
రానా, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండపై కేసు
ప్రణీత, నిధి అగర్వాల్, మంచు లక్ష్మితోపాటు
మరికొందరు యాంకర్లపై కూడా...
25 మందిపై మియాపూర్ ఠాణాలో నమోదుడ
సాక్షి, హైదరాబాద్/మియాపూర్: ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’పేరుతో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేస్తున్న అవగాహన కార్యక్రమం ప్రకంపనలు పుట్టిస్తోంది. దీంతో స్ఫూర్తి పొందిన అనేక మంది సామాజిక కార్యకర్తలు బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న పంజగుట్ట ఠాణాలో 11 మంది యాంకర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు కాగా... తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న మియాపూర్ పోలీసుస్టేషన్‌లో 25 మందిపై రిజిస్టరైంది. ఇందులో సినీనటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ తదితరులు నిందితులుగా ఉన్నారు. మియాపూర్‌కు చెందిన పీఎం ఫణీంద్ర శర్మ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.
కాలక్రమంలో బానిసలుగా...: బెట్టింగ్, గేమింగ్, క్యాసినో యాప్స్‌కు వ్యతిరేకంగా ముమ్మర ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫణీంద్ర గత ఆదివారం తమ కాలనీకి చెందిన యువకులతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలోనే వారిలో అత్యధికులు ఈ యాప్స్‌పై ఆసక్తి చూపడాన్ని గమనించారు. సోషల్‌మీడియా ద్వారా పలువురు సెలబ్రిటీలు, యాంకర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు చేస్తున్న ప్రచారమే దీనికి కారణమని ఫణీంద్ర గుర్తించారు. ఈ సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రచారం యువతను ప్రధానంగా డబ్బు అవసరం ఉన్న వారిని బెట్టింగ్ యాప్స్ ఉచ్చులోకి లాగుతోందని, అనేకమంది వాటిలో డబ్బు పెట్టి నిండా మునిగిపోతున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
ఎవరెవరు ఏ యాప్స్‌లో..
ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వాటిలో అత్యధికం సోషల్‌మీడియాలో పాప్‌అప్ యాడ్స్ రూపంలో వస్తున్నట్లు ఫణీంద్ర గుర్తించారు. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్‌లు జంగిల్‌రమ్మీ.కామ్, విజయ్ దేవరకొండ ఏ23, మంచు లక్ష్మి యోలో247.కామ్, ప్రణీత ఫేర్‌ప్లే.లైవ్, నిధి అగర్వాల్ జీత్‌విన్ సైట్లు, యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు.
సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యాంకర్లుగా ఉన్న అనన్య నాగెళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్‌రాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నియాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బీఎస్ సుప్రీత వివిధ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు పూర్తి వివరాలు సమరి్పస్తూ బుధవారం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈడీ కూడా రంగంలోకి..
పోలీసులు 25 మంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై బీఎన్‌ఎస్‌లోని 318 (4), 112 రెడ్ విత్ 49, గేమింగ్ యాక్ట్‌లోని 3, 3 (ఎ), 4, ఐటీ యాక్ట్‌లోని 66 డీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ నిందితుల్లో కొందరు పంజగుట్టలో నమోదైన కేసులోనూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసుల వివరాలను సేకరించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. మరోపక్క పంజగుట్ట కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు మంగళ, బుధవారాల్లో టేస్టీ తేజ, హబీబ్‌నగర్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్‌ను ప్రశ్నించారు.
గురువారం విష్ణు ప్రియ, రీతు చౌదరి విచారణకు హాజరయ్యారు. ఒక్కొక్కరిని 3 నుంచి 8 గంటలపాటు ప్రశి్నస్తున్న అధికారులు కొందరి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తాము కేవలం స్కిల్డ్ గేమ్ అని చెప్పడంతోనో, తెలియకో ఆ యాప్స్‌ను ప్రమోట్ చేశామని కొందరు తమ వాంగ్మూలాల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ క్యాంపెయిన్‌కు సంబంధించిన లావాదేవీలన్నీ యాప్స్ నిర్వాహకులతో బ్యాంకు ఖాతా ద్వారానే జరిగినట్లు వాళ్లు పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో తదుపరి విచారణకు బ్యాంకు స్టేట్‌మెంట్స్‌తో హాజరుకావాలని పోలీసులు వారికి స్పష్టం చేశారు. మిగిలిన ఇన్‌ఫ్లూయన్సర్లు ఒకటిరెండు రోజుల్లో విచారణకు రానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment