
సాక్షి, హైదరాబాద్ : కేంద్రం, ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు భావప్రకటనా స్వేచ్ఛను దారుణంగా హరిస్తున్నాయని నటుడు ప్రకాశ్‌రాజ్, ప్రొఫెసర్ కంచ ఐలయ్య అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఇండియాటుడే సౌత్ కంక్లేవ్-18లో వారు మాట్లాడారు. ఎస్ దుర్గా, పద్మావతి సినిమాలపై జరుగుతోన్న దాడిని ఖండించారు. నటుడు విశాల్, ‘ఎస్ దుర్గ’ దర్శకుడు శశిధరన్‌లు కూడా చర్చలో భాగస్వాములుగా ఉన్నారు.
కంచె ఐలయ్య ఏమన్నారంటే..
‘‘బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి రాగలిగిందంటే దళితుల ఓట్లు కూడా కారణమని చెప్పుకుంటారు. అయితే, నిజానికి ప్రజాస్వామ్య భావన కేవలం ఓట్లతో ముడిపడిన అంశమేకాదు! అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఏ కూలీన వర్గాలైతే ఓట్లు వేశాయో వారిని ప్రభుత్వాలు ఇంకా అణిచివేతకు గురిచేస్తుండటం గర్హనీయం. గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా దళిత, పేద వర్గాలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుండటం దేనికి సంకేతమో ఆలోచించాలి. మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌పై చూపించిన శ్రద్ధ.. ‘దళితులకు అర్చకత్వ హక్కు’ విషయంలో చూపించడంలేదు. వారు మతరాజకీయాలు చేస్తున్నారనడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే’’ అని పేర్కొన్నారు.
హిందూ వ్యతిరేకిని కాను.. మోదీ వ్యతిరేకిని : ప్రకాశ్ రాజ్
‘‘నా స్నేహితురాలు గౌరీ లంకేశ్‌ను చంపేసిన తర్వాత కొంత మంది సంబరాలు చేసుకున్నారు. వారంతా మోదీ ఆరాధకులని తెలిసింది. నేను బీజేపీకి ఓటు వేశానా లేదా అన్నది అనవసరం. మోదీ ఈ దేశానికి ప్రధానమంత్రి అన్నది నిజం. మరి దేశంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నా పట్టించుకోరెందుకు? ఆయన గురించి ఏదైనా మాట్లాడితే ‘నువ్వు హిందూ వ్యతిరేకివి’ అని విమర్శిస్తారు. నిజానికి నేను హిందూ వ్యతిరేకిని కాను. మోదీ వ్యతిరేకిని. అమిత్ షా వ్యతిరేకిని. అనంతకుమార్ హెగ్డేకి వ్యతిరేకిని. ఆ బీజేపీ ఎంపీ హెగ్డే ఏమన్నారు? రాజ్యాంగాన్ని మార్చేస్తారా! ఆయనను ప్రశ్నిస్తూ నేను ప్రెస్‌మీట్ పెడితే.. వాళ్లు బీఫ్ గురించి మాట్లాడతారు. అరే! ఒక విధానమంటూ ఉండదా ఆ పార్టీకి! పద్మావతి సినిమా విషయంలో జరుగుతున్నదేంటి? సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేనప్పుడు బీజేపీ ప్రభుత్వాలు ఉండి మాత్రం ఏం లాభం? వెంటనే దిగిపోతే ప్రజలకు మంచిది’’ అని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు.
‘సెక్సీ దుర్గా’కు మతంతో సంబంధంలేదు: శశిధరన్
తాను రూపొందించిన ‘సెక్సీ దుర్గా’ సినిమాకు మతాలకు అసలు సంబంధమేలేదన్నారు దర్శకుడు శశిధరన్. ఇతర మతాల కంటే హిందూత్వని విమర్శిస్తూ లేదా వ్యతిరేకిస్తూ వ్యక్తీకరణలు ఎక్కువైపోయాయన్న ప్రయోక్త ప్రశ్నకు దర్శకుడు ఘాటుగా బదులిచ్చారు. ‘‘ఒక మతాన్ని చులకనగా తీసుకుంటారనే ప్రశ్న.. క్యూరియాసిటీ(జిజ్ఞాస) నుంచి కాకుండా డివిజనిజం(వేర్పాటుభావన) నుంచి పుడుతుంది. ఇది నిర్మాణాత్మకమైన ప్రశ్నకాదు’ అని శశిధరన్ అన్నారు.
న్యాయస్థానాలే దిక్కు : విశాల్
‘‘పద్మావతి సినిమా విషయంలో సుప్రీంకోర్టు న్యాయమైన తీర్పు ఇచ్చింది. వ్యక్తులు, సంస్థలు సృష్టించే వివాదాలు పరిష్కారం కావాలంటే సినిమావాళ్లు న్యాయస్థానాలను ఆశ్రయించడమే ఉత్తమ మార్గం. అక్కడైతే న్యాయం దొరుకుతుంది’’ అని విశాల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment