్సిన భాష మొదలగు అంశాలపై ఇంకా చాలా చర్చ జరగాల్సి ఉంది. ఎన్నికల కమిషన్‌కు కూడా ఎన్నికల్లో ఏ చర్చ నీతివంతమైనది, ఏది కాదు అనే అంశంపై స్పష్టత లేదు. 2024 ఎన్నికల్లో నాయకులు ప్రచార సభలలో వాడిన భాషను ఒక్కసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు ఒక బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి వాడిన ‘నీ అమ్మ మొగుడు చేశాడా’ లాంటి భాష ఏ ప్రజాస్వామ్య దేశంలో ఉపయోగించినా ఆయన్ని ఎన్నికల నుండి బహిష్కరించడమే కాక, తీవ్రమైన శిక్ష విధించే విలువలు ఉంటాయి. పాకిస్తాన్ వంటి అస్థిరమైన ప్రజాస్వామ్యంలో కూడా ఇటువంటి భాషను బహిరంగంగా వాడటాన్ని ప్రజల విలువలు ఒప్పుకోవు. కానీ ఇండియాలో ఇటువంటి భాష, దీని అనుసంధాన ప్రవర్తన ఎన్నికల రంగంలో మామూలుగా కనిపిస్తుంది. జగన్ ఇటువంటి భాషను బహిరంగ సభల్లో ఎవరి మీదా వాడటం కనిపించలేదు. అదే చంద్రబాబు ‘సైకో, సైకో’ అంటూ జగన్‌ను తిట్టగా చూశాం. ఎన్నికల రంగంలో సాధారణంగా జరగాల్సిన నైతిక ప్రచారం... తమ పార్టీ గెలిస్తే ఏం చెయ్యబోతోందో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం. దీన్నే మనం మ్యానిఫెస్టో అంటాం. జగన్ తన పార్టీ బహిరంగ సభల్లో తను గత ఐదేండ్లు చేసిన పనులు, గెలిస్తే చెయ్యబోయే పనులు చెప్పుతూ తిరిగారు. కానీ చంద్రబాబు గానీ, ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో మీటింగుల్లో పాల్గొన్న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గానీ ఆ నైతికతను పాటించలేదు. ఎదుటి నాయకుడిని నిందించే నైతికతను మాత్రమే పాటించారు. ప్రధానమంత్రిగా మోదీ దేశ స్థాయిలో కూడా తన మ్యానిఫెస్టో గురించి గానీ, తను గత పదేండ్లుగా చేసిన పనుల గురించి గానీ చెప్పలేదు. రాహుల్ గాంధీ మీద ‘శహజాదా’ (యువరాజు) అనే పదజాలంతో నిరంతరం దాడి చేశారు. అంతకంటే ఘోరంగా ముస్లింలను ఉద్దేశించి ‘ఎక్కువమంది పిల్లల్ని కనేవాళ్ళు’ అనే పదజాలంతో దాడి చేయడం ఎన్నికల నైతికతకు పూర్తిగా భిన్నమైంది. ఈ దేశంలో ముస్లిమేతురులు, ముఖ్యంగా బీదవారు కూడా చాలామంది పిల్లల్ని కంటారు. ఆయనే స్వయంగా తన తల్లిదండ్రులకు ఆరుగురిలో ఒకరు. ఈ రచయిత తన తల్లిదండ్రులకు ఎనిమిది మంది పిల్లల్లో ఒకడు. ఈ భాష మతం ఎన్నుకొని పుట్టని పిల్లలపై దాడి చేస్తుంది. ఒక దేశ ప్రధానమంత్రి ఇలాంటి భాష వాడినప్పుడు అలా ఎక్కువ సంతానం ఉన్న అన్ని కుటుంబాల్లో, ముఖ్యంగా చిన్న పిల్లల్లో సైతం భయాందోళన మొదలవుతుంది. ఇది అటువంటి పిల్లలను జీవితాంతం భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఎన్నికల నైతికతలో పిల్లల్ని, అమాయకుల్ని భయభ్రాంతుల్ని చేసే భాష అసలుండకూడదు. కానీ దేశ ప్రధానమంత్రే బహిరంగ సభల్లో ఇలా మాట్లాడితే, ఆ భాషకు ఎన్నికల కమిషన్ నుండి కూడా చెక్ లేకపోతే దేశంలో ఎన్నికల వ్యవస్థ కొనసాగడం కష్టం. క్రమంగా ఈ దేశ రాజ్యాంగానికీ, ప్రజాస్వామ్యానికీ ప్రమాదం ఇటువంటి ధోరణుల నుండే వస్తుంది. ఈ ఎన్నికల్లో రాజ్యాంగానికీ, రిజర్వేషన్లకూ ప్రమాదమున్నదనే ప్రచారాన్ని కాంగ్రెస్ పెద్ద ఎత్తున చేసింది. రాహుల్ గాంధీ ప్రతి బహిరంగ సభలో రాజ్యాంగాన్ని చూపిస్తూ బీజేపీ తిరిగి గెలిస్తే ప్రమాదముందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అందుకు విరుగుడు రిజర్వేషన్లను కాపాడటం, పెంచడంలో ఉందని మొదటిసారి కాంగ్రెస్ ప్రచారం చేసింది. నిజంగానే ఆర్ఎస్ఎస్–బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని క్రమంగా రద్దు చేసే అవకాశముందా? ఈ రాజ్యాంగాన్ని 1950లో ఆమోదించినప్పుడు ఆర్ఎస్ఎస్ ఒక పక్క, ఆనాటి కమ్యూనిస్టులు మరో పక్క వ్యతిరేకించారు. ఈ రాజ్యాంగం భారతీయ సంస్కృతిని (అంటే బ్రాహ్మణీయ సంస్కృతిని) ప్రతిబింబించదనీ, అది పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబిస్తుందనీ ఆర్ఎస్ఎస్ స్పష్టంగా చెప్పింది. కమ్యూనిస్టులేమో శ్రామికవర్గ నియంతృత్వ రాజ్యాంగం కావాలి, ఇటువంటి బూర్జువా రాజ్యాంగం వద్దని ప్రకటించారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్– బీజేపీ బయటకు చెప్పేది వారి అసలైన అభిప్రాయం కాదు. 400 పైన స్థానాల్లో గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని కొంతమంది ఎన్నికలకు ముందు ప్రకటించారు. ఈ రాజ్యాగ రక్షణకు మోదీ గ్యారెంటీ లాంటి వ్యక్తిగత ప్రకటనలు పనికిరావు. వంద సంవత్సరాల నుండి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏం చెబుతోంది అనేది లోతుగా చూడాలి. ఈ మధ్యకాలంలో సనాతన ధర్మాన్ని కాపాడాలని ఆర్ఎస్ఎస్, బీజేపీల్లోని పై కులస్థులతోపాటు ఓబీసీ అయిన మోదీ కూడా చాలాసార్లు మాట్లాడారు. సనాతన ధర్మం అంటే ఇప్పుడు అందరూ అనుకునే హిందూయిజం కాదు. సనాతన ధర్మం ప్రధానంగా వర్ణ ధర్మం (కుల వ్యవస్థ) కలిగివుంది. ఆర్ఎస్ఎస్, బీజేపీల్లోని బీసీ, ఎస్సీలు... మళ్లీ వర్ణ ధర్మం పాత పద్ధతిలో నెలకొల్పాలంటే ఈ రాజ్యాంగాన్ని రద్దు చెయ్యకుండా సనాతన ధర్మాన్ని తిరిగి స్థాపించడం సాధ్యం కాదు అని అర్థం చేసుకోవాలి. ఆ నిర్మాణాల్లో ఉన్న శూద్రులు, బీసీలు, ఎస్సీలు, ఆదివాసులు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం లోతు చూడకపోతే తాము మునిగి దేశాన్ని కూడా ముంచే అవకాశముంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
పేదల అక్షరంపై కక్ష
నిరుపేదల చదువుపై ఇంకా పెత్తందార్ల కక్ష తీరడం లేదు. జగన్ ప్రభుత్వంలో వారికి ఉచితంగా ఇంగ్లిష్ మీడియం చదువు చెప్పిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ ఏపీ విధానాలపై ప్రశంసలు కురిపిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు సైతం ఇక్కడి విద్యా విధానంలో తెచ్చిన సంస్కరణలను వేనోళ్ల పొగుడుతుంటే వీరికి గిట్టడం లేదు.ఉన్న పళంగా వారికి మాతృభాషపై ప్రేమ పుట్టుకొచ్చేసింది. దానిని జగన్ తొక్కేస్తున్నారంటూ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏదోలా జగన్‌ను ఇరుకున పెట్టాలని వారు లేనిపోని కుట్రలు చేస్తున్నారు. బీజేపీ అగ్రనేత అమిత్ షా సైతం ఇక్కడి పచ్చనేతల స్క్రిప్టునే వల్లె వేస్తూ నిరుపేదల చదువుపై కుట్రకు పన్నాగం పన్నుతున్నారు. –సాక్షి, అమరావతి బడుగులు ఎదుగుతున్నారనే బాబు భయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన విద్యా సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తుండటంతో బడుగులు ప్రపంచ మానవులుగా ఎదుగుతుండటంతో చంద్రబాబుకు భయం పట్టుకుంది. అందుకే కేంద్ర ప్రభుత్వానికి చెందిన పెద్దలు రాష్ట్రానికి వచ్చినప్పుడు మన రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీలు అడగడం మానేసి ఇంగ్లిష్‌పై విషం నూరిపోశారు.చంద్రబాబు మొదట్నుంచి కులవాది, తన కుల ఆధిపత్యం కోరుకునే వ్యక్తి. అందుకే తన సామాజికవర్గం వారే ఇంగ్లిష్ చదువులతో విదేశాలకు వెళ్లాలని కోరుకుంటున్నారు. పేద పిల్లలు మాత్రం ఇక్కడే అరకొర వేతనాలతో ఉండిపోవాలన్నది ఆయన దురుద్దేశం. విభజనాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా ఆయన ఐదేళ్లపాటు నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించి, వారి ఆర్థిక సహకారంతో రాజకీయం నడిపారు. పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. విద్యా వ్యవస్థను కులతత్వ పూరితంగా మార్చేశారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇంగ్లిష్ చదువులను దూరం చేసే కుట్ర చేశారు. సీఎం వైఎస్ జగన్ మాత్రం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. దేశంలోనే తొలిసారిగా బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు అందించారు. ఇంగ్లిష్ మీడియంను ప్రోత్సహించారు. ఖరీదైన బైజూస్ కంటెంట్‌ను ఉచితంగా అందించారు. ట్యాబ్‌లు ఇచ్చారు. విశ్వవిజ్ఞానాన్ని అందుకునేలా పేద పిల్లలను తీర్చిదిద్దారు. దీనిపై పెత్తందార్లు కుయుక్తులు పన్నడం సరికాదు. ఇంగ్లిష్ మీడియం పెత్తందారులకే పరిమితమా? పేదలకు ఇంగ్లిష్ వస్తే ఎదుగుతారని భయమా..తెలుగు కోసం కాదు విద్యా వెలుగు అడ్డుకోవాలనే.. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కి దీటుగా జగన్ అభివృద్ధి చేస్తున్నారు. డిజిటల్ విద్యా బోధన కూడా అందుబాటులోకి తెచ్చారు. అదే క్రమంలో నిరుపేద విద్యార్థులు కెరీర్లో ఉన్నత స్థాయికి వెళ్లేందుకు వీలుగా ఇంగ్లిష్ మీడియం కూడా తీసుకువచ్చారు. వాటి ఫలితాలు కూడా ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఇది ఇంకా పెరిగి దేశం మొత్తం అనుసరిస్తే విద్యా వ్యాపారానికి నూకలు చెల్లుతాయనే కేంద్రంలోని పెద్దల భయం. అయినా ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్ ఇతర ప్రభుత్వ ఉన్నతోద్యోగులు ఏ భాషలో చదివారు? తెలుగు మీడియంలో చదువుకున్నవారిలో అత్యధికులు నిరుద్యోగులుగా, లేదా చిరుద్యోగులుగా ఎందుకు మిగిలారు? అమిత్ షా పిల్లలు ఎక్కడ చదివారు? మన రాష్ట్రంలో తెలుగు భాషకు కంకణం కట్టుకున్నామని చెబుతున్న భాజాపా నేత వెంకయ్యనాయుడు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు... వాళ్ల పిల్లలు, మనవళ్లను ఏ మీడియంలో చదివించారు? అదే చదువు బడుగు బలహీన వర్గాల వారికి వద్దని ఎలా చెబుతారు? అయినా ఇక్కడ తెలుగు భాషనేమీ తీసేయడం లేదు కదా. ఇంగ్లిష్ మీడియం అదనంగా తెచ్చారు. అందరూ విద్యావంతులైతే హెచ్చుతగ్గులుండవన్నది అంబేడ్కర్ మాట. అందుకు తగ్గట్టుగా ఏపీలో అడుగులు పడుతున్నాయి. ఇది చూసి తమ ఆధిపత్యం ఎక్కడపోతుందోనని కొందరు భయపడుతూ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. – జస్టిస్ ఈశ్వరయ్య అమిత్ షా ఇంట పిల్లలు ఏ మీడియం చదువుతున్నారు అమిత్‌షా పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలి. డబ్బున్నవారంతా తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్నారు. కూటమిలో ఉన్న నాయకుల మాట విని తెలుగు భాష గురించి అమిత్‌షా మాట్లాడటం బాధగా ఉంది. చంద్రబాబు కొడుకు ఎక్కడ చదివాడు? ఏం మీడియంలో చదివాడు? పేద ప్రజల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదివితే తప్పేంటి? విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిన నాయకుడు సీఎం జగన్. ఓటుకి ఇంగ్లిష్ మీడియానికి ముడిపెట్టడం సరికాదు. ఇంగ్లిష్ మీడియం తీసుకు రాను అని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా? – యార్లగడ్డ వెంకటరమణ, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కో–ఆర్డినేటర్ అమిత్ షా,చంద్రబాబు పిల్లలు మాతృభాషలోనే చదివారా? మాతృభాషకు మద్దతు సాకుతో జరుగుతున్న ప్రచారం వెనుక పేదల చదువులను దెబ్బతీసే కుట్ర దాగి ఉంది. మాతృభాషను చంపేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్న అమిత్ షా, చంద్రబాబు, రామోజీరావు వంటి పెద్దల వారసులు, మనుమలు మాతృభాషలోనే చదివారా? మాతృభాషపై ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తున్న వారి పిల్లలు మాత్రం ఇంగ్లిష్‌లో చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు చెందిన పేదోళ్లు మాత్రం మాతృభాషను బతికించాలనే నిబంధనతో ప్యూన్లు, క్లర్కులు, గుమాస్తాలు, కూలీలుగా మిగిలిపోవాలా? ఇదెక్కడి ఆటవిక న్యాయం. పేద పిల్లలు ఇంగ్లిష్ చదువులు చదవకూడదా? పెత్తందార్లకు మాత్రమే ఇంగ్లిష్ చదువులు రాసిపెట్టారా? ఏ బిడ్డ అయినా పుట్టినప్పటి నుంచి మాతృభాషలోనే అక్షరాభ్యాసం చేస్తారు కదా. అలాంటి మాతృభాషను ఎవరో చంపేస్తే చచ్చిపోతుందా? చంద్రబాబు చెబితే మాత్రం అమిత్ షాకు అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పేద బిడ్డలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీఎం జగన్ ఇంగ్లిష్‌కు అధిక ప్రాధాన్యమిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ఆయన కృషివల్లే ఈ రోజు మన పేద బిడ్డలు అమెరికాలోని శ్వేతసౌధం, ఐక్యరాజ్యసమితి, వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్, కొలంబియా యూనివర్సిటీ వంటి అంతర్జాతీయ వేదికలపై ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడి సత్తా చూపారు. ఇక్కడి తల్లిదండ్రులు కూడా ఇంగ్లిష్ మీడియంనే కోరుకుంటున్నారు. ఎన్నికల వేళ దీనిపై రాజకీయం తగదు. –ఆర్.కృష్ణయ్య, రాజ్యసభ సభ్యుడుబాబోస్తే ఇంగ్లిష్ మీడియం తీసేయడం తథ్యం భవిష్యత్తులో చంద్రబాబు తీసుకోబోయే చర్యలకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. మోదీ, అమిత్ షాల మాటను బాబు తూచా తప్పరు కాబట్టి.. టీడీపీ అధికారంలోకి వస్తే ఇంగ్లిష్ మీడియం తీసేయడం తథ్యం. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే పిల్లలకు మంచి స్కూళ్లు, మౌలిక సదుపాయాలు, భోజన వసతి, బైలింగ్వల్ బుక్స్ అందుబాటులోకి తెచ్చారు. దీని వల్ల రానున్న రోజుల్లో పెట్టుబడి దారుల పిల్లలకు పోటీపడే స్థాయిలో పేద వర్గాల పిల్లలు ఎదుగుతారు. ప్రాంతీయ భాషలోనే చదువు అంటున్న అమిత్ షా కొడుకు జయ్ షా పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని చిన్న వయసులోనే నేషనల్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ అయ్యాడు.మరి తన కొడుకుని అమిత్ షా గుజరాతీలో ఎందుకు చదివించలేదు? అంబానీకి ధీరూబాయ్ అంబానీ పేరుతో ముంబయిలో పెద్ద ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ ఉంది. అక్కడ గుజరాతీ, మరాఠీ సబ్జెక్టే లేదు. మరి వాటిని మరాఠీ లోకో, గుజరాతీ భాషలోకో అమిత్ షా ఎందుకు మార్పించలేదు? గుజరాత్‌లోనే అదానీ స్కూల్ ఉంది అది కూడా పూర్తిగా ఇంగ్లిష్ మీడియం స్కూల్. బిర్లా కూడా ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు నడుపుతున్నారు.మరి వీటన్నింటినీ కేంద్రంలోని పెద్దలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్లంతా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా చందాలు ఇస్తున్నారనా? గ్రామీణులు, వ్యవసాయదారుల పిల్లలు అంబానీ అదానీ పిల్లలతో సమానమైపోతారేమోననే భయంతోనే ఇంగ్లిష్ వద్దంటున్నారా? ఏ మీడియంలో చదివితే పిల్లలు బాగా రాణించగలరో అదే మీడియంలో చదివించాలి కదా. తాజాగా వచ్చిన పదోతరగతి ఫలితాల్లో కూడా ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నవారు 91శాతం పాసైతే తెలుగు మీడియంలో చదువుకున్నవారు 81 శాతమే పాసయ్యారు.అంటే దీనర్థం ఏమిటి? ఇంగ్లిష్‌లో పిల్లలు మరింత సులభంగా చదువుకోగలుగుతున్నారనే కదా. ఇంగ్లిష్ మీడియంలో చదివినంత మాత్రాన తెలుగు రాకుండా ఎలా పోతుంది? పల్లెల్లో వ్యవసాయ కూలీలు, చెప్పులు కుట్టేవారు, కుండలు చేసుకునేవారికి ఇంగ్లిష్ చదువులు వస్తే తమ పిల్లలతో పోటీ పడతారని వీరి భయం. కూటమి అధికారంలోకి వస్తే విద్యావ్యవస్థను కుక్కలు చింపిన విస్తరి చేద్దామని చూస్తున్నారు. జగన్ ప్రభుత్వం, ఆయన చేపట్టిన విద్యా సంస్కరణలు ఇలాగే కొనసాగితే మరో పదేళ్లలో నిరుపేదలు ఆదివాసీలు, దళితులు దేశం గుర్తించే విజయాలు సాధిస్తారు. –కంచ ఐలయ్య, విద్యావేత్త ఎన్డీఏ ప్రభుత్వంలోనే తెలుగు భాష నిర్వీర్యంరాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే తెలుగు భాషను భ్రష్టు పట్టించారు. అయినా ధర్మవరం సభలో అమిత్‌షా తెలుగును పరిరక్షిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ‘క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు రాసిచ్చిన అబద్ధాలను అమిత్‌షా వల్లెవేయడం సిగ్గుచేటు. చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేయకుండా, తెలుగు భాష ప్రోత్సాహానికి ఎలాంటి చర్యలు చేపట్టకుండా భాషా స్ఫూర్తిని నిర్వీర్యం చేశారు.ఐదేళ్లపాటు అధికారంలో ఉండి కనీసం భాషా సంఘాన్ని పెట్టలేని చంద్రబాబు తెలుగు భాషను పరిరక్షిస్తామని చెప్పడం హాస్యాస్పదం. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార భాషా సంఘాన్ని పూర్తిస్థాయిలో నియమించి తెలుగు వికాసానికి బాటలువేశారు. ఎన్నడూ లేనివిధంగా గిడుగు రామ్మూర్తి జయంతి ఉత్సవాలను వారంరోజులపాటు ఘనంగా నిర్వహిస్తున్నాం. వేమన శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇంగ్లిష్ మీడియం విద్యార్థులతో వేమన పద్యాలను చదివించి ఉభయ భాషా ప్రావీణ్యాన్ని ప్రోత్సహించారు.అల్లూరి సీతారామరాజు శత జయంతి, జాషువా వంటి మహోన్నత కవుల జయంతులను అధికారికంగా నిర్వహిస్తూ తెలుగు ఖ్యాతిని వెలుగెత్తి చాటారు. అందువల్లే ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే స్థాయికి తెలుగు విద్యార్థులు ఎదిగారు. తెలుగుభాషా పరిరక్షణ కంటే ముందుగా లోకేశ్‌కు మంచి తెలుగు నేర్పించాలి..’ అని విజయబాబు అన్నారు. –విజయబాబు, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు -
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
ఏపీలో ప్రైవేటీకరణ అభిమాని చంద్రబాబు జాతీయ ప్రైవేటీకరణ అభిమాని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అన్ని ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటు ఏకస్వామ్య కంపెనీలకు అప్పజెప్పాలన్నది వారి ఆలోచన. ఇక్కడ రిజర్వేషన్లు అమలు కావు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ కూటమికి ఓటు వేయడమంటే, ప్రైవేటీకరణకు ఓటు వేయడమే. కానీ నిరుపేదలకు ప్రభుత్వ విద్య, ప్రభుత్వ ఉద్యోగ అవకాశం మొదటి తరంలో చాలా ముఖ్యం. మన దేశ భవిష్య త్తుకు పునాది స్కూలు విద్యను పూర్తిగా ప్రభుత్వ రంగంలోకి తెచ్చి, ప్రైవేట్ స్కూలు విద్యను రద్దు చెయ్యడంలో ఉంది. ఉద్యోగస్థులు మొత్తం సమాజ భవిష్యత్ గురించి ఆలోచించకుండా ప్రైవేటీకరణకు, మత తత్వానికి ఓటు వేస్తే ప్రజాస్వామ్యం కాదుకదా, మానవీయ విలువలు కూడా బతకవు.ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటీకరణ అభిమాని చంద్రబాబు నాయుడు జాతీయ ప్రైవేటీకరణ అభిమాని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. దేశంలోని మొత్తం కేంద్ర ప్రభుత్వ కంపెనీలను, అతి పెద్దదైన రైల్వేతో సహా ప్రైవేట్ ‘మోనోపలి’ (ఏకస్వామ్య) కంపెనీలకు అప్పజెప్పి ప్రభుత్వం కేవలం సూపర్వైజ్ చెయ్యాలనేది ఆరెస్సెస్/బీజేపీ సిద్ధాంతం. దేశంలో రిజర్వేషన్ వ్యవస్థను కూడా క్రమంగా రద్దు చెయ్యాలన్నది వారి సిద్ధాంతం. నరేంద్ర మోదీ ఓబీసీ పేరుతో ప్రధానమంత్రి అయ్యారు కనుక గత పదేండ్ల పాలనలో వాళ్ళు రిజర్వేషన్ పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ రిజర్వేషన్ వ్యతిరేక విధానం రిజర్వేషన్ ద్వారా కాక జనరల్ కోటాలో ఉద్యోగాలు తెచ్చుకున్న వారికి నచ్చ వచ్చు కూడా. కానీ విద్యా అసమాన వ్యవస్థ ఉండగా రిజర్వేషన్లు ఎత్తేస్తే దేశంలో అంతర్యుద్ధం జరుగుతుందని చాలామందికి అర్థం కాని విషయం. దేశంలోని ఉత్పత్తి కులాలు రిజర్వేషన్లు రద్దు చెయ్య డాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాయి.బీజేపీతో పొత్తుతో చంద్రబాబు అధికారంలోకి వస్తే మొట్ట మొదట ప్రైవేట్ స్టీల్ కంపెనీకి అప్పజెప్పే అతిపెద్ద స్టీల్ కంపెనీ ‘విశాఖ ఉక్కు’. ఆ తరువాత బీజేపీ తెలంగాణలోని బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ వంటి అతిపెద్ద కంపెనీలను ప్రైవేట్ గుజరాతీ, ముంబై కంపెనీలకు అమ్మకానికి పెడుతుంది. బీజేపీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ చేతుల్లోని సంస్థల్లో దొడ్డిదారిన ఏ సెలక్షన్ కమిటీని ఫేస్ చెయ్యకుండా అధికారులను, యూనివర్సిటీ ప్రొఫెసర్లను సైతం నియమిస్తోంది.ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు బీజేపీకి ఓటు వేయడమంటే ప్రైవేటీకరణకు అనుకూలంగా ఓటు వేయడమే. చంద్ర బాబు 2014 నుండి 2019 వరకు చూపిన స్వతంత్రతను కూడా చూపలేడు. ఆయన పూర్తిగా బీజేపీ ఏమి చెబితే అది చెయ్యాల్సిందే. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఈ కూటమికి ఓటేస్తే ముందు ప్రైవేటీకరణ సమస్యను కొని తెచ్చుకుంటారు.బీజేపీ ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టారు ఎంప్లాయిమెంట్‌ను అమెరికా మోడల్లోకి మార్చాలనే ఆలోచనతో ఉన్నట్లు వాళ్ళ ఆర్థికవేత్తల రచనలు చదివితే స్పష్టంగా అర్థమౌతుంది. ఆంధ్రప్రదేష్ సుదీర్ఘ తీర ప్రాంతం గల రాష్ట్రం. విశాఖ పోర్టు మాత్రమే కాక క్రమంగా ఇతర సీ–పోర్టులను అక్కడ అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని కొత్త పోర్టుల నిర్మాణం జరుగుతోంది. అయితే బీజేపీ ప్రభుత్వం వాటి నిర్మాణం మాత్రమే కాక వాటి మేనేజ్మెంట్ మొత్తాన్ని ప్రైవేట్ సెక్టా రుకు అప్పజెప్పే ఆలోచనలో ఉన్నది. ఈ పని ఇప్పటికే ఎయిర్‌పోర్టుల విషయంలో చేశారు. దేశంలోని పెద్ద, పెద్ద ఎయిర్‌పోర్టులన్నిటినీ ప్రైవేటు మేనేజ్మెంట్కు – అదీ పెద్ద పెద్ద మోనోపలి కంపెనీలకు అప్పజెప్పారు. ఇక్కడి ఉద్యోగాలన్నీ ప్రైవేట్ కంపెనీల చేతిలోనే ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగాలన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలే. అక్కడ పెద్ద ఉద్యోగాలన్నీ పెద్ద కంపెనీల బంధువులకు మాత్రమే వస్తాయి. యూపీఎస్సీ పరీక్షల్లో పోటీపడి ఎవరైనా ఉద్యోగం తెచ్చుకునేది అక్కడ ఉండదు. కమ్మ, రెడ్డి కులాలకు కూడా పెద్ద ఉద్యోగాలు రావు.ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకొని తీరాన్నంతా అభివృద్ధి చేసుకుంటే అది ముంబైకి మించిన నగరమయ్యే అవకాశ ముంది. కోల్‌కతా కూలిపోతున్న నగరం. ఇటు చెన్నై దేశపు చివరి మూలన ఉంది. దానికి ఇంకా అభివృద్ధి అవకాశం తక్కువ. ఇంగ్లిష్ విద్యలో ఆదివాసులు, దళితులు, బీసీలు, ఇతర బీద పిల్లలు చదువు కుంటే వైజాగ్ నగరాన్ని అత్యాధునిక నగరంగా మార్చే అవకాశం వారికొస్తుంది. ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్ విద్య నాణ్యంగా కొన సాగితే అడవుల్లోని ఆదివాసులు పక్షులుగా ఎదిగి విమానాలుగా మారుతారు. వారికి ఎంత పోడు భూమి ఇచ్చినా, ఎంత పంట సహాయం చేసినా ఒక్క తరంలో అడవి నుండి విశాఖ నగరంలోకి, అక్కడి నుండి అమెరికాకో, ఆస్ట్రేలియాకో పోలేరు. అయితే ఈ ఆదివాసులకు ప్రభుత్వ విద్య, ప్రభుత్వ ఉద్యోగ అవకాశం మొదటి తరంలో చాలా ముఖ్యం. ప్రైవేట్ సెక్టారు వీరికి అవకాశాలివ్వదు. వారిని ఉన్నత ఉద్యోగాల్లోకి రానివ్వదు. ఆంధ్రలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాణ్యమైన ఇంగ్లిష్ విద్య ఈ ఆదివాసుల్లో కొనసాగితే, 20–30 సంవత్సరాల్లో అమెరికాలో నల్లజాతీయులను మించిన మేధా వులు ఆదివాసుల నుండి వచ్చి విశాఖ పట్టణాన్ని ప్రపంచ నగరంగా మారుస్తారు. ఈ ఆదివాసుల నుండి ఎంతోమంది ఎలాన్ మస్క్‌లు వచ్చే అవకాశముంది. ఇటువంటి మార్పు భారతదేశపు గుజరాతీ క్యాపిటలిస్టులకు, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, ఆరెస్సెస్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. వీరికి ప్రభుత్వ ఉద్యోగులు ఓటువేసి గెలిపించే ప్రయత్నం చేస్తే వ్యవస్థనంతా గుజరాత్–ముంబై క్యాపిటలిస్టులకు అప్పజెప్పడమే.భారతదేశం అమెరికా కాదు, యూరప్ కాదు, ఆస్ట్రేలియా కాదు, కెనడా కాదు. ఇది 140 కోట్ల జనాభా కలిగిన చిన్న దేశం. దీన్ని చిన్న దేశం అని ఎందుకు అంటున్నానంటే భూపరిమాణంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, చైనాతో పోలిస్తే ఇది చాలా చిన్న భూమి కలిగిన దేశం. ఈ దేశ జనాభా ఇంకా ముందు, ముందు పెరుగుతుంది. ఆధునిక సైన్స్‌ను ఇంగ్లిష్ భాషతో ముడేసి గొప్ప, గొప్ప శాస్త్ర పరిశోధనల ద్వారానే మనం ఇంతమందికి తిండి, బట్ట, ఇల్లు ప్రపంచంలో తలెత్తుకుని బతికే ఆత్మ గౌరవాన్ని ఇవ్వగలం. అందుకు భావితరాలు – ముఖ్యంగా ఆదివాసులు, దళితులు, ఓబీసీలు – ఇంగ్లిష్‌లో చదువుకొని ప్రపంచ జ్ఞానాన్ని సాధించకుండా ఈ దేశానికి మనుగడ ఉండదు. మన దేశ భవిష్యత్తుకు పునాది స్కూలు విద్యను పూర్తిగా ప్రభుత్వ రంగంలోకి తెచ్చి, ప్రైవేట్ స్కూలు విద్యను రద్దు చెయ్యడంలో ఉంది; అన్ని రకాల ఎంట్రన్స్‌లను, కోచింగ్‌లను రద్దు చేసి నేరుగా 12వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా, విద్యార్థి శ్రమ గౌరవ పనుల్లో పాల్గొన్న సర్టిఫికెట్ల ఆధారంగా ఉన్నత చదువులకు పోవడంలో ఉంది. అమెరికా, యూరప్ ఇదే చేస్తాయి. బీజేపీ, చంద్రబాబు ఇటువంటి విద్యకు పూర్తిగా వ్యతిరేకం. కనుక ఇప్పుడు ఉద్యోగాలు ఏ కులస్థులైనా మొత్తం సమాజ భవిష్యత్ గురించి ఆలో చించకుండా ప్రైవేటీకరణకు, కుల తత్వానికి, మత తత్వానికి, వర్గ తత్వానికి ఓటు వేసుకుంటే సమాజంలో తిరుగుబాటు మొదలైతే దేశం కుప్పకూలుతుంది.భారతదేశపు ప్రైవేట్ రంగం అమెరికాలో, యూరప్‌లో ఉన్నట్టు మానవతా విలువలతో ఏర్పడినది కాదు. గ్రామాల్లో రైతులను, కూలీలను దోచుకొని వారితో బడిలో, గుడిలో ప్రేమతో పెరిగిన మనుషులుగా కాక మేం కులానికి ఎక్కువ, మేం కంచం–మంచం పొత్తును అంగీకరించం అనే వారి చేతిలో పెరిగింది. ఈ దేశంలో అతిపెద్ద పెట్టుబడిదారులు కుష్ఠు రోగులకు, కుంటి వారికి, గుడ్డి వారికి ఒక ఆశ్రమం కట్టించి ఆదుకున్నట్టు చూశామా! అమెరికా తెల్లజాతి ధనవంతులు, నల్లజాతి స్త్రీలను తమ ఇంట్లో వంట మనిషిగా పెట్టుకొని వారి పిల్లలను చదివించి మేధావులను చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. నల్లవారికి ప్రత్యేక స్కూళ్ళు, కాలేజీలు పెట్టి ముందు చదివించింది తెల్లజాతి పెట్టుబడిదారులు. ఈ దేశంలో అతిపెద్ద పెట్టుబడిదారులు దళితుల కోసం, ఆదివాసుల కోసం ఒక్క స్కూలు కట్టి చదివించారా!అందుకే దిక్కులేని రోడ్డుమీద బతికే పిల్లల్ని దగ్గరకు తీసి ‘నిన్ను ఇంగ్లిష్ మీడియం బడిలో చదివిస్తాన’ని హామీ ఇచ్చిన వ్యక్తిని దింపేసి నారాయణ స్కూలును వెనుక ఉండి నడిపించే వ్యక్తికి ఓటు వేస్తే, ప్రజాస్వామ్యం కాదు గదా మానవ విలువలే బతకవు. అందరికంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నేను చెప్పే ఈ మాట గురించి ఆలోచించండి.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఏపీ ఉద్యోగులతో ఒక మాట!
దేశంలోనే అన్ని రంగాల్ని మొట్టమొదటగా ప్రైవేటీకరించడం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అన్నిటికంటే ప్రమాదకరమైంది – స్కూళ్ళు, జూనియర్ కాలేజీల విద్యా ప్రైవేటీకరణ. దీంతో పేదలకు చదువు దూరమైంది. ఆంగ్లం అందకుండా పోయింది. దీనికి విరుగుడుగా జగన్ నేతృత్వంలో విద్యా, వైద్య రంగాల్లో ప్రైవేటీకరణ వ్యతిరేక మోడల్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైంది. దేశంలోని మొత్తం స్కూలు విద్యను ఎల్కేజీ నుండి 12వ తరగతి వరకు ప్రైవేట్ రంగం నుండి ప్రభుత్వ రంగంలోకి మార్చకుండా విద్యా సమానత్వాన్ని తేవడం సాధ్యమా? అందుకే గ్రామాలలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు అట్టడుగు గ్రామీణ శ్రమజీవుల జీవితాలను మార్చడానికి ప్రభుత్వం ఏమి చేస్తున్నదో అర్థం చేసుకోవడం ముఖ్యం.రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు ఎక్కువ ఎటు ఓటు వేశారనేది ముందుగానే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించినప్పుడు తెలుస్తుంది. ముఖ్యంగా అత్యధిక సంఖ్యలో ఉన్న టీచర్లు – స్కూలు, కాలేజీ, యూనివర్సిటీలలో పనిచేసేవారు ఎటువైపు ఉన్నారు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, సహాయక సిబ్బంది ఎటు ఓటు వేస్తారనేది కూడా ముఖ్యం. వీరితోపాటు గణనీయ సంఖ్యలో ప్రభుత్వ పోలీసు రంగం ఉద్యోగులు కూడా ఎటు ఓటు వేస్తారనేది చాలా ముఖ్యం. ఇక రెవెన్యూ, మున్సిపాలిటీ, సఫాయి శాఖతో పాటు ప్రభుత్వ రంగంలో ఉన్న పర్మనెంటు ఉద్యోగులు ఎటు ఓటు వేస్తారు, ఎవరు గెలవాలనుకుంటారు అనేది చాలా ముఖ్యమైంది. ఇంతకీ ఈ ఉద్యోగుల ఓటు గురించి ఎన్నడూలేని విధంగా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లోనే ఎందుకు చర్చించాలి? దానికొక ముఖ్య కారణమున్నది.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబులాగే ఒక రీజినల్ పార్టీ నడిపే ప్రభుత్వం. దేశంలోనే అన్ని రంగాల్ని మొట్టమొదటగా ప్రైవేటీ కరించడం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి, చంద్రబాబునాయుడు. అన్నిటికంటే ప్రమాదకరమైంది–స్కూళ్ళు, జూనియర్ కాలేజీల విద్యా ప్రైవేటీకరణ. దాన్ని ఆయన విపరీతంగా ప్రైవేటీకరించి అక్కడినుండి పార్టీ ఫండ్‌ను జమ చేశాడు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో ఎంట్రెన్సులు, కోచింగ్ సెంటర్లు ప్రారంభమయ్యాయి. ఈ దశలోనే పుట్టగొడుగుల్లా స్కూళ్ళు, జూనియర్ కాలేజీలు, గైడ్ రైటింగ్ కంపెనీలు, అడ్వరై్టజ్ ర్యాంకులు మొదలయ్యాయి.వైద్య రంగంలో కూడా ప్రభుత్వ రంగాన్ని మండలాల వరకు అభివృద్ధి చెయ్యకుండా ప్రైవేట్ హాస్పిటల్స్, ఒక్కొక్క డాక్టరు తన సొంత హాస్పిటల్ కట్టి నడపడం మొదలయ్యాయి. గత ఐదేళ్ళ జగన్ పాలనలో ప్రభుత్వ విద్యా రంగంలో ఇంగ్లిష్ మీడియం పెట్టి, స్కూళ్ళ అభివృద్ధి ప్రారంభించాక స్కూలు విద్యలో ప్రైవేట్ రంగం విద్య బాగా పడిపోయింది.స్కూలు టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థ వ్యతిరేక అభివృద్ధిని ఎలా చూడాలి? రాష్ట్రంలో మండలం, గ్రామ స్థాయిలో చిన్న, చిన్న ప్రభుత్వ హాస్పిటల్స్ పెరిగి, వాటిని టెలీ మెడిసిన్‌తో ముడేసిన వైద్యం... వైద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకమైందా, కాదా? గ్రామ సెక్రటేరియట్ల నిర్మాణం, చిన్న జీతాలతోనైనా 2,50,000 మంది వలంటీర్లను ప్రభుత్వ రంగంలో నియమిస్తే ప్రభుత్వ రంగం విస్తరించినట్టా, ప్రైవేట్ రంగం విస్తరించినట్టా?నిజంగానే బడ్జెట్ డబ్బులో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంత బీద, దిగువ మధ్యతరగతి రైతాంగానికి, కూలీలకు బదిలీ చేయబడ్డది కనుక ఉద్యోగుల జీతభత్యాల పెరుగుదల ఆగిందనుకుందాం. అయినా ప్రభుత్వ రంగ ఎదుగుదల, ప్రైవేట్ రంగ ఎదుగుదల కోణం నుండి చూసినప్పుడు ప్రభుత్వం 30 వేల ఎకరాల్లో అమరావతి కట్టడం కోసం కాంట్రాక్టర్లకు ఆ డబ్బు ఇస్తే ఏ రంగం పెరిగేది? అందుకు బదులు గ్రామీణ అభివృద్ధి ముఖ్యంగా విద్యా, వైద్య రంగాల అభివృద్ధి జాతీయ వాదంలో కీలకమైంది.ఈ స్థితిలో ప్రభుత్వ రంగ ఉద్యో గులు, ముఖ్యంగా టీచర్లు ఏ ముఖ్యమంత్రిని కోరుకోవాలి? ప్రభుత్వ రంగాన్ని గణనీయంగా పెంచిన జగన్నా, ప్రైవేట్ రంగ అనుకూల బాబునా? మరీ ముఖ్యంగా మోదీల కూటమినా? పవన్ కల్యాణ్‌కి సినిమా రంగం తప్ప ఏ రంగం గురించి తెలియదు. ఆయన మోదీ, బాబు ఏది చెబితే అది చేస్తాడు.ఉద్యోగస్తులు నిరంతరం ప్రజా జీవన విధానం, వారి ఆర్థిక స్థితి గతులతో సంబంధం లేకుండా తమ జీతాల పెంపు, అనుకూల ట్రాన్స్ ఫర్, రిటైర్మెంట్ ఏజ్ పెంపు గురించి ఆలోచిస్తే క్రమంగా ప్రభుత్వ రంగాన్ని మూసేసి ప్రైవేట్ రంగ ఎదుగుదలకు ఓటెయ్యడమే. భవిష్యత్ తరాల బతుకుదెరువు గురించి, రాష్ట్ర, దేశ భవిష్యత్ గురించి మాకెందుకు అనుకుంటే ప్రైవేటీకరణను ప్రభుత్వ రంగ ఉద్యోగులే కోరుకోవడం కాదా? ఉద్యోగుల్లో, ముఖ్యంగా టీచర్లు కమ్యూనిస్టు పార్టీలతో ఉండి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుంటారు.అదే టీచర్లు ఇప్పుడు ఏపీలో ప్రైవేట్ విద్యారంగాన్ని ప్రభుత్వ రంగంలోకి మారిస్తే, ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే, నాడు–నేడు పథకం ద్వారా స్కూళ్ల రూపురేఖలను మారిస్తే ఈ ప్రక్రియకు మద్దతు ఇవ్వాలి కదా! కమ్యూ నిస్టు పార్టీలు ఈ నూతన ప్రభుత్వ రంగ అభివృద్ధిని వ్యతిరేకిస్తూ జగన్‌ను ఓడించాలని చూస్తున్నాయి. ఇది విద్యా, వైద్య రంగంలో పెరుగుతున్న ప్రభుత్వ ఆస్తులను వ్యతిరేకించడం కాదా?కమ్యూనిస్టులు ఏపీలో ఒకవేళ అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్ మీడియంను తీసేసి, ఆ బడులను మూసేసి, విద్యా దోపిడీదారులకు అప్పజెబుతారా? భారతదేశంలో అతి పెద్ద ప్రైవేట్ సెక్టార్, విద్యా రంగం. ప్రైవేట్ రంగంలో ఇంగ్లిష్ విద్య పేరుతో చంద్రబాబు మిత్రబృందం వేల కోట్లు దోచుకుంటుంటే జగన్ ప్రభుత్వం ఆ దోపిడీకి అడ్డుకట్ట వేసే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది.కమ్యూనిస్టులు సైతం ప్రభుత్వ రంగ అభివృద్ధిని వ్యతిరేకిస్తూ, మాతృభాష ప్రాంతీయ వాదానికి తలొగ్గి మళ్ళీ ప్రైవేట్ విద్యా వైద్యానికి ఊడిగం చేస్తే ప్రజలు వీరినెలా నమ్ముతారు? విద్యా, వైద్య రంగాల్లో ప్రైవేటీకరణ వ్యతిరేక మోడల్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైంది. దాన్ని చంపెయ్యడానికి కమ్యూనిస్టులు నడుం కడితే ప్రజలు ఏమైపోవాలి?ఆరెస్సెస్/బీజేపీ నేతృత్వంలో నడిచే కేంద్ర ప్రభుత్వం కేంద్ర స్థాయి పరీక్షలు, సెంట్రల్ యూనివర్సిటీల ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లను హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే రాయనిస్తున్నది. అంటే క్రమంగా హిందీని దేశపు ఉత్పత్తి కులాల పిల్లల మీద రుద్ది, ధనవంతులకు మాత్రమే ప్రైవేట్ ఇంగ్లిష్ అంతర్జాతీయ జ్ఞాన సంపదను అందు బాటులో ఉంచ చూస్తున్నది.ఈ విద్యా విధానాన్ని ఎలా ఎదు ర్కోవాలి? దేశంలోని మొత్తం స్కూలు విద్యను ఎల్కేజీ నుండి 12వ తరగతి వరకు ప్రైవేట్ రంగం నుండి ప్రభుత్వ రంగంలోకి మార్చ కుండా విద్యా సమానత్వాన్ని సాధించగలమా? దేశంలో విద్యా వ్యవస్థని, కనీసం స్కూలు విద్యా వ్యవస్థనైనా ప్రభుత్వ రంగంలోకి మార్చడానికి ప్రభుత్వ టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, మానవ సమానత్వం కోసం పనిచేసేవాళ్ళు సపోర్టు చెయ్యకపోతే ఎలా?అంతేకాక ప్రభుత్వ ఉద్యోగులు బీద ప్రజల సంక్షేమం కోసం బడ్జెట్ డబ్బును ఖర్చు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తమ కుటుంబాల గురించే ఆలోచిస్తే ప్రభుత్వ రంగం కూలిపోక ఏమౌతుంది? ఈ సమస్య చాలా కీలకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ముందు ఉన్నది. దేశంలోనే అన్ని రంగాల్ని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలోకి నెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్లు ప్రభుత్వ రంగ వ్యతిరేకికే ఓటు వేస్తే జరిగేదేంటి?గ్రామాలలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్లు అట్టడుగు గ్రామీణ శ్రమ జీవుల జీవితాలను మార్చడానికి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూసి ఆ ప్రభుత్వాన్ని కొనసాగించాలా వద్దా అని నిర్ణ యించుకోవాలి. ఉత్పత్తి రంగంలో పనిచేసే ప్రజల జీవితాలను మెరుగుపర్చే ప్రభుత్వం ఉన్నప్పుడు తమ జీతభత్యాల పెంపుదలతో కొంత రాజీపడాల్సి వస్తే కూడా పడాలి. అది ఒక ఉద్యోగి రాష్ట్రానికి, దేశానికి చేసే మేలు. రాజకీయ నాయకులు దోచుకుంటున్నప్పుడు వారిపై పోరాటం తప్పు కాదు.ఉద్యోగులు హక్కులను, ఆత్మగౌర వాన్ని ఎప్పుడు కూడా తాకట్టు పెట్టకూడదు. అయితే, తమ హక్కుల పోరాటం, ఉత్పత్తి రంగంలో పనిచేసే మానవాళిని ఆకలితో మాడ్చ టానికో, బీద పిల్లలు ధనవంతుల పిల్లలతో పోటీపడి ఎదిగే జీవితాన్ని అడ్డుకోవడానికో చెయ్యడం మహానేరం. ఈ మాట 38 సంవత్సరాలు ప్రభుత్వ రంగంలో పనిచేసిన వ్యక్తిగా చెబుతున్నాను. ప్రతి ఉద్యోగి, ఓటరు, పౌరుడు దిక్కు లేని వారికి దిక్కుగా నిలబడాలి. అందుకే 2024 ఎన్నికల్లో వాళ్ళ ఓటు వాళ్ళ జీవిత లక్ష్యాన్ని సూచిస్తుంది.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఇంగ్లిష్ వ్యతిరేకులను చీపుర్లతో స్వాగతించండి
‘ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు భారతదేశానికే దిక్సూచిలా మారింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా విధానం భవిష్యత్తులో ప్రతీ ఒక్కరూ అనుసరించక తప్పదు. వద్దన్న వారికి చీపుర్లతో బుద్ధి చెప్పాలి’ అని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లభాష అమలు, దాని ఫలాలపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. దేశాన్ని మార్చే విద్యా విధానం.. ఇంగ్లిష్ మీడియం కోసం 1990 నుంచి నేను గళం విప్పాను. మండలి బుద్ధప్రసాద్, ఏబీకే ప్రసాద్, చుక్కా రామయ్య.. వీళ్లంతా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అంటే నా మీద తీవ్ర స్థాయిలో విమర్శలతో దాడి చేశారు. ఈ విషయంలో సీఎం జగన్ చేసిన పోరాటం చాలా గొప్పది. ఆయన దేశాన్ని మార్చే విద్యా విధానం తీసుకొచ్చారు. మొత్తం బీజేపీ ప్రభుత్వ అజెండాను కూడా మార్చే శక్తి దానికుంది. నిజానికి గ్రామాల్లో నుంచి వచ్చే పిల్లలతో నగరాల్లోని పిల్లలు పోటీ పడలేరు. గ్రామీణ పిల్లలకు కేవలం కమ్యూనికేషన్ ఒక్కటే సమస్యగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల పిల్లలు బాగా మాట్లాడుతున్నారు. స్కూలు పిల్లల్ని బహిరంగ సభల్లో తెచ్చి మాట్లాడించిన నాయకుడ్ని నా జీవితంలో చూడలేదు. ఇంగ్లిష్ మీడియం విద్య జగన్‌ను గెలిపించబోతోంది. దీన్ని ఎవరూ ఆపలేరు. ఇటీవల రాహుల్ గాం«దీకి కూడా చెప్పా. దేశమంతా ఆంధ్ర మోడల్ తీసుకురండి.. బీజేపీని ఓడించగలుగుతారు అని. విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం, మ్యూజియంలను నేను అంబేడ్కర్ గుడి అంటాను. 2002లో నేను మా ఊర్లో గుడ్ షెçపర్డ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ పెట్టి.. లంబాడి కూలోళ్ల పిల్లలకు ఇంగ్లిష్ చదువులు చెప్పించాను. ఇప్పుడు అద్భుతంగా వాళ్లు ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నారు. మీ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివిస్తారా? వెంకయ్యనాయుడు, రమణ, చంద్రబాబు, పవన్‌కు చెబుతున్నా. మీ ఆధ్వర్యంలో తెలుగు మీడియం స్కూల్స్ పెట్టించండి. మీ పిల్లల్ని, అగ్రకులాల పిల్లల్ని తెలుగు మీడియంలో బాగా చదివించండి. మేం మాత్రం దిక్కుమాలిన ఇంగ్లిష్‌లోనే చదువుకుంటాం. మీరు తెచ్చిన నారాయణ, చైతన్య, విజ్ఞాన్ స్కూల్స్‌ను తెలుగు మీడియంకు మార్చండి. ఇంగ్లిష్ మీడియం వద్దన్న వారికి ఊరూరా మహిళలు చీపుర్లతో స్వాగతం చెప్పండి. అలాంటి మేధావులకు అంటిన మురికిని వదిలించడానికి చీపుర్లతో శుభ్రం చేయండి. తొలి మార్పు వైఎస్సార్ నుంచే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక 2006లో 6 వేల స్కూల్స్‌లో ప్యారలల్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే పలువురు వ్యతిరేకించారు. ఈ విషయం మీద తనని కలిసిన వారిని మీ పిల్లలు, మనవళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు అని వైఎస్సార్ ప్రశ్నించాక నోరు మూసుకున్నారు. మన పిల్లలకు ఇంగ్లిష్ చదువులు కావాలా? బీదల పిల్లలకి అక్కర్లేదా? అని వారందర్నీ మందలించారు. బహుశా అదే జగన్‌కు స్ఫూర్తినిచ్చి ఉంటుంది. పాదయాత్రలో పిల్లల పరిస్థితి చూసిన జగన్.. మేనిఫెస్టోలో ఇంగ్లిష్ విద్య గురించి పెట్టారు. ఇచ్చింన మాట ప్రకారం ఆయన ఇంగ్లిష్ మీడియం తేవడానికి ప్రయత్నిస్తే వెంకయ్యనాయుడు, చంద్రబాబు, పవన్‌లాంటి వాళ్లంతా వ్యతిరేకించారు. నా దృష్టిలో వాళ్లంతా యూజ్లెస్. కమ్యూనిస్ట్‌లు, నాతో పనిచేసిన వారు కూడా వ్యతిరేకించారు. ఆఖరికి అప్పట్లో సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న రమణ కూడా వీరికి జతకలిశారు. ఆయన తెలుగు భాష గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఆయన అసలు ఏం తెలుగు రాశారని? వీళ్లందరికీ ఏం తెలుగు వచ్చని? లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్‌కు చెబుతున్నా. ఒక్కసారి ఆ పిల్లలతో ఇంగ్లిష్‌లో మాట్లాడు. మేధావితనం ముసుగు మాత్రమేనని నీకే తెలుస్తుంది. -
ఫర్ డెమాక్రసీ? అగేనెస్ట్ డెమాక్రసీ?
‘సిటిజెన్స్ ఫర్ డెమాక్రసీ’ ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాపాడటానికి పుట్టినట్టు కనిపిస్తుంది. ఈ సంస్థ చేసిన అతి గొప్ప పని ముసలివాళ్ళకు, గుడ్డివాళ్ళకు, కుంటివాళ్ళకు ఇంటి దగ్గరే పింఛన్లను అందించే కార్యక్రమాన్ని ఆపించడం. ఇందుకోసం ముందు కోర్టుకు పోయింది. తరువాత ఎన్నికల కమిషన్ వద్దకు పోయి ఆపించింది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించిన 2,50,000 మంది వలంటీర్లు ఫించన్ల పంపిణీ ద్వారా ఓటును ప్రభావితం చేస్తారని. ఇదో కొత్త వాదన, వింత వాదన. ఈ అప్రజాస్వామిక సంస్థ చెయ్యబట్టి 30కి పైగా ముసలివాళ్ళు చనిపోయారని వార్తలు వస్తున్నాయి. ఇంత దారుణానికి ఒడిగట్టిన ఈ సంస్థను ప్రజలు గౌరవిస్తారా? వైసీపీ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో వలంటీర్లను కాంట్రాక్టు ఉద్యోగ పద్ధతిలో నియమించింది. వారినందరినీ ఉద్యోగాల నుండి తీసేసే అధికారం ఈసీకి కూడా లేదు. వలంటీర్లు చేసే అతిమానవత్వపు పని ముసలోళ్ళకు, కుంటోళ్ళకు, గుడ్డోళ్ళకు ఒకటో తారీఖు నాడు పెన్షన్ డబ్బు వాళ్ళ ఇంటి వద్ద అందించడం. అదికాక వీళ్లు ఇంకా చాలా పనులు తమ క్లస్టర్స్ (దాదాపు 50 కుటుంబాలు)లో చేస్తారు. దాదాపు నాలుగున్నర సంవత్సరాలకు పైగా ఆ కుటుంబాలతో, ఆ ముసలి వారితో, రోగస్థులతో సంబంధంలో ఉండి వారి మెప్పును పొందిన వలంటీర్లను ఎన్నికలయ్యే వరకు వారిని కలిసి మాట్లాడకుండా ఎలా ఆపుతారు? అంతేకాదు, ప్రభుత్వ వెల్ఫేర్ స్కీముల కిందికొచ్చే ప్రజలు ఏ రాష్ట్రంలోనైనా మెజారిటీ. అటువంటి కుటుంబాలన్నిటితో ఈ వలంటీర్లు చాలా ఇతర స్కీముల ద్వారా కూడా కలుస్తారు కదా. ఆరోగ్య సంబంధ స్కీములు, గర్భిణీ స్త్రీలకు సంబంధించిన అవసరాలు, స్కూలు పిల్లలకు ఉన్న అవసరాలు, రేషనుకు సంబంధించిన అవస రాలు అన్నీ వాళ్లు ఇంటింటికి తీరుస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళకు చెడ్డ పేరొస్తే తప్ప, మంచి పేరుతో, సహాయ సహకార సంబంధాలలో వలంటీర్లు ఉంటే వారి సంబంధాల్ని సిటిజెన్స్ ఫర్ డెమాక్రసీ గానీ, ఈసీగానీ ఎలా ఆపుతాయి? ఈ పనిని ఈ సంస్థ డెమాక్రసీకి అను కూలంగా కాదు చేసింది; డెమాక్రసీ వ్యతిరేక బుద్ధితో చేసినట్లు అర్థమౌతూనే ఉంది. ఈ వలంటీర్లు ఆయా గ్రామాల వారే, వాడల వారే. పట్టణాల్లో కూడా వాళ్ళు పనులు చేసే కుటుంబాలకు తెలిసిన వారే. వీళ్ళు నిత్య సంబంధాలు ముసలోళ్ళకు, కుంటోళ్ళకు, గుడ్డోళ్ళకు ఫించను ఇవ్వకుండా ఆపితే ఆగుతాయా? అప్పుడు ఈ సంస్థ ఏమి చెయ్యాలి? ఈ వలంటీర్ల ఉద్యోగాలు పీకించి గ్రామ బహిష్కరణ చేయించాలి. అప్పుడు వీళ్ళు నిజమైన సిటిజెన్స్ ఫర్ డెమాక్రసీ పని చేసినట్టు! కానీ అది వారి నుంచి కాదు కనుక ఈ ఒక్క డిమాండ్ సాధించారు. ఈ పని చేసింది ప్రజా స్వామ్యం కోసమా, ప్రతిపక్షాల కోసమా? అసలు ఈ సంస్థ ఏర్పడిన విధానం, దాని లక్ష్యం, అది సాధించిన ఘనతలను చూద్దాం. ఇది 2023 అక్టోబర్‌లో విజయవాడలో ఏర్పడింది. మాజీ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (రిటైర్డ్ ఐఏఎస్) జనరల్ సెక్రటరీగా ఏర్పడింది. మాజీ ఛీప్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం (రిటైర్డ్ ఐఏఎస్) ఇందులో ముఖ్యంగా పని చేస్తున్నారు. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోనే డెమాక్రసీని కాపాడటానికి, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాపాడటానికి పుట్టినట్టు కనిపిస్తుంది. ఈ ఇద్దరికీ పౌరహక్కుల గురించి ఎన్నడూ మాట్లాడిన చరిత్ర లేదు. ఆదివాసుల్లోగానీ, దళితుల్లోగానీ వీరికి అభిమానులు ఉన్నట్లు ఎక్కడా కనిపించదు. ఇంతకుముందు ఐఏఎస్ అధికారులు పదవుల్లో ఉండగా, దిగిపోయాక కూడా ప్రజల హక్కుల కోసం పని చేసినవాళ్ళు ఉన్నారు. మన ఉమ్మడి రాష్ట్రంలో ఎస్ఆర్ శంకరన్, కాకి మాధవరావు చాలా కాలం ఇటువంటి పని చేశారు. ఆదివాసుల కోసం బీడీ శర్మ చాలా పనిచేశారు. శంకరన్ రిటైర్ అయ్యాక కమిటీ ఆఫ్ కన్సర్న్డ్ సిటిజన్స్ అనే సంస్థ పెట్టి బీద ప్రజల కోసం, పౌర హక్కుల రక్షణ కోసం చాలా పనిచేశారు. ఆయన మరణానంతరం దళిత సంఘాలు ఈనాటికీ ఆయన సంస్మరణ సభలు జరుపుతాయి. కాకి మాధవరావు ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్‌లో చాలా చురుకుగా పనిచేశారు. బీడీ శర్మ ఆది వాసుల హక్కుల కోసం తన జీవిత కాలమంతా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకు భిన్నంగా రమేష్ కుమార్, సుబ్రహ్మణ్యం... చంద్ర బాబు నాయుడి ఏజెంట్లుగా వ్యవహరించారని స్పష్టంగా అర్థమౌ తూనే ఉంది. దానివల్ల ఎవరి హక్కులు భంగమయ్యాయి? అతి బీద, ముసలి, కుంటి, గుడ్డి వారి హక్కులు భంగమయ్యాయి. చాలా బాధా కరమైన విషయమేమంటే ఈ అప్రజాస్వామిక సంస్థ చెయ్యబట్టి 30కి పైగా ముసలివాళ్ళు చనిపోయారని వార్తలు వస్తున్నాయి. ఇంత దారుణానికి ఒడిగట్టిన సిటిజెన్స్ ఫర్ డెమాక్రసీ అనే పేరు గల సంస్థను ప్రజలు గౌరవిస్తారా? ఇప్పుడు పరిస్థితి చూడండి. అదే చంద్రబాబు నాయుడు నేను వలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాను; వాళ్ళందరికీ నెలకు 10 వేలు ఇస్తానంటున్నాడు ఎందుకు? మొత్తం ప్రజానీకంలో ఆయన ఆట బొమ్మలైన మాజీ ఐఏఎస్ అధికారులు చేసిన పనివల్ల మొత్తం కూటమి ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది. ఈ కూటమి కూడా ఒక ఉమ్మడి మానిఫెస్టోను ప్రకటించలేదు. ఎవరిది వాళ్ళు మానిఫెస్టోగా రాసుకున్నారు. కానీ రేపు అధికారమొస్తే ముగ్గురు మంత్రి మండలిలో ఉండి పరిపాలించాలి. చంద్రబాబు ఇప్పుడు ఇచ్చే హామీలు బీజేపీ, జనసేనవి కావు కదా! వాళ్ళెందుకు అంగీకరిస్తారు? ఆయన పబ్లిక్ మీటింగుల్లో ఇష్టమొచ్చినట్లు వాగ్దానాలు చేస్తున్నాడు. మరో వాగ్దానం చూడండి. ఆయన అధికారంలోకి వస్తే ప్రతి స్త్రీకి సంవత్సరానికి 15 వేలు ఇస్తాడట. ఇంట్లో ఎంతమంది స్త్రీలు ఉంటే అన్ని పదిహేను వేలు ఇస్తాడట. ఇద్దరుంటే 30 వేలు, ముగ్గురుంటే 45 వేలు అంటున్నాడు. ఈ పైసల పంపకాన్ని బీజేపీ ఒప్పుకుంటుందా! అందుకు మోదీ సరే అన్నాడా? చంద్రబాబు హామీలు జగన్ హామీ లలా కాదే. జగన్ అన్నీ స్వయంగా తన పార్టీలో నిర్ణయించగలడు. కానీ బాబు ఇప్పుడు అలా చెయ్యలేడే. బీజేపీ ఒక జాతీయ పార్టీ. దానికి 30 వేల ఎకరాల్లో వేల కోట్లు పెట్టి రాజధాని కట్టడమే అంగీకారం కాదు. ఇప్పుడు ఆంధ్రలో వలంటరీ వ్యవస్థను అంగీకరిస్తే దేశమంతా అటువంటి డిమాండ్లు వచ్చే అవకాశముంది. కనుక బాబు బోగస్ వాగ్దానాలు ఇస్తున్నాడు. ఆయన అయోమయంలో మాట్లాడు తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దేశంలో చాలా అంశాలను ప్రభావితం చేస్తాయి. ప్రశాంత్ కిశోర్ డబ్బులతో ఎన్నికల రిజల్ట్ ప్రిడిక్షన్స్ చేస్తూ స్వంత పార్టీ పెట్టి బిహార్‌లో ఏ మాత్రం గుర్తింపు లేని నాయకుడుగా మిగిలిపోయి ఇప్పుడు మళ్ళీ పాత అవతారమెత్తుతున్నాడు. ఏపీ ఎన్నికలు అతన్ని దేశంలోనే ఎవరూ నమ్మకుండా చేసే అవకాశముంది. విదేశాల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుకొని వచ్చిన ఈ బ్రాహ్మణ మేధావి ఇంగ్లిష్ మీడియం విద్యా ప్రభావంగానీ, సంక్షేమ పథకాల ప్రభావంగానీ ఎన్నికల్లో ఉండదని ఊకదంపుడు బ్రాహ్మణ వాదం చేస్తున్నాడు. బడులు కాకుండా, గుడులు కడితే ప్రజలు ఓట్లేస్తారని వీరి సిద్ధాంతం. రిటైర్డ్ ఐఏఎస్‌లు పౌరహక్కుల నాయకుల అవతారమెత్తి ముసలోళ్ళను, కుంటోళ్లను, గుడ్డోళ్ళను ముంచితే వారి నాయకుడు చంద్రబాబు వలంటీర్లను, అమరావతి రైతులను అంతు లేని ఆశలతో ముంచుదామని చూస్తున్నాడు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితి కనిపిస్తలేదు. ఎలా నమ్ముతారు? జగన్ వెల్ఫేర్ కార్యక్రమాల వల్ల రాష్ట్రం అప్పుల పాలైంది; అభివృద్ధి అంటే సింగపూర్ వంటి రాజధాని కట్టలేదు; అద్దంలా మెరిసే రోడ్లు వెయ్యలేదు అంటూనే ఇప్పుడు జగన్‌ను మించిన హామీలిస్తున్నాడు. ఆయన ఇచ్చే హామీల గురించి పవన్ కల్యాణ్ గానీ, పురందే శ్వరిగానీ ఏమీ మాట్లాడటం లేదు. అంటే ఆ పార్టీలు ఈ వాగ్దానా లను అంగీకరించవనే కదా అర్థం. ఎన్నికలు ఇంకో నెల రోజులు ఉండగా, ఈ మూడు పార్టీల పరేషాన్ చూస్తే చూసేవారికే జాలేస్తుంది. మరీ చంద్రబాబు అయితే ఓడిపోతే ఎట్లా, ఎట్లా అనే భయం ముఖంలో కనిపిస్తుంది. ఇవి ఆఖరి ఎన్నికలని ఆయన భయమే చెబుతుంది. ఏమౌతుందో ఏపీ ప్రజలే నిర్ణయిస్తారు. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
పేదలకు ఇంగ్లీష్ వస్తే ... అమెరికాను దాటేస్తాం
-
సీఎం జగన్ మాస్టర్ మైండ్ అభివృద్ధి అంటే ఇది
-
పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ స్పీచ్ ..!
-
‘రాష్ట్ర బడ్జెట్‌తో సినిమాలు తీయమంటావా పవన్?’
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొచ్చిన విప్లవాత్మక విద్యా సంస్కరణలపై ప్రతి పక్షాలు చేస్తున్న విమర్శలను ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెపర్డ్ తీవ్రంగా తప్పుపట్టారు. పేద పిల్లలకు కార్పోరేట్ విద్య నేర్పిస్తే ఇందులో పెత్తందారులకు వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. గ్రామాల్లో చదువుకున్న పిల్లలకు ఇంగ్లిష్ నాలెడ్జ్ వస్తే ఆ పిల్లల్లో క్రియేటివిటీ అనేది 1000 రెట్లు పెరుగుతుందని స్పష్టం చేశారు. ఇంగ్లిష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్ అని, దాన్ని ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు అందుబాటులోకి సీఎం జగన్ తీసుకొస్తే మరి ఇందులో వారికి వచ్చిన నష్టమేంటో తెలియడం లేదన్నారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా విద్యావ్యవస్థలో సీఎం జగన్ తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులపై ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో ఐలయ్య పలు విషయాలను పంచుకున్నారు. రాబోయే పదేళ్లల్లో పల్లె విద్యలో కొత్త చరిత్ర ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టడాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు తప్పుపట్టడాన్ని తీవ్రంగా ఖండించారు ఐలయ్య. తమ పిల్లలకు గ్రామాల్లో ఉన్న పిల్లలు తీవ్రంగా పోటీ ఇస్తారని, తమ పిల్లలకు ఊళ్లల్లో పిల్లలు పోటీ వస్తారని ఆ కారణం చేతనే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. కొన్ని కులాల్లో నేటికి విద్య అనేది సరిగా లేదని, రాబోయే కాలంలో ఊళ్లల్లో ఉన్న విద్యార్థులు.. అంబానీ, అదానీ స్కూళ్లలో చదివే పిల్లల్ని సైతం ఓడించగలరన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం అనేది రాబోయే 10 ఏళ్లలో పల్లె విద్యలో కొత్త చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు. పవన్‌కు అసలు కామన్ సెన్స్ ఉందా? ఏపీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని పవన్ కళ్యాణ్ గతంలో తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలపై కూడా ఐలయ్య ఘాటుగా స్పందించారు. ప్రధానంగా యూట్యూబ్‌లో చూసి ఇంగ్లిష్ నేర్చుకోవచ్చని, దాని కోసం ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు పెట్టనవసరం లేదని చేసిన వ్యాఖ్యలను ఐలయ్య ఖండించారు. అసలు పవన్ కళ్యాణ్ కామన్ సెన్స్‌తో మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. అంతా యూట్యూబ్‌లో చూసి నేర్చుకుంటే పిలల్ని కూడా కార్పోరేట్ స్కూళ్లలో చేర్చించాల్సిన అవసరమే ఉండదన్నారు. మరి మీ పిలల్ని పెద్ద పెద్ద స్కూళ్లలో ఎందుకు చదివిస్తున్నారో చెప్పాలని సూటిగా నిలదీశారు. పవన్ యాక్షన్ చేసి ఏవో డబ్బులు సంపాదించాడు తప్ప కనీసం నాలెడ్జ్ లేదన్నారు. ప్రభుత్వ బడులకు బడ్జెట్ ఖర్చు పెడుతుంటే తప్పేంటన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ను దేనిపైనా ఖర్చు పెట్టకుండా మరి సినిమాలు తీయమంటావా? లేక చంద్రబాబుతో కలిసి హైటెక్ సిటీ కట్టమంటావా? అని పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నీ మనవడితో తెలుగు మీడియం చదివించు ఇంగ్లిష్ మీడియంలో చదివితే పిల్లలు ఏమవుతారో తెలుసా అంటూ గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని ఐలయ్య తప్పుపట్టారు. ‘ కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక పోయింది’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఐలయ్య తనదైన శైలిలో బదులిచ్చారు. ఇదే నిజమైతే తన మనవడిని తెలుగు మీడియంలో చదివించొచ్చు కదా అంటూ ప్రశ్నించారు. మరి అటువంటప్పుడు తన మనవడి ఉన్న నాలుక(కొండ నాలుకకు మందేస్తే) ఎందుకు తీసేస్తున్నావ్ అంటూ ప్రశ్నించారు. అలా అయితే మీరు.. మీ పార్టీ వారి పిల్లల్ని రేపే తెలుగు మీడియంలో చేర్పించాలని డిమాండ్ చేశారు ఐలయ్య. -
ఏపీ విద్యా వ్యవస్థ దేశానికే రోల్ మోడల్..
-
ఈయన మాటలు వింటే చంద్రబాబు తల ఎక్కడ పెట్టుకుంటాడో
-
కంచ ఐలయ్య ‘మా జాతి సూర్యుడు’
సాక్షి, హైదరాబాద్: కంచ ఐలయ్య షెఫర్డ్ తమ జాతి సూర్యుడని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొనియాడారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా తింతని బ్రిడ్జ్ కనకపీఠంలో శనివారం సీఎం సిద్ధరామయ్య ‘మా జాతి సూర్యుడు’అవార్డును ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ ఐలయ్య సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో పుస్తకాలు రాసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని, కులాధిపత్య అసమాన సమాజంలో ఆయన తరహా వ్యక్తుల అవసరం ఎంతో ఉందన్నారు. ఆయన బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా నేటి పరిస్థితులకు అనుగుణంగా ‘వై ఐయామ్ నాట్ ఏ హిందు’, ‘బఫెల్లో నేషనలిజం’.. తదితర రచనలు చేశారన్నారు. కులాధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా, ఆధునిక శూద్ర సమాజ పురోగతికి, సమసమాజ స్థాపనకు ఆయన రచనలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని మారుమూల పల్లె పాపయ్యపేటలో, కురుమ కులంలో జన్మించిన ఐలయ్య షెపర్డ్ యావత్ భారతదేశం గరి్వంచే స్థాయికి ఎదగడం కురుమ కులానికే గర్వకారణమని ప్రశంసించారు. అందుకే ఆయనకు యావత్ కురుమ సమాజం తరపున ’మా జాతి సూర్యుడు’ అవార్డును అందజేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఐలయ్యకు కనక పీఠం పీఠాధిపతి శ్రీ సిద్ధ రామానంద మహాస్వామి తలపాగా తొడిగి రూ. 50 వేల నగదును బహూకరించారు. అనంతరం కంచ ఐలయ్య షెపర్డ్ మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని దళిత బహుజనుల పిల్లలందరికీ ఆంగ్ల మీడియం పాఠశాలలు ప్రారంభించాలని, అగ్రకులాల పిల్లల చదువులకు బహుజనుల పిల్లలు ఏ మాత్రం తీసిపోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. జాతి సూర్యుడిగా అవార్డు అందజేసిన కనకపీఠానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి భగవంత్ ఖుభా, కర్ణాటక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బైరతి సురేష్, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు చలకాని వెంకట్ యాదవ్, ప్రొఫెసర్ నర్రి యాదయ్య, తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు విప్లవ్, దాసరి శ్రీనివాస్, ఉస్మానియా విద్యార్థులు కొంగల పాండు, గురునాథ్, సురేందర్, దయ్యాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కుల నిర్మూలన ఇలాగేనా?
ఆర్ఎస్ఎస్ నాయకులు కుల నిర్మూలన గురించి మాట్లాడటం మంచిదే. అదే సమయంలో దానికి గల మార్గాలను కూడా వారు వివరించాలి. ప్రస్తుత మాంసాహారం వర్సెస్ శాకాహారం వివాదం కులతత్వంతో కూడుకున్నది. ఇది కుల నిర్మూలనకు సహాయం చేయకపోగా, పౌర సమాజంలో, విశ్వ విద్యాలయాల్లో కులతత్వాన్ని ప్రోత్సహిస్తుంది. వివాహం, గౌరవప్రదమైన కులాంతర భోజనాలు అనే ఈ రెండు సామాజిక వ్యవస్థలు తీవ్రమైన కుల నిర్మూలనా శక్తిని కలిగి ఉన్నాయి. అందుకే తాము హిందువులని ఆర్ఎస్ఎస్ భావించే అన్ని కులాలకూ దేవాలయాలలో అర్చకత్వ హక్కులు కల్పించాలి. దేశం, సమాజం, కుటుంబం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మంచిదని ప్రచారం చేయడం ద్వారా కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. జాతీయ స్థాయిలో కుల గణనను డిమాండ్ చేస్తూ, ద్విజ ఆధిపత్యం కలిగిన సమాజంలో తమ చారిత్రక స్థానం పట్ల స్పృహను ప్రదర్శిస్తూ, తమ సంఖ్య గురించి శూద్ర/ఓబీసీలు చైతన్యాన్ని చూపుతున్న నేపథ్యంలో– ఎట్టకేలకు, ఆర్ఎస్ఎస్ బహిరంగ వేదికలపై కుల నిర్మూలన గురించి మాట్లాడుతోంది. కుల నిర్మూలన కోసం దత్తాత్రేయ çహొసబలే, ఇతర నాయకులు దళితులు, శూద్రులకు ఆలయ ప్రవేశాన్ని, నీటి హక్కు లను గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ రెండు అంశాలూ కాలం చెల్లినవి మాత్రమే కాదు, ఇవి సామాజిక వివక్షను తొలగించే అవకాశం లేదు. రెండు సామాజిక వ్యవస్థల శక్తి మాంసాహారం వర్సెస్ శాకాహారం వివాదం కులతత్వంతో కూడుకున్నది. ఇది కుల నిర్మూలనకు సహాయం చేయకపోగా, పౌర సమాజంలో, విశ్వవిద్యాలయాల వంటి ప్రభుత్వ సంస్థలలో కుల తత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఆహార సాంస్కృతిక ఘర్షణలకు దారి తీస్తుంది. కులాల మధ్య విభజితమైన ఆహార సంస్కృతి కూడా కులాంతర వివాహాలకు అడ్డుగోడగా నిలుస్తో్తంది. వివాహం, గౌరవప్రదమైన కులాంతర భోజనాలు అనే ఈ రెండు సామాజిక వ్యవస్థలు తీవ్రమైన కుల నిర్మూలనా శక్తిని కలిగి ఉన్నాయి. వివాహం, ఆహార సాంస్కృతిక కండిషనింగ్ అనేవి, సామాజిక బృందాలను ఏకం చేయగలవు లేదా విభజించగలవు కాబట్టి వాటిని నేను ఉద్దేశపూర్వకంగానే శక్తి అని పిలుస్తాను. కుల వివాహ వ్యవస్థ, సామా జికంగా వేర్పాటుతో కూడిన ఆహార సాంస్కృతిక పరంపర అనేవి వేయి సంవత్సరాలుగా దేశంలో కుల అంతరాలను కొనసాగించాయి. కుల కేంద్రకమైన వివాహ వ్యవస్థ అనేది వ్యక్తుల డీఎన్ఏను కుల ప్రాతిపదికన విభజించడానికి ఉద్దేశించబడింది. గత వందేళ్ల ఆర్ఎస్ఎస్ ఉనికిని చూసినట్లయితే, కుల నిర్మూలన కోసం కులాంతర వివాహాలను అది ప్రోత్సహిస్తుందనడానికి వారి రచనల్లో గానీ, నాయకుల ప్రసంగాల్లో గానీ ఎలాంటి ఆధారాలు లేవు. కులాంతర వివాహం వివిధ వృత్తులు కలిగిన రెండు వేరు వేరు వర్గాల మధ్య రక్త సంబంధాలను మార్పిడి చేస్తుందని డా. బి.ఆర్ అంబేడ్కర్ సూచించారు. ఇది ఇద్దరు భాగస్వాముల కులాన్ని బలహీనపరచడమే కాకుండా, వారి సంతానపు మానసిక, శారీరక సామర్థ్యాలను మెరుగు పరుస్తుంది. బహుశా అలాంటి కులాంతర వివాహాన్ని రుజువు చేయడానికి ఆయన సవితా అంబేడ్కర్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె బ్రాహ్మణ కుటుంబ నేపథ్యం నుండి వచ్చారు. సాధారణంగా పాశ్చాత్య సంస్కృతితో మాంసాహారం తినే దళితుడు, భారతీయ వాతావరణంలో మాత్రమే పెరిగిన బ్రాహ్మణ స్త్రీ తమ వైవాహిక జీవి తంలో ఎలాంటి సర్దుబాట్లు చేసుకున్నారు అనే సమాచారం మన వద్ద లేదు. అంబేడ్కర్, సవిత తమ ఆహారాన్ని పూర్తి శాకాహారంగా గానీ, మిశ్రమ ఆహారంగా గానీ మార్చుకుని ఉండొచ్చు. లేదా ఎదుటివారి ఆహార ఎంపికను మరొకరు గౌరవించి ఉండొచ్చు. ప్రస్తుత వ్యవస్థలో కులాంతర వివాహం అన్ని కులాలకు చెందిన భారతీయ యువత ఉన్నత విద్యను అభ్యసిస్తున్నందున కులాంతర వివాహాల పరిధి పెరుగుతోంది. అవి జరుగుతున్నాయి కూడా. కానీ కులాంతర వివాహాలను సాధారణంగా తల్లిదండ్రులు అంగీకరించరు. ఎందుకంటే ఇది సామాజిక కళంకాన్ని తీసుకొస్తుంది. అనేక సందర్భాల్లో, ముఖ్యంగా ఒక భాగస్వామి దళి తుడు, మరొకరు దళితేతరులు అయినప్పుడు అలాంటి వివాహితు లను చంపడం ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. అధికారంలో ఉన్న బీజేపీకి మార్గదర్శకంగానూ, భారతదేశంలోని అతిపెద్ద సామాజిక సంస్థగానూ ఉన్న ఆర్ఎస్ఎస్ ఈ సమస్యతో ఎలా వ్యవహరిస్తుందో సమాజానికి తెలియదు. ఈ సంస్థ నాయకులు సనా తన ధర్మం లేదా హిందూ సంప్రదాయం గురించి నిరంతరం మాట్లాడుతుంటారు. కులాంతర వివాహాలు సనాతన ధర్మంలో లేక హిందూ సంప్రదాయంలో భాగమేనా అన్నది వాళ్లు స్పష్టం చేయాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కుల నిర్మూలన ఒక క్లిష్టమైన యత్నం. కుల నిర్మూలన గురించి మాట్లాడటం మంచిదే. అదే సమయంలో దానికి గల మార్గాలను, సాధనాలను వివరించాలి. కులాలు, మాంసాహారం, శుద్ధ శాకాహారులు కుల వ్యవస్థ భారతీయుల మధ్య భోజనాన్ని ప్రధాన సమస్యగా మార్చింది. శతాబ్దాలుగా దేశంలోని వివిధ కులాల ప్రజలు పక్క పక్కనే కూర్చుని భోంచేయడం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఆధునిక రెస్టారెంట్ వ్యవస్థలు కుల రహితంగా తినే వీలును కల్పించాయి. కానీ గ్రామాల్లో ఇప్పటికీ ఇది పెద్ద సమస్య. అనేక పాఠశాలల్లో దళితులు వండిన ఆహారాన్ని దళితేతరులు తినడం లేదు. ఈ పరంపరకు వ్యతి రేకంగా ఆర్ఎస్ఎస్ స్పష్టమైన వైఖరిని తీసుకోలేదు. శాకాహారం, మాంసాహారం అనే సమస్య ప్రస్తుతం చాలా ఐఐటీలు, ఇతర కేంద్ర విద్యా సంస్థల్లో తీవ్రమైన సమస్యగా మారింది. కొంతమంది కేంద్ర మంత్రులు ఆర్ఎస్ఎస్ శాకాహార సంస్కృతిలో భాగమయ్యారు. పైగా వారు పూర్తి శాకాహార మెనూని అవలంబించాలని ఆయా సంస్థలను కోరుతున్నారు. కేంద్ర విద్యాసంస్థల్లో, విశ్వ విద్యాలయాలలో శాకాహారం మాత్రమే అందించాలని ఆదేశాలను పంపిన మొదటి విద్యా మంత్రి స్మృతి ఇరానీ. ముంబై ఐఐటీతో సహా ఇతర ఐఐటీల అధిపతులు శాకాహారం, మాంసాహారం తినేవారికి వేర్వేరు వసతి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటన్నింటికీ కారణం సనాతన ధర్మాచరణకు చెందిన శాకాహార భావజాలమే. ముస్లింలను, క్రైస్తవులను విడిచిపెట్టండి... శూద్రులు, దళితులు, ఆదివాసీలు భారతదేశంలో ప్రధానంగా మాంసాన్ని, లభ్యత ఆధారంగా శాకాహారాన్ని తినడం ద్వారా జీవిస్తున్నారు. కానీ పండుగ సందర్భాలలో వారికి ఇష్టమైనది మాంసాహారమే. ఆహార సాంస్కృతిక పరంపరలో స్పష్టమైన కుల వర్ణ విభజన ఉంది. ఆర్ఎస్ఎస్ తన స్వచ్ఛమైన శాకాహార సంస్కృతిని వదులుకుంటుందా? బహిరంగ, వ్యక్తిగత ప్రదేశాలలో ప్రజలు తమకు నచ్చిన ఆహారాన్ని తినడం గురించి ఏ వైఖరిని తీసుకుంటుంది? హిందూ లేదా హిందూత్వ ఆహార సంస్కృతి ఏమిటి? ఇది స్వచ్ఛమైన శాకాహారమా లేదా వ్యక్తిగత ఎంపిక ఆధారంగా మిశ్రమ ఆహారమా? వ్యక్తిగత ప్రాధాన్యాల ఆధారంగా ఆహార సంస్కృతిని ప్రజా స్వామ్యీకరించడం కుల నిర్మూలన చర్యల్లో ఒకటి. కానీ ఆర్ఎస్ఎస్ నాయకులు కుటుంబాల ఆహార స్వేచ్ఛ గురించి ఎప్పుడూ మాట్లాడ లేదు. ఉదాహరణకు దక్షిణ భారతదేశంలో శూద్రులు, దళితులు, ఆదివాసీలందరూ మాంసాహారాన్ని తింటుంటారు. బ్రాహ్మణులు, వైశ్యులు కులపరంగా శాకాహారులు. వారి పిల్లలకు అలాగే తినేలా శిక్షణ ఇస్తారు. ఈ పద్ధతులను ప్రస్తావించకుండా ఆర్ఎస్ఎస్ కులాన్ని ఎలా నిర్మూలిస్తుంది? కుల నిర్మూలనకు దశలవారీగా ఉపయోగపడే నాలుగు సామాజిక సాధనాలను నేను గుర్తించాను. వాటి గురించి ఈ సంస్థ మౌనంగా ఉంది. 1) తాము హిందువులని ఆర్ఎస్ఎస్ భావించే అన్ని కులాలకు దేవాలయాలలో అర్చకత్వ హక్కులు కల్పించాలి. దళితులు, ఆదివాసీలు, శూద్రులతో సహా అన్ని కులాల కోసం వాటిల్లో ప్రవేశానికి హక్కు కల్పించేలా ధార్మిక పాఠశాలలను, కళాశాలలను తెరవాలి. 2) చర్మశుద్ధి నుండి కుండల తయారీ వరకు అన్ని వృత్తుల గౌరవం పెరిగేలా బోధనా సామగ్రిని రూపొందించాలి. 3) దేశం, సమాజం, కుటుంబం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మంచిదని ప్రచారం చేయడం ద్వారా కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. 4) మాంసాహారం, శాకాహారంతో సంబంధం లేకుండా ఇతరుల ఆహార ఎంపికను గౌరవిస్తూ కలిసి భోంచేసేలా చూడాలి. ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుతో సహా, శుద్ధ శాకాహారమే హిందూ లేదా భారతీయ ఆహార సంస్కృతిగా జరుగుతున్న ప్రచారాన్ని నిలిపివేయాలి. కుల నిర్మూలన గురించి ఆర్ఎస్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాలపై తన వైఖరిని స్పష్టంగా తెలియ జేయాలి. కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
విద్యా వ్యవస్థపై సినీ విమర్శనాస్త్రం
ఆర్. నారాయణ మూర్తి ‘యూనివర్సిటీ: పేపర్ లీక్’ అనే కొత్త సినిమా తీశారు. అది ఇటీవల విడుదలయింది. మూర్తి ఆహ్వానం మేరకు, ప్రైవేట్ థియేటర్లో ప్రీ–రిలీజ్ స్పెషల్ షో చూశాను. నారాయణ మూర్తి ప్రభుత్వ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా, పోలీస్ ఆఫీసర్‌గా డబుల్ యాక్షన్‌లో ప్రధాన పాత్రలో నటించారు. నేటి విద్యా వ్యవస్థను ఎడ్యుకేషన్ మాఫియా ఎలా తన గుప్పిట పెట్టుకుంటున్నదో చూపించిన కమర్షియల్ సినిమా ఇది. మొట్టమొదటిసారిగా పాఠశాల, విశ్వవిద్యాలయ స్థాయి విద్యా మాధ్యమం మీద, ప్రభుత్వ సదుద్దేశానికీ విద్యారంగంలో ప్రైవేట్ మాఫియా విధ్వంసక పాత్రకూ మధ్య వైరుద్ధ్యంపై ఒక సినిమా రూపొందించారు. ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్ మీడియం అమలు చేయాలనే సాహసోపేతమైన నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం చేస్తున్న కొత్త ప్రయోగం లేకుండా, చంద్రబాబు నాయుడు మద్దతు ఉన్న ప్రైవేట్ మాఫియా ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణలో కూడా ప్రతికూల పాత్ర పోషిస్తుండటం లేకుండా ఈ సినిమా తీయడం అసాధ్యం. ఒక తెలుగు పండితుడు తన ఎనిమిది వేళ్లకు వజ్రాల ఉంగరాలు ధరించి ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ‘దేశభాషలందు తెలుగు లెస్స’ ఎందుకవుతుందో గర్జిస్తూ పాఠాలు చెప్పే సన్నివేశంతో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. తెలుగువారంతా తెలుగు మాధ్యమంలోనే చదవాలనీ, తెలుగువారు కేవలం తెలుగు మాధ్యమంలో చదివితేనే తెలుగువారి ఆత్మగౌరవం, జ్ఞానం విశ్వగురువు అవుతాయని ఆయన చెప్తారు. కానీ అదే తెలుగు పండితుడు ఓ పెద్ద ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ కాలేజీని దాని అసలు యజమానిని మోసం చేసి సొంతం చేసుకుంటాడు. దానిని ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా మారుస్తాడు. ఆ తర్వాత విపరీతమైన ఫీజుల ద్వారా ప్రజలను దోచుకోవడం ప్రారంభిస్తాడు. ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుతున్న ఒక తెలివైన విద్యార్థి అన్నీ ఫస్ట్ ర్యాంకులు పొందుతున్న ఈ ప్రైవేట్ యూనివర్సిటీకి పంపాలంటూ తల్లి తండ్రులపై ఒత్తిడి చేస్తాడు. అప్పటికే అతడి తల్లి ఈ పిల్లవాడి చదువుకోసం పుస్తెలతాడు అమ్మి ఉన్నందున, అతని తండ్రి తన కిడ్నీని అమ్మి, అతడిని తెలుగు పండిట్ నిర్వహిస్తున్న ప్రైవేట్ ఇంగ్లీషు మీడియం యూనివర్సిటీలో చేర్పిస్తాడు. నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలకు లాగే, అన్ని నంబర్ వన్ ర్యాంకులూ తెలుగు పండిట్ సొంత విశ్వవిద్యాలయ విద్యార్థులకే వచ్చాయి. అతని విశ్వవిద్యాలయ ప్రకటనలు ఎంత ప్రాచుర్యం పొందాయంటే, గ్రామస్థులు కూడా పుస్తెలమ్ముకుని మరీ వారి అబ్బాయిలను, అమ్మా యిలను ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయానికి పంపేంతగా. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య కోసం ప్రజానీకం పోరాడుతున్నప్పుడు వారిపై దాడి చేసేందుకు ఈ తెలుగు పండితుడు పోలీసులకు లంచం ఇస్తాడు. మంత్రులకు లంచం ఇవ్వ డానికి కూడా ప్రయత్నిస్తాడు కానీ ఇప్పుడిక్కడ నిజాయతీపరుడైన ఈ ముఖ్యమంత్రి ఉన్నారు. తర్వాత ఈ యూనివర్సిటీ వ్యవహారాలపై ఆయన విచారణకు ఆదేశిస్తాడు. తెలుగు పండితుడు అన్ని దిగువ స్థాయి ప్రభుత్వ వ్యవస్థ లనూ కొనుగోలు చేస్తాడు. పైగా పేపర్ల లీకేజీకి పాల్పడతాడు. తన విశ్వవిద్యాలయంలోని ధనవంతులైన విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకొని వారి బదులు విద్యార్థులు కాని బయటి వారితో పరీక్షలు రాయిస్తాడు. పరీక్షా పత్రాలు దిద్దే మాస్టర్లకు డబ్బు చెల్లించడం ద్వారా ప్రభుత్వ విశ్వ విద్యాలయంలోని తెలివైన విద్యార్థులు ఫెయిలయ్యే వ్యవస్థ కోసం అతను ప్లాన్ చేస్తున్నాడు. అలా ఫెయిలైన కారణంగా ఒక తెలివైన విద్యార్థిని ప్రభుత్వ విద్యాలయం క్యాంపస్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. దీంతో ప్రభుత్వ విద్యాసంస్థలు ఏమాత్రం సరిగా బోధించడం లేదని ప్రజలు భావించేలా చేయగలుగుతాడు. రాష్ట్ర స్థాయి సర్వీస్ కమిషన్ పరీక్షల ప్రశ్న పత్రాలను ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయం కూడా మేనేజ్ చేయగలుగుతుంది. పేద విద్యార్థులు డిగ్రీలు పొందినప్పటికీ వారికి ఉద్యోగాలు రాకుండా తెలుగు పండిట్ మేనేజ్ చేయగలుగుతాడు. తన సొంత విశ్వవిద్యాలయంలోని ఒక నిజాయతీగల విద్యార్థిని... విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరీక్షను ఒకరికి బదులు మరొకరు రాస్తున్న విష యాన్ని తన మొబైల్ ఫోన్‌తో రికార్డు చేసిందనే కారణంతో దారుణానికి ఒడిగడతాడు. ఆ ఏరియా పోలీస్ స్టేషన్‌కి చెందిన తన తొత్తు అయిన సీఐ కుమారుడి గ్యాంగ్‌తో ఆమెను అత్యాచారం చేయించి హత్య చేయిస్తాడు. అలాగే ప్రొఫెసర్ పాత్రలో ఉన్న నారాయణ మూర్తిని సీఐ చంపే స్తాడు, కానీ అదే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పాత్రధారి అయిన నారాయణమూర్తి ఎడ్యుకేషన్ మాఫియా లీడర్ అయిన సీఐని చంపేస్తాడు. నారాయణమూర్తి సినిమాలో సందేశం చాలా స్పష్టంగా ఉంది. ప్రస్తుత ఆంధ్రా మోడల్ విద్యా విధానాన్ని ఆయన ఎత్తిపడుతున్నారు. అదే సమయంలో ప్రైవేట్ విద్యా మాఫియాను ఎండగడు తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రులు అనుస రించిన ప్రైవేట్ అనుకూల విద్యను కేసీఆర్ హయాంలో తెలంగాణలో కొనసాగిస్తున్న విషయం ఆర్. నారాయణ మూర్తి దృష్టిలో ఉంది. ఈ రకమైన సినిమాలు డాక్యుమెంటరీ రూపంలో కూడా చాలా అరుదు, జనాదరణ పొందిన వాణిజ్య సినిమాలను వదిలివేయండి. ప్రైవేట్ మాఫియా విద్య వల్ల ప్రాణాలను, వనరులను కోల్పోతున్న తల్లితండ్రులు, విద్యార్థులు తప్పక చూడాల్సిన సినిమా ‘యూనివర్సిటీ: పేపర్ లీక్’. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఇంటింటా ఇంగ్లిష్ వసంతం
ఈ 2023 అక్టోబర్ 5... 206వ భారతీయ ఇంగ్లిష్ దినోత్సవం. భారతదేశంలో పరిపాలనా భాషగా మనుగడ సాగించిన ఈ 206 సంవత్సరాల్లో ఇంగ్లిష్ అతి సంపన్నుల ఆస్తిగా మిగిలిపోయింది. దేశంలో అతి ధనవంతులు లేక స్థిరమైన వేతనం పొందేవారు మాత్రమే తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్యను చెప్పించగలిగారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నాలుగేళ్ల కాలంలో భారతదేశంలోని విద్యా నమూనానే మార్చివేశారు. ఈ నమూనాలో వ్యవసాయ కార్మికుల పిల్లలు, ఆదివాసీలు, చేతివృత్తుల వారితోపాటు, పేదల్లోకెల్లా నిరుపేదలు కూడా కేవలం ఇంగ్లిష్ మాధ్యమం విద్యనే కాదు, పూర్తిగా భిన్నమైన విద్యను పొందుతున్నారు. మన దేశంలో అతి ధనవంతులు లేక సక్రమంగా ఉద్యోగం చేస్తూ స్థిరమైన వేతనం పొందేవారు మాత్రమే తమ పిల్లలకు పరిమితమైన స్థాయి నుండి ఉన్నత తరగతి ఇంగ్లిష్ మీడియం విద్యను చెప్పించగలిగారు. దేశంలోని అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులందరూ తమ పిల్ల లను ఇంగ్లిషు మీడియంలో చదివించేవారు. నాగాలాండ్ వంటి చిన్న ఈశాన్య రాష్ట్రాలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలందరికీ ఏదో ఒక రకమైన ఇంగ్లిష్ మాధ్యమ విద్యను అందిస్తున్నాయి. రాజధాని ఢిల్లీ నుంచి దేశాన్ని అత్యధిక కాలం పాలించిన భారత జాతీయ కాంగ్రెస్, 15 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన బీజేపీ వంటి జాతీయ పార్టీలు ఇప్పుడు ఇంగ్లిష్ భాషా విద్యను ధనవంతులకు సొంతం చేశాయి. ఈ పార్టీల అభివృద్ధి నమూనాలో పాఠశాల విద్యకు అతితక్కువ ప్రాధాన్యత మాత్రమే లభించింది. వెనుకబడిన నైజాం రాష్ట్రంలో సరైన తెలుగు మీడియం పాఠశాల కూడా లేని ఒక కుగ్రామంలో పుట్టి, ఇంగ్లిష్ నేర్చుకోవడంలో దుర్భ రమైన కష్టాన్ని అనుభవించిన వ్యక్తిగా బతికిన నేను, జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాఠశాల విద్యపై ఇంత శ్రద్ధ చూపుతారని ఎన్నడూ ఊహించలేదు. నా 71 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, విడిపోయిన ఏపీ, తెలంగాణలలో అనేక మంది ముఖ్యమంత్రులను చూశాను. నేను అనేక రాష్ట్రాల్లో పర్యటించాను. ముఖ్యమంత్రుల, ప్రధాన మంత్రుల పరిపాలనా పద్ధ తుల గురించి చదివాను. అయితే పాఠశాల విద్యా కార్యక్రమాలకు ఏపీ ముఖ్యమంత్రి వెచ్చిస్తున్నంత సమయాన్ని ఏ ముఖ్యమంత్రి కానీ, ప్రధాన మంత్రి కానీ వెచ్చించలేదు. గతంలో సిద్ధరామయ్య కర్ణాటకకు మొదటి దఫా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పినరయి విజయన్ రెండు పర్యాయాలు కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను వారితో మాట్లాడి ఆ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని అభ్యర్థించాను. అయితే అగ్రవర్ణ మేధాజీవులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆ ఇద్దరూ భయపడ్డారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో పేదల్లోకెల్లా నిరుపేదలకు ఈ రోజువరకూ ఇంగ్లిష్ మీడియం విద్యను అందించడం లేదు. దీన్ని అలా పక్కన బెడితే రాష్ట్ర విద్యావ్యవస్థ పనితీరును సమీక్షించడానికి ఏ ముఖ్య మంత్రీ జగన్‌లా పాఠశాల విద్యపై ఇంత డబ్బు, సమయం, శక్తి వెచ్చించలేదు. ‘నా రాష్ట్ర పిల్లలకు ఉత్తమమైన విద్యను అందించాలని కోరుకుంటున్నాను, అదే వారి భవిష్యత్ ఆస్తి’ అని జగన్ మోహన్ రెడ్డి పదేపదే చెప్పారు. పాఠశాల, కళాశాల పిల్లల తల్లుల ఖాతాల్లో ఏడాదికి సుమారు 35 వేల రూపాయలు జమ అవుతున్నాయి. ఆ డబ్బును వారు తమ విద్యా అవసరాలకు ఖర్చు చేస్తారు. పిల్లల బూట్లు, బ్యాగుల నాణ్యత, మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్ల సౌకర్యాలు వంటివాటిపై ఏపీ ముఖ్యమంత్రి నిత్యం సమీక్షిస్తున్నారు. దేశంలోని ఏ భాగానికి చెందిన పాఠశాల మౌలిక సదుపాయాలు కూడా భారతదేశ చరిత్రలో ఏపీలోని పిల్లలకు ఉన్న నాణ్యతతో ఎన్నడూ లేవు. ప్రభుత్వ పాఠశాల భవనాల నిర్మాణాన్ని రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి అని ఎప్పుడూ నిర్వచించలేదు. బడా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి వారిని బలిపించడం నుంచి చిన్న కాంట్రాక్టర్ల దిశగా అభివృద్ధి ఆలోచనలను జగన్ మోహన్ రెడ్డి మార్చి వేశారు. ఇలాంటి చిన్న కాంట్రాక్టర్లు ఇప్పుడు గ్రామ, పట్టణ మార్కెట్లలో డబ్బు ఖర్చు చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో వేతనాలు పొందే కార్మికులు గ్రామాలు, పట్టణాలలో విస్తరించారు. ఈ నమూ నాలో అభివృద్ధి పెద్ద నగరాల్లో మాత్రమే కేంద్రీకృతం కాదు. గ్రామ మార్కెట్లు ఎంతగానో పుంజుకుంటాయి. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి ఐదేళ్ల చంద్రబాబు పాలనను, తెలంగాణలో చంద్రశేఖర్ రావు పదేళ్ల పాలనను చూశాను. వారు తమ తమ రాష్ట్రాల్లోని పాఠశాల విద్యా నిర్మాణాలను ఎప్పుడూ సమీక్షించలేదు. ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పుడూ రాష్ట్ర పేద పిల్లల జీవితం, అభివృద్ధి గురించి చర్చించే స్థలంగా ఉండలేదు. పాఠ శాల, కళాశాల విద్యను కార్పొరేట్ వ్యాపార సంస్థలకు అప్ప జెప్పడంలో వీరు పేరొందారు. కానీ జగన్ మోహన్ రెడ్డి గ్రామీణ పాఠశాలలకు వైఫై, స్మార్ట్ టీవీలు ఇవ్వడమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ వినూత్న విద్యా పద్ధతులను సమీక్షిస్తూ, గ్రామీణ పాఠశాలలకు వాటిని జోడిస్తూనే ఉన్నారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల ఆధ్వర్యంలో నడిచే దేశం, రాష్ట్రాలు ఈ ఏడాది భారతీయ ఇంగ్లిష్ దినోత్స వాన్ని జరుపుకోవాల్సిన నేపథ్యం ఇది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి మాట్లాడటం నేను టీవీ ఛానళ్లలో చూశాను. తెలుగు కంటే వారి ఇంగ్లిష్ చాలా బాగుంది. ఎందుకు? వారు అగ్రశ్రేణి ఇంగ్లిష్ మాధ్యమ పాఠశాలల్లోనూ, అమెరికాలో కూడా చదువుకున్నారు. కానీ ఆ కుటుంబం, ఆయన పార్టీ 2019లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడానికి జగన్ కోర్టు పోరాటాలు, మీడియా పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఏపీకి చెందిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎం.వి.రమణ ఆ విధానాన్ని వ్యతిరేకించారు. అయినా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం చదువు తున్న నిరుపేదలకు, తల్లులకు ఆర్థిక సాయంతో జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారు. అలాంటి కార్మిక పిల్లలు ఇంగ్లిష్ మాట్లాడే సుసంపన్న దేశమైన అమెరికాకు వెళ్లి ఐక్యరాజ్యసమితి విద్యా సమావే శాలలో, వైట్ హౌస్‌లో ధైర్యంగానూ, విశ్వాసంతోనూ మాట్లాడారు. ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకుల నుంచి చప్పట్లు స్వీకరించారు. ఇది కచ్చితంగా భారతదేశ భవిష్యత్ పాఠశాల విద్యా వ్యవస్థకు ప్రేరణాత్మక ఉదాహరణ. ఈ రోజు పేదలు, గ్రామ పిల్లలు ఇంగ్లిష్ నేర్చుకోవడంపై సంబ రాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. 1817లో మన జాతీయ జీవనంలోకి వచ్చిన ఇంగ్లిష్ విద్య కొత్త మార్గాన్ని సుగమం చేసింది. కొత్త ఆశను సృష్టించింది. మన విద్యావ్యవస్థలో ఇద్దరు సంస్కర్తలు విలియం కేరీ, రాజా రామ్మోహన్ రాయ్ 206 సంవత్సరాల క్రితం అక్టోబర్ 5న మొదటి పాఠశాలను ప్రారంభించారు. అయితే ఆ భాషా ఫలాలు వ్యవసాయాధారిత ప్రజానీకానికి, పట్టణ పేదల పిల్లలకు ఇప్పటికీ చేరలేదు. ఉన్నత స్థాయి ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్య నుండి వచ్చిన ఏ విద్యావేత్త కూడా సమాన విద్యా మాధ్యమం కోసం పోరాడలేదు. మన దేశంలో ప్రాంతీయ భాషల వేడుకలను ఎవరూ వ్యతిరేకించరు. కానీ అదే సమయంలో భారతీయ ఇంగ్లిష్‌ను సెలబ్రేట్ చేసుకోవడం, ఆ ప్రపంచ భాషని మన గ్రామాల్లోకి విస్తరించడం అనేది మన సొంత రూపాంతరంలో ఇంగ్లిష్‌ని తీర్చిదిద్దుతుంది. 206 సంవత్సరాల పాటు ఇంగ్లిష్ అగ్రవర్ణ ధనవంతులు భద్రపరుచు కున్నదిగా ఉండిపోయింది. ఇంగ్లిష్ భాషను ధనవంతుల ఇళ్లకు, ఉన్నత కార్యాలయాలకు, మాల్ మార్కెట్లకు, విమానాశ్రయాలకు పరిమితం చేయడం నేరం. ఇది గ్రామ మార్కెట్లు, గ్రామ బస్టాప్ లతోపాటు వ్యవసాయ క్షేత్రాలకు చేరుకోవాలి. అక్కడే అది మరింతగా భారతీయతను సంతరించుకుంటుంది. ఏ భాషనూ ఒక వర్గ ప్రజల ఆస్తిగా పరిగణించకూడదు. జగన్ ప్రభుత్వం ఆ తొలి అడుగు వేసింది. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఇండియన్ ఇంగ్లిష్‌ను వేడుకగా జరుపుకొని, ఆ రోజున మన పిల్లలను, యువతను ఒక పుస్తకాన్ని చదివేలా చేద్దాం. కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
నెత్తురంటిన ఆ చేతులెవరివి బాబూ?
కొన్నేళ్ల పాటు మావోయిస్టుగా గడిపిన అజ్ఞాత జీవితం, విప్లవ గాయకుడిగా, గ్రామాల్లో, నగరాల్లో బహిరంగ ప్రదర్శనలు ఇచ్చిన జీవితం, దశాబ్దాలుగా ఎదుర్కొన్న రాజ్య నిర్బంధం అనేవి గద్దర్ పాటను దాదాపు ప్రతి ఇంటికీ మోసుకెళ్లాయి. భారత దేశవ్యాప్తంగా విశిష్టమైన రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక చిహ్నంగా ఆయన ఉండిపోయారు. ప్రభుత్వ ఏజెన్సీలు 1997లో ఆయనపై బుల్లెట్లు పేల్చాయి. దాదాపు 25 ఏళ్లపాటు వెన్నెముకలో దిగిన బుల్లెట్‌తోనే ఆయన జీవించారు. అలాంటి జీవితం మానవ చరిత్రలో కనీవినీ ఎరుగం. ఆ సమయంలో రాష్ట్రపాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేతులకు నెత్తురంటింది. శ్మశానంలో ఉన్న గద్దర్ దేహంలోని బుల్లెట్ దీనికి శతాబ్దాలపాటు సాక్షీభూతంగా నిలుస్తుంది. 2023 ఆగస్ట్ 6న ప్రజాగాయకుడు గద్దర్ అనూహ్య మరణం, కడసారి చూడడానికి తరలి వచ్చిన వేలాది ప్రజల మధ్య బౌద్ధ ఆచారాలతో జరిగిన ఆయన ఖననం... భారతీయ కమ్యూనిస్టులకు కొత్త దారి చూపాయి. గద్దర్ కమ్యూనిస్టు విప్లవ గాయకుడిగా, పాటల రచయితగా, కళాకారుడిగా సుపరిచితుడు. కొన్నేళ్ల పాటు మావోయిస్టుగా గడిపిన అజ్ఞాత జీవితం, విప్లవ గాయకుడిగా, గ్రామాల్లో, నగరాల్లో బహిరంగ ప్రదర్శ నలు ఇచ్చిన జీవితం, దశాబ్దాలుగా ఎదుర్కొన్న రాజ్య నిర్బంధం అనేవి గద్దర్ పాటను దాదాపు ప్రతి ఇంటికీ మోసుకెళ్లాయి. ప్రభుత్వ ఏజెన్సీలు 1997లో ఆయనపై బుల్లెట్లు పేల్చాయి. ఆ సమయంలో రాష్ట్రపాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేతులకు నెత్తురంటింది. శ్మశానంలో ఉన్న గద్దర్ దేహంలోని బుల్లెట్ దీనికి శతాబ్దాల పాటు సాక్షీభూతంగా నిలుస్తుంది. గద్దర్ దేహాన్ని దహనం చేసివుంటే, అది గుర్తించలేని బూడిదగా మారిపోయేది. సజీవమైన చారిత్రక సాక్ష్యం మిగిలి ఉండేది కాదు. మావోయిస్టుగా జీవించినప్పటికీ, బౌద్ధ అంత్యక్రియల ద్వారా బౌద్ధ అంబేడ్కరిస్టుగా మరణించిన ఆయన, శాంతికి ప్రతినిధిగా, 25 సంవత్సరాల పాటు గాయపడిన దేహ బాధితుడిగా మనకు మిగిలిపోయారు. దాదాపు 25 ఏళ్లపాటు వెన్నెముకలో దిగిన బుల్లెట్‌తో ఆయన జీవించారు. అలాంటి జీవితం మానవ చరిత్రలో కనీవినీ ఎరుగం. శరీరంలోని పలు అవయవాల్లో ఆరు బుల్లెట్లు దూరిన స్థితితో ఆయన మనగలిగారు. శరీరంలో ఆరు బుల్లెట్లు దూరినప్పటికీ బతికి, చివరి వరకూ శరీరంలో ఒక బుల్లెట్‌తో జీవించినట్టు యుద్ధంలో పోరాడిన ఏ సైనికుడి గురించీ మనకు తెలీదు. ఆ రకంగా మానవ చరిత్రలోనే గద్దర్ ఒక విశిష్ట వ్యక్తి. అలాంటి జీవితం ఆయన్ని అపార ప్రజాదరణ, ప్రేమాదరణలు కలిగిన మనిషిగా మార్చింది. 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విభజన జరగడానికి ముందున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గద్దర్ పాడిన పాటలు, చేసిన ప్రదర్శనలు ఆయనకు ఎంతోమంది అభిమానులను సాధించిపెట్టాయి. ఆకలి, దోపిడీల నుంచి మానవ విముక్తి లక్ష్యం పట్ల ఆయన వహించిన నిబద్ధత... ఆయన్ని బాధామయ జీవితంలో గడిపేలా చేసింది. అనంతరం 1996 నుంచి 2014 వరకు ప్రత్యేక రాష్ట్రంకోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆయన వహించిన పాత్ర వల్ల ఆంధ్రా ప్రజలు ఆయన పట్ల అయిష్టత ప్రదర్శించి ఉండవచ్చు. అయితే, ఒక రచయితగా, కళాకారుడిగా గద్దర్ భారత దేశవ్యాప్తంగా విశిష్టమైన రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక చిహ్నంగా ఉండిపోయారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు పార్టీ ముందు అనేక తీవ్రమైన సైద్ధాంతిక అంశాలను లేవనెత్తి, 2012లో ఆ పార్టీ నుంచి విడి పోయారు. మార్క్స్, లెనిన్, మావోతోపాటు భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మహాత్మా పూలే, అంబేడ్కర్లను కూడా గుర్తించడం ద్వారా మావోయిస్టు పార్టీ కులానికీ, వర్గానికీ వ్యతిరేకంగా పోరాడాల్సి ఉందని గద్దర్ ప్రతిపాదించారు. భారతదేశంలో కులం ప్రతికూల పాత్ర గురించి పాటలు రాయడం, వేదికల మీద ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. దాంతో మావోయిస్టు పార్టీ గద్దర్ పనిని పార్టీ వ్యతిరేకమైనదిగా పరిగణించడమే కాదు... ఆయన అవగాహనను మార్క్సిజం కాదని ముద్రవేసి, ఆయన ప్రతిపాదనలను తిరస్కరించి, 2010లో షోకాజ్ నోటీసు ఇచ్చింది. విప్లవ పార్టీ తనను బహిష్కరించడం ఖాయమని గ్రహించిన గద్దర్ 2012లో మావోయిస్టు పార్టీకి రాజీనామా చేశారు. అయితే భారతీయ కుల–వర్గ దోపిడీకి అనుగు ణంగా తన పార్టీ పంథాను మార్చడానికి గద్దర్ చేసిన ప్రయత్నం విస్మరణకు గురి కాకూడదు. అంబేడ్కరైట్ నవయాన బౌద్ధమతం పట్ల తన ఆధ్యాత్మిక సామా జిక విధేయతను గద్దర్ బహిరంగంగా ప్రకటించారు. దళితుల, మహిళల అణచివేతపై అనేక పాటలు రాశారు. అతను ఒక యాంత్రిక మార్క్సిస్ట్, బౌద్ధ లేదా అంబేడ్కరైట్ కాదు. అత్యంత సున్నితత్వం కలిగిన మానవుడు. భారతదేశంలోని కమ్యూనిస్టు నాయకులు వర్గపోరాటంతోపాటు సామాజిక సంస్కరణలను అవసరమైన అంశంగా ఎన్నడూ అంగీకరించలేదన్న విషయం అందరికీ తెలిసిందే. భారతీయ సాంఘిక సంస్క రణలో ఆధ్యాత్మిక సంస్కరణతో పాటు శ్రమకు గౌరవం, పురుషులతో స్త్రీల సమానత్వం కూడా భాగమై ఉన్నాయి. దానికి అంతిమ రూపం ఏదంటే కుల అసమానతలను, మహిళల అసమానతలను నిర్మూలించడం. అయితే, భారతీయ కమ్యూనిస్టులు ఆధ్యాత్మిక పరంగా తమను తాము నాస్తికులుగా ప్రకటించుకున్నారు. పైగా, ఆర్థిక నియతి వాదులుగా (ఆర్థికమే అన్నింటినీ నిర్దేశిస్తుంది అనే వాదం) వారు వర్గ ప్రశ్నలపైనే ప్రాథమికంగా దృష్టి పెట్టారు. కానీ వాస్తవానికి వారిలో ఎక్కువ మంది హిందువులుగానే మరణిస్తున్నారు. రోజువారీ జీవితంలో వారి నాస్తికత్వం ఎలాంటి సామాజిక సంస్కరణకు సంబంధించినదిగా లేదు. గద్దర్ తన మరణంతో వారికి ఒక పెద్ద సామాజిక, ఆధ్యాత్మిక సంస్కరణ కార్యక్రమాన్ని అందించారు. అంబేడ్కర్ ఇలా అన్నారు: ‘‘నేను అంటరాని వ్యక్తిని అనే కళంకంతో జన్మించిన దురదృష్టవంతుడిని. అయితే, ఇది నా తప్పు కాదు. కానీ నేను హిందువుగా మరణించను, ఎందుకంటే ఇది నా చేతుల్లో ఉంది.’’ ఇలా ప్రకటించిన తర్వాతే ఆయన బౌద్ధుడు అయ్యారు, బౌద్ధుడిగా మరణించారు. గద్దర్ అంటరాని వ్యక్తిగా జన్మించారు. అది ఆయన చేతుల్లో లేనిది. అనేక సాయుధ దళాలను కలిగి ఉన్న కమ్యూనిస్ట్ విప్లవ పార్టీలో పనిచేశారు. ఆయన వారి ప్రజా యుద్ధ నౌక. అయితే మరణ సమయంలో తన చేతుల్లో ఉన్న అధికారాన్ని ఉపయోగించి శాంతి సందేశంతో బౌద్ధుడిగా మరణించిన అంబేడ్కర్ జీవన సారాంశాన్ని గద్దర్ గ్రహించారు. తాను జీవితాంతం సమర్థించిన తుపాకులు ఆ అంటరానితనం నుండి విముక్తి చేయలేదు. అందువల్లనే గద్దర్ బౌద్ధుడయ్యారు, అంటరానితనం నుండి విముక్తి పొందారు. ముఖ్యంగా, బూటకపు ఎన్కౌంటర్లలో చిత్రహింసలు పెట్టి, వంద లాది మృతదేహాలను తగులబెట్టిన ఆ రాజ్య వ్యవస్థకు వ్యతి రేకంగా పోరాడిన వ్యక్తిగా, తన శరీరాన్ని, బుల్లెట్‌ని దహనం చేసేస్తే ఆ తర్వాత తనను హింసించినట్లు ఎటువంటి ఆధారాలు మిగిలి ఉండ వని గద్దర్ గ్రహించారు. ఆ మృతదేహాలను ఖననం చేసినట్లయితే, దశాబ్దాల తర్వాత కూడా వాటిని వెలికితీసి మళ్లీ పరీక్షించవచ్చు. అందువల్ల గద్దర్ తన శరీరంలోని బుల్లెట్‌తో పాటు ఖననం చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. 1997లో చంద్రబాబు నాయుడి క్రూర పాలనకు నిదర్శనంగా ఆయన వెన్నులో బుల్లెట్ అలాగే ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చంద్రబాబు కబ్జా చేసిన పార్టీకి ఆయన మామ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అని పేరు పెట్టారు. అదే సమయంలో గద్దర్ తెలుగు నేల అందించిన అత్యంత శక్తిమంతమైన తెలుగు రచయిత, గాయకుడు, సంభాషణకర్త. గద్దర్ నివసించిన బస్తీలో మహాబోధి విద్యాలయం పేరుతో ఆయన స్థాపించిన ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుల్లెట్‌తోపాటు ఆయన భౌతికకాయాన్ని ఖననం చేశారు. చంద్రబాబు ఆ సమాధి వద్దకు వెళ్లి, సాష్టాంగ నమస్కారం చేసి, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1997 ఏప్రిల్ 6న ఏమి జరిగిందో కనీసం ఇప్పుడైనా నిజం చెప్పినట్లయితే, దేశం మొత్తం చంద్రబాబుని క్షమిస్తుంది. అలా పశ్చాత్తాపం ప్రకటించిన తర్వాత చంద్రబాబు తన జీవితాంతం కచ్చి తంగా మనిషిగా జీవించగలరు. కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
జవ సత్వాలున్న జన గళం
ప్రజా గాయకుడిగా, ప్రజా ఉద్యమ గేయ రచయితగా దశాబ్దాల పాటు శ్రామిక, ఉత్పాదక రంగాలలోని పీడితుల్ని, అధికార వర్గాల పీడనల్ని ప్రతిబింబించిన నెత్తుటి, నిలువెత్తు మట్టి మనిషి గద్దర్. ఆయన ఆలోచన, రచనలు... ఆధునాతనంగానూ, గ్రామీణంగానూ రెండు విధాలుగా సాగాయి. గద్దర్ అంబేడ్కరిజంలోకి మారాక కుల వ్యవస్థ, అంటరానితనాలకు వ్యతిరేకంగా అనేక జానపద గేయాలు రాశారు. స్త్రీ జీవితం, ఆమె పడుతున్న శ్రమ, మానవత్వాలపై లోతైన తాత్వికతతో పాటలు కూర్చారు. ఆయన భౌతికకాయం, అందులో మిగిలి ఉన్న తుపాకీ తూటా సహా ‘మహాబోధి’ప్రాంగణంలో ఖననం అయినప్పటికీ... విముక్తి పోరాటానికి ఆయన రాసిన పాటలు ఎప్పటికీ సజీవంగా జనంలో ఉండిపోతాయి. న్యాయం కోసం తనకు తానుగా ఒక ప్రజా గీతంగా, ఒక ప్రజాయుద్ధ నౌకగా అవతరించిన గద్దర్ (75) – గుమ్మడి విఠల్ – ఆగస్టు 6న కన్నుమూశారు. ప్రజా గాయకుడిగా, ప్రజా ఉద్యమ గేయ రచయితగా దశాబ్దాల పాటు శ్రామిక, ఉత్పాదక రంగాలలోని పీడితుల్ని, అధికార వర్గాల పీడనల్ని ప్రతిబింబించిన నెత్తుటి, నిలువెత్తు మట్టి మనిషి గద్దర్. ప్రజా గేయ రచయితగా ఎదుగుతున్న క్రమంలో 1970లలో గద్దర్ రాసిన పాట తెలుగునాట మోతెత్తిపోయింది. సిరిమల్లె సెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మా / నీవు సినబోయి గూసున్న వెందుకమ్మో ఎందుకమ్మా రాడికల్ విద్యార్థి ఉద్యమం వైపు మళ్లి, తర్వాత ఒక జాతీయ బ్యాంకులో క్లర్కుగా చేసి, కొంతకాలానికే ఆ ఉద్యోగాన్ని వదిలి, తిరిగి ఉద్యమంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత, నక్సలైట్ ఉద్యమంగా ప్రసిద్ధి చెందిన కమ్యూనిస్టు విప్లవోద్యమంలో పూర్తి సమయం గాయ కుడిగా మారారు. చిన్న చిన్న సభల్లో, కొన్నిసార్లు వీధుల్లో పాటలు పడుతూ, జనాన్ని సమీకరిస్తూ సీపీఐ–ఎంఎల్ (పీపుల్స్ వార్)లో అందరికీ తెలిసిన వ్యక్తి అయ్యారు. పీడిత వ్యవసాయ ఉత్పాదక రంగ ప్రజానీకం మీద; భూస్వాముల దోపిడీలు, దౌర్జన్యాల మీద తనదైన శైలిలో పాటలు రాసి, పాడి, భారతదేశ సాంస్కృతిక రంగాన్ని కదం తొక్కించారు. సాయుధ విప్లవం మాత్రమే ప్రస్తుత వ్యవస్థకు ప్రత్యా మ్నాయాన్ని నిర్మించగలదని చాలాకాలం పాటు నమ్మికతో ఉన్నారు. గద్దర్ అనే తన పేరును ఆయన అమెరికా గదర్ ఉద్యమం నుంచి తీసుకున్నారు. చివరికి ఆ పేరు మావోయిస్టు పోరాటాలకు భారతీయ చిహ్నంగా మారింది. 1997లో గద్దర్ అజ్ఞాతం నుంచి జన జీవన స్రవంతిలోకి వచ్చినప్పుడు ఆయనపై జరిగిన కాల్పులలో ఐదు తూటాలు ఆయన శరీరంలోకి దిగబడ్డాయి. వైద్యులు నాలుగు తూటా లను బయటికి తీయగలిగారు. మిగతా ఒక తూటా మొన్నటి రోజున ఆయన అంతిమ శ్వాస తీసుకునే వరకు పాతికేళ్లకు పైగా ఆయన శరీరం లోపలే ఉండిపోయింది. ధైర్యం, దృఢచిత్తం, వివేకం, వినయం... అదే సమయంలో చిన్న పిల్లవాడి మనస్తత్వం. ఇవీ గద్దర్‌లోని గుణాలు. క్రమంగా ఆయనకు తెలిసి వచ్చినదేమంటే... మావోయిస్టు విప్లవం ఎక్కడికీ దారి తీయడం లేదని. దాంతో దళిత ఉద్యమం వైపు మళ్లి, ప్రజాదరణ పొందే విధంగా పాటలు రాయడం, పాడటం మొదలుపెట్టాడు. 1985లో కారంచేడు కమ్మ భూస్వాములు ఎనిమిది మంది దళితులను దారుణంగా హత్య చేసినప్పుడు ఆయన రాసిన పాట ఇది: కారంచెడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరుచేసిన దళిత పులులమ్మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని యావత్ దళితులను ఏకం చేసేందుకు ఈ పాట ఆయుధంగా మారింది. అక్కడి నుంచి ఆయన అంటరాని తనం, అంబేడ్కరిజం, రాజ్యాంగవాదంపై పాటలు రాయడం ప్రారంభించారు. 1990లో మండల్ వ్యతిరేక ఉద్యమం దేశమంతటా వ్యాపించింది. సామాజిక న్యాయం, ప్రతిభ అన్నవి మండల్ అనుకూల,మండల్ వ్యతిరేక శక్తుల సైద్ధాంతిక లంగర్లు అయ్యాయి. కమ్యూనిస్టు విప్లవకారులు కూడా తమ అగ్రవర్ణ నాయకుల నేతృత్వంలో స్పష్టమైన వైఖరిని తీసుకోడానికి వెనుకంజ వేస్తున్నారు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ అప్పటి ఎడిటర్ అరుణ్‌శౌరీ మేధోపరమైన మండల్ వ్యతిరేక ఉద్య మానికి నాయకత్వం వహించారు. ఆ సమయంలో గద్దర్ రాసిన పాట మండల్ అనుకూల శక్తులకు ఆయుధంగా మారింది. అరుణ్శౌరిగో నీకు ఆకలి బాధేమెరుక నెయ్యి కాడ నువ్వుంటే పియ్యికాడ మేముంటం ఈ పాట చాలామంది అగ్రవర్ణ విప్లవకారులకు నచ్చలేదు. కానీ మండల్ రిజర్వేషన్లు అమలు చేయాలని పోరాడుతున్న ఓబీసీ/ ఎస్సీ/ ఎస్టీలకు స్ఫూర్తినిచ్చేందుకు గద్దర్ ఆ పాటను బహిరంగ సభలలో పాడుతూనే ఉన్నారు. 1990వ దశకం చివరిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని మావోయిస్టులు నిర్ణయించుకున్నారు. మెల్లిగా గద్దర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మూల శక్తిగా మారారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా... బలే.. బలే.. బలే... ఈ పాట తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచింది. గద్దర్ ఎప్పుడూ టీఆర్ఎస్కు బహిరంగ మద్దతుదారు కానప్పటికీ మావోయి స్టుల మద్దతుతో సమాంతర రాడికల్ తెలంగాణ అనుకూల గ్రూపు లను నడిపించారు. ఈ క్రమంలో మావోయిస్టు భావజాలంతో గద్దర్ వ్యతిరేకించారు. వర్గపోరు మాత్రమే సరిపోదు, కులపోరాటాన్ని చేపట్టాలని భావించారు. అనేక విముక్తి బలాలను కలిగి ఉన్న భారత రాజ్యాంగాన్ని గుర్తించడం ప్రారంభించారు. భారత రాజ్యాంగం పట్ల, అంబేడ్కర్ పట్ల తమ దృక్పథాన్ని మార్చుకోవాలని మావోయిస్టులను ఒప్పించేందుకు పార్టీతో అంతర్గతపోరును సాగించారు. అయితే సహజంగానే వారు తమ పాత వర్గ పోరాట పంథాను మార్చుకోడానికి నిరాకరించారు. దాంతో పార్టీ నుంచి బయటికి వచ్చి నేటి భారత రాజ్యాంగాన్ని సమర్థించిన, సమర్థిస్తున్న అనేక ఇతర శక్తులతో కలిసి పని చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విభిన్న రాజకీయ, సైద్ధాంతిక శక్తులతో సన్నిహితంగా మెలిగారు. అప్పటికే గద్దర్‌పై ఆయన మావోయిస్టుగా ఉన్నప్పటి కేసులు అనేకం ఉన్నాయి. ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలైంది. ఆ సమయంలోనే కొంత కాలం గద్దర్, నేను... సీపీఎం మద్దతు ఉన్న బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్‌లో కలిసి పని చేశాం. మరోవైపు ఆయన కాంగ్రెస్‌తోనూ సత్సంబంధాలు కొనసాగించారు. తెలంగాణలో రాహుల్ గాంధీ ప్రసంగించిన కొన్ని బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఢిల్లీలో రాహుల్‌ను, సోనియాగాంధీని కలిశారు. గద్దర్ జీవితం వీరోచిత పోరాటాల అవిశ్రాంత గాథ. ఒక్క రెండు పాటలు తప్ప మిగతా ముఖ్యమైన పాటలన్నీ తనే రాసి, పాడినవి. గద్దర్ పాడటంతో ప్రాచుర్యం పొందిన ‘బండెనక బండి కట్టి’ పాట 1940లలో నిజాంకు, రజాకర్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా పోరాటంలో యాదగిరి రాసినది. రెండో పాట: ఈ ఊరు మనదిర, ఈ వాడ మనదిర / దొర ఏందిరో, వాని పీకుడేందిరో. ఈ పాటను మరో ప్రముఖ దళిత గాయకుడు, రచయిత గూడ అంజయ్య రాశారు. గద్దర్ తన గళంతో ఆ పాటను ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు ప్రతి పల్లెకు తీసుకెళ్లారు. గద్దర్ ఆలోచన, రచన... ఆధునాతనంగానూ, గ్రామీణంగానూ రెండు విధాలుగా సాగాయి. గద్దర్ అంబేడ్కరిజంలోకి మారాక కుల వ్యవస్థ, అంటరానితనాలకు వ్యతిరేకంగా అనేక జానపద గేయాలు రాశారు. స్త్రీ జీవితం, ఆమె పడుతున్న శ్రమ, మానవత్వాలపై లోతైన తాత్వికతతో పాటలు కూర్చారు. వంటపని, వీధుల పారిశుధ్యం,ఇంటిని శుభ్రంగా ఉంచే హింసాత్మక శ్రమలలోని నొప్పిని పాటలుగా మలిచారు. ఇంటికి చీపురు చేసే సేవలోని గొప్పతనంపై ఆయన రాసి, పాడిన పాట అత్యంత తాత్వికమైనది. అంబేడ్కర్ అడుగుజాడల్లో గద్దర్ తన పూర్వపు కమ్యూనిస్టు నాస్తికత్వాన్ని పక్కనపెట్టి సరైన బౌద్ధేయుడు అయ్యారు. గద్దర్ భౌతికకాయం, అందులో మిగిలి ఉన్న తూటా సహా ‘మహాబోధి’ (పేద పిల్లల కోసం ఆయనే స్థాపించిన పాఠశాల) ప్రాంగణంలో ఖననం అయినప్పటికీ, మానవ సమానత్వంపై ఆయన ప్రేమ, విముక్తి పోరాటానికి ఆయన రాసిన పాటలు ఎప్పటికీ సజీవంగా జనం జీవనంలో ఉండిపోతాయి. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
సంస్కృతంలో వాళ్లెందుకు రాయరు?
సంస్కృతాన్ని ఇష్టపడే కొందరు భారతీయ అమెరికన్లు తమ పుస్తకాలను సంస్కృతంలో ఎందుకు రాయరు? వీరు ఆంగ్లంలో రాస్తూనే, ఆ భాషను వలసవాదమంటూ దాడి చేస్తారు. చారిత్రకంగా సంస్కృతాన్ని కొందరు రచయితలే నియంత్రించారు. వారు దాని ప్రాప్యతను, విస్తృతిని పరిమితం చేశారు. శూద్రులకు ఆ భాషలో చదవడానికి, రాయడానికి గల అవకాశాన్ని నిరాకరించారు. కానీ, ఇప్పుడు వాళ్లూ సామాజికపరమైన లేదా విద్యాపరమైన ప్రాముఖ్యం కలిగిన పుస్తకాలు రాయడానికి సంస్కృతాన్ని ఉపయోగించడం లేదు. అలా సంస్కృత అంతర్ధానానికి చైతన్యవంతంగా బాధ్యత వహిస్తున్నారు. అయినా ఆ అంతర్ధానానికి మాత్రం మిగిలిన ప్రపంచాన్ని నిందిస్తూ ఉంటారు. దాదాపుగా భారతీయ అమెరికన్లతో కూడిన రాజీవ్ మల్హోత్రా నేతృత్వంలోని బృందం ఇటీవల ‘టెన్ హెడ్స్ ఆఫ్ రావణ: ఎ క్రిటిక్ ఆఫ్ హిందూఫోబిక్ స్కాలర్స్’ పుస్తకాన్ని ప్రచురించింది. ఇంగ్లిషులో రాసిన ఈ పుస్తకం... ఈ రచయితతో సహా రొమిల్లా థాపర్, ఇర్ఫాన్ హబీబ్, శశిథరూర్, రామచంద్ర గుహ, దేవదత్ పట్నాయక్, షెల్డన్ పొలాక్, వెండీ డోనిగర్, ఆద్రీ త్రూష్కే, మైకేల్ విట్జెల్లను విమర్శించింది. మల్హోత్రా బృందం ఈ పండితులను పౌరాణిక పాత్ర అయిన రావణుడితో పోల్చింది. ఈ పండితులు ప్రాచీన సంస్కృత పుస్తకాలు ప్రబోధించిన ధర్మాన్ని చంపేశారని ఆరోపించింది. ‘చారిత్రక రావణుడికి మల్లే ఈ పండితుల రచనల్లో నేడు చాలామంది హిందువులు అధర్మంగా భావిస్తున్న అంశాలు ఉన్నాయి కాబట్టే ఈ పుస్తకంలో పది మంది సమకాలీన విద్వాంసులను లక్ష్యంగా’ ఎంచుకున్నట్లు మల్హోత్రా తన పరిచయంలో పేర్కొన్నారు. ఈ పుస్తకంలో లక్ష్యంగా ఎంచుకున్న నలుగురు విదేశీ పండితులు సంస్కృత భాషపై కృషి చేశారు. చాలాకాలం వివిధ పాశ్చాత్య విశ్వ విద్యాలయాలలో సంస్కృత భాషను బోధించారు. మరోవైపు, మల్హోత్రాకు అమెరికాలో ‘ఇన్ఫినిటీ ఫౌండేషన్’ అనే ఆర్థిక నెట్వర్క్ ఉంది. ఈ పుస్తకాన్ని ప్రచురించిన ఢిల్లీలోని ‘గరుడ ప్రకాశన్ ’ సంస్థనూ నడుపుతున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే: సంస్కృతాన్ని ఇష్టపడే ఈ భారతీయ అమెరికన్లు తమ పుస్తకాన్ని సంస్కృతంలో ఎందుకు రాయలేదు? వీరు ఆంగ్లంలో రాస్తూనే, ఆ భాషను వలసవాదమంటూ దాడి చేస్తారు. సంస్కృతాన్ని గొప్ప ప్రపంచ సజీవ భాష అంటారు, కానీ ఆ భాషలో ఏ గ్రంథాన్నీ రాయరు. సంస్కృతాన్ని మృత భాష అని షెల్డన్ పొల్లాక్ సరిగ్గానే అన్నారు. తమ దైనందిన జీవితంలో సంస్కృతాన్ని ఉప యోగించే, అందులో భావ వ్యక్తీకరణ చేసే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఒక భాషను స్థానికంగా మాట్లాడేవారు లేనప్పుడు భాష మరణిస్తుంది. ఆధిపత్య నియంత్రణను కొనసాగించడానికి సంస్కృతాన్ని ఉపయోగించే వ్యక్తుల సమూహమే ఆ భాషను చంపేసింది. చారిత్రకంగా సంస్కృతాన్ని కొందరు రచయితలే నియంత్రించారు. వారు దాని ప్రాప్యతను లేదా విస్తృతిని పరిమితం చేశారు. శూద్రులకు ఆ భాషలో చదవడానికి లేదా రాయడానికి గల అవకాశాన్ని నిరాకరించారు. సామాజికపరమైన లేదా విద్యాపరమైన ప్రాముఖ్యం కలిగిన పుస్తకాలు రాయడానికి సంస్కృతాన్ని ఇప్పుడు వాళ్లూ ఉపయోగించడం లేదు. అలా సంస్కృత అంతర్ధానానికి చైతన్యవంతంగా బాధ్యత వహిస్తున్నారు. కానీ ఆ అంతర్ధానానికి మిగిలిన ప్రపంచాన్ని నిందిస్తూ ఉంటారు. ఇతర సంస్కృతులకు చెందిన యూదుల వంటివారు తమ ఆధునిక పుస్తకాలను హీబ్రూలో రాస్తున్నారు. యువల్ నోవా హరారీ ప్రభావవంతమైన రచన ‘సేపియన్స్– ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్’ను మొదట హీబ్రూలోనే రాశారు. అలాగే గ్రీకులు గ్రీకు భాషలో రాస్తారు. అరబ్బులు అరబిక్‌లోనే రాస్తారు. బ్రాహ్మణ వాదులు మాత్రం సంస్కృతంలో రాయరు. శూద్ర, దళిత, ఆదివాసీ ప్రజానీ కాన్ని మోసం చేయడానికి మాత్రమే సంస్కృతాన్ని పొగడటాన్ని నేటికీ కొనసాగిస్తున్నారా? బ్రాహ్మణవాద మేధావులకు ఆరెస్సెస్, బీజేపీ ఆర్థికంగా, సంస్థాగతంగా మద్దతు ఇస్తున్నాయి. భారతదేశ వ్యవసాయ చేతివృత్తుల చరిత్రను విస్మరిస్తూ సంస్కృత గతాన్ని మాత్రమే వీరు కీర్తిస్తున్నారు. వివిధ విభాగాలలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న జ్ఞానాన్నంతటినీ సంస్కృత గ్రంథాలైన వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, రామాయణం, మహాభారతాల నుండే దొంగిలించారనే భావనను ప్రచారం చేస్తారు. బ్రాహ్మణవాద శాస్త్రవేత్తలు కూడా ఆధునిక విజ్ఞాన శాస్త్రాలన్నీ ప్రాచీన సంస్కృత పుస్తకాలలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పండితుల్లో ఎంతమంది సంస్కృతంలో ఆ పుస్తకాలను చదివారు? సంస్కృతంలో ఇంత అపారమైన సృజనాత్మక శక్తి ఉన్నట్లయితే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న భారతీయ మేధావులు... ప్రపంచ తాత్విక, మే«ధాపరమైన రచనలను హరారీ వంటి వ్యక్తులకు ఎందుకు వదిలివేస్తున్నారు? భారతదేశ చరిత్ర పొడవునా సంస్కృతాన్ని ‘మాతృభాష’గా కాకుండా ‘పితృభాష’గా పరిగణిస్తూ వచ్చారు. సంస్కృతాన్ని ద్విజ కుటుంబాలలో కూడా మాతృభాషగా మారడానికి అనుమతించలేదని గుర్తుంచుకోవాలి. తల్లి, ఆమె బిడ్డల మధ్య సంభాషణతో సహా ఇంటిలో రోజువారీ జీవితంలో ఒక భాషను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మాత్రమే దానిని ‘మాతృభాష’గా పరిగణించవచ్చు. కులీన గృహాలలో కూడా సంస్కృతాన్ని మాతృభాషగా మారడానికి అనుమతించనప్పుడు, ఉత్పత్తి వర్గాల్లో దాన్ని స్వీకరించే ప్రశ్న తలెత్తదు. ఈ పరిస్థితుల దృష్ట్యా, నాగరికతకు రక్షణకర్తలుగా తమను తాము గుర్తించుకునే ఈ భారతీయ అమెరికన్ల సమూహం... సంస్కృతంలో తమ పుస్తకాలను ఎందుకు రాయడం లేదని ప్రశ్నించాల్సి ఉంది. ఈ బృందం ప్రధానంగా అమెరికా, యూరప్, కెనడా, ఆస్ట్రేలియాల్లో నివసిస్తున్న వ్యక్తులలోని భారతీయ ఆలోచనా విధానాన్ని నిర్వలసీకరించడం, ఆర్థిక వనరులను సమీకరించడం లక్ష్యంగా పెట్టు కుంది. కానీ, భారతదేశంలో స్థాపించిన సంస్కృత పాఠశాలలు,సంస్కృత విశ్వవిద్యాలయాలకు వారు తమ పిల్లలను ఎందుకు పంపరు? బదులుగా వారు తమ పిల్లలను ప్రతిష్ఠాత్మకమైన అమెరికన్ విశ్వవిద్యాలయాలకు మాత్రమే ఎందుకు పంపాలని భావిస్తున్నారు? ‘టెన్ హెడ్స్ ఆఫ్ రావణ’ పుస్తకాన్ని రచించిన ఈ వ్యక్తులు,సంస్కృత పుస్తకాల నుండి వచ్చిన భారతదేశ నాగరికత మా లాంటి ఎవరికీ తెలియదని ఆరోపించారు. నాగరికత అంటే వారి దృష్టిలో అర్థం ఏమిటి? పుస్తకాల ద్వారా నాగరికతను నిర్మించవచ్చా? సంస్కృత పుస్తకాలకు చెందిన ఏదైనా అనువాదాన్ని చదివితే... శూద్ర, దళిత, ఆదివాసీ వర్గాల నుండి సామాజిక శక్తులు ఏవీ లేవని అది సూచిస్తుంది. ఇవి యుద్ధం, యజ్ఞాలు, క్రతువుల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. ఆహార ఉత్పత్తి, సేకరణ, జంతువుల మేతకు చెందిన వ్యవస్థలను ఈ పుస్తకాలలో ఏ కోశానా పొందుపర్చలేదు. ఈ హిందూత్వ రచయితలతో సహా మానవులందరూ శూద్ర వ్యవసాయా ధారిత ప్రజానీకం ఉత్పత్తి చేసే ఆహారంతోనే జీవిస్తున్నారని గుర్తించడం ముఖ్యం. ఆ ‘సంస్కృత యుగం’లో భూమిని పండించిన వారి గురించి, జంతువుల మేత ద్వారా మాంసాన్ని, పాలను ఉత్పత్తి చేసిన వారి గురించి ఎప్పుడూ రాయలేదు. హాస్యాస్పదంగా, ఈ భారతీయ అమెరికన్ కులీన వర్గాలు, ప్రత్యేకించి అమెరికాలో కుల వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించే ఇన్ఫినిటీ ఫౌండేషన్ సభ్యులు తమను తాము ‘మేధావులైన క్షత్రియులు’గా పేర్కొంటారు. అది కులతత్వం కాదా? మరోవైపున వీరి సంస్కృత యుగం పట్ల దళితులు, ఆదివాసీలు, శూద్రులకు ఏ మాత్రం ఆసక్తి లేదు. ఇంగ్లిష్ యుగంలోకి వెళ్లాలనీ, జ్ఞానోత్పత్తికి సంబంధించిన అన్ని కేంద్రాల నుండి ఈ శక్తులను స్థానభ్రంశం చేయాలనీ, ఆహార ఉత్పత్తి, జ్ఞానోత్పత్తి మధ్య సంబంధాన్ని ప్రతిష్ఠించాలనీ వారు కోరుకుంటున్నారు. ఇది అమృత్ కాల్ కాదు; నిజానికి ఇది శూద్ర కాలం. ఈ యుగంలో సంస్కృత పుస్తకాలలో వర్ణించినట్లుగా ఉత్పత్తి అనేది లోకువైనది కాదు; ఇక్కడ ఉత్పత్తి చాలా పవిత్రమైనది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
దేశానికి అవసరమైన విజయం!
కీలకమైన ఎన్నికల్లో విజయం సాధించి కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రెండోసారి ఎన్నికవడం శుభవార్త అనే చెప్పాలి. ప్రజా సంక్షేమ రాజకీయాలకూ, మత రాజకీయాలకూ మధ్య జరిగిన ఎన్నిక ఇది. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాదరణ, స్థిరమైన లౌకిక ప్రజాస్వామ్య వ్యూహాలు సిద్ధ రామయ్యను నిజమైన మాస్ లీడర్‌గా మార్చాయి. దేశం మతతత్వం నుండి ప్రజాస్వామ్య సంక్షేమం వైపు మళ్లాల్సిన అవసరం ఉన్నందున, కర్ణాటక ఎన్నికలు దేశానికి చాలా ముఖ్యమైనవి. మహాత్మా ఫూలే, బి.ఆర్. అంబేడ్కర్, పెరియార్లు రాజకీయాలలో మతం ప్రమేయం లేకుండా సానుకూల ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు. సిద్ధరామయ్య మతపరమైన భావజాలానికి చోటివ్వకుండా లౌకికవాద భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వల్లే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందన్న కథనం ఢిల్లీ నుంచి వినిపిస్తోంది. ఇది ఒక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. కానీ రాష్ట్ర స్థాయిలో ఒక బలమైన మాస్ లీడర్ లేకుండా ఏ జాతీయ పార్టీ కూడా రాష్ట్ర ఎన్నికల్లో గెలవలేదు. శూద్ర ఓబీసీల కోసం నిబద్ధత కలిగి, మంచి పరిపాలనాదక్షుడిగా, చిల్లర అవినీతి రాజకీయాలకు అతీతంగా తనను తాను నిరూపించుకున్న సిద్ధరామయ్య లాంటి బలమైన లీడర్ లేకుండా కాంగ్రెస్ గెలవలేక పోయేది. అవినీతికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నప్పటికీ, ఆయన పార్టీకి చెందిన కర్ణాటక నేతలు మాత్రం ఆయన మాట తప్పని నిరూపించారు. కేపీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ కాంగ్రెస్ గెలుపులో మంచి పాత్ర పోషించినప్పటికీ, సిద్ధరామయ్యకు ఉన్న ప్రజాపునాది, క్లీన్ ఇమేజ్ ఆయనకు లేదు. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రెండోసారి ఎన్నికవడం యావత్ భారతదేశానికి శుభవార్త అనే చెప్పాలి. అయినప్పటికీ, ఆయన రెండవ టర్మ్... మోసపూరిత బీజేపీని అదుపులో ఉంచడం, శివ కుమార్ తక్కువ స్థాయి ఆకాంక్షలను నియంత్రించడంతోపాటు మోదీని ఓడించిన ప్రజలను మాత్రమే కాకుండా స్థానిక నాయకులను సంతృప్తిపరిచేలా పరిపాలనను నడపడం వంటి సవాళ్లను కలిగి ఉంది. ఇది ఆర్ఎస్ఎస్ తదుపరి సర్సంచాలక్ దత్తాత్రేయ హొసబలే సొంత రాష్ట్రం. బహుశా ఈయన కూడా ఢిల్లీలోని మొత్తం బలాన్ని ఉప యోగించి, అన్ని విధాలుగా రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకోవాలను కున్నారు. హొసబలే బ్రాహ్మణ నాయకుడు. అంతేకాకుండా మోదీకి బలమైన మద్దతుదారు. 2013లో మోదీని ప్రధాని అభ్యర్థిగా తీసుకు రావడానికి హొసబలే కారణమని చెబుతున్నారు. అందుకే మోదీ ఓబీసీ కార్డ్‌ని, మతతత్వాన్ని ఉపయోగించి కర్ణాటకను గెలవడానికి తన ప్రభుత్వ బలాన్ని, తన సమయాన్ని, తన శక్తిని ఉపయోగించి నట్లనిపించింది. ప్రతి గ్రామ వ్యవసాయ సమాజాన్నీ, చేతివృత్తుల సంçఘాన్నీ కలిసిన సిద్ధరామయ్య... మోదీ కంటే భిన్నమైన ఓబీసీ నాయకుడని తెలియజేస్తోంది. సిద్ధరామయ్య 75వ జన్మదినోత్సవానికి 16 లక్షల మంది హాజరైనట్లు ‘వికీపీడియా’ రాసింది. ‘‘సిద్ధరామయ్య తన 75వ పుట్టినరోజును 2022 ఆగస్టు 3న దావణగెరెలో జరుపుకొన్నారు. జనం దాన్ని సిద్ధరామోత్సవ అని పిలిచారు, సిద్ధరామయ్య అను యాయులైన 16 లక్షల మంది ఆనాటి కార్యక్రమానికి హాజర య్యారు’’. రాహుల్ గాంధీ కూడా హాజరైన ఈ జన్మదిన వేడుకల్లో, పైన చెప్పిన సంఖ్యలో సగం మంది హాజరైనా కూడా, లక్షలాది మంది జనం ఒక నాయకుడి చుట్టూ గుమికూడటం భారతీయ చరిత్ర లోనే అపూర్వం. ఆయన పెద్ద లేదా చిన్న పట్టణ వ్యాపార నేపథ్యం నుండి కానీ, కొత్తగా చేర్చబడిన ఓబీసీ నేపథ్యం నుండి కానీ రాజకీయ అధికారానికి రాలేదు. ఆయన ఋగ్వేదం రాసిన రోజుల నుండి విద్య, ప్రభుత్వో ద్యోగం, మానవ గౌరవ హక్కుల నిరాకరణకు గురైన చారిత్రక శూద్ర గొర్రెల కాపరి కుటుంబానికి చెందిన ఓబీసీ. ఢిల్లీలో అధికారాన్ని ఓబీసీ ఓటు నిర్ణయిస్తుందని గ్రహించిన ఆరెస్సెస్–బీజేపీ శక్తులు, చాలా మంది శూద్రేతర నాయకులను ఓబీసీలుగా ప్రచారం చేస్తున్నాయి. మండల్ రిజర్వేషన్ ను వ్యతిరేకించిన తర్వాత ఓబీసీ ఓట్లు లేకుండా ఢిల్లీని చేజిక్కించుకోలేమని వారు గ్రహించడమే దీనికి కారణం. మోదీ, సుశీల్ మోదీ తరహాలో ఇప్పుడు ఓబీసీ కార్డు వాడు తున్న బీజేపీ నాయకులు ఆనాడు మండల్ రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తూ మిలి టెంట్ కమండల్ ఉద్యమ నాయకులుగా పనిచేశారు. సిద్ధరామయ్య బలమైన మండల్ ఉద్యమ నాయకుడు. గొర్రెల కాపరి కుటుంబం నుండి వచ్చి, బీఎస్సీ, ఎల్ఎల్బీ డిగ్రీలు పొందారు. ఆ రోజుల్లో ఇది ఒక కురుబ బాలుడు ఊహించనిది. ఎల్ఎల్బి పూర్తి చేసిన తర్వాత మైసూర్ ప్రాంతంలో సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నప్పుడు లా ప్రాక్టీస్‌లోకి ప్రవేశించారు. ఈ అసాధారణ యువ కురుబ న్యాయవాది 1980వ దశకం ప్రారంభంలో రైతు ఉద్యమంలో సుప్రసిద్ధ నాయకుడైన ఎం.డీ. నంజుండస్వామి దృష్టిని ఆకర్షించారు. ఆయనే సిద్ధరామయ్యను రాజ్య రైతు సంఘం ప్రతినిధిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించారు. అలా 1983లో గెలిచి అసెంబ్లీకి వెళ్ళారు. తరువాత జనతా పార్టీలో చేరారు. వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ మంత్రి కాగలిగారు. దేవెగౌడ పదవీ విరమణ చేసిన తర్వాత తాను ముఖ్యమంత్రి కావాలనే ఆశతో, పేదల అనుకూలత, నిబద్ధత కలిగిన ఓబీసీ, ఎస్సీ, ఆదివాసీ ప్రతినిధిగా జేడీ (యూ)లో చేరారు. ఆయన మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. కానీ సిద్ధరామయ్యను పట్టించు కోకుండా దేవెగౌడ తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేశారు. దేవెగౌడ సంప్రదాయవాద అర్ధ–హిందుత్వ నాయకుడు. కాగా, సిద్ధరామయ్య శూద్ర ఆధ్యాత్మిక భావజాలం కలిగిన హేతువాది. ఆ తర్వాత జేడీ (యూ)ను విడిచిపెట్టి ‘అహిందా’ పార్టీని స్థాపించారు. అంటే ‘అల్పసంఖ్యాక, హిందూళిద, దళిత’ అని! హిందూళిద అంటే కన్నడంలో వెనుకబడినది అని అర్థం. వాస్తవానికి ప్రధాన స్రవంతి మీడియా సిద్ధరామయ్య నాటి దశను ఆయన రాజకీయ జీవితానికి ముగింపుగా చూసింది. మాస్ లీడర్ లేని సమయంలో ఆయన కాంగ్రెస్ లోకి వచ్చారు. ఓబీసీ ఎజెండా, లౌకిక వాదం, హేతువాదంపై తనకున్న బలమైన నిబద్ధతను వదలకుండా కాంగ్రెస్‌లోకి ప్రవేశించారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అన్ని ప్రకటనల్లో కుల వ్యతిరేకత, సెక్యుల రిజం, హేతువాదం పట్ల ఆయన నిబద్ధతను చూడవచ్చు. ఎల్లప్పుడూ తన మణికట్టుకు కాషాయ దారాలను ధరించే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివ కుమార్ శైలితో దీన్ని పోల్చి చూడవచ్చు. కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విచిత్రంగా దేవాలయాలకు వెళ్తూ శివుడు (రాహుల్), హనుమంతుడి (ప్రియాంక) పూజలు చేస్తున్నారు. కానీ సిద్ధరామయ్య అలా చేయ లేదు. తన ఆధ్యాత్మిక నాయకుల సంప్రదాయంగా బసవ, అక్క మహా దేవిలను ఉదాహరిస్తారు. దేవాలయాల చుట్టూ తిరగరు. సిద్ధరామయ్య, పినరయి విజయన్, ఎం.కె.స్టాలిన్, కె.చంద్ర శేఖరరావు, జగన్మోహన్ రెడ్డి– దక్షిణాదిలోని ముఖ్యమంత్రులందరూ శూద్ర వ్యవసాయ, చేతివృత్తుల నేపథ్యం ఉన్నవారే. ఉత్తరాదిలో అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్, నితీశ్ కుమార్, భూపేశ్ బఘేల్, అశోక్ గెహ్లోత్ కూడా శూద్ర వ్యవసాయ నేపథ్యం నుండి వచ్చినవారే. వీరందరూ 2024లో మెజారిటీ పార్లమెంటు స్థానాలు గెలిస్తే బీజేపీ ఓడిపోతుంది. జాతీయ శూద్ర–ఓబీసీ నాయకులు ఏకమై సానుకూల ప్రజా స్వామ్య సంక్షేమం దిశగా దేశాన్ని నడిపించాల్సిన సమయం ఇది. ఓబీసీ రాజకీయాల పేరుతో జరుగుతున్న మతతత్వాన్ని అంత మొందించాలి. వ్యవసాయాధారిత జాతీయవాదాన్ని అగ్జ్రపీఠిన ఉంచడం; ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు కానివారు భారీ మొత్తంలో కూడగట్టిన క్రోనీ క్యాపిటల్ సమీకరణను తనిఖీ చేయడం ప్రస్తుతం చాలా ముఖ్యం. తమకు భాగస్వామ్యం లేని క్రోనీ క్యాపిట లిజానికి ఓబీసీలు మద్దతు ప్రకటిస్తే, అది భారతదేశ ప్రజాస్వామ్య పెట్టుబడిదారీ మార్గాన్ని నాశనం చేస్తుంది. మహాత్మా ఫూలే, అంబే డ్కర్, పెరియార్లు రాజకీయాలలో మతం ప్రమేయం లేకుండా సానుకూల ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు. సిద్ధరామయ్య తన జీవితంలో ఏ సమయంలోనైనా మతపరమైన భావజాలానికి చోటివ్వ కుండా లౌకికవాద భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
విశ్వ సమానత్వాన్ని తిరస్కరిస్తారా?
జాతి, మతం, లింగం, లైంగిక ధోరణితోపాటు కుల ప్రాతిపదికన వివక్షను నిషేధించే చట్టాలు అమెరికా, కెనడాల్లోని కొన్ని రాష్ట్రాలు ఆమోదించాయి. వీటిని ఆర్ఎస్ఎస్, బీజేపీ మేధావులు వ్యతిరేకించారు. అమెరికాలో హిందూ ప్రతిభ పురోగతిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారనీ, ప్రపంచంలో హిందూ మతానికి హాని కలిగించడానికే ఈ వివక్షా కార్డును ఉపయోగిస్తున్నారనీ వారు ఆరోపించారు. భారతీయ వలసల్లో కుల వివక్ష ఎలా పనిచేస్తోందని అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఇప్పటికే కొన్ని అధ్యయనాలు జరిగాయి. సాధారణంగా మానవ సమానత్వం వైపు, ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నప్పటికీ భారతీయులు సమానత్వం వైపు నిలబడుతున్నట్లయితే, ఎవరైనా అలాంటి శాసనాలను ఎందుకు వ్యతిరేకించాలి? అమెరికాలో పలువురు వలస భారతీయుల కేంద్రంగా ఉన్న సుసంపన్న రాష్ట్రం కాలిఫోర్నియా సెనేట్‌లో 2023 మార్చి 22న కుల వివక్ష వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొందినట్లయితే, ప్రపంచంలోనే కులాన్ని మరింత మౌలికంగా చర్చించే మొదటి చట్టం అవుతుంది. భారత రాజ్యాంగం అస్పృశ్యతను రద్దు చేసింది కానీ కులాన్ని కాదు. హిందుత్వ ప్రవాసులు ఇలాంటి కీలక పరిణామం చోటు చేసుకోబోదని భావించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, బీజేపీ శక్తులు కూడా అలాంటి ఘటన జరగకూడదని భావించాయి. కానీ ప్రపంచం వీరి పరిధిని దాటిపోయింది. జాతి, మతం, లింగం, లైంగిక ధోరణితోపాటు కుల ప్రాతిపదికన పౌరులు, పెద్దలు లేదా పిల్లలపై వివక్షను నిషేధించే చట్టాన్ని సియాటిల్ సిటీ కౌన్సిల్(అమెరికా), టొరొంటో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్(కెనడా) ఆమోదించినప్పుడు పలువురు ఆర్ఎస్ఎస్, బీజేపీ మేధావులు వ్యతి రేకించారు. ఇలాంటి శాసనాలను ‘హిందూఫోబియా’గా వారు ఖండించారు.అటువంటి శాసనాలను వ్యతిరేకిస్తూ పలు పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో రాశారు, మాట్లాడారు. సాధారణంగా మానవ సమానత్వం వైపు, ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నప్పటికీ భారతీయుల సమానత్వం వైపు నిలబడుతున్నట్లయితే, అలాంటి శాస నాలను ఎందుకు వ్యతిరేకించాలి? వివక్షకు సమర్థనా? సియాటిల్ సిటీ కౌన్సిల్ ఇటీవలే ఆమోదించిన తీర్మానంలో వివక్ష వ్యతిరేక చట్టాలకు కులాన్ని కూడా జోడించడాన్ని ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రిక పాంచజన్య ‘సంస్థాగత మార్గం ద్వారా అమెరికాలో హిందూఫోబియాను ప్రోత్సహిస్తున్నారు, అమెరికాలో హిందూ ప్రతిభ పురోగతిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారు’ అని పేర్కొన్నట్టుగా ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రాసింది. ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ ఈ వాదననే మరింత ముందుకు తీసుకు పోయారు. కుల వివక్షకు సంబంధించిన ఈ తప్పుడు జెండాను ఎత్తుతున్న బృందాలు సాధారణంగా హిందూభయంతో ఉంటు న్నాయని ఆయన ఒక జాతీయ దినపత్రికలో రాశారు. ప్రపంచంలో హిందూ మతానికి హాని కలిగించడానికే ఈ వివక్షా కార్డును ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అమెరికా కేంద్రంగా వ్యవహరించే పరిశోధనా సంస్థ ‘ఈక్వాలిటీ ల్యాబ్’నూ, అలాగే అమెరికా, కెనడా, యూరప్ తదితర ప్రాంతాల్లో అలాంటి కుల వ్యతిరేక చట్టాలు, శాస నాలపై పనిచేసే పౌర సమాజ బృందాలనూ పశ్చిమ దేశాల్లోని హిందూఫోబిక్ గ్రూపులుగా రామ్ మాధవ్ తప్పుపట్టారు. పాంచజన్య ఆరెస్సెస్ అధికార పత్రిక. వివక్షా వ్యతిరేక చట్టం హిందూఫోబియాకు సంకేతమనీ, భారతీయ ప్రతిభ పురోగతిని అడ్డుకునే కుట్ర అనీ అది పేర్కొంటోంది. భారత్ లేదా ప్రపంచంలో గణనీయ సంఖ్యలో భారతీయులు నివసిస్తున్న చోట సంస్థాగత శాసనాలను రూపొందించకుండా కులవివక్ష సమస్యను పరిష్కరించడం ఎలా? వివక్షను ప్రదర్శిస్తున్న వారు అలాంటి వివక్షా వైఖరి తప్పు అని ఎన్నడూ భావించరు. ఒక వ్యక్తి లేదా వర్గ మానసిక లక్షణాల్లో వివక్షా పూరితమైన ప్రవర్తన భాగమవుతుంది. హిందూ మతానికి సంబంధించి, అలాంటి వివక్షను ఆధ్యాత్మిక పాఠ్య గ్రంథాల ద్వారా సమర్థిస్తున్నారు. దానికి పవిత్రతను కల్పిస్తున్నారు. వివక్షాపూరిత అనుభవాలెన్నో! భారతీయ వలసల్లో కుల వివక్ష ఎలా పనిచేస్తోందని అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఇప్పటికే కొన్ని అధ్యయనాలు జరిగాయి. స్కూల్, కాలేజీ, పిల్లలు, యువత రోజువారీగా అను భవిస్తున్న వేదనకు సంబంధించిన ఇవి గాథలను వర్ణించాయి. వ్యక్తుల కుల నేపథ్యాన్ని తెలుసుకోవడానికి, అమలవుతున్న వివక్షా పద్ధతు లను కనుగొనడానికి సంబంధించిన యంత్రాంగాలను పలు నివేది కలు వెలికి తెచ్చాయి. ఉదాహరణకు, తెన్ మొళి సౌందరరాజన్ తాజా పుస్తకం ‘ద ట్రామా ఆఫ్ కాస్ట్ – ఎ దళిత్ ఫెమినిస్ట్ మెడిటేషన్ ఆన్ సర్వైవర్‌షిప్, హీలింగ్, అబాలిషన్’ అమెరికాలోని భారతీయ వలస ప్రజలలో వివక్షకు సంబంధించిన అసంఖ్యాక ఘటనలను గుది గుచ్చింది. ఈమె రెండో తరం భారతీయ అమెరికన్ దళిత మహిళ. టొరొంటో శాసనాలను రూపొందించిన తర్వాత, కెనడాలోని ఒక కాలేజీ విద్యార్థి త్రినా కుమార్ తన జీవితంలో ఎదుర్కొన్న ఒక అనుభవాన్ని సమగ్రంగా వర్ణించారు. తమ వేదనా గాథలను చెబు తున్న, భవిష్యత్తును ప్రేమిస్తున్న యువ మహిళగా ఆమె కనిపిస్తారు. ‘‘గ్రేటర్ టొరొంటో పాఠశాలల్లో కులపరమైన వేధింపును చాలానే ఎదుర్కొన్నాను. ఈ వేధింపు నాకు అయోమయం కలిగించింది. ప్రత్యేకించి మేమంతా కెనడియన్లమే అయినప్పటికీ నా తోటి క్లాస్ మేట్లకు కులం అంటే ఇంత ప్రాధాన్యం ఎందుకు అని నేను ఆశ్చర్య పడ్డాను’’ అని ఆమె చెబుతున్నారు. ‘‘వారి అగ్రకుల సంప్రదాయా లను నేను అనుసరించలేదు, దళిత క్రిస్టియన్ గా ఉంటున్నందుకు వారు నన్ను ఆటపట్టించేవారు’’ అని ఆమె చెప్పారు. క్రిస్టియన్లు మెజారిటీగా ఉంటున్న దేశంలో వారు ఇలా చేస్తున్నారు. ఇది క్రిస్టోఫోబియా కాదా? పాశ్చాత్య కులతత్వ వలస ప్రజల్లో ఈక్వాలిటీ ల్యాబ్స్ ఒక సంక్షోభాన్ని సృష్టించింది. అయితే, అమెరికాలో కుల వివక్షపై ఈక్వా లిటీ ల్యాబ్స్ అధ్యయనాన్ని రామ్ మాధవ్ తోసిపుచ్చారు. ఇలాగైతే, మొత్తంగా గోధుమవర్ణపు భారతీయులు తమ మీద శ్వేత అమెరికన్లు వివక్ష ప్రదర్శిస్తారని ఎలా ఆరోపించగలరు? సమానత్వం కోసం పనిచేస్తున్న గ్రూపులెన్నో! అమెరికా, కెనడాల్లో కుల వివక్షా వ్యతిరేక చట్టాలపై ఈక్వాలిటీ ల్యాబ్స్ ఒక్కటే పనిచేయలేదు. ఉత్తర అమెరికా అంబేడ్కర్ అసోసి యేషన్, బోస్టన్ స్టడీ గ్రూప్, పెరియార్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్,అంబేడ్కర్ బుద్ధిస్ట్ అసోసియేషన్, అంబేడ్కర్ కింగ్ స్టడీ సర్కిల్, అంబేడ్కర్ ఇంటర్నేషనల్ మిషన్ వివక్షను ఎండగట్టడానికీ, పీడిత కుల వలస ప్రజలను చైతన్యవంతం చేయడానికీ కృషి చేశాయి. భారత్‌లో కులం, మానవ అస్పృశ్యత ఎలా పనిచేస్తున్నాయో, దాన్ని అమెరికా, యూరప్, కెనడా, ఆస్ట్రేలియాల్లో ఎలా విస్తరింపజేస్తున్నారో పాశ్చాత్య సమాజాలకు తెలియపర్చేందుకు ఈ సంస్థలు బహుముఖ కార్యక్రమాలను చేపడుతూ వచ్చాయి. ఎక్కడ ఉన్నా సరే... కుల అణచివేత, దాని కార్యకలాపాలు ఎంత అమానుషంగా ఉంటు న్నాయో ఈ దేశాల్లోని నల్లవారికీ, శ్వేత జాతీయులకూ తెలియజెప్పేందుకు ఈ సంస్థలు తమ వనరులనూ, మానవ శ్రమనూ చాలా వెచ్చించాయి. కులవ్యవస్థ గురించి, దాని అమానుషమైన ఆచరణ గురించి ప్రపంచానికి అవగాహన కల్పించడంలో తప్పేముంది? మానవ సమా నత్వం కోసం నిలబడకుండా ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రజాస్వామ్యం కోసం ఎలా నిలబడతాయి? జాతి వివక్ష, ఇతర దేశాల పట్ల దురభిప్రాయం, దానికి సంబంధించిన అసహనాలకు వ్యతిరేకంగా డర్బన్ లో ఐక్యరాజ్యసమితి సదస్సు జరిగిన 2001 నుంచి ప్రపంచం చాలా దూరం పయనించింది. ఆనాటి సదస్సులో జాతి సమస్యతోపాటు కుల సమస్యను కూడా చర్చించడానికి అనుమతించలేదు. ఆనాడు ఐ.రా.స. అంగా లకు కుల వ్యవస్థ గురించి ఏమీ తెలియదనే చెప్పాలి. కుల సమస్యను అంతర్గత అంశం అని ప్రకటించి, దానిపై ఎలాంటి చర్చను కూడా అనుమతించడానికి బీజేపీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సుముఖత చూపడం లేదు. హిందూఫోబియా పేరిట వివక్షను, అసమాన త్వాన్ని, జాతి హత్యాకాండను విశ్వగురువు ఎందుకు ప్రేమిస్తున్నారు? హిందూయిజం మానవ సమానత్వాన్ని కోరుకోవడం లేదని దీని అర్థం కాదా? ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
స్వీయ దిద్దుబాటుపైనే జాతి భవిష్యత్తు!
బ్రిటిష్ పాలనకు ముందు భారతదేశ జనాభాలో 70 శాతం మంది విద్యావంతులేనని మోహన్ భాగవత్ పేర్కొన్నారు. 70 శాతం మంది విద్యావంతు లని ప్రకటించడం అంటే సంస్కృతం బోధించే బ్రాహ్మణీయ గురుకులాల్లో శూద్రులు, దళితులు చదువుకునేవారనే అర్థం వస్తోంది. భారతదేశంలో అన్ని కులాలు, వృత్తులకు చెందిన పిల్లలకు బోధించిన బ్రాహ్మణ లేదా హిందూ సంస్థలు ఉండేవా? నేడు దేశంలో ప్రధాన ఓటర్లుగా ఉంటున్న శూద్రులు, ఓబీసీలు, దళితులు, ఆదివాసీ ప్రజారాసులకు అవాస్తవ గాథలను వల్లించడం ద్వారా జాతీయవాదాన్ని స్థాపించలేరు. గత తప్పిదాలను ఆమోదించడం ద్వారానే జాతీయ స్ఫూర్తిని ప్రజల్లో నింపవచ్చు. అసత్యాలతో కాకుండా నిజాయితీ, స్వీయ దిద్దుబాటుపైనే జాతి భవిష్యత్తును నిర్మించవచ్చు. ఆరెస్సెస్ సర్సంచాలక్ మోహన్ భాగవత్ కొంతకాలంగా అసాధారణ ప్రకటనలు చేస్తు న్నారు. దేవుడు కులాన్ని సృష్టించలేదనీ, పండిట్లు (పూజారులు) కులాన్ని సృష్టించారనీ అన్నారు. శాస్త్రాలు మౌఖికంగా బదిలీ అయి నంతకాలం బాగుండేవనీ, వాటిని ఎప్పుడైతే రాయడం జరిగిందో తప్పుడు విషయాలు పొందుపరుస్తూ వచ్చారని కూడా అన్నారు. ఈ రెండు ప్రకటనలు కాస్త సంస్కరణ తత్వంతో ఉన్నాయి. ‘2023 మార్చి 5న మోహన్ భాగవత్ బ్రిటిష్ పాలనకు ముందు భారతదేశ జనాభాలో 70 శాతం విద్యావంతులేనని పేర్కొన్నారు. అప్పట్లో దేశంలో నిరుద్యోగమనేది లేదని కూడా చెప్పారు’. ఆయన ఈ ప్రకటనకు మీడియా విస్తృత ప్రచారం కల్పించింది. సావిత్రీబాయి ఫూలే జయంతి నేపథ్యంలో 2023 మార్చి 7న ‘పుణేకర్ న్యూస్’లో కేమిల్ పార్ఖే 1824లో బాంబేలో మొట్టమొదటి బాలికా పాఠశాలను ప్రారంభించిన అమెరికన్ మిషనరీ మహిళ సింథియా ఫరార్ గురించి ఒక ఆసక్తికరమైన కథనం రాశారు. పుణేలో బాలికల పాఠశాలను ప్రారంభించడానికి మహాత్మా జ్యోతిరావు ఫూలేకు ఫరార్ ఆదర్శంగా నిలిచారు. ఈ పాఠశాలలోనే సావిత్రీ బాయి, ఫాతిమా బాలికలకు పాఠాలు చెప్పేవారు. జాతీయవాద దృష్టితో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రీ బాయిని దేశం పరిగణిస్తోంది. నిజానికి సింథియా ఫరార్‌ను మొదటి మహిళా టీచర్‌గా భావించాలి. సింథియా పెళ్లి చేసుకోలేదు. భారత దేశంలో బాలికా విద్య కోసం తన జీవితాంతం కృషి చేశారు. అహ్మద్‌నగర్‌లో 1862లో మరణించారు. ‘‘ముంబై, అహ్మద్ నగర్లలో అనేక బాలికా పాఠశాలలు, బాలికల బోర్డింగ్ స్కూల్స్‌ను ప్రారంభించిన ఘనత సింథియా ఫరార్దే’’ అంటారు పార్ఖే. చరిత్రలో ఏ కాలంలోనైనా భారత్‌లో హిందూ బ్రాహ్మణ మిషనరీలు అలాంటి బాలికా పాఠశాలలను ప్రారంభించడం జరిగిందా? 70 శాతం మంది భారతీయులంటే, అందులో శూద్రులు, గ్రామాల, పట్టణాల చివర నివసిస్తున్న దళితులకు విద్యాహక్కు ఉండాలి. బ్రిటిష్ పూర్వ భారతదేశం అంటే మొఘలాయి పాలన గురించి ఆయన మాట్లాడుతున్నారని అర్థం. ముస్లిం పాలనాకాలంలో 70 శాతం మంది భారతీయులు చదువుకున్నవారేనన్న అర్థాన్ని ఇస్తోంది మోహన్ భాగవత్ ప్రకటన. అదే నిజమైతే, ముస్లింల పాలన ఎందుకు చెడ్డది? మొఘలుల పాలనాకాలంలో భారత్‌లో 70 శాతం మంది ముస్లింలు లేరు. ముస్లిం పాలకులు శూద్రులను, దళితులను విద్యావంతుల్ని చేశాక కూడా వాళ్లు ఇటీవలి కాలం వరకూ నిరక్ష రాస్యులుగానే ఎందుకు ఉండిపోయినట్లు? మోహన్ భాగవత్ ప్రకటన సాధారణంగా ఆరెస్సెస్ వాస్తవికతను ప్రతిబింబిస్తుంది. కులం, మహిళల అసమానత్వం అనేవి సంస్కృత శాస్త్రాల్లోకి తదనంతర రచయితలు ప్రవేశపెట్టారని ఆరెస్సెస్ చెబు తున్నట్టయితే– ఆరెస్సెస్/బీజేపీ ప్రభుత్వం ఒక సమీక్షా కమిటీని ఏర్పర్చి శాస్త్రాల్లో కులం, మహిళల అసమానత్వం గురించిన ప్రస్తా వనలను తొలగించవచ్చు. శాస్త్రాలు, పురాణాల్లో దేవతలకు కూడా కులం అంటగట్టేశారు. ఉదాహరణకు రాముడిని క్షత్రియుడిగా, కృష్ణు డిని యాదవుడిగా పేర్కొంటారు. శూద్ర, చండాల వంటి కుల బృందాలను అత్యంత హీనంగా శాస్త్రాలు పేర్కొన్నాయి. అదే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్య సామాజిక వర్గాలను అత్యంత గౌరవనీయమైన రీతిలో పేర్కొన్నారు. పైగా శూద్రులు, చండాలురు వీరిని సేవించాల న్నారు. శాస్త్రాల్లో అలాంటి భాషను మార్చడాన్ని ఎవరూ ఆపరు. హిందువులుగా తమను పరిగణించుకునే అన్ని వృత్తి బృందాలకు అర్చక విద్య పొందే హక్కును కల్పించాలి. ‘దేవుడు కులాన్ని సృష్టించలేదు’ అని ఆరెస్సెస్ అధినేతగా భాగవత్ చెబుతున్నందున ఇది అవసరమైన చర్యే. ఆధ్యాత్మిక విద్యలో సమాన అవకాశాలపైన ఆధ్యా త్మిక సమానత్వం ఆధారపడి ఉంటుంది. హిందూ పిల్లలందరికీ హిందూ ఆధ్యాత్మిక విద్యను ఆరెస్సెస్, బీజేపీ కూటమి ప్రారంభించవచ్చు. ఇటీవలి కాలం వరకూ హిందూ ఆధ్యాత్మిక గ్రంథాలను చదివే హక్కు శూద్రులకు, దళితులకు ఉండేది కాదని తెలిసిన విష యమే. ఈ పుస్తకాల్లోనే వీరి జీవితాన్ని పశువులతో సమానంగా చిత్రించారు. ‘రామచరిత్ మానస్’లో అలాంటి భాష గురించి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన చర్చ అందరికీ తెలిసిందే. ఆరెస్సెస్, బీజేపీ పాలిస్తున్నప్పుడు అన్ని రంగాల్లో సమానమైన వాతావరణంలో విద్యా హక్కుకు హామీ ఉండేలా చూడాలి. భారతీయ వృత్తిజీవులందరి హుందాతనాన్ని నిలబెట్టేలా పాఠ్యప్రణాళిక ఉండాలి. ఏ కాలంలో, ఏ సమాజమైనా వ్యవసాయం, పశుపోషణ, చేతి వృత్తులు లేకుండా మనుగడ సాగించలేదు. కానీ రుగ్వేదం నుంచి రామాయణ, మహాభారతాల వరకు ఈ వృత్తులను దైవికం కానివిగా చూశాయి. అందువల్ల అవి శూద్ర లేదా చండాలమైనవి. కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న ఆధునిక యువత ఇలాంటి భాషను ఆమోదించలేదు. కాబట్టి మార్పు అవసరం. బ్రిటిష్ పూర్వ భారతదేశంలో 70 శాతం మంది విద్యావంతులని ప్రకటించడం అంటే సంస్కృతం బోధించే బ్రాహ్మణీయ గురుకులాల్లో శూద్రులు, దళితులు, మహిళలు చక్కగా చదువుకునే వారనే అర్థం వస్తోంది. దీనికి రుజువు ఉందా? ప్రాచీన, మధ్య యుగాల్లో అంటే బ్రిటిష్ వారు అడుగుపెట్టేంతవరకూ విద్యావిధానం నుంచి శూద్రులు, దళితులు, మహిళలను దూరం పెట్టాలని శాస్త్రాలే స్వయంగా చెబుతున్నప్పుడు బ్రిటిష్ పూర్వ భారతదేశంలో 70 శాతం మంది భారతీ యులు చదువుకున్నారని మోహన్ భాగవత్ అనడంలో అర్థం ఉందా? భారతదేశంలో అన్ని కులాలు, సామాజిక బృందాల పిల్లలకు సూత్రరీత్యా విద్యను అందించేందుకు ఆమోదించిన మొట్టమొదటి పాఠశాలను విలియం కేరీ అనే బ్రిటిష్ మిషనరీ 1817లో కలకత్తాలో రాజా రామ్మోహన్ రాయ్ సహకారంతో ప్రారంభించారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మొట్టమొదటి బాలికల పాఠశా లను 1824లో బాంబేలో అమెరికన్ మరాఠీ మిషన్ ప్రారంభించింది. ఆ మిషన్ తరఫున భారత్ వచ్చిన సింథియా ఫరార్ అన్ని కులాల మహిళలకు, పిల్లలకు బోధించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ముస్లిం పాలనా కాలంలో కానీ, అంతకుముందు కానీ భారత దేశంలో అన్ని కులాలు, వృత్తులకు చెందిన పిల్లలకు బోధించిన బ్రాహ్మణ లేదా హిందూ సంస్థలు ఉండేవా? అలాంటి విద్యాసంస్థలు లేకుండా దేశంలోని 70 శాతం మంది పిల్లలకు ఎవరు విద్య నేర్పారు? ఏ రాజరిక ప్రభుత్వమూ పాఠశాలలను నడపలేదు. బ్రాహ్మణులు (ప్రధానంగా బ్రాహ్మణులు, క్షత్రియ విద్యావంతులు) ఆ పని చేసి ఉండాల్సింది. కానీ దానికి శాస్త్రాలు వారిని అనుమతించలేదు. మొఘలుల కాలంలో కూడా పర్షియా భాషలో అన్ని కులాల కోసం పాఠశాలలను ఏర్పర్చలేదు. సార్వత్రిక విద్యకు వ్యతిరేకులైన బ్రాహ్మణ పండితుల సూచన ప్రకారమే అక్బర్‌తో సహా మొఘల్ పాలకులు నడుచుకున్నారు. మొఘలుల పాలనాకాలంలో విషాదకర మైన విషయం ఏమిటంటే – ఇస్లాంలోకి మతం మార్చుకున్న కింది కులాల వారికి ఉన్నత కులాల ముల్లాలు, పఠాన్లు లేదా మొఘల్ జాతి వారు విద్య నేర్పలేదు. నేడు దళిత అక్షరాస్యత కంటే కిందికులాలకు చెందిన ముస్లింల నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం. 70 శాతం అక్షరాస్యత గణాంకాలకు ఆరెస్సెస్ అధినేతకు ఆధారం ఏమిటి? నేడు దేశంలో ప్రధాన ఓటర్లుగా ఉంటున్న శూద్రులు, ఓబీసీలు, దళితులు, ఆదివాసీ ప్రజారాసులకు అవాస్తవ గాథలను వల్లించడం ద్వారా జాతీయవాదాన్ని స్థాపించలేరు. గతంలోని తప్పిదాలను ఆమోదించడం ద్వారానే జాతీయ స్ఫూర్తిని ప్రజల్లో నింపవచ్చు. అసత్యాలతో కాకుండా నిజాయితీ, స్వీయ దిద్దుబాటు పైనే జాతి భవిష్యత్తును నిర్మించవచ్చు. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
నైతిక పునాది లేని జాతీయవాదం
భారత్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పర్చడానికి విదేశీ విశ్వవిద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం తలుపులు తెరిచింది. ఈ క్యాంపస్‌ను ఏర్పర్చాలనుకునే విదేశీ విశ్వవిద్యాలయం గ్లోబల్ ర్యాకింగ్స్లో టాప్ – 500ల్లో ఉండాలి. స్పష్టంగా వీటిలోని కోర్సులను ప్రపంచస్థాయిలో పోటీపడే సిలబస్‌తో ఇంగ్లిష్‌లో నేర్పుతారు. కేంద్రం ఇంగ్లిష్‌లో తమ ఇచ్ఛప్రకారం కోర్సులను బోధించే విశ్వవిద్యాలయాలను అనుమతించడం ఆశ్చర్యంగా లేదా? ఇదే ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థల్లో హిందీని బోధనా భాషగా చేయాలనీ, సిలబస్ భారతీయ సంçస్కృతిపై ఎక్కువగా ఆధారపడి ఉండాలనీ చెబుతూ వచ్చింది. ప్రశ్న ఏమిటంటే, భారతీయ విశ్వవిద్యాలయాల్లో హిందీలో చదివేవారు ఎవరు? విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లిష్‌లో అధ్యయనం చేసేది ఎవరు? మన విద్యా వ్యవస్థ ద్వంద్వ ప్రమాణాల వల్ల దెబ్బతింటోంది. తీవ్ర జాతీయవాది సైతం తమ పిల్లలకు ఇంగ్లిష్, విదేశీ యూనివర్సిటీ విద్య నేర్పించడాన్నే ఇష్టపడుతున్నారు. మరోవైపు సంస్కృతి, వారసత్వం, మాతృభాష అంటూ రాగం ఎత్తుకుంటారు. ఒక కుటుంబానికి డబ్బుంటే, వారి పిల్లలు ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం స్కూల్స్‌లో చదవడానికి భారీగా ఖర్చు చేస్తారు. విదేశీ యూనివర్సిటీల్లో చదవడానికి అమెరికా లేదా ఇంగ్లండ్‌కు పోతారు. కానీ స్వదేశంలో అత్యున్నత విజ్ఞానాన్ని మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు బోధించాలని వీరు కోరుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం భారత్‌లో తమ క్యాంప స్లను ఏర్పర్చడానికి విదేశీ విశ్వవిద్యాలయాలకు (యేల్, హార్వర్డ్, ప్రిన్్సటన్) తలుపులు తెరిచింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్పర్సన్ ఎం. జగదీశ్ కుమార్ జనవరి 5న నిర్వహించిన ఒక ప్రెస్ కాన్ఫరెన్ ్సలో ఈ ప్రకటన చేశారు. మీడియా నివేదికల ప్రకారం, ‘భారత్‌లో తన క్యాంపస్‌ను ఏర్పర్చాలనుకునే విదేశీ విశ్వవిద్యా లయం గ్లోబల్ ర్యాకింగ్స్లో టాప్– 500ల్లో ఉండాలి.’ అంటే వివిధ దేశాలకు చెందిన అగ్రశ్రేణి యూనివర్సిటీలు భారత్ లోని కొత్త క్యాంపస్‌లపై దృష్టి సారిస్తాయని దీనర్థం. స్పష్టంగా వీటిలోని అన్ని కోర్సులను ప్రపంచస్థాయిలో పోటీపడే సిలబస్‌తో ఇంగ్లిష్‌లో నేర్పుతారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇంగ్లిష్‌లో తమ ఇచ్ఛప్రకారం కోర్సులను బోధించే విశ్వవిద్యాలయాలను అనుమతించడం ఆశ్చర్యం కలిగించడం లేదా? ఇదే ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థల్లో హిందీని బోధనా భాషగా చేయాలనీ, సిలబస్ భారతీయ సంస్కృతి, వార సత్వంపై ఎక్కువగా ఆధారపడి ఉండాలనీ పదే పదే చెబుతూ వచ్చింది. యూనివర్సిటీ సిలబస్‌లో నిర్బంధంగా వేద, పురాణ అధ్యయనాలను చొప్పించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. వివాదా స్పదమైన ప్రశ్న ఏమిటంటే, భారతీయ విశ్వవిద్యాలయాల్లో హిందీలో చదివేవారు ఎవరు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లిష్‌లో అధ్యయనం చేసేది ఎవరు? విదేశీ విశ్వవిద్యాలయాలు వేద విజ్ఞానం, గణితం, మానవ శాస్త్రాలను ‘ప్రపంచ’ నాగరికతా ఆధారాలుగా హిందీలో బోధిస్తాయా? ‘భారతీయ క్యాంపస్‌లో విదేశీ విశ్వవిద్యాలయం అందించే విద్యా నాణ్యత, దాని సొంత దేశంలోని ప్రధాన క్యాంపస్‌లో అందించే విద్యానాణ్యతకు సమానంగా ఉంటుందని హమీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే భారతీయ క్యాంపస్‌లోని విద్యార్థులకు అందించే విద్యా పరమైన అవార్డులు సొంతదేశంలోని ప్రధాన క్యాంపస్‌లోని ఉన్నత విద్యాసంస్థలు అందించే విద్యాపరమైన అవార్డులకు సరిసమానంగా ఉండటమే కాకుండా ఆ మేరకు తగిన గుర్తింపును కూడా ఇవ్వాల్సి ఉంటుంది’ అని యూజీసీ చైర్పర్సన్ జగదీశ్ కుమార్ పేర్కొన్నారు. భారత్‌లో విదేశీ విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి గురించి కూడా ఆయన నొక్కి చెప్పారు. క్యాంపస్‌లో విద్యా కార్యక్రమాలు, మౌలిక వసతుల విషయంలో తప్ప, నిర్వహణాత్మక అంశంలో యూజీసీ నుంచి ఎలాంటి జోక్యం ఉండబోదని అన్నారు. జాతీయ విద్య వర్సెస్ గ్లోబల్ విద్యతో దేశాన్ని కుల, వర్గ ప్రాతిపదికన మరింతగా విభజించాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటున్నట్లయితే, భారతీయ యూనివర్సిటీలలో విద్యా నాణ్యత, పట్టభద్రుల ఉపాధి విషయం ఏమిటి? ఇదే జరిగితే, భారత్ మరోసారి తన అంధకార గతం వైపు వెళ్లిపోతుంది. శూద్రులు, ఇతర వెనుక బడిన వర్గాలు (ఓబీసీలు), దళితులు, ఆదివాసీలు ఆధునిక విద్యాసంస్థల్లో ప్రవేశం పొందలేరు. రిజర్వేషన్ ప్రయోజనాలు ఇకపై శూన్య మైపోతాయి. ఉత్పాదక వర్గాల పిల్లలకు కేంద్ర ప్రభుత్వం విద్యా భారతిని చూపిస్తుంది. ఇది ఆరెస్సెస్ నిర్వహించే పాఠశాలల నెట్వర్క్. ఇలాంటి విద్యా నమూనా ద్వారా ఘనమైన ప్రాచీన నాగరికతను భారతీయులు అనుసరించాలని ఆరెస్సెస్, బీజేపీ కోరుకుంటున్నాయి. అదే సమయంలో ఆధునిక ఉత్పత్తి, ఆధునిక విజ్ఞానశాస్త్రం, వనరుల పంపిణీ, సమానత్వం వంటివాటిని భార తీయేతరమైనవిగా ఇవి చూస్తున్నాయి. వర్ణవ్యవస్థ కేంద్రకంగా ఉన్న మానవ సంబంధాలు, ఆశ్రమాల్లో నివసించడమే సమాజ ఆద ర్శాలుగా మారిపోతాయి. అదే సమయంలో విదేశీ, భారతీయ ప్రైవేట్ పాఠశాలలు, యూనివర్సిటీలు దేశంలోని కులీన వర్గాల, పాలక వర్గాల పిల్లలకు హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, యేల్ యూనివర్సిటీల సిలబస్‌తో ఇంగ్లిష్‌లో బోధనను అందిస్తాయి. దీనివల్ల వీరు పాశ్చాత్య దేశాలతో వాటికి వెలుపలి ప్రపంచంతో కూడా కనెక్ట్ అవుతారు. వీరే నిజమైన విశ్వగురువులుగా లేదా ప్రపంచ నేతలుగా మారతారు. ఈ రకమైన విభజన వల్ల మన దేశంలోని సెక్యులర్, లిబరల్ ద్విజులు పెద్దగా కోల్పోయేది ఏమీ ఉండదు. తమ పిల్లలకు హిందీ మీడియం విద్యా భారతి సిలబస్‌ను నేర్పరని వీరందరికీ స్పష్టంగా తెలుసు. బోధనా పద్ధతులపై, బోధనా శాస్త్రంపై వీరి విమర్శ అటు భాష, ఇటు విషయంపై అస్పష్టతతోనే ఉంటుంది. కానీ వీరు సమా నతా విద్య గురించి వల్లిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యావేత్తలు ఈ విద్యా నమూనాతో పోరాడరు. గతంలో పేలవమైన విద్యా విధానాలను రూపొందించింది వీరే మరి. దీనివల్లే శూద్రులు, ఓబీసీలు, దళితలు, ఆదివాసుల్లో ఇంగ్లిష్ విద్య పొందిన మేధావులు అతి కొద్ది సంఖ్యలో మాత్రమే ఉండిపోయారు. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ మేధావుల విషయానికి వస్తే ఈ విధమైన విద్యాపరమైన విభజన వారికి పెద్ద సమస్య కాదు. ఎందుకంటే పలువురు ముస్లిం విద్యార్థులు మదరసాల్లో, క్రిస్టియన్ విద్యార్థులు మిషనరీ స్కూల్స్‌లో చదువుకుంటూ ఉంటారు. మదర సాలు, క్రిస్టియన్ స్కూళ్లు అంతరిస్తున్నాయనుకోండి! మరోవైపున విద్యావకాశాలకు దూరమైన శూద్రులు, ఓబీసీలు కూడా ఈ సమ స్యను పెద్దగా పట్టించుకోవడం లేదు. హిందూ సామ్రాట్ గుర్తింపుతో మొట్టమొదటి బీసీ ప్రధానిగా చెప్పుకొంటున్న నరేంద్ర మోదీ తమను చారిత్రక బానిసత్వం నుంచి బయటపడేస్తారని వీరిలో చాలామంది భావిస్తున్నారు. భారతీయ ప్రాంతీయ పార్టీలు కూడా ప్రజారాసులకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందించడాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే అది వారి సొంత భాషా దురహంకారానికి వ్యతిరేక మవుతుంది. ఇక ఓబీసీ, దళిత సంస్థల విషయానికి వస్తే విద్యా నాణ్యత కంటే రిజర్వేషన్ లో తమ వాటా గురించే ఆందోళన చెందుతున్నాయి. నిరంకుశమైన 2020 వ్యవసాయ సంస్కరణ చట్టాలను ఉపసంహరించుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా వ్యవసాయ ప్రజా బాహుళ్యం చిన్న విజయం సాధించగలిగింది. కానీ ఆరెస్సెస్, బీజేపీ విద్యా కుట్రతో తమ పిల్లలు మరింత ప్రమాదంలో పడనున్నారని వీరు గుర్తించడం లేదు. ప్రజారాసుల పిల్లలను చేర్చు కుంటామని హామీ ఇవ్వకుండానే అనేక విదేశీ విశ్వవిద్యాలయాలు చాలావరకు ప్రజల భూములను కొనివేయబోతున్నాయి. రైతుల పిల్లల విద్యాపరమైన శక్తిసామర్థ్యాన్ని విచ్చిన్నపర్చడానికి పాలక వర్గాలు పథకం వేస్తున్నాయి. ఈ విధానాల ద్వారా వీరి భవిష్యత్తు అంధకారం కానుంది. ప్రభుత్వ రంగంలో మాత్రమే ఉంటున్న రిజ ర్వేషన్లు పొందుతున్నవారేమో ఒకసారి ప్రైవేటీకరణ పూర్తి శక్తితో ముందుకొచ్చాక న్యూనతతో బాధపడక తప్పదు. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఉత్తరాదిన కొత్త ఉరుములు
పదహారవ శతాబ్దపు భక్తకవి తులసీదాసు రాసిన ‘రామ్‌చరిత్‌మానస్’ ఇప్పుడు ఉత్తరాదిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రాచీన, మధ్య యుగాల్లో ద్విజులు రాసిన ఇతర గ్రంథాలకు వ్యతిరేకంగా శూద్ర, దళిత రాజకీయనేతలు నేడు మొట్టమొదటిసారిగా మేధా పోరాటానికి పిడికిలి బిగిస్తున్నారు. ఆ పుస్తకాలను ఆయుధాలుగా చేసుకుని ఆరెస్సెస్, బీజేపీలు సమకాలీన హిందూ జాతీయవాదాన్ని నిర్మించి అన్ని విద్యా సంస్థలపై ఆధిపత్యాన్ని నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నాయన్నది వారి ప్రధాన ఆరోపణ. అందుకే వారు శూద్రులు, దళితులు వర్సెస్ ద్విజులు అనే కొత్త వ్యూహంలోకి ఆరెస్సెస్, బీజేపీని లాగడం ద్వారా ఉత్తరాదిన సరికొత్త యుద్ధానికి తెర తీయడానికి సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. గోస్వామి తులసీదాస్ రాసిన రామ్చరిత్ మానస్ ఇప్పుడు ఉత్తర భారతదేశంలో... ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, బీహార్లలో కుల యుద్ధాన్ని రాజేస్తోంది. ఆ ప్రాంత బ్రాహ్మణులు, క్షత్రియులు ఈ పుస్తకాన్ని తమ ఆధ్యాత్మిక రామాయణంగా భావిస్తుంటారు. అయితే ఈ పుస్తకంలో శూద్రులకు, దళితులకు వ్యతిరేకంగా అవమానకరమైన ద్విపదలు ఉన్నాయని ఆరోపిస్తూ తాజాగా ఇద్దరు శూద్ర ఓబీసీ నేతలు స్వామి ప్రసాద్ మౌర్య (సమాజ్‌వాది పార్టీ–యూపీ), బీహార్ విద్యామంత్రి చంద్రశేఖర్ (ఆర్జేడి) పుస్తకాన్ని నిషేధించాలన్న డిమాండ్‌తో పోరు ప్రారంభించారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం తన బలమైన శూద్ర నేపథ్యంతో పుస్తకంపై తీవ్ర వైఖరిని చేపట్టారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ 2023 జనవరి 29న ఒక పత్రికా సదస్సులో ప్రసంగిస్తూ... ‘‘నేను శూద్రుడినా లేక శూద్రుడిని కాదా తెలీదు కానీ, నేను రాముడికి వ్యతిరేకం కాదు. మరే ఇతర హిందూ దేవుడికి కూడా వ్యతిరేకం కాదు. అయితే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రామ్‌చరిత్‌మానస్ నుంచి శూద్రుల గురించి ప్రస్తావించిన ఆ పంక్తులను పఠించగలరా?’’ అని ప్రశ్నించారు. ఈ అంశం గురించి ఒక జర్నలిస్టు మళ్లీ ప్రశ్నించి చీకాకు పరచినప్పుడు ‘మీకు తెలిసి ఉంటే వాటిని చదవగలరా?’’ అని అడిగారు. అప్పుడు ఆ జర్నలిస్టు ఆ పంక్తిని చదివి వినిపించారు. ‘‘డోలు, నిరక్ష్యరాస్యుడు, శూద్రుడు, పశువు, మహిళ... వీళ్లందరూ శిక్షార్హులే..’’ అన్నది ఆ పంక్తి సారాంశం. అప్పుడు అఖిలేష్ ఆ జర్న లిస్టును ‘‘ఆ పంక్తులు శూద్రులను, దళితులను, స్త్రీలను అవమానిస్తు న్నాయా లేదా?’’ అని ప్రశ్నించారు. ‘‘సీఎం యోగి అయినందున ఈ పంక్తులను రాష్ట్ర అసెంబ్లీలో చదవాలని నేను అడుగుతాను’’ అన్నారు. అంతకు ముందు అఖిలేష్ యాదవ్ ఒక ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లినప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆయనను అడ్డుకోవాలని చూశాయి. రామ్‌చరిత్‌మానస్ శూద్రులను, దళితులను, మహిళలను అవమానిస్తోందని, ఆ పుస్తకాన్ని నిషేధించాలని చెప్పిన ఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై చర్య తీసుకోవాలని ఆ రెండు పార్టీలవారు నినదించారు. మౌర్య హిందువుల మనోభావాలను గాయపర్చారని వారి ఆక్షేపణ. కేసులు పెట్టారు. కానీ ఆయన తన వైఖరికి కట్టుబ డ్డారు. ఆలయం వద్ద అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారికి అఖిలేష్ కూడా గట్టిగా సమాధానమిచ్చారు. వెనుకబడిన వర్గాల (ఓబీసీల)ను, దళితులను మొత్తంగా శూద్రులుగా బీజేపీ పరిగణిస్తోందని, బీజేపీలో ఉంటున్నవారితోపాటు, పార్టీకి ఓటు వేస్తున్న శూద్రులను, దళితు లను, మహిళలందరినీ రావ్ుచరిత్ మానస్ అవమానిస్తోందని మౌర్య పేర్కొన్నారు. బీహార్ విద్యా మంత్రి ఆర్జేడీ నేత చంద్రశేఖర్ కూడా ‘‘రావ్ుచరిత్మానస్ మనుస్మృతి లాగా, ఆర్ఎస్ఎస్ రెండో సర్సంఘ్ చాలక్ (ఛీఫ్) ఎమ్ఎస్ గోల్వాల్కర్ రచించిన గ్రంథం ‘పాంచజన్యం’లాగా ఒక విభజన గ్రంథం’’ అని అన్నారు. ఈ నేపథ్యంలోనే... ప్రాచీన, మధ్యయుగాల్లో బ్రాహ్మణులు రాసిన కుల గ్రంథాలకు వ్యతిరేకంగా ఉత్తర భారత శూద్ర, దళిత రాజ కీయనేతలు మేధాపోరాటం చేస్తున్నారు. ‘‘ఈ పుస్తకాలను ఉపయో గించుకోవడం ద్వారా ఆరెస్సెస్, బీజేపీలు సమకాలీన హిందూ జాతీయవాదాన్ని నిర్మించి అన్ని విద్యా సంస్థలపై ఆధిపత్యాన్ని నెల కొల్పాలని చూస్తు్తన్నాయి. ఆహార ఉత్పత్తిదారులు, తోలుపని వారు, వడ్రంగులు, కుమ్మరులు, పశుపోషకులు, గొర్రెలకాపర్లు వంటి వారిని గౌరవించకూడని, వారు పనికిమాలిన వారని సూచించడానికి ‘శూద్ర’, ‘చండాల’ భావనలను ఈ పుస్తకాలు చాలా వరకు వ్యాపింపజేశాయి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదవటానికి, విద్యను అభ్యసించడానికి వీరికి అర్హత లేదని, సమాజంలో గౌరవం పొందే అర్హత వీరికి లేదని ఈ పుస్తకాలు చెప్పాయి. అలాగే ఆలయాల్లో ప్రవేశించడానికి వీరికి అనుమతి లేదని పేర్కొన్నాయి’’ అని ఆరోపిస్తున్నారు. ఓబీసీ, దళిత్ వంటి సమకాలీక వర్గీకరణలను స్వాతంత్య్రానంతర భారత్‌లో కులాలు, కమ్యూనిటీల కోసం దాదాపుగా వాడేవారు. గతంలో ఓబీసీలు, దళితులు బ్రాహ్మణ పుస్తకాలను నిశితంగా పరిశీ లించలేదు. అందుచేత తమ గురించి ఈ పుస్తకాలు ఏమని పేర్కొ న్నాయన్నది వీరు ఎన్నటికీ అర్థం చేసుకోలేదు. భారతదేశంలోని ఓబీసీలను ఏమాత్రం అర్థం చేసుకోకుండానే శూద్రులు అనే వర్గీ కరణను పై పుస్తకాల్లో రాసేశారు. అందుకే జాతీయవాద సమయంలో జాట్లు, పటేళ్లు, మరాఠీలు, కమ్మవారు, రెడ్లు, లింగాయతులు, నాయర్లు తదితరులు శూద్ర హోదాను కాకుండా క్షత్రియత్వాన్ని తాము పొందవచ్చని ఆలోచించారు. శూద్ర హోదా అవమాన కరమైనదని వారు భావించారు. ప్రాచీన, మధ్యయుగాలకు చెందిన రచనల్లో చాలా మంది బ్రాహ్మణ రచయితలు శూద్ర, చండాల అనే భావనను వారు పనికిరానివారు అని చిత్రించేందుకు ఉపయోగించారు. రుగ్వేదం రచించిన రోజుల నుంచి ఇది చారిత్రకంగా సాగుతూ వచ్చింది. వారు తమను తాము హిందువులుగా ఎన్నటికీ భావించలేదు. ముస్లిం చరిత్రకారుడు అల్ బెరూనీ (క్రీ.శ. 973–1053) ‘అల్–హింద్’ అనే పుస్తకం రాసిన తర్వాతే, హిందూ అనే భావన భారతీయ నిఘంటువులోకి వచ్చి చేరింది. అయితే ఇప్పుడు ఆరెస్సెస్, బీజేపీ భావ వ్యాప్తిలో ముస్లింలకు మొహమ్మద్ ఎలాగో, తులసీదాసు కూడా అలాగే గొప్ప హిందూ ప్రవక్త అయిపోయారు. ప్రవక్తను విమ ర్శించేవారు ఎవరైనా సరే, చంపేస్తామనే బెదిరింపులకు లోనయ్యే వారు. ఇప్పుడు స్వామి మౌర్యను అంతమొందించాలని ఒక హిందూ మతగురువు ఇప్పటికే ఫత్వా జారీ చేశారు. కానీ శూద్రులు, దళితుల విషయంలో ఎవరైనా ఇలాంటి విమర్శ చేస్తే వారికి ఏమీ కాదు. ఓబీసీ మహాసభ సభ్యులు గత వారం రామ్‌చరిత్‌మానస్ పుట లను బహిరంగంగా తగులబెట్టారు. ఈ దేశం అగ్రరాజ్యమని నేడు ఆరెస్సెస్, బీజేపీ శక్తులు పిలుస్తున్నాయి. అయితే శూద్రుల, దళితుల, ఆదివాసీల శ్రమ మాత్రమే ఈ దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇది భారతదేశం గురించిన నూతన భావన. ఆరెస్సెస్, బీజేపీ అధికారంలోకి వచ్చాక, అధికార కుల రాజకీయాలు నిశిత పరీక్షకు గురవుతున్నా యన్న విమర్శ ఉంది. ఎందుకంటే సామాజిక, రాజకీయ ప్రక్రియలో ఈ కులతత్వపు గ్రంథాలను పాలకవర్గ శక్తులు తిరిగి రుద్దాలని కోరుకుంటున్నాయి. తమ ఉనికిని, భవిష్యత్తును సరికొత్త ఉచ్చులోకి దింపే ప్రయత్నం జరుగుతోందని శూద్ర, ఓబీసీ, దళితులు మెల్లగా గుర్తిస్తున్నారు. గతంలో ఓబీసీలు, దళితులు రిజర్వేషన్ చుట్టూనే పోరా డుతూ వచ్చారు. ఆరెస్సెస్, బీజేపీలు ఉద్యోగాలను ప్రైవేటీకరించడం ద్వారా, దాదాపు ఈ సమస్యను అసంగతంగా మార్చి వేశాయి. ద్విజ నాయకత్వం కింద ముస్లింలు శత్రువులు అనే ముద్రను బలంగా చొప్పించడం ద్వారా శూద్రులు, దళితులను ద్విజ నియంత్రణలోకి తీసుకురావాలని వీరు కోరుకున్నారు. క్రమంగా ఈ ఎజెండాలో తమను ఉచ్చులోకి లాగుతున్నారని శూద్రశక్తులు గ్రహిస్తున్నాయి. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలని ఆరెస్సెస్, బీజేపీ కోరుకుంటున్నాయి. బెంగాల్, ఒడిషా తప్ప దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు, మండల్ విప్లవం తర్వాత పుట్టుకొచ్చిన శూద్ర నేతల ఆధిపత్యంలో ఉంటున్నాయన్నది గమనించాలి. శూద్ర, దళిత కమ్యూనిటీల నుంచి మేధావులు ఆవిర్భవిస్తుండటంతో, రామ్‌చరిత్‌మానస్, ఇతర ప్రాచీన సంçస్కృత గ్రంథాల చుట్టూ కొత్త చర్చలు మొదలు కానున్నాయి. అఖిలేష్ శూద్రుడు కాబట్టి 2016 యూపీ ఎన్నికల్లో ఓడిపోయి, ముఖ్యమంత్రిగా అధికార నివా సాన్ని ఖాళీ చేసినప్పుడు ఆవు పాలతో, గోమూత్రంతో సీఎం నివా సాన్ని శుద్ధి చేసి యోగి ఆదిత్యనాథ్ తనను ఎంతగా అవమానించిందీ అఖిలేష్‌కి, శూద్రులు, దళితులకు ఇంకా గుర్తుంది. ఇప్పుడిక రామ్ చరిత్మానస్ లేవనెత్తిన సమస్యతో ఉత్తర భారతదేశంలో అనేక కుల సాంస్కృతిక పోరాటాలు ప్రధాన భూమికలోకి రానున్నాయి. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
Sharad Yadav: ‘మండల్’ అమలు వ్యూహం ఆయనదే!
దేశరాజధానిలో 2023 జనవరి 12న తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూసిన శరద్ యాదవ్ (75) మృతి దేశవ్యాప్తంగా ఆయన అనుయాయులను, ఆరాధకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఈ యువ ఎమర్జెన్సీ వ్యతిరేక విద్యార్థి నేత 1974 జయప్రకాష్ నారాయణ్ ఉద్యమ సమ యంలో 27 ఏళ్ల ప్రాయంలోనే పార్ల మెంటు స్థానంలో గెలుపొంది జాతీయ నేతగా మారారు. ఓబీసీ భావన, దాని వర్గీకరణ జాతీయ నిఘంటువుగా మారడానికి చాలాకాలానికి ముందే ఆయన శూద్ర, ఓబీసీ, సామాజిక శక్తుల ప్రతినిధిగా, సోషలిస్టు సిద్ధాంతవేత్తగా ఆవిర్భవించారు. రామ్మనోహర్ లోహియా, కర్పూరీ ఠాకూర్ (బిహార్‌కి చెందిన క్షురక సామాజిక బృందానికి చెందిన నేత)ల సోషలిస్టు సిద్ధాంత భూమిక నుంచి ఉత్తర భారతదేశంలో ఆవిర్భవించిన నూతన యువ శూద్ర, ఓబీసీ నేతల బృందంలో శరద్ యాదవ్ ఒక భాగమై ఉండేవారు. ఈ బృందంలోని ఇతర నేతలు తమ సొంత రాష్ట్రాలకే పరిమితమై పోగా, ఈయన మాత్రం జాతీయ ప్రముఖుడిగా మారారు. ఈ యువ బృందానికి చెందిన ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్‌లు జాతీయ రాజకీయాల నుంచి వెనుదిరిగి రాష్ట్ర రాజ కీయాలకు పరిమితమైపోగా, శరద్ యాదవ్ మాత్రం పార్లమెంటులోనే ఉండిపోయారు. ఏడు సార్లు లోక్‌సభ సభ్యుడిగా, మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా నెగ్గిన శరద్ యాదవ్ పార్లమెంటులో పేదల అనుకూల సమరాల్లో పోరాడుతూ వచ్చారు. హిందీలో చక్కటి వక్త, తార్కిక చింతనాపరుడైన శరద్ యాదవ్ రాజకీయ వ్యూహకర్తగా ఉండేవారు. ఈయన రాజకీయ వ్యూహం ఫలితంగానే నాటి ఉప ప్రధాని, జాట్ నేత అయిన దేవీలాల్ నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలోనూ... మండల్ నివేదికలోని ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ ఇచ్చే అంశాన్ని వీపీ సింగ్ అమలు చేయవలసి వచ్చింది. జనతా దళ్ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పరిణామాల గురించి శరద్ యాదవ్ వివరించి చెప్పారు. ‘మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాల్సిందిగా జనతా దళ్ ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి మేము సోషలిస్టు నేతలందరినీ సమీకరించడం ప్రారంభించాము. ఇది జరగకుండా శూద్రులకు నిజమైన న్యాయం కలగదని మేము బలంగా నమ్మాము. మండల్ కమిషన్ సిఫార్సులను వీపీ సింగ్ సన్నిహితులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీన్ని అధిగమించడానికి ఆయన ఉపప్రధాని, ప్రముఖ జాట్ నేత దేవీలాల్ చౌదరి అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. చరణ్ సింగ్ జోక్యం కారణం గానే జాట్లను వెనుకబడిన వర్గాల జాబి తాలో మండల్ చేర్చలేక పోయారని తనకు తెలుసు. అయినప్పటికీ అనేక మంది స్థానిక జాట్ నేతలు, బృందాలు రిజ ర్వేషన్ కేటగిరీలో తమను చేర్చాల్సిందిగా తమ తమ రాజకీయ నేతలను ఒత్తి డికి గురి చేశారు. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న వీపీ సింగ్ గొప్ప ఎత్తు వేశారు. జాట్లను రిజర్వేషన్ జాబితాలో చేర్చడానికి తాను వ్యతిరేకమే అయినప్పటికీ, ప్రముఖ జాట్ నేత అయిన దేవీలాల్ జాట్లను చేర్చకుండా మండల్ సిఫార్సులను అమలు చేయబోరని వీపీ సింగ్‌కు కచ్చితంగా తెలుసు. జనతాదళ్ జనరల్ సెక్రెటరీ, పరిశ్రమల మంత్రీ అయిన చౌదరి అజిత్ సింగ్ కూడా వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ప్రచారం ప్రారంభించారు, ఓబీసీ జాబితాలో జాట్లను చేర్చాల్సిందేనని నొక్కి చెప్పసాగారు. దీంతో దేవీలాల్ రాజకీయ డైలమాలో చిక్కుకున్నారు. జాట్లను వెనుకబడిన వర్గంగా చేర్చిన ఘనత అజిత్ సింగ్‌కు దక్కకూడదని ఆయన కోరుకున్నారు. మరోవైపు, జాట్లను ఓబీసీ జాబితాలో చేర్చకుంటే తన సొంత జాట్ కమ్యూనిటీ నుంచి ఆగ్రహాన్ని చవిచూసే ప్రమాదాన్ని కూడా దేవీలాల్ కోరుకోలేదు. కాబట్టి, ఇది మండల్ కమిషన్‌పై చర్చకు ముగింపు పలుకుతుందని వీపీ సింగ్ భావించారు. ‘‘1990 ఆగస్టు 3న, వీపీ సింగ్ నాకు కబురంపి ‘సోదరా శరద్! చౌదరి దేవీలాల్ని ఇక ఏమాత్రం నేను సహించలేన’ని చెప్పారు. దేవీలాల్‌తో మాట్లాడతాననీ, ఈ అధ్యాయానికి శాశ్వతంగా ముగింపు పలుకుతాననీ నేను వీపీ సింగ్‌కు హామీ ఇచ్చాను. అయితే దేవీ లాల్‌ని కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించవద్దని నేను వీపీ సింగ్‌ను అభ్యర్థించాను. కానీ అప్పటికే దేవీలాల్‌కి ఉద్వాసన పలుకుతున్న ఆదేశాన్ని తాను రాష్ట్రపతికి పంపేసినట్లు వీపీ సింగ్ సమాధాన మిచ్చారు. దీంతో నేను సంభాషణను ముగించాల్సి వచ్చింది. మరుసటి రోజు తన కార్యాలయానికి రావలసిందిగా వీపీ సింగ్ కబురంపారు. నేను వెళ్లాను. దేవీలాల్ గురించి చర్చించుకున్నాము. నన్ను విశ్వాసంలోకి తీసుకోవాలని వీపీ సింగ్ భావించారు. అలాగైతేనే నేను దేవీలాల్‌తో జతకట్టబోనని ఆయన భావించారు. దేవీలాల్ పక్షంలో నేను చేరినట్లయితే ప్రధానమంత్రిగా తాను ఎక్కువ కాలం కొనసాగలేనని వీపీ సింగ్ భావిస్తున్నారని దీనర్థం. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న నేను మండల్ కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేస్తున్నట్లు ప్రకటించాలని వీపీ సింగ్‌ను కోరాను. ఆయన 1990 ఆగస్టు 15న దీనిపై ప్రకటన వెలువరించడానికి మొదట అంగీకరించారు. కానీ ఆగస్టు 9వ తేదీనే ఆయన దాన్ని ప్రకటించాల్సి వచ్చింది. అలా ప్రకటించకపోయి ఉంటే నేను ఢిల్లీలో జరగనున్న దేవీ లాల్ ర్యాలీలో చేరడం తప్ప మరొక అవకాశం నాకు ఉండేది కాదు. మండల్ సిఫార్సులను అమలు చేస్తే అవి సమానతా సమాజాన్ని విశ్వసించి, దానికోసం కలగన్న అంబేడ్కర్, కర్పూరీ ఠాకూర్, లోహియా, జయప్రకాష్ నారాయణ్ స్వప్నాలు సాకారమవుతాయని నేను భావించాను. 1990 ఆగస్టు 6న వీపీ సింగ్ నివాసంలో సాయంత్రం 6 గంటలకు క్యాబినెట్ సమావేశం జరిగింది. మండల్ కమిషన్ సిఫార్సుల అమలు ఈ సమావేశ ప్రధాన ఎజెండా. సన్ని హితులు హెచ్చరిస్తున్నప్పటికీ, ఆ మరుసటి రోజు అంటే 1990 ఆగస్టు 7న కేంద్ర ప్రభుత్వం 27 శాతం రిజర్వేషన్లను ఓబీసీలకు కల్పిస్తూ మండల్ కమిషన్ చేసిన రికమంండేషన్ను అమలు చేస్తామని ప్రకటించింది. చివరకు 1990 ఆగస్టు 13న ఓబీసీ రిజర్వేషన్ అమలుకు కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది. ఆగస్టు 10 నుంచే ఆధిపత్య కులాలు రిజర్వేషన్కి వ్యతిరేకంగా నిర సనలు ప్రారంభించాయి. నెలరోజుల పాటు విద్యార్థులు, బ్యూరోక్రాట్లు, టీచర్లు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ వ్యతిరేక నిర సనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. రహదారులు దిగ్బంధనకు గురయ్యాయి.’’ – ‘ది శూద్రాస్– విజన్ ఫర్ ఎ న్యూ పాత్’ అనే పుస్తకం నుంచి. అయితే, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను కల్పించాలన్న మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేసేలా వీపీ సింగ్ ప్రభుత్వాన్ని ప్రేరేపించడంలో; వీధుల్లో మండల్ అనుకూల, వ్యతిరేక పోరాటాలను రగుల్కొల్పడంలో నాటి యువ శరద్ యాదవ్ తగిన పాత్ర పోషించకపోయి ఉంటే, భారతీయ శూద్ర/ఓబీసీలు ఈ రోజు దేశంలో ఈ స్థాయికి చేరుకుని ఉండేవారు కాదు. ఆర్ఎస్ఎస్/బీజేపీ శక్తులను నియంత్రిస్తున్న ద్విజులు మండల్ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఆనాడు శూద్ర/ఓబీసీలు భారీ స్థాయిలో మండల్ అనుకూల సామాజిక సమీకరణకు పూనుకోకపోయి ఉంటే, నేడు ఓబీసీలు తమకు నాయకత్వం వహించి, నరేంద్రమోడీ భారత ప్రధాని కావ డానికి ద్విజులు అమోదించి ఉండేవారు కాదు. చివరగా, ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ శూద్ర/ఓబీసీ నేతలు నేటి తమ రాజకీయ ప్రతిపత్తికి గాను శరద్ యాదవ్ అనే గొప్ప పోరాటకారుడికి ఎప్పటికీ రుణపడి ఉంటారు. - ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
భారతీయ గ్రామాల్లో ఇంగ్లిష్ విప్లవం
ఇంతవరకు దేశంలో ఆంధ్రప్రదేశ్ లాంటి ఒకటి రెండు రాష్ట్రాలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను తప్పనిసరి చేశాయి. భారతదేశంలో విద్యా విప్లవానికి ఇదే నాంది. ఇటీవలి కాలంలోనే చాలా రాష్ట్రాలు ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్‌ని తప్పనిసరి సబ్జెక్టుగా చేయడం ప్రారంభించాయి. ఇప్పుడు అన్ని వ్యక్తీకరణల్లోనూ మెల్లగా తెలుగు పదాల స్థానంలో ఇంగ్లిష్ పదాలు వచ్చి చేరుతున్నాయి. ప్రాంతీయ భాషల్లో మాట్లాడేవారి మాతృభాషా పదాల స్థానంలో విప్లవాత్మకంగా ఇంగ్లిష్ పదాలు వచ్చిచేరాయి. ఇంగ్లిష్ పదాలతో మార్కెట్ అనేది మార్పుకు అసలైన యజమానిగా మారిపోయింది. మతాచరణలు, మత ఛాందసత్వాలు, మతతత్వం వంటివి ఈ భాషా విప్లవాన్ని ఆపలేవు. అక్టోబర్ 5 అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. అదే రోజు భారతీయ ఇంగ్లిష్ దినోత్సవం కూడా. భారతదేశంలో ఇంగ్లిష్ భాషలో విద్యకు 205 సంవత్సరాల చరిత్ర ఉంది. యాదృచ్ఛికంగా అక్టోబర్ 5న నా 70వ జన్మదినం కూడా! ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందుబాటులోకి తేవాలంటూ గత 30 సంవత్స రాలుగా నేను చేస్తూ వస్తున్న ప్రచారం ఇప్పుడు ఒక అర్థవంతమైన దశకు చేరుకుంది. విలియం కారీ, రాజా రామమోహన్ రాయ్ 1817లో నాటి కలకత్తాలో దేశంలోనే మొట్టమొదటి ఇంగ్లిష్ మీడియం పాఠశాలను ప్రారంభించారు. 2022 నాటికి ప్రధానంగా వైద్యశాస్త్రం వల్ల ప్రపంచం కాస్త ఉపశమనం చెందింది. అంతర్జాతీయ ప్రసార కర్తగా ఇంగ్లిష్ భాషను ఉపయోగించుకుని అభివృద్ధి చెందిన వైద్య శాస్త్రం నిజంగానే ప్రపంచం ధ్వంసం కాకుండా కాపాడింది. సైన్స్, ఇంగ్లిష్ రెండూ కలిసి మనలేకపోయి ఉంటే, కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మరుభూమి అయిపోయి ఉండేది. భారతదేశంలో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి ఒకట్రెండు రాష్ట్రాలే తమ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను తప్పనిసరి చేశాయి. భారతదేశంలో విద్యా విప్లవానికి ఇదే నాంది. ఇప్పటికే చాలాకాలంగా నాగాలాండ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలోనే బోధన కొనసాగుతూ వస్తోంది. ఇటీవలి కాలంలోనే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్‌ని తప్పనిసరి సబ్జెక్టుగా చేయడం ప్రారంభించాయి. కశ్మీర్ చాలా కాలానికి ముందే ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్‌ని తప్పనిసరి సబ్జెక్టుగా ప్రారంభిం చేసింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ బోధించడాన్ని ఎంతగానో ప్రోత్సహించింది. వీటితో పాటుగా, భారతదేశ వ్యాప్తంగా వేలాది ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు కూడా ఉన్న విషయం తెలిసిందే. నా చిన్నతనంలో నా కుల ప్రజలు మానవులతోనే కాకుండా, జంతువులతో కూడా కురుమ అని పిలిచే భాషలో మాట్లాడేవారు. చాలా కొద్దిమంది ప్రజలు మాత్రమే ఆ భాషను అర్థం చేసుకునేవారు. దానికి లిపి ఉండేది కాదు. నా మొత్తం కమ్యూనిటీ నిరక్షరాస్య కమ్యూనిటీ. లిపి లేని భాష తమలో తాము మాత్రమే మాట్లాడుకునేది. ఇతర గ్రామీణులకు ఆ భాష అర్థమయ్యేది కాదు. నా చిన్ని గ్రామం చుట్టూ లంబాడా గిరిజన గుడిసెలు ఉండేవి. వారు గొర్ బోలి అనే లంబాడా భాషను మాట్లాడేవారు. గ్రామం లోపల కొన్ని ముస్లిం ఇళ్లు ఉండేవి. వారి పిల్లలు ఉర్దూ మాట్లాడే వారు. ఇక వ్యవసాయ పనులు చేసే అనేక కులాలు తెలంగాణ మాండలికంలోని తెలుగు మాట్లాడేవారు. దాంట్లో చాలా ఉర్దూ పదాలు ఉండేవి. గత 65 సంవత్సరాల నా చైతన్యపూర్వకమైన, భావ ప్రసార జీవితంలో ఒక మందగమనంతో కూడిన నిశ్శబ్ద విప్లవం చోటుచేసుకుంది. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, గ్రామీణులు, పట్టణ వాసులు తేడా లేకుండా అన్ని ఇళ్లలో నిదానంగా ఇంగ్లిష్ మెల్లగా అడుగుపెట్టేసింది. మార్పు తీసుకురావడానికి ఇది ప్రారంభం. ఈ క్రమంలో బియ్యం స్థానంలో రైస్ అనే పదం వచ్చి చేరింది. మాంసం స్థానంలో మటన్ వచ్చి చేరింది. చేపలు అనే పదాన్ని ఫిష్ తోసి పారేసింది. కోడికూర స్థానంలో చికెన్, కూరగాయల స్థానంలో వెజిట బుల్స్ వంటి ఇంగ్లిష్ పదాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామాల్లో, కుగ్రామాల్లో అన్ని కమ్యూనిటీలకు సొంతమైపోయాయి. గ్రామాల్లోని అన్ని సంతల్లో, అంగళ్లలో కూడా తెలుగు పదాలు పక్కకుపోయి ఇంగ్లిష్ పదాలు వచ్చి చేరాయి. ఒక తెలుగులోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. సరుకులకు ఉపయోగించే రోజువారీ పేర్లు, పదాలకు సంబంధించి కూడా ఇంగ్లిష్ పదాలు చలామణిలో ఉంటున్నాయి. నిదానంగా అయినా సరే, భారతీయ జీవనం తప్పనిసరిగా ఆంగ్లీకరణకు గురవుతోందని చెప్పాలి. తెలుగు, ఉర్దూ లేదా లంబాడి భాష మాట్లాడే ప్రజలు కూడా నిత్యం ఉప యోగించే ఆహార పదార్థాలు, పేర్లు, నూతన టెక్నాలజీలకు ఇంగ్లిష్ పదాలు జోడించడం అలవాటైపోయింది. వారి జీవితంలోకి ప్రవేశి స్తున్న ఇంగ్లిష్ వారి భవిష్యత్తును కూడా మారుస్తోంది. ఇప్పటికైతే ప్రతి గ్రామంలోనూ స్త్రీ పురుషులకు కొన్ని వందల ఇంగ్లిష్ పదాలు తెలుసు. ఈరోజు ఇంగ్లిషులో ఉన్న మెషిన్లను ఉపయోగిస్తున్నవారు సెల్ ఫోన్ వంటి ఇంగ్లిష్ పేర్లనే వాడుతున్నారు. వీరి మాతృభాషలో సెల్, ఫోన్ వంటి ఇంగ్లిష్ పదాలకు సరిసమాన పదాలు లేవు. ప్రాంతీయ టీవీ ఛానల్స్ అయితే 30 నుంచి 40 శాతం వరకు ఇంగ్లిష్ పదాలు, వాక్యాలనే వాడుతున్నాయి. మార్నింగ్ న్యూస్, ఈవెనింగ్ న్యూస్, బర్నింగ్ టాపిక్, గన్ షాట్, బిగ్ ఫైట్, బిగ్ డిబేట్, న్యూస్ ఎక్స్‌ప్రెస్ వంటివి తెలుగు టీవీ స్క్రీన్లపై సాధారణంగా ఉపయో గించే పదాలుగా మారిపోయాయి. ప్రాంతీయ భాషలను మాత్రమే ఉపయోగించే ఛానల్స్‌కు వీక్షకులు పెద్దగా లేరు. 1950లలో బస్సు, ట్రెయిన్ వంటి ఇంగ్లిష్ పదాలు మన గ్రామా లను చేరుకున్నాయి. ఎందుకంటే ఈ వాహనాల్లో వారు ప్రయాణిం చడం మొదలెట్టారు. అలా ప్రయాణిస్తున్నప్పుడు టికెట్, కండక్టర్ వంటి పదాలను కూడా వారు నేర్చేసుకున్నారు. సంవత్సరం తర్వాత సంవత్సరం గడిచే కొద్దీ పనిముట్ల పేర్లు, మెషిన్లు వంటి యంత్రాల పేర్లకు పలు ఇంగ్లిష్ పదాలు వాడటం వారి జీవితంలో భాగమై పోయింది. ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో గిరిజన, గిరిజనేతర అనే తేడా లేకుండా ఈ మార్పు జరుగుతూ వచ్చింది. నా తొలి బాల్యంలో నేను ఉపయోగించిన కురుమ భాష అంతరించిపోయినందుకు నేను విచారించలేదు. అప్పట్లోనే అనేక ఉర్దూ పదాలు కలిసిపోయిన తెలుగులో మాట్లాడటం మొదలెట్టాను. మా గ్రామం మాజీ నిజాం రాజ్యంలో ఉంటున్నందున నాటి తెలుగును గ్రామంలో లేదా సమీ పంలోని పట్టణంలో చాలామంది ప్రజలు అర్థం చేసుకునేవారు. ఇప్పుడు అన్ని వ్యక్తీకరణల్లోనూ మెల్లగా తెలుగు పదాల స్థానంలో ఇంగ్లిష్ పదాలు వచ్చి చేరుతున్నాయి. వ్యాకరణంతో కూడిన భాషలో మాట్లాడకుండానే ఒక ఇంగ్లిష్ పదం లేదా పేరును ఉపయోగించడం ద్వారా చాలామంది ప్రజలు ఇప్పుడు పరస్పరం భావ ప్రసారం చేసుకుంటున్నారు. గ్రామంలో ఉత్పాదక భాష ఎన్నడూ వ్యాకరణ కేంద్రకంగా ఉండేది కాదు. అది భావ ప్రసార కేంద్రకంగా ఉండేది. ఇంగ్లిష్ పదాలు తమ కమ్యూనికేషన్ పరిధిని విస్తరించుకున్నాయి. నా తొలి బాల్యంలో గ్రామస్థులు ఇంగ్లిష్ పేర్లు కలిగి ఉన్న మెషిన్లను వాడటం మొదలెట్టారు. వాటి విడిభాగాలు కూడా ఇంగ్లిషులోనే ఉండేవి. ఉదా. 1960ల మొదట్లో సైకిల్ అనే పేరున్న వాహనం వారి జీవితంలోకి వచ్చేసింది. అలాగే చైన్లు, హ్యాండిల్స్ వంటి పదాలు కూడా. ఆ కాలంలోనే వారి గ్రామంలోకి వచ్చిన కరెంట్ అదే పేరుతో చలామణీ అయ్యేది. ఆయిల్ ఇంజిన్ అదే పేరుతో పిలిచేవారు. వాటి పేర్లతోనే ప్రజలు వాటి పాత్రలను, విధులను అర్థం చేసుకునేవారు. ప్రాంతీయ భాషల్లో మాట్లాడేవారి మాతృభాషా పదాల స్థానంలో విప్లవాత్మకంగా ఇంగ్లిష్ పదాలు వచ్చిచేరాయి. ఆరెస్సెస్– బీజేపీ, కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టు లేక ప్రాంతీయ పార్టీలు మద్దతిచ్చినా, లేకున్నా ఈ భాషా విప్లవాన్ని ఆపలేకపోయాయి. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బుద్ధిస్టులు, పార్సీలు వంటి అన్ని మతాల వాడుకలో ఇంగ్లిష్ పదాలు వచ్చి చేరాయి. మతాచరణలు, మత ఛాందసత్వాలు, మతతత్వం వంటివి ఈ భాషా విప్లవాన్ని ఆప లేవు. ఇంగ్లిష్ పదాలతో మార్కెట్ అనేది మార్పుకు అసలైన యజ మానిగా మారిపోయింది. ఈ మార్పును నేను చూడగలిగాను. ఇత రుల భాషను అర్థం చేసుకోలేని గ్రామాల్లోని ఇరుగుపొరుగు వారు కూడా ఇంగ్లిష్ పదాలను ఉత్తమంగా అర్థం చేసుకోవడం మొద లెట్టారు. ఎందుకంటే ఇంగ్లిష్ పదాలు వారిని మార్కెట్‌కు అను సంధానం చేశాయి. ఇంగ్లిష్ పదాలతో గ్రామ ప్రజలు ఇండియన్స్ అయిపోయారు. ఇంగ్లిష్ వారిని జాతీయవాదులను చేసింది. హిందీతో సహా ఏ ఇతర ప్రాంతీయ భాష కూడా దీన్ని సాధించలేకపోయింది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఇంగ్లిష్ మీడియంతోనే దేశాభివృద్ధి
రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రపంచ దేశాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన చేపట్టాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. సోమవారం తెల్లాపూర్‌లోని అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషన్ సొసైటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగానికి రూ.పదివేల కోట్లను ఖర్చు చేస్తుందని దానిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం సైతం విద్యాభివృద్ధికి రూ.పదివేల కోట్లను ఖర్చు చేయాలని సూచించారు. ధనవంతులు మాత్రమే ఇంగ్లిష్ మీడియం చదువుతున్నారని, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడితే చైనా లాంటి దేశాలతో పోటీ పడగలుగుతామని సూచించారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం వల్ల కొత్తగా ఎనిమిది లక్షల మంది పిల్లలు పాఠశాలల్లో చేరారని తెలిపారు. అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా కుల, మతాలకతీతంగా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా పెద్దపెద్ద విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించేలా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. త్వరలో రాజకీయ నాయకులకు సైతం పలు సబ్జెక్టులో శిక్షణ ఇవ్వడంతో పాటు వారు ఇంగ్లిష్‌లో మాట్లాడేలా శిక్షణ ఇస్తామన్నారు. (క్లిక్: వారు నమ్మనివే... నేడు జీవనాడులు) -
సామాన్య శూద్రుడికి సెయింట్‌హుడ్
భారతదేశంలో సామాన్య మానవుడైన దేవసహాయం లేదా లాజరస్ (1712–1752)ను వాటికన్ 2022 మే 15న ‘పునీత హోదా’(సెయింట్ హుడ్)గా ప్రకటించడం అనేక రకాలుగా చారిత్రాత్మకమైనది. సెయింట్ పీటర్ లేదా మదర్ థెరీసా స్థాయిని కల్పించడంతో ఇది సమానం. పుట్టుక, పెరుగుదల, చావు వరకూ హింసాత్మక జీవితాన్ని గడిపిన అతి సామాన్యుడు సెయింట్‌గా మారడం మానవ మత చరిత్రలో ఎన్నడూ చూసి ఉండం. నీలకంఠ పిళ్లైగా జన్మించిన దేవసహాయం కుల వ్యవస్థ కారణంగానే తనచుట్టూ ఉన్న లక్షలాది మంది మగ్గిపోతున్నారని గ్రహించాడు. మానవజాతిలోని సమస్త బానిసత్వానికి వ్యతిరేకంగా జీసస్ ఎలా దారి చూపాడో, దేవసహాయం కూడా తన మరణం ద్వారా భారత్‌లోని శూద్రులకు అలాంటి దారి చూపాడు. హిందూ దేవాలయాల్లో ప్రార్థించినట్లు గానే, స్త్రీ పురుషులు తమకు కానుకలు (క్రైస్తవ సంప్రదాయంలో అద్భుతాలు) ఇవ్వాలని దేవసహాయంను వేడుకునే వారు. ఆయన విగ్రహం మెడలో రంగురంగుల పూలదండలను అలంకరించి పూజలు చేసేవారు. పొట్టలోనే మరణించిన తన గర్భస్థ పిండాన్ని తాను ప్రార్థించిన వెంటనే సజీవమైన పసిపాపగా చేశాడని ఒక మహిళ ఆ మహిమ గురించి పేర్కొనడం దేవసహాయంకు సెయింట్‌హుడ్ ఇవ్వడానికి గల ఆధారాలలో ఒకటయింది. శూద్ర మహిళలపై ఘోరమైన కుల, ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధనాలు బిగించిన వ్యవస్థలో దేవసహాయం జన్మించాడు. తల్లి దేవకి అమ్మ. ఈమె కేరళలో నాయర్ అని పిలిచే శూద్ర వ్యవసాయ ఉత్పాదక కులానికి చెందిన వ్యక్తి. హిందూ ఆలయంలో పూజలు నిర్వహించే వాసుదేవన్ నంబూద్రి అనే బ్రాహ్మణ పూజారికి పుట్టిన సంతానమే దేవసహాయం (మతం మారడానికి ముందుపేరు నీలకంఠన్ పిళ్లై). దేవకి అమ్మ, వాసుదేవన్ నంబూద్రి మధ్య ‘సంబంధం’ వారి మధ్య ప్రేమ వ్యవహారం లేదా వారు వివాహం చేసుకున్న కారణంగా ఏర్పడిన సంబంధం కాదు. నంబూద్రికి ఆమె లొంగిపోవడం అనేది నాయర్ మహిళలతో లైంగిక సంబంధాలను నిర్బంధపూరితంగా బ్రాహ్మణులు పెట్టుకునే కులకట్టు బాటులో భాగంగా జరిగింది. ఇలాంటి లైంగిక బంధాన్ని ‘సంబంధం’ అని పిలిచేవారు. ఒక శూద్రుడిగా ఇలాంటి మానవ హింస ద్వారానే బాల్యం నుంచి పెద్ద వయసు వరకూ అనుభవిస్తూ వచ్చాడు దేవసహాయం. బ్రాహ్మణ నిర్దేశకత్వంలోని ఈ సంబంధంలోని హింసాత్మక భాగం ఏమిటంటే, పిల్లలు తమకు జన్మనిచ్చిన తండ్రి ఎవరు అనేది తెలుసు కోవలసి ఉంటుంది. పైగా ఈ సంబంధం ద్వారా పుట్టిన పిల్లలు తల్లివద్ద లేక ఆమె పుట్టింట్లో పెరగాలి లేదా వ్యవసాయ పనులు చేసుకుంటూ బయట గడపాలి. చాలామంది నాయర్ కుటుంబాలు ఇలాంటి వివాహేతర సంబంధం ద్వారా పుట్టిన తమ కుమార్తెల పిల్లలను ఆమోదించి వారికి కొన్ని ఆస్తి హక్కులు కల్పించేవారు. కానీ ‘సంబంధం’లో పుట్టిన పిల్లలు తండ్రి, తల్లితో పాటు ఇతర పిల్లలు ఉన్న కుటుంబాల్లో జీవించవలసి వస్తే అది ఘోరమైన చిత్రహింస లతో కూడిన జీవితాన్ని కలిగిస్తుంది. దీనిలో ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే ఇలాంటి పిల్లలను దేవుడి బిడ్డల్లాగే చూసేవారు. వీళ్లు దేవుడిచ్చిన దౌర్భాగ్యాన్ని అనుభవిస్తూ దానికి ఎదురు తిరగలేక జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. హిందూమతంలోని అలాంటి అమానుష జీవితానికి వ్యతి రేకంగా నీలకంఠన్ పిళ్లై తిరగబడి క్రైస్తవ మతం పుచ్చుకున్నాడు. ఆనాటి పూజారి వర్గం, క్షత్రియుల నియంత్రణలో ఉన్న రాజ్యం ఈ మతమార్పిడిని ఘోరాతిఘోరమైన నేరంగా భావించింది. క్రైస్తవు డిగా మారిన తర్వాత, దేవసహాయం కుల వ్యవస్థ కారణంగానే తన చుట్టూ ఉన్న లక్షలాది మంది ప్రజలు మగ్గిపోతున్నారని గ్రహించాడు. దీంతో దిగువ కులాలతో కలవటం ప్రారంభించాడు. కేరళలో ఇప్పటికీ నాయర్ కులం శూద్ర వ్యవసాయ కులంలో ఉన్నత శ్రేణిలో ఉంటోంది. అదే సమయంలో నాయర్లకు జంధ్యం ధరించే హక్కు లేదు. వీరికి సంçస్కృత గ్రంథాలు చదివే హక్కు లేదు. హిందూ ఆలయాల్లో వీరు పూజారులు కాలేరు. దేవసహాయం అన్ని కులాల ప్రజలతో కలిశాడనీ, అస్పృశ్యులతో కలిసి భోంచేయడం కొనసాగించాడనీ జనం చెప్పుకునేవారు. ఇది జీసస్ స్వయంగా ఇజ్రాయెల్‌లో అన్యజనులు, వ్యభిచారిణిలతో కలిసిన దానితో సమానం అని చెప్పుకోవచ్చు. వికీపీడియాలోని వివ రాల ప్రకారం, రాజ్యంలోని బ్రాహ్మణ పూజారి, భూస్వామ్య ప్రభువులు, రాజకుటుంబ సభ్యులు, నాయర్ కమ్యూనిటీ కలిసి దేవన్ లేదా రామయ్యన్ దలవా వద్ద దేవ సహాయంపై ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. శూద్రుల చారిత్రక బానిసత్వం, అదనంగా సంబంధం పేరిట స్త్రీ పురుషుల బంధంలో అత్యంత అవమానాలు భరించిన నాయర్ కమ్యూనిటీ కూడా విముక్తి ప్రదాత అయిన దేవసహాయంను చిత్రహింసలు పెట్టి వధించడంలో పూజారులతో, రాజుతో కలిసి పోయారు. శూద్రులలోని ఈ ప్రతిఘాతుక చైతన్యమే భారతదేశాన్ని చిరకాల బానిసల భూమిగా మార్చివేసింది. రెండువేల సంవత్సరాల క్రితం మానవజాతిలోని సమస్త బానిసత్వానికి వ్యతిరేకంగా జీసస్ ఎలా దారి చూపాడో, దేవసహాయం కూడా తన మరణం ద్వారా భారత దేశంలోని శూద్రులకు అలాంటి దారి చూపాడు. ఇప్పటికీ శూద్రులలో ఆధ్యాత్మిక బానిసత్వం కొనసాగుతోంది. క్రిస్టియన్‌గా మారిన తర్వాత దేవసహాయం మహారాజా మార్తాండవర్మ రాజ్యంలో నివసించసాగాడు. క్రిస్టియానిటీని స్వీకరిం చిన నాటికి ఆ రాజ్యంలో మంచి స్థానంలోనే ఉండేవాడు. కానీ 40 ఏళ్ల వయసులో అంటే 1752 సంవత్సరంలో అతడిని చంపేశారు. తమిళ–మలయాళీ ప్రాంతాన్ని చాలా కాలం పరిపాలించిన వర్మలు క్షత్రియులు. జీసస్‌ను శిలువ వేసిన కాలంలో జెరూసలెంలోని ఫరిసీ కౌన్సెల్ నాటి రోమన్ పాలకులపై ఒత్తిడి తెచ్చినట్లే, భారత ఉప ఖండం మొత్తంలో క్షత్రియులు పాలిస్తున్న రాజ్యాలకు బ్రాహ్మణులు న్యాయ శాసనాలు రచించేవారు. మరణ శిక్ష విధిస్తున్న సమయంలో రోమన్ పాలకుడు పొంటియనస్ పిలేట్, జీసస్ పట్ల మరీ కఠినంగా వ్యవహరించాలని అనుకోలేదు. కానీ అప్పటి పూజారి వర్గ మండలి అత్యంత క్రూరంగా వ్యవహరించి జీసస్‌కి శిలువ విధించింది. తలపై ముళ్ల కిరీటం పెట్టారు. గోల్గోతాలోని శిలువ వేసే ప్రాంతం వరకూ ఆయనపై శిలువ మోపి నడిపించారు. బ్రాహ్మణ ఆధిపత్యంనుంచి శూద్రులకు ఏవిధంగానూ విముక్తి లభించని విధంగా ప్రాచీన బ్రాహ్మణ న్యాయ శాస్త్రమైన మను ధర్మ శాస్త్రం శాసనాలు రూపొందిం చింది. అందుకే దేవసహాయం బ్రాహ్మణాధిపత్య హిందూయిజం నుంచి బయటపడినప్పటికీ అతడిని చిత్రహింసలు పెట్టాలని పూజారి వర్గం నిర్ణయించుకుంది. దళితులు, మత్స్యకారులు, వడ్రంగులు, గొర్రెల కాపర్లు, కుమ్మ రులు, ఇనుము, బంగారు నగల పనివారితో కలిసి భోంచేయటం ద్వారా దేవసహాయం కుల వ్యవస్థను ధ్వంసం చేయడానికి ప్రయ త్నించాడని ఆరోపించారు. పైగా మతమార్పిడిలను అతడు ప్రోత్స హించాడనీ, విదేశీయులకు సమాచారం ఇవ్వడం ద్వారా రాజద్రోహా నికి పూనుకున్నాడనీ ఆరోపణలు గుప్పించారు. జీసస్‌కి లాగే ముందుగా అతడిని నిర్బంధించి చిత్రహింసల ఏకాంత గదిలో ఉంచారు. మూడేళ్ల తర్వాత దేవసహాయాన్ని గొడ్డును బాదినట్లు బాది, గేదెపై కూర్చోబెట్టారు. గేదెను పురాణ గ్రంథాల ప్రకారం మృత్యుదేవత అయిన యుముడి వాహనంగా వర్ణించేవారు. గేదె వెనుక వైపు అతడిని తిప్పి గ్రామాల్లో ఊరేగిస్తూ కొరడాలతో కొట్టారు. భారతీయ ఉపఖండం మొత్తంలో అత్యధికంగా పాలను ఇచ్చే జంతువు గేదె. కానీ అది నల్లగా ఉంటుంది కాబట్టి బ్రహ్మణ పూజా రులు, క్షత్రియ పాలకులు దాన్ని దయ్యపు జంతువుగా భావించేవారు. జీసస్కు గాడిద వాహనమైనట్లే, దేవసహాయానికి గేదె దేవుడిచ్చిన వాహనంగా మారింది. ఆ గేదె ముందుకు కదులుతుండగా, రక్తమోడే టట్లు దేవసహాయాన్ని బాదారు. రోజుల తరబడి అతడికి కనీసం ఆహారం, నీరు అందించకుండా గేదెపై ఊరేగిస్తూ చిత్రహింసలు పెట్టారు. అతడిని ఎలా హింసిస్తున్నారో, బాధపెడుతున్నారో అతడి భార్య స్వయంగా చూసేలా నిర్బంధించారు. చివరకు అతడిని రాళ్లు, పొదలతో ఉన్న అడవిలో కాల్చేశారు. ఇప్పుడు దేవసహాయం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సెయింట్ అయ్యాడు. సెయింట్‌గా మారిన సాధారణ మానవుడు దేవసహాయం. ప్రపంచ ఆధ్యాత్మిక వ్యవస్థలపై ఇది తీవ్ర ప్రభావం కలిగిస్తుంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
సైద్ధాంతికంగా కాంగ్రెస్ మేల్కొన్నట్లేనా?
కాంగ్రెస్ పార్టీ ‘సామాజిక న్యాయ సాధన ప్యానెల్’ చేసిన సిఫార్సులు దాని భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో చెబుతున్నాయి. ఓబీసీల మద్దతుతో ఓబీసీ అభ్యర్థిని ప్రధానమంత్రిగా చేసిన బీజేపీని ఎదుర్కోవడానికి... ఓబీసీ వర్గాల అనుకూల పంథాను ఎంచుకోవడమే సరైన మార్గమని కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లుంది. సంస్థాగతంగా పునర్నిర్మాణం కాకపోతే ఓబీసీలు పార్టీతో కలవరని కాంగ్రెస్‌కి ఆలస్యంగానైనా బోధపడింది. లౌకిక వాదం, బహుళత్వం, మైనారిటీ ప్రాధాన్యవాదం అనే పాత సైద్ధాంతిక ఎజెండా ఇక ఏమాత్రమూ ఓబీసీ ఓట్లను సాధించిపెట్టదని కాంగ్రెస్ అవగతమైంది. ఉదయ్‌పూర్‌లో ఇటీవలే ముగిసిన మేధోమథన సదస్సులో సామాజిక న్యాయ ప్యాకేజిని కాంగ్రెస్ తీసుకురావడం ఈ అవగాహనలో భాగమే. కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణ వ్యూహం ఒక బలమైన ప్రయోజనాన్ని సాధించింది. రాజ స్థాన్లోని ఉదయపూర్‌లో ఇటీవలే మూడు రోజుల పాటు జరిగిన ‘నవ సంకల్ప్ చింతన్ శిబిర్’ లేదా నూతన మేధోమథన సదస్సులో సీనియర్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, కె. రాజు నేతృత్వంలో ‘సామాజిక న్యాయ కమిటీ’ని కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ కమిటీ పార్టీ పునర్నిర్మాణం కోసం పలు సామాజిక న్యాయ చర్యలను ప్రతిపా దించింది. మీడియా రిపోర్టులను బట్టి ఈ ప్యానెల్, పార్టీ నిర్మాణం లోని అన్ని స్థాయుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని సిఫార్సు చేసిందని తెలుస్తోంది. పార్లమెంటు లోనూ, రాష్ట్రాల అసెంబ్లీలలోనూ ఓబీసీ రిజర్వేషన్ల కోసం పోరాడాలని ప్యానెల్ సిఫార్సు చేసింది. ఆలాగే మహిళా రిజర్వేషన్ బిల్లులో ‘కోటా లోపలి కోటా’ను సమర్థించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్ కల్పించాలని కూడా ఇది సిఫార్సు చేసింది. మరింత కీలకమైన విషయం ఏమిటంటే, ప్రైవేట్ రంగంలోనూ కుల ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పనను కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సాధన ప్యానెల్ సిఫార్స్ చేయడం! ఇది పాలక భారతీయ జనతా పార్టీకి మింగుడు పడని సమస్యే అవుతుంది. వాస్తవానికి ఓబీసీల ఓటు కారణంగానే బీజేపీ కేంద్రంలో రెండుసార్లు అధికారం లోకి వచ్చింది. ప్రైవేట్ రంగంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల ఉనికిని మెరుగుపర్చడం వైపుగా బీజేపీ ఎలాంటి చర్యా తీసుకోలేదు. నిజానికి నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రైవేటీకరణ కారణంగా ఉద్యోగరంగంలో అనేక కోతలు విధించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కమిటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ), సామాజిక న్యాయ ప్యానెల్ సిఫార్సులను అప్పటికప్పుడు ఆమోదించ లేదు. సంస్కరణాత్మకమైన సామాజిక న్యాయ కార్యక్రమం పార్టీ ఆలోచనా తీరులో కనబడిందంటే ఇది దాని భవిష్యత్ రాజకీయాలను నిర్ణయించగలదు. ఇలాంటి సామాజిక న్యాయ ప్యాకేజిని కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ తీసుకురావడమే గొప్ప. అదేవిధంగా కుల ప్రాతిపదికన జనాభా గణన కోసం కాంగ్రెస్ పోరాడాలని సిఫార్సు చేసింది. దీన్ని బీజేపీ ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. లౌకికవాదం, వైవిధ్యత, బహుళత్వం, మతతత్వ వ్యతిరేకత వంటి అంశాలపై దృష్టి సారించడం ద్వారా పార్టీ అధికారంలోకి రావాలనీ, వస్తుందనే భావన పట్ల కాంగ్రెస్ మేథోమథన బృందాలు ఇంతవరకు సానుకూలంగా ఉండేవి. కానీ శూద్ర ఓబీసీలు, దళితులు, ఆదివాసీ ప్రజానీకం ఇలాంటి అమూర్త భావాలపై ఏమాత్రం ఆసక్తి ప్రదర్శించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించినట్లుంది. ఈ విషయంలో రాహుల్ గాంధీకే ఘనత దక్కుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ ఒక్కరే ప్రజానేత, జనాకర్షక నేతగా ఉన్నారు. పైగా తన అంతర్గత వ్యవస్థాగతమైన డోలాయ మానం కారణంగా సామాజిక న్యాయ ఎజెండాపై బలమైన వైఖరి తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా తడబడుతూ వచ్చింది. వీపీ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ రిపోర్టును అమలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు రాజ్యమేలింది. పీవీ నరసింహరావు అయిదేళ్లు, తర్వాత మన్మోహన్ సింగ్ పదేళ్లు దేశాన్ని పాలించారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా సామాజిక న్యాయ వ్యతిరేక కులీనవర్గాల ఆధిపత్య పట్టులోనే ఉండిపోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కులీన నేతల్లో చాలామంది బోర్డ్ రూమ్ మేనేజర్లే తప్ప ఓట్లు రాబట్టేవారు కాదు. మన్మోహన్ సింగ్, పి. చిదంబరం, జైరాం రమేష్, మణి శంకర్ అయ్యర్, దివంగత అహ్మద్ పటేల్ వంటివారు ప్రభుత్వాన్నీ, పార్టీని మేనేజ్ చేసేవారు మాత్రమే కాదు... క్షేత్రస్థాయిలో మండల్ శక్తుల పట్ల వ్యతిరేక భావంతో ఉండే వారు. పార్టీలోని ఈ కులీన వర్గాలకు రాజ్యసభే అధికార రాజకీ యాల్లోకి వచ్చేందుకు మార్గంగా కనిపించేది. ఇప్పుడు ఆ మార్గం రెండేళ్లుగా మూసుకు పోయింది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ విజయం తర్వాత (ఇందిరా గాంధీ హత్య నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 414 ఎంపీ స్థానాలు చేజిక్కించుకుంది) కాంగ్రెస్ పార్టీ దాదాపుగా డూన్ స్కూల్ టీమ్‌గా మారిపోయింది. ఇది పార్టీలో అంతర్గత సంక్షోభానికి దారితీసి నూతన జాతీయ నేతగా వీపీ సింగ్ పెరుగుదలకు దారితీసింది. 1991లో పీవీ నరసింహారావు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పర్చినప్పటికీ కాంగ్రెస్‌ని ముందుకు తీసుకుపోగలిగే మాస్ లీడర్‌గా అయన ఎప్పుడూ లేరు. మెరిట్ సిద్ధాంతాన్ని బలపర్చిన రిజర్వేషన్ వ్యతిరేక వర్గాలు మండల్ ఉద్యమాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. రాజీవ్ గాంధీ బద్ధశత్రువు వీపీ సింగ్ మండల్ కమిషన్ రిపోర్టును అమలు చేశారు. దీన్ని రాజీవ్ గాంధీ, ఆయన కులీన బృందం ఇష్టపడలేదు. ఓబీసీ రిజర్వేషన్ని వీరు శక్తికొద్దీ వ్యతిరేకించారు. కాంగ్రెస్ కులీన బృందంలో ఒక్కరంటే ఒక్కరు కూడా శూద్ర ఓబీసీ, దళిత్, ఆదివాసీ నేపథ్యంలోంచి వచ్చిన వారు ఉండేవారు కాదు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ శూద్ర ఓబీసీ యువత, ప్రజల ఆకాంక్షలను గానీ, వారి బలాన్ని గానీ అంచనా వేయడంలో పొరపడ్డాయి. యూపీఏ పదేళ్ల పాలనలో (2004–2014) మరింతగా సంఘటితమైన మండల్ వర్గాలను సంతృప్తి పరిచేందుకు కొన్ని సానుకూల చర్యలు చేపట్టారు. అయితే ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ ఏ మండల్ అనుకూల నేతకూ కాంగ్రెస్ చోటు ఇచ్చిన పాపాన పోలేదు. 2014 నాటికి గత పదేళ్ల పాలనా కాలంలో తామేం చేసిందీ గ్రామీణ భారత ప్రజానీకానికి సమర్థవంతంగా చెప్పగల నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఒక్కరూ లేకపోయారు. భారతదేశ వ్యాప్తంగా చక్కగా వ్యవస్థీకృతమై ఉన్న ఆరెస్సెస్, బీజేపీతో పోరాడటానికి యువ రాహుల్ గాంధీపై మాత్రమే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆధారపడింది. ఇదే సమయంలో మండల్ శక్తుల ప్రాధాన్యతను చక్కగా అర్థం చేసుకున్న బీజేపీ ఓబీసీ కార్డు ఉపయోగించి నరేంద్రమోదీని రంగంలోకి దింపింది. నరేంద్రమోదీ వికాసం, దాని వెనుకనే ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్‌కు జ్ఞానోదయం కలిగినట్లయింది. సంస్థాగతంగా పునర్ని ర్మాణం కాకపోతే ఓబీసీలు పార్టీతో కలవరని కాంగ్రెస్‌కు బోధపడింది. శూద్ర ఓబీసీల సంఖ్యను బట్టి చూస్తే (మండల్ అంచనా ప్రకారం జనాభాలో 52 శాతం) వీరి సమస్యలను పట్టించుకోకుండా, ప్రస్తావించకుండా సాధారణ ఎన్నికల్లో గెలవడం అనేది నేటి రాజకీయాల్లో ఆలోచనకు కూడా సాధ్యం కాని విషయం అని చెప్పాలి. లౌకికవాదం, బహుళత్వం, మైనారిటీ ప్రాధాన్యవాదం అనే పాత సైద్ధాంతిక ఎజెండా ఇక ఏమాత్రమూ ఓబీసీ ఓట్లను సాధించిపెట్టదని కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది. సామాజిక న్యాయ శక్తుల్లో రాహుల్ గాంధీ ఇమేజ్ మారుతుందేమో చూడాలి. తానూ, ఖుర్షీద్ నేతృత్వంలోని ప్యానెల్ తీసుకుంటున్న సామాజిక న్యాయ చర్యలను వ్యతిరేకించే గ్రూప్‌ని లైన్లో పెట్టడం రాహుల్‌కి చాలా కష్టమైన పనే అవుతుంది. మతతత్వ శక్తుల ప్రమాదంతో క్షీణించిపోతున్న భారతీయ వ్యవస్థల పరిరక్షణ కోసమైనా సరే, కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయకోసం పోరాటం చేయాల్సి ఉంది. భారత రాజ్యాంగ సంవిధానాన్ని తిరిగి ప్రజాస్వా మీకరించాల్సి ఉంది. ఇది మాత్రమే దేశాన్ని ప్రస్తుత అంధకార మార్గం నుంచి వెనక్కు మళ్లిస్తుంది. అంతేకాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు పునర్ వైభవం తీసుకొస్తుంది. ఉదయ్‌పూర్ సదస్సులో కాంగ్రెస్ ఆ మార్గాన్ని ప్రారంభించడం మంచి పరిణామమే అని చెప్పాలి. వ్యాసకర్త: ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
శౌరీది జాలిపడాల్సిన మేధావితనం
మండల్ శక్తులను ముందుకురికించిన వీపీ సింగ్ గురించి అరుణ్ శౌరీ తప్పు అంచనా వేశారు. కానీ తన సొంత శైలిలో దేశాన్ని పాలిస్తున్న మోదీ విషయంలో కూడా శౌరీ అంచనా తప్పింది. మోదీ ప్రధాని పీఠం అధివసించినప్పటికీ శౌరీలాంటి ఫారిన్ డిగ్రీ హోల్డర్లు తామే వ్యవస్థను నడపగలమని భావించి ఉంటారు. కానీ మోదీ వారి స్థానమేంటో చూపించారు. అయితే శౌరీ దృష్టిలో మోదీ చేసిన సీరియస్ తప్పు ఏదంటే, తాను ధిక్కరించిన అంబేడ్కర్‌నే మోదీ ఆరాధించడం! అంబేడ్కర్ ఒక కొత్త దేవుడిగా ఆవిర్భవించారనీ, కానీ అది చెల్లిపోయే పరిణామం కావచ్చనీ 1990లలో శౌరీ వంటివారు భావించి ఉంటారు. కానీ అంబేడ్కర్ నిజమైన ప్రజాస్వామ్య సంరక్షకుడిగా వెలిగిపోతున్నారు. కాస్త ఆలస్యంగా అయినా సరే, అరుణ్ శౌరీ మీడియా వర్గాల్లో మళ్లీ క్రియాశీలంగా ఉంటు న్నారు. ప్రస్తుత మోదీ ప్రభుత్వంపై తన అభిప్రాయం గురించీ, గతంలో ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఎడిటర్‌గా తన పాత్ర గురించీ ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతున్నారు. 1999–2004లో వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా బీజేపీతో తన సంబంధం గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. వీపీ సింగ్, నరేంద్రమోదీ గురించి తన అంచనా తప్పిందనీ... 1989లో, 2014లో వీరిద్దరినీ ప్రధాన మంత్రి పదవికి అభ్యర్థులుగా బలపర్చడంలో తాను పొరపాటు చేశాననీ చెప్పారు. 1990లలో పెల్లుబికిన రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాలకు అను కూలంగా బలమైన వాణిని వినిపించిన వారిలో అగ్రగామి అరుణ్ శౌరి. ఆ సమయంలో బీజేపీ ఒక పార్టీగా వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు పలికింది. కానీ బీజేపీ విద్యార్థి, యువజన విభాగాలు మండల్ రిజర్వేషన్లపై హింసాత్మకంగా వ్యతిరేకించాయి. బోఫోర్స్ కుంభకోణాన్ని ఎండగట్టిన వీపీ సింగ్ ఆ నేపథ్యంలోనే ప్రధానమంత్రి అయ్యారు. అందుకే కాంగ్రెస్ పార్టీకీ, వీపీ సింగ్ నేతృత్వంలోని జనతాదళ్‌కూ బద్ధ శత్రుత్వం ఏర్పడింది. ఆ కారణం వల్లే అరుణ్ శౌరీ, వీపీ సింగ్‌కి సన్నిహిత మిత్రుడైపోయారు. మండల్ కమిషన్ నివేదికను అమలు పర్చడానికి ముందు వరకు వీపీ సింగ్‌కి బలమైన మద్దతుదారుగా కొనసాగారు. ఆ తర్వాతే వీపీ సింగ్‌కి వ్యతిరేకంగా మారారు. ఈ క్రమంలోనే వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసింది. ఆ తర్వాత కూడా ప్రతిభా సిద్ధాంతానికి అత్యంత క్రియాశీలక మైన మద్దతుదారుగా శౌరీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తన దూషణ పర్వాన్ని కొనసాగించారు. ‘ప్రతిభా సిద్ధాంతం’ అనేది 1990లలో ద్విజ మేధావులు నిర్మించిన బోగస్ సామాజిక శాస్త్ర సిద్ధాంతం. ఈ సిద్ధాంత ప్రతిపాదకులు ఏ స్థాయికి వెళ్లారంటే మన దేశంలోని కులవ్యవస్థ బ్రిటిష్ వలసవాద సృష్టి అని ఆరోపించే సాహసానికి ఒడిగట్టారు. ఈ సిద్ధాంతం వెనుక మాస్టర్ మైండ్ అరుణ్ శౌరీనే అంటే ఆశ్చర్యపోవలసిన పనిలేదు. బ్రిటిష్ కుల గణనలో తప్ప భారత దేశంలో కులం అనేదే ఉనికిలో లేదని చెప్పే రచనలను ఎన్నింటినో ఆయన ప్రోత్సహించారు. ఆ సమయంలోనే ‘వర్షిపింగ్ ఫాల్స్ గాడ్స్ – అంబేడ్కర్, అండ్ ద ఫ్యాక్ట్స్ విచ్ హావ్ బీన్ ఎరేజెడ్’ అనే ఒక అసహ్యకరమైన గ్రంథరాజాన్ని కూడా రాసిపడేశారు. అదే సమయంలో ఇంగ్లిష్ మీడియాలో మండల్ అనుకూల శక్తుల స్వరాలకు చోటే లేకుండా పోయింది. ఈ విధంగా శౌరీ మండల్ వ్యతిరేక శక్తుల మేధోవంతమైన హీరోగా మారిపోయారు. ఆ సమయంలోనే నేను ఆంధ్రప్రదేశ్‌లో ఒక చిన్న గ్రూపు నిర్వహిస్తున్న ‘నలుపు’ అనే తెలుగు పక్షపత్రికలో ‘పరాన్న భుక్కులకు ప్రతిభ ఎక్కడిది’ అనే వ్యాసం రాశాను. మా దృష్టిలో అరుణ్ శౌరీ ఒక సజీవుడైన కౌటిల్యుడు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు శౌరీ ప్రేరేపించిన మండల్ వ్యతిరేక వాదంపై పోరాడాలని మేం భావించాం. ఆ సమయంలోనే సుప్రసిద్ధ విప్లవ గాయకుడు, రచయిత గద్దర్ ‘అరుణ్ శౌరిగా... నీకు ఆకలనేదేమెరుక’ అని ఒక పాట కూడా రాశారు. ఇక్కడ ఒక పంజాబీ బ్రాహ్మణ కులతత్వ మేధావి ఈ దేశంలోని ఉత్పాదక కమ్యూనిటీలన్నింటినీ ప్రతిభారహితులు అని నిందిస్తు న్నాడు. క్రమంగా మండల్ అనుకూల శక్తుల నంబర్ వన్ శత్రువుగా అరుణ్ శౌరీ మారిపోయారు. వీపీ సింగ్ ప్రభుత్వం కుప్పగూలి పోయాక, బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిపోయాక, శౌరీ బీజేపీకి సంబంధించి పూర్తికాలం మేధావిగా మారిపోయారు. పెట్టుబడుల ఉపసంహరణ శాఖ మంత్రిగా, ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగా నికి ఉద్యోగాలను మళ్లించడం అనే ఏకైక ఎజెండాతో పనిచేశారు. ఆ విధంగా వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆయన రిజర్వేషన్ వ్యతిరేక లక్ష్యం నెరవేరింది. శౌరీ రిజర్వేషన్ వ్యతిరేక ప్రచార కాలంలో లేక అడ్వాణీ రథయాత్ర ప్రచార కాలంలో మోదీ ఒక ఈవెంట్ మేనేజర్‌గా ఉండే వారు. శౌరీ అనేక సందర్భాల్లో నరేంద్రమోదీని గొప్ప రాజకీయ వాదిగా కాకుండా ఈవెంట్ మేనేజర్ మాత్రమేనని చెప్పేవారు. మోదీని ప్రధాని అభ్యర్థిగా శౌరీ ఎలా అంచనా కట్టారనేది సందేహం. మోదీపై తన అంచనా తప్పు అని ఇప్పుడెలా గ్రహించారు? ఏ అంశాలను బట్టి తన అంచనా తప్పు అని భావిస్తున్నారనేది ప్రశ్న. మోదీ తన ఓబీసీ కులాన్ని ఉపయోగించుకుని 2014 నాటి ఎన్నికల్లో గెలుపు సాధించలేరని వాజ్‌పేయి కాలం నాటి పాలక ద్విజ నేతలు చాలామంది భావించి ఉంటారు. ఒకవేళ మోదీ ప్రధాని పీఠం అధివసించినప్పటికీ శౌరీ లాంటి మరికొందరు ఫారిన్ డిగ్రీ హోల్డర్లు, ప్రపంచ బ్యాంకు నిపుణులు తామే వ్యవస్థను నడపగలమని భావించి ఉంటారు. కానీ మోదీ మాత్రం శౌరీనీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా వంటి అహంభావపు సీనియర్లనూ పక్కన పెట్టేశారు. అదే శౌరీకి తగిలిన మొట్టమొదటి షాక్. పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని శౌరీ భావించి ఉంటారు. కానీ అరుణ్ శౌరీ శత్రువులకు సంబంధించిన పునాదే మోదీ ఓటు పునాదిగా మారిపోయింది. అయితే శౌరీ దృష్టిలో అన్నిటికంటే మోదీ చేసిన సీరియస్ తప్పు ఏదంటే, తాను ధిక్కరించిన ‘ఫాల్స్ గాడ్’ అంబేడ్కర్‌నే మోదీ ఆరాధించడం. అంబేడ్కర్ ఒక కొత్త దేవుడిగా ఆవిర్భవించారనీ, కానీ అది చెల్లిపోయే పరిణామం కావచ్చనీ 1990లలో శౌరీ వంటివారు భావించి ఉంటారు. కానీ తాను దూషించిన ఆ ఫాల్స్ గాడ్ అంబే డ్కరే, శౌరీ రియల్ దేవుడు మహాత్మా గాంధీకంటే ఎక్కువ అను యాయులను కలిగి ఉన్నారు. శౌరీ ఆరాధించే మరొక దేవుడైన వివేకానందుడు అతడి హిందుత్వ భక్తులకు సందర్భానుసారం ఉల్లేఖనల్లో మాత్రమే ఉనికిలో ఉంటూ వచ్చారు. లేదా శశిథరూర్ వంటి ఐక్యరాజ్య సమితిలో శిక్షణ పొంది వచ్చిన కాంగ్రెస్ మేధావుల ఉల్లేఖనలకే వివేకానందుడు పరిమితమవుతూ వచ్చారు. అదే అంబే డ్కర్ విషయానికి వస్తే దళిత ఓబీసీ, ఆదివాసీ గృహాల నుంచీ, అన్ని మేథో ఫోరంలలో, పండుగల సందర్భాల్లో, కోర్టు తీర్పుల్లో, యూని వర్సిటీ చర్చల్లో, వార్తా పత్రికల కాలమ్‌లలో ఒక ప్రజాస్వామ్య సంరక్షకుడిగా వెలిగిపోతున్నారు. రాజ్యాంగాన్ని రాసిన అసలు రచయిత అంబేడ్కర్ కాదని అరుణ్ శౌరీ చేసే వాదనను మందమతి సైతం అంగీకరించడు. జీవిత పర్యంతం ప్రతిభా సిద్ధాంతానికి వ్యతిరేకిగా, ప్రజాస్వామ్యానికి అనుకూలవాదిగా ఉంటూ థియరీ, ఆచరణ రెండింటినీ ప్రారంభిం చిన అంబేడ్కర్ జాతి మొత్తం ఆలోచనల్లో ఇప్పుడు వెలుగొందు తున్నారు. కానీ నిరాశా నిస్పృహలతో సతమతమవుతున్న హిందూ ప్రాణిగా ఇప్పుడు తాను చనిపోవడానికి వేచి ఉంటున్నానని శౌరీ స్వయంగా చెప్పుకున్నారు. మండల్ వ్యతిరేక ద్విజ మేధావుల సర్కిల్లో మోదీ ఒక ప్రతిభ లేని ఓబీసీ! కానీ పాలనలో వారి స్థాన మేంటో మోదీ చూపించారు. దేశాన్ని మొత్తంగా తానే ఏలుతున్నారు. తన సొంత కారణాలతో మండల్ శక్తులను ముందుకురికించిన వీపీ సింగ్ గురించి శౌరీ తప్పు అంచనా వేశారు. కానీ తనలాంటి మేధావులను పక్కన బెట్టి, తన సొంత శైలిలో దేశాన్ని పాలిస్తున్న మోదీ విషయంలో కూడా శౌరీ అంచనా తప్పింది. మండల్ కాలంలో నా స్వరం ఎలా మూగబోయిందో అలాగే మోదీ కాలంలో శౌరీ స్వరం కూడా మూగబోయినందుకు ఒకరకంగా నేను సంతోషిస్తాను. అంబేడ్కర్ ఇప్పుడు నిజమైన దేవుడిగా మారి పోయారు. తనపై అంత ధిక్కారపూరితమైన పుస్తకం రాసినందుకు శౌరీని బహుశా అంబేడ్కర్ శిక్షించాలని భావించి ఉండరు. కానీ భారతీయ వాస్తవికత పట్ల మేధోపరమైన అలక్ష్యానికి గానూ శౌరీ తనపై తానే జాలి పడాల్సి ఉంది. అంబేడ్కర్ లేకుండా మండల్ రాజకీయాలు లేవు. మండల్ రాజకీయాలు లేకుండా ఈరోజు మోదీ ప్రధాని అయివుండేవారు కాదు. వ్యాసకర్త: ప్రొ.కంచ ఐలయ్యషెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఈ సంక్షోభానికి అసలు మూలం
ఈరోజు ప్రపంచం మొత్తం పుతిన్ గురించి మాట్లాడుతోంది. కానీ రష్యాలో పాతుకుపోయిన సనాతన మతతత్వమే అసలు సమస్య. కమ్యూనిజం, సోషలిజం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించడమే కాదు, రష్యన్ సమాజంలోకి సనాతన వ్యతిరేక విలువలను తీసుకొచ్చిన ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని కూడా అక్కడి సనాతన మతం వ్యతిరేకిస్తోంది. ఈ రాజకీయ, ఆధ్యాత్మిక, సామాజిక పునాదే నేడు పుతిన్‌ను ఇలా తయారు చేసింది. ప్రపంచం ఇప్పుడు అఫ్గాన్ తాలిబనిజం, రష్యన్ సనాతనవాదం వంటి పలురకాల మత ఛాందసవాదాలతో తలపడుతోంది. ఈ యుద్ధంలో రష్యా గెలిచి ఉక్రెయినియన్ ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసినట్లయితే, ఉదారవాద మత ప్రపంచం తమ ప్రజాస్వామ్యం, లౌకికవాదాల ప్రయోగంలో కొత్త దశలోకి ప్రవేశించక తప్పదు. ఆధునిక కాలాల్లో పాలకవర్గ రాజకీయ శక్తులు తీవ్రమైన మత లేదా మత వ్యతిరేక కార్యకలాపాల్లో మునిగితేలడం అత్యంత ప్రతికూల పరిణామాలను తీసుకొస్తుంది. రష్యన్ అనుభవం దీన్ని స్పష్టంగా ప్రదర్శిస్తోంది. రష్యాలో కమ్యూనిస్టు దశ సంపూర్ణంగా మత వ్యతిరేకతతో కూడుకుంది. కమ్యూనిస్టు పాలనలో భయంకరమైన బాధలకు గురైన సనాతన చర్చితో ఇప్పుడు పుతిన్ రష్యా ప్రగాఢంగా ముడిపడివుంది. 20వ శతాబ్ది ప్రారంభం నుండి రష్యన్ సమాజం, ప్రభుత్వం– రెండూ మత సమస్యపై అత్యంత తీవ్రమైన వైఖరులను తీసుకున్నాయి. బోల్షివిక్ విప్లవం తర్వాత రష్యాలో మత వ్యతిరేక ప్రచారం ఎంత తీవ్రంగా సాగిందంటే, చర్చికి సంబంధించిన చిహ్నాలు, భవనాలను కూల్చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలు అప్పటికీ మతస్ఫూర్తితో ఉంటున్నందున ప్రజలందరూ నాస్తికత్వాన్ని పాటించాలని కమ్యూనిస్టులు భావించేవారు. ఇప్పుడు రష్యన్ అధ్యక్షుడు పుతిన్... మతాచరణను రాజ్యవిధానంగా నమ్మాలని ప్రజలను బలవంతపెడుతున్నారు. రష్యన్ సనాతన చర్చి ప్రామాణికమైన పితృస్వామిక వ్యవస్థ నేతృత్వంలో ఉండేది. ఇది రోమన్ కేథలిక్ మతతత్వానికి భిన్నమైనది. అందుకే పుతిన్ నిరంకుశ వ్యవస్థను పూర్తిగా సమర్థించడం, ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని బలపర్చడమే కాకుండా యుద్ధానికి అవసరమైన బలగాలను కూడా ఇది సమీకరించింది. రష్యన్ చరిత్ర, జాతీయత పట్ల సనాతన చర్చి వ్యాఖ్యానం సరిగ్గా ఇతర ఆధ్యాత్మిక మతతత్వాలను అచ్చుగుద్దేలా ఉంటుంది. మతం అనేది జాతిని నిర్వచించే కీలక వనరుగా మారిపోయినప్పుడు ప్రతి అంశంలోనూ ఛాందసవాదం పాతుకుపోతుంది. రష్యాలో ఉక్రెయిన్ భాగమని రష్యన్ సనాతన మతబోధకులు నమ్ముతారు. ఎందుకంటే రష్యన్ సనాతన చర్చి ప్రస్తుత ఉక్రెయిన్ ప్రాంతంలో 10వ శతాబ్దంలో పుట్టింది. సెయింట్ ఆండ్రూస్ కీవన్ రస్ ప్రాంతంలో తొలి చర్చిని నెలకొల్పినట్లు చెబుతారు. అదే ఇప్పుడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ పేరుతో చలామణిలో ఉంది. రష్యా, ఉక్రెయిన్, బెలారస్లను సనాతన అఖండ రష్యాగా చెప్పేవారు. దీనికీ... ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను సనాతన హిందూ ప్రాంతాలుగా గుర్తిస్తూ అఖండ భారత్ గురించి ఆరెస్సెస్ నేతలు చెప్పేదానికీ ఏమాత్రం వ్యత్యాసం లేదు. సోవియట్ యూనియన్ శాంతియుతంగా విచ్ఛిన్నమైపోవడం ఆమోదించకూడదనీ, కనీసం సనాతన చర్చి కేంద్రంగా ఉన్న రష్యాను ఎలాగైనా సరే మళ్లీ ఐక్యపర్చాలనీ భావిస్తున్న సనాతన మతబోధకుల నుండి పుతిన్ ఈ థియరీని తీసుకొచ్చారు. సనాతన చర్చిలో కూడా అసమ్మతివాదులు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ చాలావరకు సనాతన నేతలు పుతిన్‌తో ఉంటున్నారు. ఈ రోజు ప్రపంచం మొత్తంగా పుతిన్ గురించి మాట్లాడుతోంది కానీ సమస్య ఒక్క పుతిన్ మాత్రమే కాదు. మొత్తం సనాతన మతతత్వానికి చెందిన మత జాతీయతే అసలు సమస్య. రోమన్ కేథలిక్ చర్చితో సనాతన రష్యన్ చర్చి విభేదించడంలో కొన్ని మౌలిక సమస్యలు ఉన్నాయి. అలాగే పశ్చిమాన ప్రొటెస్టెంట్ చర్చితో ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. సనాతన చర్చి మద్దతుతో పుతిన్ రష్యాకు ఎదురులేని నేతగా మారిన తర్వాత రష్యాలోని రోమన్ కేథలిక్కులపై హింసాత్మకంగా దాడి చేయడం మొదలైంది. గర్భస్రావాలపై, స్వలింగ వివాహాలపై రోమన్ చర్చి కాస్త ఉదారవాద దృక్పథం తీసుకోవడమే కాకుండా ఉదారవాద డ్రెస్ కోడ్‌ను కూడా పాటిస్తూ వచ్చింది. దీంతో ఇవన్నీ పాశ్చాత్య ప్రపంచ ఆధునికానంతర దశలో చొచ్చుకువచ్చిన అనైతిక విధానాలుగా సనాతన చర్చి భావించేది. పాశ్చాత్య ఉదారవాదులను సనాతనవాద రష్యన్లు తమ శత్రువులుగా భావించేవారు. అయితే రష్యన్లు ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్నారని దీని అర్థం కాదు. కమ్యూనిస్టు దశలో శ్రామికవర్గ నియంతృత్వ భావన రష్యన్ ప్రజల మనస్తత్వంపై ప్రతికూల ప్రభావం కలిగించింది. కమ్యూనిస్టు పాలనలో వారి అనుభవం వల్ల కావచ్చు. ప్రత్యేకించి సనాతన భావాలు కలిగినవారు సనాతన నిరంకుశ రాజకీయ పాలననే గట్టిగా విశ్వసిస్తున్నారు. నేటి రష్యాను ఆధ్యాత్మిక రాజ్యంగా మనం పిలవలేనప్పటికీ పుతిన్ వంటి స్వార్థ కాంక్షగల పాలకులు ఇలాంటి సనాతన వాతావరణాన్ని క్రమేపీ ఆధ్యాత్మిక నిరంకుశత్వంలోకి సులువుగా తీసుకుపోతారు. ఉదారవాదం, లౌకికవాదం రెండూ ప్రమాదకరమైన సిద్ధాంతాలని రష్యన్ సనాతనవాదులు నమ్ముతున్నారు. కమ్యూనిజం, సోషలిజం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించడమే కాదు, రష్యన్ సమాజంలోకి సనాతన వ్యతిరేక విలువలను తీసుకొచ్చిన ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని కూడా సనాతన చర్చి వ్యతిరేకిస్తోంది. పుతిన్ మితవాద నిరంకుశత్వం చాలా ఉపయోగకరమని ఇలాంటి జాతీయవాద ప్రాపంచిక దృక్పథాలు భావిస్తున్నాయి. తమ పొరుగున ఉన్న ఉక్రెయినియన్ ప్రజాస్వామ్యం తమ మితవాద, లాంఛనప్రాయమైన ఎన్నికలతో కూడిన నిరంకుశత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందని సనాతన చర్చి భావిస్తోంది. చైనా తరహా మార్కెట్ కమ్యూనిజాన్ని రష్యన్లు కోరుకోవడం లేదు. కమ్యూనిస్టు వ్యవస్థలు ప్రజల ఆధ్యాత్మిక స్వయంప్రతిపత్తిని నిర్మూలించడమే కాకుండా ప్రజాజీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభుత్వం నిర్దేశిస్తూ రావడంతో... ప్రభుత్వమూ, మతమూ ఒకటిగా కలిసిపోయి ఉండే తరహా నియంతృత్వాన్ని రష్యన్ సనాతనవాదులు కోరుకుంటున్నారు. ప్రభుత్వాన్ని, మతాన్ని విడదీయడానికి ఆస్కారమే లేని ఈ వ్యవస్థే పుతిన్‌ను సంపూర్ణంగా బలపర్చింది. చాలావరకు ముస్లిం దేశాలు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక నిరంకుశ రాజ్యవ్యవస్థలలోనే నడుస్తుంటాయి. కానీ ఇవి లౌకికవాదంతో ఘర్షణ పడవు. అఫ్గాన్ తాలిబనిజం ఒక్కటే అత్యంత తీవ్రరూపంలోకి మళ్లింది. మతం, రాజ్యవ్యవస్థ కలగలిసిన నిరంకుశత్వం... విభిన్న సామాజిక, రాజకీయ వ్యవస్థలను కొనసాగించదలుస్తున్న పొరుగుదేశాలతో యుద్ధాలు కోరుకుంటుంది. సోషలిస్టు వ్యవస్థలు కుప్పకూలిన తర్వాత ప్రపంచం తిరిగి సోషలిస్టు పూర్వ ఘర్షణల స్థాయికి చేరుకుంది. రష్యాలో ప్రజాస్వామిక సంక్షేమ జాతీయవాదం కాకుండా ఆధ్యాత్మిక జాతీయవాదమే జాతి కార్యాచరణను నిర్ణయిస్తోంది. పాశ్చాత్య ప్రపంచం రష్యాను ఒక ధూర్తదేశంగా వర్ణిస్తున్నప్పటికీ తమపై ఈ ముద్రను ఆధ్యాత్మిక జాతీయవాదం లెక్కచేయదు. క్రిస్టియన్ ప్రపంచంలో ఈ దిశను రష్యా ఇప్పుడు చూపిస్తున్నట్లుంది. ఉక్రెయిన్ కూడా ప్రభుత్వాన్ని, చర్చిని నామమాత్రంగా మాత్రమే విడదీసే ప్రజాస్వామిక నమూనాను ఆమోదించే సనాతన క్రిస్టియానిటీని కలిగి ఉన్నది కనుక ఈ యుద్ధంలో ఏం జరగబోతుందనేది వేచి చూడాలి. ప్రపంచం ఇప్పుడు అఫ్గాన్ తాలిబనిజం, రష్యన్ సనాతనవాదం వంటి పలురకాల ఆధ్యాత్మిక ఛాందసవాదాలతో తలపడుతోంది. భారతదేశంలో హిందుత్వశక్తులు పదేపదే తాము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నామనీ, రాజ్యాంగ పరిధిలో నడుస్తున్నామనీ చెప్పుకుంటున్నప్పటికీ, మతపరమైన ఛాందసవాదం ఈ శక్తులను ఏవైపునకు తీసుకుపోతుందనేది చెప్పలేం. మతమనేది ప్రభుత్వ పాలనతో కలిసిపోయాక, ఒక పాలకుడు జీవితకాల పాలకుడిగా మారాలని అభిప్రాయానికి వచ్చాక, మతపర శక్తులు పౌరసమాజాన్ని దూకుడుగా నియంత్రిస్తాయి. ఎన్నికల వ్యవస్థను కూడా తారుమారు చేసినప్పడు ఏ వ్యవస్థ అయినా నియంతృత్వంలోకి వెళ్లి తీరుతుంది. ఈ యుద్ధంలో రష్యా గెలిచి ఉక్రెయినియన్ ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసినట్లయితే, క్రిస్టియన్ ప్రపంచం తమ జాతీయవాదం, ప్రజాస్వామ్యం, లౌకికవాద తత్వాల ప్రయోగంలో కొత్త దశలోకి ప్రవేశించడం ఖాయం. ప్రొ‘‘ కంచ ఐలయ్య వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త షెపర్డ్ -
అందరి ఆకాంక్షల చదువు
ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలోనూ ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఆహ్వానించదగ్గది. ఇప్పటికే ఈ విషయంలో చొరవ తీసుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటిదాకా విద్యావ్యవస్థ ధనికులను మరింత ధనవంతులుగా మారిస్తే... పేదలను మరింత దరిద్రంలోకి నెట్టేసింది. పేద, ధనిక తారతమ్యాన్ని తగ్గించడం విద్య వల్ల మాత్రమే సాధ్యమని ప్రజలిప్పుడు గట్టిగా విశ్వసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు తోడైతే అవి ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడగలవు. విద్యాసంబంధిత అంశాల్లో పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకూ అధ్యాపకులందరినీ వృత్తిపరమైన క్రమశిక్షణను అనుసరించేట్టు చేయడం తప్పనిసరి. ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలోనూ ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాలన్న తెలంగాణ మంత్రివర్గ నిర్ణయం భారతీయ జనతా పార్టీ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి వేసిన మాస్టర్ స్ట్రోక్! ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లిష్ మీడియం విద్య, అమ్మ ఒడి వంటి పథకాలు జనసామాన్యంలో ఎంతో ప్రాచుర్యం పొందిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. 2022–23 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అటు పట్ట ణాలు, నగరాల్లో మాత్రమే కాదు... పల్లెపట్టుల్లోనూ వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యానికి మంచి ఆదరణ కనిపిస్తోంది. దీంతో తెలంగాణ ప్రజల్లోనూ అలాంటి పథకాలు తమకూ అందుబాటులోకి వస్తే బాగుంటుందన్న కాంక్ష బలపడటం అసహజమేమీ కాదు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు కల్వ కుంట్ల చంద్రశేఖరరావుకు ఈ రెండు పథకాలు కలిసివస్తాయనడం లోనూ ఎలాంటి సందేహం లేదు; 2018 ఎన్నికల్లో రైతు బంధు మాదిరిగా! జాతీయ పార్టీల తీరు అటు బీజేపీ గానీ, ఇటు కాంగ్రెస్ గానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను అంగీకరించలేవు. ఎందుకంటే ప్రాంతీయ భాషల సెంటిమెంటుతోనే ఈ పార్టీలు 70 ఏళ్లుగా తమను తాము బలపరుచుకుంటున్నాయి మరి! కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యతో ఈ అంశంపై ఒకసారి చర్చ జరిగింది. అయితే రాష్ట్రంలో ఉండే మేధావి వర్గం ఇంగ్లిష్ మీడియం బోధనపై సమస్యలు సృష్టిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. కేరళ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) నేత పినరయి విజయన్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని నాతో వ్యక్తం చేశారు. అయితే... ఈ మేధా వులు, చదువుకున్న వారందరూ కూడా తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలోనే చదివిస్తున్నారన్న సంగతి మరచిపోకూడదు. భారతీయ జనతా పార్టీని తీసుకుంటే... రాష్ట్ర, జాతీయ స్థాయిలు రెండింటిలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనపై ఆలోచన చేయడం లేదు. కానీ.. ధనికుల పిల్లలు చదువుకునేందుకు ప్రైవేట్ స్కూళ్లు పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే నడిపేందుకు మాత్రం ఓకే చేస్తుంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత పాఠ శాలల, విశ్వవిద్యాలయ స్థాయిలో విద్య పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ అవుతున్న విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ప్రాంతీయ భాషల్లోనే విద్యాబోధన జరగాలని అంటోంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్య చాలా అధ్వాన్న స్థితిలో ఉంది. ఆ పార్టీకి ఆర్థికంగా మద్దతిచ్చే పారిశ్రామిక వేత్తలు, భూస్వామ్య పోకడలున్న వారు సులువుగా డబ్బు సంపా దించేందుకు దేశవ్యాప్తంగా ఇంగ్లిష్ మీడియం విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర విభాగాలేవీ కూడా ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తాము ఇంగ్లిష్ బోధన అందిస్తామని చెప్పలేక పోతు న్నాయి. మతం, కమ్యూనలిజంల చుట్టే ఆ పార్టీ అజెండా ఉంటుం దన్నది వేరే సంగతి. కానీ వీటివల్ల ప్రయోజనం లేదని ఇప్పుడు గ్రామీణ ప్రజలు సైతం అర్థం చేసుకున్నారు. పేద, ధనిక తార తమ్యాన్ని తగ్గించడం విద్య వల్ల మాత్రమే సాధ్యమని ప్రజలి ప్పుడు గట్టిగా విశ్వసిస్తున్నారు. మౌలిక సదుపాయాలు తోడైతేనే... ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనకు మౌలిక సదు పాయాలూ తోడైతే అవి ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడగలిగే పరిస్థితి వస్తుంది. మౌలిక సదుపాయాలంటే ఎయిర్ కండీషన్ ఉన్న తరగతి గదులు కావాలని కాదు. ఈ దేశానికి అలాంటివి అస్సలు అవసరం లేదు. కావాల్సిందల్లా ప్రాథమిక అవసరాలను తీర్చగలిగేవి మాత్రమే. మంచి తరగతి గదులు, కూర్చునేందుకు తగిన ఏర్పాట్లు, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం వంటివన్నమాట. వీటన్నింటికీ మించి నిబద్ధతతో పాఠాలు బోధించే మంచి ఉపాధ్యాయుల అవసరమూ ఎంతో ఉంది. పాఠ్యపుస్తకాల్లోనివి వల్లెవేసే వారు కాకుండా... పరిస రాలను అర్థం చేసుకుని కనీస జ్ఞానంతో రాష్ట్ర, జాతీయ, అంతర్జా తీయ అంశాలను పిల్లలకు పరిచయం చేయగలిగిన వారు కావాలి. పాఠ్యపుస్తకాలు ఇతర టీచింగ్ మెటీరియల్ సరఫరా కూడా కీలకమే. 73 ఏళ్లుగా ద్వంద్వ విధానాలు... దేశంలో విద్యకు సంబంధించి గత 73 ఏళ్లుగా ద్వంద్వ విధానాలే అమల్లో ఉన్నాయి. ధనికులకు ఇంగ్లిష్‌లో, పేదలకు ప్రాంతీయ భాషల్లో బోధన సాగుతూ వచ్చింది. ఇరు వర్గాల మధ్య సౌకర్యాల అంతరమూ చాలా ఎక్కువే. ఫలితంగా పేదవారు, గ్రామీణ విద్యా ర్థులు జీవితంలో అన్ని దశల్లోనూ సమస్యలు ఎదుర్కోవాల్సిన పరి స్థితి ఏర్పడింది. ఈ విద్యావ్యవస్థ ధనికులను మరింత ధనవం తులుగా మారిస్తే... పేదలను మరింత దరిద్రంలోకి నెట్టేసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం పాఠశాల విద్యలో సమూల మార్పులకు ధైర్యంగా నిర్ణయించడంతో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. అప్పటివరకూ దేశంలోని ఏ ముఖ్యమంత్రీ ఇంతటి వినూత్నమైన, విప్లవాత్మకమైన మార్పుకు యోచన కూడా చేయలేదు. 2014లో తెలంగాణ ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందిస్తామని ప్రకటించినా ఏడేళ్లపాటు కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన గురించి ఆలోచన కూడా చేయలేకపోయారు. ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం ద్వారా రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థలను బలపరిచే చర్యలు చేపట్టినా... గ్రామీణ స్థాయిలో పాఠశాల విద్యా బోధన నాణ్యత పెంచడం పెద్దగా జరగలేదనే చెప్పాలి. ఒక దశలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఎంతో బలహీనమైంది కూడా. పట్టభద్రులు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఉద్యోగాలకు పోటీ పడే పరిస్థితి కూడా లేకపోయింది. ఇంటర్మీడియెట్ స్థాయిలో బోధన సక్రమంగా లేకపోవడంతో కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలపై ప్రభావం చూపింది. పాఠశాల స్థాయి ఉపా ధ్యాయులు మాత్రమే కాదు.. విశ్వవిద్యాలయ స్థాయి అధ్యాపకుల ఇంగ్లిష్ ప్రావీణ్యత అధ్వాన్న స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యావ్యవస్థలో సమూల మార్పులు జరగాల్సిన అవసరం ఏర్పడింది. ఆహ్వానించదగ్గ పరిణామం ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ తగిన మౌలిక సదుపాయాలతో ఇంగ్లిష్ మీడియం వైపు మళ్లించడం ఈ మార్పుల దిశగా వేసే తొలి అడుగు అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రయత్నం మొదలు పెట్టడం ఎంతైనా ఆహ్వానించదగ్గది. అయితే ఇది ఇక్కడితో ఆగి పోరాదు. పాఠశాల ఉపాధ్యాయులకు భాషతోపాటు కంటెంట్‌కు సంబంధించి తగిన శిక్షణ ఇవ్వడం ఒక పార్శ్వమైతే... టీచింగ్ వ్యవ స్థకు కొంత క్రమశిక్షణ నేర్పటం ఇంకోటి. ఉపాధ్యాయులు, అధ్యాప కుల ప్రజాస్వామ్య హక్కులకు గౌరవమిస్తూనే... విద్యాసంబంధిత అంశాల్లో పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకూ అందరినీ వృత్తి పరమైన క్రమశిక్షణ అనుసరించేట్టు చేయడం తప్పనిసరి. చైనీయుల మాదిరిగా విద్య నాణ్యత పెంచాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీకి అంతగా ఉన్నట్లు లేదు. జాతీయ విద్యా విధానం ఒక్కటే వ్యవస్థలో అన్ని మార్పులూ తీసుకురాదు. బీజేపీ మతతత్వ వాదం మైనార్టీలను ఆ పార్టీకి దూరం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా గతంలో విద్యావ్యవస్థనేమీ అంతర్జాతీయ స్థాయికి చేర్చలేదు. లేదా గ్రామీణ విద్యావ్యవస్థను చైనా మాదిరిగా మెరుగు పరచలేదు. అందుకే ప్రాంతీయ పార్టీలు ఈ దిశగా వేస్తున్న అడుగు లకు అందరూ తమవంతు మద్దతివ్వాల్సి ఉంది. వ్యాసకర్త: ప్రొ కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
అయోధ్య రాముడా? మధుర కృష్ణుడా?
రామాలయం, రామరాజ్యం వంటి అంశాలతో ఓటర్ల మనోభావాలను ప్రభావితం చేయడానికి యూపీలో బీజేపీ ప్రయత్నిస్తోంది. తాజాగా సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్... శూద్ర, ఓబీసీలకు అత్యంత ఆమోదనీయుడైన శ్రీకృష్ణుడిని రంగంమీదికి తీసుకొచ్చారు. శ్రీకృష్ణ రాజ్యమే సమాజ్ వాదీ పార్టీ సోషలిస్టు రాజ్యమని అఖిలేష్ ఇచ్చిన నినాదం బీజేపీ రామరాజ్య భావన కంటే మించిన మనోభావాలను ఇప్పుడు శూద్ర, ఓబీసీ వర్గాల్లో కలిగిస్తోంది. గోపాలకుడిగా, పిల్లనగ్రోవిని ధరించి ఉండే శ్రీకృష్ణుడి ఇమేజిని అఖిలేష్ తాజాగా ప్రయోగించారు. కేంద్రప్రభుత్వ వ్యవసాయ సంస్కరణ చట్టాలు ఈ గోపాలకులకు, ఆహార ఉత్పత్తిదారులకు వ్యతిరేకంగా నిలిచాయి కాబట్టి అఖిలేష్ మొదలెట్టిన ఈ కొత్త ప్రయోగం మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం, 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు దిశానిర్దేశం చేస్తుందన్నది తెలిసిన వాస్తవమే. ప్రత్యేకించి యూపీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోదీకి కీలక సవాలు కానున్నాయి. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలపై రైతులు చేసిన పోరాటంలో ప్రధాని ప్రతిష్ఠ మసకబారింది. సంవత్సరం తర్వాత ఆ చట్టాలను బేషరతుగా ఉపసంహరించుకోవడంతో మోదీ ప్రభుత్వం నైతికంగా, రాజకీయంగా ఓటమి చెందినట్లేనని చెప్పాలి. దాదాపు 14 నెలల పాటు రైతులు చేసిన చారిత్రక పోరాటం, ఆ క్రమంలో 750 మంది రైతులు మరణించడం... మోదీ పాలనలో సాధించిన సానుకూల ఫలితాలను తోసిరాజనడం గమనార్హం. మోదీ స్వయంగా ఎంచుకున్న గవర్నర్ సత్యపాల్ మాలిక్ (ఈయన పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కి చెందిన జాట్ కావడం విశేషం) ప్రధాని అధికారాన్ని నేరుగా ప్రశ్నించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు ప్రధానికీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కీ మధ్య సమరంగా ముద్రపడ్డాయి. మోదీ ఈ సమరంలో ఓడిపోయినట్లయితే, భారతదేశ భవిష్యత్తు కొత్త దిశలో నడుస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ యువ కుడు మాత్రమే కాదు... ఇప్పటికే జాతీయస్థాయిలో అనుభవజ్ఞుడైన నిపుణ నేతగా తనదైన ముద్ర వేసుకున్నారు. చారిత్రకంగా శూద్రులుగా గుర్తింపు పొందిన దేశీయ ఆహార ఉత్పత్తి శక్తులు ఇప్పుడు నరేంద్రమోదీకి వ్యతిరేకంగా తిరగబడు తున్నాయి. 2014లో మోదీ ఇచ్చిన ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ నినాదంలో ఇక ఏమాత్రం విశ్వసనీయత లేదని రైతులు గ్రహించారు. దేశ ఆహార ఉత్పత్తిదారుల ప్రయోజనాలకు ఆరెస్సెస్, బీజేపీ వ్యతి రేకమన్నది నిరూపిత సత్యం. ఆరెస్సెస్, బీజేపీ మెజారిటీవాదం అనే భావన అర్థరహితమైనదని కేంద్రప్రభుత్వంపై రైతుల సుదీర్ఘ పోరాటం స్పష్టంగా నిరూపించింది. వ్యవసాయ సంస్కరణ చట్టా లను ఉపసంహరించుకునేలా మోదీని ఒత్తిడికి గురి చేసింది మన దేశంలోని మెజారిటీ శూద్ర, ఓబీసీ ఆహార ఉత్పత్తిదారులేనని మర్చి పోరాదు. గుజరాత్‌కు చెందిన రెండు లేదా మూడు గుత్తపెట్టుబడిదారీ కుటుంబాల ప్రయోజనాల కోసమే కేంద్ర పాలకులు పనిచేస్తున్నారని మన దేశ రైతులు యావత్ ప్రపంచానికీ స్పష్టం చేశారు. మోదీ, అమిత్ షా కూడా గుజరాత్ నుంచి వచ్చారు. అలాగే మోహన్ భగవత్, దత్తాత్రేయ హొసబలే వంటి ఆరెస్సెస్ అగ్రశ్రేణి నేతలు కూడా ఈ రాష్ట్రం నుంచే వచ్చారు. శూద్ర, ఓబీసీ, దళిత్, ఆదివాసీ శక్తులు ఇప్పుడు ఈ వాస్తవాన్ని గ్రహించారు కూడా. ఈ గ్రహింపు ఇక ఓటర్ల చైతన్యంలో ఇంకిపోవడమే జరగాల్సింది. ప్రతిపక్ష పార్టీలపై ప్రత్యే కించి యూపీలో ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీపై డబ్బు, అధికార బలాన్ని ఉపయోగించి దెబ్బకొట్టాలని చూస్తున్న కేంద్ర పాలకుల విధానాలను ఓటర్లు అధిగమించాల్సి ఉంది. వాస్తవానికి అఖిలేష్ యాదవ్ వంటి యువ, నిపుణ శూద్ర నేత యూపీ పరిధిని దాటి రాజకీయంగా ఎదగడం చూసి ఆరెస్సెస్, బీజేపీ శక్తులు కలవరపడుతున్నాయి. అందుకే వీరు రామాలయం, రామ రాజ్యం వంటి అంశాలతో ఓటర్ల మనోభావాలను ప్రభావితం చేయ డానికి ప్రయత్నిస్తున్నారు. అయితే తాజాగా అఖిలేష్ యాదవ్... శూద్ర, ఓబీసీలకు అత్యంత ఆమోదనీయుడైన శ్రీకృష్ణుడిని రంగం మీదికి తీసుకురావడం ద్వారా చాలా నైపుణ్యంతో బీజేపీపై పోరా టాన్ని ప్రారంభించారు. అయోధ్య, ముస్లిం వ్యతిరేక వైఖరి వంటి అంశాలను దాటి ఇప్పుడు అన్నిటికంటే ప్రజల జీవితాలే కీలక సమస్యగా ముందుకొచ్చాయి. ప్రత్యేకించి, ఆరెస్సెస్, బీజేపీ ప్రచారం లోకి తీసుకొచ్చిన ‘హమ్ సబ్ హిందూ’ నినాదాన్ని ఇప్పుడు రైతులు ఏమాత్రం నమ్మడం లేదు. ఇటీవలిదాకా ఆరెస్సెస్, బీజేపీ నేతలు ముస్లింలను శత్రువులుగా భావిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం, ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు దిగి ప్రాణాలు కోల్పోయిన రైతులను తమకు అత్యంత ప్రధాన శత్రువులుగా చూస్తున్నారు. సనాతన వర్ణధర్మ మనస్తత్వంతో, భారతీయ రైతులకు వ్యతిరేకంగా రామరాజ్య భావన ఎలా పనిచేస్తుందో వీరు ఇటీవలిదాకా చేసి చూపించారు. శ్రామికులు, రైతులు, చేతివృత్తులవారి ప్రయోజనాలకు ఆరెస్సెస్ భావజాలం వ్యతిరేకమైనదనే గ్రహింపు ఇదివరకు శూద్రులు, ఓబీసీ లకు ఉండేది కాదు. అయితే వ్యవసాయ చట్టాలపై పోరాటంలో, రైతులు చూపించిన మార్గం తాము ఎలా ఉండాలనే విషయంపై వీరికి ఇప్పుడు పూర్తి గ్రహింపు నిచ్చాయి. శ్రీకృష్ణ రాజ్యమే సమాజ్ వాదీ పార్టీ సోషలిస్టు రాజ్యమని అఖిలేష్ యాదవ్ ఇచ్చిన నినాదం బీజేపీ రామరాజ్య భావన కంటే మించిన మనోభావాలను ఇప్పుడు శూద్ర, ఓబీసీ వర్గాల్లో కలిగి స్తోంది. గోపాలకుడిగా, పిల్లనగ్రోవిని ధరించి ఉండే శ్రీకృష్ణుడి ఇమేజిని అఖిలేష్ తాజాగా ప్రయోగించారు. బీజేపీ తీసుకొచ్చిన రామరాజ్య భావన కంటే అఖిలేష్ ప్రతిపాదించిన కృష్ణ రాజ్య భావనను ప్రజులు ఇప్పుడు మరింత ఎక్కువగా విశ్వసిస్తారు. ఎందుకంటే కేంద్రప్రభుత్వ వ్యవసాయ సంస్కరణ చట్టాలు ఈ గోపాలకులకు, ఆహార ఉత్పత్తిదారులకు వ్యతిరేకంగా ఎదురు నిలిచాయి. పౌరాణిక గాథలతో ప్రజల మనోభావాలను జ్వలింప చేయడం, వాటిని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి జరుగుతోంది. ఒక అభిప్రాయం ప్రకారం, కృష్ణుడు ఎన్నడూ బ్రాహ్మణ గురువుల అనుయాయిగా వ్యవహరించలేదు. తనకు తానే ‘దేవుళ్లకు దేవుడు’గా ప్రకటించు కున్నాడు. పైగా తన విశ్వరూప ప్రదర్శన ద్వారా మహాభారతంలో బ్రాహ్మణులకు వారి చోటు ఎక్కడుందో చూపించాడు. గోపాలకుడిగా ఉంటూ బ్రాహ్మణులకంటే ఆధిక్యతా స్థానంలో ఉన్నందువల్లే శ్రీకృష్ణుడి ఇమేజిని ఆరెస్సెస్ ప్రోత్సహించలేదు. శ్రీకృష్ణుడి స్వయం సత్తాక ఆధ్యాత్మిక ఘనతను శూద్రులు, ఓబీసీలు గుర్తించాల్సి ఉంది. అప్పుడు మాత్రమే వారు అఖిలేష్ యాదవ్ తాజాగా ఇచ్చిన కృష్ణ రాజ్య నినాదాన్ని తమ సొంతం చేసుకుంటారు. ఈ ఏడేళ్లలో గ్రామీణ పేదలు, రైతులు, విద్యార్థుల ప్రయో జనాలకు వ్యతిరేకంగా బీజేపీ పాలన వ్యవస్థీకృతంగా నడిచింది. స్టార్టప్ బిజినెస్ ప్రారంభించిన ఆహారేతర ఉత్పత్తిదారు లకు కొంత సంపదను పంపిణీ చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం శూద్రులు, ఓబీసీలు, దళితులు, ఆదివాసీల్లో ఒక్కరంటే ఒక్కరిని కూడా బడా వాణిజ్య నెట్వర్క్ లోకి ప్రోత్సహించిన పాపాన పోలేదు. అప్రతిష్ఠ పాలైన యోగీ ఆదిత్యనాథ్‌ను బలపర్చడానికి మోదీ ప్రభుత్వం పాటుపడుతోంది. తాజాగా, సమాజ్‌వాదీ పార్టీ మద్దతుదారుల ఇళ్లపై దాడి చేసేందుకు సీబీఐ, ఆదాయ పన్ను అధికారులును పంపించారు. ఇంతవరకు జైన వ్యాపార వర్గాలపై మోదీ, అమిత్ షా కన్ను పడలేదు. యూపీలోని జైనుల్లో చాలామంది బీజేపీ మద్దతుదారులే. కానీ అఖిలేష్ యాదవ్‌ని బలపరుస్తున్న జైనులపై ఇప్పుడు దాడి చేశారు. పొరపాటుగా బీజేపీ మద్దతు దారుడైన జైన్ ఇంటిపై కూడా దాడి చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడింది. ఏ రాష్ట్రంలో అయినా సరే... ఎన్నికల్లో గెలవడానికి తగిన ఆర్థిక దన్ను ఉన్న ప్రతిపక్షాన్నీ, దాని మద్దతుదారులనూ కేంద్ర పాలకవర్గం అసలు సహించబోదని ఈ ఘటన తేటతెల్లం చేస్తోంది. ఒక సమగ్రమైన రాజ్యాంగంతో ఏర్పడిన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ తమకు ఆమోదనీయం కాదని ఆరెస్సెస్, బీజేపీ ప్రతిరోజూ తమ చర్యల ద్వారా నిరూపిస్తూ వస్తు న్నాయి. ఎన్నికల నియమాలను తమకు అనుకూలంగా మార్చు కోవడం ద్వారా భారత ప్రజాస్వామ్య నిర్వచనాన్నే వీరు తోసి పుచ్చుతున్నారు. దీనివల్ల మొత్తం వ్యవస్థ కుప్పగూలిపోతుంది. ప్రజాస్వామ్య భావనకు తూట్లు పొడుస్తున్న ప్రస్తుత కేంద్రపాలక పార్టీ విధానంపై జాతీయ స్థాయిలో అన్ని ప్రతిపక్షాలూ కలసి పోరాడాల్సి ఉంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
అందరి వికాసం ఉత్త నినాదం కారాదు!
ఇటీవల జరిగిన ధర్మసంసద్ వ్యాఖ్యానాలు భారత సామరస్య వాతావరణాన్ని దెబ్బకొట్టేలా ఉన్నాయి. బ్రాహ్మణవాదాన్ని మోసే వీళ్లందరి ధోరణి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సవాల్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఈ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని తమ ఎజెండాను అమలు చేసే ప్రయత్నం జరుగుతోంది. కానీ శూద్రులు, ఓబీసీలను కూడా హిందూమతంలో భాగమని చెప్పే వీళ్లందరూ బీజేపీ ప్రకటిత ‘సబ్ కా సాథ్... సబ్ కా వికాస్’ నినాదాన్ని నిజం చేయాల్సి ఉంది. వాస్తవికంగా ఆ వర్గాల వారిని పైకి తెచ్చేలా, వారి కోసం స్పష్టమైన అభివృద్ధి ప్రణాళిక ప్రకటించాల్సిన అవసరం ఉంది. హరిద్వార్‌లో నరసింగానంద్ తదితరులు ఇటీవల నిర్వహించిన ధర్మసంసద్ భారత సామరస్య వాతావరణానికి తీవ్రమైన ముప్పుగా మారుతోంది. ప్రభుత్వ అనుమతులు లేకుండా అలాంటి సమావేశం ఒకటి జరిగే అవకాశం లేనట్లే. కానీ ప్రశ్నల్లా ఆ సమావేశం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆమోదం లేకుండానే, లేదా అందులోని పైస్థాయి నాయక గణంలో కొందరికైనా తెలియకుండానే జరిగిందా అన్నదే. ముస్లింల హననానికి బహిరంగంగా పిలుపునిచ్చిన వక్తల వ్యవహారం కేవలం మైనార్టీ వర్గాల ఉనికికి సంబంధించిన విషయం కానే కాదు. మహాత్మా గాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సే పేరును పదే పదే ప్రస్తావిస్తూండటం... మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూండటాన్ని బట్టి చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ అధికారాన్ని సైతం వీరు నేరుగా సవాలు చేస్తున్నట్లు కనిపి స్తోంది. భారత దేశం నుంచి ఇస్లాంను చెరిపివేయడం అసాధ్యమనీ, భారతీయ ముస్లింలు ఒంటరి వారు కాదనీ ధర్మసంసద్ నిర్వాహ కులకు స్పష్టంగా తెలుసు. ఇలాంటి వారు ఇస్లామిక్ ప్రపంచపు శక్తికి ఎదురొడ్డడం, అది కూడా ఆర్ఎస్ఎస్/భారతీయ జనతా పార్టీల పూర్తిస్థాయి మద్దతు ఉన్నా కూడా అసాధ్యం. ‘సాధు సమాజం’ ఇటీవలి కాలంలో జాతీయ అంశాల్లో జోక్యం చేసుకోవడం ఎక్కువవుతోంది. కాకపోతే కుల భావజాలపరంగా వీరంతా బ్రాహ్మణవాదులే. హిందూమతంలో భాగమని నమ్మే శూద్రుల్లో సాధువులు అయినవారు అతితక్కువ. చారిత్రకంగా చూస్తే శూద్రులను సాధువులయ్యేందుకు అనుమతించే వారు కూడా కాదు. నరేంద్ర మోదీ విషయాన్ని తీసుకుంటే.. ఆయనేమో తనను తాను ఓబీసీ ప్రధానిగా ప్రకటించుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో విజయం తరువాత మొదలైన రెండో టర్మ్‌లో పరిస్థితి ఆయన చేయిదాటిపోయినట్లుగా కనిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ ఈ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని తన అజెండాను అమలు చేయడం మొదలు పెట్టింది. ఆర్ఎస్ఎస్ అజెండాలో ముస్లింలు, వారికి సంబంధించిన పలు అంశాలున్నాయి. 2014–2019 మధ్యకాలంలో వీటిని సంఘ్ వర్గాలు దూరం పెట్టాయి. మోదీ కూడా ఢిల్లీ గద్దెకు కొత్తయినా సాధికారికంగా పెత్తనం చలాయించగలిగారు. 2019 ఎన్నికలు వచ్చే సమయానికి యాంటీ పాకిస్తాన్, ముస్లిం వ్యతిరేక రొడ్డకొట్టుడు నినాదాలు, వివాదాలను రెచ్చగొట్టే అవకాశం బీజేపీకి లేకుండా పోయింది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తరువాత అమిత్ షా భవిష్యత్తు ప్రణాళికను ఆచరణలో పెట్టాడు. ముందుగా కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ఆ తరువాత ట్రిపుల్ తలాఖ్, సిటిజన్‌షిప్ (అమెండ్మెంట్) యాక్ట్, జాతీయ సంస్థల్లో ముస్లింల ఉనికిని పరిమితం చేయడం వంటి చర్యలన్నీ ఈ ప్రణాళికలో భాగమే. వీటిల్లో కొన్నింటికి శూద్ర/ఓబీసీ వర్గాల్లోని కొందరి మద్దతు కూడా లభించింది. ఈ చర్యల వల్ల తమకు లాభం కలుగుతుందని వారు భావించడం దీనికి కారణం. అయితే ఆర్ఎస్ఎస్ శూద్రులు/దళితులు, ఆదివాసీల కోసం ఎలాంటి ప్రణాళిక, అజెండా సిద్ధం చేయలేదు– వాళ్లంతా హిందువులే అని పదేపదే చెప్పడం మినహా! సంఘ్ వ్యవస్థలోనూ శూద్రులు/ఓబీసీ వర్గాలకు చెందిన వారు ఎవరూ సిద్ధాంతకర్తలుగా ఎదిగే అవకాశం ఇవ్వలేదు. శూద్రులు, ఓబీసీలకు సంబంధించి అజెండాలో రిజర్వే షన్లు, అధికారంలో భాగస్వామ్యం, విద్య వంటి రాజకీయ, సామాజిక అజెండాలు కూడా సంఘ్ వ్యవస్థకు వెలుపల పుట్టుకొచ్చినవే. కాంగ్రెస్, ఇతర పార్టీలు అధికారంలో ఉన్న సమయాల్లోనూ ఆర్ఎస్ఎస్ వీటిల్లో ఏ ఒక్క అంశాన్ని కూడా లేవనెత్తింది లేదు. శూద్రులు, ఓబీసీల్లో అధికులు రైతులు. వ్యవసాయ చట్టాల రూపకల్పనతో తమపై జరిగిన తొలి దాడిని వారు గుర్తించారు. విస్తృతమైన నెట్వర్క్ ఉన్న సంఘ్ కూడా రైతుల నుంచి రాగల వ్యతిరేకతను ముందుగానే గుర్తించలేదని అనుకోవడం అనూహ్యం. మొండిగా వారిని అణచివేయాలని అనుకున్నారు. కానీ వ్యూహం కాస్తా బెడిసికొట్టింది. ప్రధానిగా మోదీ ‘‘సబ్ కా సాథ్... సబ్ కా వికాస్’’ అన్న నినాదమే ఇవ్వకపోయి ఉంటే శూద్రులు, ఓబీసీలు ఆయనను ఎప్పుడూ నమ్మి ఉండే వారు కాదని నా భావన. ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ మాటలను కొంచెం జాగ్రత్తగా గమనిస్తే... ‘‘సబ్ కా సాథ్... సబ్ కా వికాస్’’ అన్న నినాదాన్ని ఆచరణలో పెట్టేందుకు తాను కానీ.. తన సంస్థ (ఆర్ఎస్ఎస్) కానీ ప్రయత్నిస్తుందని ఎక్కడా సూచన ప్రాయంగానూ చెప్పలేదని స్పష్టమవుతుంది. వాస్తవానికి 2014 ఎన్నికల ప్రక్రియ నడుస్తున్నంత సమయమూ మోహన్ భాగవత్ నిశ్శబ్దంగానే ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ అనేది ఒకటి ఉందన్న విషయమూ ఎవరి దృష్టిలో లేకుండా ఉండింది. మోదీ ఓబీసీ నేపథ్యం గురించి ప్రజలకు తెలుస్తున్న కొద్దీ మోహన్ భాగవత్ జాతీయ స్థాయిలో ‘కనిపించడం’ మొదలైంది. వివిధ వేదికల్లో మాట్లాడుతూ రిజర్వేషన్లు, మైనార్టీ అజెండాలపై తన వ్యతిరేకతను వెళ్లగక్కారు. రిజర్వేషన్లపై చర్చ జరగాలనడం, మదర్ థెరెసాకు చెందిన సంస్థలపై దాడుల గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఓట్లు, అధికారం కోసం మోదీ ఎలాంటి హామీలైనా ఇవ్వనీ అన్న చందంగా ఆర్ఎస్ఎస్ 2014 ఎన్నికల వ్యూహం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం అత్యంత శక్తిమంతమైన మోదీ ప్రభుత్వం చేతుల్లోంచి కూడా వ్యవస్థ చేయిదాటినట్లుగా అనిపిస్తోంది. తాజా పరిణామాలను గమనిస్తే– అంతర్జాతీయ స్థాయిలో మరీ ముఖ్యంగా పాశ్చాత్య క్రిస్టియన్ ప్రపంచంలో మోదీ ఇమేజ్ను పెంచే ప్రయత్నం జరుగు తున్నట్లుగా అర్థమవుతుంది. పోప్‌ను కలిసి భారత్ రావాల్సిందిగా మోదీ ఆహ్వానించడాన్ని ఆర్ఎస్ఎస్ నాయకుల్లో చాలామంది జీర్ణించుకోలేకపోయారు. భారత్‌లో క్రిస్టియన్ అజెండా అమలుకు పోప్ ప్రయత్నిస్తున్నాడని వారు భావిస్తూండటం ఇందుకు కారణం. అయితే క్రిస్మస్కు ముందు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చర్చిలపై దాడులు మొదలయ్యాయి. దాడులకు పాల్పడిన వారిలో అధికులు అగ్ర కులాలకు చెందిన వారే. చిత్రకూట్‌లో డిసెంబరు 16న జరిగిన హిందూ మహా కుంభ్‌లో మోహన్ భాగవత్ ‘ఘర్ వాపసీ’కి పిలుపునిచ్చారన్నదీ ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. చర్చిలపై జరిగిన దాడులపై దేశమంతా ఆవేదన వ్యక్తమవుతున్న సమయంలో హోంశాఖ మదర్ థెరెసా హోమ్స్‌కు సంబంధించిన ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ దరఖాస్తును తిరస్కరించింది. అది కూడా సరిగ్గా క్రిస్మస్ రోజునే! కొన్నేళ్ల క్రితం మోహన్ భాగవత్ స్వయంగా మదర్ థెరెసా గురించి చెప్పిన మాటలు ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ‘‘మదర్ థెరెసా పేదలకు చేసిన సేవల వెనుక వారిని క్రైస్తవం వైపు మళ్లించా లన్న దురుద్దేశం ఉంది’’ అని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. మోదీ ఇప్పటివరకూ క్రిస్టియానిటీపై ఆ స్థాయిలో ఎప్పుడూ మాట్లాడలేదు. పాశ్చాత్య దేశాల్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో అత్యధికం క్రైస్తవాన్ని ఆచరించేవే. పోప్‌ను ఆహ్వానించడం ద్వారా దేశంలో జరిగిన క్రైస్తవ వ్యతిరేక చర్యలను కొంతవరకైనా సర్దుకోవచ్చునని మోదీ అనుకుని ఉండవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో సంఘ్ నెట్వర్క్ ఆ ఆలోచనకు పూర్తి వ్యతిరేకత వ్యక్తం చేసింది. దీంతో ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ అన్న నినాదాన్ని ఎవ్వరూ నమ్మని పరిస్థితి ఏర్పడింది. హరిద్వార్‌లో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. మోదీ కూడా ఇలాంటి ప్రణాళికాబద్ధమైన నేరాలు జరిగినన్ని సార్లూ మౌనాన్నే ఆశ్రయించారు. కానీ హరిద్వార్ అంశంపై మోదీ మౌనం ప్రభుత్వానికి పెద్ద దెబ్బే. రైతు ఆందోళనల తరువాత జరిగిన ఈ ఘటనకు మరింత ప్రాధాన్యమేర్పడింది. ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా జరిగిందేమీ కాదు. సంఘ్ వర్గాల్లో ఏదో మథనం సాగుతున్నట్టుగానే కనిపిస్తోంది. ఈలోపు దేశం మాత్రం అన్ని రకాల సమస్యలూ ఎదుర్కొంటోంది! ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
జీవించే హక్కు అందరి సొంతం కాదా?
ఢిల్లీలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి శూద్ర ఓబీసీల సదస్సు చేసిన డిక్లరేషన్ చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రకటన అని చెప్పాలి. కులాలవారీ జన గణనను సాధించడం, రిజర్వుడ్ ఉద్యోగాలను కొల్లగొట్టడానికి ఉపాధి రంగాన్ని మొత్తంగా ప్రైవేటీకరించడాన్ని నిరోధించడం, జాతీయ సంపదను అగ్రకుల పారిశ్రామికవేత్తల చేతుల్లో పెట్టడాన్ని అడ్డుకోవడం కోసం మరో కీలకమైన శూద్ర ఓబీసీల ఉద్యమం అవసరముందని ఇది స్పష్టం చేసింది. బ్యాంకులు, రైల్వేలు, ఎయిర్‌లైన్స్‌ను ప్రైవేటీకరించడం పూర్తయితే ఇకపై వాటిలో శూద్ర ఓబీసీలకు, దళితులకు, ఆదివాసీలకు ఉద్యోగాలు ఉండవని తెలిసిందే. ప్రస్తుత పాలకవర్గ శక్తులు వెనుకబడిన వర్గాలకు మంచి జీవితం అందించడంపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. కాబట్టే శూద్ర ఓబీసీ దళిత, ఆదివాసీ శక్తులు రెండో స్వాతంత్య్ర సమరానికి సిద్ధం కావాలి. ఢిల్లీలో ఇటీవలే ముగిసిన శూద్ర ఓబీసీ సదస్సు ఇస్తున్న సందేశమిదే! ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో 2021 డిసెంబర్ 21న భారీస్థాయి జాతీయ శూద్ర ఓబీసీల సదస్సు జరిగింది. వందలాది శూద్ర ఓబీసీ కార్యకర్తలు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, వివిధ యూనివర్శిటీలు, పౌరసమాజ సంస్థలకు చెందిన మేధావులు ఈ సదస్సుకు హాజరయ్యారు. మొట్టమొదటి శూద్ర ఓబీసీ డిక్లరేషన్ని వీరు తీసుకొచ్చారు. ఇది దేశం మొత్తానికి చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రకటన. చరిత్రాత్మకమైన రైతుల పోరాటం... భారతీయ వ్యవసాయ మార్కెట్లను హిందుత్వశక్తులు ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా శూద్ర ఓబీసీలు చేసిన పోరాటం మాత్రమే. ఆ తర్వాత కులాలవారీ జనగణనను సాధించడం, రిజర్వుడ్ ఉద్యోగాలను కొల్లగొట్టడానికి ఉపాధి రంగాన్ని మొత్తంగా ప్రైవేటీకరించడాన్ని నిరోధించడం, జాతీయ సంపదను అగ్రవర్ణ పారిశ్రామికవేత్తల చేతుల్లో పెట్టడాన్ని అడ్డుకోవడం కోసం మరొక కీలకమైన శూద్ర ఓబీసీల ఉద్యమం ఇప్పుడు నడుస్తోంది. అయితే శూద్ర ఓబీసీ శక్తులను బలహీనపర్చి వారిని ప్రాచీన భారతదేశంలోని బానిసల్లాగా మార్చడానికి హిందుత్వ శక్తులు కుట్రపన్నుతున్నాయి. శూద్ర ఓబీసీల సదస్సు నిర్వాహక కమిటీకి మండల్ ఉద్యమ హీరో శరద్ యాదవ్ నేతృత్వం వహించారు. కాగా, చగన్ భుజ్‌బల్ (ఎన్సీపీ కేబినెంట్ మంత్రి, మహారాష్ట్ర), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ అధ్యక్షుడు), కనిమొళి కరుణానిధి (ఎంపీ, డీఎంకే), కంచ ఐలయ్య (ఎడిటర్, విజన్ ఫర్ ఎ న్యూ పాత్) సునీల్ సర్దార్ (ప్రెసిడెంట్, సత్య శోధక్ సమాజ్) ఈ కమిటీ సభ్యులుగా వ్యవహరించారు. సమృద్ధ భారత్ ఫౌండేషన్–ఢిల్లీ, మహాత్మా ఫూలే సమతా పరిషద్–మహారాష్ట్ర సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. ఢిల్లీ డిక్లరేషన్‌పై పలువురు పండితులు, రాజకీయ నేతలు, కార్యకర్తలు ప్రసంగించి, లోతుగా చర్చించారు. రాబోయే నెలల్లో వివిధ రాష్ట్రాల్లో అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణపై వీరు చర్చిం చారు. దేశంలో మండల్ అనంతర పోరాటాలు ఎన్నింటికో నాయకత్వం వహించిన లాలూ ప్రసాద్ యాదవ్ వర్చువల్‌గా మాట్లాడారు. సామాజిక న్యాయాన్ని సాధించాలంటే కులాలవారీ జనగణన ఒక్కటే మార్గమని ఆయన స్పష్టంగా చెప్పారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, చగన్ భుజ్‌బల్, డీఎంకే ఎంపీ టీకేఎస్ ఇళంగోవన్, కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, హరియాణా మాజీ మంత్రి అజయ్ యాదవ్‌తోపాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు, మేధావులు ఈ ప్రకటనలోని లక్ష్యాల సాధనకు, దేశవ్యాప్తంగా శూద్ర ఓబీసీ శక్తులను సంఘటితం చేయడానికి అవసరమైన రాజకీయ, బౌద్ధిక ఎజెండాను రూపొందించారు. సుప్రసిద్ధ రచయిత్రి అరుంధతీ రాయ్ ఈ సదస్సుకు శక్తిమంతమైన సందేశం పంపారు. భారతదేశంలో సామాజిక బాధ్యత కలిగిన ప్రతి మేధావికీ కులాలవారీ జనగణన ఉమ్మడి లక్ష్యంగా ఉండాలని ఆమె వక్కాణించారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వంలో ఉన్న పాలక రాజకీయ వ్యవస్థ శూద్ర ఓబీసీలను బలహీనపర్చాలని ప్రయత్నిస్తోంది. రిజర్వేషన్ వ్యవస్థను రద్దు చేయాలని, ద్విజ గుత్తాధిపత్య కుటుంబాలను పైకి తేవాలని అది కంకణం కట్టుకుంది. ఈ పరిస్థితుల్లో కులాలవారీ జనగణన కోసం, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం పోరాటం దేశీయ ఆహార ఉత్పత్తిదారులకు, హస్తకళల నిపుణులకు జీవన్మరణ సమస్యగా మారుతోంది. వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా గత 13 నెలలుగా మన దేశంలోని రైతులు చావో రేవో చందంగా పోరాడుతూ వచ్చారు. ఈ క్రమంలో 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి ఓటు వేసిన శూద్రఓబీసీలు తమను కూడా వారు భరతమాత ముద్దుబిడ్డల్లాగే చూస్తారని నమ్మారు. కానీ ఏడేళ్ల పాలనా కాలంలో నేటి పాలకులు తమ రైతు వ్యతిరేక, ఓబీసీ వ్యతిరేక వైఖరిని చాటుకున్నారు. 1990లలోని మండల్ ఉద్యమంతో సామాజిక న్యాయ పోరాటం ముగియలేదని, అది ఇప్పటికీ కొనసాగుతోందని ఢిల్లీ డిక్లరేషన్ వాగ్దానం చేసింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ మండల్ రిజర్వేషన్ కోసం నాడు పోరాడిన శూద్రులు, ఇప్పుడు రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తున్న మరాఠాలు, జాట్లు, కాపు వంటి కులాలకు చెందిన శూద్రులు ప్రస్తుత ప్రమాదానికి వ్యతిరేకంగా సర్వశక్తులూ ఉపయోగించాల్సి ఉంది. బీజేపీ ఆరెస్సెస్ అధికారంలోకి రాగానే వ్యవసాయం సంపద్వంతమౌతుందని, లంచగొండితనం తగ్గిపోతుందని రెడ్లు, కమ్మ, వెలమలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), కేరళలో నాయర్లు, బెంగాల్లో మహిష్యాలు నిజంగానే భావించారు. కానీ జరుగుతున్నదేమిటి? మునుపటిలా చిన్నపాటి అవినీతి స్థానంలో లక్షలాది కోట్ల రూపాయలను రుణమాఫీ ద్వారా గుత్తసంస్థలకు కట్టబెడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని బ్యాంకులను, రైల్వేలను, ఎయిర్‌లైన్స్‌ను ప్రైవేటీకరించడం గురించి ఆలోచిస్తున్నారు. ప్రైవేటీకరించిన సంస్థల్లో శూద్ర ఓబీసీలకు, దళితులకు, ఆదివాసీలకు ఉద్యోగాలు లేవన్న విషయం తెలిసిందే. ఆరెస్సెస్ బీజేపీ మద్దతుదారులు తమ పిల్లలను ఉత్తమమైన ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చేర్పించి చదివిస్తున్నారు. పైగా ఇంగ్లిష్‌ను ఆధునిక సంస్కృతం లాగా చేసి ద్విజుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉంచాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటోంది. శూద్ర ఓబీసీల్లో అతి కొద్దిమంది మాత్రమే ఈ గేమ్ ప్లాన్‌ని అర్థం చేసుకుంటున్నారు. వారి పిల్లలను సంపద లేని వ్యవసాయ రంగంలోకి నెట్టేస్తున్నారు. పైగా ఆహారాన్ని, మతాన్ని అధికారంతో ముడిపెడుతున్నారు. ఇది శూద్ర ఓబీసీల చుట్టూ పన్నుతున్న అతి పెద్ద ఉచ్చు. భవిష్యత్తులో వీరి పిల్లల మెదళ్లు, శరీరాలు బలహీనంగా మారిపోతాయి. మొత్తం మీద పాలక వర్గ శక్తులు వీరికి మంచి జీవితం అందించడంపై ఏ మాత్రం శ్రద్ధపెట్టడం లేదు. శూద్ర దళిత ఆదివాసీ శక్తుల అజ్ఞానాన్నే తప్ప వారిలో విజ్ఞానాన్ని పాలకులు ప్రేమించడం లేదు. శూద్ర ఓబీసీ మేధావులు ప్రప్రథమంగా వీరి ఆటను పసిగట్టడం ప్రారంభించాయి. ఈ వర్గాల నుంచి అత్యున్నత విద్యావంతులైన మేధావులు, చింతనాపరులు, రచయితలు, పోరాటకారులు ఆవిర్భవించకపోతే వీరి పిల్లలు తిరిగి బానిసలుగా మారిపోతారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు అటు గ్రామాల్లోనూ, ఇటు ప్రైవేటీకరించిన పరిశ్రమల్లోనూ ఉపాధి దొరకడం లేదు. యజమానుల కంపెనీల్లో, కొద్దిమంది సంపన్నుల కంపెనీల్లో సెక్యూరిటీ సిబ్బందిగా మాత్రమే శూద్ర ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు చేరుతున్నారు. వీటిలో నెలకు పదివేల రూపాయల కంటే తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. ఈ కంపెనీలు మొత్తంగా ప్రైవేట్ కంపెనీలే. బిజినెస్ కుటుంబాలు ఆరెస్సెస్ – బీజేపీ శాఖల సమన్వయంతో వీటిని నిర్వహిస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన శూద్ర ఓబీసీల సదస్సు ఈ ప్రక్రియను గుర్తించింది కూడా! అసలు విషయం మరొకటుంది. దళితులు, ఉదివాసీలను అలా పక్కన బెట్టండి. చివరకు శూద్ర ఓబీసీలు కూడా మేధావులు, చింతనాపరులుగా మారడానికి పాలక వ్యవస్థ ఏ మాత్రం అంగీకరించడం లేదు. ప్రపంచస్థాయి విజ్ఞానం వీరికి కూడా అందాలని పాలకవ్యవస్థ భావించడం లేదు. ఆరెస్సెస్ అగ్రనేతల ప్రసంగాలు పదే పదే దీన్నే నిరూపిస్తున్నాయి. కాబట్టే శూద్ర ఓబీసీ, దళిత, ఆదివాసీ శక్తులు రెండో స్వాతంత్య్ర సమరానికి సిద్ధం కావాలి. ఢిల్లీ సరిహద్దుల్లో మొన్నటి వరకు పోరాడి మరణించిన రైతు హీరోల మార్గం వీరికి ఆదర్శం కావాలి. దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవలే జరిగిన శూద్ర ఓబీసీ సదస్సు ఇస్తున్న సందేశమిదే! ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
దళితులు శూద్రులే... విడగొట్టారంతే!
మానవ చరిత్రలో ఒక్క భారతదేశంలోనే అత్యంత హేయమైన అంటరానితనం వేళ్లూనుకొని ఉంది. దాదాపు అన్ని మతాలూ మనుషుల మధ్య ప్రేమను ప్రోదిచేసి, ఇహపరమైన జీవితాన్ని సమానత్వం, సౌభాతృత్వం వంటి గొప్ప ఆదర్శాలతో ఆనందమయం చేసుకోవడానికి మార్గాలు చూపించినవే. కానీ హిందు మతం మాత్రం అంటరానితనం ప్రాతిపదికన భారతీయ సమాజంలో అసమానతలకు బీజం వేసి కొనసాగేలా ఆంక్షలు విధించడం.. విడ్డూరమేకాదు అమానవీయం కూడా. ఒకప్పుడు శూద్రుల్లో భాగంగా ఉన్న దళితులను వారి నుంచి వేరుచేసిన వైనం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. దళితులు చారిత్రక శూద్రులు. ఆర్యులకంటే ముందు క్రీ.పూ. 3000 నాటికే వ్యవ సాయ–పట్టణ నాగరికతను అభివృద్ధి చేసు కున్న హరప్పా ప్రజా సమూహంలో వారూ భాగంగా ఉన్నారు. కానీ ఇంత ఆధునిక రాజ్యాంగం కలిగిన ప్రజాస్వామ్య వ్యవస్థలో బతుకు తున్నప్పటికీ, ద్విజులతో పాటు శూద్రులు కూడా వారిని అంటరాని వారుగా చూస్తున్నారు. మనకు గొప్ప ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ ఒక దళితుడనే ఎరుక భారతీయుల్లో కనిపిం చడం లేదు. అంబేడ్కర్ తనను తాను విముక్తి గావించుకొని, కులము, అంటరానితనం లేని ‘భారతదేశం అనే ఆలోచన’కు రూపమిచ్చాడు. అయితే ఇది సాకారం కావాలంటే, తమ సాటి ఉత్పాదక శూద్రులైన దళితులు తమ నుంచి ఎలా వెలికి గురయ్యారనే సంగతిని శూద్రులు అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఈ విభజన సృష్టించడం ద్వారా ద్విజులు.. తమ ఇరువురిపైనా ఎంత పటిష్టమైన నియంత్రణ కలిగి ఉన్నారో కూడా అర్థం చేసుకోవాలి. దళితులను శూద్రుల నుంచి వేరుచేసి వారికి ప్రతికూల ఆధ్యా త్మిక భావజాలాన్ని ఆపాదించింది బ్రాహ్మణవాదం. అది ఇప్పటికీ కొనసాగుతున్న ఒక మూఢ నమ్మకం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత మొత్తం జనాభాలో శూద్రులు 52 శాతం ఉన్నారు. దళితులు 16.6 శాతం ఉన్నారు. బ్రాహ్మణులు, బనియాలు, కాయస్థులు, ఖత్రీలు, వంటి వారందరూ కలిసి దాదాపు 5 శాతం మాత్రమే ఉన్నా. తమకన్నా అధిక సంఖ్యలో ఉన్న దళితులను వీరు ఆధునిక అంటరాని బానిసలను చేశారు. 2011 జనగణన ప్రకారం మొత్తం జనాభాలో హిందువులు 79.8 శాతం ఉన్నారు. శూద్రులు/ఓబీసీలు, ద్విజులు కచ్చితంగా ఎంతమంది ఉన్నారన్న సంగతి భవిష్యత్తులో కులాలవారీ జనాభా గణన చేసినప్పుడే తెలుస్తుంది. ప్రస్తుతం అనుకుంటున్న సంఖ్యలు గాలిలో రాతల లాంటివే. చర్రితను పరిశీలించినప్పుడు, కుల విభేదాలు భారత అభివృద్ధిపై చాలా ప్రతికూల ప్రభావం కలిగి ఉన్నాయనేది స్పష్టమవుతుంది. క్రీ.పూ. 1500 ప్రాంతంలో బ్రాహ్మ ణుల ఆధ్యాత్మిక గ్రంథంగా రుగ్వేదాన్ని రాయడంతో అసలు సమస్య ప్రారంభమైంది. ఆహార అనుత్పాదక వర్గాలవారు హరప్పా నాగరికత నిర్మాతలను శాశ్వతంగా తమ బానిసలుగా చేసుకున్నారు. వారు మొదట్లో ఈ బానిసలను అంటదగిన, అంటరానివారుగా; ఆ తర్వాత అనేక కులాలుగా విభజించారు. అంటరానితనం అనే సామాజిక జాడ్యం రుగ్వేదకాలంలో లేనే లేదనిపిస్తుంది. ఎక్కడా దాని ప్రస్తావన కనిపించదు. నాలుగు వర్ణాల్లో చిట్టచివరిదైన శూద్ర వర్ణం వారు మిగిలిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారికి అన్ని రకాల సేవలూ అందిస్తూ సేవించాలి. దీన్నిబట్టి అంటరానివారుగా భావిస్తున్న పంచములు మొదట్లో శూద్రులలో భాగంగా ఉండేవారని అర్థమవుతుంది. జంతు చర్మాలు, వాటితో తయారు చేసిన వస్తువులు అపవిత్రమైనవి (అంటరానివి)గా బ్రాహ్మ ణవాదం ప్రçకటించిన తర్వాతే తోళ్లతో సంబంధం ఉన్న శూద్రు లందరినీ అంటరానివారుగా పరిగణించారని అనిపిస్తుంది. వేద కాలపు ప్రజల ప్రధాన వృత్తి పశుపోషణ అయినప్పటికీ తోళ్ల పరిశ్రమ కూడా వారి ఆర్థిక జీవనంలో ఒక భాగమే అని చెప్పవచ్చు. వేదకాలపు పశుపోషణ ఆర్థిక వ్యవస్థను పోలిన ప్రస్తుత ఆదివాసీ వ్యవస్థలను పరిశీలిస్తే అందుకు సంబంధించిన సాక్ష్యాలు లభిస్తాయి. దట్టమైన అరణ్యాల్లో ఉన్న మనకాలపు ఆదివాసీ సమాజాల్లో కూడా వృత్తుల ప్రత్యేకీకరణ కనిపిస్తుంది. అక్కడా వేటాడటం, చర్మా లను సేకరించడం, ఆ చర్మాల నుంచి రకరకాల తాళ్లు, బ్యాగులు, ఇతర వ్యవసాయ పనిముట్లు తయారు చేయడం కనిపిస్తుంది. కానీ ఆ ఆదివాసీ సమాజాల్లో ఈ తోళ్లతో సంబంధం ఉన్న పనివారిని అంట రానివారుగా పరిగణించకపోవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాల అభివృద్ధి క్రమంలో అతి సహజంగా కనిపించే దృశ్యం ఇది. కానీ భారత దేశంలో బ్రాహ్మణవాదం మానవుల్లో బానిసత్వం కన్నా ఘోరమైన అంటరానితనం అనే కొత్త సూత్రాన్ని ప్రవేశపెట్టింది. అంటరానితనానికి గీటురాయి తోలు ఆధునిక భారతం అంతటా తోళ్ల పరిశ్రమ మొత్తం దళితుల పరి శ్రమగా ఉంది. ఇందులో పనిచేసేవారందరూ దళితులే. గ్రామీణ భారతావనిలో తోలు పని.. శూద్రులు, దళితులకు మధ్య అంటరాని తనానికి గీటురాయిగా ఉంది. అయితే ఇస్లాం రాకతో అందులోకి మారినవారు కుల పరమైన గుర్తింపు లేకుండానే తోలు పరిశ్రమలో భాగమయ్యారనుకోండి. ఇతర వెనుకబడిన తరగతులవారు, ద్విజులు ఎవరూ తోలు పరిశ్రమలో పనిచేయడం లేదు. అయితే ఏ దశలో తోలుపని అంటరానిదానిగా మారిందనేది స్పష్టంగా తెలియదు. శూద్రుల ఆచార వ్యవహారాల్లో కొత్తగా కులాల ప్రాతిపదికన బ్రాహ్మణ కర్మకాండలను బ్రాహ్మణవాదం ప్రవేశ పెట్టింది. తోలు అపవిత్రం, దానికి సంబంధించిన పని కలుషిత మైనదని ఈవాదం వారి బుర్రల్లో చొప్పించింది. ఫలితంగా అంటరాని తనం పాదుకుంది. కర్మకాండలు మూఢనమ్మకాలుగా మారి పోయాయి. ఇందుకు వేలాది సంవత్సరాల కాలం పట్టింది. అందుకే బ్రాహ్మణవాదం ఒక మతం కాదు. అది ఒక మూఢ నమ్మకం. పరంపరగా వస్తున్న బ్రాహ్మణ వాదం ఆధారంగా పనిచేసే ఆర్ఎస్ఎస్/బీజేపీ శ్రేణులకు అంటరానితనాన్ని నిర్మూలించాలనే ఎజెండా లేదు. దళిత, శూద్ర తత్వవేత్తలు కలిసి కూర్చొని భారత చర్రితను జాగ్రత్తగా అధ్యయనం చేసినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అంటరానివారు, అంటదగినవారి మధ్య ఉండే సంబంధం శాశ్వత మానవ సంబంధం కాదు. ఈ అమానవీయ సంబంధాన్ని నాశనం చేయడానికి నడుం బిగిస్తే తప్పనిసరిగా ఈ భూమిపై నుంచి అది మాయమవుతుంది. బ్రాహ్మణ వాద సాహిత్యానికి చెందిన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాల్లో అంటరానితనానికి ఎటువంటి పరిష్కారం లేదు. అసలు సమస్యను సృష్టించిందే ఈ సాహిత్యం కాబట్టి పరిష్కార మార్గాలు అందులో ఎందుకుంటాయి? ఇవ్వాళ ఆర్ఎస్ఎస్, బీజేపీలు బ్రాహ్మణ వాద గ్రంథాలన్నీ శూద్రులు, దళితుల అసలైన సంస్కృతిని నిక్షిప్తం చేశాయని, వాటిని అనుసరించాలని, వాళ్లంతా తమవారేనని.. తమ రాజకీయ ప్రాపగాండాలో భాగంగా ప్రచారం చేస్తున్నాయి. నిజానికి భారత దేశంలో తప్ప, ప్రపంచంలోని ఏ మత గ్రంథం కూడా ప్రజ లను కులాలుగా విభజించి అమానవీయమైన అంటరానితనాన్ని ప్రబోధించలేదు. తోలుపై రాయడాన్ని ఎందుకు నిరాకరించినట్లు? భారతదేశంలో తోలుతో సంబంధం ఉన్న వారందరినీ అంటరాని వారిగా చిత్రించిన బ్రాహ్మణీయ వ్యవస్థ, చివరికి తోళ్లను రాత సాధనంగానూ ఉపయోగించడానికి నిరాకరించింది. తోలుకు అపవ్రి తతను ఆపాదించిన బ్రాహ్మణవాదులు తొందరగా పాడైపోయే తాళ పత్రాలపై రాసేవారు. దీంతో మన ప్రాచీన జీవనానికి సంబంధించిన ఎంతో సమాచారాన్ని కోల్పోయాం. ప్రాచీన ప్రపంచంలో మొదటగా బైబిల్ని లిఖించింది సాపుచేసిన చర్మం మీదే. అలాగే గ్రీకు తత్వ వేత్తలు, ఈజిప్టు వాసులూ తోలుపైనే రాశారు. కన్ఫ్యూసియస్ వంటి చైనా తత్వవేత్తలు కూడా చర్మంపైనే తమ రచనలు చేశారు. టావో మతం చర్మంపై రాసిన రచనల ఆధారంగానే ఉనికిలోకి వచ్చింది. సమకాలీన ప్రాచీన ప్రపంచంలో భారతీయులు తప్ప వేరే ఎవరూ తాళపత్రాలను రాతకోసం ఉపయోగించలేదు. పోనీ దేశంలో తోలు పరిశ్రమలో ఉన్నవారన్నా చర్మంపై రాశారా అంటే అదీ లేదు. ఇందుకు కూడా నిందించవలసింది బ్రాహ్మణ వాదు లనే. ఎందుకంటే దళితులు, శూద్రుల చదువుపై నిషేధం విధించింది వారే గనుక. మానవుల మధ్య అసమానత్వాన్ని సృష్టించడానికి దైవత్వ భావాలను సాధనాలుగా ఉపయోగించడం వల్ల ప్రజల్లో ఉత్పాదకతా సామర్థ్యం దెబ్బతింటుంది. సరిగ్గా భారత దేశంలో జరి గిందీ ఇదే. ఈ బ్రాహ్మణీయ భావజాలం వల్ల కేవలం దళితులే కాదు శూద్రులు కూడా తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఉత్పాదక శక్తులు బాగా బలహీనమయ్యాయి. ఇతర శక్తులు భారతదేశంలో జోక్యం చేసుకుని ఉండకపోతే ఇండియా మరింతగా వెనకబడిపోయి ఉండేది. విశ్లేషకులు ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
విద్యార్థులు బలిపశువులు కారాదు!
సాంకేతిక సమస్య కారణంగా గడువుతేదీ లోపు ఫీజు చెల్లించలేకపోయిన ఒక దళిత విద్యార్థికి తప్పకుండా సీటు కల్పించాలని సుప్రీంకోర్టు ఇటీవలే కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఫీజు చెల్లింపు విషయంలో బ్యాంకు నుంచి జరిగిన సాంకేతిక లోపం కారణంగా ఆ విద్యార్థిని బలిపశువును చేయవద్దంటూ సుప్రీంకోర్టు అసాధారణ వ్యాఖ్య చేయడం గమనార్హం. విద్యార్థి భవిష్యత్తు విషయంలో శిలాసదృశంగా ఉండొద్దని, కాస్త మానవీయ దృష్టితో వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం హితవు చెప్పింది. ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం నుంచి కోర్సు ముగింపు వరకు తీవ్రమైన ఇక్కట్లను ఎదుర్కొం టున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు ఈ తీర్పు ఒక ఆశా కిరణమై నిలిచింది. ఉన్నత విద్యను ఆశించి, అష్టకష్టాలు పడి సీటు సాధించి, ఉద్యోగ జీవితంలో కూడా వివక్ష పాలవుతున్న వెనుకబడిన వర్గాల పిల్లలకు... ప్రిన్స్, అతడి తండ్రి సాగించిన పోరాటం నిజంగానే స్ఫూర్తిదాయకం అవుతుంది. పద్దెనిమిదేళ్ల దళిత కుర్రాడు ప్రిన్స్ జైబీర్ సింగ్‌కి 48 గంటలలోపు బాంబే ఐఐటీలో ప్రవేశం కల్పించాలని, సుప్రీంకోర్టు ఇటీవలే అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. ప్రతిష్ఠా త్మక ఐఐటీలో చేరడానికి ఫీజు చెల్లింపు విషయంలో బ్యాంకు నుంచి జరిగిన సాంకేతిక లోపం కారణంగా ఈ విద్యార్థి గడువుతేదీ లోగా ఫీజు చెల్లించలేకపోయాడు. దీంతో అతడికి ప్రవేశార్హత లేదని అధికారులు ప్రకటించారు. తన ప్రమేయం లేకుండా జరిగిన ఒక సాంకేతిక తప్పిదానికి ఆ కుర్రాడి భవిష్యత్తు పట్ల అమానవీయ దృష్టితో వ్యవహరించడం తగదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ సమస్య మానవీయ కోణానికి సంబంధించింది కాబట్టి నియమనిబంధనలను శిలాసదృశంగా పాటించకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పటికే చాలా ఆలస్యమైనందున ఆ విద్యార్థికి ప్రవేశం కల్పించడం చెడు పరిణామాలకు దారి తీస్తుందని బాంబే ఐఐటీ అధికారులు చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తాను చేయని తప్పుకు ఆ విద్యార్థిని బలిపశువును చేయవద్దని, ఒక యువకుడి భావి జీవితానికి సంబంధించిన ఈ విషయంలో వీలైనంత సహాయం చేసి అతడికి మేలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో భారత పీడిత ప్రజానీకంలో మన న్యాయవ్యవస్థ కాస్త ఆశలు నిలిపినట్లయింది. ఐఐటీ బాంబేలో తన స్థానంకోసం ప్రిన్స్ అనే పేరున్న ఈ దళిత కుర్రాడు చేసిన పోరాటం కానీ, ఈ క్రమంలో తాను సాధించిన విజయం కానీ సాధారణమైంది కాదు. ఇది ఇజ్రాయెల్ జానపద గాథల్లో గోలియెత్ని ఓడించిన గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టిన డేవిడ్‌ను తలపించింది. ఒక దళిత కుర్రాడు అందులోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రిన్స్ అనే పేరు పెట్టుకోవడం అసాధారణమే అని చెప్పాలి. ప్రిన్స్ అంటే ఇంగ్లిష్‌లో ‘ఎదుగుతున్న పాలకుడు’ అని అర్థం. అన్యాయానికి మూలం ఇదా? బాంబే ఐఐటీకి చెందిన జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీలోని అధికారులు ప్రిన్స్ అనే పేరు కల ఈ కుర్రాడి దళిత మూలాలను అనుమానించి ఉండవచ్చు. కానీ నిర్దేశించిన సమయంలోనే ఈ కుర్రాడి సోదరి ఐఐటీ పోర్టల్‌లో అవసరమైన అన్ని పత్రాలనూ అప్లోడ్ చేసిన తర్వాత పీజు కట్టడానికి ప్రయత్నించింది. కానీ వెబ్సైట్ పనిచేయ లేదు. దాంతో ప్రిన్స్ స్వయంగా మరోసారి ప్రయత్నించగా మళ్లీ అతడి ప్రయత్నం తిరస్కరణకు గురైంది. మన సంస్థాగత పునాదిలో ఆన్లైన్ అడ్మిషన్లను కూడా పక్షపాత దృష్టితో వేధించడానికి ఉపయోగిస్తారన్నది తెలిసిందే. భారతదేశంలో చివరకు ఇంటర్నెట్ కూడా దళిత వ్యతిరేక పాశుపతాస్త్రంగా మారిపోవడం విచారకరం. ఆ కుర్రాడు, ఉమ్మడి సీట్ కేటాయింపు విభాగం పనిచేస్తున్న పశ్చిమబెంగాల్ లోని ఐఐటీ ఖర్గపూర్కి సాధారణ కానిస్టేబుల్ అయిన తండ్రితో కలిసి వెళ్ళాడు. ఫీజు కడతానని చెప్పినా అతడిని చేర్చుకోవడానికి అధికారులు తిరస్కరించారు. గడువుతేదీ ముగిసిందని కారణం చెప్పారు. దీంతో అతడు బాంబే హైకోర్టు తలుపులు తట్టాడు. అక్కడా అతడి పిటిషన్‌ని కొట్టేశారు. చివరకు అతడు సుప్రీకోర్టుకు వెళ్లాడు. ఆ కుర్రాడిని ఐఐటీలో చేర్చుకోవలసిందిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వై.డి. చంద్రచూడ్, ఏఎస్ బోపన్న సంచలనాత్మక ఆదేశాలు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన దళిత కానిస్టేబుల్ కుమారుడు అనేక స్థాయిల్లో పోరాటం సల్పి చిట్టచివరకు ఐఐటీ బాంబేలో చేరగలగడం ఆధునిక ఏకలవ్య గాథను తలపిస్తుంది. సమర్థుడైన విలుకాడు అయినందుకు తన బొటనవేలును కోల్పోవలసి వచ్చిన ఏకలవ్యుడు శస్త్రచికిత్స సహా యంతో తిరిగి తన బొటనవేలును పొందగలిగాడు. ఇప్పుడు ఈ దళిత కుర్రాడు ప్రిన్స్, ఐఐటీ సీటు కోసం పడిన తపనకు సుప్రీంకోర్టులో మాత్రమే న్యాయం జరిగింది. ఉన్నత విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశం పొందడానికి తీవ్రంగా ఘర్షిస్తూ, అంతిమంగా సీట్లు చేజిక్కించుకుంటున్న, రిజర్వేషన్ హక్కు కలిగిన యువత పడుతున్న తపనలో, ఘర్షణలో ఇది ఒంటరి ఘటన కాదు. సరిగ్గా కొన్ని నెలల క్రితం ఐఐటీ మద్రాస్‌లో జనరల్ కేట గిరీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన ఓబీసీలకు చెందిన యువకుడు విపిన్ పి. వీటిల్.. మద్రాస్ ఐఐటీ నుంచి వివిధరకాల వివక్షల పాలబడి తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ప్యాకల్టీ అతడి కులనేపథ్యాన్ని కనిపెట్టి, అవమానించడం, వేధించడం మొదలెట్టింది. ఈ సందర్భంగా వివిధ స్థాయిల్లోని అధికారులకు విపిన్ రాసిన ఉత్తరాలు, ఇచ్చిన ఇంటర్వ్యూలు ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో కులతత్వం ఎంతగా పేరుకుపోయిందో స్పష్టం చేశాయి. ప్రస్తుత సందర్భానికి వస్తే మన దళిత ప్రిన్స్ ప్రవేశం కోసం చేసిన పోరాటంతోనే రిజర్వుడ్ అభ్యర్థుల పోరాటం ముగిసిపోలేదు. ఉన్నత విద్యాసంస్థల్లో చేరడం ఒకెత్తు కాగా, వీటిలో చదువు కొనసాగించడం మరొక ఎత్తు. వీరు క్యాంపస్‌లలోనే ఉంటున్నందువల్ల వివక్ష ఈ సంస్థల్లో ఒక నిరంతర సమస్యగా ఉంటుంది. ఇలా చెబితే అతిశయోక్తి కావచ్చు. ఆరెస్సెస్ శక్తులు మైనారిటీలను భారతీయేతరులుగా వ్యవహరిస్తున్నట్లుగా... దళితులు, ఓబీసీలు, గిరిజనుల పిల్లలను ఘనత వహించిన మన ఐఐటీలు భారతీయేతరులుగా చూస్తున్నాయి. ఈ విద్యా సంస్థలనుంచి రిజర్వేషన్లను తొలగించాలని వీరు అనేకసార్లు విద్యామంత్రికి పలు ఉత్తరాలు రాశారు. కానీ వారనుకున్నది జరిగితే, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటం కంటే మించిన పెద్ద పోరాటాన్ని దేశం ఎదుర్కోవలిసి వస్తుందని వీరు గ్రహించడం లేదు. ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం విషయంలో నిరాకరణకు గురైన విద్యార్థులకు ప్రిన్స్ సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకం కానుంది. ఉన్నత విద్యాసంస్థల్లో చేరిన నా వంటి తొలితరం రిజర్వేషన్ విద్యార్థులకు, ఆపై ప్యాకల్టీగా మారినవారికి... గడువు తేదీలు, చివరి క్షణంలో మార్కుల కోతలు, రిజర్వేషన్ సంఖ్యలు వంటివాటిని ఎలా తారుమారు చేయగలరో స్పష్టంగా తెలుసు. ఒక విద్యార్థిగా చేరి, కోర్సు పూర్తి చేసుకునే తరుణంలో, విద్యార్థులకు ఏ గ్రేడ్ని ఇవ్వాలి అనే అంశాన్ని కూడా వీరు తారుమారు చేయగలరు. చదువు పూర్తయ్యాక ఉద్యోగ జీవితం కూడా వెనుకబడిన వర్గాల యువతకు రోజువారీ పోరాటంగా మారిపోతుంది. ఒక వైపు పోటీపడలేకపోవడం, మరోవైపు మోతాదుకు మించి పోటీపడటం అనేవి రిజర్వేషన్ విద్యార్థులను వెంటాడతాయి. మద్రాస్ ఐఐటీకి చెందిన విపిన్ తాను రెండో కారణం వల్ల వివక్షకు గురయ్యానని చెప్పారు. తన విభాగంలోని దళిత్/ఓబీసీ ఫ్యాకల్టీ సభ్యుడి కంటే ఎక్కువ సమర్థతను ప్రదర్శించడమే తన పట్ల వివక్షకు కారణమైందట. ఈ ఉన్నత విద్యాసంస్థల్లో ఏకలవ్యుల బొటనవేళ్లను నరికేసే ద్రోణాచార్యులూ ఉన్నారు. అలాగే వీటిలో చేరిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ యువత జీవిత ప్రక్రియనే నరికేసే ద్రోణాచార్యులు కూడా ఉన్నారు. గ్రామీణ భారత్ నుంచి తొలి తరం విద్యా నేపథ్యం కలిగిన వారిలో చాలామంది విద్యార్థులు ఇలాంటి వివక్షకు గురైనప్పుడు విద్యాసంస్థలనే వదిలేసి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ప్రిన్స్ చదువు ముగించి తన కానిస్టేబుల్ తండ్రి కంటే ఉన్నతదశకు ఎదిగితే గొప్ప ఆదర్శంగా మారతాడు. విద్యాసంస్థలను టీచర్ల ద్వారా మాత్రమే సంస్కరించవచ్చు. అయితే ఇలాంటి విద్యాసంస్థల్లోని టీచర్లు ద్రోణాచార్యులను తమ ఆదర్శ గురువులుగా చేసుకున్నంతకాలం, వీరు జాతి మొత్తానికి పెను నష్టం కలిగించగలరు. ఈ విద్యా సంస్థలు గురునానక్ని తమకు ఆదర్శంగా తీసుకుంటే, సాంకేతిక అభివృద్ధిలో చైనానే సవాలు చేసే రీతిలో ఇవి దేశాన్ని మార్చివేయగలవు. ఈ సందర్భంగా ప్రిన్స్, ఆయన తండ్రి మనందరి అభినందనలకు అర్హులు. కంచె ఐలయ్య షెపర్డ్, ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఈ మానవతావాదం ‘సంపూర్ణ’మేనా?
దీన్‌దయాళ్ ప్రతిపాదించినట్లు చెబుతున్న సంపూర్ణ మానవతావాద సిద్ధాంతం తమ అధికారిక భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండే కీలకమైన తత్వశాస్త్రమని ఆరెస్సెస్, బీజేపీ మేధావులు చెబుతున్నారు. మన దేశంలోని మైనారిటీలు మాత్రమే కాకుండా శూద్ర, దళిత, ఆదివాసులు కూడా ఈ సిద్ధాంతాన్ని పరిశీలించడం ముఖ్యం. ఎందుకంటే హిందుత్వ వర్ణధర్మ పరంపరలో చెప్పిన కనీస సమానత్వ ప్రతిపత్తిని కూడా శూద్ర, దళిత, ఆదివాసులకు కల్పించలేదు. సంపూర్ణ మానవతావాదం... హిందుత్వ బ్రాహ్మణిజంతో పోలిస్తే ఎలా భిన్నమైంది అని దేశానికి తెలపాల్సి ఉంది. మానవ, లింగ సమానత్వాన్ని, కులనిర్మూలనను, అస్పృశ్యత రద్దును ప్రతిపాదించని, ఆచరించని సిద్ధాంతం సంపూర్ణ మానవతావాదం ఎలా అవుతుందో వీరు స్పష్టం చేయవలసి ఉంది. ఆరెస్సెస్, బీజేపీకి చెందిన మేథావులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ (1916–1968) ప్రతిపాదించినట్లు చెబుతున్న సంపూర్ణ మానవతావాదం సిద్ధాంతాన్ని ముందుపీఠికి తీసుకొస్తున్నారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే, కార్యదర్శి రామ్ మాధవ్ పదేపదే ఉపాధ్యాయ సూత్రీకరించిన సంపూర్ణ మానవతావాదం గురించి మాట్లాడుతున్నారు. తమ అధికారిక భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండే కీలకమైన తత్వశాస్త్రంగా వీరు ఈ సిద్ధాంతాన్ని భావిస్తున్నారు. ఈ తాత్వికతే తన ప్రభుత్వాన్ని నడిపించే దీపస్తంభమని ప్రధాని నరేంద్రమోదీ తరచుగా చెబుతూ వస్తున్నారు. రామ్ మాధవ్ తాజా పుస్తకం ‘ది హిందుత్వ పారడైమ్: ఇంటెగ్రల్ హ్యూమనిజం అండ్ క్వెస్ట్ ఫర్ ఎ నాన్–వెస్టర్న్ వరల్డ్ వ్యూ’ ఆవిష్కరణ సందర్భంగా హొసబలె ఈ సిద్ధాంతాన్ని వివరిస్తూ ‘హిందూత్వ అనేది వామపక్షమూ కాదు, మితవాద పక్షమూ కాదు.. సంపూర్ణ మానవతావాదమే దాని సారాంశం’ అని పేర్కొన్నారు. సంపూర్ణ మానవతావాదం అనేది ఆరెస్సెస్ తొలి ప్రబోధకులైన సావర్కర్, హెగ్డేవార్, గోల్వాల్కర్ల ప్రతిపాదనలకు అంత భిన్నమైనదా అనేదే అసలు ప్రశ్న. మన దేశంలోని మైనారిటీలు మాత్రమే కాకుండా శూద్ర, దళిత, ఆదివాసుల కోణంలో కూడా ఈ సిద్ధాంతాన్ని పరిశీలించడం ముఖ్యం. ఎందుకంటే హిందుత్వ తత్వవేత్తలు వర్ణధర్మ పరంపరలో చెప్పిన కనీస సమానత్వ ప్రతిపత్తిని కూడా శూద్ర, దళిత, ఆదివాసులకు కల్పించకపోగా, మైనారిటీలకు వ్యతిరేకంగా వారిని బలమైన శక్తిగా ఉపయోగించుకుంటూ వస్తున్నారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఒక ఆరెస్సెస్ కార్యకర్తగా పనిచేస్తూ తన జీవితకాలంలోనే ఆ సంస్థ రాజకీయ విభాగమైన భారతీయ జనసంఘ్ రెండో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఈయన మోహన్ భగవత్, దత్తాత్రేయ హొసబలె, రామ్ మాధవ్ లాగే ఒకేరకమైన బాల్య వాతావరణంలో పెరిగారు. వివిధ రాష్ట్రాలకు చెందినప్పటికీ వీరందరూ ఒకే కులనేపథ్యం కలిగినవారు. ప్రారంభంలోని వీరి సైద్ధాంతిక రచనల్లో, ప్రత్యేకించి గోల్వాల్కర్ రచనల్లో హిందుత్వ పరంపరాగత వ్యవస్థను విస్తృతంగా వివరిస్తూ వచ్చారు. వీరు మాత్రమే కాదు.. హిందూయిజాన్ని ఒక మిలిటెంట్ రాజకీయ శక్తిగా మార్చాలని సూత్రీకరించిన ఆరెస్సెస్ తొలి సిద్ధాంతకర్త వి.డి. సావర్కర్ కూడా బ్రాహ్మణుడే. ఇప్పుడు సంపూర్ణ మానవతావాదం అని పిలుస్తున్న గొప్ప మూల సిద్ధాంత నిర్మాణ కర్తగా దీన్దయాళ్ని ముందుకు తీసుకువస్తున్నారు. ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే, ఆరెస్సెస్ సిద్ధాంతకర్తల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా శూద్ర, దళిత, ఆదివాసీల నుంచి పుట్టుకురాలేదు. చివరకు రిజర్వేషన్లకు వెలుపల ఉండిపోయిన జాట్లు, మరాఠాలు, పటేల్స్, కమ్మ, రెడ్డి, లింగాయత్, ఒక్కళిగ, నాయికర్లు, మహిస్యాలు వంటి శూద్ర వ్యవసాయ కులాలు మొత్తంగా ఆరెస్సెస్ మద్దతుదారులుగా, కార్యకర్తలుగా చాలాకాలంగా పనిచేస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరు కూడా ఇంతకాలంగా ఆరెస్సెస్ సిద్ధాంతకర్తగా గానీ, దాని అధినేతగా గానీ కాలేకపోయారు. హిందుత్వ చారిత్రక వికాస దశలో కూడా శూద్ర, దళిత, ఆదివాసీలకు చెందినవారు ఒక్కరు కూడా చింతనాపరులుగా రూపొందలేకపోయారు. ఇప్పుడు అసలు ప్రశ్న. బ్రాహ్మణులు మాత్రమే ఆరెస్సెస్ అధినేతలవుతూ అప్పుడూ, ఇప్పుడూ సంపూర్ణ మానవతావాద సిద్ధాంతాలను ఎలా వల్లించగలుగుతున్నారు? హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థలో శూద్ర, దళిత, ఆదివాసులు భాగమై ఉంటున్నప్పటికీ వీరిలో ఒక్కరు కూడా ఒక పూజారిగా, సిద్ధాంతవేత్తగా కాకతాళీయంగా కూడా ఎందుకు కాలేకపోయారు? దేశంలో మతపరమైన సాంస్కృతిక నిర్మాణం కొనసాగుతున్నం దున, కుల సాంస్కృతిక అభివృద్ధి కూడా బాల్యం నుంచే కొనసాగుతూ వస్తోంది. ఈ కులపరమైన సాంస్కృతిక పెంపకం ఇతర కులాలతో కలిసి జీవించే ఎలాంటి సమగ్ర అస్తిత్వాన్ని పెంచి పోషించలేదు. అందుకే భారత్‌ని వ్యక్తిగతంగా అందరూ సమానంగా ఉండే సాంస్కృతిక దేశంగా రూపొందించే లక్ష్యాన్ని ఈ సంపూర్ణ మానవతావాదం కలిగిలేదని చెప్పాలి. కాబట్టి హిందూయిజాన్ని ఆధ్యాత్మిక ప్రజాస్వామిక మతంగా మార్చే ఎలాంటి గొప్ప నిర్మాణం కూడా ఉనికిలో లేదు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రాన్ని పరిమితంగా సమర్థిస్తూనే.. పెట్టుబడిదారీ వ్యక్తివాదం, మార్క్సిస్ట్ సోషలిజం రెండింటినీ వ్యతిరేకించారు. అయితే పాశ్చాత్య, ప్రాచ్య విజ్ఞాన శాస్త్రాలు ఏవైనా సరే.. వ్యవసాయ ఉత్పాదక, చేతివృత్తులకు సంబంధించిన పనుల్లో పవిత్రత, మాలిన్యం సూత్రాలను ప్రతిపాదించకుండానే, శ్రమను గౌరవించే పునాదులను కలిగి ఉంటూ వచ్చాయి. శ్రామికులు ఉత్పత్తిచేసే సరకులు, వస్తువుల విషయంలో ఇవి ఎలాంటి భేదభావాన్ని ప్రకటించలేదు. కానీ ఒక సంస్థగా బ్రాహ్మణిజం పునాదులపై నిలిచిన ఆరెస్సెస్... పవిత్రత, అపవిత్రత, కులాలు, జెండర్ వారీగా అసమానత్వం, మానవ అస్పృశ్యతను ప్రతిపాదించే బ్రాహ్మణవాద విలువల చుట్టూ ఏర్పడిన భారతీయ పరంపరతో కొనసాగుతోంది. ఈ దేశంలోని బ్రాహ్మణ మార్క్సిస్టులు, ఉదారవాద మేధావులు తీసుకొచ్చినట్లుగా కులాన్ని ఒక సమస్యాత్మక అంశంగా కూడా దీన్‌దయాళ్ ఎన్నడూ ప్రతిపాదించలేదు. అలాగే మహాత్మా పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సిద్ధాంతాలు సూత్రీకరించిన కుల సంస్కృతిపై సమకాలీన ఆరెస్సెస్/బీజేపీ మేధావులు ఎవరూ వ్యాఖ్యానించిందీ లేదు. మానవ అస్పృశ్యత, కుల నిర్మూలన అనేవి మానవ జీవితంలోని అన్ని అంశాల్లో కీలక సూత్రంగా ఉండాలని పూలే, అంబేడ్కర్ చేసిన ప్రతిపాదనలను వీరు కనీసంగా కూడా పట్టించుకోలేదు. అదే సమయంలో మానవ అస్పృశ్యత మినహా హిందూ వర్ణ ధర్మాన్ని బలపర్చిన మహాత్మాగాంధీ సర్వోదయ, గ్రామ్ స్వరాజ్లను మిళితం చేయడానికి దీన్‌దయాళ్ ప్రయత్నించారు. హిందూ పురాణాలు, దేవుళ్లు కూడా తొలినుంచి మైనారిటీలకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించడాన్నే ప్రబోధిస్తూ వచ్చాయన్నది అందరికీ తెలిసి విషయమే. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న ఆరెస్సెస్, బీజేపీ మేధావులు ఈ వైరుధ్యాన్ని ఎలా పరిష్కరిస్తారు? హిందూ దేవతలు కులపరమైన ఆధ్యాత్మిక మూలాలను ప్రోత్సహిస్తూ, సంస్థాగతీకరిస్తున్నప్పుడు వీరు ముందుకు తీసుకొస్తున్న సంపూర్ణ మానవతావాద భావం ఎలా సాధ్యమవుతుంది? దేవుడొక్కడే, మనుషులందరినీ దేవుడు సమానులుగా సృష్టించాడు అనే సూత్రం ఉనికిలో ఉన్నప్పుడే ఏకాత్మవాద భావన సాధ్యమవుతుంది. అందుకే హిందుత్వ ప్రాపంచిక దృక్పథంలో పనిచేస్తున్న శూద్ర, దళిత, ఆదివాసీల ముందు ఇప్పుడున్న పెను సవాలు ఏమిటి? అంటే ఈ సంపూర్ణ మానవతావాద సిద్ధాంతం ప్రతిపాదిస్తున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక జాతీయవాదంలో తమ స్థానం ఎక్కడ అనేది వీరు ప్రశ్నించుకోవాలి. ఆరెస్సెస్, బీజేపీ మేధావులు ప్రచారం చేస్తున్న సంపూర్ణ మానవతవాద తాత్వికతలో కుల నిర్మూలన, లైంగిక సమానత్వం, అస్పృశ్యత రద్దు అనే కీలకమైన అంశాలకు చోటే లేదు. అందుకే హిందుత్వ సంస్థల్లో కూడా శూద్రులు, దళితులు, ఆదివాసీల అసమాన స్థితి కొనసాగుతూనే ఉంది. శూద్ర, దళిత, ఆదివాసీ మేధావుల స్వీయప్రతిపత్తిని హిందుత్వ సంస్థల నిర్మాణాలు ఇప్పటికీ అనుమతించలేదు. మోహన్ భగవత్, దత్తాత్రేయ హొసబలె, రామ్ మాధవ్ వంటివారు ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న సంపూర్ణ మానవతావాదం అనేది హిందుత్వ బ్రాహ్మణిజంతో పోలిస్తే ఎలా భిన్నమైంది అని దేశానికి తెలియజెప్పాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ కీలక సమస్యలుగా ఉన్నవాటిని ఈ కొత్త సిద్ధాంతం ఎలా పరిష్కరిస్తుంది అని వీరు వివరించాలి. అప్పుడు మాత్రమే జాతి వీరికి ధన్యవాదాలు చెబుతుంది. వ్యాసకర్త: ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
రైతు వ్యతిరేకతే లక్ష్యంగా...
జాతికి ఆహారధాన్యాలు పండించి ఇస్తున్న రైతుల ప్రాణాలను హీనంగా భావిస్తూ వారిపై తన వాహనం నడిపించి తొక్కించగలననే ఆత్మవిశ్వాసం కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాకు ఎలా వచ్చింది? తన 96 ఏళ్ల చరిత్రలో ఆరెస్సెస్ ఒక రైతు బిడ్డను ఎన్నడూ నాయకత్వ స్థానంలో నిలిపి ఎరుగదు. రైతులు, చేతివృత్తుల వారిగురించి ఒక్క సానుకూల ప్రకటనను కూడా ఎన్నడూ చేసి ఎరుగదు. సర్దార్ పటేల్ నిర్వహించిన ఏ రైతాంగ ఉద్యమంలోనూ వీరు పాల్గొనలేదు. స్వాతంత్య్రం తర్వాత కూడా వీరు ఒక్క రైతాంగ ఉద్యమాన్ని కూడా నిర్వహించలేదు. అందుకే రైతులు చేస్తున్న ఆందోళనలను వీరు జాతి వ్యతిరేక ఆందోళనగా ముద్ర వేస్తున్నారు. రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఎలాంటి మక్కువ, ప్రేమాభిమానాలు లేవు కానీ, అదే రైతుల ఓట్ల దన్నుతో వీరు దేశాన్ని పాలిస్తున్నారు. ఇంతకు మించిన హాస్యాస్పదమైన విషయం మరొకటి లేదు. భారతీయ జనతా పార్టీ... ఆరెస్సెస్ రాజ కీయ అనుబంధ సంస్థ. బీజేపీ సభ్యుల ప్రవర్తన, లక్ష్యాలకు సంబంధించిన శిక్షణ మొత్తంగా ఆర్ఎస్ఎస్ నుంచే వస్తోందనడంలో సందేహమే లేదు. అజయ్ మిశ్రా, అతడి కుమారుడు ఈ సంస్థాగత నిర్మాణంలో భాగమే. లఖీమ్‌పూర్ ఖేరీ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ నోరు విప్పకపోవడంపై చర్చ జరుగుతున్నప్పటికీ, ఆర్ఎస్ఎస్ సైతం అక్కడ జరిగిన హింసాకాండపై మౌనం పాటించడం మరింత చర్చనీయాంశంగా ఉంది. ఆరెస్సెస్ అధినేతలు మోహన్ భాగవత్ కానీ, దత్తాత్రేయ హొసబలే కానీ ఇంతవరకు లఖీమ్‌పూర్ ఘటనపై నోరెత్తిన పాపాన పోలేదు. ప్రధానంగా శూద్రులు, దళితులతో కూడిన భారతీయ ఉత్పాదక శక్తులు–రైతులు, చేతివృత్తుల వారి– పట్ల ఒక సంస్థగా ఆరెస్సెస్ నడవడిక, దృక్పథం గురించిన మౌలిక ప్రశ్నలను ఇది లేవనెత్తుతోంది. ఇక్కడ నేను రెండు విషయాలను ప్రధానంగా పరిశీలనలోకి తీసుకుంటున్నాను. భారతీయ స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం వహించి, ప్రజాస్వామ్యానికి ఊపిర్లూదిన భారత జాతీయ కాంగ్రెస్‌కూ, భారతీయ రైతులు, ఉత్పాదక శక్తుల పట్ల ఆరెస్సెస్ దృక్పథానికి మధ్య ప్రాథమికంగా ఉంటున్న వ్యత్యాసాలను పరిశీలిద్దాము. భారతీయ, స్కాటిష్ వలసవాద వ్యతిరేక స్వాతంత్య్రోద్యమ ప్రేమికులు కలిసి 1885లో స్థాపించిన సంస్థే భారత జాతీయ కాంగ్రెస్. దాదాబాయి నౌరోజీ, అలెన్ ఆక్టోవియన్ హ్యూమ్, దిన్షా ఎడుల్జీ వచా వంటివారు భారత జాతీయ కాంగ్రెస్ తొలి సంస్థాపకుల్లో ఉన్నారు. వీరిలో దాదాబాయి నౌరోజీ, దిన్షా ఎడుల్జీ పార్సీలు కాగా, హ్యూమ్ స్కాటిష్ స్వాతంత్య్ర ఉద్యమకారుడు. జాతీయ కాంగ్రెస్ ప్రారంభంలో భారతీయ బ్రాహ్మణ నేత కానీ బనియా నేత కానీ ఏ ఒక్కరూ లేరని గమనించాలి. బ్రిటిష్ పాలకులతో ఘర్షిస్తున్న క్రమంలో అనేక రకాలుగా నష్టపోయిన ప్రముఖ పత్తి వ్యాపారి దిన్షా ఎడుల్జీ ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. భారతీయ నేతల మద్దతు కొరవడినప్పటికీ, కాంగ్రెస్‌ని సంస్థగా నిర్వహించడంలో స్కాటిష్ జాతీ యుడైన ఏఓ హ్యూమ్ వహించిన కీలకపాత్రను దిన్షా గుర్తించారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ కారులకు ఊపిరి పోసిన గొప్పమనిషి హ్యూమ్ అని ప్రశంసించారు. ఆనాడు, భారతదేశంలోని అనేకమంది బ్రాహ్మణులు, బని యాలు, కాయస్థులు, ఖాత్రీలు ఇంగ్లండులో చదువుకుని న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఇంగ్లిష్ చదువుకున్న బ్రాహ్మణుల్లో చాలామంది వలసవాద ప్రభుత్వం తరపున పనిచేసేవారు. కాంగ్రెస్ ఏర్పడ్డాక ద్విజులు తమ కెరీర్‌ను దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీతో కూడా పొత్తు జట్టుకట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న వెంటనే బ్రాహ్మణులు దాని నాయకులైపోయారు. కానీ శూద్ర రైతులకు మాత్రం ఇంగ్లిష్ విద్య అందని ద్రాక్షలాగే ఉండిపోయింది. ఇంగ్లిష్ విద్య నేర్చుకున్న తొలి శూద్ర రైతు మహాత్మా జ్యోతిబా పూలే 1827లో జన్మిం చారు. ఆయన కూడా 7వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ప్రభుత్వ సర్వీసులో, న్యాయస్థానాల్లో ఇంగ్లిష్ చదువుకున్న బ్రాహ్మణ యువత మాత్రమే పనిచేస్తూ డబ్బు సంపాదించేవారు. శూద్రులు వ్యవసాయంలో, ఇతర చేతివృత్తుల్లో నిమగ్నమవుతూ వచ్చారు. దేశంలో బ్రిటిష్ విద్య నేర్చుకున్న తొలి శూద్ర రైతు వల్లభాయి పటేల్ ఆ తర్వాత లాయర్ వృత్తి చేపట్టి 1917లో కాంగ్రెస్‌లో చేరారు. రైతులను ఎలా సంఘటితపర్చాలో కాంగ్రెస్ పార్టీకి, మహాత్మాగాంధీకి ఒక మార్గం చూపిన వ్యక్తి పటేల్. మంచి లాయర్‌గా చక్కగా ప్రాక్టీసు చేస్తున్న పటేల్... ఖేడా, బార్డోలితో సహా గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో రైతాంగ ఉద్యమాలకు నేతృత్వం వహించారు. సోషలిస్టు రైతాంగ విప్లవాల యుగంలో కాంగ్రెస్ పార్టీ మితవాద పంథా చేపట్టినప్పటికీ, గ్రామాల్లోకి పటేల్ చొచ్చుకుపోయారు. ఒక సహజ సజీవ మేధావిగా ఆయన రైతుల మనసుల్లో నిలిచిపోయారు. కానీ 1931లో కానీ పటేల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాలేకపోయారు. రైతు నేపథ్యంలోంచి భారత జాతీయ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడిగా లాహోర్ కాన్ఫరెన్సులో ఎన్నికైన పటేల్.. ‘ఏ భారతీయుడైనా ఆకాం క్షించే కాంగ్రెస్ పార్టీ అత్యున్నత పదవికి ఒక సాధారణ రైతును ఆహ్వానించార’ని పేర్కొన్నారు. ‘1931 నాటికి కాంగ్రెస్ పార్టీ నాలుగు దశాబ్దాలుగా ఉనికిలో ఉంటూవచ్చిందనీ, కానీ పార్టీ అధ్యక్ష పదవికి రైతాంగ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని ఆ నలభై ఏళ్ల కాలంలో ఎంపిక చేసుకోలేకపోయిందనీ, భారతదేశం తన గ్రామసీమల్లోనే నివసిస్తోం దని మహాత్మాగాంధీ అతిశయించి చెబుతున్నప్పటికీ రైతుకు అధ్యక్ష పదవిని కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టలేకపోయింద’నీ చరిత్రకారుడు రామచంద్ర గుహ పేర్కొన్నారు. మహారాష్ట్ర బ్రాహ్మణులు 1925లో ఆరెస్సెస్‌ను స్థాపించారు. ఈ సంస్థలో ఒక పార్సీకానీ, సిక్కు కానీ, బుద్ధిస్టు కానీ లేరు. ఒకే ఒక ముస్లిం మాత్రం ఉండేవారు. తన సైద్ధాంతిక పత్రాల్లో ఈ సంస్థ రైతులు, చేతివృత్తుల వారిగురించి ఒక్క సాను కూల ప్రకటనను కూడా ఎన్నడూ చేసి ఎరుగదు. సర్దార్ పటేల్ నిర్వహించిన ఏ రైతాంగ ఉద్యమంలోనూ వీరు పాల్గొనలేదు. స్వాతంత్య్రం తర్వాత కూడా వీరు ఒక్క రైతాంగ ఉద్యమాన్ని కూడా నిర్వహించలేదు. ఒకే జాతి, ఒకే సంస్కృతి, ఒక పురాతన వారసత్వం నినాదంతో వచ్చిన ఆరెస్సెస్.. తన 96 సంవత్సరాల ఉనికిలో ఒక రైతు కుమారుడిని ఎన్నడూ అధినాయకత్వ స్థానంలో నిలిపి ఎరుగదు. వీరిదృష్టిలో గ్రామీణులు జాతిలో కానీ, దాని పురాతన వారసత్వంలో కానీ భాగం కాదు. భారత జాతీయ కాంగ్రెస్‌కు, ఆరెస్సెస్‌కి మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే. కాంగ్రెస్ పార్టీ తన చరిత్రలో అనేక రైతాంగ ఉద్యమాలను సంలీనం చేసుకుంది. కానీ ఆరెస్సెస్ ఆ పని చేయలేదు. కేవలం మైనారిటీలకు వ్యతిరేకంగా పోరాడే బలమైన శక్తిగా మాత్రమే రైతులను ఆరెస్సెస్ వాడుకుంది. తమ మనుగడను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న అంశాలపై రైతులు చేస్తున్న ఆందోళనను మితవాద పక్షం జాతి వ్యతిరేక ఆందోళనగా ముద్ర వేస్తోంది. భారత్ అంటే వ్యవసాయంతో ఎలాంటి సంబంధం లేని హిందుత్వ శక్తులకు సంబంధించిన అతి చిన్న భాగమేననేలా మితవాద పక్షం భావిస్తోంది. వీరి సాంస్కృతిక జాతీయవాదం వ్యవసాయాన్ని జాతీయవాదంలో భాగంగా చూడటం లేదు. రైతుల పిల్లలు పూజారులుగా మారి పూజలు నిర్వహించే హక్కేలేని హిందూ ఆలయాలకే ఈ తరహా జాతీయవాదం పరిమితమైపోయింది. వ్యవసాయం గురించి, శూద్ర దళిత ప్రజారాశుల గురించి కనీసం ప్రస్తావించని ప్రాచీన సంస్కృత పుస్తకాల్లో మాత్రమే వీరి జాతీయవాదం ఉనికిలో ఉంది. జాతికి ఆహారధాన్యాలు పండించి ఇస్తున్న రైతులను వీధికుక్కలకంటే హీనంగా భావిస్తూ వారిపై తన వాహనం నడిపించి తొక్కించగలననే ఆత్మవిశ్వాసం ఆశిష్ మిశ్రాకు మెండుగా ఉందంటే అది ఆరెస్సెస్ వారసత్వం నుంచే వచ్చింది. ఆరెస్సెస్ సంస్థాగత మద్దతుపై ప్రాతిపదికనే ఇతడికి ఇంత అహంభావం పుట్టుకొచ్చింది. అదే సమయంలో దేశం మొత్తానికి ఆహార ధాన్యాలు పండిస్తున్న శూద్రుల వారసత్వమే రైతులది. ఆరెస్సెస్‌కు తమకు మధ్య ఇంత వ్యత్యాసం ఉందనే విషయం ఈ రైతులకు తెలీదు. అందుకే ఆశిష్ మిశ్రా వారసత్వం గురించి దేశం అర్థం చేసుకోవలసిన సమయం ఆసన్నమైంది. రైతులు, మొత్తం దేశం కూడా ఇప్పుడు బతికి బట్టకట్టాల్సిన అవసరం ఉంది. దీని సాంస్కృతిక జాతీయవాద ఎజెండాకు రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఎలాంటి మక్కువ, ప్రేమాభిమానాలు లేవు. కానీ అదే రైతుల ఓట్ల దన్నుతో వీరు దేశాన్ని పాలిస్తున్నారు. ఇంతకు మించిన హాస్యాస్పదమైన విషయం మరొకటి లేదు. -ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
అక్కడ ఇంగ్లిష్! ఇక్కడేమో హిందీనా?
భారతదేశంలో ఇంగ్లిష్ భాష జీవం పోసుకొని 2021 అక్టోబర్ 5 నాటికి 204 ఏళ్లవుతుంది. ఇంగ్లిష్ వల్లే, ప్రపంచం నలుమూలల్లో ఉన్న మానవులు మరింతగా అనుసంధానమయ్యారు. పరస్పరం జ్ఞానాన్ని పెంచుకున్నారు. కానీ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో పీహెచ్డీ సిద్ధాంత పత్రాలను కూడా హిందీలోనే రాసి సమర్పించేలా హిందీని బోధనా మాధ్యమంగా మార్చేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదేసమయంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, పాఠశాలలు, కాలేజీల్లో ఇంగ్లిష్‌నే బోధించేలా, పరిశోధనను కూడా ఇంగ్లిష్‌లోనే చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు రూపొందించాయి. ఇది దళిత, బీసీ, శూద్ర, ఆదివాసీ యువతకు ఇంగ్లిష్‌ను దూరం చేయడంలో భాగమే. భారతదేశంలో ఇంగ్లిష్ భాష జీవం పోసుకొని 2021 అక్టోబర్ 5 నాటికి 204 సంవత్సరాలవుతుంది. ప్రతి ఏటా ఆ రోజున భారతీయ ఇంగ్లిష్ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. 1817 అక్టోబర్ 5న కోల్‌కతాలో మొట్టమొదటి ఇంగ్లిష్ మీడియం పాఠశాల ప్రారంభమైంది మొదలుకొని ఇంగ్లిష్ భాషను లేకుండా చేయడానికి భారతదేశం ఎన్నడూ అనుమతించలేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ నేడు ఇంగ్లిష్ వృద్ధి చెందుతోంది. ఇంగ్లిష్ మాట్లాడే దేశాలను సవాలు చేస్తున్న చైనా... మాండరిన్ భాషతో పాటు ఇంగ్లిష్‌ని కూడా తన సొంతం చేసుకుంది. భారత్, చైనా రెండూ తమ మాతృభాషలతోపాటు ఇంగ్లిష్‌ని తమ పిల్లలందరికీ బోధించినట్లయితే, (ఉదాహరణకు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లాగా) ఎవరూ ఊహించలేనంత వేగంగా అది అంతర్జాతీయ అనుసంధానాన్ని, శాస్త్ర పరిజ్ఞానాన్ని మార్చివేస్తుంది. చాలా కాలం క్రితం ఒక ఇజ్రాయెల్ ప్రవక్త, ప్రపంచమంతా ఒకే భాషను మాట్లాడే రోజు వస్తుందని జోస్యం చెప్పారు. అయితే ఆ భాష ఏది అని ఆయన అప్పట్లో చెప్పలేదు. ఇప్పుడు ఆ భాష ఇంగ్లిషేనని మనం చెప్పవచ్చు. భూమండలంలోని అత్యధిక సంఖ్యాక ప్రజలు మాట్లాడుతున్న, రాస్తున్న, అర్థం చేసుకుంటున్న భాష ఇంగ్లిష్ మాత్రమే. ప్రపంచంలో మాట్లాడే, రాసే భాషలకు నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే ఇంగ్లిష్ వల్లే, ప్రపంచం నలుమూలల్లో ఉన్న మానవులు మరింతగా అనుసంధానమయ్యారు. పరస్పరం జ్ఞానాన్ని పెంచుకున్నారు. మానవ చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఇలాంటి గుణాత్మక మార్పు జరగలేదు. చరిత్రలో చాలాకాలం పాటు అనేక తెగలు అతి చిన్న బృందాలతో భావవ్యక్తీకరణ చేసుకునే భాషా యంత్రాంగాలతో జీవించేవి. ఒకే ప్రాంతంలో లేదా ఒకే దేశంలోని ఇతర భాషా బృందాలతో ఇవి వ్యక్తీకరణ సామర్థ్యాన్ని కలిగి ఉండేవి కాదు. కానీ ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఇలాంటి పరిమిత స్థాయిలోని అనేక బృందాల్లోకి ఇప్పుడు ఇంగ్లిష్ భాష కొద్దో గొప్పో చొచ్చుకుపోయింది. ఇలాంటి అనేక భాషా బృందాలకు పదాలు, వాక్యాల రూపంలో చేరువైన ఇంగ్లిష్ భాష... వారిని ఇంతవరకు తమకు తెలియని స్థలాల్లోని పెద్ద పెద్ద మార్కెట్లతో కూడా భావ ప్రసారం జరుపుకొనేలా చేసింది. పరస్పరం భావ వ్యక్తీకరణ, భావ ప్రసారం చేసుకోలేని వేలాది చిన్న చిన్న భాషా బృందాల ఉనికికి భారతదేశం ఒక ప్రామాణిక ఉదాహరణగా నిలుస్తుంది. తమకు సమీపంలోనే ఉంటున్న ఇతర భాషా బృందాలకు, పట్టణ మార్కెట్లకు పెద్దగా పరిచయం కాకుండానే మనుగడ సాగిస్తున్న తెగలు, పర్వత ప్రాంతాల్లో నివసించే భాషా బృందాలు భారతదేశంలో అనేకం ఉన్నాయి. ఇతర సంస్కృతులకు, జీవన విధానాలకు పరిచయం కాకుండానే నివసిస్తున్న భారతీయ ఉత్పాదక ప్రజారాశులకు భాషే ప్రధాన అవరోధం. కానీ కేవలం 200 సంవత్సరాలలోపే ఈ భాషాపరమైన అవరోధాన్ని ఇంగ్లిష్ తొలగించివేసింది. ప్రత్యేకించి గత 30 ఏళ్లుగా ప్రపంచీకరణ, దేశ ప్రజలను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడంతో ప్రజల భావ వ్యక్తీకరణలో చాలా మార్పులొచ్చాయి. పాఠశాలల్లో విద్యార్థులకు క్రమబద్ధమైన ఇంగ్లిష్ నేర్పింది ప్రభుత్వాలు కాదు. ప్రపంచవ్యాప్తంగా నిరక్షరాస్యులకు, వివిధ భాషా బృందాలకు ఇంగ్లిష్ నేర్పుతూవచ్చింది మార్కెట్ మాత్రమే. ఒక భాషగా ఇంగ్లిష్‌ని మాట్లాడటం, రాయడం తెలీనప్పటికీ సమాజానికీ లేదా మార్కెట్‌కీ ప్రాణాధారమైన విషయాలను మనం ఇంగ్లిష్ ద్వారానే తెలుసుకుంటూ వస్తున్నాము. ఆ భాష తెలీకున్నా వాటర్, ఫుడ్, బస్, ట్రెయిన్, సాల్ట్, రైస్, టికెట్, మిల్క్, టీ, బెడ్, ఫోన్, లిక్కర్, ప్లేట్ వంటి ఎన్నో ఇంగ్లిష్ పదాలను మనం సాధారణ అవగాహనతో అర్థం చేసుకుంటున్నాము. ప్రపంచంలోని నలుమూలల్లో ఇంగ్లిష్ ఇలాంటి పదాలతో చొచ్చుకుపోయింది. అత్యంత వెనుకబడిన ప్రాంతంలోని తెలుగు మాట్లాడే ఓ కుగ్రామంలోని సగటు నిరక్షరాస్యుడైన కూలీకి కూడా ఇప్పుడు కనీసం 250 నుంచి 300 వరకు ఇంగ్లిష్ పదాలు తెలుసు. దేశవ్యాప్తంగా రిక్షా తోలేవారు, ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, ధాన్యం, కూరగాయలు అమ్మేవారు, కార్మికులకు కూడా ఇంగ్లిష్ పదాలతో పరిచయమైపోయింది. మరే స్థానికేతర భాషా పదాలు కూడా ఇంగ్లిష్ లాగా జనజీవితంలో ఈ స్థాయిలో ప్రవేశించలేదు. భారతదేశంలో ఎక్కువమంది ప్రజలు మాట్లాడే, రాసే భాష హిందీ అని తెలుసు. కానీ దేశం నలుమూలల్లో హిందీ కంటే ఎక్కువగా ఇంగ్లిష్ పదాలే ఎక్కువ మంది ప్రజల వాడుకలోకి వచ్చేశాయి. వివిధ యాసలతో కూడిన సాధారణ సంభాషణకు సంబంధించి 250 నుంచి 300 పదాలను తెలుసుకుంటే చాలు... మనకు తెలియని మార్కెట్లో కూడా ఇతరులతో భావ వ్యక్తీకరణ సాధ్యమవుతుంది. కాబట్టి భారతీయ గ్రామం నుంచి ఒక కూలీని మనం ఆఫ్రికన్ లేదా లాటిన్ అమెరికన్ దేశంలోకి పంపించినట్లయితే, అక్కడి స్థానిక భాషను నేర్చుకోకపోయినా అతిముఖ్యమైన ఇంగ్లిష్ మార్కెట్ పదాల సహాయంతో వాళ్లు ఆ దేశాల్లో మనగలుగుతారు. ఇక స్థానిక భాషను కూడా నేర్చుకుని ఇంగ్లిష్‌ని మెరుగుపర్చుకుంటే మరింత మెరుగ్గా జీవించగలరు. కొన్ని పదాలను తెలుసుకోవడం ద్వారా యావత్ ప్రపంచంలో ఇంత సులభంగా జీవించగల, మనుగడ సాధించగల అవకాశాన్ని ఇంగ్లిష్ తప్ప మరే భాషా కల్పించడం లేదు. ఇంగ్లిష్ పదాలు, భాష ప్రపంచంలోని నలుమూలలకు ఇంత విస్తృతంగా ఎలా విస్తరించాయి అంటే ప్రపంచీకరణ మార్కెట్టే అని చెప్పాలి. చారిత్రకంగా సంస్కృతంపై నియంత్రణ సాధిస్తూవచ్చిన బ్రాహ్మణులు, ఇతర ద్విజ కులస్థులు... ఇప్పుడు వారు ఏ పార్టీలో లేదా ఏ సంస్థలో ఉన్నప్పటికీ ఇంగ్లిష్‌పై అదుపు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. పురాతనకాలంలో సంస్కృతం లాగా, నాణ్యమైన ఇంగ్లిష్ ఇప్పటికే వీరికి ఆలంబనగా మారిపోయింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ఇటీవలి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం ద్వారా రాష్ట్రీయ స్వయం సేవక్, భారతీయ జనతా పార్టీలు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. అదేమిటంటే శూద్రులు, దళితులు, ఆదివాసీలు, ఇతర పేదప్రజల పిల్లలు మాతృభాషలోనే చదువుకోవాలట! ఇంగ్లిషేతర భాషే విద్యా మాధ్యమంగా ఉండాలట! చివరకు కేంద్ర విశ్వవిద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో పీహెచ్డీ సిద్ధాంత పత్రాలను కూడా హిందీలోనే రాసి సమర్పించేలా హిందీని బోధనా మాధ్యమంగా మార్చేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదేసమయంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, పాఠశాలలు, కాలేజీల్లో ఇంగ్లిష్‌నే బోధించేలా, పరిశోధనను కూడా ఇంగ్లిష్‌లోనే చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు రూపొందించాయి. దేశంలో అగ్రవర్ణాల (బ్రాహ్మణులు, బనియాలు, కాయస్థులు, ఖాత్రీలు, క్షత్రియులు) యాజమాన్యంలోని గుత్త పారిశ్రామిక కంపెనీలు అశోక, అమిటీ, ఓపీ జిందాల్ వంటి అత్యున్నత ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను నెలకొల్పాయి. ఇవి ఇంగ్లిష్ మాధ్యమంలో బోధించేందుకు యూరో–అమెరికన్ సిలబస్‌ని చేపడుతున్నాయి. మరోవైపున ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటినీ ప్రాంతీయ భాషలో ప్రధానంగా హిందీ మీడియంలో బోధన చేసేలా కేంద్ర ప్రభుత్వం పథక రచన చేస్తోంది. దీని పర్యవసానంగా దళితులు, ఓబీసీలు, శూద్రులు, ఆదివాసీ యువత పూర్తిగా చలనరహితంగా ఉండిపోతారు. మెరుగైన విద్యా, జీవన అవకాశాల కోసం ఇక వారు ఎక్కడికీ వెళ్లలేరు. ఉత్పాదక కులాల నుంచి ఇంగ్లిష్ చదవగల, రాయగల మేధావులు ఉద్భవించకూడదని ఆర్ఎస్ఎస్, బీజేపీ కోరుకుంటున్నాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో చదువుకుంటున్న యువత భారతీయ ఇంగ్లిష్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి. సంపన్న అగ్రవర్ణ యువతతో సమానంగా అంతర్జాతీయ భాషను నేర్చుకుంటున్న దళిత, ఆదివాసీ, శూద్ర యువతకు వ్యతిరేకంగా పథక రచన చేస్తున్న శక్తులను ఆ విధంగా ఓడించగలగాలి. ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
గెయిల్ ఒమ్వెట్; శ్వేతజాతిలో వికసించిన నల్ల వజ్రం
కులం, జెండర్ అధ్యయనాలపై అత్యంత గొప్ప పండితులలో ఒకరైన గెయిల్ ఒమ్వెట్ మహారాష్ట్రలోని కెసెగావ్ గ్రామంలో ఆగస్ట్ 25 తెల్లవారు జామున కన్నుమూశారు. ఆమె వయస్సు 81 సంవత్సరాలు. ఈ అమెరికన్ సంతతి భారతీయ పరిశోధకురాలు, సామాజిక శాస్త్రవేత్త గత అయిదు దశాబ్దాలకు పైగా దళిత, ఓబీసీ, ఆదివాసీల సమస్యలపై తన రచనలకు గాను ప్రపంచఖ్యాతి పొందారు. గెయిల్ ఒమ్వెట్ అమెరికన్ చర్మంలో ఒదిగిన దళిత మహిళ. రచనా క్షేత్రంలో, పోరాట రంగంలో ఉంటున్న మాలాంటి అనేక మందికి సిద్ధాంతాలపై రాజీపడకుండా, ప్రమాణాలు పలుచబారకుండా ఎలా రచనలు చేయాలో ఆమె నేర్పారు. ఇవాళ ఆమె మన మధ్య లేరు కానీ, తను రాసిన పుస్తకాలు, వ్యాసాలు, ప్రసంగాల ద్వారా, అసమానత్వానికి వ్యతిరేకంగా మేం సాగిస్తున్న పోరాటంలో ఆమె మాతో ఎప్పటికీ కలిసే ఉంటారు. 1980ల ప్రారంభంలో ఒక యువ విద్యావిషయక కార్యకర్తగా నేను ఆమెను పుణే సెమినార్లో తొలిసారిగా కలిశాను. మహారాష్ట్ర కులాల పొందిక, సామాజిక ఉద్యమాలు, రాజకీయాల చరిత్ర వంటి అంశాలపై ఆమెకున్న పట్టు చూసి ఆశ్చర్యపోయాను. భారతదేశంలోని దిగువ కులాల గురించి ఇంత పరితాపం, ఆసక్తి ఉన్న విదేశీయులను నేను అంతవరకు తెలుసుకుని ఉండలేదు. ఆ సెమినార్లో పాల్గొన్నవారందరూ సత్యశోధక్ ఉద్యమం, అంబేడ్కర్ ఆందోళనలు, రచనలపై అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆమె వివరణను తీసుకోవాలని ప్రయత్నించారు. ఒక మార్క్సిస్టు విద్యాధిక కార్యకర్తగా నేను ఆ శ్వేత మహిళలోని అపార జ్ఞానాన్ని, కులం, మహిళా విముక్తికి చెందిన ప్రతి అంశంపై ఆమె అవగాహనను చూసి ఆశ్చర్యపోయాను. ఆ సమయంలో దళిత, ఓబీసీ ఉద్యమాల కంటే ఫెమినిస్టు ఉద్యమమే బాగా ప్రచారంలో ఉండేది. ఈ రెండింటి గురించి ఒమ్వెట్ సమాన స్థాయిలో మాకు సమాచారం పంపేవారు. ఆ తర్వాత ఆమె దిగువ తరగతి శూద్ర/ఓబీసీ కుటుంబంలో కోడలిగా మారి ఒక గ్రామంలో నివసించారు. అమెరికానుంచి వచ్చి పూలే, అంబేడ్కర్ రచనలతో ప్రభావితురాలై, భారత్‌లోని అస్పృశ్యులు, ఆదివాసీల విముక్తి కోసం బోధన చేసి, వారిని సంఘటితపర్చి, ఆందోళనల్లో పాల్గొన్న ఈ గొప్ప మహిళ రచనలను అప్పటినుంచే చదవసాగాను. అది అంధకార గృహం నుంచి విరిసిన సరి కొత్త కాంతిపుంజం. తన రచనలు, ఉపన్యాసాల ద్వారా ఆమె దేశ, విదేశాల్లోని వేలాది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. అమెరికా నుంచి విద్యార్థిగా వచ్చి 1970లలో భారత్‌లో నివాసమేర్పర్చుకున్న ఒమ్వెట్ కుల అధ్యయనాలపై గొప్ప ప్రతిభ ప్రదర్శించారు. ఈ క్రమంలో ఆమె మార్క్సిస్టు పండితుడు, కార్యకర్త భరత్ పటాంకర్‌ను వివాహమాడారు. కులాన్ని, మహాత్మా పూలే ఉద్యమాన్ని అధ్యయనం చేయడానికి అమెరికా నుంచి ఆమె పీహెచ్డీ విద్యార్థినిగా వచ్చారు. భారతదేశంలో కులం, అస్పృశ్యతా వ్యవస్థను చూసి ఆమె కదిలిపోయారు. పీడిత కులాల విముక్తిపై కృషి చేయడానికి ఈ దేశంలోనే స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు. భారతదేశంలో దళిత, ఆదివాసీ, ఓబీసీ చైతన్యానికి రూపురేఖలు దిద్దడానికి ఆమె చేసిన దోహదం అసమానమైనదని చెప్పాలి. అమెరికాలోని మినియాపోలిస్‌లో జన్మించిన ఒమ్వెట్ యూసీ బర్క్లీ వర్సిటీలో చదివారు. 1973లో అదే వర్సిటీ నుంచి పీహెచ్.డి పొందారు. ఈ క్రమంలోనే ఆమె సామ్రాజ్యవాద వ్యతిరేకిగా మారిపోయారు. జాతీయవాదం అనేది పుట్టుక ద్వారా ఏర్పడదని నిరూపించడానికి ఆమె భారత్‌లో నివాసం ఏర్పర్చుకున్నారు. ఆమె అసాధారణ రచయిత, పలు పుస్తకాలు రచించారు. ఆమె థీసిస్ ప్రపంచానికి మహాత్మా పూలే సత్యశోధక్ ఉద్యమం గురించి ప్రపంచానికి తెలిపింది. ఆమె రాసిన విశిష్ట రచన ‘దళిత్స్ అండ్ డెమొక్రాటిక్ రివల్యూషన్’ భారత దేశంలోని కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ, ప్రపంచంలోని దక్షిణాసియా స్టడీ సెంటర్లలోనూ ప్రతి యువ విద్యార్థికీ, విద్యార్థినికీ కరదీపికగా మారిపోయింది. పరిశోధకులు కులం, అంటరానితనం సమస్యపై అవగాహనకు, ఆమె పుస్తకాలు చదివారు. గెయిల్ ఒమ్వెట్ పుణేలోని పూలే ఇంటికి వచ్చి కొత్త కాంతి ప్రసరించేంతవరకు, 1898 మహమ్మారికి బలైన సావిత్రీబాయి పూలే మరణం వరకు భారతీయ పండితులు వీరిద్దరి గురించి తెలుసుకోలేదు. స్వయంగా రంగం మీద ఉండి అనేక ఉద్యమాలకు నేతృత్వం వహించారు. జీవితకాలం ఆమె చేసిన కృషి, కలిగిం చిన స్ఫూర్తికి గాను శూద్ర, ఓబీసీ, దళిత, ఆదివాసీ ఉద్యమాలు ఆమెకు రుణపడి ఉంటాయి. అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక చైతన్యంతో భారతదేశం వచ్చిన ఒమ్వెట్ తన రంగును మార్చుకోలేకపోయారు కానీ, భారతీయ దళిత మహిళగా మారేందుకు అవసరమైన ప్రతి అంశాన్ని ఆమె పాటించారు. ఆమె సమర్పించిన పరిశోధనా సిద్ధాంతం పేరు ‘కల్చరల్ రిపోల్ట్ ఇన్ ఎ కలోనియల్ సొసైటీ: ది నాన్ బ్రాహ్మన్ మూవ్మెంట్ ఇన్ వెస్టర్న్ ఇండియా, 1870–1930.’ దీన్ని తర్వాత పుస్తకంగా ప్రచురించారు. గెయిల్ తన కెరీర్‌ని మార్క్సిస్టుగా ప్రారంభించారు. భారతీయ కుల వ్యవస్థను అధ్యయనం చేయడానికి ఆమె మార్క్సిస్టుగా కొనసాగి సోషలిస్టు భావాలను, మార్క్సిస్టు వైధానికతను అట్టిపెట్టుకున్నారు. అదే సమయంలో అంబేడ్కరైట్‌గా కూడా ఆమె పరివర్తన చెందారు. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో ఒమ్వెట్ దంపతులు చాలా క్రియాశీలకంగా పనిచేశారు. అనేక రంగాలపై ఆమె రచనలు చేశారు. బుద్ధిజంపై, మహిళలపై ఆమె రాసిన రచనలు కులంపై ఆమె రాసిన రచనల్లాగే సుపరిచితం. గత నలభై ఏళ్లుగా ఆమె భర్త భరత్ పటాంకర్, ఏకైక కుమార్తె ప్రాచీ పటాంకర్‌తో కలిసి దళిత, ఓబీసీ, ఆదివాసీ, మహిళా విముక్తి ఉద్యమాలలో సుదీర్ఘకాలం ఆమెతో కలిసి పని చేసిన మేమంతా ఆమె జీవితాన్ని, కృషిని భారతీయులుగా గర్విస్తూ వేడుకలు జరుపుకుంటాము. - ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఇంగ్లిష్ తొలగింపే లక్ష్యంగా...
హిందుత్వ ప్రాపంచిక దృక్పథం 2014 నుంచి సంపూర్ణంగా దేశాన్ని నియంత్రిస్తూ ఉంది. ఢిల్లీలో నరేంద్రమోదీ, అమిత్ షాలు, నాగ్‌పూర్‌లోని మోహన్ భగవత్, దత్తాత్రేయ హొసబలె తదితర ఆర్ఎస్ఎస్ అధినేతలు ఒక అసాధారణమైన జాతీయవాద భావజాలాన్ని అమలుచేస్తూ వస్తున్నారు. హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థలో చారిత్రకంగా మినహాయించిన కులాలు, కమ్యూనిటీలను ఈ జాతీయవాద లక్ష్యం మినహాయించబోదనీ, వారు హిందువులైతే విద్యా వ్యవస్థల్లోంచి వారిని పక్కన పెట్టమని వీరు చెబుతూ వస్తున్నారు. అదే సమయంలో ముస్లింలను, క్రిస్టియన్లను ఇతరులుగా మాత్రమే ఈ దృక్పథం చూస్తుంటుంది. 1990ల సరళీకరణ తర్వాత బడా వాణిజ్య కుటుంబాలు విద్యా వ్యాపారంలోకి అడుగుపెడుతూ వచ్చాయి. రాజీవ్‌గాంధీ హయాం లోనే హరియాణాలోని సోనిపట్‌లో ప్రైవేట్ విద్యారంగం కోసం ఏర్పర్చిన ప్రత్యేక ఆర్థిక మండళ్లలో వీరికి భారీ స్థాయిలో భూమిని కేటాయించారు. ఆ తర్వాతే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే విశ్వవిద్యాలయాలు ఉనికిలోకి వచ్చాయి. అత్యంత ఖర్చుతో కూడిన ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియంని వీటిలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ రిజర్వేషన్ పాలసీని ఇవి పాటించలేదు. ఇప్పుడు అత్యంత సరళమైన ఆర్ట్, ప్రాథమిక సైన్స్ విశ్వవిద్యాలయాలుగా పేరొందిన అశోకా, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలు ఇక్కడే మనుగడలో ఉన్నాయి. దేశంలోని అత్యంత ఖరీదైన ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన అశోకా విశ్వవిద్యలయాన్ని 2014లోనే స్థాపించడం గమనార్హం. కేంద్ర విద్యా చట్టాలు, నిబంధనలను అమలు చేస్తున్న జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయం, అలీఘర్ ముస్లిం వర్సిటీలతో పోలిస్తే పై వర్సిటీల స్వభావం, పనితీరు పూర్తిగా భిన్నమైనవి. ఇవి తమ సొంత సిలబస్‌ని కలిగి ఉండటమే కాకుండా, అత్యత నాణ్యమైన ఆంగ్లో - అమెరికన్ ఇంగ్లిష్‌ను బోధిస్తున్నాయి. కాబట్టే ఈ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు ప్రపంచ మార్కెట్లలో తమ ఉద్యోగావకాశాలకు సంబంధించి సమర్థవంతంగా పోటీ పడగలుగుతున్నారు. నిరుపేద ఆర్థిక నేపథ్యం కలిగి ఉండి తొలి తరం ప్రాంతీయ భాషా స్కూల్ విద్యా విధానంలో పెరిగివచ్చిన దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు ఈ ప్రైవేట్ విద్యా కేంపస్లలోకి కనీసం అడుగు కూడా పెట్టలేరు. జేఎన్‌యూ, ఢిల్లీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం నాణ్యమైన విద్యను అందించేవి. ప్రాంతీయ భాషలో చదువుకున్న తొలితరం యువత కూడా ఇవి అందించే నాణ్యమైన విద్యను, ఇంగ్లిష్ భాషను క్రమంగా అందిపుచ్చుకోగల వాతావరణం ఈ విద్యాసంస్థల్లో ఉండేది. కానీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో అలాంటి వాతావరణం ఉండదు. మనం ఉత్తమమైన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలహీనపర్చి శుద్ధ ప్రైవేట్ ఉన్నత విద్యను ప్రోత్సహించినట్లయితే పేదవర్గాలు అతి త్వరలో లేక తర్వాతైనా నిస్పృహకు గురికాక తప్పదు. ఐఐటీలు, ఐఐఎమ్‌లు వంటి కేంద్ర విద్యా సంస్థలు, సెంట్రల్ విశ్వవిద్యాలయాల్లో హిందుత్వ శక్తులు హిందీని మరింతగా ముందుకు తీసుకు వస్తున్నారు. అలాగే వారి శుద్ధ జాతి కేంద్రక హిందుత్వ సిలబస్‌ని కూడా ప్రోత్సహిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ విద్యా సంస్థలను బలహీనపరుస్తూ, మరోవైపు విదేశీ మార్కెట్ల కోసం సంపన్నులను విద్యావంతులను చేయడానికి ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించడం జాతీయవాదం కానే కాదు. భారతదేశం భాషా పరంగా చూస్తే చైనా, జపాన్ వంటి ఇంగ్లిషేతర జాతీయ భాషను కలిగిన దేశం కాదు. అలాగే హిందీ భాష మాండరిన్ (చైనా), జపనీస్ భాష లాంటిది అసలే కాదు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంగ్లిష్‌ను వ్యతిరేకిస్తూ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో దానికి అపారమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడం ప్రమాదకరమైన పద్ధతి. దీని ద్వారా ఒకనాటికి భారతీయ ఇంగ్లిష్, పూర్వపు సంస్కృతంలాగా కొద్దిమంది చేతివిద్యలా మారిపోతుంది. హిందుత్వ శక్తుల ద్వారా తీసుకొస్తున్న ఈ భాషా, సిలబస్ కంటెంట్ రాజకీయాల ప్రమాదాన్ని శూద్ర/దళిత/ఆదివాసీ మేధావులు గమనించే స్థితిలో లేరు. పైగా విద్యా విభాగాల నుంచి దీనికి ప్రతిఘటన ఎదురుకావడం లేదు. హిందుత్వ స్కూల్ మానసపుత్రిక బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇప్పుడు చాలావరకు హిందీలో బోధన చేస్తూ పీజీ, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు తమ పరీక్షలను హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రాసేలా అనుమతిస్తోంది. కానీ చాలామంది హిందీలోనే పరీక్షలు రాస్తున్నారు, తమ పరిశోధనలను సమర్పిస్తున్నారు. అయితే గత 35 ఏళ్లుగా మన విద్యావ్యవస్థను ప్రభావితం చేయగల మేధావులను ఈ విశ్వవిద్యాలయం సృష్టించలేకపోయింది. తద్భిన్నంగా, జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ అనేకమంది స్కాలర్లను, ప్రభుత్వ ఉన్నతోద్యోగులను, ప్రముఖ రాజకీయ నేతలను రూపొందించాయి. ప్రమాణాలను తీసివేసే ధోరణి ఇలాగే కొనసాగితే, ఈ వర్సిటీలు కూడా మన పేరుమోసిన జాతీయవాద విశ్వవిద్యాలయాల స్థాయికి పడిపోతాయి. పైగా, హిందుత్వ స్కూల్ దేశీయ పరిశ్రమలు, వ్యవసాయం, విద్యారంగాల్లో భారీ ప్రైవేటీకరణ పట్ల అనుకూలత వ్యక్తం చేస్తోంది. పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను వారు ప్రైవేటీకరిస్తున్న తీరు అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్త సాగుచట్టాల ద్వారా వ్యవసాయ మార్కెట్లను కూడా ప్రైవేటీకరించాలని నిర్ణయించారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగానే రైతులు పోరాడుతున్నారు. ఇక ఉన్నత విద్యలో వీరి విధానం కచ్చితంగా భవిష్యత్తుకు భారం కానుంది. ప్రైవేట్ విద్యా సంస్థలను జాతీయీకరణకు బదులుగా అంతర్జాతీయీకరణ వైపు అనుమతిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ప్రమాణాలు పెద్దగా లేని శుద్ధ జాతీయవాద పంథా వైపు తీసుకుపోతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయీకరణ పొందిన ప్రపంచంలో ప్రాంతీయీకరించిన విద్యావ్యవస్థను తీసుకురావడంతో పేదలు మరింతగా అవకాశాలు కోల్పోయి ప్రమాణాలు దిగజారిన వర్గంగా మిగిలిపోతారు. కేంద్రప్రభుత్వం యూజీసీ ద్వారా అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో సిలబస్‌నీ, భాషనీ, సంస్థాగత చట్రాన్నీ నియంత్రిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలు లేదా స్పర్థాతత్వం వంటివి కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాంశాలు కావు. భారతీయతపై కాకుండా ప్రాచీన హిందూతత్వంపై, హిందూ విజ్ఞానంపై దృష్టి సారించే హిందూ జాతీయవాదం లక్ష్యం ఏమిటంటే, మెల్లగా ఆంగ్లీకరణను రంగం నుంచి తప్పించడమే. ఉదాహరణకు రాజకీయ తత్వవిచారాన్ని బోధించేటప్పుడు దాంట్లోని యూరోపియన్ చింతనను తగ్గించివేసి భారతీయ వేద విజ్ఞానాన్ని, ఉపనిషత్ చింతనను ముందుకు తీసుకువస్తున్నారు. అయితే దీంట్లోనూ బౌద్ధచింతనను మినహాయించడం కుట్రపూరితం అనిపిస్తోంది. చివరకు జేఎన్‌యూ, ఢిల్లీ వర్సిటీలు కూడా ఇప్పుడు ఇంగ్లిష్ నైపుణ్యాలను, అంతర్జాతీయ స్పర్థకు తావిచ్చే జ్ఞానాన్ని మెరుగుపర్చడంపై కాకుండా, హిందీ, హిందుత్వ భావజాలానికి పరిమితం కావడంపైనే దృష్టి పెడుతున్నాయి. చివరకు కేంద్రీకృత పాలన ఉన్న చైనాలో కూడా విద్యావ్యవహారాల్లో ఇంత సంకుచిత దృష్టితో వ్యవహరించడం లేదు. ఈమధ్యనే ప్రతాప్ భాను మెహతా రాజీనామా, వెనువెంటనే అశోకా యూనివర్సిటీలలో జరిగిన చర్చను చూస్తే, విద్యా దార్శనికత కలిగిన ఆధ్యాపకులు జేఎన్‌యూ, ఢిల్లీ వర్శిటీల వంటి కేంద్ర విశ్వవిద్యాలయాలను వదిలిపెట్టి వెళ్లిపోతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కంచ ఐలయ్య, వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
విద్యా విప్లవానికి నాందీవాచకం
పాఠశాలల్లోని పిల్లలందరికీ నాణ్యమైన, సమానమైన మీడియం విద్యను అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నమూనా ఒక్కటే ఏకైక మార్గం. సంపన్నులు మాత్రమే చదవగల ప్రైవేట్ రంగ విద్యను రద్దు చేసే అవకాశం లేనందున అన్ని పాఠశాలల్ని ఒకే స్థాయిలో నిర్వహిం చడం ఒక్కటే సరైన పద్ధతి. దేశంలోని రైతులను, ఇతర శ్రామిక ప్రజానీకాన్ని ప్రాంతీయ, జాతీయ మనోభావాల ఉచ్చులోకి దింపి వారిని ఇంగ్లిష్ భాషలో విద్యకు పూర్తిగా దూరం చేసిన మనోభావాల లింకును వైఎస్ జగన్ తుంచేశారు. ప్రాథమిక విద్యపై, కళాశాల విద్యపై ఇంతగా దృష్టి పెట్టిన మరో సీఎంని మనం చూడలేం. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో అసాధారణమైన ప్రయోగం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో అసాధారణమైన ప్రయోగం చేస్తోంది. 2019 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. దీనికి చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. అయితే ఏపీ ప్రభుత్వం అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీల్లో ఇంగ్లిష్‌ని విద్యా మాధ్యమంగా చేసింది. వీటిని చేపట్టడానికి రాష్ట్ర యువ, ఆశావహ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు యుద్ధాలు చేయవలసి వచ్చింది. తమ పిల్లలను మాత్రం అతి ఖరీదైన ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో చదివి స్తున్న ఏపీలోని కపట మేధావి–రాజకీయ వర్గం జగన్ ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ దాన్ని మాతృభాషా సమస్యగా మార్చేసింది. తల్లి భాష అంటే తల్లి పాలు అంటూ వీరు గొంతు చించుకున్నారు. తమ గావుకేకలు వైఎస్ జగన్‌ని కదిలించకపోవడంతో తర్వాత వీరు న్యాయస్థానం ముందు సాగిలపడ్డారు. రాష్ట్ర కుహనా మేధావివర్గాల, ప్రతిపక్షాల ఈ కపటత్వాన్ని ఎండగడుతూ, వీరి వీధి పోరాటాలతో, మీడియాలో యుద్ధాలతో తలపడటానికి ఏపీ ముఖ్యమంత్రి తమ యువ కేడర్ని, పార్టీ నాయకులను మోహరించారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీతోపాటు వామపక్షాలు కూడా జగన్ చర్యను వ్యతిరేకిస్తూ ఆయన తెలుగు వ్యతిరేకి అని ఆరోపించారు. అయితే ఇంగ్లిష్ మీడియంలో విద్య అనేది తన నవరత్నాలు పథకంలో భాగం కాబట్టి, ఎన్నికల మేనిఫెస్టోలో ఈమేరకు వాగ్దానం చేశారు కాబట్టి వైఎస్ జగన్ తన మాటకు చివరివరకు కట్టుబడ్డారు. అదే సమయంలో ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో తెలుగును ఒక పాఠ్యాంశంగా తప్పనిసరిగా బోధించాలని జగన్ ఆదేశిం చారు. అన్ని పాఠ్యపుస్తకాలను ద్విభాషా పద్ధతిలో ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ముద్రించి ఇవ్వాలని కూడా ఆదేశించారు. అంటే అన్ని సబ్జెక్టుల్లోని పాఠాలు ఒక వైపు పేజీలో ఇంగ్లిష్‌లో, దాని పక్కపేజీలో తెలుగులో ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. దీంతో విమర్శకులకు మౌనం పాటించడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడు వీరి పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో కూడా రెండు భాషల్లో విద్య నేర్చుకోవచ్చు. ఇంతవరకు ఏపీలోని ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు తెలుగులో విద్య నేర్చుకోవడాన్ని అనుమతించలేదు. విద్యలో జగన్ సమూల మార్పులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యాబోధనకు గ్రామీణ, రైతు, మధ్యతరగతి వర్గాల తల్లిదండ్రుల మద్దతును వైఎస్ జగన్ పొందారు. తాము ఎంచుకున్న మీడియంలో విద్య పొందాలనుకునే పిల్లల హక్కును ఏ కోర్టూ వ్యతిరేకించదు. ఈ విషయాన్ని భారత సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ఎత్తిపట్టింది. ఇంగ్లిష్ మీడియంలో విద్యా హక్కు ప్రైవేట్ రంగానికి మాత్రమే పరిమితమైంది కాదు. పిల్లలంటే పిల్లలే. ప్రైవేట్ లేదా ప్రభుత్వ.. ఇలా వారు ఏ పాఠశాలలో చదివినా వారి హక్కు వారికే చెందుతుంది. వైఎస్ జగన్ తన ఇంగ్లిష్ మీడియం ఎజెండాను అమ్మ ఒడి పథకంతో మేళవించారు. పిల్లలను బడికి పంపే తల్లికి ఏటా విద్యా ఖర్చుల కోసం రూ. 15,000ల నగదును అందించే పథకమిది. దీంతోపాటు కాలేజీలో చదువుకునేవారి ఫీజు మొత్తం రీయింబర్స్ చేస్తున్నారు. దీనికి తోడుగా నాడు–నేడు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల మౌలిక వసతులను సమూలంగా మార్చడానికి భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అమలు చేస్తున్న పథకం కంటే నాడు–నేడు మరింత నిర్దిష్టమైనది, గుణాత్మకమైనది కావడం విశేషం. పైగా ఆంధ్రప్రదేశ్ అతి పెద్ద రాష్ట్రం కూడా. ఏపీ ముఖ్యమంత్రి ఈ విద్యాసంవత్సరం నుంచి అంగన్ వాడీలను కూడా ప్రాథమిక పాఠశాలలతో మిళితం చేశారు. పైగా స్కూల్ సిబ్బందిని, వసతి సౌకర్యాలను పెంచారు. ప్రతి రోజు స్థిరమైన మెనూతో ప్రభుత్వం నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేస్తోంది. అనేక రాష్ట్రాల్లో కంటే ఏపీలో ఈ పథకం కింద పిల్ల లకు మంచి ఆహారం లభిస్తూండటం గమనార్హం. పిల్లలున్న ప్రతి ఇంటి నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు కొద్ది రోజుల క్రితమే వైఎస్ జగన్ ప్రకటించారు. అలాగే మూడు కిలోమీటర్ల పరిధిలో ఒక హైస్కూలును, ఏడు కిలోమీటర్ల పరిధిలో రెండు జూనియర్ కళాశాలలను ఏర్పర్చనున్నారు. ఈ అన్ని విద్యా సంస్థల్లో ఒక సబ్జెక్టులో తెలుగును తప్పనిసరి చేస్తూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. పైగా ఇంగ్లిష్, తెలుగు రెండింటిలో టీచర్లు బోధించేలా తీర్చిదిద్దడానికి భారీ స్థాయిలో ఉపాధ్యాయ శిక్షణా పథకాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. విద్య అనేది ప్రతి పాప, బాబుకి చెందిన గౌరవనీయమైన ఆస్తిగా పాలకులు భావించనంతవరకు ఏ పాలకుడైనా విద్యపై ఇంత శ్రద్ధ పెట్టలేరు. వైఎస్ జగన్ 48 ఏళ్ల యువకుడు. సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది. నిజానికి దేశంలో అధికారంలో ఉంటున్న ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రుల్లో జగన్ అత్యంత యువ ముఖ్యమంత్రి కావడం విశేషం. భవిష్యత్తులోనూ ఒక రాజకీయనేతగా తన ఈ విద్యా ఎజెం డాను జగన్ కొనసాగించినట్లయితే దేశంలోని ప్రభుత్వ రంగ విద్యావిధానంలో గణనీయ ముద్రను వేయడం ఖాయం. సమానత్వానికి నమూనా ఎవరి జీవితంలోనైనా విద్య అత్యంత విలువైన సంపద అనేది తెలిసిన విషయమే. ఇది బంగారం కంటే ఉత్తమమైనది. దళితులకు, ఆదివాసీలకు, శూద్రులకు ఇంగ్లిష్ విద్య అనేది తమ ట్రావెల్ బ్యాగ్‌లో పెట్టుకుని మోసే బంగారు గనిలాంటిది. పదే పదే ఇది రుజువవుతోంది కూడా. అయితే స్వాతంత్య్రానంతర భారత పాలకులు ప్రభుత్వ రంగంలో ప్రాంతీయ భాష, ప్రైవేట్ రంగంలో ఇంగ్లిష్ భాష అనే రెండు వేర్వేరు రంగాలను నెలకొల్పడం ద్వారా దేశ ప్రజలకు సమానమైన మీడియం విద్యను తిరస్కరించారు. దేశంలోని ఆహార ఉత్పత్తిదారులను, ఇతర శ్రామిక ప్రజానీకాన్ని ప్రాంతీయ, జాతీయ మనోభావాల ఉచ్చులోకి దింపి వారిని ఇంగ్లిష్ భాషలో విద్యకు పూర్తిగా దూరం చేశారు. భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాలు ఈ సెంటిమెంటును తోసిపుచ్చి, ఇంగ్లిష్ కులీన విద్యావంతుల ప్రయోజనాల కోసం పనిచేస్తూ వచ్చాయి. ఇలాంటి సెంటిమెంటల్ లింకును జగన్మోహన్ రెడ్డి తెంచివేసారు. తన నూతన విద్యా ప్రాజెక్టులను క్రమం తప్పకుండా సమీక్షిస్తూ వస్తున్నారు. విద్యపై ఇంతగా దృష్టి పెట్టిన మరో ముఖ్యమంత్రిని మనం చూడలేం. విద్యకోసం తన ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు కూడా చాలావరకు మెరుగ్గా ఉన్నాయి. తన విద్యాపథకాల కోసం ఇతర పథకాలను కూడా ఆయన ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం మెరుగైన విద్యా నమూనాపై కృషి చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ భాషా విధానం.. ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించలేని గ్రామీణ, పేద ప్రజానీకానికి అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే స్థాయి విద్యను అందించడంలో తోడ్పడలేదు. పైగా బీజేపీ హయాంలో విద్యారంగంలో ఒక సరికొత్త వైరుధ్యం ఆవిర్భవించింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాంతీయ భాషలో పాఠశాల విద్య విషయంలో మొండిగా వ్యవహరిస్తూనే, మరోవైపున ఇంగ్లిష్ మీడియం కొనసాగించడానికి పెద్ద సంఖ్యలో ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలను అనుమతిస్తోంది. పాఠశాలల్లోని పిల్లలందరికీ నాణ్యమైన, సమానమైన మీడియం విద్యను అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నమూనా ఒక్కటే ఏకైక మార్గం. సంపన్నులు మాత్రమే చదవగల ప్రైవేట్ రంగ విద్యను రద్దు చేసే అవకాశం లేనందున అన్ని పాఠశాలల్ని ఒకే స్థాయిలో నిర్వహించడం ఒక్కడే సరైన, ఏకైక మార్గం. వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
ఈ వైఫల్యంలో పరివార్ బాధ్యత లేదా?
కరోనా మహమ్మారి తొలిదశలో వైరస్ వ్యాప్తికి.. ఢిల్లీలో మతపరమైన కార్యక్రమానికి హాజరైన తబ్లిగి జమాత్ ముస్లిం గ్రూప్ కారణమని ఆరెస్సెస్–బీజేపీ నాయకత్వం ఆరోపించింది. అది నిజమే అయితే, ఈ ఏడు వైరస్ వ్యాప్తికి ఆరెస్సెస్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంది. ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ముందస్తుగా నిర్వహించిన కుంభమేళా కార్యక్రమంలో ఆరెస్సెస్ పాత్ర లేదా? లక్షలాది ప్రజలు హాజరైన కుంభమేళా నుంచి వైరస్ దేశంలోని గ్రామాలన్నింటికీ వ్యాపించిన ఘటనకు ఎవరు బాధ్యత వహించాలి? కనీవినీ ఎరుగని ఈ విధ్వంసంలో తమ పాత్ర ఎంత అనే విషయంలో ఇప్పటికైనా సంఘ్ పరివార్, మోహన్ భాగవత్ నోరు విప్పాల్సి ఉంది. తప్పించుకు తిరగడం అనేది జాతీయవాదం కానే కాదు. భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న కోవిడ్– 19 విషాదానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రాథమికంగా బాధ్యత వహించాలా? కోవిడ్–19 తొలి వేవ్ తర్వాత భారత ప్రభుత్వం, పాలనా యంత్రాంగం, భారత ప్రజలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారని స్వయంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అదినేత మోహన్ భాగవత్ మే 15న ప్రకటించారు. అంతే.. భారతదేశంలో కరోనా మృతుల సునామీ విరుచుకుపడటానికి బాధ్యులైనవారిలో ప్రధాని మోదీని కూడా బీజేపీ మాతృసంస్థ చేర్చివేసిందని ప్రతిపక్షం, మీడియా వెంటనే విమర్శలు మొదలెట్టేశాయి. కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఆరెస్సెస్ బాధ్యత ఏమిటి? తనకు రాజకీయాలతో సంబంధం లేనే లేదని ఆరెస్సెస్ చెప్పుకుంటున్నప్పటికీ బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఆరెస్సెస్ చేయగలిగినంతా చేసింది. సరిహద్దుల్లోని భారత శత్రువులతో పోరాడటానికి కొద్ది రోజుల వ్యవధిలోనే తమ సంస్థ సిద్ధంగా ఉంటుందంటూ గతంలో మోహన్ భాగవత్ సంచలన ప్రకటన చేశారు. కానీ ఇంత శక్తివంతమైన సంస్థ కూడా ప్రస్తుతం నెలకొన్న వైద్యపరమైన సంక్షోభాన్ని, దేశవ్యాప్త కల్లోలాన్ని ఎందుకు పసిగట్టలేకపోయింది? బీజేపీని, ఆ పార్టీ ప్రధాని మోదీని తగు చర్యలు చేపట్టాల్సిందిగా ఆరెస్సెస్ ఎందుకు ఆదేశించలేకపోయింది? ప్రధాని మోదీ దశాబ్దాలపాటు రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకర్తగా గడిపారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 2002లో మారణకాండ చోటు చేసుకున్న తర్వాత హిందువులు బాధితులవుతున్నారనే భావనను బలోపేతం చేసే అవకాశాన్ని ఆరెస్సెస్, మోదీ సమర్థవంతంగా అందిపుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే మోదీకి ప్రమోషన్ లభించి న్యూఢిల్లీకి తరలివెళ్లారు. ‘నేను నిన్ను ఉపయోగించుకుంటాను, నువ్వు నన్ను ఉపయోగించుకో’ అనే భావజాలాన్ని ఆరెస్సెస్, మోదీ పరస్పరం పంచుకున్నారు. వీరిద్దరి ఉమ్మడి శత్రువు అయిన ముస్లింలు స్థిరంగా ఉంటూండగానే, వీరిద్దరూ పరస్పరం వాడేసుకున్నారు. అదే సమయంలో భారత్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే ఎజెండా వీరిద్దరికీ లేదు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం విషయంలో కానీ, మానవ సమానత్వంలో కానీ వీరికి ఏమాత్రం విశ్వాసం లేదు. దానికి మించి ప్రజాస్వామ్య మూలసూత్రాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలను వీరు ఎన్నడూ విశ్వసించలేదు. 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ ఆవిర్భవించిన తర్వాత ఆ సంస్థకు ఆధిపత్యం వహించిన సర్ సంచాలక్లలోకెల్లా మోహన్ భాగవత్ అత్యంత శక్తివంతమైనవారు అన్నది స్పష్టమే. భారత ప్రభుత్వంపై, పౌర సమాజంపై ఇంతటి ప్రభావం చూపగలుగుతున్న వారిని మునుపెన్నడూ చూసి ఎరుగం. ప్రత్యేకించి హిందూ పౌర సమాజంపై మోహన్ భాగవత్ వేసిన ప్రభావం అంతాఇంతా కాదు. ఇది ఎలా సాధ్యమయిందంటే, 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ గెలవడానికి ముందు, ఆరెస్సెస్, బీజేపీలు ఢిల్లీపై కానీ, దేశంలోని చాలా రాష్ట్రాల్లో కానీ ఎన్నడూ పట్టు సాధించిన పాపాన పోలేదు. చివరకు 1999–2004 సంవత్సరాల మధ్య నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో కూడా ఢిల్లీలో, బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రభుత్వంపై ఆ పార్టీకి పరిమితమైన పట్టు మాత్రమే ఉండేది. అప్పట్లో బీజేపీ నియంత్రణలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఉండేవి. దీని పర్యవసానంగానే 2000 సంవత్సరం నుంచి ఆరెస్సెస్ చీఫ్‌గా ఉండిన కేఎస్ సుదర్శన్ నేటి మోహన్ భాగవత్ కంటే చాలా తక్కువ పలుకుబడి కలిగి ఉండేవారు. కరోనా మహమ్మారి తొలిదశలో అంటే 2020 మార్చిలో, కరోనా వ్యాప్తి చెందడానికి.. ఢిల్లీలో అంతర్జాతీయ మతపరమైన కార్యక్రమంలో భాగంగా హాజరైన తబ్లిగి జమాత్ ముస్లిం గ్రూప్ కారణమనే భావనను ఆరెస్సెస్–బీజేపీ బలంగా ముందుకు తీసుకొచ్చింది. నిజానికి లాక్ డౌన్ ప్రకటించడానికి ముందే ఈ మత కార్యక్రమం మొదలైంది. తబ్లిగి జమాత్‌పై ఆ ఆరోపణలు నిజమే అయినట్లయితే, ఈ సంవత్సరం కరోనా వైరస్ వ్యాప్తికి ఆరెస్సెస్ మరింత బాధ్యత వహించాల్సి ఉంది. ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు సంవత్సరం ముందస్తుగా నిర్వహించిన కుంభమేళా భారీ కార్యక్రమానికి ఆరెస్సెస్ బాధ్యత వహించదా? లక్షలాదిమంది ప్రజలు హాజరైన కుంభమేళా నుంచి వైరస్ దేశంలోని గ్రామాలన్నింటికీ వ్యాపించిన ఘటనకు, గంగానది పొడవునా సామూహికంగా వైరస్ ప్రభావ మరణాలు సంభవించడానికి ఎవరు బాధ్యత వహించాలి? అదే సమయంలో అయిదురాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రధాని మోదీ ఇతర బీజేపీ జాతీయ స్థాయి నాయకుల బహిరంగ సమావేశాలకు భారీ స్థాయిలో ప్రజలను తరలించడంలో ఆరెస్సెస్ పాత్ర లేనే లేదా? ఈ క్రమంలో ఇంటింటికీ, గ్రామం నుంచి గ్రామానికీ, నగరం నుంచి నగరానికి ఆరెస్సెస్ కార్యకర్తలతో పాటు వైరస్ తోడుగా ప్రయాణించలేదా? ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఆరెస్సెస్ అదినేత మోహన్ భాగవత్ కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రి పాలయ్యారని వార్త కూడా వచ్చింది. అటు పిమ్మట సైతం ఆయన ఎన్నికలను వాయిదా వేయాలని బహిరంగంగా సూచించలేకపోయారు. కొందరు హిందుత్వ మద్దతుదారులు చెబుతున్నట్లుగా మోహన్ భాగవత్ కచ్చితంగా ఆవు మూత్రాన్ని, ఆవు పేడను కరోనా చికిత్సకోసం ఉపయోగించి ఉండరని నేను గట్టిగా చెప్పగలను. మరోవైపున ఈ ’బూటకపు’ వైద్య శాస్త్రాన్ని విమర్శించడానికి కూడా ఆరెస్సెస్ అధినేత ముందుకు రాలేదు. అన్నిటికంటే మించి మోహన్ భాగవత్, మోదీ ఒకే సంస్థ నీడలో సుదీర్ఘకాలంలో ఎదిగి వచ్చారన్నది మనం గ్రహించాలి. మోదీ ప్రధాని అయ్యేంతవరకు, రాష్ట్రీయ స్వయం సేవక్ అఖిల భారత యంత్రాంగంపై కానీ, దాని విశాలమైన సంస్థాగత యంత్రాంగంపై గానీ ఆయనకు ఏమాత్రం నియంత్రణ కూడా లేదు. సంఘ్ పరివార్ లోని కుల సాంస్కృతిక నియంత్రణల నేపథ్యంలో మోహన్ భాగవత్ సహజంగానే ఆరెస్సెస్‌లో అత్యంత శక్తివంతమైన నేతగా వెలుగొందుతూ వచ్చారు. అదే సమయంలో వెనుకబడిన కులాలనుంచి వచ్చిన మోదీకి ఎలాంటి ప్రాధాన్యతా ఉండేది కాదు. 2002 సంవత్సరానికి ముందువరకు ఆరెస్సెస్‌కి చెందిన మోహన్ భాగవత్, మరొక మహారాష్ట్ర బ్రాహ్మణుడైన ప్రమోద్ మహాజన్‌ల ఆదేశాలను మోదీ శిరసావహించేవారన్నది జగమెరుగని సత్యం. ఆరెస్సెస్–బీజేపీ సంస్థాగత నిర్మాణాల్లో కులం ప్రధాన అధికార శక్తిగా ఉంటూ వచ్చింది. నరేంద్రమోదీకి అత్యంత అనుకూలంగా మారిన విషయం ఏమిటంటే ఆయన గుజరాతీ నేపథ్యమే. ఇది మాత్రమే ఆయనకు పలు వ్యాపార సంస్థలతో బలమైన అనుసంధానాన్ని కల్పించింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యాధృచ్ఛికంగా తన ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. తనను తాను మరింత ముందుకు ప్రోత్సహించుకోవడానికి తన గత నెట్‌వర్క్‌లను మోదీ అత్యంత సమర్థంగా ఉపయోగించుకోగలిగారు. అయితే ఇప్పుడు సైతం సంఘ్ పరివార్ అధినేత మోహన్ భాగవత్.. ప్రధాని మోదీని గొప్ప నాయకుడిగా ఆమోదిస్తున్నారంటే నమ్మశక్యం కాదు. ఎందుకంటే చంద్రగుప్త మౌర్యుడు చక్రవర్తి అయినప్పటికీ అతడిని కౌటిల్యుడు తనకంటే అధికుడిగా ఎన్నడూ ఆమోదించేవాడు కాదు మరి. ఈ నేపథ్యంలో మోహన్ భాగవత్, ఆయన నేతృత్వంలోని సంఘ్ పరివార్‌కు భారతదేశం ప్రస్తుతం కూరుకుపోయిన ఉన్న తీవ్ర సంక్షోభంలో ఏ పాత్రా లేదని భారత ప్రజానీకం ఎలా విశ్వసించగలదు? కనీవినీ ఎరుగని ఈ సర్వవిధ్వంసంలో తమ పాత్ర ఎంత అనే విషయంలో ఇప్పటికైనా సంఘ్ పరివార్, మోహన్ భాగవత్ నోరు విప్పాల్సి ఉంది. ఒకటి మాత్రం నిజం.. పలాయనత్వం లేదా తప్పిం చుకు తిరగడం అనేది జాతీయవాదం కానే కాదు. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
వర్ణ వ్యవస్థను విస్మరిస్తే ఎలా?
రిజర్వేషన్ల ముఖ్య ఉద్దేశం అక్షరానికి ఉన్న శక్తిని అందరికీ పంచడమే. మరాఠాలతోపాటు అన్ని శూద్ర వర్గాలు ఈ అంశంలో వెనుకబడి ఉన్నాయి. ఈ కారణం వల్లనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు విద్యలో రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం గరిష్ట పరిమితిపై పునరాలోచన జరగాలి. దేశంలో కుల, వర్ణ వ్యవస్థలు అంతరించిపోయేంత వరకూ ఈ పరిమితిపై చర్చ కొనసాగాలి. న్యాయస్థానం శక్తి కూడా అక్షరంలోనే ఉంది. అన్ని సామాజిక వర్గాల వారికీ ఈ శక్తి పంపిణీ కూడా అనివార్యం. లేదంటే సామాజిక, సహజ న్యాయ సూత్రాలకు విఘాతం అనివార్యమవుతుంది! మరాఠాలు మహారాష్ట్ర జనాభాలో దాదాపు 30 శాతం వరకూ ఉండే వ్యవసాయాధారిత శూద్ర సామాజిక వర్గం. మహారాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో చాలావరకు మరాఠాలు కొన్ని ఇతర వ్యవసాయాధారిత శూద్ర సామాజిక వర్గాల సంక్షేమంపై ఆధారపడి ఉంటుంది. ఇంతటి కీలకమైన సామాజిక వర్గానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 16 శాతం రిజర్వేషన్‌ను సుప్రీంకోర్టు ఇటీవలే కొట్టివేసింది. 1992 నాటి మండల్ కేసు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు అన్నీ 50 శాతం వరకూ ఉండాల్సి ఉండగా.. మరాఠాలకు దీనికంటే ఎక్కువగా కోటా ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అసాధారణ పరిస్థితులేవీ చూపించలేదని ఐదుగురు సభ్యులు సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో వ్యాఖ్యానించింది. అయితే కోర్టు కుల–వర్ణ వ్యవస్థలను పరిగణనలోకి తీసుకోలేదు. మరాఠాల్లాంటి వ్యవసాయాధారిత సామాజిక వర్గాల విషయంలోనూ ఈ కుల – వర్ణ వ్యవస్థ సమానత్వ సూత్రాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంటుంది. కేంద్రంలో భారతీయ జనతాపార్టీ 2014 నుంచి అధికారంలో ఉన్నప్పటికీ తాము ఇంకా అసమానత బాధితులుగానే మిగిలి ఉన్నామన్న విషయం మరాఠాలకు ఇప్పటికే బోధపడి ఉంటుంది. అఖిల భారత సర్వీసుల్లో కానీ, రాష్ట్ర సర్వీసుల్లో కానీ వీరు శూద్రేతర అగ్రవర్ణాలైన ద్విజులతో వీరు పోటీ పడే పరిస్థితి లేదు. సామాజికంగా ఆర్థికంగా వృద్ధిలోకి వచ్చేందుకు ఉన్న అవకాశాల్లో ఇవి ముఖ్యమైనవి. మరాఠాల మాదిరిగానే భారత్‌లో వ్యవసాయాధారిత శూద్రులైన జాట్లు, గుజ్జర్లు, పటేల్స్, రెడ్లు, కమ్మలు, నాయర్లు 1992లో వెనుకబడిన కులాల జాబితాలో చేరే నిర్ణయం తీసుకోలేదు. కానీ చారిత్రకంగా సంస్కృత, పార్శీ, ఇంగ్లిషు విద్యాభ్యాసాన్ని చాలాకాలంగా కలిగి ఉన్న బ్రాహ్మణులు, కాయస్తులు, ఖాత్రీలు, క్షత్రియులు, బనియాలతో తాము పోటీ పడలేమని ఇప్పుడు వీరిలో చాలామంది గ్రహిస్తున్నారు. మహారాష్ట్రలో హిందూత్వ ఉద్యమం వైపు జన సామాన్యం ఆకర్షితమయ్యేలా చేయగలిగిన మరాఠాలు ఆర్ఎస్ఎస్/బీజేపీ అధికారం చేపడితే ఢిల్లీలో తమకు అధికార ఫలాలు కొన్నైనా దక్కుతాయని ఆశపడినా.. వారి ఆశలు నిరాశలుగానే మిగిలిపోయాయి. ఢిల్లీ, అధికారం, తమకింకా దూరంగానే ఉందని మరాఠాలు అర్థం చేసుకున్నట్లుగా అనిపిస్తోంది. తమ ప్రాభవమంతా మహారాష్ట్రకే పరిమితమని మరాఠాలు మాత్రమే కాదు... మండల్ జాబితాలోకి చేరిన పలు వ్యవసాయాధారిత శూద్ర సామాజిక వర్గాలూ స్పష్టమైన అంచనాకు వచ్చాయి. మహారాష్ట్ర, గుజరాత్‌లుగా విడిపోక ముందు ఉన్న స్టేట్ ఆఫ్ బాంబే నుంచి బ్రాహ్మణులు, బనియాలు జాతీయ నేతలు, ఉన్నత ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు, మేధావులు చాలామంది జాతీయ స్థాయికి చేరినా మరాఠాలకు మాత్రం ఢిల్లీ అధికారంలో తమ వంతు భాగం దక్కలేదు. శూద్రుల్లో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పాటిదార్ సామాజిక వర్గం నుంచి జాతీయ స్థాయి నేతగా ఎదిగినా మరాఠాలు మాత్రం దాదాపుగా లేరనే చెప్పాలి. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనే కాకుండా ఆ తరువాత కూడా తమ వర్గం నుంచి ఎవరినీ ఎదగకుండా ద్విజులు అడ్డుకున్నారని ఇప్పుడు మరాఠాలు భావిస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ వ్యాపారాలకు, స్థానికంగానే అధికారాలకు తమను పరిమితం చేసి హిందూ సమైక్యత పేరుతో తమను మైనార్టీలపై కండబలం చూపించే సాధనాలుగా ఆర్ఎస్ఎస్ వాడుకుంటోందన్నది కూడా వీరి అంతరంగం. ఇంగ్లిషు విద్యాభ్యాసమున్న ఉన్నతస్థాయి జాతీయ నేతలు, మేధావులను తయారు చేసుకోవడంలోనూ మరాఠాలు అంతగా విజయం సాధించలేదు. విద్యాభ్యాసం పరంగా వీరందరూ వెనుకబడి ఉన్నారన్నది దీని ద్వారా తేటతెల్లమవుతుంది. చారిత్రకంగానూ శూద్రులు సంస్కృతం చదివేందుకు రాసేందుకు అడ్డంకులు ఉండేవన్నది తెలిసిందే. ముస్లింల పాలనలో పార్శీ విద్యాభ్యాసం విషయంలోనూ ఇదే తంతు కొనసాగింది. అలాగే ఆధునిక ఇంగ్లిషు విద్యకూ మరాఠాలూ దూరంగానే ఉండిపోయారు. ప్రాంతీయ శూద్రులందరిలోనూ ఈ చట్రం నుంచి తప్పించుకోగలిగిన అదృష్టవంతులు కేరళకు చెందిన నాయర్లు మాత్రమే! సుప్రీం ఆలోచన మారాలి... సమానత్వమన్న భావనను ముందుకు తీసుకెళ్లాలంటే కుల వ్యవస్థ తాలూకూ చరిత్ర మొత్తాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. శూద్రుల్లోని కొన్ని వర్ణాల వారు ఇప్పటికీ ద్విజుల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నా ఆలిండియా సర్వీసుల్లో వారితో సమానంగా ఎందుకు పోటీ పడలేక పోతున్నారన్నది ఇది మాత్రమే వివరించగలదు. చరిత్ర శూద్రులపై మోపిన అతిపెద్ద భారం ఇది. వారందరూ వ్యవసాయం, కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారన్న విషయాన్ని దేశ ఉన్నత న్యాయస్థానం ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదన్నది ఎలా అర్థం చేసుకోవాలి? భారత సుప్రీంకోర్టు కూడా కమ్యూనిస్టు సిద్ధాంతకర్తలు చేసిన తప్పులే చేయరాదు. వారు భూ యజమానులను మాత్రమే గుర్తిం చారు కానీ.. అక్షరానికి ఉన్న శక్తిని గుర్తించలేకపోయారు. భారత్‌లో శూద్రులకు కొంత భూమి, శ్రమశక్తి ఉన్నప్పటికీ అక్షర శక్తి మాత్రం లేకుండా పోయింది. బ్రిటిష్ పాలనలో బ్రాహ్మణ జమీందారులు శూద్రుల జీవితం మొత్తాన్ని నియంత్రించే శక్తి కలిగి ఉండే వారంటే అతిశయోక్తి కాదు. ఈ రకమైన శక్తి దేశంలోని ఏ ఇతర కులానికీ లేదు. భూమి కలిగి ఉన్న మరాఠాలు కూడా ఈ రకమైన శక్తి కోసం ఆలోచన కూడా చేయలేకపోయారు. ఈ చారిత్రక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అత్యున్నత న్యాయస్థానమైనా ఆహారోత్పత్తిలో కీలకమైన కులాల భవిష్యత్తు విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సింది. రిజర్వేషన్ల ముఖ్య ఉద్దేశం అక్షరానికి ఉన్న శక్తిని అందరికీ పంచడమే. మరాఠాలతోపాటు అన్ని శూద్ర వర్గాలు ఈ విషయంలో వెనుకబడి ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇంగ్లిషు, ఇంగ్లిషు మీడియం విద్యాభ్యాసం విషయాల్లో. అన్ని కేంద్ర, న్యాయ, మీడియా సర్వీసుల్లో అక్షరానికి ఉన్న శక్తి ద్విజులను సానుకూల స్థితిలో నిలబెట్టింది. ఈ కారణం వల్లనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు విద్యలో రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం గరిష్ట పరిమితిపై పునరాలోచన జరగాలి. దేశంలో కుల, వర్ణ వ్యవస్థలు అంతరించిపోయేంత వరకూ ఈ పరిమితిపై చర్చ కొనసాగాలి. కుల వర్ణ వ్యవస్థలను రూపుమాపడం ఇప్పుడు ద్విజులకు మాత్రమే కాదు.. హిందువుల్లోని అన్ని కులాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నామని చెప్పుకునే ఆర్ఎస్ఎస్/బీజేపీల చేతుల్లోనే ఉంది. శూద్రులు, దళితులకు ఆధ్యాత్మిక, సామాజిక న్యాయం కల్పించాల్సిన బాధ్యత కూడా వీరిదే. కానీ దురదృష్టవశాత్తూ వీరు ఈ దిశగా పనిచేయడం లేదు. సుప్రీంకోర్టు చట్టపరంగా అమలు చేయగల తీర్పులు ఎన్నో ఇచ్చినప్పటికీ కులాధారిత జనగణనకు మాత్రం ఒప్పుకోవడం లేదు ఎందుకు? ఇదే జరిగితే ప్రతి సంస్థలోనూ కులాల ప్రాతినిథ్యం ఎలా ఉండాలన్న స్పష్టమైన అంచనా ఏర్పడుతుంది కాబట్టి! న్యాయస్థానం శక్తి కూడా అక్షరంలోనే ఉంది. అన్ని సామాజిక వర్గాల వారికీ ఈ శక్తి పంపిణీ కూడా అనివార్యం. లేదంటే సామాజిక, సహజ న్యాయ సూత్రాలకు విఘాతం అనివార్యమవుతుంది! ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
కమ్యూనిస్టుల అడ్డాగా కేరళ.. ఎలా?
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ముందస్తు పోల్ సర్వేలు ఒక విషయాన్ని తేల్చేశాయి. కేరళలో పినరయి విజయన్ రెండోసారి సీపీఎం తరపున ముఖ్యమంత్రిగా కానున్నారని అన్ని సర్వేలు స్పష్టం చేశాయి. కానీ పశ్చిమ బెంగాల్లో అదే సీపీఎం కనీస వార్తల్లో కూడా నిలవలేకపోయింది. కారణం కింది కులాల నేతలను నాయకత్వ స్థానాల్లోకి రాకుండా బెంగాలీ భద్రలోక్ కమ్యూనిస్టు నేతలు దశాబ్దాలుగా అడ్డుకున్నారు. కేరళలో అగ్ర కులాల నేతృత్వాన్ని పక్కకు తోసి పినరయి విజయన్ లాంటి దిగువ కులాలకు చెందిన వారు నాయకత్వ స్థానాల్లోకి రావడంతో ఇక్కడ సీపీఎం పీఠం చెక్కు చెదరలేదు. ఇందువల్లే బీజేపీ ఆటలు బెంగాల్లో చెల్లుతున్నట్లుగా, కేరళలో చెల్లడం లేదు. కేరళలో ఒకే దశ ఎన్నికలు పరిసమాప్తమై, పశ్చిమబెంగాల్లో ఎనిమిది దశల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న తరుణంలో ఈ వ్యాసం రాస్తున్నాను. అనేక ముందస్తు పోల్ సర్వేలు చెబుతున్నట్లుగా కేరళ సీపీఎం నేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేరళ ఎన్నికల చరిత్రలో రెండోసారి తిరిగి అధికారంలోకి రానున్నారు. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం ఎన్నికల అంకగణితంలో సీపీఎం కనీసం వార్తల్లో కూడా లేకుండా పోయింది. బెంగాల్లో ఆ పార్టీ పని దాదాపుగా ముగిసిపోయినట్లుగానే కనిపిస్తోంది. కేరళలో సీపీఎం నాయకత్వం మొదటగా బ్రాహ్మణుడి (ఈఎమ్ఎస్ నంబూద్రిపాద్) పరమై 1957లో తొలి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత రాష్ట్రంలోని శూద్రకులాల్లో అగ్రగామిగా ఉంటున్న నాయర్ల పరమైంది. ఇప్పుడు ఈళవ కులానికి చెందిన పినరయి విజయన్‌కి రెండోసారి కూడా సీఎం పదవి దక్కనుంది. ఈయన ఒకప్పుడు అంటరానిదిగా భావించిన కల్లుగీత కార్మికుల కమ్యూనిటీకి చెందినవారు. సుప్రసిద్ధ సామాజిక సంస్కర్త నారాయణ గురు ఈ కులానికి చెందినవారే. బెంగాల్ దళితుల్లా కాకుండా, కేరళ దళితులు ఇటీవలి కాలంలో సంస్కర్త అయ్యంకళి ప్రభావంతో బాగా సంఘటితం అయ్యారు. ఇప్పటికీ వీరు కమ్యూనిస్టు మద్దతుదారులుగానే ఉంటున్నారు. అదే పశ్చిమబెంగాల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభం నుంచి మూడు భద్రలోక్ కులాలైన బ్రాహ్మణులు, కాయస్థులు, బైద్యాస్ నియంత్రణలో నడిచేది. మిగిలిన శూద్రులు, నామ శూద్ర (దళిత్) కులాలను భద్రలోక్ మేధావులు చోటోలోక్ (నిమ్న కుల ప్రజలు)గా ముద్రవేసి చూసేవారు. పార్టీ శ్రేణులలో వీరు ఎన్నటికీ నాయకులు కావడానికి అనుమతించేవారు కాదు. కమ్యూనిస్టు భద్రలోక్ నేతలు వ్యవసాయ, చేతి వృత్తుల ఉత్పాదక ఆర్థిక వ్యవస్థ మూలాల్లో ఏ పాత్రా పోషించనప్పటికీ, కింది కులాల వారిని శ్రామికుల స్థాయిలోనే ఉంచడానికి మార్క్సిస్ట్ పదజాలాన్ని ఉపయోగిస్తూ పోయేవారు. చివరకు శూద్రులను, దళితులను రిజర్వేషన్ ఉపయోగించుకుని మధ్య తరగతి దిగువ స్థాయి మేధావులుగా రూపాంతరం చెందడానికి కూడా భద్రలోక్ నేతలు అనుమతించేవారు కాదు. ఇప్పుడు ఇదే శూద్ర, నిమ్నకులాల ప్రజలను ఆర్ఎస్ఎస్, బీజేపీలు సంఘటితం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సద్గోప్ (ఇతర రాష్ట్రాల్లో యాదవులకు సమానమైన) కులానికి చెందినవారు. ఈ కమ్యూనిస్టు భద్రలోక్ నేతలు పశ్చిమబెంగాల్లో 27 శాతం జనాభాగా ఉన్న ముస్లింలను సైతం గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులుగా ఎదగడానికి అనుమతించలేదు. కమ్యూనిస్టు పార్టీ భద్రలోక్ ఆలోచనా తత్వంనుంచి బయటపడి ఉంటే, ఒక ముస్లిం నేత ఇప్పటికే కమ్యూనిస్టుల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయి ఉండేవారు. అలా కాకూడదనే ఉద్దేశంతోటే భద్రలోక్ నేతలు తమ కమ్యూనిస్టు లౌకికవాద ముసుగులో శూద్రులను, దళితులను, ముస్లింలను అణిచిపారేశారు. మరోవైపున కేరళ ప్రయోగం దీనికి విరుద్ధంగా నడిచింది. అక్కడ కమ్యూనిస్టు ఉద్యమంలోని ఈళవ కుల నేతలు తమ నాయకత్వ స్థానాలను బలోపేతం చేసుకున్నారు. పార్టీలోని బ్రాహ్మణులు, నాయర్లు.. శూద్రులను దళిత కార్యకర్తలను అగ్రశ్రేణి నేతలుగా కాకుండా నిరోధించారు కానీ నారాయణ గురు, అయ్యంకళి సంస్కరణ ఉద్యమాలతో స్ఫూర్తి పొందిన వీరు నాయకత్వ స్థానాల్లోకి ఎగబాకి వచ్చారు. కేఆర్ గౌరి అమ్మ, వీఎస్ అచ్యుతానందన్, పినరయి విజయన్ క్రమంగా కమ్యూనిస్టు పార్టీలోని బ్రాహ్మణ, నాయర్ల ఆధిపత్యాన్ని తొలగించి నాయకత్వ స్థానాలను చేజిక్కించుకున్నారు. కేరళలో సీపీఎం పొలిట్ బ్యూరో ప్రధానంగా బెంగాల్ భద్రలోక్, కేరళ నాయర్ల ఆధిపత్యంలో నిండి ఉండేది. దేశంలో కానీ, అంతకు మించి పార్టీ శ్రేణుల్లో కానీ కుల చైతన్య ధోరణులు ఆవిర్భవించడాన్ని సైతం వీరు అడ్డుకునేవారు. అయితే కేరళ ఓబీసీలు, దళిత్ నేతలు కుల అంధత్వంలో ఉండిపోయిన కేంద్ర భద్రలోక్ నాయకత్వాన్ని అడ్డుకుని హుందాగానే కేంద్ర స్థానంలోకి వచ్చారు. ఇప్పుడు పినరయి విజయన్ పార్టీలో అత్యంత నిర్ణయాత్మకమైన రీతిలో కెప్టెన్‌గా అవతరించారు. కింది కులాల ప్రజలు, దళితులు అలాంటి మార్గంలో పయనించడానికి బెంగాల్లో, త్రిపురలో కూడా అక్కడి పార్టీ నాయకత్వం అనుమతించలేదు. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా తయారైందంటే శూద్ర, ఓబీసీ, ఆదివాసీ ప్రజలు అక్కడి భద్రలోక్ కమ్యూనిస్టు నేతలను నమ్మలేని దశకు చేరుకున్నారు. కులం అనేది దేశవ్యాప్తంగానే కమ్యూనిస్టు భద్రలోక్ జీవులకు సంపూర్ణంగా ఒక విచిత్రమైన, పరాయి సంస్థగానే ఉండిపోయింది. అసలు కులం అనేది ఉనికిలోనే లేదు అని వారు నటించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో వర్గ అస్తిత్వ రాజకీయాల కంటే కుల అస్తిత్వమే పరివర్తనా పాత్రను పోషిస్తోంది. ఇవి రెండూ కూడా ఎన్నికల్లో జన సమీకరణ సాధనాలుగా ఉంటున్నాయి. అలాగే సామాజిక, ఆర్థిక స్తబ్ధతను అధిగమించే సాధనాలుగా కూడా ఉంటున్నాయి. ఇది కమ్యూనిస్టు భద్రలోక్ మేధావులకు ఏమాత్రమూ తెలీని విషయం కాదు. కానీ, వారి నాయకత్వ స్థాయిని, స్థితిని దెబ్బతీస్తుంది కాబట్టి ఈ వాస్తవాన్ని దాచిపెట్టాలని వీరు కోరుకున్నారు. పశ్చిమ బెంగాల్లో ఇలా వాస్తవాన్ని మరుగునపర్చి ఆటలాడిన కారణంగానే అక్కడ కమ్యూనిస్టు పార్టీ అంతరించిపోయింది. అదే కేరళలో ఈళవ కుల నేతల ఊర్ధ్వ ప్రస్థానం పార్టీని సైతం కాపాడుకోగలిగింది. తమిళనాడులో ద్రవిడ ఉద్యమం కానీ, ఏపీ తెలంగాణల్లో తెలుగుదేశం, టీఆర్ఎస్ కానీ, వైఎస్సార్సీపీ కానీ దళితులను, రిజర్వుడ్ శూద్ర కులాలను తెలివిగా ముందుకు తీసుకొచ్చారు. ఈ పార్టీలన్నీ కమ్మ, వెలమ, రెడ్డి వంటి అన్ రిజర్వుడ్ శూద్ర కులాల నేతల నేతృత్వంలో ఉంటున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోకుండా ఆరెస్సెస్, బీజేపీని సైతం నిలువరిం చాయి. అయితే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ స్వయంగా భద్రలోక్ పార్టీ కావడంతో ఆరెస్సెస్, బీజేపీలు అక్కడ దళితులను, శూద్రులను గణనీయంగా సమీకరించగలుగుతున్నాయి. కానీ కేరళలో ఇదే ఆరెస్సెస్, బీజేపీలు నాయర్లు లేక దళితుల్లో కొందరిని తప్ప, రిజర్వుడ్ శూద్రుల (ఓబీసీలు) నుంచి నేతలను కొనలేకపోతున్నాయి. కేరళలో నాయర్లు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కమ్మ, రెడ్డి, వెలమ వంటి శూద్ర కులాలు దక్షిణభారత దేశంలో దిగువ శూద్రులకు, దళితులకు అధికారం పంచిపెట్టకపోయి ఉంటే బీజేపీ ఈ దిగువ శూద్ర, దళిత కులాలను చక్కగా ఉపయోగించుకునేది. దీంతో బీజేపీకి ఇక వేరు మార్గం లేక రాష్ట్ర విభాగాలకు గాను అధ్యక్ష పదవిని కాపులకు ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కాపులను సమీకరించాలని ప్రయత్నిస్తున్నారు. కేరళలో పినరయి విజయన్ ఈళవ కులం నుంచి రాకపోయి ఉంటే (ఆ రాష్ట్రంలో ఈ కులస్తులు మొత్తం జనాభాలో 24 శాతంగా ఉన్నారు), ప్రధాని నరేంద్రమోదీ ఈళవ కులనేతల్లో ఎవరో ఒకరికి సీఎం పదవిని ప్రతిపాదించి అధికారం కైవసం చేసుకుని ఉండేవారు. కానీ ఇప్పుడు ఇది కేరళలో సాధ్యం కాదు. పశ్చిమబెంగాల్లో కూడా మహిస్యాలు, సద్గోపులు, దళితులు వంటి చోటోలోక్ నేతలను సమీకరించడం ద్వారా ఆరెస్సెస్, బీజేపీలు జూదక్రీడను ఆడుతూ వస్తున్నాయి (మహిస్యాలు అంటే బెంగాల్లో రెడ్డి లేక కమ్మ కుల స్థాయికి సంబంధించిన వారని చెప్పుకోవచ్చు. కానీ వీరిని పాలక కులాలుగా అవతరించడానికి ఇంతవరకు బెంగాల్ పార్టీలు అనుమతించలేదు). కమ్యూనిస్టు భద్రలోక్ నేతలు ఇప్పుడు రహస్య స్థావరాలను వెతుక్కుంటున్నారు. అక్కడ ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. కానీ కేరళలో మాత్రం కమ్యూనిస్టు బ్రాహ్మణిజాన్ని తుంచివేసి ముస్లింలను, ఓబీసీలను, దళితులను సమీకరిం చడం ద్వారా పినరయి విజయన్ అటు కేరళను, ఇటు దేశాన్ని కూడా కాపాడబోతున్నారు. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
హలధారులే కానీ.. హంతకులు కారు
ఏనాడూ ఎకరం భూమిని దున్ని ఎరుగని, పొలంలో విత్తనాలు చల్లడం, ఒక టన్ను ధాన్యం పండించడం ఎరుగని కుటుంబంలోంచి వచ్చిన కంగనా రనౌత్ ఆహార ఉత్పత్తిదారులపై తనదైన తీర్పు చెబుతూ ఉండటం గమనార్హం. నిజానికి గుర్రపుస్వారీ చేసే, కత్తి సాము చేసే కుటుంబ వారసత్వం నుండి కంగనా వచ్చింది. హిమాచల్‌ప్రదేశ్‌లో రాజభవనంలో నివసిస్తున్న కంగనా రనౌత్‌కి, దేశంలోని సకల ప్రజానీకానికి జీవనదానం చేస్తున్న విత్తనాలను నాగేటి చాలులో రైతులు ఎలా చల్లుతారో కూడా బహుశా తెలిసి ఉండకపోవచ్చు. ఈ సచిన్ టెండూల్కర్‌లకు, ఈ కంగనా రనౌత్‌లకు వ్యవసాయం గురించి ఏం తెలుసని? ప్రత్యేకించి రైతులకు వ్యతిరేకంగా కంగనా రనౌత్ వాడిన భాష దేశాన్నే కాదు.. ప్రపంచాన్నే నివ్వెరపర్చింది. భారతీయ రైతులు ఉగ్రవాదులంటూ కంగనా రనౌత్ పదే పదే దాడిచేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత పాప్ గాయని రిహానా, అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థెన్‌బర్గ్ భారతీయ రైతుల ఉద్యమాన్ని బలపర్చినందుకు స్పందనగా కంగనా మన రైతులను ఉగ్రవాదులను చేసిపడేశారు. సచిన్ టెండూల్కర్, ఇతర బీజేపీ అనుకూల శక్తులుకూడా దీనికి వంతపాడారు. ఈ సెలబ్రిటీల్లో చాలామంది గుత్తపెట్టుబడి దారీ సంస్థలకు అనుకూలంగా ఉంటారు. భారతీయ రైతులు, వ్యాపార, పారిశ్రామిక వర్గాల మధ్య ఘర్షణ నెలకొన్నప్పుడు ఎవరి వైపు నిలబడాలి అని తేల్చుకోవడానికి కులపరమైన సామాజిక స్థానమే కీలకపాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ అభిప్రాయాలు అనేక అంశాలపై వ్యక్తమవుతూ ఉంటాయి. నిజానికి బీజేపీ/ఆరెస్సెస్ శక్తులు అనేక సందర్భాల్లో అంతర్జాతీయ మద్దతును తమకు అనుకూలంగా కూడగడుతూ వచ్చాయి. నిర్భయ ఘటన సమయంలో అలాంటి అంతర్జాతీయ అభిప్రాయాలు చాలా వ్యక్తమయ్యాయి. అవి చాలావరకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేవి కాబట్టి ఆరెస్సెస్/బీజేపీ కూటమి చాలా సంతోషంగా అలాంటి అంతర్జాతీయ అభిప్రాయాలను స్వాగతించేది. మన రైతులు ఈ స్థాయిలో ఆందోళనను నిర్వహించడం నా జీవితకాలంలోనే చూసి ఎరుగను. ఈ సచిన్ టెండూల్కర్‌లకు, ఈ కంగనా రనౌత్‌లకు వ్యవసాయం గురించి ఏం తెలుసని? ప్రత్యేకించి రైతులకు వ్యతిరేకంగా కంగన వాడిన భాష దేశాన్నే కాదు.. ప్రపంచాన్నే నివ్వెరపర్చింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ద్వారా భారతీయ శూద్ర రైతులపై ఎక్కుపెట్టిన క్షత్రియ బాణమే కంగనా రనౌత్ అనేది అందరికీ తెలిసిందే. నేను ఇంత బలంగా ఎందుకు చెబుతున్నానంటే, ఆందోళన చేస్తున్న రైతులు చాలావరకు శూద్రులే. ఇక క్షత్రియులు ఒక సామాజిక వర్గంగా ఎన్నడూ నాగలి చేత బట్టి ఎరుగరు. వారి చేతుల్లో ఎస్టేట్ల కొద్దీ భూములున్నప్పటికీ తమ చారిత్రక ఉనికిలో క్షత్రియులు నాగలి పట్టలేదు. పొలాలను దున్నడం అనేది వారి సామాజిక హోదాకు భంగకరమని వీరి భావన. ఆసక్తికరమైనదేమిటంటే, ఉత్తరప్రదేశ్‌కి చెందిన జాట్లు రాకేష్ తికాయత్ నాయకత్వంలో ప్రస్తుతం రైతాంగ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉండటమే. అయినప్పటికీ ఖలిస్తాన్‌తో ఈ ఆందోళనను ముడిపెట్టి పంజాబ్ రైతుల ఉద్యమాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు కంగనా చెబుతూ వస్తోంది. వ్యవసాయ ఉత్పత్తికి, దానిద్వారా వ్యాపారం చేసి లాభాలు సాధించాలని కోరుకుంటున్న వ్యాపార వర్గాలకు మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉంది. రైతులు భారతదేశ చరిత్రలో ఎన్నడూ వ్యాపార సముదాయంగా మారలేదు. దేశంలో ఇప్పుడు కమ్మ, రెడ్డి, వెలమ, కాపు, లింగాయత్, జాట్, గుజ్జర్, యాదవ్, మరాఠా వంటి కులాల ప్రజలు గుత్తాధిపత్య వాణిజ్యంలోకి ఎన్నడూ అడుగు పెట్టలేదు. అదే సమయంలో బడా వ్యాపారం మొత్తంగా బనియాలు, బ్రాహ్మణులు, కాయస్థులు, ఖాత్రిస్ వంటి వారి చేతుల్లో ఉండిపోయింది. ఇటీవలే క్షత్రియులు కూడా వాణిజ్యంలోకి అడుగుపెడుతున్నారు. ఈ కులపరమైన విభజన కారణంగానే రైతుల భయాలు రెట్టింపవుతున్నాయి. ఏనాడూ ఎకరం భూమిని దున్ని ఎరుగని, పొలంలో విత్తనాలు చల్లడం, ఒక టన్ను ధాన్యం పండించడం ఎరుగని కుటుంబంలోంచి వచ్చిన కంగనా రనౌత్ ఆహార ఉత్పత్తిదారులపై తనదైన తీర్పు చెబుతూ ఉండటం గమనార్హం. నిజానికి గుర్రపుస్వారీ చేసే, కత్తి సాము చేసే కుటుంబ వారసత్వం నుండి కంగనా వచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లో రాజభవనంలో నివసిస్తున్న కంగనా రనౌత్‌కి, దేశంలోని సకల ప్రజానీకానికి జీవనదానం చేస్తున్న వనరు అయిన విత్తనాలను నాగేటి చాలులో ఎలా చల్లుతారో కూడా తెలిసి ఉండకపోవచ్చు. తెలుగు కవి అస్తా గంగాధర్ రైతు గురించి రాసిన పాట యూట్యూబ్‌లో ట్రెండ్ సెట్టర్ అయింది. ’’ఓ కర్షకుడా నీవే మా హీరో, ఓ రైతా నీవే మా లెజెండ్, ఓ రైతా బురదలోంచి ఆహారం పండిస్తావు, నీవు ఆహారం పండించకుంటే కంప్యూటర్లు పనిచేయవు, నీవు ఆహారం పండించకుంటే రోబోలు నడవలేవు, నీవు ఆహారం పండించకుంటే సైనికులు తుపాకులు పేల్చలేరు’’ అని సాగుతుందా గీతం. జాతికి నిజమైన కథానాయకుడైన ఈ రైతును, జాతి నిజమైన దిగ్గజమైన ఈ రైతును కంగనా పదేపదే ఉగ్రవాది అని పిలుస్తోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘకాలంగా సాగిస్తున్న తర్వాత వారి ఉద్యమంపట్ల ఈ అంతర్జాతీయ స్పందన ఎలా వచ్చింది? ఈశాన్య భారతదేశానికి చెందిన తొమ్మిదేళ్ల గిరిజన బాలిక, పర్యావరణ వాది కంగుజమ్ ప్రపంచానికి సందేశమిస్తూ గడ్డకట్టించే చలిలో కరోనా మహమ్మారి కాలంలో ఢిల్లీ సరిహద్దుల్లో ఆరుబయట నిరసన తెలుపుతున్న రైతుల పట్ల స్పందించాల్సిందిగా కోరారు. ‘‘ప్రియ స్నేహితులారా, లక్షలాది మన పేద రైతులు చలికి గజ గజ వణుకుతూ వీధుల్లో నిద్రిస్తున్నారు. మీ నుంచి వారు ఏమీ ఆశిం చడం లేదు. వారు సాగిస్తున్న పోరాటానికి అనుకూలంగా కేవలం ఒక ప్రేమపూర్వకమైన ట్వీట్ చేయండి, సంఘీభావం ప్రకటించండి.. అదే వారికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మన భారతీయ సెలబ్రిటీల పని ముగిసిపోతుంది’’ అంటూ కంగుజమ్ ట్వీట్ చేసింది. మన సొంత పర్యావరణవాది, యువ ఆదివాసీ బాలిక చేసిన అభ్యర్థన రిహానాతో సహా పలువురు అంతర్జాతీయ సెలబ్రీటీలను కదిలించింది. ఢిల్లీ సరిహద్దులో అతి శీతల వాతావరణంలో బతుకుతున్న భారతీయ రైతు చిత్రాన్ని పోస్ట్ చేసిన రిహానా ‘మనం ఈ రైతుల నిరసన గురించి మాట్లాడలేమా’ అని ట్వీట్ చేశారు. ఈ ఆరుపదాల ట్వీట్ సుడిగాలిని సృష్టించింది. భారత్‌లో నడుస్తున్న రైతుల నిరసనకు మేం సంఘీభావం తెలుపుతున్నాం అంటూ ప్రపంచ ప్రసిద్ధ పర్యావరణ వాది గ్రేటా థన్ బెర్గ్ మద్దతు పలుకుతూ ట్వీట్ చేసింది. ఇక నటి, ఇన్‌స్ట్రాగామ్‌లో చురుకుగా ఉండే అమందా సెర్నీ కూడా తన మద్దతును తెలిపింది. ప్రపంచం గమనిస్తోంది. సమస్యను అర్థం చేసుకోవడానికి మీరు ఇండియన్, పంజాబీ లేక దక్షిణాసియా వాసి కావాల్సిన పనిలేదు. వాక్ స్వాతంత్రం, పత్రికా స్వేచ్ఛ, కనీస మానవ, పౌర హక్కుల సమానత్వం, కార్మికులను గౌరవించడం ఇవే మనం డిమాండ్ చేయవలసినవి అంటూ అమందా ఫార్మర్స్ ప్రొటెస్ట్, ఇంట ర్నెట్ షట్‌డౌన్ హ్యాష్ ట్యాగ్లు జతకలిపి మరీ సందేశం పంపింది. ఈ అంతర్జాతీయ ట్వీట్లకు స్పందిస్తూ కంగనా వారు రైతులు కాదు, భారత్‌ను విడదీయాలను చూస్తున్న ఉగ్రవాదులు అంటూ ట్వీట్ చేసింది. రిహానాను నోర్మూసుకో అంటూ దూషించడమే కాకుండా, గ్రేటా థెన్బర్గ్ను కూడా అనరాని మాటలతో నిందించింది. రైతు ఉద్యమాన్ని ఖలిస్తాన్ ఉగ్రవాద ఉద్యమంగా ముద్రించాలని చూస్తున్న కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతుగా ఆమె తెగ రెచ్చిపోయింది. తన ఆరేళ్ల పాలనలో ప్రధాని మోదీ మొదటి సారిగా అతిపెద్ద రాజకీయ తప్పిదానికి పాల్పడ్డారు. తాను అధికారంలోకి రావడానికి రెండుసార్లు ఓట్లేసిన రైతులపై మోదీ దాడి చేశారు. మరోవైపున రైతులను ఉగ్రవాదులుగా వర్ణించడాన్ని వ్యతిరేకిస్తూ రైతు కుటుంబాలనుంచి వాస్తవ మేధావులు అసంఖ్యాకంగా పుట్టుకొచ్చి తమ తమ ప్రాంతీయ భాషల్లో, తమ సొంతపాటలు, కథలు, నవలలు రాస్తూండటం గమనార్హం. ఈ విధంగా రైతుల ఆందోళన ఒక కొత్తతరం రాతను, పాటను, నృత్యాన్ని గ్రామాల్లో ప్రభావితం చేసింది. సోషల్ మీడియాకు రెండు కోణాలు ఉన్నాయి. ఒక నిర్దిష్ట దశలో అది ఆరెస్సెస్/బీజేపీకి అనుకూలంగా పనిచేసింది. కానీ ఇప్పుడు దాని భాష మారుతోంది. ఎందుకంటే ఉగ్రవాదిగానో, జాతి వ్యతిరేకి గానూ ముద్ర వేసి తొక్కేసేటంత తక్కువ జాతీయవాదిగా మన రైతు నేడు లేడు. ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
రైతు పోరాటంపై పంజాబ్ ముద్ర
దేశంలో ఏ ప్రాంతంలోని రైతు సంఘాలకంటే పంజాబ్ రైతు సంఘాలు, రైతులు కేంద్రప్రభుత్వ నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం కొనసాగిస్తున్నారు. కనీస మద్దతు ధరను డిమాండ్ చేయడం కంటే, తమ శ్రమశక్తిని అంగట్లో పెట్టి కొల్లగొట్టాలని చూస్తున్న భారతీయ కార్పొరేట్లను నిలువరించడానికే పంజాబ్ రైతులు ఇప్పుడు పోరాడుతున్నారు. న్యాయమైన పోరాటం చేస్తున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా రైతుల విశేష మద్దతును వారు కూడగట్టగలిగారు. అదే సమయంలో తమ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ముందుకొచ్చే రాజకీయ జిమ్మిక్కుల పట్ల కూడా పంజాబ్ రైతులు అప్రమత్తంగా ఉంటూవచ్చారు. ఈ అప్రమత్తత, దృఢనిశ్చయమే తమపై జరుగుతున్న హిందుత్వ దాడిని పంజాబ్ రైతులు తిప్పికొట్టగలిగేలా చేసింది. నూతన వ్యవసాయ చట్టాలపై కొనసాగుతున్న రైతుల నిరసన.. కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీని సాధించుకోవడానికి లేక మూడు కొత్త చట్టాల రద్దు కోసం మాత్రమే కాదు. తగిన విలువను చెల్లించకుండానే రైతుల శ్రమశక్తిని అపహరించుకుపోవాలని చూస్తున్న భారతీయ సంపన్న పెట్టుబడిదారులను నిలువరించడానికే ఇప్పుడు రైతుల పోరాటం జరుగుతోంది. ఈ పోరులో సిక్కు కమ్యూనిటీకి చెందిన రైతులే ఎక్కువగా ముందుపీఠిన నిలబడటానికి అనేక కారణాలు తోడవుతున్నాయి. ఎలాంటి చర్చలూ లేకుండా, రైతు సంఘాలను విశ్వాసంలోకి తీసుకోకుండానే.. కేంద్రప్రభుత్వం వివాదాస్పదమైన ఈ మూడు సాగు చట్టాలను పార్లమెంటులో హడావుడిగా ఆమోదింపజేసుకున్నప్పుడే దాంట్లోని ప్రమాదాన్ని పంజాబ్ రైతులే మొట్టమొదటగా గ్రహించారు. పంజాబ్‌లోకి సైనిక దళాలను నాటి ప్రధాని ఇందిరాగాంధీ పాలనాయంత్రాంగం పంపించినప్పుడు అంటే 1980ల మొదట్లో పంజాబ్ సిక్కులు చివరిసారిగా కేంద్రంతో తలపడ్డారు. అప్పట్లో ఖలిస్తాన్ ఉద్యమానికి విస్తృత స్థాయిలో మద్దతు లేదు. కానీ ఇప్పుడు సిక్కు రైతులు న్యాయమైన పోరాటం చేస్తున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా రైతులను సమీకరించడమే కాకుండా, వారి విశేష మద్దతును కూడా కూడగట్టగలిగారు. అందుకే రైతాంగ ఉద్యమంలో ముందుండి పోరాడిన హీరోలుగా వీరు భారతీయ చరిత్రలో స్థానం సంపాదించుకోనున్నారు. సిక్కు రైతులు ఖలిస్తాన్ ఉగ్రవాదులా? ఆరెస్సెస్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కలిసి కంగనా రనౌత్ వంటి ప్రచారకుల దన్నుతో, పంజాబ్ సిక్కు రైతులను ఖలిస్తానీ ఉగ్రవాదులుగా చిత్రించడానికి ప్రయత్నించాయి. కానీ సిక్కు రైతాంగ యువత ఉన్నత విద్యను పొందడమేకాదు.. వారు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నందున హిందుత్వ సైన్యానికి సరైన సమాధానం ఇవ్వగలిగారు. ఆరెస్సెస్, బీజేపీలు నియంత్రణలో లేని తమ బలగాలను ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీరీలపై ప్రయోగించినట్లు, పంజాబ్ రైతులపై ప్రయోగిస్తే ఒక జాతిగా భారత్ ప్రమాదంలో పడుతుంది. పైగా దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోని రైతాంగం కంటే సిక్కు రైతులు మెరుగైన పోరాటం చేయగలరు. అదే సమయంలో తమ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ముందుకొచ్చే రాజకీయ జిమ్మిక్కుల పట్ల కూడా పంజాబ్ రైతులు అప్రమత్తంగా ఉంటూ వచ్చారు. ఈ అప్రమత్తత, దృఢనిశ్చ యమే తమపై జరుగుతున్న దాడిని పంజాబ్ రైతులు తిప్పికొట్టగలిగేలా చేసింది. పైగా దేశవ్యాప్తంగా రైతులు వారి ఉద్యమంలో భాగమయ్యేలా కూడా చేసింది. మరొకవైపు బాలీవుడ్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న చిత్ర పరిశ్రమ కూడా న్యాయంకోసం పోరాడుతున్న రైతులకు మద్దతుగా నిలబడింది. రైతులు భారతదేశ ఆహార సైనికులు అని చిత్రసీమ ప్రముఖులు వర్ణించారు. ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్న రైతు సైనికులు లేనిదే సరిహద్దుల్లో సైనికులు కూడా నిలబడలేరు. ఆరెస్సెస్, బీజేపీలు రైతు సైనికులను జాతీయవాదులుగా ఎన్నడూ గుర్తించలేదు పైగా దేశంలోని బడా వ్యాపార కుటుంబాలను మాత్రమే వారు నిజమైన జాతీయవాదులుగా ఆరాధిస్తున్నారు. శ్రమను గౌరవించడం సిక్కు రైతులు ఇలా ఇప్పుడు దుడ్డుకర్రలు ఎందుకు పట్టుకున్నారంటే తమ శ్రమను కాపాడుకోవడం కోసమే. సిక్కు మతంలో శ్రమించడానికి అపారమైన విలువ ఉంది. సాపేక్షికంగా చూస్తే సిక్కులలో కులతత్వం తక్కువగా ఉంటున్నందుకు తగిన మూలాలు ఇక్కడే ఉన్నాయి. సిక్కులలో మెజారిటీ ప్రజలు జాట్లు. చారిత్రకంగా వీరు శూద్ర వర్ణానికి చెందినవారు. ఐక్య పంజాబ్‌లో వీరు ద్విజుల చేతుల్లో నానా బాధలకు, అవమానాలకు గురయ్యారు. గురునానక్ సిక్కుమతం స్థాపిం చాక ఆయన, అనంతర సిక్కు గురువుల బోధనలను, శ్లోకాలను గురుగ్రంథ సాహిబ్ గ్రంథంలో పొందుపర్చారు. వర్ణ వ్యవస్థ నుంచి, శ్రమను అగౌరవపర్చడం నుంచి సిక్కు సమాజం విముక్తి పొందడానికి ఇది పునాది వేసింది. ఇది శూద్ర శ్రామికులలో ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చింది. వారి స్థాయిని మార్చి సమానమైన, గౌరవం కలిగిన సభ్యులుగా కలిపేసుకుంది. అయితే పంజాబ్‌లో దళిత సిక్కులు సామాజిక వివక్షను ఎదుర్కొనడం లేదని దీనర్థం కాదు. అయితే సిక్కు కమ్యూనిటీ హిందుత్వ వాదుల స్థాయి కులతత్వాన్ని కలిగిలేదు. అలాగే ఆ స్థాయిలో వీరు వర్ణధర్మాన్ని పాటించడంలేదు. దళిత సిక్కులకు ప్రపంచవ్యాప్తంగా తమవైన రవిదాసి గురుద్వారాలు ఉన్నాయి. పైగా దళిత సిక్కులు ఉన్నత విద్యావంతులై, సిక్కుమతంలో భాగంగా ఉంటూనే తమదైన స్వతంత్ర ఆధ్యాత్మిక, సామాజిక అస్తిత్వాన్ని కలిగి ఉన్నారు. సిక్కు మతాన్ని హిందూ మతంలో భాగంగా చిత్రించడానికి హిందుత్వవాదులు ప్రయత్నిస్తున్నప్పటికీ తమను హిందూమతంలో కలిపేసుకోవడంలో భాగంగా అలా చేస్తున్నారని సిక్కులు స్పష్టంగా గ్రహించారు కాబట్టి హిందుత్వ వాదుల ఆటలు చెల్లడం లేదు. పైగా గురుగ్రంథ సాహిబ్ గురించి తగుమాత్రం జ్ఞానం కలిగి వున్న ఏ సిక్కు అయినా సరే లింగ భేదంతో పనిలేకుండా గ్రంథి అయిపోతారు. ఇది హిందూయిజానికి భిన్నమైనది. సిక్కుమతంలో ఉన్న అలాంటి లింగపరమైన ఆధ్యాత్మిక తటస్థత, ఉత్పత్తి క్రమం, వ్యవసాయ ఉత్పత్తిలో వారి సామూహిక శ్రమ భాగస్వామ్యం, సామర్థ్యత వంటివి పంజాబ్‌ను భారతదేశ ధాన్యాగారంగా మార్చాయి. వ్యవసాయ ఉత్పత్తిలో కులరహిత, లింగ తటస్థతతో కూడిన ఇలాంటి భాగస్వామ్యాన్ని ఆరెస్సెస్, బీజేపీ ఎన్నడూ కోరుకోలేదు. పైగా వర్ణ ధర్మ పరంపరను కొనసాగించడంపై వీరు నొక్కి చెబుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ గౌరవంగా పొలంలో పనిచేయడం అనే సామాజిక పునాదిలోనే పంజాబ్ వ్యవసాయ పురోగతికి మూలాలున్నాయి. ఇకపోతే గురుద్వారాలలో చేసే కరసేవ ఇప్పటికే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. గురుద్వారాలు ప్రత్యేకించి అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించే ఏ వ్యక్తికైనా అక్కడ ఉచిత భోజనం లభిస్తుంది. కులపరమైన సాంస్కృతిక అగౌరవం చూపకుండానే సంపన్నులు సైతం ఆలయాల్లో శ్రామిక సేవను సాగించే ఇలాంటి సంస్కృతి.. తామే నిజమైన హిందూ జాతీయవాదులుగా ప్రచారం చేసుకుం టూండే ఆరెస్సెస్–బీజేపీ అజెండాలో ఎన్నడూ లేదు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్ భారత్ వంటి నినాదాలను ఘనంగా ప్రచారం చేసుకుంటోంది కానీ, ఆధ్యాత్మిక–మత వ్యవస్థలో శ్రమ గౌరవాన్ని చొప్పించకుండా ఈ పదాలకు అర్థమే ఉండదు. సజీవ వ్యత్యాసం సకల జనుల శ్రేయస్సుకోసం పనిచేయడం, కరసేవ (అందరి శ్రేయస్సు కోసం శారీరక పనిచేయడం) గురించి సిక్కుమతం నొక్కి చెబుతుంటుంది. ఈ రెండూ గురు గ్రంథ్ ఆధ్యాత్మిక సిద్ధాంతంలో రెండు విశిష్ట భావనలు. బ్రాహ్మణవాదానికి వీటి గురించి ఏమీ తెలీని సమయంలోనే సిక్కు గురువులు శ్రమగౌరవానికి చెందిన భావనను గొప్పగా నెలకొల్పారు. హిందుత్వ భావజాలంలో శూద్ర/దళిత రైతులు, కూలీలకు ఏమాత్రం గౌరవం ఉండదు. వీరిని మనుషులుగానే లెక్కించరు. కానీ పంజాబ్ వెలుపల భారతీయ ఆహార వ్యవస్థకు వీరే మూలస్తంభాలుగా ఉంటున్నారు. హిందూ ఆధ్యాత్మిక, సామాజిక వ్యవస్థలో వ్యవసాయ పనికి గౌరవం కల్పించే వైపుగా మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. దానికి బదులుగా సామాజిక, ఆర్థిక మార్పులకు ఎన్నడూ దోహదం చేయని, మేటపడిన తమ సంపదను విస్తృత ప్రజానీకం శ్రేయస్సు కోసం ఖర్చుపెట్టకుండా పేద రైతులను దోపిడీ చేయడానికి సిద్ధంగా ఉంటున్న గుత్త పెట్టుబడిదారులను అనుమతించే తరహా సాగు చట్టాలను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. సిక్కు రైతులు ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తి జ్ఞానాన్ని తమ వెన్నెముకగా చేసుకున్న బలమైన ప్రపంచవ్యాప్త కమ్యూనిటీలో భాగమయ్యారు. అటవీ భూములను సాగు చేయడానికి వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వలసపోయారు. ఈ క్రమంలో ఆయా దేశాల గౌరవనీయ పౌరులుగా మారిపోయారు. ఇప్పుడు వీరు కెనడాలో కీలకమైన రాజకీయ శక్తిగా ఉన్నారు. భారతదేశం వినమ్రంగా వీరి నుంచి నేర్చుకోవాలి. అలాగే సిక్కు కమ్యూనిటీని కించపర్చడంకోసమే నిరంతరం ప్రయత్నిస్తున్న తన శక్తులకు ఆరెస్సెస్– బీజేపీ పగ్గాలు వేయాల్సి ఉంది. సిక్కు సమాజాన్ని కించపర్చడాన్ని వీరు ఎంత ఎక్కువగా కొనసాగిస్తే అంతగా వీరు దేశంలోనే కాకుండా ప్రపంచం ముందు కూడా పలచన అయిపోవడం ఖాయం. ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
భారత మహిళలకు కమల ఆదర్శం
శ్వేతసౌధంలో అడుగు పెట్టబోతున్న మొట్టమొదటి ఆసియన్‌గా, భారత, నల్లజాతి మూలాలు కలిగిన వ్యక్తిగా కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించనున్నారు. సముద్రాలను దాటి పరదేశాలవైపు ప్రయాణిస్తే తమ సంప్రదాయాలు కలుషితమవుతాయని వందేళ్ల క్రితం వరకు భారతీయ పురుషులు తటపటాయించిన చరిత్రకు భిన్నంగా కమల కొత్తదారి పట్టారు. జెండర్, జాతి, కులం, వర్గంతో పనిలేకుండా దేవుడు మనుషులందరినీ సమానంగా సృష్టించాడు అనే మత విశ్వాసంతో.. మానవ సమానత్వం పట్ల నిబద్ధత వహించిన వ్యక్తిగా కమల నుంచి నేర్చుకుందాం. కమల తల్లి, ఇప్పుడు కమల జీవితం నుంచి భారతీయ మహిళలు పాఠం నేర్చుకోవలసి ఉంది. ఒక మహిళ కుల, జాతి వివక్షకు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించుకుంటే సాహసంతో ఆ పని చేయవచ్చని వారిద్దరూ నిరూపించారు. నిస్సందేహంగా అమెరికా ఒక ప్రపంచ శక్తి. దాన్ని సవాల్ చేయడానికి చైనా ప్రయత్నిస్తున్నప్పటికీ సమీప భవిష్యత్తులో అది విజయం సాధించకపోవచ్చు. ఇప్పటినుంచి అనేక సంవత్సరాల వరకు అమెరికా ప్రజాతంత్ర నైతికత, దాని అత్యంత అధునాతనమైన పెట్టుబడిదారీ సంపద ఈ ప్రపంచాన్ని పాలించబోతోంది. అలాంటి అమెరికాకు భారతీయ మూలాలు కలిగిన కమలా హ్యారిస్ తన భుజాలపై నల్ల ముద్రను తగిలించుకుని మొట్టమొదటి ఉపాధ్యక్షురాలిగా మారుతున్నారు. ఇది భారతీయులకు ప్రత్యేకించి భారత మహిళలందరికీ నిస్సందేహంగా గర్వించదగిన విషయమే అవుతుంది. శ్వేతసౌధం పాలనా భవనంలోకి అడుగుపెడుతున్నప్పుడు ఆమె రెండు చేతుల్లో అనేక ప్రథమ పతాకాలను తనతో తీసుకెళతారు. రంగు తెలుపైనా, నలుపైనా ఆ స్థానంలోకి వెళుతున్న మొట్టమొదటి అమెరికా మహిళ ఆమె. ఉపాధ్యక్ష పీఠం అధిష్టించబోతున్న తొలి ఆసియన్ మహిళ, తొలి భారత సంతతి మహిళ.. ఆ రకంగా ప్రథమ భారత మహిళ కూడా. నల్లజాతి, బ్రాహ్మణ నేపథ్యాలు కలగలసిన భారత సంతతి మహిళ కమలా హ్యారిస్. ఏరకంగా చూసినా ఇది ఒక అరుదైన, అసాధారణమైన సమ్మేళనం అనే చెప్పాలి. జాతివివక్ష కొనసాగుతున్న దేశంలో భారతీయ బ్రాహ్మిన్ నుంచి నల్లజాతితత్వం వరకు ఎంతో అనురక్తితో కమలా హ్యారిస్ పొందిన ఈ పరివర్తన అత్యంత అరుదైన సందర్భాల్లో ఒకటిగా నిలుస్తుంది. చరిత్రలో చాలా కాలంపాటు బ్రాహ్మణ పురుషులు సముద్రాలను దాటి ప్రయాణించేవారు కాదు. అలా ప్రయాణిస్తే తమ సంప్రదాయాలు కలుషితమవుతాయని వారు భావించేవారు. భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన బికాజీ బల్సారా అనే పార్సీ వ్యక్తి 1910లో మాత్రమే కోర్టు తీర్పు ద్వారా మొట్టమొదటి అమెరికన్ తటస్థ పౌరుడయ్యారు. తెల్లరంగు కలిగిన పార్సీకి అమెరికా పౌరసత్వం పొందే హక్కును కోర్టు అనుమతించింది. అంతకుముందు కొంతమంది సిక్కులు అమెరికాకు కూలీలుగా వలసవెళ్లి పౌరసత్వం పొందని చట్టవిరుద్ధ కూలీలుగా దశాబ్దాలపాటు అక్కడే పనిచేస్తూ ఉండేవారు. తర్వాత ఏకే మజుందార్ అమెరికాకు వలసవెళ్లి 1913లో అమెరికన్ పౌరసత్వం తీసుకున్న మొట్టమొదటి బ్రాహ్మణుడిగా చరిత్రకెక్కారు. తాను ఆర్య జాతికి చెందినవాడిని కనుక కకేసియన్ అమెరికన్ శ్వేతజాతికి సరిసమానుడైన వ్యక్తిని అని న్యాయస్థానంలో మజుందార్ వాదించారు. ఆ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఆ సమయంలో అమెరికాలో జాతి ఆధిక్యతా భావం మన దేశంలోని కులాధిక్యతలాగే తీవ్ర స్థాయిలో ఉండేది. కమలా హ్యారిస్ తాత పీవీ గోపాలన్ ఒక సంప్రదాయ తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. తమిళనాడులో 1940, 50లలో పెరియార్ రామస్వామి నాయకర్ సాగించిన బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమానికి నిరసన తెలిపిన క్రమంలోనే మధ్యతరగతి ఇంగ్లిష్ విద్యాధిక బ్రాహ్మణులు వలస పోవడం మొదలైంది. 1950, 60లలో అమెరికాకు ఉన్నతవిద్యకోసం వలసవెళ్లిన కొద్దిమంది భారతీయులు అక్కడే స్థిరపడిపోయారు. కానీ ఆ కాలంలో ఉన్నతవిద్యకోసం అమెరికాకు పెద్దగా మహిళలు వెళ్లిన చరిత్ర లేదు. అలాంటి స్థితిలో కమలా హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ సైన్స్‌లో ఉన్నత విద్య కోసం 1958లో అమెరికాకు వెళ్లారు. నల్లజాతికి చెందిన స్టాన్‌ఫర్డ్ వర్సిటీ ఆర్థికశాస్త్ర ఉపాధ్యాయుడు డోనాల్డ్ జాస్పర్ హ్యారిస్‌ని ఆమె పెళ్లాడారు. ఈయన జమైకా నుంచి అమెరికాకు వలస వచ్చిన వ్యక్తి. ఇద్దరు బాలికలకు (కమలా, మాయా) జన్మనిచ్చిన తర్వాత కొద్ది కాలానికే డాక్టర్ హ్యారిస్ ఆమెను వదిలిపెట్టి వెళ్లిపోయారు. శ్యామల నల్లజాతి పౌరహక్కుల కార్యకర్తగా అమెరికాలో నివసించారు. ఒక తమిళ బ్రాహ్మణ మహిళ అమెరికాలో అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా అత్యంత అరుదైన ఘటన. మార్టిన్ లూథర్ కింగ్ నేతృత్వంలో పౌరహక్కుల ఉద్యమం 1960ల నాటి అమెరికాలో పతాక స్థాయికి చేరుకుంది. తన భర్త మతమైన ప్రొటెస్టెంట్ క్రిస్టియన్‌గా కమల మారింది. కానీ తరచుగా ఆమె హిందూ దేవాలయాలను కూడా దర్శించేది. కమల ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ నేపథ్యం అటార్నీ, సెనేట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఆమెకు సహకరించింది. జోబైడెన్ కేథలిక్ క్రిస్టియన్. అందుకనే భారతీయ నల్లజాతికి చెందిన ప్రొటెస్టెంట్ నేపథ్యం ఉన్న కమలా హ్యారిస్‌ను జో ఎంపిక చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలవడానికి అది ఎంతగానో పనిచేసింది. శ్యామల తండ్రి పీవీ గోపాలన్ బ్రిటిష్ పాలనాయంత్రాంగంలో ఒక ప్రభుత్వోద్యోగి. శ్యామల ఢిల్లీలోని లేడీ ఇర్విన్ కాలేజీలో డిగ్రీ చదివారు. తర్వాత ఉన్నత విద్యకోసం బర్క్లీ వర్సిటీకి వెళ్లారు. అక్కడే ఆమె తన జమైకన్ భర్తను కలిశారు. సాధారణంగా తమిళ బ్రాహ్మణులు సంప్రదాయ వైష్ణవులు. శ్యామల తన ఈ నేపథ్యాన్ని అధిగమించి తన సాంస్కృతిక వారసత్వానికి పూర్తిగా భిన్నమైన ఒక నల్లజాతి వ్యక్తిని పెళ్లాడింది. ఇదే ఒక విప్లవాత్మక చర్య. కమల హార్వర్డ్, కాలిఫోర్నియా వర్సిటీలలో లా చదువుకున్నారు. అమెరికాలో చాలామంది న్యాయవాదులు లా ప్రాక్టీసు చేస్తూనే రాజకీయాల్లోకి ప్రవేశించేవారు. జో బైడెన్, బిల్ క్లింటన్, ఒబామా కూడా లాయర్లే. కమల విజయవంతమైన లాయర్‌గా, రాజకీయనేతగా ఆవి ర్భవించారు. ఈ నేపథ్యంలోనే యూదు అమెరికన్‌ను పెళ్లాడారు. మొట్టమొదటి ఉపాధ్యక్షురాలైన కమల అమెరికా అధ్యక్షురాలిగా కూడా కావచ్చు. ఈ నవంబర్ 20 నాటికి 78 సంవత్సరాలు పూర్తయ్యే జో బైడెన్‌కు ఆరోగ్య సమస్యలు తలెత్తిన పక్షంలో కమల దేశాధ్యక్షురాలు కావచ్చు. లేదా ఉపాధ్యక్షురాలిగా తాను సమర్ధురాలిని అని నిరూపించుకున్న పక్షంలో రాబోయే సంవత్సరాల్లో నేరుగా అధ్యక్షపదవికి పోటీ చేయవచ్చు కూడా. భారతీయులుగా మనం అమెరికాలో కమలా హ్యారిస్ ఉత్థానం నుంచి నేర్చుకోవలసిన పాఠం ఒకటుంది. జెండర్, జాతి, కులం, వర్గంతో పనిలేకుండా దేవుడు మనుషులందరినీ సమానంగా సృష్టించాడు అనే మత విశ్వాసంతో మానవ సమానత్వం పట్ల నిబద్ధత వహించిన వ్యక్తిగా కమల నుంచి నేర్చుకుందాం. ఒక మహిళ కుల, జాతి వివక్షకు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించుకుంటే అత్యంత సాహసంతో ఆ పని చేయవచ్చని శ్యామల, కమల నిరూపించారు. శ్వేతసౌధంలో కమల పోషించే పాత్ర భారత్‌కు ఎలా ఉపకరి స్తుంది? వచ్చే నాలుగేళ్లలో భారత ప్రభుత్వానికి, బైడెన్–హ్యారిస్ ప్రభుత్వానికి మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యం ఉండబోతుంది? పోలిస్తే కమల, బైడెన్లు కశ్మీర్ సమస్యపై విభిన్న దృక్పథాన్ని కలిగి ఉన్నారు. కమల భారతీయ మూలాలు కలిగి ఉండటం ఒక అంశం కాగా, మోదీ ప్రభుత్వ విధానాలపై వారి ప్రభుత్వ దృక్పథం ఏమిటనేది మరో అంశం. హౌస్టన్‌లో అమెరికన్ ఇండియన్ ర్యాలీలో అమెరికా గడ్డపై ‘ఆబ్కీ బార్ ట్రంప్‌కీ సర్కార్’ వంటి ప్రకటనలు చేయడంద్వారా ప్రధాని మోదీ అనేక దౌత్యవిరుద్ధ ప్రకటనలు చేసి ఉన్నారు. భారత్‌లో కూడా ఈ మార్చి నెలలో అహ్మదాబాద్ బహిరంగ సభను నిర్వహించిన మోదీ మరోసారి ట్రంప్ అధికారంలోకి రావాలన్న ఉద్దేశాన్ని ప్రకటించారు. అయితే మోదీ ప్రభుత్వం ట్రంప్ అనుకూల ప్రదర్శనలు ఎన్ని చేసినప్పటికీ అమెరికన్ భారతీయుల్లో ఎక్కువమంది బైడెన్–హ్యారిస్ ప్రచారానికి అనుకూలంగా ఓటేశారు. 2019 ఎన్నికల్లో గెలిచాక, మోదీ ప్రభుత్వం అంతర్గతంగా, విదేశీ విధాన పరంగా తీసుకున్న చర్యలు భారత్‌ను సంక్షోభం నుంచి సంక్షోభం లోకి నెట్టాయి. మోదీ మానవ హక్కుల సమస్యపై తన వైఖరిని మార్చుకోవడంపైనే అమెరికాతో తన సంబంధాలు ఆధారపడి ఉంటాయి. భారతీయ మూలాలు ఉన్నాయి కాబట్టి కమలా హ్యారిస్ ఈ అంశంపై కాస్త ఔదార్యంతో వ్యవహరించే ప్రసక్తే ఉండకపోవచ్చు. వ్యాసకర్త ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ సామాజిక కార్యకర్త -
నల్లజాతి కళ్లలోంచి మన కులవ్యవస్థ
అమెరికన్ ఓటర్లను 2020 ఎన్నికల్లో ప్రభావితం చేసిన ఇసాబెల్ విల్కర్సన్ రచన ‘క్యాస్ట్: ది ఆరిజన్స్ ఆఫ్ అవర్ డిస్కంటెంట్స్’ (కులం: మన అసంతృప్తుల మూలాలు) పుస్తకాన్ని పూర్తిగా చదవకముందే నేనొక విషయాన్ని గుర్తించాను. అదేమిటంటే, ఒక నల్ల సోదరి 400 సంవత్సరాల పాత గృహం నుంచి 3,500 సంవత్సరాల మన పాత గృహానికి వచ్చేసింది. ఆమె మన పాత ఇంటిని పూర్తిగా కూల్చివేసి కొత్త ఇంటిని నిర్మించుకోవాలని చెప్పింది. వాస్తవానికి చరిత్రలో మొట్టమొదటిసారిగా కులం జన్మించిన అతి పాత ఇంటి కథను ఆమె మనకు చెప్పింది (ఆర్యుల మూల స్థానం జర్మనీ). ఆర్యుల తొలి స్థలం రెండో ప్రపంచయుద్ధంలో కూల్చివేతకు గురై తిరిగి దాన్ని కొత్తగా నిర్మించారని నాకు గుర్తొచ్చింది. అమెరికాలో కూడా వారు తమ పాత ఇంటిని కూల్చివేసే మార్గంలో ఉన్నారు. అమెరికాలో తమదైన కులాన్ని పాటించే తెల్లవాళ్లు ఇప్పుడు ఒక సర్దుబాటు క్రమంలో ఉన్నారు. ఇసాబెల్ విల్కర్సన్ గొప్ప సత్యాన్ని చెబుతున్నారు. మానవుల చర్మాల్లో జాతి భావన ఎలా ఇమిడిపోయి ఉందో, అలాగే భారతీయుల, అమెరికన్ల మూలగల్లో కులం ఘనీభవించింది. ఆర్యులే కుల వైరస్ సృష్టికర్తలు. భూమ్మీద ఉన్న మానవులందరిలో ఎక్కువగా భారతీయుల మూలగలను ఈ వైరస్ కబళించేస్తోంది. భారతీయుల్లో కులం నరనరానా ఎంతగా జీర్ణించుకుని పోయిం దంటే అమెరికాలో లేక యూరోపియన్ విశ్వవిద్యాలయాల్లో ఉంటున్న ఇంగ్లిష్ విద్యావంతురాలైన బ్రాహ్మణ సోదరి తన చేతిలో ఉన్న సాధనాన్ని తనిఖీ చేయాలని కానీ, లేదా కనీసం ఈ ఇంటిలో ఉన్న పరిస్థితిపై చర్చ జరగాలని కానీ భావించడం లేదు. వెయ్యి సంవత్సరాలుగా సంస్కృతంలో, పర్షియన్ భాషలో విద్య పొందిన, ఇప్పుడు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్ యూనివర్శిటీల్లో అత్యున్నత ఇంగ్లిష్ విద్య పొందుతున్న మన ఆధిపత్యకుల సోదరులు ఎన్నడూ మన ఇంటి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఎవరినీ అనుమతించాలని కోరుకోలేదు. మరోవైపున బెంగాల్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్ తదితర రాష్ట్రాల్లోని మన ఆధిపత్యకుల సోదరీమణులు ఈ పాత ఇంటిలోనే అనేక విషయాలను సాధించారు. కమలా హ్యారిస్, నిక్కీ హేలీ, ఇంద్రా నూయి మరెందరో ఈ పాత ఇంటిలోనే చాలా చక్కగా పనిచేశారు. కానీ తమకు చెందిన ఈ పాత ఇంటిలో కుళ్లిపోతున్న మూలగలను అమెరికన్లు తెలుసుకోవాలని వీరు ఎన్నడూ కోరుకోలేదు. అమెరికాలో ఉంటున్న అనేకమంది బ్రాహ్మణ మహిళలు చాలా పుస్తకాలను రాసి అనేక అవార్డులు పొందారు. కానీ వీరెవ్వరూ తన పాత ఇంటిని గురించి రాయలేదు. మన చర్మాన్నే కాదు, మన మూలగలను కూడా తినేస్తున్న వ్యాధి గురించి వీరిలో ఎవరూ రాయలేదు. పైగా 3,500 ఏళ్లుగా ఆ వైరస్ మనల్ని దుర్గంధంలోకి నెట్టేస్తోంది. అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో అత్యున్నతమైన ఇంజనీరింగ్ నైపుణ్యాలు నేర్చుకుని, ఐఐటీలు, ఐఐఎమ్‌లను నిర్వహించడానికి మళ్లీ పాత ఇంటికి తిరిగొచ్చిన పండిట్లు మన పాత ఇంటిలోని ఘనమైన ప్రజాస్వామ్యంలాగే ప్రపంచ వ్యాప్తంగా భారతీయ ప్రజాస్వామ్యం గొప్పదనం గురించి డాలర్ల సంపాదన కోసం కథలురాసి అమ్మేసుకుంటున్నారు. ఏమైతేనేం, పాత ఇంటిలో వ్యవస్థ కంటే ఇది మెరుగ్గా ఉందని వీరు చెబుతున్నారు. ఇక్కడికి సమీపంలోనే హిట్లర్ జన్మించి, ప్రపంచాన్ని కొత్తగా సృష్టించడానికి స్వస్తిక్ సింబల్‌ని ఉపయోగించి నియంతగా ఎదుగుతూ, జాతితత్వం, కులతత్వంతో నిండిన పాత వ్యవస్థను ప్రపంచమంతటా వ్యాపింపచేయాలని కోరుకున్నాడు. అదృష్టవశాత్తూ రష్యన్ల చేతిలో అతడు పరాజయం పొందాడు. రాజ్యాంగ ప్రజాస్వామ్యం ముసుగులో అనేక మంది నియంతలు పుట్టుకొస్తున్నారు కానీ వారితో ఎలా పోరాడాలో వీరికి తెలియదు. సొంత ఇంటికి తిరిగి వచ్చాక మన ఆధిపత్యకుల సోదర, సోదరీ మణులు (ది నేమ్‌సేక్ లేదా లైఫ్ ఈజ్ వాట్ యు మేక్ ఇట్ వంటి నవలలు రాయడం ద్వారా) తమ పేర్లు, లేక వైవాహిక జీవితానికి సంబంధించి తాము అక్కడా ఇక్కడా ఎదుర్కొంటున్న సమస్యల గురించి కథలు చెబుతూ వస్తున్నారు. పాత ఇంటిలో నివసిస్తున్న ఏ రచయిత కంటే జంపా లహరి, అనితా దేశాయ్ వంటి రచయిత్రులు భారతీయ బుక్ మార్కెట్లో చాలా బాగానే సంపాదిస్తున్నారు. తమ ఆర్యన్ ఇళ్లలో తమ పెళ్లిళ్ల గురించి, పాత ఇంటి ఆచారాల గురించి మన ద్విజ పురుషులు మాట్లాడుతూ వచ్చారు. వారు ఎ సూటబుల్ బాయ్, ది గ్లాస్ ప్యాలెస్ తదితర రచనల ద్వారా పాత ఇంటి సమస్యల గురించి మాట్లాడుతూ వచ్చారు. ఇకపోతే విక్రమ్ సేత్, అమితవ్ ఘోష్ వంటి రచయితలు అయితే దాదాపు అన్ని సాహిత్య ఉత్సవాలలో అత్యున్నత గౌరవాలు పొందుతూ, అవార్డులు గెల్చుకుంటూ వస్తున్నారు. కానీ తమ పాత ఇంటిలో క్రీస్తు పూర్వం 3,500 ఏళ్లకు ముందునాటి ఆర్యజాతి నుంచి పుట్టుకొచ్చిన కులం అనే వ్యాధి గురించి వీరెన్నడూ రాసి ఉండలేదు. టోనీ జోసెఫ్ తన ఎర్లీ ఇండియన్స్ (తొలి భారతీయులు) పుస్తకంలో, సింధుస్థాన్కు ఆర్యన్లు మూడో పెనువలస వచ్చిన క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల కాలం లోనే భారతీయ మూలగలను కబళించేస్తున్న కులం అనే వ్యాధి కూడా వచ్చి చేరిందని చెబుతున్నారు. కానీ హరప్పా గ్రామీణ, నగర నాగరికత నిర్మించడానికి వేల సంవత్సరాల క్రితమే ఆఫ్రికా నుంచి వచ్చిన తొలి రంగుజాతి ప్రజల (ఆండో–ఆఫ్రికన్స్) మూలాలు కలిగిన మన సొంత సోదరి మాత్రం జాతితత్వం, కులతత్వానికి సంబంధించిన సమస్య లేకుండానే భారతదేశానికి వచ్చి మన బాధలు గమనించి ఎంకే గాంధీ ప్రపచించిన సత్యానికి భిన్నమైన వాస్తవాన్ని మనకు తెలియజేస్తోంది. హరప్పన్ నాగరికతా కాలంలో మనం కూడా ఇసాబెల్ లాగే నల్లగానూ, అందంగానూ ఉండేవారం. కానీ ఆర్యన్ వలస మొదలైన తర్వాత మాత్రమే మనం సంకరవర్ణంలో కలిసిపోయాం. మన ఆధిపత్యకుల సోదరీమణులు మూల ఆర్యన్లు అని మనం కచ్చితంగా చెప్పలేం. బ్రహ్మ, ఇంద్ర, అగ్ని, వాయు, తదితరులు (రుగ్వేదకాలం నాటి దేవతలు, జొరాస్ట్రియన్ లిపి కలిగిన రాక్షసులు) అతి పురాతన స్థలం నుంచి వలస వచ్చినట్లుగా కనిపిస్తారు. కానీ వీరిలో ఎవరూ తమతో పాటు మహిళలను తీసుకొచ్చినట్లు కనిపించరు. ఇకపోతే సతి, బాల్యవివాహాలు, శాశ్వత వైధవ్యం వంటి సమస్యలతో సతమవుతూ వచ్చిన మన అగ్రకుల మహిళలు బహుశా జర్మనీ నుంచి మొదట వలస వచ్చిన వారు తీసుకొచ్చిన మన ఆండో–ఆఫ్రికన్ సోదరీమణులు అయివుండొచ్చు. ఈ జర్మనీనే ఇసాబెల్ పురాతన గృహం అంటూ పిలుస్తున్నారు. వెయ్యి సంవత్సరాల క్రమంలో వీరు తమ ప్రస్తుత రంగు, వర్చస్సు, ఆకారాలను పొందారు. కానీ ఇలా రూపొందిన వీరు ఇప్పుడు ఆ పాత ఇంటికి చెందిన నల్లవారిని పెళ్లాడటానికి ఇష్టపడటం లేదు. కమలా హ్యారిస్ తల్లి శ్యామల మాత్రం ఒక మినహాయింపు అని చెప్పాలి. 1970లు, 80లలో పాత ఇంటిలో స్త్రీవాద ఉద్యమం ఉండేది. బ్రాహ్మణ, బనియా మహిళలు ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు. కానీ మరింత మెరుగైన విద్యావకాశాలు పొందడానికేగానీ తమ 3,500 సంవత్సరాల వ్యథలను పట్టించుకోవడానికి వారు ఆ ఉద్యమంలో పాల్గొనలేదు. వారిలో కమ్యూని స్టులు, ఉదారవాదులు, లౌకికవాదులు ఉండేవారు. వీరంతా బయటకి కనిపించే మన దారిద్య్రాన్ని తప్ప, మన మూలగల్లో పేరుకుపోయిన వ్యాధిని చూడలేదు. వీరి చర్మం మనకంటే కాస్త కాంతివంతగా ఉంటూ వచ్చినందున, బాలీవుడ్ మొత్తంలో వీరి సౌందర్యమే కనిపిస్తూ వచ్చేది. అయితే అదే సమయంలో హాలీవుడ్ పాత ఇంట్లో అనేకమంది నల్లజాతి సోదరులకు, సోదరీమణులకు స్థానం దక్కింది. కానీ మన స్త్రీపురుషులు తమ చర్మం వల్ల కాక, తమ మూలగల్లో ఉండిపోయిన కులం అనే సమస్య వల్ల దురదృష్టవంతులుగా మిగిలిపోయారు. మన యూరో అమెరికన్ ద్విజ స్త్రీపురుష పండిట్లు పాశ్చాత్య ప్రపంచ అవకాశాల దన్నుతో తమ పాత ఇంటిలో విరిగిపడుతున్న దూలాలు, కారుతున్న పైకప్పులు, మసకబారుతున్న గోడలు వంటి వాటిని దాచి ఉంచాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో మన నల్ల సోదరి పాత ఇంటిలో వాస్తవంగా నివసిస్తున్న వారి తలుపులను తెరుస్తూ కొత్త కాంతిని వెదజల్లుతోంది. ఆమె అమెరికా పాత ఇల్లు లేదా వ్యవస్థను పరారుణ కాంతిని కలిగినదిగా వర్ణిస్తోంది. అదే సమయంలో ఆమె జర్మనీని జాతితత్వానికి, కులతత్వానికి మూలమైన పురాతన ఇల్లుగా అభివర్ణిస్తూ విశ్లేషణకు కొత్త ఆధారాన్ని అందజేస్తోంది. ఇక భారతదేశం విషయానికి వస్తే బుద్ధిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం అన్నీ ఉండి కూడా తీవ్రంగా దెబ్బతింటూనే పై రెండు పాత వ్యవస్థల మధ్య నలుగుతోంది. స్వస్తిక్, త్రిశూల్ ఇప్పుడు నాగ్‌పూర్ హెడ్ క్వార్టర్స్ నుంచి పాలన సాగిస్తున్నాయి. కానీ మన సోదరులను పక్కన పెట్టండి.. మన సోదరీమణులు కూడా వారి పాత ఇంటిపై ఎలాంటి కాంతీ ప్రసరించాలని కోరుకోవడంలేదు. కాబట్టి అక్కడ మునుపటిలాగే గాఢాంధకారం రాజ్యమేలాలని, అలాగైతేనే బయటి నుంచి వచ్చిన ఎవరూ ఆ ఇంటిలోపల ఏముందని టార్చ్ వెలిగించలేరని వీరు భావిస్తున్నారు. ఈస్ట్ ఇండియా సామ్రాజ్య కాలం నుంచి అనేకమంది తెల్లవారు ఇక్కడికి వచ్చారు. వాళ్లంతా ఆర్య బ్రాహ్మణులు తమకు చెప్పిందే నమ్ముతూ వచ్చారు. ప్రియమైన ఇసాబెల్లా సోదరీ, మా పాత ఇంటిని నీవు సందర్శించినందుకు నీకు కృతజ్ఞతలు. క్షుణ్ణంగా శోధించే విమానాశ్రయాలలోంచి కూడా నీవు ఎంతగానో ప్రేమించే మా డాక్టర్ అంబేడ్కర్ చిత్రాన్ని నీ దుస్తుల్లో పొదవుకుని తీసుకొచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెబుతున్నాం తల్లీ. నల్ల సోదర అధికారులు ఆ చిత్రపటంలో ఉన్నది ఎవరో తెలుసుకోలేనప్పుడు, అతడు భారత దేశపు మార్టిన్ లూథర్ అని నీవు వారికి తెలియజెప్పినప్పుడు, మా ఆధిపత్యకుల సోదర సోదరీమణులు తమ కులాన్ని తమ చర్మంలోని కులాన్ని ఇకపై దాచి ఉంచలేరని మేం ఎంతో ఉద్వేగం చెందుతున్నాం. వారి కులం వారి మూలగల్లోకి కూడా చేరుతుంది. ప్రొ.కంచ ఐలయ్య, షెపర్డ్ వ్యాసకర్త ఇంగ్లిష్ తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
రైతుల పిల్లలకు ఇంగ్లిష్ విద్యే ఆక్సిజన్
దేశంలో సమాన మాధ్యమ విద్యా ప్రేమికులు ప్రతి ఏటా అక్టోబర్ 5ని భారతీయ ఇంగ్లిష్ దినోత్సవంగా జరుపుకుంటారు. దేశంలో ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్య ఆవిర్భవించి నేటికి 203వ సంవత్సరం. ఒక చర్మకార వృత్తి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన బ్రిటిష్ మిషనరీ విలియం క్యారీ కలకత్తాలో మొట్టమొదటి ఇంగ్లిష్ మీడియం పాఠశాలను ప్రారంభించాడు. ఈయన 1793లో భారత్ వచ్చి సుప్రసిద్ధ సెరాంపూర్‌లో స్థిరపడి, తన విద్యాపరమైన ఎజెండాను మొదలెట్టారు. 1817లో రాజారామమోహన్ రాయ్‌తో కలిసి అక్టోబర్ 5న మొట్టమొదటి ఇంగ్లిష్ మీడియం పాఠశాలను ప్రారంభించారు. అక్టోబర్ 5 అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం కూడా. దేశంలో ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్య కొనసాగిన ఈ 203 సంవత్సరాల్లో ఇంగ్లిష్‌ని ఎవరు నేర్చుకున్నారు? ఇంగ్లిష్ విద్యకు దూరమై నష్టపోయిందెవరు? ఈ పాఠశాల విద్య చరిత్రను నిశి తంగా పరీక్షించాల్సి ఉంది. అన్ని పాఠశాలల్లో కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లోనే, ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ప్రాంతీయ భాషల్లోనే బోధన కొనసాగించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వ నూతన విద్యా విధానం చెబుతున్న నేపథ్యంలో దీనికి ఎంతో ప్రాధాన్యముంది. కానీ, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియమే కొనసాగుతోంది. అలాగే చిన్న, మధ్యస్థాయి, బడా విద్యా వ్యాపార సంస్థలు నడుపుతున్న అన్ని ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియమే ఉంటుంది. ఇకపోతే గుత్తపారిశ్రామిక సంస్థలు నిర్వహిస్తున్న కొన్ని స్కూల్స్ అయితే బ్రిటిష్, అమెరికన్ స్కూల్ విద్యా నమూనా ప్రకారం నడుస్తున్నాయి. 12వ తరగతి వరకు ఈ విద్యా సంస్థల బోధనా క్రమం మొత్తంలో ఒక్క ప్రాంతీయ భాషకూ చోటు లేదన్నది గమనార్హం. చారిత్రకంగా చూస్తే దేశంలో మెజారిటీ ప్రజలు శూద్రులే. దేశ జనాభాలో వీరు 56 శాతంగా ఉన్నారు. వీరిలో జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు, యాదవులు, రెడ్లు, కమ్మ, కాపు, వెలమ, నాయికర్లు, నాయర్లు, మరాఠాలు, లింగాయతులు, వొక్కలింగ తదితరులంతా సాధారణ విభాగంలోనే పోటీపడుతుంటారు. ఈ కులాలతోపాటు రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న ఓబీసీలందరూ శూద్రులలో భాగమే. వీరితర్వాత దేశజనాభాలో దళితులు 18 శాతం, ఆదివాసీలు 7.5 శాతంగా ఉన్నారు. ఏ రంగంలోనైనా సరే ఇంగ్లిష్ రచయితలను చూస్తే వీరిలో శూద్రులు కనిపించరని అర్థమవుతుంది. సైద్ధాంతిక రచనలు (రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక), ఫిక్షన్, కవిత్వం, జర్నలిస్టిక్, కళావిమర్శ వంటి మరెన్నో రచనలను ఇంగ్లిష్‌లో రాస్తున్నవారు ద్విజులకు చెందినవారు మాత్రమే. ద్విజులు అంటే బ్రాహ్మణులు, బనియాలు, క్షత్రియులు, కాయస్థులు, ఖాత్రిలు అని అందరికీ తెలుసు. జనాభాలో అతిపెద్ద భాగమై ఉన్న శూద్రులకు కాకుండా ఈ ద్విజులకు మాత్రమే ఇంగ్లిషులో ఇంత పట్టు ఎలా వచ్చింది? ఈ శూద్రులలో కూడా అందరూ నిరుపేదలు కారు. భారతదేశంలో భాషా, విద్యా చరిత్రే దీనికి కారణం. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం అంటే దేశంలోకి సంస్కృతం ఇంకా అడుగు పెట్టడానికి ముందు ప్రజలు పాళి, ఇతర ప్రాంతీయ గిరిజన భాషలను మాట్లాడేవారు. వీరే హరప్పా, మొహంజొదారో, ఢోలవీరా వంటి నగరాలతోపాటు హరప్పా నాగరికతను నిర్మించారు. వీరందరికీ తమతమ సొంత భాషలున్నాయి. అధునాతన భాష లేకుండా పట్టణ నాగరికతను నిర్మించడం అసాధ్యం అనేది తెలిసిందే. భారతదేశంలో మొట్టమొదటి లిఖిత సంస్కృత పాఠం రుగ్వేదం. వేదకాలంలో శూద్రులను నాలుగోవర్ణంగా ప్రకటిం చారు. అంటే వీరు బానిసలతో సమానం. వీరికి సంస్కృత భాషను నిషేధించారు. వీరిలో ఎవరైనా సంస్కృతం నేర్చుకున్నా, చదివినా, రాసినా తీవ్ర శిక్షలు విధించేవారు. తర్వాత 13వ శతాబ్దంలో టర్కులు, అప్గాన్ పాలకులు వచ్చారు. పర్షియన్ భాష మెల్లగా పాలక భాషగా, పాఠ్యభాషగా ఉనికిలోకి వచ్చింది. ఈ భాషను వ్యతిరేకించడానికి బదులుగా ద్విజ కులాలు ఆ భాషను నేర్చుకుని ముస్లిం పాలకులకు పాలనాధికారులుగా, దుబాసీలుగా మారిపోయారు. మొఘల్ పాలనలోనే పర్షియన్ భాష భారతదేశ వ్యాప్తంగా విస్తరించింది. చాలావరకు ముస్లింలతోపాటు బ్రాహ్మణులు, కాయస్థులలో చాలామంది ఆ భాషను నేర్చుకుని ప్రభుత్వంలో కొలువులు సాధించడానికి దేశమంతా వలసపోయారు. హైదరాబాద్ రాష్ట్రానికి, ముంబై ప్రాదేశిక ప్రాంతానికి బ్రాహ్మణులు, కాయస్థులు వలసపోవడం దీనికి రుజువు. బాల్ థాకరే కుటుంబం కూడా కాయస్థులకు చెందినవారే. ముస్లిం పాలకులు కూడా రైతులకు, హస్తకళా నిపుణులకు విద్య నేర్పి పర్షియన్ భాషలో వ్యవసాయ కులాల నైపుణ్యాలను మెరుగుపర్చాలని భావించలేకపోయారు. శూద్రుల నిరక్షరాస్యత కూడా వ్యవసాయ రంగంలో ఉత్పత్తి క్షీణతకు కారణమైంది. క్రమంగా పర్షియన్ భాష నుంచి హిందీ, ఉర్దూ భాషలు ఆవిర్భవించాయి. ఇవి కూడా హిందుస్తానీ భాషలుగా చెలామణి అయ్యాయి. సంస్కృత అక్షరాలను హిందీ స్వీకరించగా, అరబిక్, పర్షియన్ అక్షరాలను ఉర్దూ స్వీకరించింది. అయితే ఈ రెండు భాషల మధ్య భావ ప్రసరణ నేటికీ వ్యవస్థీకృతంగానే ఉంటోంది. బెంగాలీ, మరాఠీ, గుజరాతీ వంటి సంస్కృత లిపిని ఉపయోగిస్తున్న ఉత్తరాది భాషల మధ్య పరస్పర అవగాహన ఉంది. హిందీకీ ఈ భాషలకు మధ్య పరస్పర అవగాహన, మార్పిడి కూడా ఉంటోంది. ఈ రాష్ట్రాలకు చెందిన ప్రజలు సులభంగా హిందీని అర్థం చేసుకుని మాట్లాడుతుండటానికి ఇదే కారణం. పర్షియన్ సంస్కృతిలో కూడా ముస్లిం పాలనాధికారులు శూద్రులను శారీరక శ్రమలకే పరిమితం చేశారు తప్పితే బౌద్ధిక కృషిలో భాగం చేయలేదు. 1839లో పర్షియన్ భాషను ఈస్టిండియా కంపెనీ రద్దు చేసి ఇంగ్లిష్‌ను పాలనా భాషగా చేశారు. 1817 నుంచి ఇంగ్లిష్‌ను నేర్చుకోవడం ప్రారంభించిన ద్విజులు ప్రధానంగా బ్రాహ్మణులు నేరుగా ఇంగ్లిష్ పాలనాయంత్రాంగంలో ప్రవేశించారు. అయితే ఇంగ్లిష్‌ను బోధనా, పాలనా భాషగా చేసిన తర్వాత కూడా శూద్రకులాలకు చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాలను పొందలేకపోయారు.అయితే బ్రిటిష్ అధికారులతో వ్యక్తిగత స్నేహం ప్రాతిపదికన ఇంగ్లిష్‌ను నేర్చుకున్న మొట్టమొదటి వ్యక్తి రాజారామమోహన్ రాయ్. ఈయన ఓ బ్రాహ్మణ జాగీర్దారు. పోతే 1841లో ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చేరిన మొట్టమొదటి శూద్రుడు మహాత్మా పూలే. పార్శీ అయిన దాదాబాయి నౌరోజి కూడా ఇంగ్లిష్‌లో చదువుకుని వ్యాపారం కోసం ఇంగ్లండ్ వెళ్లి రాజకీయనేతగా మారారు. ఇకపోతే స్వదేశంలోనూ, ఇంగ్లండ్‌లోనూ ఇంగ్లిష్ చదువుకున్న మొట్టమొదటి బనియా (వర్తకులు) గాంధీజీ కావచ్చు. ఆ తర్వాత భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చి ఇంగ్లండ్‌లో చదివిన ఏకైక శూద్రుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మాత్రమే. అయితే పటేల్ ఇంగ్లిష్‌లో పెద్దగా రాయలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శూద్రకులాల్లోని భూస్వాములు తమ పిల్లలకు ఇంగ్లిష్ నేర్పడానికి ఇంగ్లండ్‌కు పంపడం పెద్దగా జరగలేదు. తెలుగు రాష్ట్రాల్లో కట్టమంచి రామలింగారెడ్డి భారతదేశంలో చక్కగా ఇంగ్లిష్ చదువుకున్న శూద్రుడిగా కనిపిస్తాడు. అయితే శూద్ర భూస్వాములు కట్టమంచి వారసత్వాన్ని కొనసాగించలేదు. గ్రామాల్లో భూస్వామ్య అధికారం చలాయించడంతోనే వారు సంతృప్తి చెందారు. ఇప్పుడు వీరు ఇంగ్లిష్ మీడియంలో విద్య ప్రాధాన్యతను గుర్తిస్తున్నారు. దళితులు, ఆదివాసులతోపాటు శూద్రులు కూడా వెనకబడిపోవడానికి కారణం భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలతో అనుసంధానం కలిగించే జాతీయ భాషను వారు నేర్చుకోలేకపోవడమే. ఇప్పుడు శూద్రులు, దళితులు, ఆదివాసులు తమ ఉత్పత్తి అవసరాలకోసం ప్రాంతీయ భాషతోపాటు ఇంగ్లిష్‌ను కూడా నేర్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. వీరికి ఇంగ్లిష్ ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ భాషగా మారింది. ఇక ప్రాంతీయ భాష వారి ఉత్పాదక, వ్యవహార భాషగా కొనసాగుతుంది. ఇంగ్లిష్ తెలుసుకుని వ్యవసాయ ఉత్పత్తిలో పాలుపంచుకునేవారు ఉంటే భారతీయ వ్యవసాయ నాణ్యత మౌలికంగానే మారిపోతుంది. ఒక జాతిగా భారతదేశం ఇంగ్లిష్‌ను జాతీయ భాషగా గుర్తిస్తూ అక్టోబర్ 5ను భారతీయ ఇంగ్లిష్ దినోత్సవంగా పాటిస్తుండటం ప్రాధాన్యత కలిగిన అంశం. ఇంగ్లిష్ 1817లో స్కూల్ విద్యా భాషగా మనదేశంలో పుట్టింది ఇది కేవలం ద్విజుల భాషగానే ఉనికిలో ఉంటూ వచ్చింది. ఈ పరిస్థితి మారాల్సి ఉంది. ఇంగ్లిష్ కూడా ఇప్పుడు మన భాషే కాబట్టి ప్రతి ఆహార ఉత్పత్తిదారు ఇంగ్లిష్ మన భాష కాదని అలోచించకుండా దాన్ని నేర్చుకోవలసి ఉంది. విశ్వీకరణ చెందిన ప్రపంచంలో ప్రతి రైతూ అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లిష్‌లో పట్టు సంపాదించాలి. పేదలకు, భారతీయ గ్రామాల్లోని ఆహార ఉత్పత్తిదారులకు ఇంగ్లిష్ మీడియంలో విద్యను అడ్డుకోవడంలో అంతర్జాతీయ కుట్ర లేకుండా జాగ్రత్తపడదాం. (రేపు భారతీయ ఇంగ్లిష్ దినోత్సవం) ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ఇంగ్లిష్ తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
శ్రీరాముడికి కొత్త నిర్వచనం
అయోధ్యలో రామాలయ భూమిపూజ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం శ్రీరాముడి గురించి సరికొత్త నిర్వచనం ఇచ్చింది. శత్రుసంహారం చేసే ధనుద్ధారిగా రాముడిని గత 30 ఏళ్లుగా ఆరెస్సెస్/బీజేపీ చిత్రిస్తూ వచ్చిన దృక్కోణానికి పూర్తిగా భిన్నమైన రాముడిని మోదీ ఆవిష్కరించారు. దాని ప్రకారం శ్రీరాముడు అందరివాడు. ప్రజలను సమానంగా ప్రేమించాడు. పేదలు ఉండకూడదన్నాడు. దుఃఖం ఉండకూడదన్నాడు. స్త్రీలు, పురుషులు, రైతులు, పశుపాలకులు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. కాలంతోపాటు ముందుకెళ్లాలని మోదీ రాముడు బోధిస్తున్నాడు. ఆధునిక భారతదేశంలో ఇవన్నీ సాధ్యం కావాలంటే మొట్టమొదటగా పార్లమెంటులో శక్తివంతమైన కులనిర్మూలనా చట్టం రూపొందించాల్సి ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా, 130 కోట్లమంది భారతీయుల ప్రధానమంత్రిగా కూడా శ్రీరాముడిని పునర్విచించారు. ఇది 1989 నుంచి గత ముప్ఫై ఏళ్లుగా ఆరెస్సెస్/బీజేపీ శ్రీరాముడి గురించి ఇస్తూ వస్తున్న నిర్వచనానికి పూర్తిగా భిన్నమైంది కావడం విశేషం. అయోధ్యలో, రామజన్మభూమి ఆలయంలో భూమి పూజ సందర్భంగా 2020 ఆగస్టు 5న ప్రధాని మోదీ తన ప్రసంగంలో కొత్త శ్రీరాముడిని ఆవిష్కరించారు. అందుచేత ఆయన ప్రసంగానికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. రామాలయ భూమిపూజ సందర్భంగా మోదీ చేసిన ప్రసంగ సారాంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానకి నేను మొదట ఆయన ప్రసంగంలోని కొన్ని భాగాలను ఇక్కడ ప్రస్తావిస్తాను. ‘‘దళితులు, అధోజగత్ సహోదరులు, ఆదివాసీలు.. సమాజంలోని అన్ని వర్గాలకు చెందినవారు స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీకి సహకారం అందించినట్లే, రామాలయ నిర్మాణానికి చెందిన బృహత్ కార్యక్రమం భారతదేశ ప్రజలందరి సహకారంతో ఈరోజు ప్రారంభమైంది. రాముడికి తన ప్రజలపై సమానమైన ప్రేమ ఉండేది. అయితే పేదలు, పీడితుల పట్ల రాముడు ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. వివిధ రామాయణాల్లో శ్రీరాముడి వివిధ రూపాలను మీరు కనుగొనవచ్చు.. కానీ రాముడు ప్రతిచోటా ఉన్నాడు. (ఒకే బాణము, ఒకటే పార్టీ!) రాముడు అందరివాడు. అందుకే భారతీయ భిన్నత్వంలో ఏకత్వానికి శ్రీరాముడు అనుసంధాన కర్తగా ఉంటున్నాడు. ‘ఎవరూ విచారంగా ఉండకూడదు, ఎవరూ పేదవారిగా ఉండకూడదు’ అని రాముడు బోధించాడు. పైగా ‘స్త్రీలు పురుషులతో సహా ప్రజలందరూ సరిసమానంగా సంతోషంగా ఉండాల’ని శ్రీరాముడు సామాజిక సందేశం ఇచ్చాడు. ‘రైతులు, పశుపాలకులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి’ అని కూడా సందేశమిచ్చాడు. అలాగే ‘వృద్ధులను, పిల్లలను, వైద్యులను ఎల్లప్పుడు పరిరక్షించాలి’ అని రాముడు ఆదేశమిచ్చాడు. ఆశ్రయం కోరుకున్న వారికి ఆశ్రయమివ్వడం అందరి బాధ్యతగా ఉండాలని రాముడు పిలుపిచ్చాడు. స్థల, కాల, సమయ పరిస్థితులకు అనుగుణంగా రాముడు మాట్లాడేవాడు, ఆలోచించేవాడు, వ్యవహరించేవాడు. కాలంతోపాటు ఎదుగుతూ, ముందుకెలా వెళ్లాలో రాముడు మనకు బోధించాడు. రాముడు మార్పు, ఆధునికతా ప్రబోధకుడు. సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో, జ్ఞానాన్ని ఎలా సాధించాలో కూడా రాముడు మనకు బోధించాడు. అందరి మనోభావాలను మనం గౌరవించాలి. మనందరం కలిసి ఉండాలి. కలిసి ముందుకెళ్లాలి, పరస్పరం విశ్వసించాలి’’. ప్రధాని మోదీ రామాలయ భూమి పూజానంతరం చేసిన ప్రసంగం ప్రకారం రాముడు ఆధునికవాది. దారిద్య్ర నిర్మూలన, స్త్రీ, పురుషుల మధ్య భేదం, కులం, మానవ దోపిడీకి కారణమవుతున్న దారిద్య్రం ఇలా అన్ని రకాల అసమానతలను రాముడు వ్యతిరేకించాడు. వైవిధ్యతకు మద్దతిచ్చాడు. తనకోసం కాకుండా అనేకమంది రోగులకు చికిత్స చేసే వైద్యుడి భద్రత గురించి రాముడు మాట్లాడాడు. ఈ దేశం స్వర్గం కంటే మిన్నగా మారాలని రాముడు విశ్వసించి ఉంటాడు. రథ యాత్ర సమయంలో ప్రధానంగా ఎల్కే అద్వానీ రూపంలో ఆరెస్సెస్/బీజేపీ కూటమి ప్రబోధించిన రాముడితో పోల్చి చూస్తే మోదీ రాముడు పూర్తిగా భిన్నమైన వాడు. రాముడంటే విల్లుబాణాలు ధరించి శత్రువులను దునుమాడే పరమ శక్తిమంతుడు అనే ముద్రను గత మూడు దశాబ్దాలుగా ఆరెస్సెస్/బీజేపీ ప్రచారం చేసింది. బీజేపీ ప్రవచిస్తూ వచ్చిన రాముడితో పోలిస్తే ఇప్పుడు శ్రీరాముడు అందరివాడు. రాజ్యంలో ఏ ఒక్కరూ దుఃఖంతో ఉండరాదు, పేదవారిగా ఉండరాదు అని రాముడు బోధించినట్లు ప్రధాని మోదీ చెబుతున్నారు. రామాయణ పురాగాథ, రాముడి గురించిన పాత అవగాహనకు పూర్తిగా ఇవి భిన్నమైనవి. రాజ్యాంగంలో పొందుపర్చిన లౌకికవాద స్వరూపాన్ని ఏ ప్రధాని కూడా ధిక్కరించి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనరాదు అని గతంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం చేసిన సూత్రీకరణను మోదీ ఉల్లంఘించారనడంలో సందేహమే లేదు. కానీ శ్రీరాముడికి కొత్త నిర్వచనం ఇవ్వడం ద్వారా మోదీ ఇప్పుడు రాముడినే లౌకికవాదిని చేసి పడేశారు. (భారత్‌ను హిందూదేశంగా మార్చే శంకుస్థాపన) రామమందిరం గురించి మోదీ చేసిన ప్రసంగం ముస్లిం మైనారిటీలు, ఇకనుంచి భారత్‌లో వారి భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారంతో కూడుకుంది. అయితే దీనికంటే మించిన మౌలిక సమస్య ఇక్కడ ఉంది. అదేమిటంటే వాల్మీకి రామాయణం రచించిన రోజుల నుంచి కుల పీడన, స్త్రీల అణచివేత. కుల పీడన గురించి, స్త్రీల అసమానత్వం గురించి రామాయణం ఏ సందర్భంలోనూ పేర్కొనలేదు. పైగా వర్ణధర్మం, బ్రాహ్మణ పితృస్వామ్యంలో భాగంగా కులం, స్త్రీల అణచివేతకు సంబంధించిన వివిధ అంశాలను రామాయణంలో చొప్పించారు. భారతదేశంలోనే కాకుండా అనేక ఇతర దేశాల్లో వ్యాప్తిలో ఉంటున్న వివిధ రామాయణాల గురించి మోదీ తన ప్రసంగంలో ప్రస్తావిం చారు. కానీ రామానుజన్ రాసిన ‘మూడు వందల రామాయణాలు’ (త్రీ హండ్రెడ్ రామాయణాస్) అనే రచనను ఢిల్లీ యూనివర్సిటీ సిలబస్ నుంచి హిందూత్వ అనుకూలవాదులు కొన్నేళ్ల క్రితం బలవంతంగా తొలగించారు. కానీ ప్రధాని మోదీ ప్రసంగం రాముడి గురించిన ఆయన సూత్రీకరణలకు కట్టుబడింది. భారత ప్రభుత్వాధినేతగా ప్రధాని మోదీ రాముడిని ఒక ఆధునికుడిగా నిర్వచించినందున రాముడిపై ఈ సరికొత్త నిర్వచనాన్ని మేధో చర్చలనుంచి తొలగించలేం. మోదీ నిర్వచనంతో ఏకీభవిం చినా, ఏకీభవించకపోయినా సరే ఈ కొత్త నిర్వచనం గురించి ఎవరైనా చర్చించాల్సిందే. ముస్లిం మైనారిటీని చావుదెబ్బతీసి, హిందూ ఆలయాన్ని నిర్మించాలనే తమ ఎజెండాలో భాగంగా అద్వానీ, ఆరెస్సెస్/బీజేపీ నాయకులు ఇంతకుముందు రాముడి గురించి ఏ నిర్వచనం ఇచ్చారో మళ్లీ ప్రస్తావించాలని నేను భావించడం లేదు. ఎందుకంటే ఆ చరిత్ర అందరికీ తెలిసిందే. అయితే ఇకపై రామాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత తమ జీవితాలపై ప్రధాని మోదీ ప్రసంగం సానుకూల ప్రభావం వేయనుందా లేక ప్రతికూల ప్రభావం వేయనుందా అనే చర్చను, రామ వర్సెస్ ముస్లిం సమస్యపై చర్చను ముస్లిం పండితులకే వదిలివేస్తాను. అయోధ్యలో రామాలయం రోమ్‌లోని వాటికన్ కంటే, సౌదీ అరేబి యాలోని మక్కాకంటే ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకోనుందని అనేకమంది ఆరెస్సెస్/బీజేపీ నేతలు గతంలో చెప్పి ఉన్నారు కూడా. మతాలను తులనాత్మకంగా పరిశీలించడంలో నిష్ణాతులైన క్రిస్టియన్, ముస్లిం పండితులు ఈ అంశాన్ని కూడా మత చర్చలో భాగం చేయవలసి ఉంది. మహిళా సమస్యను అన్ని కులాలకు చెందిన మహిళా రచయితలు, చింతనాపరులు చేపట్టి చర్చిస్తారు. ఇక్కడ నా అందోళన అంతా కుల ఎజెండాను రద్దు చేయడానికి సంబంధించే ఉంటుంది. అయోధ్యలో ప్రధాని ప్రసంగం.. రిజర్వేషన్ చట్టాలను మించి పార్లమెం టులో తగిన చట్టం ద్వారా కులాన్ని, అంటరానితనాన్ని రద్దు చేయడానికి సంబంధించి ఒక బలమైన ప్రాతిపదికను అందిస్తోంది. ఆరెస్సెస్/బీజేపీల ద్వారా ఆగమశాస్త్రాలు విధించిన ఆధ్యాత్మిక వివక్షాపూరితమైన చట్టాల నిర్మాణానికి, హిందూయిజంకి సంబంధించి ఆధునిక ఆధ్యాత్మిక సమానత్వాన్ని ప్రబోధిస్తున్న వారికి మధ్య ఉన్న సంఘర్షణను ఈ కొత్త చట్టం పరిష్కరించాల్సి ఉంది. హిందూయిజాన్ని ఒక జీవన విధానంగా మాత్రమే కాకుండా ప్రపంచంలో క్రైస్తవం, ఇస్లాం, బుద్ధిజం వంటి మతాల సరసన నిలిపే అంశంలో ఇదే ప్రధాన సమస్య అవుతుంది. భారత పార్లమెంటు కుల నిర్మూలనను పూర్తిగా పరిష్కరించాల్సి ఉంది. ఆధునిక రాముడిపై తన అవగాహనను నొక్కి చెబుతున్న మోదీ ఈ అంశాన్ని చిత్తశుద్ధితో స్వీకరించాల్సి ఉంది. 2014, 2019 సార్వ్తత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ తనను తాను ఇతర వెనుకబడిన కులానికి చెందిన ప్రధానిగా అభివర్ణించుకుని ప్రచారం చేసుకున్న వైనాన్ని మనం మర్చిపోకూడదు. దళితులను అలా పక్కనపెట్టండి.. చివరకు శూద్రులు, ఓబీసీలకు కూడా రామాలయంలో పూజారులుగా ఉండే హక్కు లేదు. మోదీ చెబుతున్న రాముడు అందరికీ సామాజిక న్యాయం పక్షాన నిలబడ్డాడు మరి. పైగా మోదీ ప్రకారం రాముడు మార్పుకు ప్రతినిధి. భూమి పూజ అనంతరం ప్రధాని చేసిన ప్రసంగం ప్రకారం రాముడు కాలాన్ని బట్టి మారుతూ, ఆధునికతను చాటిన పాలకుడు కదా. అందుకే అందరికీ సామాజిక న్యాయం కావాలంటే, జరగాలంటే పార్లమెంటులో శక్తివంతమైన కులనిర్మూలనా చట్టం రూపకల్పన తప్పనిసరి అవసరంగా ఉంటుంది. - ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
కుల నిర్మూలనపై మాట్లాడరేం?
అరబ్ వసంతం పేరిట చెలరేగిన ప్రజా తిరుగుబాట్లు దశాబ్దం క్రితం ఇస్లామిక్ ప్రపంచాన్ని కదిలించివేశాయి. జార్జి ఫ్లాయిడ్ దారుణ హత్య నేపథ్యంలో ప్రస్తుతం చెలరేగుతున్న జాతి వివక్షా వ్యతిరేక ఉద్యమాలు పాశ్చాత్య ప్రపంచ మూలాలను కదిలిస్తున్నాయి. మరి మానవుల మధ్య సానుకూల సంబంధాలను, మెరుగైన ఉత్పత్తి సంబంధాలను విధ్వంసం చేస్తున్న భారతీయ కులవ్యవస్థ, వివక్షపై మన మేధావులు గళం విప్పాల్సిన అవసరం లేదా? భారత గడ్డ మీది నుంచి కులాన్ని, అస్పృశ్యతను కలిసికట్టుగా పెకిలించివేయాల్సిందేనంటూ, ఓబీసీల నుంచి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి చెప్పాల్సిన నైతిక బాధ్యత మన మేధావులకు లేదా? ఒక దృఢమైన కులనిర్మూలనా చట్టం ఉనికిలో లేని నేపథ్యంలో.. ఘనీభవించిపోయిన కుల వ్యవస్థపై భారతీయ న్యాయ వ్యవస్థ సైతం దృఢవైఖరిని చేపట్టలేకపోతోంది. ముస్లిం ప్రపంచాన్ని 2010–11 మధ్యకాలంలో అరబ్ వసంతం పేరిట ప్రజా తిరుగుబాట్లు చుట్టుముట్టిన చందాన 2020లో పాశ్చాత్య ప్రపంచాన్ని జాతివివక్షా వ్యతిరేక ఉద్యమాలు చుట్టుముడుతున్నాయి. భారతదేశంలోనూ, అమెరికా–యూరప్ ఖండాల్లోనూ నివసిస్తున్న భారత సంతతి పాశ్చాత్య విద్యావంత మేధావులు, పండితులు, క్రియాశీల కార్యకర్తలు, కళాకారులు తాము కూడా నల్లజాతి ప్రజల్లాగే క్రియాశీలకంగా మారారు. వీరిలో చాలామంది బ్రాహ్మణ, బనియా, క్షత్రియులతోపాటు కాయస్థ, ఖాత్రి అనే ఉత్తర భారత కులాలకు చెందిన కుల నేపథ్యం ఉన్నవాళ్లే. అతికొద్దిమంది మాత్రం శూద్రులు, ఓబీసీలు, దళితులు, ఆదివాసీ నేపథ్యంనుంచి వచ్చినవారు. వీరు పాలకవర్గాలను ప్రభావితం చేయగలిగిన కలం బలం ఉన్నవారు. జాత్యహం కారం, వివక్ష, అసమానత్వంపై నైతిక చర్చలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో, ఈ మేధావులు తమ కులపరమైన మూలాలను కూడా కులంలాగే, జాతిలాగే తిరస్కరిస్తారని ఎవరూ భావించలేరు. కుల సమస్యలను వ్యతిరేకిస్తున్న సుప్రసిద్ధ సామాజిక శాస్త్రజ్ఞులు, చరిత్రకారులు కొందరిని డర్బన్‌లో 2001లో జాతి, జాతి వివక్షత, జాతి దమనకాండపై జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సుకు తీసుకెళ్లడం జరిగింది. ఆ సదస్సులో దీపాంకర్ గుప్తా, రామచంద్ర గుహ వంటివారు నల్లజాతి ప్రజలు సాగిస్తున్న జాతి వివక్షా వ్యతిరేక విప్లవాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. అమెరికాలో నివసిస్తున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి ప్రముఖులు, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, గార్డియన్ వంటి ప్రముఖ పత్రికల్లో రాసే భారతీయ కాలమిస్టులు అనేకమంది కూడా తాజాగా జాతివివక్ష సమాజంలోంచి తొలగిపోవాలని చెప్పారు. తాము కూడా నల్లవారిమే అనే విధంగా వీరు ‘నల్లజాతి ప్రాణాలు విలువైనవే’ (బ్లాక్ లైవ్స్ మ్యాటర్) అనే బ్యానర్లను సైతం సాహసోపేతంగా పట్టుకుని ముందుపీటిన నడిచారు. అలాంటప్పుడు భారత గడ్డ మీదినుంచి కులం, అస్పృశ్యత కలిసికట్టుగా అంతరించిపోవలసిందేనంటూ, ఓబీసీల నుంచి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి చెప్పాల్సిన నైతిక బాధ్యత మన మేధావులకు లేదా? అమెరికా, బ్రిటన్లలో జాతివ్యతిరేక పౌర హక్కుల చట్టాలు అనేకం ఉనికిలో ఉంటున్నాయి కానీ జాతిపరమైన అత్యాచారాలు అక్కడ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యమాలకు అర్థం మరిన్ని చట్టాలు రావాలని, పౌర సమాజ మనస్తత్వాన్ని మార్చాలనే తప్ప మరేమీ కాదు. నల్లజాతికి చెందిన జార్జి ఫ్లాయిడ్‌ని తెల్లజాతి పోలీసు అధికారి క్రూరంగా హత్య చేసిన సందర్భంలో తెల్లజాతి పోలీసుల ప్రవర్తనను మార్చడానికి సాగుతున్న ఉద్యమాలు కావివి. కాకపోగా పాశ్చాత్య ప్రపంచంలో ప్రాథమిక మానవ సంబంధాలనే మార్చడానికి సాగుతున్న ఉద్యమాలవి. మరి మనదేశంలో మనం కులపరంగా బ్రాహ్మణ, బనియా లేక శూద్ర–దళిత నేపథ్యం దేనికైనా చెంది ఉండవచ్చు కానీ.. ఒక సమగ్రమైన కులనిర్మూలన చట్టాన్ని ఆమోదించాలని మనందరం ఎందుకు ప్రశ్నించకూడదు? అమెరికాలో జాతి సమస్యకు పరిష్కారం లిండన్ బి.జాన్సనే అంటూ దీపాంకర్ గుప్తా తన రచనల్లో ఒకదానిలో సూచించారు. అంటే నాటి అమెరికా అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ శ్వేత జాతి శాసన కర్తలనుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ 1964 పౌరహక్కుల చట్టాన్ని ఆమోదించుకునే విషయంలో చివరివరకూ పట్టుబట్టి సాధించుకున్నారు. మరి మనదేశంలో కులసమస్యను ఎవరు పరిష్కరిస్తారు? ప్రధాని మోదీ జనాదరణ కల నేత. పార్లమెంటులో మెజారిటీ సభ్యుల మద్దతు పొందారు. పైగా తన సొంత పార్టీ సభ్యులే చెబుతున్నట్లుగా ఓబీసీ నేపథ్యంలో భారతదేశం ఇదివరకెన్నడూ సృష్టించలేకపోయిన సాహసనేత కదా ఆయన. మరి మోదీ ప్రభుత్వాన్ని కుల నిర్మూలనా చట్టం రూపొందించాల్సిందిగా మన భారత మేధావులు ఎందుకు డిమాండ్ చేయరు? అంటరానితనానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో పొందుపర్చిన నిబంధనలు కానీ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లు వంటివి కానీ, ఆర్థికపరమైన మెరుగుదలకు సంబంధించినవే కానీ అవి వ్యవస్థాగతమైన మార్పులను తీసుకురాలేవు. పాశ్చాత్య ప్రపంచంలో ప్రస్తుతం నడుస్తున్న బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమం నల్లజాతి ప్రజలకు కొన్ని ఆర్థికపరమైన, విద్యాపరమైన అవకాశాలను కల్పించే లక్ష్యంతో మాత్రమే సాగడం లేదు. వివిధ వర్ణాల మధ్య, జాతుల మధ్య ప్రాథమిక సంబంధాలనే మార్చే లక్ష్యంతో ఈ ఉద్యమం కొనసాగుతోంది. మనం కూడా దక్షిణాసియాలో ప్రాథమికమైన కుల సంబంధాలనే మార్చిపడేసే విస్తృతి కలిగిన చట్టం రూపకల్పన కోసం పాలకులను అడగాల్సి ఉంది. ఈ సందర్భంలో భారతదేశం చేపట్టే చర్యలు నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను కూడా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే ఈ దేశాల్లో కూడా కుల వ్యవస్థ ఒకటి లేదా పలురూపాల్లో అమలవుతూ వస్తోంది. మన దేశంలో కులవ్యవస్థ.. అసమానతలకు సంబంధించిన దొంతర్లను, వివక్షకు చెందిన కార్యాచరణలను సృష్టించిపెట్టిందని ప్రతి మేధావికీ తెలుసు. భారతజాతి అభివృద్ధిని సాగిస్తూ, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్న దశలో పలురకాల కులాచారాలు, అలవాట్లు ఉనికిలోకి వస్తున్నాయి. ఈ కుల వ్యవస్థ కారణంగానే మన వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అనేకమంది ప్రతిభాపాటవాలు ప్రతి రోజూ తొక్కివేయబడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. శూద్రులను, దళితులను, ఆదివాసీలను హిందువులుగా నిర్వచిస్తూనే మన ఆలయాల్లో ఆగమశాస్త్రం ప్రాతిపదికన వారిపట్ల వివక్ష ప్రదర్శిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు వంశపారంపర్య రాజకీయాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకుంటున్న బీజేపీ, ఆరెస్సెస్‌లు దేశంలోని అన్ని వ్యవస్థల్లోనూ వంశపారంపర్యం ప్రాతిపదికన సాగుతున్న ప్రమోషన్లను కూడా తప్పకుండా వ్యతిరేంచాల్సి ఉంది. జీవితంలోని అన్ని రంగాల్లోనూ సమానత్వంకోసం పాటుపడతానని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ సమగ్రమైన కుల నిర్మూలనా చట్టం తీసుకురావడంపై ఎన్నడూ మాట్లాడిన పాపాన పోలేదు. కాంగ్రెస్ పార్టీ మేధావులు అనేక విషయాలపై రచనలు చేశారు కానీ కుల నిర్మూలనా చట్టం గురించి నోరెత్తలేదు. భారతీయ వైవాహిక వ్యవస్థలో కులం ఒక పాశవికమైన ఉనికిని ప్రదర్శిస్తోంది. పాశ్చాత్య ప్రపంచంలోని పరస్పర ఎంపిక ద్వారా వివాహ సంబంధాలు ఏర్పర్చుకోవడం, అలాంటి తరహాలోని వివాహాలతో ప్రభావితమవుతున్న మన దేశ యువతీయువకులను కులం ప్రాతిపదికన సాగుతున్న పరువు ప్రతిష్టల భావజాలంతో చంపిపడేస్తున్నారు. కులాంతర వివాహాలు చేసుకుంటున్న దంపతులను వివక్షకు, సామాజిక బహిష్కరణకు గురిచేస్తూ వేధిస్తున్నారు. వీరి పిల్లలు అటు పాఠశాలల్లో, ఇటు పౌర సమాజంలోనూ తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. కులాంతర వివాహం చేసుకున్న కుటుంబాలకు చెందిన కుమార్తెలు, కుమారులకు పెళ్లిళ్లు కావడం లేదు. తమ తప్పేమీ లేకపోయినా ఇలాంటివారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో అమృత–ప్రణయ్, తమిళనాడులో కౌశల్య–శంకర్లకు చెందిన ప్రముఖ ఉదంతాలు.. మన దేశంలో అంటరానితనం మాత్రమే కాదు, కుల వ్యవస్థ సైతం యువతీయువకుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని చాటిచెబుతున్నాయి. చివరకు ఒక దృఢమైన కులనిర్మూలనా చట్టం ఉనికిలో లేని నేపథ్యంలో ఘనీభవించిపోయిన కుల వ్యవస్థపై భారతీయ న్యాయ వ్యవస్థ సైతం దృఢవైఖరిని చేపట్టలేకపోతోంది. శాసన సంపుటిలో బలమైన కులనిర్మూలనా చట్టం భాగమైనప్పుడు మాత్రమే కులాచారాలను, కులపరమైన నిందాత్మక భాషను తీవ్రనేరంగా ప్రకటించే పరిస్థితి ఏర్పడుతుంది. కులం అనేది మానవులను నిర్మూలించే వ్యవస్థ. చారిత్రకంగా చూస్తే కూడా కులం మానవుల్లో సానుకూలమైన, ఉత్పత్తి సంబంధాలను తోసిపుచ్చింది. సకల ఉత్పత్తి రంగాల్లో కులం అనేది అంతరించిపోయినప్పుడు మాత్రమే భారతదేశం ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతుంది. కులవివక్షత తరుణ వయస్కులలో ప్రతిభను, నైతిక విశ్వాసాన్ని చంపేస్తుంది. కుల నిర్మూలనా చట్టం రూపకల్పన గురించి చర్చ దేశంలోని దళిత, ఓబీసీ మేధావులు, హక్కుల కార్యకర్తలు మాత్రమే మాట్లాడితే సరిపోదు. కులం, జాతి ప్రపంచంలో మానవ సంబంధాలను, విలువలను విధ్వంసం చేస్తున్నాయని తలుస్తున్న వారందరూ దీనిపై తమ అభిప్రాయాలను చెప్పి తీరాలి. అందుకు ఇదే తగిన సమయం. వ్యాసకర్త: ప్రొఫేసర్ కంచ ఐలయ్యషెపర్డ్ డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
విద్యలో సమానత్వమే అసలైన విప్లవం
భారతదేశంలో సమానత్వం అతి ప్రధాన సమస్య. చారిత్రకంగా చూస్తే అన్ని దేశాల్లోనూ ఆస్తిపై యాజమాన్యమే మానవుల్లో అసమానతలను సృష్టించింది. విద్యలో కులపరమైన అంతరాలు సైతం మనదేశంలో పూడ్చలేని అసమానత్వాన్ని సృష్టించాయి. కులవ్యవస్థ ద్వారా, విద్య ద్వారా ఈ అసమానత్వం మన దేశంలో విజయవంతంగా కొనసాగుతూ వచ్చింది. ఆధునిక కాలంలోనూ.. పౌరసమాజంలో ఉంటూ సమానత్వం కోసం పోరాడటం కంటే ప్రభుత్వంలో ఉంటూ సమానత్వం కోసం పోరాటం చాలా కష్టమైనది. తాను స్వయంగా అధికారంలో ఉంటూ ఆఫ్రికన్ అమెరికన్లకు బానిసత్వం నుంచి స్వేచ్ఛ కల్పించాలనుకున్న అబ్రహాం లింకన్ దానికోసం తన ప్రాణాల్నే బలిపెట్టాల్సి వచ్చింది. కానీ, అమెరికా అధ్యక్షుడి హోదాలో ఉంటూ లింకన్ హత్యకు గురవడం అమెరికన్ జీవితాన్ని ప్రత్యేకించి నల్లజాతి ప్రజల జీవితాలనే మార్చివేసింది. ఇంగ్లిష్ విద్య లేకుండా ఈరోజు నల్లజాతి ప్రజల పరిస్థితిని కాస్త ఊహించుకోండి. వారు పాఠశాలల్లో ఇంగ్లిష్ చదువుకోకుంటే ప్రపంచం వారి వాణిని అసలు విని ఉండేది కాదు. సమాజంలోని అత్యంత నిరుపేద వర్గాలకు పాఠశాల విద్యలో బోధనా మాధ్యమంలో సమానత్వం కోసం అధికారంలో ఉంటూనే ఒక సంవత్సర కాలంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటం భారతీయ ప్రజాస్వామ్యంపై గణనీయమైన ప్రభావం కలిగించబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను ఆయన ప్రతిపాదించిన వెంటనే ప్రతిపక్షం నుంచి వ్యతిరేకత మొదలైంది. ఇంగ్లిష్ మీడియంపై ఆయన చేసిన ప్రతిపాదన సీబీఎస్ఈ అని పిలుస్తున్న సెకండరీ స్కూల్ విద్యా మండలి నెలకొల్పిన సిలబస్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, సైనిక స్కూళ్లలో చెబుతున్న ఇంగ్లిష్ మీడియంలో బోధనను సరిగ్గా పోలి ఉంది. ఇలాంటి విద్యావ్యవస్థ 1947 నుంచి అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోనూ కొనసాగుతూనే ఉంది. అయితే సమాజంలోని అన్ని రంగాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదువుతున్న విద్యావంతులే ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మాతృభాషకు ప్రాధాన్యం, స్థానిక భాషలో విద్యను పిల్లలే ఎంపిక చేసుకోవడం, ఇంగ్లిష్ మీడియంకు తగిన సన్నాహకాలు లేవనడం, మన సంస్కృతి, నాగరికతలకే ఇంగ్లిష్ విద్య గొడ్డలిపెట్టు అని పెడబొబ్బలు పెట్టడం వంటి వ్యతిరేకతలన్నీ ట్యాంకుకు చిల్లు పడినప్పుడు ధారగా కారే నీటి చందాన పెల్లుబుకుతూ వస్తున్నాయి. శ్రామిక వర్గాలు ఒకసారి ఇంగ్లిష్ నేర్చుకుని సమాజంలో మంచి స్థానంలోకి ఎగబాకితే తమ ఇళ్లలో కారుచౌకగా పనులు చేసిపెట్టేవారు ఇక దొరకరనే స్వార్థంతోనే పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి రాకుండా అడ్డుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. తమ శ్రమశక్తిని కారుచౌకగా అమ్ముకుంటున్న నిరక్షరాస్యులైన వలస కార్మికులు కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్లో తమ వాణిని కూడా వినిపించలేక ఎంతగా ఇబ్బందులు పడ్డారో మనందరికీ తెలుసు. అన్ని రాష్ట్రాల్లోనూ వీరు 12వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం విద్యను పొంది ఉంటే, వారిపై ఇలాంటి దారుణమైన దోపిడీ జరిగి ఉండేది కాదు. గతంలోనూ భూస్వామ్య ఆర్థిక వ్యవస్థ రాజ్యమేలిన కాలంలో సమాన విద్యావకాశాలు లేకనే దళితులు, ఆదివాసీలు, ఓబీసీలకు చెందిన పేదలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ వర్గాలకు చెందినవారే ఇప్పుడు కూడా పట్టణ పెట్టుబడిదారీ కేంద్రాల్లో గూడు, కనీస గౌరవం లేకుండా దెబ్బతినిపోయారు. దేశంలోని 20 కోట్లమంది నిరక్షరాస్య శక్తులకు తమదైన వాణిని వ్యక్తీకరించలేని మహా విషాదాన్ని లాక్డౌన్ ప్రపంచానికి చాటి చెప్పింది. అమ్మఒడి పథకంతోపాటు మంచి సౌకర్యాలను కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం తలపెట్టిన ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్య ఏపీలోని శ్రామికుల జీవితాన్ని శాశ్వతంగా మార్చివేయనుంది. అలా జరుగుతుందనే, ఏపీలోని ఇంగ్లిష్ విద్యాధిక శక్తులు భీతిల్లిపోతున్నారు. మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా మాధ్యమం గురించి ఇవాళ ప్రతి ఇంటిలోనూ తీవ్రమైన చర్చ, వాదనలు జరుగుతున్నాయి. సంపన్న ఇంగ్లిష్ విద్యాధిక శక్తుల అసలు ఉద్దేశాలను పీడనకు గురవుతున్న ప్రజారాశులు తెలుసుకోలేకపోవచ్చు. నిజానికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే ఇంగ్లిష్ విద్యతో నైపుణ్యం పొందిన జనాభాతో భారతదేశం ఒక ప్రపంచ శక్తిగా భవిష్యత్తులో ఎదిగే క్రమాన్నే మన కులీన విద్యావంతులు వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా 130 కోట్లమంది నిపుణ కార్మికశక్తి ఇంగ్లిష్ విద్యను పొందినరోజు ప్రపంచ మార్కెట్లను వీరు ముంచెత్తవచ్చు. ఎందుకంటే ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం, నిపుణ కార్మికుల దన్నుతో భారత్ భవిష్యత్తులో అమెరికా, చైనాలను కూడా సులభంగా సవాలు చేయవచ్చు. కానీ ప్రతీఘాతక శక్తులు తాము పొందుతున్న సౌకర్యాలు చెక్కుచెదరకుండా ఉండాలని కోరుకుంటున్నాయి. గొంతులేని కౌరుచౌక కార్మికులు తమ చెప్పుచేతల్లోనే ఉంటూ అందుబాటులో ఉండాలని వీరు కోరుకుంటున్నారు. తమ రాష్ట్రం వెలుపల తగిన వ్యక్తీకరణ సామర్థ్యం లేని అవిద్యావంతులు, లేక ప్రాంతీయ భాషలో చదువుకున్న కార్మికులు ఇప్పటి వలస కార్మికుల్లాగే కారుచౌక శ్రమశక్తికి ఒక రిజర్వ్ పూల్లాగా ఉండిపోతారు. ఇలాంటి వ్యవస్థే ఎప్పటికీ కొనసాగుతుండాలని కులీన విద్యావంతులు కోరుకుంటున్నారు. చివరకు ఇంగ్లిష్ వ్యతిరేకత, వర్గ బానిసత్వ వ్యతిరేకత కలిగి ఉండే కమ్యూనిస్టు నేతలు సైతం బోధనా మాధ్యమం విషయంలో దోపిడీదారుల వాదననే బలపరుస్తూ వస్తుండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. వ్యవసాయ ఉత్పత్తి సంబంధిత పనులకు వెలుపల ఉంటున్న దోపిడీ వర్గ, కుల శక్తులు తాజా పరిణామంతో మరింత కలవరపడుతున్నారు. ఎందుకంటే కార్మికులు సైతం ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సాధించిన తర్వాత వారు ఇక ఎన్నటికీ బానిసలుగా పడి ఉండరన్నదే దోపిడీ శక్తుల కలవరానికి కారణం. అమెరికాలో నల్లజాతీయులు తమ ఇంగ్లిష్ విద్య ద్వారానే తమ బలాన్ని ప్రదర్శించగలుగుతున్నారు. దేశంలోని ఒక రాష్ట్రంలో ఇంతటి విప్లవాత్మక చర్యకు నాందిపలికితే, అది అన్ని రాష్ట్రాలకు ఒక నమూనాగా మిగులుతుంది. సమానవిద్య అనే ఆయుధంతో బానిస–యజమాని సంబంధాల వ్యవస్థను మార్చివేయాలనే తలంపుతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని కృతనిశ్చయంతో ఉంటున్నందుకు దోపిడీ శక్తులు ఆందోళన చెందుతున్నాయి. స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి తీసుకున్న అసాధారణ నిర్ణయం ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ శక్తులే భాష సమస్యలో మనోభావాలను రెచ్చగొట్టడంలో విజయం సాధించారు. ఇలాంటి శక్తుల మధ్యనే వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలోనే ప్రారంభ చర్యను చేపట్టి ఉన్నారు. ఈ శక్తుల ప్రాబల్యం కారణంగానే తన హయాంలో ఆయన కేవలం 6,400 ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఇంగ్లిష్ మీడియాన్ని పాక్షికంగా ప్రవేశపెట్టగలిగారు. ఆయన హయాంలోనూ, బోధనతో కాకుండా పైరవీలు చేసుకుంటూ బతికేసిన ఉపాధ్యాయ సంస్థలను ముందుకు నెట్టిన విప్లవకర శక్తులుగా డప్పు వాయించుకునే ఇంగ్లిష్ వ్యతిరేక వామపక్ష శక్తులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా సమానత్వ వ్యతిరేక శక్తులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తూన్నప్పటికీ వైఎస్ జగన్ ప్రభుత్వం ఏమాత్రం వెనుకకు తగ్గలేదు. 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం విద్య ప్రారంభమైనప్పుడు, నిజంగానే ఏపీలో విద్యావిప్లవం ప్రారంభమవుతుంది. ఏడాదికేడాదిగా ఈ విప్లవం ముందుకెళుతుంది. పట్టణాలు, నగరాల బాట పట్టకుండానే గ్రామీణ పిల్లలు 12వ తరగతి వరకు చదువు పూర్తి చేసుకోగలరు. ఇది మొత్తం గ్రామీణ వ్యవస్థనే మార్చేస్తుంది. అయితే మితవాద, వామపక్ష, ఉదారవాద ప్రజాస్వామిక శక్తులనే తేడా లేకుండా ఇంగ్లిష్ మీడియం వ్యతిరేక శక్తులు తమ ఏజెంట్లను కూడా గ్రామాల్లోకి చొప్పిస్తారన్న విషయాన్ని గ్రామాల్లోని పేదపిల్లల తల్లిదండ్రులు మర్చిపోరాదు. ఇంగ్లిష్ మీడియం మీకు సరిపడదని ఈ ఏజెంట్లు పేద తల్లిదండ్రులకు నచ్చచెప్పడానికి కూడా ప్రయత్నిస్తారు. ఇంగ్లిష్ విద్యతో గ్రామీణ సంస్కృతి కూడా మారిపోతుంది. తాగివచ్చి భార్యను చితకబాదే సంస్కృతి కూడా మారిపోతుంది. అవును ఇంగ్లిష్ విద్య శ్రామిక ప్రజారాశుల బానిస మనస్తత్వాన్ని మార్చివేస్తుంది. అందుకే గ్రామాల్లోని తల్లిదండ్రులు ఇంగ్లిష్ వ్యతిరేక శక్తులను ఏమాత్రం లెక్కపెట్టకుండా తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియమే కావాలని డిమాండ్ చేస్తూ, దరఖాస్తు పత్రాల్లో సంతకాలు చేయాలి. కొందరు ఓబీసీ, దళిత, ఆదివాసీ నాయకులు కూడా ఇంగ్లిష్ వ్యతిరేక యజమానుల తరపున ఏజెంట్లుగా వచ్చి ఇంగ్లిష్ విద్య సరైంది కాదని వాదించవచ్చు. వీరిని అసలు నమ్మకండి. ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లిష్ చదువుతున్న తమ పిల్లలకు గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పిల్లలు పోటీ రాకూడదని ఈ దళారీ నేతలు కోరుకుంటున్నారని మర్చిపోవద్దు. ఒక్కమాటలో చెప్పాలంటే మన గ్రామీణ జీవితంలోని అన్ని రంగాల్లోనూ విద్యలో సమానత్వం అనేది అనేక మార్పులను తీసుకురానుంది. ఇంగ్లిష్ విద్య ప్రాముఖ్యత గురించి తెలిసిన ఏపీలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన యువత గ్రామాలకు వెళ్లి పిల్లలను ఇంగ్లిష్ మీడియంలోనే చేర్పించే విషయంలో తల్లులకు సహాయం చేయాలి. ఈ అవకాశం ఇప్పుడు కోల్పోతే, మరికొన్ని శతాబ్దాల పాటు శ్రామికవర్గాల్లో బానిసత్వం ఇప్పటిలాగే కొనసాగుతుంది. ఒకసారి మన పాఠశాలల్లో ఈ సరికొత్త విప్లవం మొదలయ్యాక, అధికారంలో ఉంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగిస్తున్న పోరాటం భారతదేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
ఈ ప్రచ్ఛన్న యుద్ధం ఎందాకా?
కోవిడ్–19 ఇప్పటికే అమెరికా, చైనా మధ్య ప్రచ్ఛన్న యుద్ధ తరహా పరిస్థితిని సృష్టిం చింది. భారత్ ఈ ప్రచ్ఛన్న యుద్ధ ఉద్రిక్తతలో భాగం పంచుకుంటూ అమెరికా పక్షం వహిం చింది. ఇప్పటికైతే అమెరికా, చైనాలు ఆర్థిక, సైనిక శక్తి విషయంలో పోటీపడుతున్నాయి. తమ ఆర్థిక, సైనిక శక్తితో చైనా, రష్యాలు ఒకవైపు చెక్ పెడుతున్నప్పటికీ.. ప్రపంచ సామ్రాజ్యవాద నియంత్రణ బలం కలిగిన పురాతన ప్రజాస్వామ్య దేశం అమెరికా. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సమయానికి, అమెరికాతో అనేక రంగాల్లో చైనా సమాన స్థాయిలో నిలబడటానికి ప్రయత్నిస్తూ వచ్చింది. ప్రత్యేకించి భారీస్థాయిలో ఉన్న నిపుణ కార్మిక శక్తి ఆధిపత్యంతో చైనా అమెరికాను సవాలు చేస్తోంది. ప్రపంచీకరణ ప్రక్రియను నేర్పుతో నిర్వహించడం ద్వారా ప్రపంచ మార్కెట్లలో అమెరికాను తోసిరాజన్న చైనా.. తన సరుకులు, విని యోగ వస్తువులతో అమెరికా మార్కెట్లనే ముంచెత్తింది. శ్రామిక శక్తితో కూడిన సోషలిజాన్ని చైనా ఆచరణలో పెడుతూ వస్తోంది. పూర్వపు సోవియట్ యూనియన్ ఇక్కడే దెబ్బతినిపోయింది. ఆసియాలోనే అత్యంత శక్తివంతమైన మార్కెట్ నియంత్రణదారుగా చైనా అవతరించింది. కొన్ని రంగాల్లో అయితే తన సొంత బ్రాండ్తోకూడిన వినిమయ సంస్కృతిని సృష్టించడం ద్వారా యూరో–అమెరికన్ మార్కెట్లలోకి కూడా చైనా చొచ్చుకుపోయింది. శ్రమశక్తిని, నైపుణ్యాన్ని, విజ్ఞానశాస్త్రాన్ని మేళవించడం అనే కారల్ మార్క్స్ స్వప్నాన్ని చైనా ఆవిష్కరించింది. ఉన్నత మానవ జీవితాన్ని సాధ్యం చేసే నూతన ప్రపంచ వ్యవస్థను కూడా చైనా సృష్టించింది. పెట్టుబడిదారీ పాశ్చాత్య ప్రపంచం ప్రకృతి అసమతుల్యతను సృష్టించడం ద్వారా అవసరానికి మించి అధికంగా వినియోగించసాగింది. ఇప్పుడు కరోనా వైరస్ సరిగ్గా ఆ వినియోగదారీ సంస్కృతిలోనే సరికొత్త సంక్షోభాన్ని సృష్టించింది. ఈ పాత వ్యవస్థను మార్చడం ద్వారానే కరోనా అనంతర ప్రపంచం ఆవిర్భవించవచ్చు. బలమైన కమ్యూనిస్టు వ్యతి రేక మనోభావాలు కలిగిన భారతీయ ప్రభుత్వాలు.. చౌక ధరలతో కూడిన సరుకులతో చైనా సాగిస్తున్న మార్కెట్ విస్తరణను అడ్డుకోలేకపోయాయి. 130 కోట్లమంది ప్రజలున్న అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారత్‌కు, 1962 యుద్ధం తర్వాత చైనా ప్రాదేశిక విస్తరణకు పూనుకుంటుందన్న భయం ఉన్నప్పటికీ దాని మార్కెట్ వృద్ధిని మాత్రం అధిగమించలేకపోయింది. పైగా చైనా బజార్లు మన దేశం లోని దిగువ ఆదాయ తరగతుల జీవన ప్రమాణాలను పెంచడంలో సాయపడ్డాయి. ఈరోజు భారత్‌లోని ప్రతి నగరంలోనూ, ప్రజా బృందాలకు చైనా బజార్లు అందుబాటులో ఉంటున్నాయి. చైనా బజార్లు కారు చౌక ధరలకు సరుకులను అమ్ముతుండటంతో భారతీయ అల్పాదాయవర్గాలు వాటి ముందు క్యూ కడుతున్నాయి. ప్రత్యేకించి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో 1999–2004 మధ్య కేంద్రంలో సాగిన బీజేపీ ప్రభుత్వం కానీ 2014 నుంచి మోదీ నేతృత్వంలో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం కానీ కమ్యూనిజాన్ని తమ నెంబర్ వన్ శత్రువుగా భావిస్తూ వచ్చాయి. అయినప్పటికీ చైనా సరు కులు భారతీయ మార్కెట్లలో పోటెత్తకుండా వాజ్‌పేయి, మోదీ ప్రభుత్వాలు అడ్డుకోలేకపోయాయి. దీనివెనుక కారణం ఏమిటంటే ప్రపంచంలోని ప్రతి సమాజం అవసరాలు, అభిరుచులను జాగ్రత్తగా అధ్యయనం చేసిన తర్వాతే, నాణ్యమైన సరుకులను చౌక ధరలకు ఎలా ఉత్పత్తి చేయాలో చైనా కార్మికులు చక్కగా నేర్చుకున్నారు. ఈ తరహా చైనా ఉత్పత్తి ఫార్ములాను దాని నిపుణులు యూరో–అమెరికన్ మార్కెట్లలోకి కూడా తీసుకుపోయారు. అంతర్జాతీయ సమాజపు బహుళ సంస్కృతి అవసరాలను జాగ్రత్తగా అధ్యయనం చేసిన చైనా.. అటు ఆహార పదార్థాలనుంచి ఇటు పడకగది అలంకరణల వరకు ప్రపంచ జనాభాలోని అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉండే ఉత్పత్తుల తయారీలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. చివరకు ఈ చైనా బజార్ల కారణంగానే ఆఫ్రికన్లు, అరబ్బులు సైతం 21వ శతాబ్ది జీవిత సౌకర్యాలను గురించి బాగా తెలుసుకున్నారు. అంతర్జాతీయ ఆధునిక జీవితానికి అవసరమైన అనేక కొత్త వస్తువులను అందించిన చైనా ఇప్పుడు కరోనా వైరస్‌కు కూడా మూలస్థానంగా నిలిచింది. ఈ వైరస్సే ఇప్పుడు అమెరికా, జర్మనీ, జపాన్, భారత్, ఆస్ట్రేలియా వంటి చైనా ప్రత్యర్థులు ఏకం కావడానికి దారి తీసింది. అయితే కరోనా అనంతర ప్రపంచంలోకి చైనా సరుకులు వెళ్లకుండా ప్రత్యర్థులు అడ్డుకోగలరా అన్నదే ప్రశ్న. ఇప్పుడు ట్రంప్, జిన్‌పింగ్ ప్రభుత్వాల మధ్య నడుస్తున్న యుద్ధానికీ, 1950లు, 60లు, 70లలో అమెరికా, సోవియట్ యూని యన్ మధ్య కొనసాగిన ప్రచ్ఛన్నయుద్ధానికి మధ్య పోలికలే లేవు. ఎందుకంటే సోవియట్ యూనియన్ తన కాలంలో ఏ దేశంలోనూ గృహ, కిచెన్ మార్కెట్‌ని నియంత్రించలేకపోయింది. ఆయుధాల అమ్మకమే యూఎస్ఎస్ఆర్ ఏకైక మార్కెట్‌గా ఉండేది. పైగా వినియోగదారీ సరుకులను భారీగా ఉత్పత్తి చేసే శ్రామికశక్తి నైపుణ్యాలు యూఎస్ఎస్ఆర్కి ఉండేవి కావు. కానీ నేడు చైనా తన 140 కోట్ల ప్రజానీకపు పరిమాణం, నాణ్యత (చక్కటి వ్యవసాయ పునాది, నైపుణ్యాలతో కూడిన కఠిన శ్రమశక్తి)తో కూడిన శ్రామిక శక్తిని ఉపయోగిస్తోంది. పైగా తాను సాధించిన ప్రతి ఫలితానికి సోషలిస్టు సంస్థాగత నైపుణ్యాలను జోడించింది. ప్రత్యేకించి ఆసియా, ఆఫ్రికా దేశాల్లో చైనా చౌక ఉత్పత్తులు ప్రజారాశుల జీవన శైలినే మార్చివేశాయి. కోవిడ్–19 అనంతర కాలంలో ప్రపంచ మార్కెట్లలో చైనా స్థానాన్ని భర్తీ చేయడానికి తమ హిందుత్వం తోడ్పడుతుందని బీజేపీ సిద్ధాంతకారులు చెబుతున్నారు. అయితే చైనాలోని నిపుణ శ్రామిక శక్తిని సవాలు చేసేలా భారత్ తన శ్రామిక శక్తిని సిద్ధం చేయగలదా? చైనా తయారు చేస్తున్న స్థాయిలో చౌక ధరలు, నాణ్యతతో కూడిన సరుకులను, వస్తువులను భారత్ తయారు చేయగలదా? ముస్లిం వ్యతిరేక సాంస్కృతిక జాతీయవాదం తోనే ఆరెస్సెస్ 95 ఏళ్లుగా మనగలుగుతూ వచ్చింది. భారత్‌లో దిగువ కులాలనుంచి వచ్చిన శ్రామిక శక్తి నైపుణ్యాలను పెంచడం గురించి ఆరెస్సెస్ ఎన్నడూ ఆలోచించలేదు. చైనీయుల కన్ఫ్యూసియనిజం, బుద్ధిజం, మార్క్సిజం మానవుల సమానత్వాన్ని, శ్రమ పట్ల గౌరవాన్ని విశ్వసిస్తాయి. కానీ కౌటిల్యుడు, మనువు, గోల్వాల్కర్ ఆలోచనలను మూలంగా కలిగిన ఆరెస్సెస్ భావజాలం.. మానవ సమానత్వం, శ్రమను గౌరవించడం గురించి తన చరిత్రలో ఎన్నడూ ప్రచారం చేయలేదు. శ్రమనే జీవి తంగా గడుపుతున్న చైనా శ్రామిక శక్తిని ఆరెస్సెస్ భావజాలం ఎలా సవాలు చేయగలదు? ఆరెస్సెస్ ప్రవచించే ‘జై శ్రీరామ్’ నినాదం ‘వంద పుష్పాలు వికసించనీ, వేయి భావాలు ఘర్షించనీ’ అనే చైనా నినాదాన్ని సవాలు చేయగలదా? సామాజిక, ప్రకృతి శాస్త్రాల మేళ వంతో కూడిన వందభావాల ఘర్షణ ఫలితమే చైనా మార్కెట్ విస్తరణ. ‘మేడ్ ఇన్ చైనా’ అనే ముద్ర ఉంది కాబట్టి చైనా వస్తువులను, సరుకులను కొనుగోలుదారులు ఇష్టపడటం లేదు. చౌక ధరలతో లభి స్తాయి, మన్నికగా ఉంటాయి కాబట్టే ప్రపంచమంతటా చైనా వస్తువులను కొంటున్నారు. రేపు మనం కూడా మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ వేసి చైనాలాగా చౌకగా భారతీయ వస్తువులను ఎగుమతి చేసినా, చైనా సరుకుల్లోని నాణ్యతను ఇవ్వలేకపోతే ఎవరూ మన సరుకులను కొనబోరు. అందుకే ఆరెస్సెస్ సిద్ధాంతకారులు తమ సాంస్కృతిక జాతీయ వాదాన్ని విడిచిపెట్టి శ్రమశక్తిని గౌరవించడానికి అధిక విలువనిచ్చే ఉత్పాదక జాతీయవాదం గురించి పాఠాలు నేర్చుకుని తీరాలి. లేబర్ మార్కెట్‌ను కులాలకు అతీతంగా మార్చడాన్ని వారు నేర్చుకోవాలి. చైనా, భారత్‌లకు సరిహద్దులున్నాయి కానీ ఈ రెండు దేశాలు తమ సంస్కృతులను ఎన్నడూ పరస్పరం పంపిణీ చేసుకోలేదు. పూర్తిగా విభిన్నమైన సంస్కృతులతోటే ఇవి మనగలుగుతూ వచ్చాయి. చైనా గ్రామీణ పరిశ్రమ వివిధరకాల సాంస్కృతిక, వాణిజ్య మార్కెట్లకు తగిన సరుకులను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో ఉంటున్నాయి. మరి మన గ్రామీణ పరిశ్రమ పరిస్థితి ఏంటి? ప్రధాని నరేంద్రమోదీ కరోనా అనంతర ఆర్థిక కార్యాచరణ కోసం 20 లక్షల కోట్ల రూపాయలతో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. కుటీర పరిశ్రమలను నెలకొల్పడం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ ప్రపంచ మార్కెట్ అభిరుచులను సంతృప్తిపరిచే వస్తువులు, సరుకులను గ్రామీణ భారత్‌లోని నిపుణ కార్మికులు తయారు చేయగలరా? ఇక నుంచి మన స్థానిక ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లు కావాలని మోదీ ఆశి స్తున్నారు. ఎలా సాధ్యం? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లాగే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా చైనా ద్విభాషా దేశంగా ఉందన్న విషయాన్ని గుర్తించడంలో విఫలమయ్యాయి. చైనా వ్యాప్తంగా మాండరీన్, ఇంగ్లిష్ భాషలు రాజ్యమేలుతున్నాయి. ఏ దేశానికి ఎలాంటి ఉత్పత్తులు అవసరం అనే అంశాన్ని గ్రామీణ చైనాలోని బ్రాండ్ మేకర్లకు బాగా తెలుసు. 1970ల నుంచి చైనాలో సిద్ధాంతం, ఆచరణల తోడుగా పాఠశాల విద్యా ప్రణాళిక నడుస్తోంది. మరి బీజేపీ ప్రభుత్వం ప్రబోధిస్తున్న స్కూలు విద్యా ఎజెండా ఏంటి? పురాణాలను ఆధునిక శాస్త్రంగా బోధించడం తప్ప పొలం దున్నడం, పంటలు పండించటమే భారతీయ సంస్కృతి అని బోధించడానికి మన పిల్లలను ఉత్పాదక క్షేత్రాల వద్దకు తీసుకుని పోవడం లేదు. చైనాలోని పిల్లలందరికీ తమ స్కూల్ కరిక్యులంలో భాగంగా పొలాల్లో పనిచేయడం నేర్పుతున్నారు. చైనాను మనం సవాలు చేయడం అంటే మనకు వాడుకలో ఉన్న అనేక అంశాల బూజు దులిపి కొత్త అంశాలను నేర్చుకోగలగడమే. ఈ కొత్త అంశాలు ఇప్పుడు జాతీయవాదతత్వంతో కనిపించకపోవచ్చు. నమస్తే ట్రంప్ అనే భావజాలంతో చైనాతో ప్రచ్ఛన్నయుద్ధం సాగించడం వల్ల దేశీయంగా కుటీర పరిశ్రమను అభివృద్ధి చేయలేం. పైగా ట్రంప్ పక్కా బిజినెస్‌మన్. తన ముందు ఎన్నికలు సవాలుగా ఉన్నాయి. ఈసారి కూడా ట్రంప్ గెలుపొందితే కచ్చితంగా జిన్‌పింగ్‌తో వాటాలు పంచుకుంటాడు తప్ప మోదీతో దాల్ రోటీని పంచుకోడు. వ్యాసకర్త: ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్, డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
వారిపై సమాజం దృష్టి నిజంగానే మారిందా?
కరోనా వైరస్ వ్యాప్తి భారతదేశంలోని పారిశుధ్య కార్మికులపట్ల మన అవగాహనను ఉన్నట్లుండి మార్చివేసింది. ఇన్నాళ్లుగా వీరిని నీచంగా చూస్తూ, గౌరవించడానికి, ఆత్మగౌరవానికి అర్హత లేనివారిగా భావిస్తూ వచ్చిన సంపన్నులు తమ ప్రాణాలు.. ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు ప్రమాదంలో పడిపోవడంతో డాక్టర్లు, నర్సులతో సమానంగా పారిశుధ్య కార్మికులను గుర్తించడం మొదలెట్టేశారు. ఇది కరోనా మహమ్మారి తెచ్చిన మార్పు. ఎలాంటి రక్షణ సామగ్రి ధరించకుండానే ప్రాణాం తక వైరస్‌కు వ్యతిరేకంగా రాత్రింబవళ్లు రహదారులు శుభ్రం చేస్తూ, బ్లీచింగ్ పౌడర్ స్ప్రే చేస్తూ వస్తున్న సఫాయి సైనికుల శ్రమను ఇన్నాళ్లుగా మన సమాజం విలువలేని పనిగా చూస్తూ వచ్చింది. ఇప్పుడు సరిహద్దుల్లోని సైనికుల త్యాగాన్ని, సాహసాన్ని పోలిన పనిగా సఫాయి కార్మికుల సేవలను జాతి గుర్తిస్తోంది. కానీ తమ పని ముగించిన తర్వాత ఇంట్లో వారు కనీస సౌకర్యాలతో జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాతి రక్షకులుగా సఫాయి కార్మికులను మన జాతీయవాదం ఎన్నడైనా గుర్తిం చిందా? వారికి మంచి జీవన పరిస్థితులను అందించిందా? కరోనా సైతాన్ లేక కరోనా రక్కసి సంపన్నులూ, నిరుపేదలూ తేడా లేకుండా అందరి ప్రాణాలూ తీస్తున్న సమయంలో జాతి ప్రాణాలు కాపాడటానికి ఎంతమంది పవిత్ర మూర్తులు మన రహదారులపై పోరాడుతున్నారో కదా. ఆలయాలూ, చర్చీలూ, మసీదులూ, విహా రాలు మొత్తం లాక్డౌన్ అయి ఉంటున్న నేపథ్యంలో మన పూజారులూ, సన్యాసులూ, బిషప్‌లూ, ముల్లాలు, సాధువులూ అందరూ సామాన్య మానవుల్లాగా ఇంటిపట్టునే ఉండిపోతున్నారు. ఈశ్వరుడూ, ప్రభువూ, అల్లా వాస్తవంగానే మన సఫాయి సైనికుల్లో కనిపిస్తున్నారు. నిస్సందేహంగానే కరోనా అనంతరం ప్రపంచంలోంచి మతం అంతరించిపోదు. కానీ పూజారులు, బిషప్‌లు, ముల్లాలు, సన్యాసుల కంటే రహదారులను శుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికులే దేవుళ్లుగా కనిపిస్తున్నారిప్పుడు. సఫాయి కార్మికులే ప్రస్తుతం అత్యంత పరిశుద్ధమైన, స్వచ్ఛమైన ప్రజలు. ఇకనుండి కరోనా అనంతర ప్రపంచంలో వీరికే అత్యంత గౌరవం లభించాల్సి ఉంటుంది. భారత్‌లో సఫాయి కార్మికులు దాదాపుగా అంటరానితనం నేపథ్యంలోంచి వచ్చినవారే అన్నది మరవరాదు. మనలో చాలామంది భార్యాపిల్లలను సైతం ముట్టకుండా భౌతిక దూరం పాటిస్తున్న కాలంలో యావన్మంది ప్రాణాలు కాపాడటానికి ఈ సఫాయి కార్మికులు ఎందుకోసం, ఎలా పనిచేస్తున్నారు? దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటిస్తున్న సమయంలో ప్రధాని నరేంద్రమోదీ.. రాష్ట్రపతి నుంచి కింది స్థాయి వరకు అధిక వేతనాలు పొందుతున్న వారి వేతనాల్లో 30 శాతం కోత విధిస్తున్న్టట్లు ప్రకటిం చారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమవైన వేతనాల కోతను ప్రకటించాయి. కానీ సఫాయి కార్మికుల వేతనాలను 30 శాతం వరకు పెంచడం జాతీయవాద చర్య కాదా? అలాంటి సానుకూల జాతీయవాద చర్యగురించి ప్రధాని ఎందుకు ఆలోచించరు? ఒక గొప్ప జాతీయవాద పనిని సాహసంతో, నిబద్ధతతో చేస్తున్న సఫాయి కార్మికులను ప్రశంసించడంతో సరిపెట్టుకోకూడదు. కరోనా వైరస్ నేపథ్యంలో రహదారులను శుభ్రం చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న వారికి సంపన్నులు పది రూపాయల నోట్ల దండ వేసి అలంకరించడం నైతికంగా సరైంది కాదు. మాతృభూమి నిజమైన సేవకుల వేతనాలు ఎల్లప్పుడు తక్కువగానే ఉంటున్నాయని దేశానికి, జాతీయవాదులకూ తెలుసు. వారిప్పుడు పొందుతున్న వేతనాలు మంచి తిండి తినడానికి, చక్కటి ఇంట్లో ఉండటానికి, పారంపర్యంగా వస్తున్న వృత్తినుంచి బయటపడేయగల మంచి చదువును తమ పిల్లలకు అందించడానికి ఏమాత్రం సరిపోవడం లేదు. పైగా వీరి వృత్తిని సాధారణంగా అగౌరవించడమే మనకు తెలుసు. దాన్ని హీనంగా భావించడమే మనకు తెలుసు. నిజానికి కరోనా మహమ్మారి మన సంపన్నులను ఒక్కసారిగా నేలమీదికి దింపింది. మీరు ఎంత ఎక్కువగా ప్రయాణిస్తే అంత ఎక్కువగా ఈ సైతాన్ బారిన పడడం ఖాయమని కరోనా తేల్చిచెప్పేసింది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆసుపత్రులు కూడా ఇప్పుడు మిమ్మల్ని రక్షించలేవు. అదే సమయంలో సఫాయి సైనికులు ఈ మహమ్మారికి ఎందుకు భయపడటం లేదు? ఎందుకంటే వారు ఈ మట్టిలో పుట్టారు. ఈ మట్టిలో పెరుగుతున్నారు. సంపన్నులు తినడానికి ఇష్టపడని తిండి (గొడ్డు మాసంతో సహా) తింటున్నారు. అయినప్పటికీ ముఖాలకు మాస్కులు కూడా లేకుండానే వీరు వీధుల్లో, రహదారుల్లో కరో నాతో తలపడుతున్నారు. ఇదెలా సాధ్యమైంది? ఎలాగంటే, ఈ మట్టిలో ఎంత ఎక్కువగా మీరు గడిపితే, మీ చేతులతో ఈ నేలను శుభ్రం చేస్తే.. అంత ఎక్కువ ధైర్యం, ఆత్మవిశ్వాసం, శక్తితో మీరు ఈ మహమ్మారితో పోట్లాడగలరు. బంగ్లా లలో కాకుండా గుడిసెల్లో జీవిస్తున్న ఈ నిరుపేదలకు అంతటి ధైర్యం, నమ్మకం, శక్తి ఎక్కడినుంచి వస్తున్నాయి? తాము మట్టినుంచే వచ్చామని, మహమ్మారి తమపై దాడిచేస్తే అదే మట్టిలో తాము కలిసిపోతామన్న కనీస విజ్ఞతనుంచి వారికి ఈ లక్షణాలు అబ్బుతున్నాయి. అలాంటి ఎన్నో మహమ్మారుల బారినపడే వారు జీవిస్తూ వచ్చారు. ఇలా కాకుండా ఏసీలతో కూడిన అసమానమైన జీవితం గడుపుతున్నట్లయితే సంపన్నులకు ఇక భద్రత ఉండదని కరోనా తేల్చి చెప్పింది. ఆసుపత్రులు మిమ్మల్ని కాపాడలేవని, తాము ఇన్నాళ్లుగా ద్వేషిస్తూ వస్తున్న నిరుపేదలే నిజంగా మిమ్మల్ని కాపాడగలరని కరోనా వారికి తేటతెల్లం చేసింది. ఈ కరోనా సంక్షోభకాలంలో తమకూ సమాన సమానస్థాయి వేతనాలు ఇవ్వాలని, మానవుల్లాగా తమనూ సమానస్థాయిలో గౌరవించాలని వీరు ఒక్కరోజు సమ్మెకు దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. అదే జరిగితే కరోనా వైరస్ భయంతో మనందరం రోడ్లమీదే చనిపోతాం. మనం నిజంగా జాతీయవాదులమే అయితే, ఈ ప్రాణాంతక వైరస్ బాంబు బారినుంచి మనల్ని కాపాడటానికి దేశవ్యాప్తంగా వీధివీధిలోనూ పోరాడుతున్న సఫాయి సైని కుల జీవితాలను మెరుగుపర్చడం ద్వారా అసమానతలను తగ్గించాలని తీర్మానించుకుందాం. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇన్‌క్లూజివ్ పాలసీ -
దురాచారమే అతిపెద్ద రోగం
వైరస్ రోగులకు సేవలందిస్తున్నారనే కారణంతో డాక్టర్లను, నర్సులను అద్దె ఇళ్లలోంచి ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్న ఘటనలు మనలో కొత్త తరహా స్వార్థానికి సంకేతాలు. ఇలా అద్దె ఇళ్లలోంచి గెంటేసినవారే రేపు రోగం బారిన పడితే.. ఆ డాక్టర్లు, నర్సులే వారికి సేవ చేయాల్సి వస్తుంది. మానవ అస్పృశ్యత, సామాజిక సామూహిక బాధ్యత లేని భయంకరమైన స్వార్థపరత్వం అనేవి భారతదేశాన్ని మరిన్ని మరణాలు, విధ్వంసం వైపు నెడతాయి. అసాధారణవేగంతో ప్రపంచంపై విరుచుకుపడుతూ ఆర్థిక వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న కరోనా వైరస్ నివారణ అనంతరం ప్రపంచం పూర్తిగా మారిపోతుందన్న వాస్తవాన్ని కుల, మత ఛాందసవాదులకు అర్థం చేయించాలి. కరోనా వైరస్ మానవజాతిపై యుద్ధం అనే ఆలోచనతో ప్రపంచం వణికిపోతుండగా, సామాజిక దూరం ఒక్కటే ఈ మహమ్మారికి రక్షణ సాధనం అనే ప్రచారం మోతాదుకు మించి సాగుతోంది. అయితే వెయ్యేళ్లపాటు దేశాన్ని పట్టి పీడించిన మానవ అస్పృశ్యత దేశాన్ని ఇప్పుడు మరింత ప్రమాదకర స్థితిలోకి నెట్టే అవకాశాలు పెరుగుతున్నాయి. అందుకే భారత ప్రభుత్వం, మీడియా సామాజిక దూరం అనే భావనను వదిలిపెట్టి రోగానికి దూరంగా ఉండటం అనే పదబంధాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వెయ్యేళ్లపాటు మనది కులపరమైన అస్పృశ్యతతో కూడిన సమాజంగా కొనసాగింది. ఏ కరోనా రోగి కూడా సామాజికంగా అస్పృశ్యుడు కాదు. అతడు/ఆమెను కొంచెం దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. అప్పుడే వారి నోటినుంచి, ముక్కునుంచి వెలువడే తుంపరలు ఆరోగ్యవంతులను చేరలేవు. ఒకసారి రోగి దేహం నుంచి వైరస్ వెళ్లిపోయాక, ఆ వైరస్ బారిన పడని వారికంటే ఎక్కువ రోగ నిరోధకశక్తిని కలిగి ఉంటారు. అంతేకాకుండా వైరస్ నుంచి బయటపడిన వారు మామూలు మనుషులుగా జీవించవచ్చు కూడా. అందుకే రోగాన్ని దూరం పెట్టడమే కానీ మనుషులను దూరం పెట్టే భావన కాదిది. సామాజిక దూరం అనే భావనమీద ఛాందసవాదులు మొదలుపెట్టిన ప్రచారంపై ఆధారపడి కులాన్ని దూరంగా ఉంచడమే కరోనాకు చికిత్స అనే ఆలోచనను చాలామంది ముందుకు తీసుకొస్తున్నారు. ఇది వేల సంవత్సరాల క్రితమే వీరు కనుగొన్న విధానమే మరి. చివరకు అత్యంత హేతువాదంతో వ్యవహరించే ద్రవిడియన్ రాష్ట్రమైన తమిళనాడులో సైతం కులపరమైన దూరం పాటించడమే కరోనా చికిత్సకు మంత్రం అనే భావన ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే పూర్తిగా శాకాహారం తీసుకునే వారి కంటే మాంసాహారం (గొర్రె, బీఫ్, కోడి, చేప, గుడ్డు) తినేవారికి మాత్రమే కరోనా వైరస్ సోకుతుందంటూ ఇవే శక్తులు ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణలో ఈరకమైన చెత్త ప్రచారం వల్లే కొంతకాలంపాటు చికెన్, మటన్ షాపులన్నీ మూతబడిపోయాయి. అయితే మాంసాహారం రూపంలో ప్రొటీన్ అధికంగా కలిగిన ఆహారంతో పాటు సీ విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ప్రజలు తప్పనిసరిగా తీసుకోవాలంటూ డాక్టర్లు చెబుతున్న సలహాల గురించి సీఎం కేసీఆర్ ఇటీవల ఒక ప్రెస్ కాన్ఫరెన్సులో నొక్కి చెప్పారు. రోగనిరోధక శక్తి బలంగా ఉన్న వారే ఎలాంటి ప్రాణాంతక వ్యాధి నుంచయినా తమను తాము కాపాడుకోగలరని సీఎం స్పష్టం చేశారు. ఆయన అలా చెప్పిన మరుసటి రోజు నుంచే తెలంగాణ వ్యాప్తంగా చికెన్, మటన్, గుడ్ల షాపుల ముందు భారీగా జనం క్యూ కట్టారు. కోడిమాంసం గురించి జరుగుతున్న దుష్ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ చేసిన ఒక్క ప్రకటనతో అనేక మంది జీవితాలను నిలబెట్టారు. అన్ని మాంసాలకంటే కోడి మాంసం చౌక. అందుకే ఇప్పుడు పేదప్రజలు కూడా కోడి మాంసం తింటున్నారు. ఒక మనిషి బ్రాహ్మణుడా, దళితుడా, మగవాడా, మహిళా, ముస్లిమా లేక క్రిస్టియనా అనే విషయాన్ని కరోనా వైరస్ పట్టించుకోదు. మనుషులు మాంసాహారులా, శాకాహారులా అనే విషయాన్ని కూడా అది పట్టించుకోదు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారి ఊపిరితిత్తులను కబళించడం ద్వారా మానవ శరీరంలో పాతుకుపోయే పరాన్నజీవే కరోనా వైరస్. రోగనిరోధక శక్తి స్థాయి బలంగా ఉన్న వారు కరోనాను ఓడించగలరు. చైనా ఆహార అలవాట్లే వారిపై కరోనా వైరస్ దాడికి ఆస్కారమిస్తూన్నాయని జోకులేస్తున్న వారంతా ఒక వాస్తవాన్ని పరిశీలించాలి. చైనా ఈ ప్రాణాంతక వ్యాధిని సైన్స్, మందుల సహాయంతో, మొత్తం సమాజాన్ని అప్రమత్తం చేసిన లీ వెన్ లియాంగ్ వంటి గొప్ప డాక్టర్ల సేవలతో ఓడించగలిగింది. పైగా చైనా ప్రజలు వైరస్ బారినుంచి తప్పించుకోవడానికి వారిలో ఉన్న అత్యున్నతమైన రోగనిరోధక స్థాయిలు కూడా తోడ్పడ్డాయి. ప్రపంచంలోని అన్ని మతధార్మిక సంస్థలూ మూతబడిపోయి, మతంమీద ఆధారపడిన వారందరూ వైద్యులు, మందులపై ఆధారపడుతున్న ప్రస్తుత తరుణంలో శాస్త్రీయంగా పరీక్షించిన, రోగనిరోథక స్థాయిలు బాగా ఉన్న ఆహారంపై ప్రచారం జరగాల్సిన తరుణంలో ఛాందసవాద భావజాలం, మానవ అస్పృశ్యత ప్రచారంలో బలం పుంజుకోవడమే జాతికి మరింత నష్టం చేకూర్చగలదు. నిజానికి కరోనా వైరస్ బారిన పడిన అనంతర భారతదేశం.. ఆహారం, మందులు, గృహ వనరులు తదితరాలను అన్ని కులాలు, సామాజిక బృందాలు, మతాలు, స్త్రీపురుషులు పంచుకుంటూ మానవ అస్పృశ్యత, కులతత్వ చరిత్రను పాతరేయవలసి ఉంది. మానవ సమానత్వం, సైన్స్‌ను అమలు చేస్తున్న శాస్త్రీయ తత్వాన్ని అభివృద్ధి చేసే దిశగా మనం అడుగేయాల్సి ఉంది. గొడ్డు మాంసం తింటున్న బౌద్ద కమ్యూనిటీలపై మానవ అస్పృశ్యతను విధించారని, తర్వాత వీరిని అస్పృశ్యులుగా ముద్రించారని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ నిశిత పరిశోధనతో మనకు తెలియజెప్పారు. కానీ 1897లో ప్రాణాంతకమైన బ్యుబోనిక్ ప్లేగు మహమ్మారికి కోటిమంది భారతీయులు బలైన సమయంలో ఈ తొలి అస్పృశ్యులైన దళితులే బతికి బయటపడ్డారు. కారణం బలమైన గొడ్డు మాంసం తినడం ద్వారా వారికి లభించిన రోగనిరోధక శక్తే. ఆరోజుల్లో వారికి గొడ్డు మాంసం తప్ప మరే ఆహారం లభించేది కాదు. పైగా ప్లేగువ్యాధి బారి నపడి జనం పిట్టల్లాగా రాలిపోతున్నప్పుడు అగ్రకులాలకు చెందిన కుటుంబ సభ్యులు.. చనిపోయిన తమ సన్నిహితుల మృతదేహాలను తాకడానికి కూడా భయపడుతున్న తరుణంలో దళితులే మృతదేహాలను మోసుకుపోయి పూడ్చిపెట్టేవారు లేక దహనం చేసేవారు. పైగా, 1897లో దేశంపై దాడి చేసిన బ్యుబోనిక్ ప్లేగు ప్రస్తుత కరోనా కంటే ప్రమాదకరమైనది. కరోనా వైరస్ సమసిపోయిన తదుపరి భారతదేశంలో తిండిపై ఉన్న ఆంక్షలను నిలిపివేయాలి. వ్యక్తులను, సామాజిక బృందాలను వేరు చేసి వివక్ష ప్రదర్శించే విధానాలను ఆపివేయాలి. ఎందుకంటే భారతీయులను మంచి ఆహారంతోనూ (వారు ఎలాంటి ఆహారం స్వీకరిస్తున్నా సరే), మెరుగైన వైద్య, ఆరోగ్య శాస్త్రాలతోనూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కరోనా వైరస్ నూతన జాతీయతా పాఠాలను మనకు నేర్పుతోంది. 1897లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో కలగలిసి ఉన్న భారతదేశంలోని 20 కోట్లమంది ప్రజల్లో ఒక కోటిమందికి పైగా ప్లేగు బారినపడి చనిపోయారు. అయితే 2020లో ప్రాణాంతక కరోనా వైరస్ దాడి చేసినప్పుడు 130 కోట్లమంది భారత ప్రజారాశులు తమ సొంత ఆహారంతో, శారీరక శ్రమతో, సామర్థ్యంతో తమను తాము బలోపేతం చేసుకున్నారు. ఇప్పుడు జాతీయవాదం అంటే శాస్త్రీయ, సాంకేతిక, వైద్య, సాంకేతిక ఆవిష్కరణలపై మరింత శ్రద్ధపెడుతూ అన్ని రంగాల ఆహార సంస్కృతులను గౌరవించడమే అని అర్థం. వైరస్ యుద్ధం అనేది అణు యుద్ధం కంటే ప్రమాదకరమైనదని ఇప్పుడు రుజువైపోయింది. వైరస్‌తో పోరాడేటప్పుడు మనం మరింత సామాజిక సంఘీభావంతో, మానవ సమానత్వంతో, గౌరవంతో మెలగాల్సి ఉంటుంది. వ్యాధికి దూరంగా ఉండటం తాత్కాలింగా ఉండే సమస్యే కానీ కులపరమైన అస్పృశ్యతలాగా సామాజిక దూరం అనే భావనను కూడా వ్యవస్థీకృతంగా మనుషుల మనస్తత్వాల్లోకి ఇంకింపజేస్తే భారతదేశం ఎన్నటికీ భవిష్యత్ వైరస్ యుద్ధాలకు సిద్ధం కాలేదు, నిలదొక్కుకోలేదు. పర్యావరణ మార్పుల సంక్షోభ సమయంలో భవిష్యత్తులో ఎలాంటి వైరస్లు మనపై దాడి చేస్తాయో ఎవరికీ తెలీదు. అలాంటి సందర్భాల్లో మతపరమైన పిడివాద సూత్రాలు మనల్ని ఏమాత్రం కాపాడలేవు. కానీ రియల్ టైమ్ సైన్స్ మాత్రమే తప్పకుండా మనల్ని రక్షిస్తుంది. వైవిధ్యపూరితమైన ఆహార సంస్కృతులు, బహుళ ఆధ్యాత్మిక ఆచరణలు, మానవ అస్పృశ్యత పూర్తిగా కనుమరుగైపోవడం ఆ నూతన ప్రపంచపు సహజతత్వంగా మారతాయి. అన్ని కులాలకు, మతాలకు చెందిన.. వైరస్ బారిన పడిన రోగులనే కాదు.. దేశంలో ఏ ఒక్కరినీ అంటరానితనంతో చూడని కొత్త సంస్కృతి ఏర్పడాలి. తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు సేవ చేస్తున్న ఆసుపత్రులు, వైద్యులు, నర్సులు ఒక సరికొత్త సామాజిక–ఆధ్యాత్మిక విలువను మనందరికీ బోధిస్తున్నారు. ప్రతి ప్రాణం సమానమైందే, మానవులంతా దైవం ప్రసాదించిన బహుమతే. వైరస్‌పై యుద్ధం నుంచి ఆవిర్భవిస్తున్న ఈ కొత్త ప్రపంచ రూపం నుంచి మనందరం పాఠాలు నేర్చుకుందాం. ప్రొ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
సమాజానికి ‘అమృత’ సందేశం
తండ్రి ఆత్మహత్య నేపథ్యంలో, హత్యకు గురైన తన భర్త పట్ల, అతడి కుటుంబం పట్ల అమృత ప్రదర్శించిన నిబద్ధత.. నైతిక జీవితానికి సంబంధించి అతి గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది. కులం చుట్టూ పెనవేసుకుపోయిన మానవ అస్పృశ్యత ప్రభావమే ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది. అంతిమంగా తండ్రి ఆత్మహత్యకు కారణమైంది. మారుతిరావు కులతత్వమే అతడి కుటుంబాన్ని, అతడిని కూడా ధ్వంసం చేసింది. మనుషులు మంచివారు లేక చెడ్డవారు అని కులం ఎలా నిర్ణయిస్తుంది అని ప్రశ్నించింది అమృత. సంపద కానీ, కులం కానీ మానవ ప్రేమను, అభిమానాన్ని పట్టించుకోవు, సహించవు అని అమృత మన సమాజానికి ఇస్తున్న సందేశం శాశ్వత విలువ కలిగినది. తెలంగాణలోని మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ అనే 24 ఏళ్ల దళిత యువకుడిని గర్భిణి అయిన భార్య సమక్షంలోనే 2018 సెప్టెంబర్ 24న నరికి చంపారు. అమృత ఆ పట్టణంలోని ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన యువతి. తన తండ్రి మారుతిరావును ధిక్కరించి మరీ ఆమె ప్రణయ్‌ని పెళ్లి చేసుకుంది. అమృతకు ఇప్పుడు 25 ఏళ్లు. సంపన్నులైన తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె. ఆమె తండ్రి రియల్ ఎస్టేట్, తదితర వ్యాపారాలతో భారీ ఆస్తులు కూడగట్టుకున్నారు. పోలీసులు సమర్పించిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఆయనకు 200 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. కృష్ణానది ఒడ్డున ఉన్న సంపన్న పట్టణమైన మిర్యాలగూడ.. తెలంగాణలో వ్యాపార కార్యకలాపాలు విస్తృతంగా సాగే పట్టణాల్లో ఒకటి. ఈ పరిస్థితిని మారుతిరావు సంపదను కూడగట్టుకోవడానికి అనువుగా మల్చుకున్నారు. ప్రణయ్ హత్యకేసులో అమృత తండ్రితో పాటు మరి కొందరు జైలుకెళ్లారు. కొన్నినెలల క్రితమే వారు బెయిల్‌పై విడుదల అయ్యారు. తన భర్త హత్య తర్వాత అమృత మిర్యాలగూడలో తన అత్త, మామలతోటే వారి సొంత ఇంటిలో కలిసి ఉంటోంది. భర్త హత్యకు గురైనప్పుడు ఆమె ఆరునెలల గర్భిణి. అమృత తన అత్తతో కలిసి వైద్య పరీక్షలకోసం ఆసుపత్రికి వెళ్లిన సందర్భంలోనే ఆమె భర్తను నరికి చంపారు. న్యాయంకోసం చెరగని నిబద్ధత తర్వాత ఆమె బాబుకు జన్మనిచ్చింది. ఇప్పుడతడు సంవత్సరం బిడ్డ. ఈ సమయంలోనే 2020 మార్చి 6న మారుతిరావు నోట్ రాసిపెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ నోట్లో తన కుమార్తె తన ఇంటికి తిరిగి వచ్చి తల్లితో కలిసి ఉండాలని కోరుకున్నారు. తన తండ్రి ఆత్మహత్య తర్వాత, న్యాయంకోసం అమృత నిబద్ధత పట్ల మీడియాలో వస్తున్న కథనాలు నిజంగానే సినిమా కథను తలపిస్తున్నాయి. మారుతిరావు పక్షాన కేసు వాదిస్తున్న లాయర్ చెప్పిందాని ప్రకారం, తన కుమార్తె అమృతను తిరిగి తనవద్దకు తెచ్చుకునేందుకు కన్నతండ్రి అనేక ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. కానీ అమృత తన భర్త హత్యకు న్యాయం జరగాలనే తన వైఖరినుంచి అంగుళం కూడా పక్కకు జరగడానికి తిరస్కరించింది. తన తండ్రి, నిజమైన హంతకుడు బిహార్‌కి చెందిన శుభాష్ శర్మ, ప్రణయ్ హత్యకు సహకారం అందించిన ఆమె చిన్నాన్న శ్రవణ్‌లకు కఠిన శిక్ష పడాలని ఆమె కోరుకుంది. ప్రణయ్ హత్య కేసులో రాజీ కుదుర్చుకోవాలని ఆమె తండ్రి ఎంతగా ప్రయత్నించాడో అంతకంటే దృఢంగా మారిన అమృత తనను బెదిరిస్తున్నారని ఆరోపించి మరిన్ని కేసులను దాఖలు చేసింది. తన తండ్రి చనిపోయిన వెంటనే ఆయన భౌతిక కాయాన్ని చూడడానికి ఆమె వెళ్లలేదు కానీ పోలీసు రక్షణ మధ్య శ్మశానవాటికలో తండ్రి మృతదేహాన్ని చూసి రావాలని ప్రయత్నించింది. కానీ ఆమె బంధువులు ఆమెను తండ్రి శవాన్ని చూడటానికి అనుమతించలేదు. దాంతో ఆమె మౌనంగా పోలీసు వ్యాన్‌లో వెనక్కి వెళ్లిపోయింది. ప్రణయ్ హత్య తర్వాత తన బాధను అర్థం చేసుకుని తన పక్కన నిలబడిన తన దళిత అత్త, మామతోనే ఆమె ఉంటోంది. తండ్రి ఆత్మహత్య అనంతరం ఆ తర్వాత శ్మశాన వాటికలో ఆమె మీడియాతో చెప్పిన మూడు విషయాలు టీవీ తెరపై చూస్తున్న ప్రతి ఒక్కరినీ నివ్వెరపర్చాయి. ఆమె చెప్పిన మాటలివి. 1. ఆత్మహత్య చేసుకోవడం కంటే నా భర్త హత్య కేసులో నాన్న శిక్ష అనుభవించి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. 2. కుటుంబ సభ్యుల పేర్లతో, బినామీ పేర్లతో కూడా ఉంటున్న తండ్రి ఆస్తులను నేను లెక్కచేయను. నా తండ్రికి అనేక ఆస్తులున్నాయని నాకు తెలుసు కానీ వాటిపై నాకు ఆసక్తి లేదు. 3. ప్రధాన నిందితుడైన తండ్రి మరణించాక అమ్మవద్దకు వెళతావా అని మీడియా అడిగినప్పుడు ఆమె ‘నేను ఇప్పుడు నా కుటుంబంతో, నా కుమారుడితో, నా అత్తమామలతోనే ఉంటున్నాను. అమ్మ కూడా నావద్దకు వస్తే మేం ఆమెను బాగా చూసుకుంటాం. అంతే కానీ మా నాన్న ఇంటికి మాత్రం వెళ్లను’ అని చెప్పింది. కులతత్వానికి బలైన కుటుంబం మరణించిన తన భర్త పట్ల, అతడి కుటుంబం పట్ల అమృత ప్రదర్శించిన నిబద్ధత.. నైతిక జీవితానికి సంబంధించి అతి గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది. ప్రణయ్ దళితుడు కాకపోయి ఉంటే ఆమె తండ్రి బహుశా అతడిని చంపించి ఉండకపోవచ్చు. ప్రణయ్ మరో కులానికి చెంది ఉంటే వారిని మారుతిరావు వదిలివేసి ఉండేవాడు. కానీ కులం చుట్టూ అంటుకుపోయిన మానవ అస్పృశ్యత ప్రభావమే ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది. అంతిమంగా తండ్రి ఆత్మహత్యకు కారణమైంది. చివరకు మారుతిరావు భార్య కూడా నిస్సహాయురాలిగా మిగిలిపోయింది. మారుతిరావు కులతత్వమే అతడి కుటుంబాన్ని, అతడిని కూడా ధ్వంసం చేసింది. మారుతిరావు తన కుమార్తెను ప్రాణాధికంగా ప్రేమించారని చెబుతున్నారు. తన కుమార్తెకు ఇవ్వడం కోసమే అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ వచ్చారు. కాని తన కుమార్తె ఒక యువకుడిని ప్రాణాధికంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు అతడిని దారుణంగా హత్య చేసే వరకు కన్నతండ్రి తెగించారు. కానీ ఆయన కన్నకుమార్తె ఈ సమాజానికి ఒక విభిన్నమైన నైతిక సందేశాన్ని పంపింది. తమపిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రేమను ప్రదర్శించడం అంటే ఆ పిల్లల జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని నిర్ణయించే హక్కు తమకు ఉంటుందని కాదు. అంతకు మించి కుల వ్యవస్థ మనిషి జీవితాన్ని, ప్రేమను, మానవ విలువలను అస్సలు నిర్ణయించకూడదు. మారుతిరావు మానవ జీవి తానికి సంబంధించిన చెడు ఉదాహరణగా నిలిచారు కానీ ఆయన కుమార్తె తన యవ్వన జీవితంలోనే అత్యంత విభిన్నమైన దారిలో నడుస్తోంది. తన భర్తను కోల్పోయింది. ఆ బాధను అనుభవిస్తూనే బిడ్డకు జన్మనిచ్చింది. తండ్రినుంచి ఒత్తిళ్లకు గురైంది. మీడియా డేగచూపులను ఎదుర్కొంటోంది. పోలీసు రక్షణలోనే జీవిస్తోంది. చివరకు కన్నతండ్రి ఆత్మహత్యను కూడా భరిస్తోంది. ఒక అగ్రకుల సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయిని ఇన్ని రకాల విషాదాలు, గాయాలు ఇంత చిన్న జీవితంలో వెంటాడుతూ వచ్చాయి. కలకాలం నిలిచే సందేశం కన్నతండ్రి ఆత్మహత్య తర్వాత మీడియా ఆమెను విభిన్నమైన ప్రశ్నలతో వెంటాడుతోంది. అమృత నుంచి ఆశ్చర్యకరమెన విషయాలను వినాలని టీవీలకు అంటుకుపోయి చూస్తున్న ప్రజలను ప్రశాంతంగా, స్థిరంగా కనిపించిన అమృత నిశ్చేష్టులను చేసింది. ఇంటర్వ్యూలలో ఆమె అత్యంత పరిణతిని, మానవీయమైన, కుల వ్యతిరేక సంస్కృతిని, నడతను ప్రదర్శించింది. భర్తను చంపించిన కన్నతండ్రే ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఈ ఘటనల మొత్తంలో ఏ పాత్రా లేని, ఏమీ చేయని కన్నతల్లి వద్దకు ఇప్పుడు మీరు ఎందుకు వెళ్లడం లేదు అని ఒక మీడియా వ్యక్తి ప్రశ్నించినప్పుడు ఆమె ఇచ్చిన జవాబు అందరి మతిపోగొట్టింది. ‘‘నా కోసం నా అత్తమామలు వారి కొడుకును పోగొట్టుకున్నారు. నా జీవితంలోని అత్యంత కఠిన పరిస్థితుల్లో వారే నాకు నా బిడ్డకు తోడుగా ఉన్నారు. నాకు అత్యంత ముఖ్యమైన వ్యక్తులు వారే. మా అమ్మ నన్ను ప్రేమిస్తున్న్టట్లయితే, ఆమే మా వద్దకు వచ్చి మాతో కలిసి జీవించాలి’’. తన భర్త హత్యకు గురైనప్పుడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఆమె మీడియాతో మాట్లాడుతూ, మనుషులు మంచివారు లేక చెడ్డవారు అని కులం ఎలా నిర్ణయిస్తుంది అని ప్రశ్నించింది అమృత. ‘నా పోరాటం మొత్తంలో నా భర్త కుటుంబంలోనే మానవీయతను నేను చూశాను. మా నాన్న వారికి వ్యతిరేకంగా ఎన్నో ఘోరమైన చర్యలు చేపట్టారు. కానీ నా కష్టకాలంలో నా కుటుంబం నాతో వ్యవహరించిన దానికంటే ఎంతో బాగా నా అత్తమామలు నన్ను చూసుకున్నారు. వారిది దిగువ మధ్యతరగతికి చెందిన దళిత కుటుంబం. మా నాన్న చాలా సంపన్నుడు, పైగా అధికార బలం ఉన్నవాడు. కానీ నా అత్తమామలు తన కుమారుడికోసం, అతడి మరణం తర్వాత నా కోసం దేన్నయినా కోల్పోవడానికి సిద్ధపడ్డారు. ఇక్కడే నేను నిజమైన మానవీయతను చూశాను. సంపద కానీ, కులం కానీ మానవ ప్రేమను, అభిమానాన్ని పట్టించుకోవు, సహించవు’. భారతీయ సమాజానికి అమృత ఇస్తున్న ఈ సందేశం కలకాలం నిలిచివుంటుంది. వ్యాసకర్త: ప్రొ'' కంచ ఐలయ్య షెపర్డ్ డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
భారతీయులందరూ హిందువులేనా?
ఈ దేశంలోని ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్శీలు తమ తమ దేవుళ్లతోపాటు, భారతమాతను పూజిస్తే చాలు.. వీరంతా హిందువులే అవుతారని ఆరెస్సెస్ సర్సంచాలక్ మోహన్ భగవత్ హైదరాబాద్ సదస్సులో ప్రకటించారు. ఈ గడ్డపై నివసిస్తూ, భారతమాతను పూజిస్తూ, ఈ నేలను, నీళ్లను ప్రేమించే ప్రతి ఒక్కరూ హిందువులే అంటూ సూత్రీకరించారు. ఆరెస్సెస్/బీజేపీ కార్యకర్తలు స్వర్గాన్నీ, రాజ్యాధికారాన్ని కోరుకోరని చెప్పడం ద్వారా ఆయన కౌటిల్యుడిని, మనువును, సావర్కార్‌ని, హెగ్డేవార్‌ని, గోల్వాల్కర్‌ని కూడా దాటి ముందుకు వచ్చేశారు. అయితే రాజ్యాధికారం కోసం కాకపోతే బీజేపీని ఆరెస్సెస్ ఎందుకు స్థాపించినట్లు? లౌకికవాదం, రాజ్యాధికారంపై విశ్వాసం ఉంచుతున్న ఇతర రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీని నిలిపి దాని విజయానికి ఆరెస్సెస్ ఎందుకు కృషి చేస్తూ వస్తోంది? భారతీయ ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, తమ తమ మత ముద్రలకు హిందూ ముద్రను చేర్చుకోవటాన్ని తప్పనిసరి చేస్తున్న మోహన్ భగవత్ కొత్త సిద్ధాంతంపై చర్చ జరగాల్సి ఉంది. శాంతి, అహింసల ప్రబోధకుడిగా ప్రపంచమంతటా గుర్తించిన జీసస్ క్రీస్తు జన్మదినమైన డిసెంబర్ 25న ఆర్ఎస్ఎస్ సర్సంచాలక్ మోహన్ భగవత్ హైదరాబాద్‌లో ప్రసంగిస్తూ, హిందువులు, హిందూయిజం పూర్తిగా భిన్నమైనవని నిర్వచించారు. ఆయన అభిప్రాయం ప్రకారం దేశంలోని 130 కోట్లమంది ప్రజలు హిందువులేనట. ఈ గడ్డపై నివసిస్తూ, భారతమాతను పూజిస్తూ, ఈ నేలను, నీళ్లను ప్రేమించే ప్రతి ఒక్కరూ హిందువులే అన్నారు. అంటే తమ తమ విశ్వాసాల మేరకు తమ దేవుడిని పూజించే, ప్రార్థించే భారతీయులందరూ ఇకనుంచి ఆర్ఎస్ఎస్ సృష్టించి, ప్రచారం చేస్తున్న భారతమాతను కూడా తమ దేవతగా తప్పకుండా పూజించాలన్నమాట. ఆయన చెప్పిందాన్ని బట్టి, ఈ దేశంలోని ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్శీలు తదితరులందరూ రెండు శక్తులను (ఒకరు తమ దేవుడు, మరొకరు దేవత అయిన భారతమాత) పూజించాల్సి ఉంటుంది. జాతీయ పౌర పట్టికలో కానీ, పాఠశాలలో కానీ, మరే ఇతర రికార్డులో కానీ మతం అనే కాలమ్‌లో భారతీయులు తప్పనిసరిగా ఇకనుంచి ముస్లిం–హిందూ, బుద్ధిస్టు–హిందూ, క్రిస్టియన్–హిందూ, సిక్కు–హిందూ, పార్శీ–హిందూ అని నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఆ తర్వాతే వారు తమ పవిత్ర గ్రంథం, తమదైన ఆహార సంస్కృతిని, తమ వివాహ వ్యవస్థను అనుసరించవచ్చు. అయితే ఈసారి మాత్రం మోహన్ భగవత్ దేశపౌరులందరూ ఆవును పూజిం చాలని, గొడ్డు మాంసం తినడం ఆపివేయాలని తన ప్రసంగంలో చెప్పలేదు. అలాగే ఉమ్మడి పౌరస్మృతి గురించి కూడా మాట్లాడలేదు. అయితే ఇస్లాం లేక క్రిస్టియానిటీ లేదా బుద్ధిజం లేక సిక్కిజం మరే ఇతర మతంలో అయినా చేరినా లేదా చేరాలని తలుస్తున్నవారు తప్పకుండా తమ మతంలో విడదీయరాని విధంగా హిందూ అనే పదాన్ని చేర్చాలన్నది ఆయన ప్రసంగ సారాంశం. సావర్కార్, హెగ్డేవార్, గోల్వాల్కర్ తదితరులు హిందుత్వకు ఇచ్చిన గత నిర్వచనాల నుంచి మోహన్ భగవత్ వేరుపడ్డారు. గతంలో హిందుత్వ లేక హిందూయిజం కాస్త విభిన్నార్థంలో కని పించేది. కాని ఇప్పుడు ఆయన ఒక ప్రధాన సమస్యను పరిష్కరించేశారు. ఈ క్రమంలో రాజకీయ సైద్ధాంతిక విషయాన్ని సైతం ఆయన తీసివేశారు. ఇది ముస్లింలు, బుద్ధిస్టులు, క్రిస్టియన్లు, సిక్కులను కలుపుకోవడానికి అవకాశమిస్తుందని ఆయన అభిప్రాయం. ఇది పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక సమస్యను కూడా పరిష్కరిస్తుంది. వలస వచ్చిన ముస్లింలు లేక శరణార్థులు తమ పేర్లకు ముస్లిం–హిందూ అని చేర్చుకోవలసి ఉంటుంది. ఆ తర్వాతే వారు అరబిక్ భాషలో అల్లా అని ప్రార్థించవచ్చు. కానీ ప్రార్థన ముగింపులో మాత్రం తప్పకుండా భారత్ మాతా కీ జై అని చెప్పాల్సి ఉంటుంది. కౌటిల్యుడు, మనువు తర్వాత హిందూ తత్వశాస్త్రానికి సంబంధించిన అతి గొప్ప సిద్ధాంతవేత్తగా మోహన్ భగవత్ ఆవిర్భవించారు. కౌటిల్యుడు, మనువు తమ సొంత సైద్ధాంతిక రచనలైన అర్థ శాస్త్రం, మనుధర్మశాస్త్రం రచించడం ద్వారా మౌర్య చంద్రగుప్త, పుష్యమిత్ర శుంగ సామ్రాజ్యాలను స్థాపించారు. తమ సిద్ధాంతాలతో చంద్రగుప్తుడిని, పుష్యమిత్రుడిని అధికారంలోకి తెచ్చిన కౌటిల్యుడు, మనువు లాగే మోహన్ భగవత్ కూడా నరేంద్రమోదీని అధికారంలోకి తెచ్చారు. నరేంద్రమోదీ తర్వాత తాను జీవించి ఉన్న కాలంలోనే అమిత్ షా కూడా దేశ ప్రధాని కావచ్చు. పార్లమెంటులో ప్రస్తుతం బీజేపీ సాధించిన మెజారిటీ కానీ, కేంద్రంలో రెండు దఫాల పాలన కానీ మోహన్ భగవత్ తాత్విక వ్యూహాత్మక చేర్పుగానే చెప్పాలి. హైదరాబాద్ సదస్సులో తన నూతన సిద్ధాంతాన్ని విస్తరించి చెప్పినట్లుగా మోహన్ భగవత్ అభిప్రాయం మేరకు, ప్రపంచంలోని మానవులను మూడు రకాలుగా విభజించవచ్చు. వీరందరికీ మూడు రకాలైన లక్షణాలు ఉంటాయి. అవి ‘తమో, రజో, సత్వ’ గుణాలు. తమోగుణం కలిగినవారు తాము విషాదంలో ఉంటూ ఇతరులనూ విషాదంలో ముంచెత్తుతుంటారు. వీరు హింసను ప్రేరేపించినప్పటికీ విజయం సాధించలేరు. అంతిమంగా వీరు ప్రతి ఒక్క అంశాన్నీ విధ్వంసం చేస్తారు. ఇక రజోగుణానికి చెందినవారు తమ ప్రయోజనాలకు చెందిన పనులను మాత్రమే చేపడుతుంటారు. తాము సంపన్నులు కావడానికి, తమ సొంత ప్రతిష్టలకు వీరు ఇతరులను ఉపయోగించుకుంటుంటారు. కాగా సంఘ్ పరివార్, భారతదేశం ధర్మ విజయాన్ని (సత్వ గుణాన్ని) నమ్ముతుంటాయి. ఈ ధర్మపాలనలో ప్రజలు ఇతరుల సంతోషం కోసం, శ్రేయస్సు కోసమే వీరు జీవి స్తుంటారు తప్ప స్వర్గాన్నీ, రాజ్యాధికారాన్ని లేక మరి దేన్ని కూడా తమకోసం కోరుకోరు’’ (ది హిందూ 2019 డిసెంబర్ 28) ఇది ఎంత అత్యున్నతమైన సృజనాత్మక సిద్ధాంతం అంటే.. స్వర్గాన్ని, రాజ్యాధికారాన్ని రెండింటినీ సాధించడానికి నేరాలకు, హింసలకు పాల్పడుతూనే స్వర్గంపై, రాజ్యాధికారంపై విశ్వాసం నుంచి విశ్వాసులను కాపాడుతూ వస్తోంది. ఈ రెండు వ్యవస్థలూ మారణకాండకు దారితీసిన హింసను ప్రేరేపిస్తూ వచ్చాయి. ఇంతవరకు పవిత్ర ముస్లింలుగా, పవిత్ర క్రిస్టియన్లుగా, పవిత్ర బౌద్ధులుగా, పవిత్ర సిక్కులుగా చెప్పుకుంటూ జీవిస్తున్న ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, సిక్కులు అందరూ ఈ జీవితంలో మరణం తర్వాత, రాజకీయాధికారం పొందిన తర్వాత స్వర్గాన్ని కోరుకుంటూ వచ్చారు. ఇలాంటి వాళ్లందరూ హింసకు పాల్పడుతూనే వచ్చారు. అయితే తొలిసారిగా ఆరెస్సెస్/బీజేపీ కార్యకర్తలు స్వర్గాన్నీ, రాజ్యాన్నీ కోరుకోవడం లేదని మోహన్ భగవత్ పేర్కొన్నారు. పైగా ఆరెస్సెస్/బీజేపీ కార్యకర్తలకుమల్లే స్వర్గాన్ని, రాజ్యాధికారాన్ని పొందాలనే కోరిక నుంచి బయటపడాలనే వారు తమ తమ మత చిహ్నాలతో పాటు హిందూ ట్యాగ్‌ను కూడా చేతపట్టాల్సి ఉంటుంది. హిందూయిజంలోకి మారాలని కానీ లేక తన హిందూ మతం నుంచి వేరొక మతంలోకి మారిన వారు ఘర్‌వాపసీలో భాగంగా మళ్లీ హిందూమతంలోకి మారాలని కానీ మోహన్ భగవత్ ఇప్పుడు ఎవరినీ కోరలేదు. దీనికి బదులుగా వీరందరూ తమ మతానికి అదనంగా హిందూ ట్యాగ్‌ను చేర్చుకుంటే చాలు. అయితే ఇక్కడ మనకు తట్టే ప్రశ్నల్లా ఏమిటంటే.. రాజ్యాధికారం చేజిక్కించుకోవడానికి కాకపోతే భారతీయ జనతాపార్టీని ఆరెస్సెస్ ఎందుకు స్థాపించినట్లు? పాపకార్యాలుగా తాను భావిస్తున్న లౌకికవాదం, రాజ్యాధికారంపై విశ్వాసం ఉంచుతున్న ఇతర రాజ కీయ పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీని నిలిపి దాని విజయానికి ఆరెస్సెస్ ఎందుకు కృషి చేస్తూ వస్తోంది? ఆరెస్సెస్ తన 95 ఏళ్ల జీవితకాలంలో తమో, రజోగుణ కార్యాచరణలో ఎన్నడూ పాల్గొనలేదని ప్రపంచానికి మోహన్ భగవత్ నొక్కి చెబుతున్నారు. లేక ధర్మ కాలంలోలాగా 2014కి ముందు ఆరెస్సెస్ ఘర్షణల చరిత్రను ఆయన గుర్తిం చడం లేదు. హిందువులకు స్వర్గాన్ని, రాజ్యాధికారాన్ని తిరస్కరించడంలోనే మోహన్ భగవత్ ధర్మంలోని మౌలిక సారాంశం దాగి ఉంది. అందుచేత ఆయన ప్రస్తుత మాటలు గౌతమబుద్ధుడి కంటే మించిన రాడికల్ స్వభావంతో ఉంటున్నాయి. ప్రాచీన హిందూ పురాణాలు మనకు చెబుతూ వచ్చినట్లుగా తమో, రజో గుణం కలిగినవారు భారతదేశంలో లేరని భగవత్ నూతన హిందూ సిద్ధాంతం చెబుతోంది. వారు భారతదేశంలోని దిగువ కులాలకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు చెందినవారు కారనీ వారంతా భారత్ బయటే ఉంటున్నారని ఈ సిద్ధాంత భావన. అయితే భారతీయ ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, తమ తమ మత ముద్రలకు హిందూ ముద్రను చేర్చుకోనట్లయితే అప్పుడు వారిని తమో, రజో, గుణ సంపన్నులుగా గుర్తించవచ్చు. ఈ రకమైన వరివర్తనకు మోహన్ భగవత్ తగినంత పరిధిని ఇచ్చారు. ఇదీ మోహన్ భగవత్ నూతన భారతదేశం. ఈ జాతి పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఒక భారీ డిజైన్ని సూచిస్తున్నారు. ఆయన హైదరాబాద్‌లో ప్రవచించిన సిద్ధాంతాన్ని పలురకాలుగా వ్యాఖ్యానించవచ్చు, పునర్ వ్యాఖ్యానించవచ్చు కూడా. ఇప్పటికే మీడియా ఆయన సిద్ధాం తాన్ని చాలా ప్రముఖంగా నివేదించింది. టీవీ చానల్స్ ఆయన ప్రసంగాన్ని విస్తృతంగా ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఈ నేపథ్యంలో ఇతర మతాలకు చెందిన మేధావులు, లౌకిక మే«థావులు, పాశ్చాత్య విద్యా పండితులు ఆయన సిద్ధాంతం పట్ల ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం. వ్యాసకర్త : ప్రొ‘‘ కంచ ఐలయ్యషెపర్డ్; డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
అత్యాచార సంస్కృతి అంతం ఎలా?
బాధితులపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేస్తున్న ఘటనలకు కారణం వ్యక్తులు తమ స్వీయ నియంత్రణను కోల్పోవడం ఎంతమాత్రం కాదు. అమ్మాయిలను అవమానించడం అంతకంటే కాదు. నిజానికి ఇవి మన సమాజంలోని పలు దొంతరలను సాంస్కృతికంగా హింసిస్తున్నదానికి వ్యక్తీకరణలు మాత్రమే. కుటుంబం పాఠశాల, మత సంస్థలు, మార్కెట్ స్థలాలు అన్నీ కలిసి స్త్రీ, పురుషులు సమానులు అనే భావాన్ని పాటిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటటువంటి సాంస్కృతిక విధానాలను పాటించాలి.. స్త్రీల ఆత్మాభిమానాన్ని, శ్రమగౌరవాన్ని పెంచేటటువంటి సిలబస్‌ను రూపొందించాలి. మహిళల శ్రమ, వారి సృజనాత్మకతే జాతి పురోగమనానికి, అభివృద్ధికి కీలకం అని మన పిల్లలకు పాఠశాలల్లో బోధించనట్లయితే, భవిష్యత్తులో కూడా అత్యాచారాలు, వేధింపుల వంటి ఉపద్రవాలు మనల్ని పీడిస్తూనే ఉంటాయి. వ్యక్తులు తమ సంతృప్తిని తీర్చుకోవడానికి లేక అణచివేతను ఆయుధంగా ప్రయోగించడానికి ఉపయోగపడుతున్న అత్యాచారాల సంస్కృతి ప్రజల నైతిక ప్రమాణాలను చంపేస్తోంది. నవంబర్ 27న హైదరాబాద్, శంషాబాద్ సమీపంలో దిశపై జరిగిన పాశవిక సామూహిక అత్యాచారం ఏడేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను మళ్లీ తలపింపజేసింది. ఢిల్లీలో కదులుతున్న బస్సులో నిర్భయను పాశవికంగా హత్యచేయగా, హైదరాబాద్‌లో దిశపై సామూహిక అత్యాచారం జరిపిన తర్వాత ఆమెను దాదాపు సజీవంగానే తగులబెట్టి చంపేశారు. ఈ రెండు ఘటనలపై యావద్దేశం తీవ్రంగా నిరసించింది. కానీ దేశం లోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దిశ కేసులో మాత్రమే రేపిస్టులను కాల్చిచంపారు. నిర్భయ హంతకులు మాత్రం తమపై మరణశిక్ష అమలు కోసం వేచి ఉంటున్నారు. అయితే ఇలాంటి సామూహిక అత్యాచార ఘటనలు ఎన్నో జరుగుతున్నా మీడియా దృష్టికి అవి రావడం లేదు. ప్రతిరోజూ దేశంలో చిన్నారులపై జరుగుతున్న అత్యాచార వార్తలు ప్రజల సున్నితత్వాన్ని చంపేస్తున్నాయి. అత్యాచారం అనేది మరొక చెడువార్త.. దాన్ని వదిలేయండి అని భావిస్తున్న పరిస్థితి ఏర్పడుతోంది. టీచర్లు తమ సొంత విద్యార్థులను పాఠశాలల్లోనే అత్యాచారం చేస్తున్నారు. మత బోధకులు తమ అనుయాయులనే అత్యాచారం చేస్తున్నారు. మన విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు భయాం దోళనలను ప్రేరేపించే సంస్థలుగా మారిపోతున్నాయి. బాధితులపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటనలకు కారణం వ్యక్తులు తమ స్వీయ నియంత్రణను కోల్పోవడం ఎంతమాత్రం కాదు. తన దృష్టిలో పడిన అమ్మాయిలను అవమానించడం అంతకంటే కాదు. నిజానికి ఇవి మన సమాజంలోని పలు దొంతరలను సాంస్కృతికంగా హింసిస్తున్నదానికి వ్యక్తీకరణలుగానే చూడాలి. దీనికి మూలాలు ప్రస్తుత కుటుంబం, స్కూలు, మత వ్యవస్థలు, పౌర సమాజంలో దాగి ఉన్నాయి. ఎందుకంటే సామూహిక అత్యాచారాలు చేసేవారు విభిన్న కుటుంబాలు, కులాలనుంచి వస్తున్నారు. ఇలాంటి అనాగరికమైన అత్యాచారాలకు మన యూనివర్సిటీలు కూడా మినహాయింపు కాదు. ప్రత్యేకించి భారతదేశంలో ఇది ఒక సామాజిక, భావజాలపరమైన ట్రెండ్‌గా మారిపోయింది. నగరం నుంచి గ్రామం దాకా, కుటుంబం నుంచి పాఠశాల, కాలేజీ, ఆలయం, మసీదు, చర్చి వరకు మనం స్త్రీ, పురుష సంబంధాలపై పునరాలోచించుకోవలసి ఉంది. ఏ మతాన్నీ, ఏ పాఠశాలను, ఏ కుటుంబాన్నీ వదలకుండా భారీస్థాయిలో సాంస్కృతిక ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉంది. అత్యాచార విముక్త భారత్ కోసం జరిగే సాంస్కృతిక ప్రచారంలో స్త్రీ, పురుషులిరువురు పూర్తిస్థాయిలో పాల్గొనాల్సి ఉంటుంది. కుల వ్యవస్థ, అమానవీకరించిన పితృస్వామిక సంబంధాలు అనేవి ప్రపంచంలోనే ఏ సమాజంలోనూ చోటు చేసుకోనంత హింసకు భారతీయ స్త్రీ, పురుష సంబంధాలను గురి చేశాయి. ఈ సమస్యను విడి విడి ఉదంతాలుగా కాకుండా సర్వసమగ్ర దృష్టితో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. గ్రామీణ కుటుంబ వ్యవస్థ నుంచి పట్టణాలు, నగరాల్లోని మన కుటుంబాల వరకు పరిశీలిస్తే ఇళ్లలో మనం వాడే భాషలో భయంకరమైన బూతులు దొర్లుతుంటాయి. వీటిలో చాలావరకు మహిళలను కేంద్రంగా చేసుకున్నవే. ఇంట్లో తండ్రీ, తల్లి, తాతా అవ్వలు సాధారణంగా ఆమోదించే జాతీయాలతో బూతు భాషను వాడుతున్నందున అది బాల్యం నుంచే మనలో ఇంకిపోయి ఉంటుంది. తరం నుంచి తరానికి ఇది పయనిస్తూనే ఉంటుంది. మన సమాజంలో ఆడదానిపై మగవాడు చలాయించే అధికారం, ఆజమాయిషీని బట్టే ఘనత వహించిన పురుషత్వం అనేదాన్ని నిర్వచిస్తుంటారు. నిత్యజీవితంలో మహిళను తనతో సమానంగా భావించి వ్యవహరించే పురుషుడిని ఈ సమాజం అసమర్థుడు అంటుంది. దీనికి మించిన పాశవిక సాంస్కృతిక భావం మరొకటి ఉండదు. కానీ అన్ని చోట్లా ఇది ఉని కిలో ఉంటోంది. దీంతో మనం తప్పక పోరాడాలి. మన పుస్తకాలు మొత్తంగా ఉత్పత్తి, ప్రకృతి, సైన్స్, స్త్రీపురుషుల మధ్య సహకార సంబంధాలు వంటివాటి కంటే శృంగారం, సెక్స్ పైనే ఎక్కువగా కేంద్రీకరిస్తుంటాయి. ఇక పాఠశాలలు, కాలేజీలు మహిళా వ్యతిరేక సాంస్కృతిక భావనలను పెంచిపోషిస్తూ, ఇంటినుంచి పాఠశాలకు బూతు భాషను విస్తృతపరుస్తూ ఉంటాయి. మన పోలీసు స్టేషన్లు భయంకరమైన బూతుభాషను వాడటంలో పేరుమోశాయి. మన సినిమాలు పూర్తిగా హింస, సెక్స్‌తో నిండివుండి రేపిజానికి మారుపేరుగా ఉంటున్నాయి. వికృతమైన సెక్సు, హింసాత్మక ఘటనలు లేని సినిమా ఒక్కరోజు కూడా థియేటర్లో ఆడలేదు. అటు ప్రేక్షకులు, ఇటు నిర్మాత, హీరోల మనస్తత్వం హింసాత్మక సెక్స్‌ని లేక వీరోచితమైన భౌతిక హింసను ప్రదర్శిస్తూంటుంది. భారతదేశంలో లేక మరెక్కడైనా సరే.. మానవ ప్రాణులను అత్యాచారం చేస్తున్న సంస్కృతి, జంతువుల్లోని ఆడామగ మధ్య లైంగిక కార్యకలాపం సందర్భంగా కనబర్చే ప్రవర్తనకు ఏమాత్రం పోలలేదు. ఆడజంతువు మద్దతు లేకుండా జంతువులు, పక్షులు బలాత్కారంగా సెక్సులో పాల్గొనలేవు. జంతువుల్లోకూడా గమనించలేనంత ఘోరమైన పీడన స్వభావంతో పురుష అణచివేత కొనసాగుతున్నందున దీన్ని అడ్డుకోవడానికి మరింత ఎక్కువగా జంతు ప్రవర్తనా శాస్త్రాలను భారతీయులు నేర్చుకోవలసి ఉంది. కానీ భారతీయ తరహా రేప్ సంస్కృతిని ఇతర సమాజాలతో అసలు పోల్చి చూడలేం. ఎందుకంటే యుద్ధ సమయాల్లో తప్పితే.. సామూహిక హత్యలు, వధలు ఆ సమాజాల్లో తక్కువ. సాధారణ పరిస్థితుల్లో ఏ మగాడైనా సరే ఆడదాని శరీరాన్ని తాకాలంటే ఆమె అనుమతి తీసుకోవడం ముందు షరతుగా ఉంటుంది. కానీ భారతదేశంలో దీన్ని చాలావరకు పరిగణించరు. ఇది మన కుటుంబ, విద్యా వ్యవస్థకు పెద్ద సవాలు. మన సమాజం, జాతిలోని ఈ బలహీనతను మనం అంగీకరించాలి, ఆ తర్వాతే నాగరిక ప్రవర్తనకు మారాలి. ఈ సమస్యకు మరింత పోలీసింగ్, ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పులు మాత్రమే పరిష్కారం కాదు. రేపిస్టులను ఎన్కౌంటర్ చేస్తే ఇది పోయేది కాదు. మన సంస్కృతిలోనే స్త్రీ వ్యతిరేక బూతు ప్రయోగాల సమస్య ఉన్నందున, ఇళ్లలో, బహిరంగ స్థలాల్లో స్త్రీ, పురుషుల సమాన హక్కులను పెంచి పోషించే సంస్కృతిగురించి మనం తప్పక ఆలోచించాలి. దీనికోసం ఇళ్లలో, వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తిలో లేక స్కూల్లో, కాలేజీలో, ఆఫీసులో కనీసం మాటల్లో కూడా మహిళలను తిట్టని ‘జీరో టాలరెన్స్’ సంస్కృతికి పట్టం కట్టాలి. ప్రతి ఇంటిలో వాడుతున్న భాష తీరును ఇరుగుపొరుగులు పరిశీలిస్తుండాలి. ఇంట్లో కానీ, బయట కానీ ఎవరైనా బూతు భాషను వాడారంటే అలాంటి వారిని ఖండించి, అవమానపర్చాలి. సామాజిక పరంగా అవమానాలకు గురికావడం, మహిళల దృఢవైఖరి కారణంగా ఇప్పుడు గ్రామాల్లో కూడా ఆడవారిని లేక భార్యను కొట్టడం నుంచి మనం బయటపడుతున్నాం. అలాగని కుటుం బంలో, ఇంట్లో, బయట ఏ మహిళనూ మనదేశంలో ఎవరూ కొట్టలేదని దీని అర్థం కాదు. గతంతో పోలిస్తే మహిళలను చితకబాదడం తగ్గుముఖం పడుతోంది. అదేవిధంగా మహిళలను బూతులాడటం, రేప్ చేయడం, చంపడం వంటివి కూడా ఒక క్రమంలో తగ్గిపోతాయి. సమాజంలోని ప్రతి చోటా మహిళలను అమితంగా గౌరవించడాన్ని నేర్పినట్లయితే కొంతకాలానికి మహిళలను వేధించడం, హింసిం చడం పూర్తిగా తగ్గిపోతుంది కూడా. చివరగా, కుటుంబం పాఠశాల, మత సంస్థలు, మార్కెట్ స్థలాలు అన్నీ కలిసి స్త్రీ, పురుషులు సమానులు అనే భావాన్ని పాటిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటటువంటి సాంస్కృతిక విధానాలను పాటించాలి. ఏ ఇతర సంస్థల కంటే పాఠశాలకు ఈ అంశంలో మరింత అధిక పాత్ర ఉంది. స్త్రీల గౌరవాన్ని, శ్రమగౌరవాన్ని పెంచేటటువంటి సిలబస్‌ను రూపొందించాలి. మహిళల శ్రమ, వారి సృజనాత్మకతే జాతి పురోగమనానికి, అభివృద్ధికి కీలకం అని మన పిల్లలకు పాఠశాలల్లో బోధించనట్లయితే, భవిష్యత్తులో కూడా అత్యాచారాలు, వేధింపుల వంటి ఉపద్రవాలు మనల్ని పీడిస్తూనే ఉంటాయి. అందుకే స్త్రీ, పురుషుల సమానత్వం కోసం ఒక సాంస్కృతిక విప్లవాన్నే ప్రారంభిద్దాం రండి. దీనికోసం ఇంట్లో, స్కూల్లో, కాలేజీలో, ఆలయంలో, మసీదులో, చర్చిలో, ఆఫీసుల్లో, షాపుల్లో ప్రతిచోటా ఈ అంశంపై చర్చను ప్రారంభిద్దాం. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
జార్జిరెడ్డిని తల్చుకోవడం అంటే..!
రెండు దశాబ్దాల పాటు ఉస్మానియా క్యాంపస్‌లో యువవిద్యార్థుల మనస్సులపై జార్జిరెడ్డి వేసిన ప్రభావం అసాధారణమైనది. అతడి భావజాలం సామాజిక శాస్త్రాల విద్యార్ధులపై బలమైన ప్రభావం వేస్తూ వచ్చింది. సమాజంలోనూ, క్యాంపస్‌లోనూ ఛాందస, కులోన్మాద భావజాలాలతో ఘర్షించటంలో జార్జిరెడ్డి సాగించిన వీరోచిత పోరాటానికి సినిమా చిత్రికపట్టింది. 1970లలో జార్జిరెడ్డి, 2010లలో రోహిత్ వేముల ఈ కారణంతోనే వేలాదిమంది విద్యార్థులను కదిలించారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలనే భావం ఇద్దరిలోనూ రగులుతుండేది. తిరుగుబాటు మనస్తత్వం కలిగిన వారితో చర్చించాలే తప్ప అణిచివేయకూడదు. సమాజంలో సమూల మార్పులను తీసుకొచ్చే మానసిక సమర్థతలను అణిచివేస్తే జాతికే నష్టం వాటిల్లుతుంది. జార్జి వంటి యువకులు పుట్టుకొస్తే వారిని పెంచి పోషించాలి తప్ప తుంచేయకూడదు. తెలుగు సినిమా ‘జార్జిరెడ్డి’ని ఎంతో ఆస క్తితో చూశాను. ప్రగాఢ అభినివేశంతో కూడిన అతడి అకడమిక్ పాండిత్య దృక్పథంతో ప్రభావితమైన వ్యక్తుల్లో నేనూ ఒకడిని. జార్జిరెడ్డిని పాశవికంగా హత్య చేసిన రెండేళ్ల తర్వాత అంటే 1974లో నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సులో చేరాను. నేను చదివిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ.. జార్జిరెడ్డి అనే అసాధారణ మేధావి ఫైర్ బ్రాండ్ తరహా కార్యాచరణకు ప్రధాన ఆకర్షణగా మారింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అతడు ఫిజిక్స్ విద్యార్థి. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆ రోజుల్లో రాజకీయ చర్చలకు, క్రియాశీల ఆచరణకు కేంద్రస్థానమై వెలుగొందుతుండేది. మరణం తర్వాత కూడా జార్జిరెడ్డి భావజాలం అనేకమంది సామాజిక శాస్త్రాల విద్యార్ధులపై బలమైన ప్రభావం వేస్తూ వచ్చింది. తదనంతర కాలంలో వీరే అనేక రంగాల్లో నాయకత్వం వహించారు. ప్రకృతి శాస్త్రాలు, ఇంజనీరింగ్, న్యాయశాస్త్ర విద్యార్థులు సైతం జార్జిరెడ్డి భావాలతో ప్రభావితులయ్యారు. సామాజిక సమస్యలపట్ల బాధ్యత ప్రదర్శిం చిన అనేకమంది విద్యార్థులు ఈ జ్ఞాన విభాగాలనుంచి కూడా ఆవిర్భవించారు. మరణించాక రెండు దశాబ్దాల పాటు ఓయూ క్యాంపస్‌లో యువ మనస్సులపై జార్జిరెడ్డి వేసిన ప్రభావం అనన్యసామాన్యమైంది. ఆనాటికి పెద్దగా రచనలు కూడా చేసి ఉండని ఒక పాతికేళ్ల విద్యార్థి మూడు అంశాలలో రాటుదేలడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అవేమిటంటే, 1. జ్ఞానాన్ని ఆయుధంగా చేసుకోవడం. 2. దాన్ని అతి స్వల్ప కాలంలోనే పీడిత కులాల విముక్తికోసం ఉపయోగించడం. 3. తాను పోరాడిన పీడకుల చేతుల్లో అమరత్వం పొందడం. సోషలిస్టు విప్లవ సిద్ధాంతాన్ని పేదలకు, దిగువ కులాలకు అనుకూలమైనదిగా మల్చడంలో జార్జిరెడ్డి నిర్వహించిన పాత్ర సాధారణ ప్రజలను కూడా ఆకట్టుకునేలా చేయడంలో ‘జార్జిరెడ్డి’ సినిమా చక్కటి విజయం సాధించింది. సమాజంలోనూ, క్యాంపస్‌లోనూ సంఘ వ్యతిరేక, కులోన్మాద భావజాలాలతో భావోద్వేగంగా ఘర్షించ టంలో జార్జి సాగించిన వీరోచిత పోరాటానికి సినిమా చిత్రికపట్టింది. నాటి నుంచి నేటి దాకా ప్రభుత్వాలు, రాజకీయ శక్తులు సాగిస్తున్న విద్యా వ్యతిరేకమైన ఎజెండా నేటికీ అనేక క్యాంపస్‌లలో సమస్యగా కొనసాగుతూనే వస్తోంది. అలాంటి బాహ్య శక్తుల ప్రభావానికి సగటు విద్యార్థులు, కండబలం, అధికార బలం ఉన్న శక్తులు సులువుగా లోనయ్యేవారు. అయితే విద్యార్జనలో కానీ, భౌతిక పోరాటాల్లో కానీ అలాంటి శక్తులందరినీ జార్జిరెడ్డి తోసిపుచ్చేశాడు. ఆయనలోని ఈ మహామూర్తిమత్వాన్ని సినిమా చాలా చక్కగా ప్రదర్శించింది. 1970లలో జార్జిరెడ్డి, 2010లలో రోహిత్ వేముల ఈ కారణంతోనే యూనివర్సిటీ క్యాంపస్‌లలోని వేలాదిమంది విద్యార్థులను ప్రభావితం చేశారు. మనుషులను పీడించే వారి ఏజెంట్ల చేతుల్లో 1972 ఏప్రిల్ 14న హత్యకు గురయ్యేనాటికి జార్జి రెడ్డి వయస్సు సరిగ్గా పాతికేళ్లు. అదే పీడకుల దౌర్జన్యానికి నిరసన తెలుపుతూ రోహిత్ వేముల 2016 జనవరి 17న ఆత్మహత్య చేసుకున్నాడు. పీడన అనైతికం, సంఘ వ్యతిరేకమనే సామాజిక–ఆత్మిక, సాంస్కృతిక మూలాల విషయంలో ఈ ఇరువురి స్వభావం ఒక్కటే. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలనే భావం ఇద్దరిలోనూ రగులుతుండేది. తమ తల్లుల్లోని సానుకూల ఆధ్యాత్మిక నైతిక భావజాలం ప్రభావంతో వీరిరువురు పేదలకు, పీడితులకు అనుకూలమైన ఉమ్మడి లక్ష్యాన్ని కలిగి ఉండేవారు. జార్జి తల్లి లీల, రోహిత్ తల్లి రాధిక ఇద్దరూ ఆ ఆధ్యాత్మిక నైతికతతోనే వారిని ఉగ్గుపాలనుంచి పెంచి పోషించారు. ఆ రోజుల్లో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలే జార్జిరెడ్డి అజెండాగా సినిమా ప్రదర్శించినప్పటికీ, పీడితుల పట్ల, పేదల పట్ల సానుభూతి చూపడంలో అతడి కుటుంబ నైతికత ఆ రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా చెలరేగిన సోషలిస్టు భావతరంగాలతో మిళితమైంది. సోవి యట్ యూనియన్ అగ్రరాజ్యంగా ఎదగడం, చైనాలో సాంస్కృతిక విప్లవం.. ఫిడెల్ క్యాస్ట్రో, చేగువేరా నాయకత్వంలో సాగిన క్యూబన్ విప్లవం వంటివి ప్రపంచవ్యాప్తంగా యువతను ప్రభావితం చేస్తూ వచ్చాయి. ఇవి జార్జిరెడ్డిపై కూడా తీవ్రప్రభావం చూపాయి. ఆ రోజుల్లో ప్రపంచమంతటా విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లలో సాగిన వియత్నాం అనుకూల, అమెరికన్ వ్యతిరేక ఉద్యమాలు ప్రజాతంత్ర పౌర హక్కులకు, సోషలిస్టు ప్రచారానికి ప్రేరణనిచ్చాయి. తీవ్రమైన మేధోపరమైన అభినివేశం కలవారు తరగతి గదుల్లో, లైబ్రరీల్లో లోతైన అధ్యయనాలు, చర్చలు జరుపుతూనే వీధి పోరాటాల్లో కూడా పాల్గొనేవారు. జార్జిరెడ్డి అసాధారణ మేధోశక్తికి ఇదే ప్రాతిపదిక అయింది. తనలోని ఈ అసాధారణ శక్తే మాలో అనేకమందిని ప్రభావితం చేసింది. కానీ అతడి తర్వాత ఈ రెండు శక్తులను ఏ ఒక్కరూ తమలో నిలుపుకోలేకపోయారు. ఆయన అనుయాయుల్లో అనేకమంది తర్వాత నక్సలైట్ ఉద్యమాలవైపునకు తరలిపోయారు. కొంతమంది సీరియస్‌గా అధ్యయనంపై దృష్టిపెట్టి పాక్షిక విజయాలు మాత్రమే సాధించారు. మాలో ప్రతి ఒక్కరూ కొన్ని కొన్ని విడి విడి రంగాల్లో తమ ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ ఒక్కరం కూడా జార్జిరెడ్డి తర్వాత అంతటి ప్రభావం కలిగించలేకపోయామన్నది వాస్తవం. జార్జిరెడ్డి ప్రతిభాపాటవాలను ప్రస్తుతతరం విద్యార్థుల ముందు ప్రదర్శించడానికి ఈ సినిమా గట్టి కృషి చేసింది. అంత చిన్న వయస్సులోనే అలాంటి అసాధారణ శక్తియుక్తులను ప్రదర్శించిన వారు మానవుల్లో చాలా తక్కువమందే ఉంటారు. వీరు ప్రపంచం దృష్టిలో అద్భుత వ్యక్తులుగా వెలుగొందుతుంటారు. అసాధారణమైన మానవుల్లో దేవుడు విభిన్నమైన బీజాలు నాటతాడు అని సామెత. సైన్స్, ఆర్ట్స్, నైతికత వంటివి ఇలాంటి వారి ద్వారానే ప్రకాశిస్తుంటాయి. ఇలాంటి అసాధారణమైన అమరుల జీవిత చిత్రాన్ని భారతీయ జీవిత చిత్రాల వారసత్వం చాలా అరుదుగా మాత్రమే చిత్రించింది. భారతీయ సినిమా పరిశ్రమ పాటలు, డ్యాన్స్ మాయాజాలానికి మించి ఎదగలేకపోయింది. జార్జిరెడ్డిపై వచ్చిన ఈ సినిమా ప్రాంతీయ చిత్రమే అయినప్పటికీ, అతి చిన్న బడ్జెట్‌తోనే పూర్తయినప్పటికీ, విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రంగా తన ముద్ర వేసింది. ఈ సినిమాలో గొప్పతనం ఏమిటంటే, బాల్యదశలో జార్జిరెడ్డిలో రూపొందిన విశిష్ట వ్యక్తిత్వంపై ఇది కేంద్రీకరించడమే. తన తల్లి నుంచి ప్రతివిషయంలోనూ అతడు సానుకూలమైన మానవీయ దృక్పథాన్ని పుణికిపుచ్చుకున్నాడు. అదే సమయంలో తనలో అంతర్లీనంగా ఉండిన అపారమైన మానవీయ సహజాతాన్ని పాటించడంలో తల్లి ఊహలను కూడా అతడు మించిపోయాడు. సామాజికంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా అలాంటి సహజాత గుణంతో పెరిగి పెద్దవడం జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. కుటుంబం నుంచి పాఠశాలకు, యూనివర్సిటీకి ఎదిగే క్రమంలో తనలోని సృజ నాత్మకమైన ప్రోత్సాహక గుణాన్ని, మంచితనాన్ని, మేధోపరమైన అభినివేశాన్ని అట్టిపెట్టుకుని పెంచుకుంటూ రావడం చాలా ముఖ్యమైన విషయం. పిల్లల వ్యక్తిత్వాలను చంపేయడం, లేదా ఇలాంటి వ్యక్తుల ప్రధాన స్ఫూర్తిని చంపేయడాన్ని భారతీయ పౌర సామాజిక నైతిక చట్రాలు ఒక ధోరణిగా కలిగి ఉంటున్నాయి. ఇలాంటి స్ఫూర్తిని వారిలో చంపేశాక మన సమాజంలో ఆడ, మగ వ్యక్తులు ఎక్కువ కాలం బతకవచ్చు కానీ చరిత్రను మాత్రం సృష్టించలేరు. చిన్నవయసులోనే హత్యకు గురైనప్పటికీ జార్జిరెడ్డి, రోహిత్ వేముల మన జీవిత కాలంలోనే చరిత్ర సృష్టించారు. స్వాతంత్య్రపోరాటంలో భగత్‌సింగ్ అదే పని చేశారు. వీరు వదిలివెళ్లిన చరిత్ర అత్యంత శక్తివంతమైన సానుకూలతను కలిగి ఉంది, అనేకమంది తరుణ మనస్కులు అనుసరించదగిన సృజనాత్మక కార్యదీక్షను వీరు చరిత్రలో నిలిపివెళ్లారు. క్యాంపస్‌లలో అలాంటి చురుకైన మనస్సు కలవారు అడుగుపెట్టకుండా చేయడానికి ఇప్పుడు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుటుంబం, పాఠశాల, విశ్వవిద్యాలయం ప్రతిచోటా సంప్రదాయ జీవన వాతావరణం ఉంటున్న పరిసరాలు సృజనాత్మక ప్రయోగాలను అనుమతించడం లేదు. నూతన విషయాలపై ప్రయోగాలు చేయదలిచిన యువత ప్రతి సంప్రదాయానికి, ఛాందసత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. తిరుగుబాటు మనస్తత్వం కలిగిన వారితో చర్చించాలే తప్ప అణిచివేయకూడదు. సమాజంలో సమూల మార్పులను తీసుకొచ్చే మానసిక సమర్థతలను అణిచివేస్తే జాతికే నష్టం వాటిల్లుతుంది. దేశంలో ఏ మారుమూలైనా జార్జి వంటి యువకులు పుట్టుకొస్తే వారిని పెంచి పోషిం చాలి. చివరగా ఈ సినిమాను అన్ని భాషల్లోకీ డబ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాసకర్త: ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
పేదలకు ఇంగ్లిష్ విద్య అందకుండా కుట్ర
గ్రామీణ ప్రాంతాల్లోని దిగువ కులాలకు చెందిన నిరుపేద పిల్లలు తమ గ్రామాల్లో ఇంగ్లిష్ చదివినంత మాత్రానే తెలుగు భాష చనిపోతుందా? అలాగైతే ప్రైవేటు స్కూళ్లల్లో చదివిన, చదువుతున్న పిల్లలున్న సంపన్నుల కాలనీల్లోని ఇళ్లలో తెలుగు ఎందుకు చనిపోలేదు? పేద పిల్లలు కూడా తమలాగే ఇంగ్లిష్ నేర్చుకోవాలని వైఎస్ జగన్ కోరుకుంటున్నారు. ఆయన విధానంలో తప్పేముంది? బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ సిటీల్లో తెలుగు అదృశ్యం కానప్పుడు పేద ప్రజలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నంత మాత్రాన వారి ఇళ్లలోంచి తెలుగు ఎలా మాయమవుతుంది? పేద ప్రజల జీవితాల్లో సమూల మార్పు తీసుకురాగల ఈ కీలక విధానాన్ని వ్యతిరేకిస్తే తమకు మనుగడే ఉండదని చంద్రబాబు, ఆయన వెనకున్న ఇంగ్లిష్ మీడియం వ్యతిరేకులు గ్రహిస్తే మంచిది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 2020–21 విద్యా సంవత్సరంలో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన అమలు చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా ఉంచుతూనే ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తారని సీఎం తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభం కావడానికి దాదాపు ఏడు నెలలకు ముందే ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఇది హడావుడిగా తీసుకున్న చర్య కాదు. అలాగే రాష్ట్ర ప్రజలకు ఇది తెలీని విషయమూ కాదు. ఇది వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోలోని కీలకమైన నవరత్నాల్లో ఒకటి. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయకపోతే అదే ఒక సమస్యగా మారి జగన్ ప్రభుత్వాన్ని మనమే తప్పు పడతాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగిష్‌ను ప్రధాన బోధనా భాషగా చేస్తామని చెప్పినందునే ప్రజలు ఆయనకు ఓట్లువేసి గెలిపించారు. కానీ ప్రభుత్వం చేపట్టిన ఈ విద్యాసంస్కరణలను ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మాతృభాషా పరిరక్షణ ముసుగులో ఇంగ్లిష్ మీడియం ప్రైవేటు పాఠశాలలకు చెందిన దళాలను రోడ్లపైకి ఎందుకు పంపుతున్నారు? ఆయన మనవడు దేవాన్ష్ మాతృభాష ఏది? అతని తల్లిదండ్రులు లోకేష్, బ్రాహ్మణి తెలుగును ఒక సబ్జెక్టుగా కూడా బోధించని ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదివారు. పైగా వారు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి అక్కడి ఉచ్ఛారణరీతిని ఒంటబట్టించుకున్నారు. మరి వారిద్దరినీ ఆంధ్రదేశంలోని ప్రపంచశ్రేణి తెలుగు బోధనా కేంద్రానికి చంద్రబాబు ఎందుకు పంపలేకపోయారు. మాతృభాష అనేది ఎన్నటికీ మారని ఒక స్థిరమైన వస్తువా లేక పిల్లల తల్లి కొత్త భాషలను నేర్చుకుంటూ, వివిధ భాషల్లో పిల్లలతో మాట్లాడుతూ మార్పు చెందుతూ ఉండదా? ఇంగ్లిష్ భాష అనేది కేవలం మనోభావాలను ప్రేరేపించే సాధనమా లేక ఒక వ్యక్తిని, కుటుంబాన్ని, ప్రాంతాన్ని, జాతిని అభివృద్ధి పరచే సాధనమా? ఇంగ్లిష్ జాతి వ్యతిరేకమైనదీ, లేక భారతీయ వ్యతిరేకమైనదీ లేక తెలుగుతల్లికి వ్యతిరేకమైనదీ అయితే మన జాతి నిర్మాతలు ఆ భాషను ఎందుకు కొనసాగించారు? పైగా దేశాన్ని, రాష్ట్రాలను పా లిస్తున్న కులీనవర్గాలలో మాత్రమే ఇంగ్లిష్ ఎందుకు మనగలిగి ఉం టోంది? భారతదేశంలోని యువతరం పాలకులు ఇంగ్లిష్ మీడి యంలో మాత్రమే ఎందుకు చదువు నేర్చుకుంటున్నారు? భారతీయ గ్రామాల్లోని నిరుపేద, దిగువ తరగతి కులాలు ఇంగ్లిష్‌లో విద్య నే ర్చుకున్న బ్రాండ్ నూతన పాలకుల భారతీయ క్లబ్లో చేరకూడదా? ఈ సంవత్సరం నవంబర్ 9 నాటి ఈనాడు పత్రిక సంపాదకీయం కేసి చూస్తే, ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లిష్ వ్యతిరేక ఆందోళనలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లోని దిగువ కులాలకు చెందిన నిరుపేద పిల్లలు తమ గ్రామాల్లో ఇంగ్లిష్ మీడియంలో చదివినంత మాత్రానే తెలుగు భాష చనిపోతుందా? అలాగైతే ప్రైవేట్ స్కూళ్లలో మాత్రమే చదివిన, చదువుతున్న పిల్లలను కలిగిన సంపన్నుల కాలనీల్లోని ఇళ్లలో తెలుగు ఎందుకు చనిపోలేదు? ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో మాత్రమే చదవడం ద్వారా వీరు దేశానికి, రాష్ట్రాలకు పాలకులుగా ఎలా మారారు? జగన్ మోహన్‌రెడ్డి నుంచి అఖిలేష్ యాదవ్ వరకు, రాహుల్ గాంధీ నుంచి నిర్మలా సీతారామన్ వరకు నారాలోకేష్ నుంచి కేటీ రామారావు వరకు సచిన్ పైలట్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా, ఆదిత్య థాక్రేల వరకు యువతరం పాలకులందరూ ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న నేతలే కదా. మరి గ్రామీణ నిరుపేదలు, దిగువ కులాలకు చెందిన యువత వీరిలాగా రూపొందకూడదా? ప్రభుత్వ పాఠశాలల్లో తప్పితే వీరు ఏ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుకోగలరు? పేద పిల్లలు కూడా తమలాగే ఇంగ్లిష్ నేర్చుకోవాలని వైఎస్ జగన్ కోరుకుంటున్నారు. ఆయన పాలసీలో తప్పేముంది? జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడం ద్వారా దేశంలోనే తొలి భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను ధ్వంసం చేస్తోందన్న వాదన పరమ హాస్యాస్పదమైనది. ఈనాడు అభిప్రాయం ప్రకారం మారుమూల పల్లెల్లో, గిరిజన ప్రాంతాల్లో నివసిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య ద్వారా లబ్ధి పొందుతున్నవారు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలట. ఇది నిజంగానే ఉద్వేగపూరితమైన, మనోభావాలను రెచ్చగొట్టే వాదన తప్ప మరేమీ కాదు. తన జీవితం తొలినాళ్లలోనే దురదృష్టవశాత్తూ కన్నుమూసిన రామోజీరావు చిన్న కుమారుడు సుమన్ నిజాం కాలేజీలో నా విద్యార్థిగా బీఏ చదువుకున్నాడు. తాను ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్యా నేపథ్యం నుంచి వచ్చాడు. తన తెలుగు ఏమంత బాగుండేది కాదు. కానీ ఇంగ్లిష్‌లో మంచి వక్త. నేర్చుకోవడం పట్ల నిజాయితీతో, చిత్తశుద్ధితో కూడిన అతడి వైఖరిని నేను అభినందించేవాడిని. తన క్లాసులో నేను అంతర్జాతీయ సంబంధాల గురించిన సబ్జెక్టును బోధించేవాడిని కాబట్టి తరచుగా నా వద్దకు వచ్చి ఆ సబ్జెక్టుపై చర్చించేవాడు. ఈ సందర్భంగా నాలో రేగుతున్న ప్రశ్నలు ఏవంటే.. అంత భారీ స్థాయి తెలుగు మీడియా పరిశ్రమను నిర్వహిస్తున్న రామోజీరావు తన కుమారుడిని మాత్రం ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఎందుకు చేర్పించారు? తన కుమారుడిని అతడి మాతృభాష అయిన తెలుగు బోధించే పాఠశాలలో ఎందుకు చేర్పించలేదు? గ్రామీణ ప్రాంతాల్లోని పేదతల్లుల పిల్లలు తమ గ్రామాల్లోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటే దాంట్లో తప్పేముంది? బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ సిటీల్లో తెలుగు అదృశ్యం కానప్పుడు, పేద ప్రజలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నంత మాత్రాన వారి ఇళ్లలోంచి తెలుగు ఎలా మాయమవుతుంది? రామోజీరావు కూడా హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో తన భార్య పేరిట రమాదేవి పబ్లిక్ స్కూల్ అనే ఇంగ్లిష్ మీడియం పబ్లిక్ స్కూల్‌ని చాలా సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఇంగ్లిష్ మీడియం స్కూలు తన సేవలను ఎలా అందించింది, ఇప్పటికీ ఎలా అందిస్తోంది? తన వినోదాత్మక చానల్స్‌ను నడుపుతున్న ప్రధాన యాంకర్ల స్కూల్ విద్యా నేపథ్యం గురించి సర్వే చేయడానికి రామోజీరావు అనుమతించగలరా? వీరిలో ఎక్కువమంది ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్యా నేపథ్యం నుంచి వచ్చినవారు కనుకనే వీరు చాలా తరచుగా ఇంగ్లిష్ మాట్లాడుతుండటాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. రామోజీరావు అనుబంధం కలిగి ఉన్న చిత్రపరిశ్రమలో సర్వే నిర్వహిద్దాం. యువ హీరోలు, హీరోయిన్లు మొత్తంగా ఇంగ్లిష్ మీడియంలో చదివినవారే కానీ వీరంతా తెలుగు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు మరి. రామోజీరావు, చంద్రబాబు కుటుంబ నెట్‌వర్క్‌లతో సంబంధమున్న ఈ శక్తులతో సమాన శ్రేణిలో నిరుపేద దళితులు, బీసీలు, ఆదివాసీలకు చెందిన పిల్లలు ఇంగ్లిష్ నేర్చుకోవడానికి వ్యతిరేకంగా కుట్ర ఏదైనా జరుగుతోందా? దేశంలో బాంబే ప్రావిన్స్‌లో గోపాలకృష్ణ గోఖలే, బాలగంగా ధర తిలక్‌తో పాటు ఇంగ్లిష్ విద్య నేర్చుకున్న తొలి శూద్రుడు మహా త్మా జ్యోతిరావు పూలే. అంటే ఇంగ్లిష్ విద్యతో ఆనాటి నుంచే దిగువ కులాల విముక్తి ప్రారంభమైంది. 1947లో ఇంగ్లిష్‌ను జాతీయ భాష గా గుర్తించాలని, ప్రభుత్వపాఠశాలల్లో ఇంగ్లిష్‌ను తప్పకుండా బోధించాలని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పట్టుపట్టినప్పటికీ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఇంగ్లిష్ బోధనను ప్రైవేట్ స్కూల్ విద్యకు పరి మితం చేసింది. ప్రాంతీయ భాషలను ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా భాషలుగా స్వీకరించారు. ఈ విధానం విద్యా వ్యవస్థలో సమానహక్కులను తిరస్కరించింది. పాలక వర్గ భాషను నిరుపేదలు, నిమ్న కులాల వారికి నిరాకరించడంలో భాషే ప్రధాన పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని స్కూల్ విద్యను సమాన స్థాయికి తీసుకువచ్చే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. చంద్రబాబు, ఆయన చుట్టూ ఉండే మీడియా నెట్వర్క్ దీన్ని వ్యతిరేకిస్తే అందులోని అంతరార్ధాన్ని గ్రామీణ ప్రాంతాల్లోని దిగువ కులాలవారూ, పేద ప్రజానీకం గమనించలేకపోరు. పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగల అత్యంత నిర్ణయాత్మకమైన ఈ కీలక విధానాన్ని వ్యతిరేకిస్తే తమకు మున్ముందు మనుగడే ఉండదని చంద్రబాబు, ఆయన వెనకున్న ఇంగ్లిష్ మీడియం వ్యతిరేకులు గ్రహిస్తే మంచిది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త రాజకీయ సిద్ధాంతవేత్త, సామాజిక కార్యకర్త -
అమ్మఒడి ఒక మార్గదర్శిని
స్వాతంత్య్రానంతరం ఒక రాష్ట్రంలో తొలిసారి అమలుకానున్న విద్యా సంస్కరణగా అమ్మఒడి పథకం గుర్తింపు పొందనుంది. ఆంధ్రప్రదేశ్‌లో విద్యాపరమైన అసమానతలను తుడిచిపెట్టగల శక్తి దీనికి ఉంది. ఈ దేశంలో పుట్టిన పిల్లలందరి భవిష్యత్తును డబ్బు నిర్ణయిస్తున్న స్థితిలో పిల్లల సంక్షేమానికి తల్లుల బ్యాంకు ఖాతాలకు ఏటా రూ. 15 వేలతో ఆర్థిక భరోసాని కల్పించే వినూత్నపథకం ఇది. ఏపీ ప్రభుత్వం ఈ పథకం కోసం కేటాయించనున్న రూ. 6,455 కోట్లతో పేద పిల్లలు చదువుకునే పరిస్థితుల్లో సమూల మార్పు వస్తుంది. తెలుగు సబ్జెక్టును కొనసాగిస్తూనే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను తప్పనిసరి చేస్తున్న కొత్త విద్యా పథకం దేశానికే మార్గదర్శకం కానుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, విద్యా, మార్కెట్‌పై అమ్మ ఒడి గణనీయమైన ప్రభావాలను చూపనుంది. ఆర్థిక పరిస్థితులు దుర్భరంగా ఉంటూ కూడా తమ పిల్లలను బడికి పంపుతున్న తల్లులందరి బ్యాంక్ ఖాతాలోకి విద్యా ఖర్చు కింద రూ. 15,000లను బట్వాడా చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగ¯Œ మోహన్‌రెడ్డి కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ పథకం పేరు అమ్మఒడి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రమాణాల రీత్యా, దారిద్య్ర రేఖకు దిగువన కనీస మాత్రం ఆదాయ వనరులను కలిగి ఉండి, తమ పిల్లలను 1 నుంచి 12వ తరగతి వరకు స్కూళ్లకు పంపుతున్న తల్లులు ఈ పథకం కింద నగదు సహాయం అందుకోగలరు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల అమలుకు తప్పనిసరైన తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. దీనికోసం ఏపీ ప్రభుత్వం రూ. 6,455 కోట్లను కేటాయించింది. దీనికి ముందుగా సీఎం మరొక కీలక ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా కలిగి ఉంటూనే ఇంగ్లిష్ మీడియంలోకి మార్చివేస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. స్వాతంత్య్రానంతరం ఒక రాష్ట్రంలో తొలిసారి అమలుకానున్న విద్యా సంస్కరణగా ఇది గుర్తింపు పొందుతుంది. రాష్ట్రంలో విద్యా పరమైన అసమానతలను తుడిచిపెట్టగల శక్తి దీనికి ఉంది. స్వాతంత్య్రం తర్వాత పాఠశాల విద్యా రంగాన్ని నిర్వహించుకునే అధికారం రాష్ట్రాలకు దఖలు పడినప్పటికీ, కేంద్రప్రభుత్వం దుర్మార్గమైన పాఠశాల విద్యా వ్యవస్థను నిర్వహించడానికి అనుమతించింది. దీని ప్రకారం పేదవారు అరకొర నిధులతో నడిచే ప్రాంతీయ భాషా ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే తమ పిల్లలను పంపించాలి. కానీ, తల్లిదండ్రులకు ఎలాంటి ఆర్థిక సహాయం లభించదు. మరోవైపున నగర, పట్టణ ప్రాంతాల్లోని సంపన్నులు మెరుగైన మౌలిక వసతులు ఉండే ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ స్కూళ్లకు తమ పిల్లలను పంపించగలిగేవారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పిల్లల భవిష్యత్తును డబ్బు నిర్ణయిస్తుందన్నమాట. కుల/వర్గ ప్రమాణాలను బట్టి చూస్తే శ్రామిక ప్రజారాసులతో ఉండే దిగువ కులాలను, ఇన్ని దశాబ్దాలుగా సరైన వసతులు కూడా లేని స్కూల్ విద్య కొనసాగుతున్న ప్రాంతీయ భాషల్లో చదువుకే పరిమితం చేశారు. అగ్రకులాల సంపన్నులు మాత్రం తమ పిల్లలను అంతర్జాతీయ అనుసంధానం ఉన్న ఇంగ్లిష్ మీడియం పాఠశాలలకు పంపిం చేవారు. ఇవి మెరుగైన వసతులతో ఉండేవని చెప్పనవసరం లేదు. ఈ పథకంతోపాటు వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులను మెరుగుపరుస్తామని వైఎస్ జగన్ వాగ్దానం చేశారు. జగన్ ప్రతిపాదించిన అదనపు చేర్పులేవీ లేకుండానే ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. కమ్యూనిస్టు పార్టీలు, మితవాద జాతీయవాద పార్టీలైన బీజేపీ, శివసేన వంటి అన్ని రాజ కీయ పార్టీలు దేశంలో కాంగ్రెస్ ప్రతిపాదిత స్కూల్ విద్యా సూత్రాన్నే ఆమోదించాయి. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఒకే రకమైన విద్యావ్యవస్థను కొనసాగిస్తూ వచ్చాయి. చివరకు కపటత్వంతో కూడిన ఉదారవాద మేధావులు సైతం బోధనా మాధ్యమం గురించి, పేద తల్లులకు అత్యవసరమైన ఆర్థిక సహాయం అందించడం గురించి మాట్లాడకుండా నాణ్యమైన పాఠశాల విద్య గురించి లెక్చర్లు దంచుతూ వచ్చారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన అమ్మఒడి తరహా ఆర్థిక సహాయం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అనేవి ఈ మసకను తొలగించేశాయి. దేశంలోనే ఇది మార్గదర్శకం కానుంది. దేశచరిత్రలో తొలిసారిగా అమ్మఒడి తరహా విద్యాపరమైన ఆర్థిక ప్యాకేజీ కింద తండ్రి ఖాతాలోకి కాకుండా తల్లి ఖాతాలోకి నేరుగా నగదు వచ్చి చేరనుంది. ఇది భారతీయ పాఠశాల విద్యావ్యవస్థ ప్రాథమిక నిర్మాణాన్ని దానితోపాటు మార్కెట్‌ని కూడా మార్చివేయనుంది. ఇది దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యుత్తమమైన భవిష్యత్ స్త్రీ–పురుష అధికారిక సంబంధాల వృద్ధి వ్యవస్థగా చెప్పాలి. ఈ తరహా విద్యా నమూనా రాష్ట్రంలోనూ, దేశంలోనూ కలిగించే ప్రభావాలు ఏమిటి? ఈ పథకంలో భాగంగా నాణ్యమైన ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్య మారుమూల పల్లెటూరి చిన్నారిని సైతం జాతీయ, ప్రాంతీయ విజ్ఞాన వ్యవస్థలతోపాటు అంతర్జాతీయ విజ్ఞాన వ్యవస్థలతో కూడా అనుసంధానం చేస్తుంది. కాబట్టి ప్రాంతీయ, ప్రపంచస్థాయి విజ్ఞానం చక్కగా అనుసంధానమవుతాయి. ఉత్పత్తి మూలాలను కలిగిన కుటుంబ నేప«థ్యం గల పిల్ల లకు స్కూలు చుట్టూ ఉన్న ఉత్పత్తి క్షేత్రాలు శ్రమపట్ల గౌరవం ప్రాతిపదికతో ఉండే జీవితంతో, విజ్ఞానంతో పెరిగే అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ తరహా ఉత్పత్తి, విజ్ఞాన అనుసంధానంలో పట్టణ పిల్లలు బలహీనులు. పల్లె వాతావరణంలో లభించే ఉత్తమమైన విద్య భాషలను సత్వరం నేర్చుకునేలా పిల్లలను తీర్చిదిద్దుతాయి. తల్లిదండ్రుల కష్టాలు, సంతోషాలతో భాగమైన పిల్లలు హాస్టళ్లలో ఉండి చదువుకునే పిల్లలకంటే ఎక్కువ అనుభవజ్ఞులై ఉంటారు. నా దృష్టిలో అమ్మఒడి పథకం ఏపీలో ఒక కొత్త, సానుకూల మార్కెట్ వికాసాన్ని ఆవిర్భవింప చేస్తుంది. తండ్రిలాగా తల్లి తన ఖాతాకు జమ అయిన నగదును లిక్కర్ మార్కెట్‌కు ధారపోయదు. ఆమె దాన్ని మంచి స్కూల్ డ్రెస్, చక్కటి షూలు, నాణ్యమైన తిండిపై వెచ్చిస్తుంది. గ్రామాల్లో, పట్టణాల్లో ఈ తరహా కొత్త కొనుగోలు సామర్థ్యం మార్కెట్ వికాసాన్ని సృష్టిస్తుంది. ప్రభుత్వం అందించనున్న రూ. 6,455 కోట్ల డబ్బు పిల్లల శ్రేయస్సు, విద్యాపరమైన మెరుగుదల అవసరాలను తీర్చే మార్కెట్లలోకి ప్రవహిస్తుంది. ఇది ఒక కొత్త సాంస్కృతిక గ్రామాన్ని రూపొందిస్తుంది. పాఠశాల పిల్లల జీవితాన్ని మారుస్తుంది. పిల్లలు తమ తల్లిదండ్రుల జీవితాల్లో మార్పు తీసుకొస్తారు. నిరుపేద కుటుంబాల్లోని పిల్లల ఆరోగ్యాన్ని అమ్మ ఒడి గణనీయంగా మెరుగుపరుస్తుంది. తల్లి తన పిల్లలలో సంవత్సరానికి రూ. 15,000ను సంపాదించే అర్జనాపరులను చూస్తుంది. కాబట్టి పిల్లల సంరక్షణ అపారంగా పెరుగుతుంది. మంచి పాఠశాల, మంచి ఆహారం, మంచి డ్రెస్, గ్రామీణ వాతావరణంలో సాగే ఆటలు పిల్లల సర్వతోముఖాభివృద్ధిని మెరుగుపరుస్తాయి. ఇది యోగా కాదు.. వ్యవసాయ పనుల్లో పాల్గొంటూనే పరుగెత్తడం, హైజంప్, లాంగ్ జంప్ తీయడం, చెట్లు ఎక్కడం, చెరువులు, కాలువలు, నదుల్లో ఈత వంటి పల్లె ఆటలు పిల్లలను అత్యంత శక్తిమంతులైన భారతీయ పౌరులుగా తీర్చిదిద్దుతాయి. ప్రస్తుతం ఆరెస్సెస్/బీజేపీలు పాఠశాలల్లో ప్రోత్సహించాలనుకుంటున్న యోగా.. చిన్నపిల్లలను బాల్యంలోనే ముసలిపిల్లలుగా మారుస్తుంది. అంటే ఒక స్థలంలో మాత్రమే కొన్ని వ్యాయామాలు చేయగల ముసలి పిల్లలు అన్నమాట. యోగా తరహాలో కూర్చుని చేసే కార్యక్రమం కాకుండా పిల్లల శరీరాలు మరింత చురుకుదనంతో, మరింత చలన స్థితిలో ఉండాలి. అందుకే ప్రభుత్వ పాఠశాలలు యోగాను కాకుండా పై తరహా శారీరక వ్యాయామం గురించి ఆలోచించాలి. యూరోపియన్–అమెరికన్ తరహా స్కూళ్లలాగా పిల్లల ఊహాశక్తిని పెంచగల మంచి పాఠశాలలు పల్లెల్లో ఉంటే, వారిలో విమర్శనాత్మక ఆలోచన చాలావరకు మెరుగుపడుతుంది. ఇంటిలోని ప్రజాస్వామికమైన, శ్రామిక సంస్కృతి వాతావరణం అటు గ్రామంలోనూ, ఇటు స్కూల్లోనూ ఉండే కుల వ్యవస్థను బలహీనపరుస్తుంది. కులపరమైన దొంతరలను, అంటరానితనాన్ని నిర్మూలించడానికి కుటుంబం కంటే పాఠశాల ఉత్తమమైన సంస్థగా ఉంటుంది. దీనికి ఒకే ఒక షరతు ఏమిటంటే, స్కూల్ సిలబస్ శ్రమగౌరవం గురించిన పాఠాలను చక్కగా పొందుపర్చగలగాలి. పవిత్రత, మాలిన్యంకి సంబంధించిన అన్ని సిద్ధాంతాలను స్కూల్ పాఠ్య పుస్తకాల నుంచి తొలగించేయాలి. పాఠ్యపుస్తకాలు చర్మకార పని, బట్టలుతకడం, క్షురక వృత్తి, పొలం దున్నడం, కుండల తయారీ గురించి పిల్లలకు తప్పక చెప్పగలగాలి. స్కూలులో పాఠం చెప్పడం, పూజారి పని చేయడం రెండింటినీ ఒకే గౌరవంతో చూడాలి. అప్పుడే పిల్లల మనస్సుల్లో మానవ సమానత్వానికి సంబంధించిన బీజాలు మొలకెత్తుతాయి. అవే అన్ని సామాజికవర్గాలు, శ్రమ సంస్కృతుల పట్ల పిల్లల ప్రవృత్తిని తీర్చిదిద్దుతాయి. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, విద్యా, మార్కెట్‌పై అమ్మ ఒడి గణనీయమైన ప్రభావాలను చూపనుంది. వచ్చే 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక భిన్నమైన రాష్ట్రంగా ఉంటుందని ప్రకటించిన స్థాయిలో ఈ పథకాన్ని అమలు చేయగలగాలి. రాష్ట్ర స్థాయిలో అమలు చేసే ఈ విద్యా విధానం ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రూపొం దించిన నూతన విద్యా విధానాన్ని సైతం మార్చివేయవచ్చు. (నేటితో ప్రజాసంకల్పయాత్రకు రెండేళ్లు. అమ్మ ఒడి పథకంఆ సంకల్పయాత్రలో ఇచ్చిన హామీల్లో భాగమే) వ్యాసకర్త: ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్, డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
మరి మతం మారితే అభ్యంతరమేల?
దేశంలో ఇతర మతాల్లోని స్త్రీల కంటే క్రిస్టియన్ మహిళలే ఉద్యోగ అవకాశాల్లో ముందంజలో ఉన్నారని ఒక ఆరెస్సెస్ మేధో బృందం తాజా అధ్యయనంలో కనుగొన్నది. క్రిస్టియానిటీ ప్రపంచవ్యాప్తంగా స్త్రీ–పురుష అసమానత్వానికి చెందిన అనేక అడ్డంకులను దాటుకుంటూ వచ్చింది. ప్రపంచంలోని ఏ మతం కంటే క్రిస్టియన్ మహిళలు నేడు మరింత స్వేచ్చగా, స్వతంత్రంగా జీవిస్తున్నారు. ఆరెస్సెస్ కూడా ఈ వాస్తవాన్ని నిష్పక్షపాతంగా అంగీకరించింది. మరి, ఎవరైనా తమకు నచ్చిన మతాన్ని ఎంచుకొనే మతపర స్వాతంత్య్రాన్ని ఆరెస్సెస్ ఎందుకు వ్యతిరేకిస్తోంది? అలా కాకుండా పేద ప్రజలు, దళితులు, ఆదివాసీలు ఎలాంటి నియంత్రణలూ లేకుండా మత స్వేచ్చను అనుభవించడానికి ఆరెస్సెస్ అనుమతించాలి. భారత్‌లో అమలులో ఉన్న అన్ని మతమార్పిడి వ్యతిరేక చట్టాలను రద్దుచేయాల్సిన సమయం ఆసన్నమైంది. భారతదేశంలోని మహిళల అభివృద్ధిపై రాష్ట్రీయ స్వయం సేవక్ మేధో బృందం 2019 సెప్టెంబర్ 19న విడుదల చేసిన ఒక చిన్న నివేదికను చూసి ఒకింత ఆశ్చర్యపడ్డాను. పుణేకి చెందిన బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. మతపరంగా చూస్తే క్రిస్టియన్ మహిళలు అత్యధిక శాతం ఉద్యోగాలు చేస్తుంటే, హిందువులు, బౌద్దులు, ముస్లింలు, జైన్లు తర్వాతి స్థానాల్లో ఉన్నారని, ఉద్యోగితా శాతం సిక్కు మహిళల్లోనే అత్యంత తక్కువగా ఉందని ఆ నివేదిక పేర్కొంది (ది హిందూ). కానీ మతంవారీగా మహిళల విద్య గురించి అది ఏమీ చెప్పలేదు. ఉద్యోగితా శాతం ఎక్కువగా ఉంది అంటే వారు అక్షరాస్యత, విద్యలోనూ ముందంజలో ఉన్నట్లే కదా? అయితే ఇతర మతాల మహిళలతో పోలిస్తే క్రిస్టియన్ మహిళలే ఎక్కువ అక్షరాస్య తను కలిగి ఉన్నారని 2011 జనాభా లెక్కల డేటా చెబుతోంది. దాని ప్రకారం క్రిస్టియన్ మహిళల్లో నిరక్షరాస్యులు 28.03 శాతం ఉండగా, హిందూ మహిళల్లో 44.02 శాతం, ముస్లిం మహిళల్లో 48.1 శాతం, బౌద్ద మహిళల్లో 34.4 శాతం నిరక్షరాస్యులుగా ఉన్నారు. విగ్రహారాధన కేంద్రంగా మనుగడ సాగిస్తున్న హిందువుల కంటే ఎక్కువగా, ఖురాన్ పఠనం కేంద్రంగా ఉండే మతం పరిధిలో జీవిస్తున్న ముస్లింలు తమ మహిళలను నిరక్షరాస్యులుగా ఉంచే యడం ఆశ్చర్యం కలిగించదు. మన దేశంలో మహిళల అక్షరాస్యత, ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలకు సంబంధించిన ప్రశ్నలు ప్రభుత్వం లేక పౌర సమాజం సమస్యలుగా కాకుండా మత–సాంస్కృతిక సమ స్యలుగా ఉంటున్నాయి. క్రిస్టియన్ మతంలో స్త్రీ–పురుషుల మధ్య ప్రజాస్వామిక సంబంధాలు ఇతర మతాలతో పోలిస్తే మరింత అభి వృద్ధి అనుకూల తత్వంతో ఉంటున్నాయని ఆరెస్సెస్ మేధో బృందం అధ్యయనం, జనాభా లెక్కల డేటా తేటతెల్లం చేస్తున్నాయి. ఆధ్యా త్మిక రంగంతోపాటు సమాజంలోని అన్ని రంగాల్లో స్త్రీ–పురుష సమా నత్వాన్ని ఏ మతమైనా ప్రసాదించకపోతే, జాతీయ అభివృద్ధితో అధి కంగా ముడిపడివుండే మహిళల పురోగతిని అది తీవ్రంగా అడ్డు కుంటుంది. మహిళలు, నల్లజాతి వంటి మైనారిటీలు విద్యను పొంది, పురుషులతో పోటీపడుతూ ఉద్యోగాల మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత పాశ్చాత్య క్రిస్టియన్ ప్రపంచం సత్వర దిశలో అభివృద్ధి చెందింది. ఆ అభివృద్ధిని వారు ఆధ్యాత్మిక ప్రజాస్వామిక ఆవరణలో కూడా ఉపయోగించారు. ప్రత్యేకించి ప్రతిభ ఆధారంగా సాగే ఉద్యోగిత పెరిగాక, స్త్రీల శక్తి సామర్థ్యాలను తలుపు వెనుక దాచి ఉంచడాన్ని విశ్వసిస్తూ వచ్చిన సమాజాలు, దేశాల కంటే.. తమ మహిళలను తలుపుల వెనుక దాచి పెట్టని, వారి లైంగికతను వాస్తవమైనదిగా, తమకు తామే నిర్వహిం చుకునేదిగా విశ్వసించిన సమాజాలు.. ప్రపంచంలో ఎక్కువగా అభి వృద్ధి చెందుతూ వచ్చాయి. స్త్రీ శరీరాన్ని కేవలం లైంగిక వస్తువుగా, పిల్లల్ని కనే యంత్రంగా చూస్తూవచ్చిన పురుష కేంద్రక మతాలు ఇప్పటికీ అత్యంత వెనుకబాటుతనంలో ఉండిపోయాయి. హిందూ వర్ణధర్మ వ్యవస్థ (బాల్య వివాహం, సతి, శాశ్వత వైధవ్యం), సంస్క రణకు నోచుకోని ప్రస్తుత ముస్లిం సమాజాలు దీనికి చక్కటి ఉదాహ రణలు. ఈ సమాజాల్లో కుటుంబ, సామాజిక అభివృద్ధిని అణచిపెట్టే మగాడి గృహ పరిధిలోనే మహిళలను ఉంచేశారు. భారత్‌లో చాలావరకు క్రైస్తవులు అంటే దళిత ఆదివాసులే. క్రిస్టియన్ మతంలోకి మతమార్పిడులు చాలావరకు మహిళల చొర వతో జరుగుతున్నవేనని అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లల విద్య ప్రతి తల్లికీ చోదకశక్తిగా ఉంటూ వస్తోంది. దళిత ఆదివాసీలుగా ఉంటున్నప్పటికీ వారి మహిళలు మాత్రం బాగా చదువుకున్నారు, చక్కగా ఉద్యోగాలు సంపాదించుకున్నారు. కేథలిక్ సంస్థాగత సంప దను మినహాయిస్తే దళిత క్రిస్టియన్ కమ్యూనిటీలో పెట్టుబడి సంచ యనం, భూ సంపద రూపంలో పెద్దగా సంపద కూడనప్పటికీ, సగటు కుటుంబ వ్యక్తిగత ఆస్తి తక్కువగానే ఉన్నప్పటికీ వీరు చాలా వరకు ఆరోగ్యకరమైన జీవితం గడుపుతున్నారు. వీరి సామాజిక సంబంధమైన వాణిజ్యం తక్కువగానే ఉన్నప్పటికీ అది సామూహికం గానే పంపిణీ అయ్యేది. అందుబాటులో ఉన్న వనరుల పంపిణీ అనేది ఇతర కమ్యూనిటీల కంటే క్రిస్టియన్ కమ్యూనిటీల్లోనే ఎక్కువ గానే ఉంటోంది. మతం ఏదైనప్పటికీ ఉత్తమమైన మహిళా విద్య, ఉద్యోగితా వనరులే సామూహిక జాతీయ వనరుగా ఉంటాయి. కానీ తమకు నచ్చిన మతాన్ని ఎంచుకునేటటువంటి మతపరమైన స్వాతంత్య్రాన్ని ఆర్ఎస్ఎస్ శక్తులు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? క్రిస్టియన్లలో ఎక్కువమంది బలవంతంగా మతమార్పిడీకి గురయిన వారే అయితే భారతీయ క్రిస్టియన్ మహిళలు సాధించిన ఉత్తమ విద్య, ఉత్తమ ఉద్యోగ స్థితి గురించి ఆరెస్సెస్ ఏం చెబు తుంది? పైగా ఆరెస్సెస్ స్వయంగా ఈ నిజాన్ని ఇప్పుడు అంగీకరిస్తోంది కూడా. చారిత్రకంగా అత్యంత అణచివేతకు గురైన కులాల్లోంచి వచ్చినప్ప టికీ క్రిస్టియన్ మహిళలు ఎలా ముందంజ సాధించారు, హిందూ, ముస్లిం మహిళలు మాత్రం ఇప్పటికీ వెనుకబాటుతనంలోనే ఎలా ఉండిపోతున్నారు అనే సైద్ధాంతిక ప్రశ్నను మనం సంధించాల్సిందే. మతపరమైన, ఆర్థిక పరమైన అభివృద్ధి సూచికలపై చైనా నిర్వ హించిన తాజా అధ్యయనాలను పరిశీలిస్తే బౌద్ధులు, కన్ప్యూసి యన్లతో పోలిస్తే అభివృద్ధిలో క్రిస్టియన్ భాగస్వామ్యమే ఎక్కువగా ఉందని చూపుతున్నాయి. అంటే, ఆధ్యాత్మికంగా మరింత ప్రజాస్వా మికంగా ఉండే మతమే సామాజిక, ఆర్థిక ప్రజాతంత్ర భాగస్వామ్యా నికి అధికంగా వీలు కల్పిస్తూ.. వ్యక్తులు, కుటుంబాలు మెరుగైన జీవి తం గడిపేందుకు అవకాశాలు కల్పిస్తోంది. అందుకే చైనా ఇప్పటికీ మతపరమైన అణచివేత స్వభావంతో ఉంటున్నప్పటికీ, దేశంలో జరుగుతున్న మత మార్పిడులను మరొక దృష్టితో చూడటం మొద లెట్టింది. మహిళల స్వాతంత్య్రం, వారి విద్య, శ్రమను గౌరవించడం అనే స్పష్టమైన వైఖరితో వేగంగా పెరుగుతున్న వారి ఉద్యోగిత, తమ లైంగికతపై పూర్తి నియంత్రణను మహిళలే కలిగి ఉండేలా అనుమ తించడం అనేవి మహిళల అభివృద్ధికి, అలాగే జాతి అభివృద్ధికి కీల కమైన సాధనాలు. ఈ పరామితులలో భారతీయ క్రిస్టియన్లే ఉన్నత స్థానంలో ఉన్నారని ఆరెస్సెస్ ఇప్పుడు తెలుసుకుంది. అలాంట ప్పుడు దేశంలోని అనేక రాష్ట్రాల్లో మత మార్పిడి చట్టాలను ఎందుకు తీసుకువస్తున్నారు? నిర్బంధ మతమార్పిడి పేరుతో వారి చర్చిలపై, మత సంస్థలపై ఎందుకు దాడులు చేస్తున్నారు? మహిళలు అన్ని రకాల స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో బతకగలుగు తున్న క్రిస్టియానిటీలాగా హిందూమతం మారాలని ఆరెస్సెస్ కోరు కుంటున్నట్లయితే, స్త్రీ–పురుష సంబంధాల విషయంలో అది పూర్తిగా తన వైఖరిని మార్చుకోవల్సి ఉంది. హిందూయిజంలోని అన్ని నిర్మా ణాలూ మహిళలను తమలో భాగం చేసుకోవాల్సి ఉంది. అలాగే భారతీయ ముస్లింలు కూడా భారతీయ ఇస్లాం పద్ధతుల్లో, మహిళా స్వాతంత్య్రం.. ప్రత్యేకించి స్త్రీల విద్య, ఉద్యోగిత విషయంలో భారీ సంస్కరణలు తీసుకురావడంపై తప్పక ఆలోచించాలి. మరే ఇతర మతాలకంటే ఈరోజు ముస్లిం మహిళలు పూర్తిగా పురుషుల నియం త్రణకు గురవుతున్నారు. ఆధ్యాత్మిక రంగంలో వారికి స్థానం లేక పోవడం, ఇంటికి పరిమితం చేయడం వల్ల ఇతర మతాల స్త్రీలకు మల్లే ముస్లిం మహిళలు పోటీ మార్కెట్లోకి ప్రవేశించలేకున్నారు. పోటీకి స్వాతంత్య్రం అవసరం. బహుళ సాంస్కృతిక లేదా బహుళ మతాలతో కూడిన మంచి సమాజం అన్ని మతాల మహిళలకూ మార్కెట్లో సానుకూల పోటీకి అనుమతించాలి. ఈ క్రమంలో మహి ళలు తమ తమ మతాలకు చెందిన అనేక చట్టాలను సవాల్ చేయాల్సి ఉంటుంది. మతాలు కూడా ఈ మార్పులకు అవకాశం ఇవ్వాలే తప్ప భూస్వామ్య యుగ చట్టాలతో మహిళలను నిర్బంధించకూడదు. ఒక మతంగా క్రిస్టియానిటీ అనేక చెడు నిబంధనలను అమలు పరుస్తున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా స్త్రీ– పురుష అసమానత్వానికి చెందిన అనేక అడ్డంకులను అది దాటుకుంటూ వచ్చింది. ప్రపంచం లోని ఏ మతం కంటే క్రిస్టియన్ మహిళలు నేడు మరింత స్వేచ్చగా, లైంగిక నియంత్రణలకు పెద్దగా లోబడకుండా ఉంటున్నారు. ఇప్పుడు ఆరెస్సెస్ కూడా సమగ్రమైన ఫీల్డ్ వర్క్‌తో చేసిన సర్వే ద్వారా వాస్తవాన్ని పక్షపాతం లేకుండా అంగీకరించింది. కాబట్టి పేద ప్రజలు, దళితులు, ఆదివాసీలు ఎలాంటి నియంత్రణలూ లేకుండా మత స్వేచ్ఛను అనుభవించడానికి ఆరెస్సెస్ అనుమతించాలి. ఇస్లాంతో సహా మరేమతంలోనూ ఇలా మతమార్పిడి ఎందుకు జరగ లేదన్న విషయంపై వారు ఆలోచించాలి. అందుకే భారత్‌లో అమ లులో ఉన్న అన్ని మతమార్పిడి వ్యతిరేక చట్టాలను రద్దుచేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
హిందీ ఆధిపత్యం ప్రమాదకరం
కొన్ని వారాల క్రితం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉండే సిలికాన్ వ్యాలీ ఏరియాలోని పలు ప్రాంతాల్లో నేను ఉపన్యాసాలు ఇస్తూ గడిపాను. ఇది ప్రపంచ ఐటీ హబ్ అనీ, గత కొంతకాలంగా అపెల్ ఫోన్, గూగుల్ తదితర అత్యంత ప్రముఖ సంస్థల ఆవిష్కరణలకు కేంద్రమనీ మనందరికీ తెలుసు. ఇంటర్నెట్ విప్లవానికి దారితీసిన ఎలెక్ట్రానిక్స్ రంగంలో అనేక నూతన ఆవిష్కరణలు ఈ ప్రాంతంలోనే చోటు చేసుకున్నాయి. సిలికాన్ వ్యాలీలోని ఐటీ, ఎలెక్ట్రానిక్ ఇంజనీరింగ్‌కి సంబంధిం చిన వివిధ రంగాల్లో దక్షిణ భారతీయులు ఉత్తర భారతీయుల కంటే అధికంగా ఉన్నారు. ప్రముఖ ఐటీ, ఎలెక్ట్రానిక్ కంపెనీల్లో హిందీ కౌ–బెల్ట్ (హిందీ భాషా ప్రాంతం) అని చెబుతున్న ఉత్తర భారతీయుల ప్రాతినిధ్యం చాలా తక్కువ. అమెరికాలోని అతి పెద్ద ఐటీ కంపెనీల్లో ఇద్దరు అత్యున్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ దక్షిణ భారతదేశం నుంచే వచ్చారు. ఎందుకు? హిందీ వల్ల కాకుండా ఇంగ్లిష్ వల్లే ఇది సాధ్యమైంది. దక్షిణ భారతీయులు తమ ప్రాంతీయ భాషలైన తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషలతో పాటు ఇంగ్లిష్‌ని ప్రత్యేక శ్రద్ధతో నేర్చుకుంటారు. ఇ.వి. రామస్వామి నాయకర్ ప్రారంభించిన హిందీ వ్యతిరేక ద్రవిడ కజగం ఉద్యమం వల్ల తమిళనాడులో హిందీని పూర్తిగా త్యజించి ప్రధానంగా రెండు భాషలనే నేర్చుకోవడం మొదలైంది. కేరళలో అధిక సంఖ్యలో క్రిస్టియన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలున్న కారణంగా హిందీని తోసిపుచ్చి ఇంగ్లిష్ మీడియంనే ముందుకు తీసుకుపోయే తనదైన మోడల్ని అభివృద్ధి పర్చుకున్నారు. ఇక తమిళనాడు, కేరళ నమూనాలతో తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక కూడా ప్రభావితమయ్యాయి. భారతదేశంలో మొట్టమొదటి దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్, భారతదేశ మొట్టమొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ కేరళ నుంచే వచ్చారు. వారు ఏదో ఆయాచితంగా ఎన్నికైన వారు కాదు. అత్యున్నత స్థానాలకు చేరుకోవడానికి ముందే వారు ఎంతో పేరు పొందారు. ఎందుకు? హిందీ వల్ల కాదు కానీ ఇంగ్లిష్ వల్లే అది సాధ్యమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూనే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెట్టడానికి కొత్త ముందడుగు వేశారు. ఉత్తర భారత ముఖ్యమంత్రి ఎవరూ ఈ సాహసానికి పాల్ప డలేరు. గుజరాత్లో ఇంగ్లిష్ విద్యా స్థాయిలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఏ ఉత్తర భారతీయ రాష్ట్రం కంటే ప్రత్యేకించి హిందీ ప్రాంతం కంటే దక్షిణ భారత్‌లో విద్యాభివృద్ధి నమూనాలు అత్యున్నత స్థాయిలో ఉంటున్నాయి. భారతీయ గిరిజనులలో ఈశాన్య భారత రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇంగ్లిష్ మీడియం కారణంగా అక్కడి యువత అత్యుత్తమ విద్యా సంస్థల్లో ప్రవేశించారు. ఇంగ్లిష్ వారి ప్రధాన బోధనా భాషగా కొనసాగినట్లయితే, వచ్చే కొన్ని దశాబ్దాల్లో వీరు అనేక రంగాల్లో ఆధిపత్యం చలాయించబోతున్నారు. ఈశాన్య ప్రాంతంలో ఈ అభివృద్ధిపట్ల ఆర్ఎస్ఎస్/బీజేపీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. అక్కడ హిందీని రుద్దితే రాజకీయంగా వీరి పని ముగిసిపోతుంది. ఇప్పుడు అమిత్ షా, బీజేపీ/ఆరెస్సెస్ ప్రభుత్వం కాలాన్ని వెనక్కు తిప్పి దక్షిణ భారత్‌లో, ఈశాన్య ప్రాంతంలో తదితర ప్రాంతంలో హిందీని ప్రోత్సహించడానికి ప్లాన్ చేస్తోంది. ఇంగ్లిష్‌ను భారతదేశం నుంచి మెల్లమెల్లగా నిర్మూలించాలని చూస్తున్నారు. హిందీ ప్రాంతంలోని విద్యా స్థాయిలు, ప్రమాణాలకు మొత్తం భారతదేశాన్ని తీసుకుపోవాలన్నదే వీరి లక్ష్యం. ఒకసారి దక్షిణ భారత్, ఈశాన్య ప్రాంతం హిందీ ప్రాంతంగా మారిపోయిన తర్వాత, హిందు–హిందీ రాష్ట్రాన్ని (దేశం) నెలకొల్పాలనే తమ లక్ష్యాన్ని చేరుకున్న్టట్లు ప్రకటించాలన్నది వారి కోరిక. హిందూ–హిందీ–హిందూస్తాన్ జాతిని నెలకొల్పాలనీ, దేశం పేరును ఇండియా అనే భారత్‌నుంచి (రాజ్యాంగ పీఠికలో ఇలాగే ఉన్నందువల్ల) హిందూస్తాన్‌గా మార్చాలని బీజేపీ/ఆరెస్సెస్ పెట్టుకున్న దీర్ఘకాలిక లక్ష్యం అందరికీ తెలిసిందే. ఈ నేలకు హిందూస్థాన్ అనే పేరు పెట్టింది ముస్లిం పాలకులు. దీన్ని మతరాజ్యంగా మార్చాలనే వారు ఆ పేరు పెట్టాలనుకుంటున్నారు. ఈ మొత్తం పథకంలో పాకిస్తాన్‌ను ఒక నమూనాగా చూపెడుతూ ముస్లిం దేశాలతో పోటీపడటమే వీరి డైరెక్షన్. యూరప్, అమెరికాతో ప్రపంచ స్థాయిలో స్పర్థాత్మక స్ఫూర్తిలో చాలా ముందంజలో ఉన్న చైనాతో లేక దక్షిణాఫ్రికాతో పోటీ పడటం వీరి ఉద్దేశం కాదు. మన దక్షిణభారత్ తరహాలో ఇంగ్లిష్ నేర్చుకోవడమే చైనా, దక్షిణాఫ్రికాల ప్రస్తుత లక్ష్యంగా ఉంది. ఆధునికీకరణకు అలాగే అధునికానంతర దశకు ప్రధాన లింక్ భాషే. ఆఫ్రికాలోని ఫ్రెంచ్ వలస దేశాలు అభివృద్ధి క్రమంలో ఉన్న స్థానిక భాషల్ని నేర్చుకోవాలని పట్టుబట్టడం లేదు. మాజీ ప్రెంచ్ వలసదేశాల్లో చాలావరకు ఫ్రెంచ్ నుంచి ఇంగ్లిష్‌పై దృష్టి మళ్లిస్తున్నాయి. ఇంగ్లిష్ భాషా కమ్యూనికేషన్, టెక్నో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధితో ప్రపంచంతో సమ్మిళితం కావడం మూలాన ఈ దేశాల ఆర్థికాభివృద్ధి వేగంగా సాగుతోంది. భాషాపరంగా, సాంస్కృతిక పరంగా బలపడుతున్న ఈ అంతర్జాతీయ దశను అర్థం చేసుకోవడంలో బీజేపీ/ఆరెస్సెస్ నేతలకు ఎలాంటి చిత్తశుద్ధీ లేనట్లుంది. అనేక ప్రాంతాలతో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్న ఇజ్రాయెల్ సైతం హిబ్రూతో పాటు ఇంగ్లిష్ విద్యను ప్రోత్సహిస్తూ ఉమ్మడి సాంస్కృతిక మార్పుకు సిద్ధమవుతున్నాయి. ఇక భారత్‌లో బీజేపీ/ఆరెస్సెస్‌కు పూర్తిగా ఆర్థిక వనరుల్ని సమకూరుస్తున్న పారిశ్రామికవర్గం హిందీని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఉత్తర భారత్‌లో భాషాపరమైన, సాంస్కృతిక పరమైన వర్గ విభేదాలు దక్షిణభారత్ కంటే ఎక్కువగా ఉంటున్నాయి. దక్షిణాదిలో అన్ని తరగతుల ప్రజానీకం తమ ప్రాంతీయ భాషతోపాటు ఇంగ్లిష్‌ను నేర్చుకోవలసిన అవసరాన్ని గుర్తించాయి. అందుకే దక్షిణాదిలో భాషా, సాంస్కృతిక పరమైన అంతరం తగ్గుముఖం పడుతోంది. అదే ఉత్తరాదిలో ఈ అంతరం చాలా ఎక్కువ. అందుకే ఆర్థిక వనరులు, సాంస్కృతిక వనరులకు చెందిన దారిద్య్రం మొరటైన, కఠినమైన రూపంలో సాగుతోంది. సంపన్నుల పిల్లలకోసం ప్రపంచ స్థాయి ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను నడుపుతున్న అగ్రశ్రేణి పారిశ్రామిక వేత్తలను ఉత్తర భారత్‌లో హిందీ మీడియంకు మారాలని అమిత్ షా ఒత్తిడి చేయగలరా? ఇక ఉత్తరాది, దక్షిణాది హిందీ మీడియం స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించవలసిందిగా తన పార్టీనేతలను షా ఆదేశించగలరా? దక్షిణ భారత్, ఈశాన్య భారత్‌లో హిందీ నేర్చుకోవాలని చెప్పి ఆయన ఎవరిని వంచించాలని అనుకుంటున్నారు? కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద గ్రామీణ పిల్లలను మాత్రమే ఆయన వంచించగలరు. అందుకే హిందుత్వ శక్తులు ప్రేరేపిస్తున్న భాషాపరమైన సెంటిమెంట్ల పట్ల దళితులు, ఓబీసీలు, చివరకు అగ్రకుల శూద్రులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. వీరి పిల్లలు ఇప్పుడిప్పుడే ఆధునిక నాగరిక, అంతర్జాతీయీకరించిన సంస్కృతులకు అలవాటు పడుతున్నారు. వీరు గనుక ఒకదేశం, ఒక భాష, ఒక సంస్కృతి అనే హిందుత్వ ప్రచార సిద్ధాంతాన్ని మోసినట్లయితే, వీరి పిల్లలు తిరిగి మధ్యయుగాల దారిద్య్రం, అజ్ఞానం, అసమానత్వంలోకి దిగజారిపోవడం తథ్యం. హిందీ ప్రాంతంలోని జనాలకు దక్షిణ భారత్ ప్రజలకూ మధ్య శాస్త్రీయ దృక్పథానికి సంబంధించిన స్థాయిలను అలా పోల్చి చూద్దాం. శా్రస్రీయ చింతనలో దక్షిణ భారత్ చాలా ముందంజలో ఉంది. అంటే దక్షిణాదిలో మూఢనమ్మకాలు, అజ్ఞానం, దోపిడీ లేవని అర్థం కాదు. కానీ దక్షిణాదిలో విజ్ఞాన స్థాయిలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం పట్ల నమ్మకం చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక పరిమిత బృందానికి చెందిన ప్రజలు లేక ఒక చిన్ని ప్రాంతం, లేక ఒక చిన్న జాతి మాట్లాడే భాష మాత్రమే తెలిసి ఉన్న పిల్లలకంటే పదసంపదలో సమృద్ధిని కలిగిన అంతర్జాతీయంగా వ్యక్తీకరించగలిగిన భాషను నేర్చుకున్న పిల్లలు మరింత ఆత్మవిశ్వాసం, విజ్ఞాన స్థాయిలను కలిగి ఉంటారు. సామాజిక, ప్రాకృతిక శాస్త్రాల బోధనను బలహీనపర్చడం ద్వారా బీజేపీ/ఆరెస్సెస్ ఇప్పటికే మన విశ్వవిద్యాలయాలకు బాగా నష్టం కలిగించాయి. అన్ని జ్ఞానాలకూ మాతృక పౌరాణిక శాస్త్రమే అంటూ వీరు తీసుకొస్తున్న కొత్త సిద్దాంతాన్ని చూసి ఇప్పటికే ప్రపంచంమంతా విరగబడి నవ్వుతోంది. ప్రపంచంలోని అన్ని శాస్త్రీయ ఆవిష్కరణలను మన పురాణగ్రంథాలే చెప్పేశాయని వీరు ప్రకటిస్తారు. కుహనా శాస్త్రవేత్తలను వీరు డీఎన్ఏ, పురావస్తు శాస్త్ర నిపుణులుగా నమ్మించాలని చూస్తారు. అంతర్జాతీయ సైంటిస్టులు మానవ వలసల గురించి చేసిన సిద్దాంతాలు అన్నీ తప్పుడువే అని వాదిస్తారు. ఈ చెత్తను శాస్త్ర ప్రపంచం జోక్‌గా పరిగణిస్తోంది. ఇప్పుడు వీరి రాజకీయ నేతలు.. అన్ని భాషలనూ వదిలిపెట్టి హిందీని తప్పక నేర్చుకోవాలని మనకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు మాత్రమే భరతఖండం సువర్ణ భూమిగా మారుతుందని అంటున్నారు. అదృష్టవశాత్తూ దక్షిణ భారతీయులందరూ అమిత్ షా ప్రవచించిన హిందీ– హిందూ– హిందూస్తాన్ అసంగత సిద్ధాంతానికి వ్యతిరేకంగా తిరగబడ్డారనుకోండి. మన పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచాలంటే, తమిళనాడులాగే ద్విభాషా సూత్రానికే మనం కూడా కట్టుబడి ఉండాలి. మన శాస్త్రీయ దృక్పధాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారానే భారత్ మరోసారి చైనా వంటి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు వలసగా మారబోదు. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
సమానత్వానికి ఆమడ దూరంలో!
కుల అసమానత్వానికి, అగౌరవానికి పరిష్కారం కులాంతర వివాహమేనని చాలామంది సామాజిక సిద్ధాంతవేత్తలు భావిస్తుంటారు. కాని అన్ని కులాల మధ్య ఆధ్యాత్మిక సమానత్వం ఏర్పర్చనట్లయితే, మరే ఇతర కులవ్యతిరేక చర్యలూ పెద్దగా సాధించేదంటూ ఏదీ ఉండదు. మనుషుల్లో కులాలను దేవుడు సృష్టించలేదని ప్రతి ఆలయంలోనూ పూజారి ప్రకటించి ఉంటే, దేశంలో కొద్దిగా అయినా సాధ్యపడుతున్న కులాంతర వివాహాలు యువతీయువకుల హత్యలకు దారితీసి ఉండేవికావు. మనం ఆలయంలోనే సమానత్వాన్ని కోల్పోయాం. అది పోలీసు స్టేషన్లో దొరుకుతుందని వెతుకుతున్నాం. ఆలయం సృష్టించిన సమస్యను పోలీసు స్టేషన్ పరిష్కరించలేదు. ఉమ్మడి వ్యవస్థలుగా ఆలయం, పాఠశాల మాత్రమే దీన్ని పరిష్కరించాలి. 21వ శతాబ్దిలోనూ భారత్‌లో మానవ సంబంధాలు అంతరాలు, అసమానతల మధ్యే కొనసాగుతున్నాయి. నా బాల్యంలోనూ, ప్రస్తుతం కూడా మా గ్రామంలో ఓ సాధారణ ప్రక్రియ జరుగుతూ వస్తోంది. ప్రతి వృత్తినీ ఒక్కో సామాజిక బృందం మాత్రమే నిర్వహిస్తూంటుంది. ప్రతి కమ్యూనిటీకీ ఒక్కో పేరు ఉంటుంది. పొలాలను దున్నడం, గొర్రెలు కాయడం లేదా పశువుల పెంపకం, చేపలుపట్టడం, కల్లుగీత, కుండల తయారీ, బట్టలు ఉతకడం, నేతపని, క్షురక వృత్తి, చెప్పుల తయారీ, జంతువులు లేక మనుషుల మృతదేహాలకు అంతిమసంస్కారం నిర్వహించడం వంటి ఒక్కో పనిని ఒక్కో కులం ప్రత్యేకంగా చేసేది. గ్రామంలో ఏదైనా వృత్తి చేతులు మారుతూ ఉంటుందంటే అది పొలం దున్నడం మాత్రమే. ఇతర వృత్తులన్నీ వేర్వేరు కులాల చేతుల్లోనే ఉంటాయి. నా బాల్యంలో అన్ని కులాలూ కలిసి భోజనం చేసే పద్ధతి ఉండేది కాదు. ఇప్పుడు అన్ని కులాలు కలిసి భోంచేయడం సాధ్యపడుతోంది కానీ, కులాంతర వివాహం ఇప్పటికీ కష్టసాధ్యమే. మార్పు ఏదైనా జరిగిందంటే అది పైపైన మాత్రమే జరుగుతోంది తప్ప వ్యవస్థాగతంగా కాదు. అంతరాల పరమైన అసమానత్వం ఇప్పటికీ అలాగే ఉంది. బ్రాహ్మణ, వైశ్య కులాలు ఇప్పటికీ ప్రత్యేకంగా ఉంటూ మిగతా కులాలకంటే అగ్రస్థానంలో ఉంటున్నాయి. కులపరమైన సమానత్వం గ్రామంలోనూ లేదు. నగరంలోనూ లేదు. 72 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశంలో ప్రజాజీవితంలో సమానత్వం లేనేలేదు. 20వ శతాబ్ది మధ్య నుంచి, 21వ శతాబ్ది ప్రారంభం వరకు భారతదేశంలో మానవ సంబంధాలు అంతరాలు, అసమానతల మధ్యే కొనసాగుతున్నాయి. స్త్రీపురుషులతో సహా మనుషులందరినీ సమానంగా సృష్టించాడని చెబుతున్న దేవుడు నేటికీ మా సామాజిక చట్రంలోకి ప్రవేశించలేకున్నాడు. ప్రతి గ్రామంలోనూ పశువుల, మనుషుల మృతదేహాలకు అంతిమ సంస్కారం నిర్వహించే వారిని అంటరానివారిగా గుర్తిస్తుం టారు. ఇక రజకులు, క్షురకులను కూడా హీనంగా చూస్తుంటారు. దాదాపుగా దేశంలోని ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి. ఉత్తరాదిన ఇది కఠినంగా అమలవుతుంటే దక్షిణాదిలో కాస్త తక్కువ స్థాయిలో అమలవుతోంది. ఆర్ఎస్ఎస్/బీజేపీ ఉత్తరాదిన బలంగానూ, దక్షిణాదిలో బలహీనంగానూ ఉండటానికి ఇదే కారణం. గ్రామాల్లో ఉమ్మడి పాఠశాలల వ్యవస్థ ఉనికిలోకి రాకముందు చారిత్రకంగా చూస్తే, అన్ని వృత్తులను ఐక్యం చేసేది ఒక్క ఆలయం మాత్రమే. దేవుడు మనుషులందరినీ సమానంగా సృష్టించాడన్న భావంతో గ్రామంలోని ఆలయం అన్ని కులవృత్తుల వారికి ఉమ్మడి స్థలంగా ఉండేది. భారతీయ గ్రామాలు చాలా విభిన్నమైనటువంటివి. ఆలయ పూజారి వారికి ఏం చెబుతాడన్నది ఊహించుకోండి మరి. మీ వృత్తిపరంగా ఉండే మీ విధులను నిర్వహించండి, అన్ని వృత్తులూ మన మనుగడ కోసం అవసరమైనట్టివే, మీరూ మీ వృత్తిపరమైన విధులూ దేవుడి రా>జ్యంలో సమానమైనవే. కానీ దీనికి భిన్నంగా గ్రామీణ పూజారి గ్రామస్థులకు ఏం చెబుతూ వచ్చాడో తెలుసా? అసమానత్వాన్ని, అంటరానితనాన్ని పాటించడం మీ పవిత్ర ధర్మం. ఎందుకంటే దేవుడు లేక దేవుళ్లు మిమ్మల్ని అసమానంగానే సృష్టించారు అనే. దేవుడి ప్రతినిధిగా భావించే వ్యక్తే గ్రామీణులకు ఇలా చెబుతూ వస్తే దేశంలో ఆధ్యాత్మిక, సామాజిక సమానత్వం ఎలా వస్తుంది? ఉమ్మడి బోధనా స్థలంగా పాఠశాల గ్రామాల్లో ప్రవేశించడానికి ముందు ఆలయం ఒక ఉమ్మడి సామాజిక స్థలంగా ఉండాలి. గ్రామ దేవాలయానికి సమానత్వమే సూత్రమైతే, ఆ సమానత్వం గ్రామీణ జీవితంలో భాగమై ఉండాలి. అన్ని కులవృత్తుల ప్రజలూ పక్కపక్కనే కూర్చుని ఆహారాన్ని ఆరగించాలని గ్రామ దేవాలయం మొదటినుంచి ప్రబోధించి ఉంటే, గ్రామాల్లో అసమానత్వం అసలు ఉండేది కాదు. కుల అసమానత్వానికి, అగౌరవానికి పరిష్కారం కులాంతర వివాహమేనని చాలామంది సామాజిక సిద్ధాంతవేత్తలు భావిస్తుం టారు. కాని అన్ని కులాల మధ్య ఆధ్యాత్మిక సమానత్వం ఏర్పర్చనట్లయితే, మరే ఇతర కులవ్యతిరేక చర్యలతో పెద్దగా సాధించేదంటూ ఏదీ ఉండదు. మనుషుల్లో కులాలను దేవుడు సృష్టించలేదని ప్రతి ఆలయంలోనూ పూజారి ప్రకటించి ఉంటే, దేశంలో కొద్దిగా అయినా సాధ్యపడుతున్న కులాంతర వివాహాలు ప్రస్తుతం జరుగుతున్నట్లుగా యువతీయువకుల హత్యలకు దారితీసి ఉండేవికావు. అలాంటి వాతావరణంలో ఆర్టికల్ 15 వంటి సినిమా ఏదీ మనకు అవసరమై ఉండేది కాదు. మనం ఆలయంలోనే సమానత్వాన్ని కోల్పోయాం. అది పోలీసు స్టేషన్లో దొరుకుతుందని వెతుకుతున్నాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ఆలయం గురించి పేర్కొనలేదు. ఆలయం సృష్టించిన సమస్యను పోలీసు స్టేషన్ పరిష్కరించలేదు. ఉమ్మడి వ్యవస్థలుగా ఆలయం, పాఠశాల మాత్రమే దీన్ని పరిష్కరించాలి. మన వివాహ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి అర్చక కులం సిద్ధపడనంతవరకు కులాంతర వివాహాలు మన దేశంలో విజయవంతం కావు. అర్చకత్వం అనేది కుల వృత్తిగా కాకుండా వ్యక్తులు చేసే వృత్తిగా మారనంతవరకు మన వివాహ వ్యవస్థ మారదు. కుల సంబంధాలు మారవు. అప్పుడు మాత్రమే శ్రమను గౌరవించడం మన కుటుంబ సంస్కృతిలో సాధ్యపడుతుంది. ఈ ప్రాథమిక అంశాలను మనం సాధించి ఉంటే, ఇస్లామిక్ మసీదు మన గడ్డపైకి అడుగుపెట్టగలిగేదే కాదు. అలాగే క్రిస్టియన్ చర్చి కూడా భారతదేశంలోకి వచ్చేది కాదు. ముస్లిం ఆక్రమణదారులు కానీ, క్రిస్టియన్ వలసపాలకులు కానీ వచ్చి ఉన్నా, వారు భారత్‌లో ఇంతటి విజయాలు సాధించి ఉండేవారు కాదు. మరోమాటలో చెప్పాలంటే, ఆధునిక కాలంలో మన సమాజాలన్నింటిలోనూ మానవ సమానత్వానికి ఆధ్యాత్మికపరమైన ప్రజాస్వామ్య వ్యవస్థే నిజమైన పునాదిగా ఉంటోంది. మన దేశంలో అలాంటి ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాన్ని బ్రాహ్మణ పండితులే ప్రతిపాదించి ఉండాలి. ఆధ్యాత్మిక సమానత్వ సూత్రాన్ని దేవుడు ప్రసాదించిన సూత్రంగా ఆలయం ఆచరించి ఉంటే మన దేశం మరో విభిన్న దశలో సాగి ఉండేది. సాధారణంగా మన కాలేజీల్లో, యూనివర్సిటీల్లో రాజకీయ సమానత్వం పట్లే చర్చలు సాగుతుంటాయి. కానీ గ్రామ స్థాయినుంచి మానవ సంబంధాలన్నింటినీ ఆధ్యాత్మిక సమాజమే పూర్తిగా నియంత్రిస్తున్నప్పుడు మన పౌర సమాజ పొరల్లోకి రాజకీయ సమానత్వాన్ని తీసుకురావడం ఎలా సాధ్యం? మానవ సమానతా సమాజాన్ని నిర్మించాలంటే ఇక్కడే ఆలయం, చర్చి, మసీదు కీలకపాత్ర పోషించాల్సి ఉంది. పరిశుద్ధమైన శాకాహార తత్వమే జాతీయ ఆహా రంగా హిందుత్వ శక్తులు చాలాకాలంగా పేర్కొంటూ వస్తున్నాయి. వీరి అభిప్రాయం ప్రకారం మాంసాహారులు ఎవ్వరు భారతీయులు కారు. అందుకే ఇప్పుడు శాకాహారులైన బ్రాహ్మణులు, వైశ్యులు, ఆరెస్సెస్ కంటే శూద్ర, దళిత, ఆదివాసీ మాంసాహారులను తక్కువజాతికింద పరిగణిస్తున్నారు. ఇప్పుడు అసమానత్వాన్ని నిర్మూలించడానికి బదులుగా అసమానత్వాన్ని పెంచి పోషించే అత్యంత శక్తివంతమైన నూతన శాకాహార కులంగా ఆరెస్సెస్ అవతరించింది. జాతీయవాదాన్ని ప్రజల ఆహార ఆర్థికవ్యవస్థకు అనుసంధానించడం తగదంటూ.. ఆరెస్సెస్‌లో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న ఏ శూద్రకులానికి చెందిన కార్యకర్త కూడా నొక్కి చెప్పలేరు. ఎందుకంటే రుగ్వేద కాలం నుంచి శూద్రులను బౌద్ధికంగా తక్కువస్థాయి కలిగినవారిగా గుర్తిస్తూ వస్తున్నారు. శాకాహారమే తమ ఆహారంగా ఉండినట్లయితే 5 వేల సంవత్సరాల క్రితమే హరప్పా వాసులు మన గొప్ప నాగరికతను నిర్మించి ఉండేవారు కాదని ఆరెస్సెస్‌కు అర్థం కావడం లేదు. వెయ్యి సంవత్సరాల క్రితం వరకు భారతదేశంలో శాకాహార ఉత్పత్తి జరిగి ఉండలేదు. ఆహారంతో సహా అన్ని రంగాల్లోనూ సమానత్వాన్ని రద్దు చేసిపడేశారు. హిందూ కుల అంతరాల వ్యవస్థకే కాదు. భారతీయ ఇస్లాం, భారతీయ క్రిస్టియానిటీకి కూడా ఇది పెద్ద సమస్యగానే ఉంటోంది. మన గ్రామాల్లో నేటికీ గుణాత్మకమైన మార్పు జరగలేదు. ఆలయం అదే కులధర్మంతో నడుస్తోంది. కులాంతర వివాహాలు చేసుకున్న యువతీయువకులను చంపేయడాన్ని, గర్భగుడిలోకి ప్రవేశించిన దళితులపై దాడి చేయడాన్ని అది ఆమోదిస్తోంది. హిందూ దేవుళ్ల కంటే ఓటుహక్కే దళితులను కాపాడుతోంది. పూజారి వైఖరి మాత్రం కులధర్మాన్ని ఆచరిస్తూనే సాగుతోంది. ఇదే అన్ని అసమానతలకు తల్లివంటిది. మనం ఆలయాన్ని మార్చలేనట్లయితే, ప్రతి పాఠశాలలో ఉదయం ఇలా ప్రార్థన చేయవలసిందిగా మన విద్యార్థులను కోరదాం. ఆలయ దేవుడు సమానత్వం తేనట్లయితే, పాఠశాల దేవుడు దేశంలో సమానత్వాన్ని తెచ్చేలా చేద్దాం. దేవుడా మమ్మల్ని సమానులుగా సృష్టించావు దేవుడా స్త్రీపురుషులను సమానులుగా సృష్టించావు దేవుడా మాలో కులాలు లేకుండా సృష్టించావు దేవుడా మామధ్య అంటరానితనం లేకుండా చేశావు దేవుడా పనిచేసి జీవించమని మా అందరికీ చెప్పావు దేవుడా మా తల్లిదండ్రులను గౌరవించమని చెప్పావు దేవుడా గర్విస్తున్న భారతీయులుగా మేం నిన్ను ప్రార్థిస్తున్నాం దేవుడా భారతీయులందరినీ సమానులుగా సృష్టించావు వ్యాసకర్త: ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
బీసీగా ప్రచారం చేసుకుని ప్రధాని అయ్యారు
హైదరాబాద్: వైశ్య కులంలో పుట్టిన మోదీ బీసీగా ప్రచారం చేసుకుని ప్రధాని అయ్యారని టీమాస్ ఫోరం చైర్మన్, ప్రొఫెసర్ కంచ ఐలయ్య విమర్శించారు. ఈ క్రమంలో దేశంలో పెద్ద మార్పు రావాల్సిన అవసరం ఉందని.. దీనికి గానూ కమ్యూనిస్టులు నిర్మాణాత్మకమైన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఎన్నికల రంగంలో దిగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో మార్క్సిజం–అంబేడ్కర్ ఆలోచనా విధానం–సామాజిక న్యాయం ప్రస్తుత కర్తవ్యం అనే అంశంపై సదస్సు జరిగింది. ఐలయ్య మాట్లాడుతూ కింది కులాల వారిని ఐక్యం చేసి రాజ్యధికారం వైపు పయనించేలా చేయాలని సూచించారు. బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మద్దికాయల అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్, తాండ్ర కుమార్, జయరాజు, నల్లా సూర్యప్రకాశ్ పాల్గొన్నారు. -
త్రిభాషా శిరోభారం ఇంకెన్నాళ్లు?
విశ్లేషణ విద్యను సంపూర్ణంగా హిందీలో లేక భారతీయ భాషల్లోనే బోధించాలని చెబుతున్న లోహియా వంచనాత్మక సోషలిస్టు విద్యావిధానంతో పోలిస్తే బీజేపీ ప్రకటించిన నూతన విద్యా విధానం.. ఖచ్చితంగానే మెరుగైనది. సంపన్నులు కార్పొరేట్ బిజినెస్ స్కూళ్లలో చదువుతూ ప్రపంచ స్థాయిలో ఉద్యోగాలు కైవసం చేసుకోవడం, సాధారణ ప్రజలు హిందీ, తదితర ప్రాంతీయ పాఠశాలలు, కాలేజీల్లో చదువుతూ చౌకీదారులుగా, ఛాయ్‌వాలాలుగా మిగిలిపోతున్న పరిస్థితి ఇకనైనా మారాలంటే ఇంగ్లిష్‌ను భారత జాతీయ భాషగా గుర్తించి దానిలో బోధన చేస్తూ దాంతో పాటు ఒక ప్రాంతీయ భాషలో బోధించే తరహా విధానం అమలు చేయాల్సి ఉంటుంది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలన్నింట్లోనూ ఇంగ్లిష్‌ను ప్రవేశపెడతానని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన హామీని నెరవేర్చితే ఆంధ్రప్రదేశ్ ఈ అంశంలో దేశానికే నమూనా రాష్ట్రంగా మారుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యా విధానం భారతదేశ భాషా విధానం గురించి విస్పష్టంగా ప్రకటించింది. మొట్టమొదటగా ఈ విధానం జాతి మొత్తాన్ని హిందీ మాట్లాడే జాతిగా మార్చాలని ఆశించింది. అయితే దక్షిణ భారతదేశంలో తీవ్ర నిరసనల తర్వాత తమకు హిందీ వద్దంటున్న రాష్ట్రాలపై హిందీని రుద్దకుండా కేంద్రం తన భాషా విధానాన్ని త్రిభాషా విధానంగా సవరించింది. ఏదేమైనా, దేశంలోని పిల్లలందరూ ఇప్పుడు మూడు భాషలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లిష్, తాము పుట్టిన రాష్ట్రానికి చెందిన భాష, ఇతర రాష్ట్రాలకు చెందిన మరొక భాష. హిందీ మాట్లాడే రాష్ట్రాల కంటే ఎక్కువగా హిందీ మాట్లాడని రాష్ట్రాలు ఉంటున్నందున మొట్టమొదటిసారిగా హిందీతోపాటు హిందీ యేతర భాషను కూడా పిల్లలు నేర్చుకోవలసి ఉంటుందని ఈ విధానం తేల్చి చెబుతోంది. ఈ విధానంలో భాగంగా దక్షిణ భారత రాష్ట్రమైన తమిళనాడు కూడా ఇంగ్లిష్, తమిళంతోపాటు మరొక రాష్ట్రానికి చెందిన భాషను (దక్షిణభారత్కి చెందిన మలయాళం, కన్నడ లేక తెలుగు లేదా హిందీనికూడా) నేర్చుకోవలసి ఉంటుంది. దక్షిణ భారత్ నుంచి తమ ప్రభుత్వంలోకి తీసుకున్న సొంత పార్టీ మంత్రులు కూడా హిందీ పెద్దగా మాట్లాడలేకపోవడంపై బీజేపీ, ఆరెస్సెస్ నాయకులు కలవరపడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎంపికైన మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పరిశీలించండి. దక్షిణాదికి చెందిన నిర్మలా సీతారామన్, సదానంద గౌడ ఇంగ్లిష్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. అందుకే దేశంలోని అన్ని రాష్ట్రాలపైనా హిందీని రుద్దేందుకు పథకం రచించారు. కానీ కొంతకాలం వరకు ఈ విధానానికి కొన్ని ఆటంకాలు తప్పేటట్టు లేవు. కాబట్టి, వీరు హిందీని బలవంతంగా రుద్దే కార్యక్రమం నుంచి వెనక్కు మళ్లారు కానీ భాషా విధానం మాత్రం త్రిభాషా సూత్రంగానే కొనసాగనుంది. బీజేపీ విద్యా విధానం మొట్టమొదటి సారిగా ఇంగ్లిష్‌ను దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే విషయంపై అంగీకారం తెలిపింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉంటుంది కానీ బోధనా మాధ్యమంగా ఆ రాష్ట్రానికి చెందిన భాషే కొనసాగుతుంది. ప్రైవేట్ పాఠశాలల్లో బోధనా భాషగా ఇంగ్లిషే ఉంటుంది. అదే సమయంలో రెండు భారతీయ భాషలను బోధించే విధానం అమలులోకి వస్తుంది. అంటే ప్రైవేట్ కంపెనీలకు చెందిన ‘ఖాన్ మార్కెట్ గ్యాంగ్స్’ (క్లాస్ స్కూళ్లు) నిర్వహించే పాఠశాలలు గతంలో ఇంగ్లిష్తో పాటు ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్ వగైరా విదేశీ భాషలను ఒక సబ్జెక్టుగా బోధించడానికి బదులుగా ఇకనుంచి రెండు ఇతర భారతీయ భాషలను బోధించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనాకాలంలో విద్యా విధానం విదేశీ భాషలను నేర్చుకునే అవకాశాన్ని ఖాన్ మార్కెట్ గ్యాంగ్స్ (సంపన్నుల పిల్లలు చదివే) పాఠశాలలకు మాత్రమే కల్పించింది. కానీ మండీ బజార్ (మాస్) పాఠశాలలు హిందీ లేదా మరొక ప్రాంతీయ భాషా మాధ్యమంలోనే బోధించవలసి వచ్చేది. సారాంశంలో కేంద్రప్రభుత్వం ఇప్పుడు ఇంగ్లిష్‌ను బోధించవలసిన అవసరమున్న ప్రధాన భాషగా గుర్తిం చింది. అయితే ఇంగ్లిష్‌ను ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో మంచి నాణ్యతతో సంపూర్ణంగా బోధించనున్నారు. అదే ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లిష్‌ను భాషా సబ్జెక్టుల్లో ఒక భాషగా బోధించనున్నారు. అయితే నిస్సందేహంగానే బీజేపీ ఒక ప్రగతిశీలమైన చర్యను చేపట్టింది. అదేమిటంటే భారతీయ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ను బోధించడాన్ని అనుమతించడమే. విద్యను హిందీలో లేక భారతీయ భాషల్లోనే బోధించాలని చెబుతున్న లోహియా వంచనాత్మక సోషలిస్టు విద్యావిధానంతో పోలిస్తే బీజేపీ నూతన విద్యా విధానం.. ఖచ్చితంగానే మెరుగైనది. లోహియా సోషలిజం ప్రకారం పేదపిల్లలు ప్రాంతీయ భాషా మీడియంకే పరిమితం కావాలి, సంపన్నుల పిల్లలకు కోరినంత డబ్బు ఉంటుంది కాబట్టి వారు మంచి ఇంగ్లిష్ మీడియం స్కూల్స్‌లో చదువుకోవచ్చు. భారతీయ కమ్యూనిస్టులు తాము పాలించిన రాష్ట్రాలన్నింటిలో ఉప– జాతీయ సెంటిమెంటును మిళితం చేసి మరీ ఈ రకమైన భాషా విధానాన్ని అమలు చేస్తూ వచ్చారు. దీనికి చక్కటి ఉదాహరణ 40 లక్షల జనాభా కలిగిన త్రిపుర రాష్ట్రం. ధారాళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడగలిగే కామ్రేడ్ మాణిక్ సర్కార్ భారతదేశంలోనే కాకుండా, ప్రపంచమంతటా కూడా ఉద్యోగాలు కైవసం చేసుకోగలిగిన సంపన్నులకు ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో చదువుకునే అవకాశాన్ని కల్పించారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలు త్రిపురి మీడియంలో బోధన జరిపేలా చేశారు. అంటే ఈ పాఠశాలల్లో చదువుకున్నవారు 40 లక్షల జనాభాతో కూడిన పారిశ్రామికేతర అర్థ–గిరిజన ఆర్థిక వ్యవస్థలో వేతన జీవులుగా మాత్రమే అవకాశాలు సాధించుకునేవారు. మాణిక్ సర్కార్ పాతికేళ్ల పాలన పొడవునా ఇలాగే జరుగుతూ వచ్చింది . ఈ తరహా విధానంతో త్రిపురలో గిరిజనులెవ్వరూ చక్కటి ఇంగ్లీషును మాట్లాడటం, మార్క్స్, లెనిన్ గురించి మాట్లాడటం చేయలేకపోయారు. దీనివల్లే 34 శాతం గిరిజన జనాభా ఉన్న త్రిపురలో ఒక్క గిరిజనుడు కూడా సీపీఎంలో పాలిట్ బ్యూరో సభ్యుడు కాలేకపోయారు. అలాగే పశ్చిమబెంగాల్లో కూడా శ్రామిక ప్రజానీకాన్ని 34 ఏళ్లపాటు ఇంగ్లిష్ విద్యకు దూరం చేసిన తరహా విద్యావిధానాన్ని సీపీఎం కొనసాగించింది. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి వీరికి ఏం మిగిలిందో మరి! మరోవైపున సంపన్నులైన భద్రలోక్ కామ్రేడ్లు ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చదువుకోగలిగారు. వీరివద్ద ప్రైవేట్ విద్యకు చెల్లించేటంత డబ్బు ఉంది మరి. అదేసమయంలో బెంగాలీ మీడియంతోపాటు ఒక ఇంగ్లిష్ సబ్జెక్టుతో కూడిన భాషా విధానాన్ని రుద్దడం ద్వారా పశ్చిమ బెంగాల్‌లోని గ్రామీణ ప్రాంతం మొత్తాన్ని వీరు వెనుకబాటుతనంలో ముంచెత్తారు. ఈ రాష్ట్రంలోనూ జనాభాలో 65 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందినవారే ఉంటున్నారు. వీరిలో ఎవరికీ ఇంగ్లిష్‌లో మాట్లాడే ప్రతిభ లేదు కాబట్టే వీరినుంచి ఒక్క కమ్యూనిస్టు నేత కూడా సీపీఎం పాలిట్‌బ్యూరోలోకి ప్రవేశించలేకపోయారు. సెయింట్ స్టీఫెన్ కాలేజీలో చదువుకుని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన రాహుల్ కూడా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో ఏకీకృత బోధనా భాషను ప్రవేశపెడతానని హామీ ఇవ్వలేకపోయారు. ప్రైవేట్ రంగంలో ఇంగ్లిష్ మీడియం నమూనాను, ప్రభుత్వ రంగంలో ప్రాంతీయ భాషా మీడియంను ప్రవేశపెట్టటం నెహ్రూ పాలనా విధానాల్లో భాగమే కదా. మన దేశంలోని ఘనతవహించిన సెక్యులర్, ఉదారవాద కమ్యూనిస్టు మేధావులు సంపూర్ణంగా ఈ ద్విభాషా విధానాన్ని ఆమోదించేశారని మనం మర్చిపోకూడదు. నరేంద్రమోదీ అభిప్రాయంలో ఖాన్ మార్కెట్, మండీ బజార్ విద్యావిధానం రెండూ ప్రత్యేకమైనవి. బడా బిజినెస్ స్కూళ్ల నుంచి ఇటలీ, ఫ్రెంచ్ భాషలను తొలగించి మరొక ప్రాతీయ భాషలో బోధించాలని చెప్పడం ద్వారా ఇప్పుడు బీజేపీ కూడా అదే విధానాన్ని కాస్త ఎక్కువగానో లేక తక్కువగానో ఆమోదించేసింది.ఇంతకు ముందు నెహ్రూవియన్ విద్యావిధానాన్ని మనం చూశాం. ఈ విధానం ప్రకారం ఖాన్ మార్కెట్ సంపన్నులు ఇంగ్లిష్ మీడియంలోనూ, మండీ బజార్ సాధారణ ప్రజలు హిందీ మీడియంలోనూ చదువుకునేవారు. ఇప్పుడు మనకు భారత మాత స్మృతి ఇరానీ విద్యా విధానం ఉంది. దీని ప్రకారం కూడా స్మృతి పిల్లలు, ఆమె ప్రత్యర్థి ప్రియాంకా గాంధీ పిల్లలు ఖాన్ మార్కెట్ కాలేజ్ అయిన సెయింట్ స్టీఫెన్స్‌లో చదువుకుంటూ ఉంటారు, ఇకపోతే మండీబజార్ మాస్ పిల్లలు ప్రభుత్వ హిందీ మీడియం కాలేజీల్లోనే చదువుకుంటూ చౌకీదార్లుగా, ఛాయ్‌వాలాలుగా అవతరిస్తుంటారు. ఇప్పుడు మనకెదురవుతున్న ప్రాథమిక ప్రశ్న ఏమిటంటే, ఇంగ్లిష్ భారతదేశమంతటా అమలులో ఉన్న భాషగా ఉంటున్నప్పుడు, దాన్ని భారత జాతీయ భాషగా గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో మరిన్ని సబ్జెక్టులలో ఇంగ్లిష్ బోధనను ఎందుకు విస్తరించకూడదన్నదే. ఇంగ్లిష్తో పోలిస్తే మన ప్రాంతీయ భాషలు పొలాల్లో పనిచేసే కూలీల మాతృభాషగా మాత్రమే ఉంటున్నాయి. ఇప్పుడు సంఘ్ పరివార్‌కి చెందినవారు అత్యధిక సంఖ్యలో విమాన ప్రయాణీకులుగా ఉంటున్నారు. వీరి పిల్ల లందరూ ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు.క్షేత్రస్థాయిలో ఇలాంటి పరిస్థితి ఉంటున్నప్పుడు, మనం ద్విభాషా విధానాన్ని (ఇంగ్లిష్ ఒక ప్రాంతీయ భాష) ఎందుకు చేపట్టకూడదు? ఇంగ్లిష్‌ను గిరిజన ప్రాంతాల్లోని పిల్లలకు కూడా విçస్తృతస్థాయిలో ఎందుకు బోధించకూడదు? అలాగే ప్రైవేటు పాఠశాలలన్నింట్లో సమాన స్థాయిలో ఈ రెండు భాషలను ఎందుకు బోధించకూడదు? ఇది సాకారమైనప్పుడు భారతదేశవ్యాప్తంగా మన ప్రజలు భవిష్యత్తులో పరస్పరం ఇంగ్లిష్‌లో మాట్లాడుకోగలరు, తమ రాష్ట్రం పరిధిలో వీరు అటు ఇంగ్లిష్‌లో, ఇటు ప్రాంతీయ భాషలో మాట్లాడుకోవచ్చు. తమిళనాడు చేస్తున్నది ఇదే మరి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే గ్రామీణ ప్రజానీకానికి వాగ్దానం చేసి ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్ మీడియంలోకి మారుస్తాననీ, ఒక సబ్జెక్టును తప్పకుండా తెలుగులో బోధించేలా చేస్తానని ఆయన నొక్కి చెప్పారు. ఈ హామీని ఆయన నెరవేర్చిన రోజున ఆంధ్రప్రదేశ్ దేశానికే నమూనా రాష్ట్రంగా మారుతుంది. ప్రొఫెసర్ కంచ ఐలయ్య వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
ఇంటర్ అవకతవకలపై న్యాయ విచారణ చేయాలి
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాపాలన గాడి తప్పిందని, ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ చేయాలని, విద్యార్థుల చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన ‘ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల నివారణ’అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జస్టిస్ ఈశ్వరయ్య, విద్యావేత్త చుక్కారామయ్య, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, ప్రొఫెసర్ పీఎల్. విశ్వేశ్వర్రావు, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, కాసీంలతో పాటు పలువురు సామాజిక వేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ ఇంటర్‌బోర్డు, గ్లోబరీనా సంస్థ చేసిన తప్పుల వల్ల 24 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షం ఏర్పాటుచేసి–మేధావులు, విద్యావంతులతో పరిష్కార మార్గాలు కనుగొనే చర్యలు తీసుకోవాలని సూచించారు. కంచ ఐలయ్య మాట్లాడుతూ..ఇంటర్ విద్యను రద్దు చేసి రానున్న విద్యాసంవత్సరం నుంచి 11వ తరగతి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 12వ తరగతి వరకూ హైస్కూల్స్ విద్య ద్వారా గ్రామాల్లోని పేద ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందన్నారు. ఈ ప్రపంచాన్ని మార్చే ఒకేఒక్క ఆయుధం విద్య అని అలాంటి విద్యను వ్యాపారంగా చేసి పేద ప్రజల జీవితాలతో ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు చెలగాటమాడుతు న్నాయని మండిపడ్డారు. నారాయణ, చైతన్య లాంటి విద్యాసంస్థల్లో చదివిన ఏ ఒక్కరూ మేధావులు కాలేదని ఎద్దేవా చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలను రాష్ట్ర హైకోర్టు సుమోటోగా స్వీకరించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్బంధాలకు, విద్యార్థులపట్ల చూపుతున్న వైఖరికి నిరసనగా 48 గంటల్లో నగరంలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆచార్య కాసీం మాట్లాడుతూ పాలకుల వల్లే విద్య వ్యాపారంగా మారిందని, తెలంగాణలో వ్యాపార ధోరణిలు పెట్రేగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలు సంఘాల నేతలు విక్రంగౌడ్, నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎదగడానికి ఇంగ్లిషే రాచబాట
వేలసంవత్సరాల భారతీయ చరిత్రలో ప్రధాన పాలక భాషలుగా చలామణి అయిన సంస్కృతం, పర్షియన్, ఇంగ్లిషు భాషలకు శూద్రులు, దళితులు, ఆదివాసీలు వెలుపలే ఉంటూ వచ్చారు. పాలకభాషకు దూరమయ్యారు కాబట్టే తొలినుంచీ వీరికి దేశవ్యాప్తంగా సంబంధాలుండేవి కావు. చిన్న స్థాయి భాషలతోటే వీరి మనుగడ సాగేది. దేశ చరిత్రలో ఇంగ్లిష్ విద్యను పొందిన మొట్టమొదటి శూద్రుడు మహాత్మా పూలే. భారతదేశంలో శూద్రులు బానిసలుగా ఉన్నారని ఆయన ఇంగ్లిష్ ద్వారానే ప్రపంచానికి చాటిచెప్పారు. శూద్ర, దళిత, ఆదివాసీలలో నిజమైన విద్యా విప్లవం అంబేద్కర్తోటే ప్రారంభమైంది. వెనుకబడిన వర్గాలు జాతీయ స్థాయి సంబంధాల్లోకి రావాలంటే ఇంగ్లిషు తప్పనిసరి. కానీ ఇంగ్లిష్ భాష ఎన్నికల అంశంగా మారితే తప్ప సామాన్య ప్రజలందరి భాషగా ఇంగ్లిషును పాలకులు అనుమతించరన్నది వాస్తవం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఒక ఆసక్తికరమైన చర్చ చోటు చేసుకుంది: చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్.. వీరిలో ఇంగ్లీషు చక్కగా ఎవరు మాట్లాడతారు అన్నదే ఆ చర్చ సారాంశం. వీళ్లు ముగ్గురూ శూద్రులే. చంద్రబాబు, కేసీఆర్‌లు తొలి తరంలో ఇంగ్లిష్ నేర్చుకున్న వారు కాగా, వైఎస్ జగన్ రెండో తరానికి చెందిన, ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న విద్యావంతుడైన నాయకుడు. ఆయన తండ్రి కూడా డాక్టరే. పైగా ఇంగ్లిష్ చక్కగా మాట్లాడేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 6000 ప్రభుత్వ పాఠశాలల్ని ఇంగ్లిష్ మీడియంలోకి మార్చడం ద్వారా ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ బోధనను ప్రారంభించారు. గ్రామీణ విద్యా పరివర్తన విషయంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కీలకమైన మార్పు ఇదే. దీన్ని మంచి రాజకీయ ఆవిష్కరణగా భావిస్తూనే, చారిత్రకంగా ఇంగ్లిష్ విద్యలో శూద్రులు/దళితులు/ఆదివాసుల స్థానమేంటో చూద్దామా? మనకు తెలిసిన చరిత్రలో ఇంగ్లిష్ మూడో భారతీయ పాలక (అధికారిక) భాషగా ఉంటోంది. కలకత్తా ప్రావిన్స్‌లో భాషా విధానాన్ని పర్షియన్ భాష నుంచి ఇంగ్లిష్‌కు మార్చడం ద్వారా 1858లో ఇంగ్లిష్ భారతీయ పాలక భాషగా మారింది. దీనికి ముందు పర్షియన్ భాషే అఖిల భారత స్థాయిలో పాలనాభాషగా ఉండేది. పర్షియన్ భాష పాలనా భాషగా మారడానికి ముందు దేశంలో సంస్కృతమే పాలకుల భాషగా ఉండేది. ఇంతవరకు ఈ మూడు భాషలు మాత్రమే అఖిల భారత స్వభావాన్ని సంతరించుకుని ఉండేవి. ఇతర భాషలన్నీ భారతీయ చరిత్ర పొడవునా ప్రాంతీయ, స్థానిక, గిరిజన భాషలుగా ఉండేవి. హరప్పా నగర నాగరికతలో ఏ భాష అమల్లో ఉండేదో మనకు తెలీదు. బహుశా అది బౌద్ధుల కాలంలో ప్రాచుర్యంలో ఉండిన పాళీ వంటి భాష అయివుండవచ్చు. నాటి పాలక రాజవంశాలు పాళి భాషను ఏమేరకు ఉపయోగించి ఉంటాయో మనకు తెలీదు. బౌద్ధ, జైన సాహిత్యం పాళి భాషలోనే ఉండటంతో ఇది కూడా ప్రధాన భారతీయ భాషగా ఉండవచ్చు కానీ సంస్కృత ఆధిపత్యం సాగిన కాలంలో పాళీని నిర్మూలించివేశారు. పలు దక్షిణ భారత భాషలు పాళీతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ దక్షిణ భారతదేశంలో ఇప్పటికీ సంస్కృతం ఉనికిలో ఉన్న విధంగా పాళీ ఒక భాషగా మనలేదు. సంస్కృత భాషను ఇంటి భాషగా, మార్కెట్ భాషగా అనుమతించనప్పటికీ హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థతోపాటు సంస్కృతం కొనసాగుతూ వచ్చింది. సంస్కృత ఆధిపత్యం రాజ్యమేలిన కాలంలో ఇప్పటి ఇతర వెనుకబడిన కులాలు, రిజర్వ్డ్ విభాగంలో లేని భూమి కలిగివున్న శూద్ర ఉన్నత వర్గం, రైతాంగంతో సహా శూద్ర వ్యవసాయ ఉత్పత్తిదారులకు సంస్కృత భాషలో చదివే, రాసే హక్కు ఉండేది కాదు. ఇక దళితులను, గిరిజనులను తొలి నుంచి పౌర సమాజ వ్యవస్థకు వెలుపలనే ఉంచేశారు. కాబట్టి సంస్కృతం లేదా పర్షియన్ భాషల్లో వారి ప్రవేశం అనే ప్రశ్నే తలెత్తేది కాదు. దాదాపుగా కులవంశాలు, తెగలు మాట్లాడే చిన్నచిన్న భాషలతోటే వీరు మనుగడ సాగించేవారు. జాతి గురించిన వారి భావన కేవలం తెగ లేక వంశం అనే అర్థంలో ఉండేది. 21వ శతాబ్ది ప్రారంభం నాటికి శూద్రులు/దళితులు/గిరిజనులు తమ తమ భాషా ప్రాంత రాష్ట్రాల్లోని ప్రాంతీయ భాషల్లో చక్కగా వ్యక్తీకరించగల స్థాయిని పొందారు. కానీ దేశవ్యాప్తంగా ప్రజలతో వీరి సంబంధ బాంధవ్యాలు నామమాత్రంగానే ఉంటున్నాయి. అదే సమయంలో బ్రాహ్మణులు/బనియాలు కొత్త భాష అయిన ఇంగ్లిషుపై పట్టు సాధించి అంతర్జాతీయ కమ్యూనిటీలోకి పరివర్తన చెందారు. ప్రారంభంలో వీరు కూడా ఇంగ్లిష్‌ని వలసభాషగా నిందించేవారు కానీ ప్రైవేట్ పాఠశాలల్లో, కళాశాలల్లో ఆ భాషను నేర్చుకోవడం కొనసాగించారు. 21వ శతాబ్ది ప్రారంభం నాటికి వీరు తమకుతాముగా ఇంగ్లిష్ మాట్లాడే, రాసే వర్గంగా మారారు. అయితే ముఖ్య విషయమేమిటంటే, ఇంగ్లిష్ జాతీయ భాషగా మారినప్పటికీ, శూద్రులు, ఓబీసీలు, దళితులు, ఆది వాసీలు దేశవ్యాప్తంగా పరస్పర సంబంధాలలో ఉండేవారు కాదు. సంస్కృతం చలామణిలో ఉన్న కాలంలో బ్రాహ్మణులు మాత్రమే దేశ వ్యాప్తంగా సంబంధాలు కలిగి ఉండేవారు. కొంతమంది బనియాలు, క్షత్రియులకు కూడా సంస్కృతం తెలిసినప్పటికీ అది వారి ఇంటి భాషగా ఉండేది కాదు. బ్రాహ్మణులకు మాత్రం సంస్కృతం ఇంటిభాషే. ఈరోజు దేశంలోని 29 రాష్ట్రాల్లోనూ శూద్రులు, దళితులు, ఆదివాసుల్లో కొద్దిమంది మాత్రమే ఇంగ్లిష్‌ను చదివి, రాయడమే కాకుండా రాష్ట్ర పాలనాపరమైన అంశాల్లో పాలుపంచుకుంటున్నారు. వారి ఆత్మవిశ్వాస స్థాయిలు పెరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వీరికి కూడా అంతర్జాతీయ భాష గురించి తెలుసు, పైగా ఉత్పత్తిలో పాలుపంచుకోనప్పటికీ రాష్ట్రంలోని, మార్కెట్లోని ప్రతి రంగంలోనూ ఆధిక్యత కలి గివున్న బ్రాహ్మణులు, బనియాలతో వీరు పోటీపడుతున్నారు. శూద్రులు, దళితులు, ఆదివాసీ శక్తులు వ్యవసాయ, చేతివృత్తులకు చెందిన ఉత్పత్తికి కట్టుబడిపోవడంతో వీరికి రాష్ట్రాల మధ్య సంబంధాలతో పనిలేకుండా పోయింది. వ్యాపార కార్యాచరణ, రాష్ట్ర పాలనకు లాగా గ్రామీణ, చేతివృత్తుల ఉత్పత్తికి దేశవ్యాప్త ప్రయాణాలు, అనుసంధానం అవసరం లేదు. ఆధ్యాత్మిక రంగంలోని బ్రాహ్మణులు, వ్యాపారరంగంలోని బనియాలు సంస్కృతంలో, ప్రాంతీయ భాషల్లో అధునాతన భాషా నైపుణ్యాలను పొందారు. శూద్రులు, దళితులు, ఆదివాసీ ప్రజానీకంపై ఆధిపత్యం వహించడానికి వీరు తమ బాషా నైపుణ్యాలను ఉపయోగించేవారు. ఈ పరిస్థితుల్లో భారతీయులందరికీ ఇంగ్లిషును పరి చయం చేయకపోతే, ఈ శూద్ర, దళిత, ఆదివాసీలు ఆధునిక ఆర్థికవ్యవస్థలోకి ప్రవేశించలేరు కూడా. చివరకు అన్ని రాష్ట్రాల్లోనూ మార్కెట్ సంబంధాలు కూడా ఇంగ్లిషులోనే నడుస్తున్నాయి. సాధారణ మార్కెట్ పూర్తిగా ఇంగ్లిషుకు మారనప్పటికీ, సాంకేతిక మార్కెట్లో మాత్రం ఇంగ్లిష్ ఇప్పుడు విస్తరిస్తోంది. హిందీకి అలాంటి విస్తరణ లేదు. 16వ శతాబ్దిలో మొఘల్ పాలన నుంచి బ్రిటిష్ పాలన మధ్యకాలం వరకు పర్షియన్ భాష దేశవ్యాప్తంగా వ్యవహారంలో ఉండేది. చిన్నచిన్న పాలకులు పర్షియన్, ఇతర భాషల్లోనే పాలనను నిర్వహించినప్పటికీ ముఖ్యంగా వీరు ముస్లిం లేక బ్రాహ్మణ అధికారులపైనే ఆధారపడేవారు. ఉదాహరణకు, హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ఉర్దూ, పర్షియన్ భాషలను ఉపయోగించేవారు. కొన్ని రాష్ట్రాలు పర్షియన్, ఇతర భాషలను ఉపయోగించేవి. శూద్రులలో ఉన్నత స్థాయి కలిగిన వారు 20 శతాబ్ది ప్రారంభంలో భూయజమానులుగా లేక భూస్వాములుగా మారి నప్పటికీ, వారిలో పర్షియన్ భాషా నైపుణ్యాలు పెరగలేదు. సంస్కృతభాష మాత్రం హిందూ మతపరమైన భాషగా ఉనికిని సాగించింది కానీ శూద్రులకు ఈనాటికీ పౌరోహిత్య హక్కు లేదు. అందుకే వీరు సంస్కృత పాఠాలతో పాండిత్య స్థాయిలో సంబంధం కలిగిలేరు. కొద్దిమంది శూద్రులు మాత్రమే సంస్కృతంలో ప్రావీణ్యం సంపాదించినప్పటికీ, వీరు గొప్ప పండితులు కాలేకపోయారు. పైగా హిందూ ధార్మిక గ్రం«థా లపై వీరు చేసే వ్యాఖ్యానాలకు సాధికారిక ఆమోదం లభించలేదు. బ్రాహ్మణ పండితుడి సంస్కృతం మాత్రమే ప్రామాణికంగా గుర్తింపు పొందేది. అందుచేతే సంస్కృత భాషా రంగంలో సమయాన్ని, శక్తిని, వనరులను వెచ్చించడానికి శూద్రులలో ఎవరికీ ఆసక్తి లేకుండా పోయింది. ఫలితంగా వేల ఏళ్లుగా వీరు జాతీయతత్వం అనే భావనకు దూరంగా ప్రత్యేక ప్రాంతాల్లోనే మిగిలిపోయి ఉన్నారు. ప్రస్తుతం దళితుల ముందున్న మార్గం ఏది? శూద్రులు, దళితులు, ఆదివాసీల అభ్యున్నతికి ఏకైక పరిష్కారం దేశం లోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెట్టడమే. విద్యలో ద్వంద్వ మీడియం.. అంటే ప్రభుత్వ స్కూళ్లలో ప్రాంతీయ భాష, ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అనేది ఒక వంచనాత్మక వ్యవస్థ. శూద్రులను, దళితులను, ఆదివాసీలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిని అందుకోకుండా అడ్డుకోవడమే దీని లక్ష్యం. భారత స్వాతంత్య్రానంతరం కూడా బ్రాహ్మణ, బనియా శక్తులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇలాంటి వ్యవస్థకు పథక రచన చేశారు. శూద్ర, దళిత, ఆదివాసీలకు జాతీయస్థాయిలో వారిని అనుసంధానించే భాషే లేకుండా పోయింది. దేశ చరిత్రలో ఇంగ్లిష్ విద్యను పొందిన మొట్టమొదటి శూద్రుడు మహాత్మా పూలే. భారత్‌లో శూద్రులు బానిసలుగా ఉన్నారని ఆయన ఇంగ్లిష్ ద్వారానే ప్రపంచానికి చాటిచెప్పారు. ఆనాటికి రాజారామ్మోహన్ రాయ్, గోపాలకృష్ణ గోఖలే, బాల గంగాధర్ తిలక్, మహదేవ్ గోవింద్ రనడే (అందరూ బ్రాహ్మణులే) ఇంగ్లిష్‌లోనే చదువుకున్నారు. నిజానికి తిలక్ 1880లోనే ఇంగ్లిష్ మీడి యం స్కూల్‌ను ప్రారంభించారు. మహాత్మా పూలే ఆయన సీనియర్. కానీ ఒక స్కాటిష్ మిషన్ స్కూల్లో 7వ తరగతి వరకే ఆయన చదువుకున్నారు. శూద్రులను చారిత్రక నిరక్షరాస్యత నుంచి ఆయన కాపాడారు. శూద్రులలో కొద్దిమంది మాత్రమే ఇంగ్లండ్‌కు వెళ్లే అవకాశం పొంది ఇంగ్లిషు విద్యను నేర్చుకున్నారు కానీ ఇంగ్లిష్ నేర్వడంలో వారికి పరిమితులు ఉండేవి. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న కొందరు శూద్రులు విద్యపై ఎన్నడూ పెద్దగా దృష్టి పెట్టలేదు. మైసూర్ రాజు, బరోడా రాజు వంటి చిన్న చిన్న రాజులు ఉండేవారు. ఈయనే తర్వాత అంబేడ్కర్‌కి విద్యలో సహాయం చేశారు. కాని ఇలాంటి రాజులు తమ కుటుంబ సభ్యులను ఇంగ్లండ్‌కు పంపించి ఇంగ్లిష్ విద్య నేర్పించిన రుజువులేవీ లేవు. విద్యకున్న శక్తి ఏమిటో గ్రహించిన వారు కాబట్టి బ్రాహ్మణులు, బనియాలు మాత్రమే విద్య గురించి తీవ్రంగా ఆలోచించేవారు. ఏమైనప్పటికీ శూద్ర, దళిత, ఆదివాసీలలో నిజమైన విద్యా విప్లవం అంబేడ్కర్తోటే ప్రారంభమైంది. ఆ విప్లవం ప్రాథమికంగా అనిశ్చితంగానే ఉంటోంది. అది ఆత్మిక, భౌతిక రూపొన్ని సంతరించుకోలేదు. హిందుత్వ శక్తులు అందరికీ ఇంగ్లిషు విద్యను అనుమతిస్తాయో అన్నది ముఖ్యమైన ప్రశ్న. ఎన్నికల అంశంగా మారితే తప్ప ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్ వ్యతిరేక మేధావులు ఇంగ్లిష్ భాషను సామాన్య ప్రజాభాషగా అనుమతించబోరని వారితో సుదీర్ఘకాలంగా పోరాడుతున్న నా అనుభవం తేల్చి చెబుతోంది. వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ ప్రొ‘‘ కంచ ఐలయ్య షెఫర్డ్ ప్రొ‘‘ కంచ ఐలయ్య షెఫర్డ్ -
‘చినజీయర్‌స్వామిపై రాజద్రోహం కేసు పెట్టాలి’
సాక్షి, హైదరాబాద్: దేశంలో కులాలు, అంతరాలు ఉండాలని ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పిన ఆంధ్ర పీఠాధిపతి చినజీయర్ స్వామిపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య డిమాండ్ చేశారు. బుధవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో టీపీఎస్కే, కేవీపీఎస్ ఆధ్వర్యంలో చినజీయర్ స్వామి వ్యాఖ్యలకు నిరసనగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టే ముందు సాష్టాంగ నమస్కారం చేయడం విచారకరమని ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. కులాలు ఉండాలి, వర్ణ వ్యవస్థ ఉండాలని చెప్పిన చినజీయర్ స్వామిపై చర్యలు తీసుకోకుంటే ఆయన ఆక్రమించుకున్న 500 ఎకరాల ఆశ్రమం వద్ద నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. మోదుగుపూల ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన చినజీయర్ స్వామిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి టి.స్కైలాబాబు, ప్రముఖ కవి కాలువ మల్లయ్య, జేవీవీ జాతీయ నాయకులు టి.రమేశ్, పీఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
సిలబస్ నుంచి ఐలయ్య పుస్తకం తొలగింపు?
సాక్షి, న్యూఢిల్లీ: పొలిటికల్ సైన్స్ సిలబస్ నుంచి ప్రొ.కంచ ఐలయ్య రాసిన పుస్తకాలను తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ సిఫార్సుచేసింది. విద్యాపర విషయాల్లో దళిత్ అనే పదం స్థానంలో ‘షెడ్యూల్డ్ కులం’ను వాడాలని పేర్కొంది. విద్యా విషయాలపై వర్సిటీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా 9 పీజీ కోర్సుల సిలబస్‌పై చర్చించామని ప్రొ.హన్స్‌రాజ్ సుమన్ తెలిపారు. ప్రొ.కంచ ఐలయ్య రాసిన ‘వై ఐ యామ్ నాట్ ఎ హిందు’, ‘పోస్ట్-హిందూ ఇండియా’లో వివాదస్పద విషయాలు ఉన్నందునే వాటిని సిలబస్ నుంచి తప్పించాలని వర్సిటీకి సూచించినట్లు చెప్పారు. అంబేడ్కర్ రచనల్ని సిలబస్‌లో చేర్చాలని సిఫార్సు చేశారు. స్టాండింగ్ కమిటీ సిఫార్సు దురదృష్టకరమని ఐలయ్య వ్యాఖ్యానించారు. తన పుస్తకాలు పలు విదేశీ, దేశీ యూనివర్సిటీల సిలబస్‌లలో భాగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. -
కేటీఆర్‌పై పోటీ చేసేదెవరో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ముందస్తుగా కేసీఆర్ కొనితెచ్చుకున్న ఎన్నికల్లో కేసీఆర్‌పై గద్దర్, కేటీఆర్‌పై విమలక్క పోటీ చేయనున్నారని టీమాస్ ఫోరం ఛైర్మన్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గద్దర్, విమలక్కలు మాత్రమే తెలంగాణ వారసులని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం వీరిద్దరూ ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. గద్దర్ రాష్ట్రం కోసం పోరాడుతుంటే అప్పటి ప్రభుత్వం కాల్పులు జరిపిందని.. ఆయనకు 6 బుల్లెట్లు తగిలాయని, విమలక్క కాలుకు గజ్జె కట్టి రాష్ట్రం కోసం ఆడీపాడారని చెప్పారు. ఏ త్యాగం చేయని కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారని విమర్శించారు. గద్దర్, విమలక్కలను గెలిపించేందుకు ఇతర పార్టీలు, ప్రజాసంఘాలు కృషి చేయాలన్నారు. వారిపై పోటీ పెట్టకుండా కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీల వారు సహకరించాలని కోరారు. పోటీ పెట్టవద్దని రాహుల్ గాంధీ, కుంతియా, ఉత్తమ్ కుమార్‌రెడ్డిలకు వినతిపత్రం సమర్పించనున్నట్లు ఐలయ్య స్పష్టం చేశారు. సమావేశంలో టీమాస్ ఫోరం కన్వీనర్ జాన్‌వెస్లీ, నాయకులు హిమబిందు, రేఖ ముక్తాల, మన్నారం నాగరాజు, శ్రీరాం నాయక్,ప్రొఫెసర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
మళ్లీ దొరల చేతిలో అధికారం పెట్టొద్దు: ఐలయ్య
నిర్మల్ అర్బన్: ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేయొద్దని.. మళ్లీ దొరల చేతిలో అధికారం పెట్టవద్దని టీమాస్ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం‘ఓటు హక్కు–ఎన్నికల సంస్కరణ’పై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని వర్గాల ప్రజలు త్యాగాలు చేశారని, కానీ సామాజిక తెలంగాణ రాకుండా వెలమ, రెడ్ల చేతుల్లోకి అధికారం వెళ్లిందన్నారు. ఈసారి వారిని గెలవనీయవద్దని చెప్పారు. ఉద్యమాన్ని తమ ఆటపాటల ద్వారా ఉవ్వెత్తున నిలిపిన గద్దర్, విమలక్కలకు మద్దతునిస్తూ కేసీఆర్, కేటీఆర్‌లపై పోటీ చేయాలని కోరినట్లు చెప్పారు. టీమాస్ అధికారంలోకి వస్తే సోషలిస్ట్ వెల్ఫేర్ ఎజెండాను అమలు చేస్తామని, ఎమ్మెల్యేల వేతనాలను ఎత్తేస్తామని, రూ.3కే టిఫిన్, రూ.5 బహుజన బువ్వ, ఇంటర్మీడియెట్‌ను రద్దు చేసి కేజీ నుంచి 12వ తరగతి వరకు గ్రామంలోనే ఆంగ్లబోధన అందేలా చూస్తామని వివరించారు. -
భారత్ మాతాకీ జై కాదు..భీమ్..భూమ్ జై అనాలి
తెయూ(డిచ్పల్లి): భారత దేశ పౌరులంద రూ భారత్ మాతా కీ జై.. అనే నినా దాన్ని మానుకుని జై భీమ్.. జై భూమ్.. అనే నినాదాన్ని చేయాలని సామాజిక శాస్త్రవేత్త కంచె ఐలయ్య పిలుపునిచ్చారు. బుధవా రం డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సి టీ క్యాంపస్‌లో తెలంగాణ యూనివర్సిటీ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మహనీయుల జయంతి వేడుకలు’ కార్యక్రమానికి కంచె ఐలయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు గోమాతను పూజించాలని చెబుతుంటారని, అయితే గోవు కంటే బర్రె (గేదె) పాలు ఎక్కువగా ఇస్తుందని, మరి బర్రెలను పూజించమని ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. గొల్ల కులంలో పుట్టిన అందరికీ వేపకాయంత వెర్రి ఉంటుందని, తనకు మాత్రం తాటికాయంత వెర్రి ఉందన్నారు. మంగళి కత్తి, చాకలి వృత్తి గొప్పవని, దేశంలో బ్రాహ్మణ రెజియేషన్ ఉందా అని ప్రశ్నించారు. భారత దేశానికి నిజమైన శత్రువు పాకిస్తాన్ కాదని, చైనా నుంచి దేశానికి ముప్పు పొంచి ఉందన్నారు. భవిష్యత్‌లో చైనాను ఎదుర్కొవాలంటే బెండకాయ, బీరకాయ తింటే సరిపోదని, మంచి బీఫ్ తినాలని పిలుపునిచ్చారు. రాందేవ్ బాబా యోగా ఉత్త గేమ్ అని, ప్రతి ఒక్కరూ ఎక్సర్సైజులు చేయాల ని సూచించారు. అలాగే ఇతరులతో పోటీ పడాలంటే ఇంగ్లీషు నేర్చుకోవడం తప్పనిసరి అని అన్నారు. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రజ్ఞ మాట్లాడుతూ.. దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి ఫూలేను చదువుల తల్లిగా కొలువాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 5న సావిత్రి ఫూలే జయంతిని గురుపూజోత్సవం జరుపుకోవాలన్నారు. చిన్నారి ఆసిఫా అత్యాచారం, హత్య ఘటనలో రాజకీయ కుట్ర దాగి ఉం దని ఆరోపించారు. హైదరాబాద్ సెం ట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బంగ్యా బుక్యా, ఎస్ఎస్డీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెంజర్ల నరేశ్, డాక ్టర్ మోతీలాల్, ఏఎస్ఏ తెయూ కన్వీనర్ జగన్, అధ్యక్షుడు అశోక్‌సామ్రాట్, రాజేందర్ పాల్గొన్నారు. -
బీజేపీపై ప్రకాశ్‌రాజ్, కంచ ఐలయ్య ఫైర్
సాక్షి, హైదరాబాద్ : కేంద్రం, ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు భావప్రకటనా స్వేచ్ఛను దారుణంగా హరిస్తున్నాయని నటుడు ప్రకాశ్‌రాజ్, ప్రొఫెసర్ కంచ ఐలయ్య అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఇండియాటుడే సౌత్ కంక్లేవ్-18లో వారు మాట్లాడారు. ఎస్ దుర్గా, పద్మావతి సినిమాలపై జరుగుతోన్న దాడిని ఖండించారు. నటుడు విశాల్, ‘ఎస్ దుర్గ’ దర్శకుడు శశిధరన్లు కూడా చర్చలో భాగస్వాములుగా ఉన్నారు. కంచె ఐలయ్య ఏమన్నారంటే.. ‘‘బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి రాగలిగిందంటే దళితుల ఓట్లు కూడా కారణమని చెప్పుకుంటారు. అయితే, నిజానికి ప్రజాస్వామ్య భావన కేవలం ఓట్లతో ముడిపడిన అంశమేకాదు! అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఏ కూలీన వర్గాలైతే ఓట్లు వేశాయో వారిని ప్రభుత్వాలు ఇంకా అణిచివేతకు గురిచేస్తుండటం గర్హనీయం. గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా దళిత, పేద వర్గాలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుండటం దేనికి సంకేతమో ఆలోచించాలి. మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌పై చూపించిన శ్రద్ధ.. ‘దళితులకు అర్చకత్వ హక్కు’ విషయంలో చూపించడంలేదు. వారు మతరాజకీయాలు చేస్తున్నారనడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే’’ అని పేర్కొన్నారు. హిందూ వ్యతిరేకిని కాను.. మోదీ వ్యతిరేకిని : ప్రకాశ్ రాజ్ ‘‘నా స్నేహితురాలు గౌరీ లంకేశ్‌ను చంపేసిన తర్వాత కొంత మంది సంబరాలు చేసుకున్నారు. వారంతా మోదీ ఆరాధకులని తెలిసింది. నేను బీజేపీకి ఓటు వేశానా లేదా అన్నది అనవసరం. మోదీ ఈ దేశానికి ప్రధానమంత్రి అన్నది నిజం. మరి దేశంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నా పట్టించుకోరెందుకు? ఆయన గురించి ఏదైనా మాట్లాడితే ‘నువ్వు హిందూ వ్యతిరేకివి’ అని విమర్శిస్తారు. నిజానికి నేను హిందూ వ్యతిరేకిని కాను. మోదీ వ్యతిరేకిని. అమిత్ షా వ్యతిరేకిని. అనంతకుమార్ హెగ్డేకి వ్యతిరేకిని. ఆ బీజేపీ ఎంపీ హెగ్డే ఏమన్నారు? రాజ్యాంగాన్ని మార్చేస్తారా! ఆయనను ప్రశ్నిస్తూ నేను ప్రెస్‌మీట్ పెడితే.. వాళ్లు బీఫ్ గురించి మాట్లాడతారు. అరే! ఒక విధానమంటూ ఉండదా ఆ పార్టీకి! పద్మావతి సినిమా విషయంలో జరుగుతున్నదేంటి? సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేనప్పుడు బీజేపీ ప్రభుత్వాలు ఉండి మాత్రం ఏం లాభం? వెంటనే దిగిపోతే ప్రజలకు మంచిది’’ అని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. ‘సెక్సీ దుర్గా’కు మతంతో సంబంధంలేదు: శశిధరన్ తాను రూపొందించిన ‘సెక్సీ దుర్గా’ సినిమాకు మతాలకు అసలు సంబంధమేలేదన్నారు దర్శకుడు శశిధరన్. ఇతర మతాల కంటే హిందూత్వని విమర్శిస్తూ లేదా వ్యతిరేకిస్తూ వ్యక్తీకరణలు ఎక్కువైపోయాయన్న ప్రయోక్త ప్రశ్నకు దర్శకుడు ఘాటుగా బదులిచ్చారు. ‘‘ఒక మతాన్ని చులకనగా తీసుకుంటారనే ప్రశ్న.. క్యూరియాసిటీ(జిజ్ఞాస) నుంచి కాకుండా డివిజనిజం(వేర్పాటుభావన) నుంచి పుడుతుంది. ఇది నిర్మాణాత్మకమైన ప్రశ్నకాదు’ అని శశిధరన్ అన్నారు. న్యాయస్థానాలే దిక్కు : విశాల్ ‘‘పద్మావతి సినిమా విషయంలో సుప్రీంకోర్టు న్యాయమైన తీర్పు ఇచ్చింది. వ్యక్తులు, సంస్థలు సృష్టించే వివాదాలు పరిష్కారం కావాలంటే సినిమావాళ్లు న్యాయస్థానాలను ఆశ్రయించడమే ఉత్తమ మార్గం. అక్కడైతే న్యాయం దొరుకుతుంది’’ అని విశాల్ అన్నారు.