బర్త్‌డే పార్టీకి వెళ్లిన బాలికకు మత్తు మందు ఇచ్చి, లైంగికదాడి జరిగిన ఘటన తమిళనాడులో జరిగింది. ఈ కేసులో సహయనటి, విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. చైన్నెలోని పెరంబూర్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలిక చేత్తుపట్టులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. విద్యార్థిని తన స్నేహితులతో కలిసి అన్నానగర్ ప్రాంతంలోని ఓ కాఫీ షాప్‌నకు వెళ్లింది. ఆ సమయంలో పెరుంగళత్తూరు ప్రాంతానికి చెందిన సహాయ నటి ప్రతిషా అకీరాతో విద్యార్థినికి పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత వీరిద్దరూ స్నేహితులయ్యారని తెలుస్తుంది. ఈ క్రమంలో గత నెల 13వ తేదీన సాలీగ్రామంలోని ఓ హోటల్‌లో జరిగిన తన పుట్టినరోజు వేడుకలకు హాజరు కావాలని విద్యార్థినిని అకీరా ఆహ్వానించింది. ఆ తర్వాత అక్కడికి వెళ్లిన విద్యార్థినికి అకీరా, ఆమె ప్రియుడు సహా ఇద్దరు యువకులు మిఠాయిలు ఇచ్చారు. విద్యార్థి నిరాకరించినప్పటికీ, వారు ఆమెకు బలవంతంగా మిఠాయిలు తినిపించారు. అందులో కొంచెం తినగానే విద్యార్థిని స్పృహతప్పి పడిపోయింది. అనంతరం ఇద్దరు యువకులు ఆ బాలికను పడక గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు.
చాలా సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన ఆ బాలిక నిద్ర లేచి తనపై లైంగికదాడి జరిగిందని గ్రహించి దిగ్భ్రాంతి చెందింది. దీని గురించి అడిగితే జరిగిన సంఘటన గురించి బయట చెప్పవద్దు. అలా అయితే, నీకు, మీ కుటుంబానికి పరువు పోతుందని సహాయ నటి అకీరా విద్యార్థినిని బెదిరించింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం తెలుపలేదు. ఈ స్థితిలో రెండు రోజుల క్రితం తనపై లైంగికదాడి జరిగిన విషయాన్ని విద్యార్థిని తన సోదరికి చెప్పింది. వెంటనే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
బర్త్ డే పార్టీ అంటూ తన కుమార్తెకు మత్తు మందు కలిపిన మిఠాయిలు ఇచ్చి లైంగికదాడి చేశారంటూ విద్యార్థిని తల్లిదండ్రులు విరుగంబాక్కం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నటి అకీరా, వడపళనికి చెందిన కాలేజీ విద్యార్థి సోమేశ్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న విలియమ్స్ కోసం వారు తీవ్రంగా వెతుకుతున్నారు. బర్త్ డే పార్టీకి వెళ్లిన విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన చైన్నెలో సంచలనం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment