Tamilanadu
-
చాలా బాధగా ఉంది.. అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నా: ఆషికా రంగనాథ్
దక్షిణాది చిత్ర పరిశ్రమను చుట్టేస్తున్న వారిలో మలయాళం, కన్నడ బ్యూటీలే ఎక్కువగా ఉంటున్నారన్నది వాస్తవం. ముఖ్యంగా శాండిల్ ఫుడ్ భామలు అనుష్క,కృతి శెట్టి,అనుపమ పరమేశ్వరన్, రాశీఖన్నా, వంటివారు తెలుగు, తమిళం భాషల్లో రాణించారు. ప్రస్తుతం నటి రష్మిక మందన్న ఇండియన్ క్రష్‌గా వెలిగిపోతున్నారు. తాజాగా ఆషిక రంగనాథ్ అదే బాటలో పయనిస్తున్నారని చెప్పవచ్చు. తన మాతృభాష కన్నడలో 'క్రేజీ బాయ్' అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో నాగార్జునకు జంటగా నా సామిరంగ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఆషికా రంగనాథ్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. దీంతో కోలీవుడ్ దృష్టి పడింది. ఇక్కడ నటుడు అధర్వకు జంటగా పట్టత్తు అరసన్ చిత్రంతో రంగ ప్రవేశం చేశారు. కాగా తాజాగా నటుడు సిద్ధార్థ్ కథానాయకుడిగా నటించిన 'మిస్ యూ' చిత్రంలో నాయకిగా నటించారు. దీంతోపాటు కార్తీ సరసన సర్ధార్ 2, మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర' వంటి భారీ చిత్రంలోనూ నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. కాగా మిస్ యూ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని నవంబర్ 29న విడుదల కావాల్సింది. అయితే ఇక్కడ తుపాన్ వంటి అననుకూల పరిస్థితులు కారణంగా చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. దీనిపై నటి ఆషీక రంగనాథ్ స్పందిస్తూ మిస్ యూ చిత్రం విడుదల వాయిదా పడటం తనకు బాధ కలిగించిందన్నారు. అయితే అంతా బాగానే జరుగుతుందని నమ్ముతున్నానన్నారు. ఇంతకుముందు నిర్ణయించిన విడుదల తేదీ కంటే ఇంకా మంచి తేదీ లభిస్తుందని భావిస్తున్నానన్నారు. అది చిత్రాన్ని అత్యధిక ప్రేక్షకుల మధ్యకు తీసుకెళ్లడానికి ఉపకరిస్తుందని, ఈ విషయాన్ని గమనిస్తే మిస్ యూ చిత్రం విడుదల వాయిదా అనే నిర్ణయం సరైనదేనని నమ్ముతున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
ఎస్జే సూర్యకు గౌరవ డాక్టరేట్.. కారణం ఇదే
కోలీవుడ్ నటుడు, దర్శకుడు ఎస్జే సూర్యకు చెన్నైలోని 'వేల్స్ విశ్వవిద్యాలయం' గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. దీంతో ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. చెన్నైలోని పల్లవరంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ వేల్స్ 15వ స్నాతకోత్సవ వేడుక ఈరోజు (డిసెంబర్ 1) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఇందులో సుమారు 5 వేల మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పరిశోధక విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.దర్శకుడు, నటుడు, నిర్మాత, గీత రచయిత, గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఎస్.జె.సూర్యను గౌరవ డాక్టరేట్‌తో 'వేల్స్ విశ్వవిద్యాలయం' సత్కరించింది. 25 ఏళ్లుగా సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గానూ గుర్తిస్తూ ఈ గౌరవాన్ని కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ పేర్కొంది. అలాగే బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధులను ఒలింపిక్ క్రీడల్లో ప్రపంచ వేదికపై విజయం సాధించేలా మార్గనిర్దేశం చేసిన కోచ్ పుల్లెల గోపీచంద్‌కు కూడా గౌరవ డాక్టరేట్ లభించింది. వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి గతేడాదిలో రామ్ చరణ్ డాక్టరేట్‌ను పొందిన విషయం తెలిసిందే.దర్శకుడిగా కాస్త విరామం తీసుకున్న ఎస్జే సూర్య తమిళ, తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. పవన్ కల్యాణ్ కెరీర్లోనే బిగ్ హిట్‌గా నిలిచిన 'ఖుషి' చిత్రానికి ఆయన డైరెక్షన్ చేశారు. ఒక రకంగా ఈ సినిమాతోనే పవన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. 2001లో విడుదలైన ఈ సినిమా టేకింగ్ చేసిన తీరుకు ఎస్జే సూర్య పట్ల చాలామంది ఫిదా అయిపోయారు. -
నటి కస్తూరికి బెయిల్
తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టు అయిన సినీ నటికస్తూరికి ఎగ్మూర్ కోర్టు బుధవారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో శనివారం హైదరాబాద్‌లో అరెస్టయిన కస్తూరిని చైన్నె పుళల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆమెకు ఈనెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ఈ పరిస్థితులలో తనకు బెయిల్మంజూరు చేయాలని కోరుతూ ఎగ్మూర్ కోర్టులో కస్తూరి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. తాను సింగిల్ మదర్ అని, తనకు స్పెషల్చైల్డ్ ఉందని, ఆమెను తానే చూసుకోవాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. దీంతో నిబంధనలతో కూడిన బెయిల్‌ను ఆమెకు మంజూరు చేస్తూ న్యాయమూర్తి దయాళన్ ఆదేశించారు.ఈ కారణం వల్లే అరెస్ట్నవంబరు 3న చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన కస్తూరి.. తెలుగువాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. 300 ఏళ్ల క్రితం రాజుగారి అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకే తెలుగు వారు తమిళనాడుకి వచ్చారని, ఇప్పుడు వాళ్లు తమిళ వాళ్లమని చెప్పుకుంటున్నారని కస్తూరి చెప్పింది. అంతేకాదు, వేరేవాళ్ల భార్యపై మోజుపడొద్దని, బహుభార్యాతత్వం వద్దని బ్రాహ్మణులు చెప్తుంటే వారిని తమిళులు కాదని.. వారికి వ్యతిరేకంగా కొందరు ప్రచారం చేస్తున్నారని కస్తూరి కామెంట్ చేయడంతో వివాదస్పదం అయింది. ఈ క్రమంలో డిఎంకే పార్టీ నేతలపై కూడా ఆమె ఫైర్ అయింది. దీంతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. -
తమిళగ వెట్రి కళగం పార్టీపై వార్తలు.. నిజమేనా?
చెన్నై : 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళగ వెట్రి కగళం (టీవీకే) పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకి నెటింట్లో ట్రెండ్ అవుతున్న ఆ వార్త నిజమేనా? దీనిపై దళపతి విజయ్ ఏమన్నారు2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే- ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పొత్తు పెట్టుకోనున్నాయని తమిళ ప్రధాన మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. అందుకు గత అక్టోబర్ నెలలో టీవీకే పార్టీ తొలి బహిరంగ సభలో విజయ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని కొన్ని ఆధారాల్ని జత చేశాయి.అక్టోబర్‌లో విల్లుపురం జిల్లా విక్రవాండిలోని వీసాలై గ్రామంలో తమిళగ వెట్రి కళగం ఆవిర్భావోత్సవం, సిద్ధాంతాల వేడుకైన పార్టీ తొలి బహిరంగ సభ జరిగింది. ఆ సభలో విజయ్ డీఎంకే, బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అయితే ఎక్కడా ఏఐఏడీఎంకే గురించి ఎక్కడా మాట్లాడలేదని హైలెట్ చేశాయి.అయితే, ఈ కథనాలపై విజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏఐఏడీఎంకేతో టీవీకే పొత్తు అనేది పూర్తిగా అబద్ధమని ఖండించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలు లేకుండా టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుంది. ప్రజల మద్దతుతో మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ విశ్లేషకుల ముసుగులో మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందని, ఇలాంటి అవాస్తవ, తప్పుడు వార్తలను పట్టించుకోవద్దని తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను’అని టీవీకే ఎక్స్ వేదికగా వివరణిచ్చింది. தலைமை நிலையச் செயலக அறிவிப்புதமிழக வெற்றிக் கழகத்தின் முதல் மாநில மாநாட்டில் கழகத்தின் கொள்கைகள், கொள்கை எதிரி, அரசியல் எதிரி, தேர்தல் நிலைப்பாடு குறித்தும் தமது உரையில் கழகத் தலைவர் அவர்கள் தெளிவாக, விளக்கமாக எடுத்துரைத்துள்ளார். கழகத் தலைவர் அவர்களின் வழிகாட்டுதலின்படி…— TVK Party Updates (@TVKHQUpdates) November 18, 2024 -
నవంబర్ 1 నుంచి తమిళ్ సినిమా షూటింగ్స్ బంద్
తమిళ చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1వ తేదీ నుంచి కోలీవుడ్‌లో ఎలాంటి షూటింగ్స్ చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ విషయంపై తాము గతంలో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని నిర్మాతల మండలి తాజాగా పేర్కొంది. తమిళ చిత్ర పరిశ్రమను పునర్నిర్మించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు ప్రకటించారు.తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. 'నిర్మాతల సంఘం తరపున ఇప్పటికే పలు సమస్యలను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మధ్య కాలంలో సినిమా బడ్జెట్‌తో పాటు నటీనటులు, టెక్నీషియన్ల ఫీజులు, ఇతర ఖర్చులు భారీగా పెరిగాయని నిర్మాతల మండలి పేర్కొంది. దీనిని నియంత్రించి, కొన్ని రకాల పరిమితులు తీసుకురావాలని వారు తెలిపారు. నిర్మాతల సమస్యలకు పరిష్కారం కనుగొనే వరకు నవంబర్ 1 నుంచి షూటింగ్‌లు, సినిమాలకు సంబంధిత ఇతర కార్యకలాపాలను ఆపేస్తున్నట్లు వారు నిర్ణయించాం. అయితే, ఈ నిర్ణయం పూర్తి చట్టవిరుద్ధమైన నిర్ణయమని నడిఘర్ సంఘం పేర్కొంది. ఇలాంటి చర్యలకు దక్షిణ భారత నటీనటుల సంఘం ఎప్పటికీ మద్దతివ్వదని తెలిపింది.తమిళ నిర్మాతల ప్రధాన డిమాండ్స్అగ్ర హీరోలు నటించిన చిత్రాలను థియేటర్లలో విడుదల చేసిన ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ చేయాలి.ఇటీవలి కాలంలో ఎక్కువగా నటీనటులు, సాంకేతిక నిపుణులు నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్ తీసుకుని ఇతర చిత్రాలకు వెళ్లడం వలన నిర్మాతలు భారీ ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారు. నిర్మాతల నుంచి అడ్వాన్స్ తీసుకున్న నటుడు, సాంకేతిక నిపుణులు వారి సినిమా పూర్తయిన తర్వాతే మరొక చిత్రానికి పనిచేయాలి.అనేక తమిళ సినిమాలు సరైన థియేటర్లు దొరక్క నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలి.నటీనటులు, టెక్నీషియన్ల జీతాలు, ఇతర ఖర్చులు అదుపులేకుండా పెరిగిపోతున్నందున, చిత్ర పరిశ్రమను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నాలు జరగాలి. -
రేసులో అజిత్.. ఉదయనిధి స్టాలిన్ అభినందన
కోలీవుడ్ సినీ నటుడు అజిత్ కుమార్‌కు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అభినందనలు తెలియజేశారు. తమిళనాడు ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై చాటుతుండటాన్ని గుర్తు చేస్తూ కొనియాడారు. సినీ నటుడు అజిత్ కొత్త అవతారం ఎత్తారు. అజిత్‌కుమార్ రేసింగ్ టీం పేరిట టీమ్ లోగోను తాజాగా ఆవిష్కరించారు. సరికొత్త పాత్రలో రేసర్‌గా వస్తున్నట్టు అజిత్ ఆనందంగా ప్రకటించారు. రేసర్‌గా తన ప్రయాణంలో గెలవాలనే సంకల్పంతో ముందుకు సాగనున్నట్టు పేర్కొన్నారు. దుబాయ్‌లో త్వరలో జరగనున్న దుబాయ్ 24 హెచ్ 2025 పోటీలలో తొలిసారిగా అజిత్‌కుమార్ రేసింగ్ టీం పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు. ఈ పోటీల ట్రయల్ రన్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. ఇందులో తమిళనాడు స్పోర్ట్స్ విభాగం లోగోను ధరించి ఈ ట్రయల్ రన్లో దూసుకెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. తమిళనాడు స్పోర్ట్స్ అండ్ డెవలప్మెంట్ విభాగం నేతృత్వంలో క్రీడాభ్యున్నతికి జరుగుతున్న తోడ్పాటుకు మరింత బలం చేకూర్చే విధంగా అజిత్ ఆ లోగో ధరించడాన్ని ఉదయనిధి స్టాలిన్ ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికగా తమిళనాడు స్పోర్ట్స్‌ను చాటడం గర్వించ దగ్గ విషయం అని, ఇందుకు అభినందనలు తెలియజేశారు. -
నేడు 'విజయ్' తొలి బహిరంగ సభ.. ఎంతమంది రానున్నారంటే..?
తమిళ సినీ రంగం నుంచి మరో అగ్రనటుడు పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారే తరుణం ఆసన్నమైంది. విల్లుపురం జిల్లా విక్రవాండిలోని వీసాలై గ్రామంలో తమిళగ వెట్రి కళగం ఆవిర్భావోత్సవం, సిద్ధాంతాల వేడుకైన పార్టీ తొలి మహానాడు నేడు (అక్టోబర్ 27) జరగనుంది. ఇందుకోసం ఆ పార్టీ నేతలు భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. అయితే, ఒకరోజు ముందుగానే నేతలందరూ విల్లుపురానికి చేరుకున్నారు. కాగా మహానాడులో విజయ్ ఏఏ అంశాలను ప్రస్తావిస్తారు.. ఎవరిని టార్గెట్ చేస్తారు.. సిద్ధాంతాలు ఏరకంగా ఉంటాయనే విషయం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.సభ హైలెట్స్ ఇవే..5 నుంచి 7 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా .వేదికపై విజయ్ ఎగుర వేసే పార్టీ జెండా ఐదేళ్ల పాటు ఎగిరే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.చైన్నె – తిరుచ్చి జాతీయ రహదారిలోని వీసాలై వద్ద 85 ఎకరాల విస్తీర్ణంలో సినీ సెట్టింగ్‌లను మించి మహానాడు ఏర్పాట్లు.సభా వేదిక చుట్టూ.. వేలునాచ్చియార్, కామరాజర్, పెరియార్, అంబేడ్కర్, తమిళ తల్లి, చోళ, చేర, పాండ్య రాజుల కటౌట్లను ఏర్పాటు చేయడం.సభా ప్రాంగణంలో విజయ్ అభిమానులకు సమీపంలోకి వచ్చి పలకరించే విధంగా 800 మీటర్లకు ప్రత్యేకంగా ర్యాంప్ ఏర్పాటు.వాహనాల పార్కింగ్ కోసం 207 ఎకరాల స్థలం కేటాయింపు.చైన్నె నుంచి విక్రవాండి వరకు సుమారు 150 కి.మీ దూరంలో విజయ్ కటౌట్లు, పార్టీ జెండాలను తమిళగ వెట్రికళగం వర్గాలు ఏర్పాటు చేశాయి.ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు అభిమానులు, పార్టీ కేడర్ చేరుకునే విధంగా ప్లాన్.. సాయంత్రం 5 గంటలకు మహానాడు మొదలయ్యే రీతిలో షెడ్యూల్ సిద్ధం.మహానాడు భద్రత విధులలో ఇద్దరు డీఐజీలు, 10 మంది ఎస్పీలు, 15 మంది ఏడీఎస్పీలు, 50 మంది డీఎస్పీలు సహా 6 వేల మంది పోలీసులు ఉన్నారు. -
రెండు చేతులు చాచి ఆహ్వానం పలుకుతున్నా అంటూ విజయ్ లేఖ
దళపతి విజయ్ కొన్ని గంటల్లో తన అభిమానులను కలవనున్నాడు. తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించిన తర్వాత తను తొలిసారి భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నాడు. దీంతో రాజకీయాలపై ఆసక్తి ఉన్న దేశ ప్రజలు అందరూ ఆయన ఏం మాట్లాడనున్నాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం విల్లుపురం జిల్లా విక్రవాండిలోని వీసాలైలో విజయ్ పార్టీ తొలి మహానాడు కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచం కీర్తించే రీతిలో వీసాలైలో పార్టీ ఆవిర్భావం, సిద్ధాంతాల వేడుకను జరుపుకుందామని కేడర్‌కు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్ పిలుపునిచ్చారు. మహానాడుకు కొంత సమయం మాత్రమే ఉండడంతో కేడర్‌కు పిలుపునిస్తూ విజయ్ లేఖ రాశారు. రేపు జరిగే మహానాడు ప్రపంచమే కీర్తించే వేడుకగా నిలవబోతోందని, ఆమేరకు వేడుక జరుపుకుందామని కేడర్‌కు సూచించారు. పార్టీ జెండాలతో తరలిరావాలని, వీసాలైలలో అందరికీ ఆహ్వానం పలికేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. బ్రహ్మాండ ఏర్పాట్లు జరిగాయని, ఈ సిద్ధాంతాల వేడుకకు తన గుండెల్లో గూడు కట్టుకున్న ప్రతి అభిమాని, కేడర్‌ను సగర్వంగా ఆహ్వానిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.తొలి మహానాడులో అందర్నీ తాను నేరుగా కలవనున్నట్లు వ్యాఖ్యలు చేశారు. ఇది సిద్ధాంతాల విజయపు వేడుక అని, రెండు చేతులు చాచి ఆహ్వానం పలుకుతున్నానని ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో, భద్రత, సురక్షితంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. హృదయం అనే తలుపును వీసాలై సరిహద్దుల్లో తెరచి ఉంచి ఆహ్వానిస్తుంటానని, మహానాడులో కలుద్దాం..తమిళ మట్టి గెలుపు కోసం శ్రమిద్దాం...2026 మన లక్ష్యం అని ముగించారు. కాగా, ఈ మహానాడు కోసం చేసిన ఏర్పాట్లపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. జాతీయ రహదారి వెంబడి ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు హోరెత్తించడంతో వాటిని తొలగించే విధంగా హుకుం జారీ చేశారు. అలాగే, కోయంబత్తూరులో అయితే విజయ్, అన్నాడీఎంకే దివంగత నేత ఎంజీఆర్ చిత్ర పటాలతో ఫొటోలు, ఫ్లెక్సీలు వెలిశాయి. -
నటి గౌతమిని మోసం చేసిన సినీ ఫైనాన్సియర్
నకిలీ పత్రాలను సృష్టించి తన భూమిని కబ్జా చేసిన వారిపై న్యాయపోరాటం చేస్తున్నారు సినీ నటి గౌతమి. ఈ కేసులో తనకు న్యాయం దక్కేవరకు పోరాడుతానని ఆమె తెలిపారు. రామనాథపురం జిల్లాతో పాటు చెన్నై పరిసర ప్రాంతాల్లో నటి గౌతమికి సుమారు 150 ఎకరాల భూములు ఉన్నాయి. కారైక్కుడికి చెందిన సినీ ఫైనాన్సియర్ అళగప్పన్.. గౌతమికి చెందిన స్థలం అమ్మిపెడుతానని చెప్పి ముందుగా ఆ పత్రాలను పరిశీలించారు. ఆపై వాటికి నకిలీ పత్రాలను సృ ష్టించి తన సొంతానికి విక్రయించారు.ఈ క్రమంలో గౌతమి నుంచి రూ. 3కోట్లు తీసుకుని మోసం చేసినట్లు తెలుస్తోంది. దీంతో రామనాథపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో గౌతమి ఫిర్యాదు చేశారు. సి.అళగప్పన్, ఆయన భార్య నాచ్చాళ్, కుమారుడు శివ, కోడలు ఆర్తి, బంధువు భాస్కర్, కారు డ్రైవర్ సతీష్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. ఏడాది నుంచి వారు ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వారు మళ్లీ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. అయితే, వారికి బెయిల్ ఇవ్వకూడదని తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టుకు తెలుపుకున్నారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని ఆమె పేర్కొన్నారు. -
ప్రముఖ గాయని పి.సుశీలను అవార్డ్‌తో సత్కరించిన తమిళనాడు
తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే ‘కలైజ్ఞర్ నినైవు కలైతురై విత్తగర్’ పురస్కారాలను ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు గాన కోకిల పి.సుశీల, ప్రొఫెసర్, రచయిత, కవి మహ్మద్ మెహతాలను అక్కడి ప్రభుత్వం ఎంపిక చేసింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతి సందర్భంగా ఏటా జూన్ 3న ‘కలైజ్ఞర్ నినైవు కలైతురై విత్తగర్’ పురస్కారాన్ని అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో తమిళ సినీ రంగంలో విశిష్ట సేవలు అందించినవారిని సత్కరించే క్రమంలో పి. సుశీల పేరును ప్రభుత్వం ఎంపిక చేసింది.ఇదీ చదవండి: ఆ క్రెడిట్ అంతా హీరోలకేనా.. హీరోయిన్లకు ఇవ్వరా: మాళవిక మోహన్‘కలైజ్ఞర్ నినైవు కలైతురై విత్తగర్’ (కరుణానిధి స్మారక కళారంగ మాంత్రికులు) పురస్కారాన్ని గాయని పి. సుశీలకు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రదానం చేశారు. చెన్నైలోని సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు పురస్కారంతో పాటు రూ.10లక్షల బ్యాంకు చెక్, జ్ఞాపికను స్టాలిన్ అందజేశారు.ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో జన్మించిన పి. సుశీల తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో 25 వేలకు పైగా పాటలు పాడారు. దీంతో ఆమెను గౌరవించే విధంగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. క్వీన్ ఆఫ్ మెలోడి, గాన కోకిలగా కొనియాడుతున్న ఆమెను ఇలా సత్కరించినందుకు సంతోషంగా ఉందని అభిమానులు తెలుపుతున్నారు. -
కోర్టుకు స్పీకర్ అప్పావు
సాక్షి, చైన్నె : అసెంబ్లీ స్పీకర్ అప్పావు శుక్రవారం చైన్నెలోని ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట తన తరఫు వాదనను ఉంచారు. గత ఏడాది చైన్నెలో జరిగిన పుస్తక ఆవిష్కరణ వేడుకలో స్పీకర్ అప్పావు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై విమర్శలు ఎక్కుబెట్టారు. జయలలిత మరణించినానంతరం 40 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు డీఎంకేలో చేరడానికి సిద్ధమయ్యారని వివరించారు. అయితే, వారిని చేర్చుకునేందుకు పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ నిరాకరించారని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల పరువుకు భంగం కలిగించేలా ఉన్నట్టు ఆ పార్టీ పరిగణించింది. స్పీకర్ అప్పావుపై అన్నాడీఎంకే తరఫున పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఎంపీ, ఎమ్మెల్యేల కేసు విచారించే ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చింది. శుక్రవారం స్పీకర్ అప్పావు ఈ పిటిషన్ విచారణ నిమిత్తం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయవేల్ ఎదుట హాజరయ్యారు. తన తరఫున వాదనను కోర్టు ముందు ఉంచారు. సమన్లను తీసుకునేందుకు తాను నిరాకరించినట్టుగా అన్నాడీఎంకే పేర్కొనడాన్ని ఖండించారు. తనకు న్యాయస్థానాలన్నా, న్యాయమూర్తులన్నా గౌరవం ఉందని, తాను సమన్లు నిరాకరించినట్టుగా పేర్కొంటున్న వ్యవహారంపై కూడా విచారణ జరగాలని ఆయన కోరారు. తనకు ఎలాంటి సమన్లు రాలేదని స్పష్టం చేశారు. వాదనల అనంతరం తర్వాత విచారణను ఈనెల 26వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.ఎంపీకి అవమానం● అధికారులు సారీసాక్షి, చైన్నె: చైన్నె విమానాశ్రయం ఆవరణలో కాంగ్రెస్ మహిళా ఎంపీ సుధాకు తీవ్ర అవమానం జరిగింది. ఆమె సామాజిక మాధ్యమం వేదికగా ఫిర్యాదు చేయడంతో విమానాశ్రయ అధికారులు శుక్రవారం సారీ చెప్పారు. మైలాడుతురై నుంచి ఎంపీగా తొలిసారిగా పార్లమెంట్లో ఆర్ సుధా అడుగుపెట్టారు. ఆమె మహిళా న్యాయవాది కావడమే కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. చైన్నె విమానాశ్రయం ఆవరణలో తనకు ఎదురైన అవమానం గురించి ఆమె సామాజిక మాధ్యమం ద్వారా విమానయాన శాఖ, ఎయిర్ పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం అర్ధరాత్రి తను ఢిల్లీ నుంచి చైన్నెకు వచ్చినట్టు పేర్కొన్నారు. తన కారులో వెళ్తుండగా పార్కింగ్ ఎంట్రీ వద్ద సిబ్బంది తనతో దురుసుగా వ్యవహరించారని, తాను ఎంపీ అని చెప్పినా బలవంతంగా ఫీజు చెల్లించే విధంగా చేశారని పేర్కొన్నారు. తాను ఫీజు చెల్లించే బయటకు రావాల్సి వచ్చిందని, ఎంపీకి విలువ లేదా అని ప్రశ్నించారు. ఇందుకు విమానాశ్రయ అధికారులు స్పందించారు. ఆమెకు క్షమాపణ చెప్పడమే కాకుండా ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామన్నారు. పార్కింగ్ ప్రవేశ మార్గంలో ఫీజులు వసూళ్లు చేస్తున్నది కాంట్రాక్టు సంస్థకు చెందిన వారని పేర్కొంటూ, అయినా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. -
చిత్రపరిశ్రమలో మీ జోక్యం ఎందుకు అంటూ విశాల్ ఫైర్
కోలీవుడ్ హీరో విశాల్ తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో ప్రభుత్వ జోక్యం ఎక్కువైందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం చిత్ర పరిశ్రమలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలో తన రత్నం సినిమా విడుదల సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేశారు.తమిళ చిత్రసీమలో రెడ్ జెయింట్ మూవీస్ ఆధిపత్యం గురించి బహిరంగంగానే విశాల్ మాట్లాడారు. ఆ సంస్థ అధినేత తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై కూడా విశాల్ విమర్శలు చేశారు. తను నటించిన రత్నం సినిమా విడుదలను కూడా అడ్డుకున్నారంటూ.. వారికి అలాంటి అధికారం ఎవరిచ్చారో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కడలూరులో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన విశాల్ మీడియాతో సమావేశమై మాట్లాడారు. ఇక సినిమా రంగంపై డీఎంకే ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని సంచలన ఆరోపణ చేశాడు.ఆయన మాట్లాడుతూ.. 'తమిళ సినిమాకు ఈ ఏడాది చాలా కష్టం కాలంగా ఉంది. సినిమాలను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడమే దీనికి కారణం. రాబోయే రోజుల్లో 10 పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. ఆ 10 సినిమాలు కూడా దీపావళి, దసరా, క్రిస్మస్ పండుగలను టార్గెట్ చేసుకుని విడుదలవుతున్నాయి. దీంతో చిన్న సినిమాలను కొనేవారు లేరు, విడుదల చేసేవారు లేరు. మంచి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అయితే ఈ ఏడాది కమర్షియల్‌గా చిత్ర పరిశ్రమకు కష్టతరమైన సంవత్సరంగా మారనుంది. దీనికి ప్రధాన కారణం సినిమా పరిశ్రమలోకి ప్రభుత్వం చొచ్చుకు రావడమే.. ఇందులోకి ప్రభుత్వం ఎందుకు రావాలి..? గత ప్రభుత్వం ఇలాంటి పనులు చేయలేదు. అని విశాల్ తెలిపారు. తమిళనాడులో తాము షూటింగ్‌కి వెళ్లినప్పుడు తాగునీరు లేని గ్రామాలు ఎన్నో చూశామని విశాల్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పైగానే అవుతున్నా తాగునీరు లేని గ్రామాలు చూస్తున్నామంటే కాస్త విడ్డూరంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. -
'మదర్ ఇండియా'కు సిద్ధం..
తమిళసినిమా: నటుడు, దర్శకుడు శశికుమార్‌కు మళ్లీ హీరోగా అవకాశాలు వరుస కడుతున్నాయి. అయోథి చిత్ర విజయంతో ఈయనకు మంచి టైమ్ వచ్చిందనే చెప్పాలి. సూరి కథానాయకుడిగా నటించిన గరుడన్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించి ఆ చిత్ర విజయంలో శశికుమార్ భాగం అయ్యారు. తాజాగా మరో చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దీనికి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈయన ఇంతకు ముందు కూక్కూ, జోకర్, జిప్సీ వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. అయితే ఇటీవల కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వం వహించిన జపాన్ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో ఈయనకిప్పుడు నటుడు శశికుమార్ చేయూత నిచ్చారు. వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఒలింపియా మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.ఈ సంస్థ ఇంతకు ముందు డాడా వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రానికి మందర్ ఇండియా అనే టైటిల్‌ను ఖారారు చేసినట్లు తెలిసింది. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం ద్వారా కన్నడ నటి చైత్రా జె.అచ్చర్ కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.ఈమె ఇటీవల కన్నడంలో నటించిన సప్త సాగరదాచే ఎల్లో సైడ్ ఏ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా నటుడు శరత్‌కుమార్ మరోవైపు స్వీయ దర్శకత్వంలో కుట్ర పరంపరై అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇవి చదవండి: ఆవిడ బయోపిక్‌లో నటించాలని..! -
విద్యార్థులను ఘనంగా సన్మానించిన విజయ్.. ఆమెకు డైమండ్ రింగ్
కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ సాయం చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటారు. ఇప్పటికే తమిళనాడులో ఆయన అనేకసార్లు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసి ప్రసిద్ధి చెందారు. తాజాగా మరోసారి మంచి మనసు చాటుకున్నారు విజయ్. ఇటీవల వెలువడిన టెన్త్, ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారిని అభినందించి వారికి బహుమతులు కూడా అందించారు. గతేడాది తమిళనాడు టాపర్‌కు డైమండ్ నెక్లస్ ఇచ్చిన విజయ్.. ఈ ఏడాదిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థికి డైమండ్ రింగ్ కానుకగా ఇచ్చారు.హీరో నుంచి రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత తొలిసారి తన పార్టీ 'తమిళగ వెట్రి కళగం' పేరుతో విధ్యార్థులను అభినందించారు. తమిళనాడులోని నియోజకవర్గాల వారీగా టెన్త్, ఇంటర్లో టాప్ 3లో నిలిచిన విద్యార్థులకు సన్మానం చేసి బహుమతులు అందించారు. తొలి విడుతగా జూన్ 28న జరిగిన ఈ కార్యక్రమంలో 750 మంది విద్యార్థులతో పాటు 3500 మంది తల్లిదండ్రులు వారి సన్నిహితులు పాల్గొన్నారు. చెన్నైలోని తిరువాన్మియూర్‌లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.తమిళనాడు వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ ప్రతి విద్యార్థికి శాలువా, సర్టిఫికెట్‌తోపాటు రూ.5000 ప్రోత్సాహకం అందించి అభినందించారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ శాఖాహార విందును ఏర్పాటు చేశారు. వేడుకల్లో పాల్గొనేందుకు 21 జిల్లాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి, తమిళనాడు వెట్రి కజగం పూర్తి ఖర్చు భరించింది. వారిని తిరిగి తమ ఇంటికి చేర్చే వరకు విజయ్ అన్నీ ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి విజయ్ ఇలా మాట్లాడారు. 'ఇటీవలి పది, పన్నెండవ పరీక్షలలో విజయం సాధించిన నా తమ్ముళ్లు, సోదరీమణులు వారితో వచ్చిన తల్లిదండ్రులకు నా వినయపూర్వకమైన నమస్కారాలు. ప్రతి విద్యార్థి తనకు నచ్చిన కోర్సులో చేరండి. అనుకున్నది సాధించే వరకు పోరాడండి. సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వార్తాపత్రికలు చదవండి. డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. భవిష్యత్‌లో రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయంగా క్రియాశీలకంగా మారాలి.' అని విద్యార్థులను విజయ్ ప్రోత్సహించారు. గతేడాది కూడా విజయ్ ఇలాంటి కార్యక్రమమే జరిపించారనే విషయం తెలిసిందే. వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయనున్నారు.వృత్తిపరంగా, విజయ్ ఇటీవల లియో చిత్రంలో కనిపించారు. ఇందులో త్రిష కూడా నటించింది. ఇది ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. తాజాగా 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) సినిమా పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. -
ఓబీసీల కోసం రాజ్యాంగ సవరణ తప్పదు..
బిహార్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. ఇది దేశంలోని బీసీ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. బిహార్ నమునాగా ఇతర రాష్ట్రాలు కూడా కులగణన చేసి శాస్త్రీయంగా బీసీల జీవన స్థితిగతుల లెక్కలు తీసుకుని విద్యా–ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంపుదల చేసుకోవచ్చని ఆశగా ఎదురు చూసిన వారు విస్మయానికి గురైనారు. దీంతో రాజ్యాంగ సవరణ చేయకుండా ఓబీసీల విద్యా–ఉద్యోగ రిజర్వేషన్ల పెంపుదల జరుగదని విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రం 69 శాతానికి పెంచిన మొత్తం రిజర్వేషన్ శాతం ఇప్పటికీ కొనసాగుతున్న విషయం గమనార్హం. శాసన సభలో ఏకగ్రీవంగా ఆమోదించిన ఒక బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది రాష్ట్ర ప్రభుత్వం. పార్టీలకు అతీతంగా సీఎం జయలలిత ఆధ్వర్యంలో అన్ని పార్టీల ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్లి అప్పటి పీవీ నరసింçహారావు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి... తమ శాసన సభ చేసిన చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా చేశారు. దీంతో తమిళనాడులో అమలు జరుగుతున్న 69 శాతం రిజర్వేషన్లపై ఏ కోర్టులోనూ ఛాలెంజ్ చేసే అవకాశం లేకుండాపోయింది.బిహార్ రాష్ట్రం కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ తరహాలో బీసీలకు అధిక రిజర్వేషన్లు అందేలా చూడాలి. బిహార్‌తో పాటుగా అన్ని రాష్ట్రాలూ ఇదే దారిలో ప్రయాణించవలసి ఉంది. ఇది జాతీయ ఉద్యమంగా రూపుదాల్చవలసి ఉన్నది. ఏ రాష్ట్రంలోనైనా బీసీల రిజర్వేషన్లు పెంచాలనే తలంపుతో ఏ విధాన నిర్ణయం తీసుకున్నప్పటికీ 1992లో ‘ఇందిరా సహానీ’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ‘మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాద’నే తీర్పును అడ్డుపెట్టుకుని ఆధిపత్య వర్గాలు కోర్టులకు వెళ్ళి అడ్డుపడుతున్నాయి. బిహార్‌లో మాదిరిగా మహారాష్ట్ర, రాజస్థాన్, హరియాణా ప్రభుత్వాలు 50 శాతం రిజర్వేషన్లు మించి ఇచ్చాయని సుప్రీంకోర్టులో పిల్స్ వేశారు. దీన్ని బట్టి చూస్తే విధిగా రాజ్యాంగసవరణ చేస్తే తప్ప బీసీలకు న్యాయం చేయడానికి వేరే మార్గం లేదని అర్థమవుతుంది.బిహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 50 శాతానికి మించి ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలా అంగీకరించిందని బీసీలు ప్రశ్నిస్తున్నారు.ఈ డబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు జనాభా గణన చేయలేదు. వారి జీవన స్థితిగతులను అధ్యయనం చేయకుండా అగ్రవర్ణాలలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. దేశజనాభాలో అగ్రవర్ణాలు ఎంతమంది? వారిలో పేదరికం ఎంత శాతం? ఈ లెక్కలు లేకుండా 10 శాతం రిజర్వేషన్లు ఎలా ఇచ్చారో కేంద్రమే చెప్పాలి. అయినా సుప్రీంకోర్టు ధర్మాసనం 10 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 85 శాతం మంది ఉంటే వీరిలో 56 శాతంగా ఉన్న బీసీలలో పేదలు ఎంతమందో ఎవరి దగ్గరా లెక్కలు లేవు. అందుకే ఓబీసీ రిజర్వేషన్లలో ఎలాంటి పరిమితి విధించకుండా అత్యవసరంగా రాజ్యాంగంలోని 15(4), 16(4) ఆర్టికల్స్‌ను సవరించాలి. అపుడే బీసీలకు విద్యా– ఉద్యోగ రంగాలలో న్యాయం జరుగుతుంది.పట్నా హైకోర్టు తీర్పు తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇపుడు దేశంలోని ఓబీసీలంతా స్పష్టంగా మహాత్మా జ్యోతిబా ఫూలే ఆలోచనలతో తమిళనాడులో రామస్వామి పెరియార్ కొనసాగించిన ఉద్యమ స్ఫూర్తితో ఓబీసీ ఉద్యమం కొనసాగించవలసి ఉంది. నితీష్ ప్రభుత్వం ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున తమిళనాడులాగా ఒక చట్టం చేసి 9వ షెడ్యూల్లో చేర్చుకుని బిహారు రాష్ట్రం వరకు రిజర్వేషన్ల పెంపును అమలు జరుపుకునే అవకాశముంది. ప్రస్తుతం ఎన్డీఏ మిత్రత్వం బిహారుకు కలిసివచ్చే విధంగా ఉంది.దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక్క తాటిపైకి వచ్చి బడుగులందరి తరఫున నిలిచి కేంద్రంపై బీసీ రిజర్వేషన్లు పెంచడానికై రాజ్యాంగ సవరణ చేయాలని ఒత్తిడి పెంచాలి. ఓబీసీల హక్కుల సాధన కోసం జాతీయోద్యమం రూపుదాల్చే సమయం ఆసన్నమయ్యింది.దేశంలో రిజర్వేషన్ల రక్షణ కోసం పాటు పడిన బీఆర్ అంబేడ్కర్ తర్వాత అంతగా కృషి చేసినవారు తమిళనాడు సామాజిక, రాజకీయ రంగాల నాయకులనే చెప్పాలి. ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు విద్యా–ఉద్యోగాలలో రిజర్వేషన్ల పెంపుదల కోసం తమిళనాడులో మహోద్యమాలు జరిగాయి. పెరియార్ రామస్వామి చేసిన కృషి మరువలేనిది. రిజర్వేషన్లను న్యాయస్థానం అడ్డుకోకుండా చేయడంలో పెరియార్ రామస్వామి జరిపిన పోరాటం మరిచిపోలేనిది. అంబేడ్కర్ రిజర్వేషన్ల రక్షణ కోసం చేసిన పోరాటానికి కొనసాగింపుగా తమిళనాడులో పెరియార్, ఉత్తర భారతంలో రామ్ మనోహర్ లోహియా, కర్పూరీ ఠాకూర్లు చేసిన ఉద్యమాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు దేశవ్యాపితంగా ఓబీసీ రిజర్వేషన్ల కోసం జాతీయ ఉద్యమం రూపుదాల్చవలసి ఉంది. నేటి ఓబీసీ యువతరం, విద్యావంతులు ఈ ఉద్యమంలో కీలకంగా పాల్గొనాలి. బడుగు వర్గాల నుంచి వచ్చిన యువతరం బీసీలకు జరిగిన అన్యాయాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. బీసీలను ఐకమత్యం చేసే పనిలో పాలుపంచుకోవాలి. ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ, సామాజిక రంగాలలో బీసీలకు న్యాయం జరిగేదాకా ఉద్యమపథంలో ముందుకు సాగక తప్పదు. న్యాయస్థానాల్లో న్యాయపోరాటం విధిగా చేయాలి.– జూలూరు గౌరీశంకర్, వ్యాసకర్త తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ చైర్మన్ -
51 మంది మృతి.. ప్రభుత్వంపై భగ్గుమన్న సూర్య, విజయ్
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణపురం ప్రాంతం కల్తీ మద్యం బాధితుల రోదనలతో ప్రతిధ్వనిస్తోంది. కల్తీ మద్యం కాటుకు 51 మంది మరణించారు. అయితే, ఆస్పత్రుల పాలైన బాధితుల సంఖ్య 116కు పెరిగిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ చెప్పారు. వీరిలో 34 మంది పూర్తిగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు చొప్పున సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. క్కువ శాతం మిథనాల్ కలిపిన సారాయి తాగడం వల్లే మరణాలు సంభవించినట్లు సీఎం అన్నారు.ఈ సంఘటనపై కోలీవుడ్ టాప్ హీరోలు భగ్గుమంటున్నారు. ఈ సంఘటన గురించి దళపతి తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేయడమే కాకుండా.. బాధితులను పరామర్శించాడు. 'గతేడాది కూడా ఇలాంటి ఘటనతో 22మందికి పైగా చనిపోయారు. అయినా, ప్రభుత్వంలో ఉన్న నేతల్లో ఎలాంటి మార్పు రాలేదు. పైగా తమ విధానాలు మార్చుకోలేదు. ఇప్పటికైనా మద్యం విషయంలో ప్రభుత్వం కళ్లు తెరవాలి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలి. ఈ మరణాలకు కారణమైన వారిని శిక్షించాలి. వారి మరణ వార్త వినగానే నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. మద్యం విషయంలో ప్రభుత్వ తీరును తప్పకుండా మార్పుచేయాలి. ఇలాంటి ఘటనల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇప్పటికైన తమిళనాడు ప్రభుత్వం కఠన నిర్ణయం తీసుకోవాలి.' అని విజయ్ కోరారు.ఈ ఘటనను ఖండిస్తూ హీరో సూర్య ఓ ప్రకటన విడుదల చేశారు. 'ప్రభుత్వం, రాజకీయ పార్టీలు దూరదృష్టితో వ్యవహరిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి విషాద మరణాలను అరికట్టవచ్చు. గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్వల్పకాలిక పరిష్కారాలను పక్కనపెట్టి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మద్యం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. కల్తీ మద్యం, అక్రమ విక్రయాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. తమిళనాడు పరిపాలన తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ బతుకులు బాగుపడాలని ఓట్లు వేసే తమిళనాడు ప్రజలు మద్యానికి బానిసలుగా కాకుండా ప్రభుత్వం చూడాలి. అందుకోసం ప్రజల్లో అవగాహన కల్పించాలి. మద్యం విషయంలో ప్రజలకు ఉపయోగపడే చట్టాలు తీసుకురావాలి.' అని సూర్య కోరారు. మృతులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆసుపత్రిలో ఉన్నవారు కోలుకోవాలని సూర్య ప్రార్థించారు. -
ప్రియుడితో సినీ నటి ప్లాన్.. స్నేహితురాలిని బర్త్‌డే పార్టీకి పిలిచి ఆపై..
బర్త్‌డే పార్టీకి వెళ్లిన బాలికకు మత్తు మందు ఇచ్చి, లైంగికదాడి జరిగిన ఘటన తమిళనాడులో జరిగింది. ఈ కేసులో సహయనటి, విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. చైన్నెలోని పెరంబూర్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలిక చేత్తుపట్టులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. విద్యార్థిని తన స్నేహితులతో కలిసి అన్నానగర్ ప్రాంతంలోని ఓ కాఫీ షాప్‌నకు వెళ్లింది. ఆ సమయంలో పెరుంగళత్తూరు ప్రాంతానికి చెందిన సహాయ నటి ప్రతిషా అకీరాతో విద్యార్థినికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ స్నేహితులయ్యారని తెలుస్తుంది. ఈ క్రమంలో గత నెల 13వ తేదీన సాలీగ్రామంలోని ఓ హోటల్లో జరిగిన తన పుట్టినరోజు వేడుకలకు హాజరు కావాలని విద్యార్థినిని అకీరా ఆహ్వానించింది. ఆ తర్వాత అక్కడికి వెళ్లిన విద్యార్థినికి అకీరా, ఆమె ప్రియుడు సహా ఇద్దరు యువకులు మిఠాయిలు ఇచ్చారు. విద్యార్థి నిరాకరించినప్పటికీ, వారు ఆమెకు బలవంతంగా మిఠాయిలు తినిపించారు. అందులో కొంచెం తినగానే విద్యార్థిని స్పృహతప్పి పడిపోయింది. అనంతరం ఇద్దరు యువకులు ఆ బాలికను పడక గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు. చాలా సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన ఆ బాలిక నిద్ర లేచి తనపై లైంగికదాడి జరిగిందని గ్రహించి దిగ్భ్రాంతి చెందింది. దీని గురించి అడిగితే జరిగిన సంఘటన గురించి బయట చెప్పవద్దు. అలా అయితే, నీకు, మీ కుటుంబానికి పరువు పోతుందని సహాయ నటి అకీరా విద్యార్థినిని బెదిరించింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం తెలుపలేదు. ఈ స్థితిలో రెండు రోజుల క్రితం తనపై లైంగికదాడి జరిగిన విషయాన్ని విద్యార్థిని తన సోదరికి చెప్పింది. వెంటనే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బర్త్ డే పార్టీ అంటూ తన కుమార్తెకు మత్తు మందు కలిపిన మిఠాయిలు ఇచ్చి లైంగికదాడి చేశారంటూ విద్యార్థిని తల్లిదండ్రులు విరుగంబాక్కం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నటి అకీరా, వడపళనికి చెందిన కాలేజీ విద్యార్థి సోమేశ్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న విలియమ్స్ కోసం వారు తీవ్రంగా వెతుకుతున్నారు. బర్త్ డే పార్టీకి వెళ్లిన విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన చైన్నెలో సంచలనం సృష్టించింది. -
కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇల్లు పోలీసుల రక్షణలో ఉంది. ఇలా రెండున్నరేళ్ల నుంచి ఆయన ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో పోలీసు రక్షణ కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై తమిళనాట చర్చ జరుగుతుంది. సూర్య కుటుంబం ప్రస్తుతం చెన్నైలో లేదు.. అయినా కూడా ఆ ఇంటికి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అనేది తెలుసుకుందాం.జై భీమ్‌తో వివాదంసూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే జ్ఞానవేల్ కలిసి నిర్మించిన చిత్రం జై భీమ్. 2021లో అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం విడుదలైంది. జైభీమ్‌లోని కొన్ని సన్నివేశాలు తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని 'రుద్ర వన్నియర్ సేన' సంఘం ఆరోపించింది. ఇరులార్ కమ్యూనిటీ (ఆదివాసీలు) సభ్యులకు కస్టోడియల్ టార్చర్ వెనుక తమ వర్గానికి చెందిన సభ్యులు ఉన్నట్లు సినిమాలో చూపించడాన్ని వారు తప్పుపట్టారు. సూర్యపై దాడి చేసిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తామని ఆ సంఘం తెలిపింది. 'రుద్ర వన్నియర్ సేన' సంఘానికి సూర్య బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు నష్టపరిహారంగా రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో టీ నగర్‌లోని సూర్య ఇంటి వెలుపల ఐదుగురు సాయుధ పోలీసులను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఇప్పటికీ పోలీసుల రక్షణ ఎందుకు..?జై భీమ్ సినిమా సమస్య కొన్ని నెలల తర్వాత ముగిసినప్పటికీ, సూర్య ఇంటికి గత రెండున్నరేళ్లుగా నలుగురు పోలీసులు రక్షణగా ఉన్నారు. ప్రస్తుతం ఆ ఇంట్లో సూర్య కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. వారందరూ ఇప్పుడు ముంబైలో ఉన్న విషయం తెలిసిందే. అయినా ఆ ఇంటికి పోలీసుల రక్షణ ఎందుకు అనే ప్రశ్న తలెత్తింది. ఈ పరిస్థితిలో, నటుడు సూర్య ఇంటికి పోలీసు రక్షణ ఎవరి ఆదేశాల మేరకు కొనసాగుతుందని సామాజిక కార్యకర్త కృష్ణమూర్తి సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించారు. పోలీస్ కమిషనర్ వివరణపోలీస్ కమిషనర్ ఆదేశం మేరకు నవంబర్ 15, 2021న తాత్కాలిక భద్రత కల్పించామని, సూర్యకు ముప్పు పొంచి ఉన్నందున భద్రతా సమీక్ష కమిటీ నిర్ణయం మేరకు భద్రతను ఇప్పటికీ కొనసాగిస్తున్నామని సమాధానమిచ్చారు. సాధారణంగా బెదిరింపులకు గురైన వ్యక్తులకు పోలీసు రక్షణ కల్పించినప్పుడు సంబంధిత వ్యక్తి తప్పనిసరిగా పోలీసు శాఖకు రుసుము చెల్లించాలి. అలా అయితే, ప్రస్తుత పోలీసు రక్షణ కోసం సూర్య ఏమైనా డబ్బు చెల్లిస్తున్నారా అనే ప్రశ్న కూడా తలెత్తింది, దానికి సమాధానం లేదు. దీంతో గత రెండున్నరేళ్లుగా సూర్య ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో భద్రత కల్పిస్తున్నట్లు తేలింది. ఇది ఎంతవరకు న్యాయమని సామాజిక కార్యకర్త కృష్ణమూర్తి ప్రశ్నించారు. ఇందులో తమిళనాడు ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆయన అన్నారు. -
ఇంటర్లో టాప్ మార్కులతో అదరగొట్టిన సూర్య కూతురు
సౌత్ ఇండియాలో బ్యూటిఫుల్ కపుల్స్‌గా సూర్య- జ్యోతిక జంట ఉంటుంది. చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన జోడీగా వీరికి గుర్తింపు ఉంది. వీరి కుమార్తె దియా ఇటీవల ముగిసిన 12వ తరగతి సాధారణ పరీక్షలో మంచి మార్కులు సాధించినట్లు సమాచారం. ఇరు కుటుంబాల అంగీకారంతో 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, ఈ దంపతలులకు దియా అనే 17 ఏళ్ల కుమార్తెతో పాటు దేవ్ అనే 15 ఏళ్ల కుమారుడు ఉన్నారు.సూర్య కుటుంబం మొత్తం సినిమా రంగంలో ఉన్నప్పటికీ దియా, దేవ్ ఇద్దరు కూడా సినిమాల్లోకి అడుగుపెట్టలేదు. దియా టెన్నిస్, ఫుట్‌బాల్ ఆటలపై దృష్టి సారిస్తుంటూ.. దేవ్ కరాటే వైపు అడుగులు వేస్తున్నాడు. చదువుతో పాటుగా ఆటలపై కూడా వారు ఆసక్తి చూపుతున్నారు.ఇంటర్లో అదరగొట్టిన దియాసూర్య కూతురు దియా ఈ ఏడాది పన్నెండో తరగతి పరీక్షలు రాసింది. తాజాగా ఫలితాలు కూడా విడుదలయ్యాయి. దియా మంచి మార్కులతో పాస్ అయినట్లు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె సాధించిన మార్కులు ఇవే అంటూ కోలీవుడ్‌లో వైరల్ అవుతుంది. తమిళంలో 100కి 96, ఇంగ్లిష్‌లో 97, గణితంలో 94, ఫిజిక్స్‌లో 99, కెమిస్ట్రీలో 98, కంప్యూటర్ సైన్స్‌లో 97 మార్కులు సాధించినట్లు తెలుస్తోంది. 600 మార్కులకు గాను 581 మార్కులు సాధించినట్లు సమాచారం. దియా ఇన్ని మార్కులు సాధించినందుకు కుటుంబ సభ్యులు ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారట. ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఈ సమాచారం ఎంత వరకు నిజమో తెలియదు.2022లో టెన్త్‌లో కూడా సత్తా చాటిన దియా10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కూడా దియా టాప్ మార్క్‌లు సాధించింది. తమిళంలో 95, ఆంగ్లంలో 99, గణితంలో 100, సైన్స్‌లో 98, సోషల్‌లో 95 మార్కులు సాధించింది. 500 మార్కులకు గాను 487 మార్కులు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. -
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
గతేడాదిలో 'సలార్'తో ట్రెండింగ్‌లోకి వచ్చిన శ్రియా రెడ్డి తాజాగా 'తలైమై సేయలగం' వెబ్ సిరీస్‌తో రానుంది. తమిళంలో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో కాంతార ఫేమ్ కిషోర్ మరో లీడ్రోల్లో నటిస్తోన్నాడు. జీ5 వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ ఈ సిరీస్‌ను రిలీజ్ చేస్తున్నారు.తలైమై సేయలగం పేరుతో తెరకెక్కుతోన్న ఈ పొలిటికల్ డ్రామా సిరీస్‌ను భారీ అంచనాలతో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో శ్రియారెడ్డితో పాటు కస్తూరి, భరత్, రమ్య నంబీశీన్, దర్శన గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ వసంత బాలన్ ఈ పొలిటికల్ మ్యాజిక్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సిరీస్ గురించి కీలక సమాచారాన్ని మేకర్స్ ప్రకటించారు. మే 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోందని తెలిపారు.రీసెంట్గా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాధిక శరత్‌కుమార్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తమిళనాడు నుంచి బీజేపీ అభ్యర్థిగా లోకసభ ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే. తమిళనాడులో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రాడాన్ మీడియా వర్క్స్ పతాకంపై ఆమె నిర్మిస్తుంది. ఈ సిరీస్‌కు గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. -
ఓటింగ్ కేంద్రంలో ఆమె కాళ్లకు నమస్కరించి సెల్ఫీ దిగిన స్టార్ హీరో
తమిళనాడులో నేడు లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఉదయం నుంచి ప్రారంభమైన ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కోలీవుడ్ ప్రముఖ హీరోలు క్యూ కట్టారు. సెలబ్రిటీలతో పాటుగా సామాన్య ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా క్యూలలో నిలబడి తమ ప్రజాస్వామిక కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, తలపతి విజయ్, నటుడు ధనుష్, నటుడు విక్రమ్ వంటి ప్రముఖులు చెన్నైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విదేశాల్లో ఉన్న విజయ్ కూడా ఈరోజు తమిళనాడుకు వచ్చి ఓటు వేశారు. చేతికి చిన్న గాయంతో కనిపించిన విజయ్ వచ్చే 2026 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ సందర్భంలో కోలివుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు, వీల్ చైర్లో నడవలేని ఒక వృద్ధురాలు ఆయన్ను సెల్ఫీ కోరింది. విజయ్ నటన అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొంది. మంచి భవిష్యత్ ఉన్న నటుడు అని ఆమె కొనియాడింది. దీంతో వెంటనే విజయ్ సేతుపతి ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసుకుని ఆ వృద్ధురాలితో సెల్ఫీ దిగి ఆనందం వ్యక్తం చేశాడు. ఆమె తల్లి లాంటి వ్యక్తి కావడంతో కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ సమయంలో చాలామంది అభిమానులు ఆయనతో కరచాలనం చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. This Is Why He Is Makkal Selvan #VijaySethupathi 🥹❤️pic.twitter.com/txOW6vF731 — Kolly Corner (@kollycorner) April 19, 2024 -
తమిళనాడులో ఎన్నికలు.. తొలి ఓటు వేసింది ఆ స్టార్ హీరోనే
లోక్‌సభ సీట్లపరంగా దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 39 స్థానాలకూ నేడు (ఏప్రిల్ 19) తొలి దశలోనే ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఎంతో ఉత్కంఠతో కూడిన ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే,బీజేపీ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. అయితే తమిళనాడు లోక్‌సభ ఎన్నికలకు ఓటు వేసేందుకు నటులు రజనీకాంత్, అజిత్ కుమార్, శివకార్తికేయన్ శుక్రవారం తెల్లవారుజామున పోలింగ్ బూత్‌లకు చేరుకున్నారు. రజనీకాంత్, అజిత్ కుమార్, శివకార్తికేయన్ శుక్రవారం ఉదయం చెన్నైలోని పోలింగ్ బూత్‌లలో ఓటు వేసేందుకు క్యూ లైన్లలో నిలబడ్డారు. తమిళ మీడియా చెబుతున్న ప్రకారం ఈ ఎన్నికల్లో మొదటగా ఓటేసిన సినిమా హీరో అజిత్ కుమార్ అని తెలుస్తోంది. ఆయన ఉదయం 6:30 గంటలకే పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాక ముందే ఆయన క్యూ లైన్లో పాల్గొన్నారు. చెన్నైలోని తిరువాన్మియూర్‌లో అజిత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని నిమిషాల తర్వాత, రజనీకాంత్, శివకార్తికేయన్లు కూడా పోలింగ్ బూత్‌ల వద్ద ఓటు వేయడానికి బారులు తీరిన క్యూ లైన్లోనే నిలబడ్డారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత మిడియాతో పలు విషయాలను పంచుకున్నారు. ప్రజలు బయటకు వచ్చి తమ పౌర కర్తవ్యాన్ని నిర్వహించాలని రజనీకాంత్,అజిత్, శివకార్తికేయన్ కోరారు. వీరందరి తర్వాత MNM అధినేత కమల్ హాసన్ చెన్నైలోని కోయంబేడులోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో కమల్ పార్టీ పోటీ చేయడం లేదు. #WATCH | Tamil Nadu: Actor Ajith Kumar arrives at a polling Booth in Thiruvanmiyur to cast his vote in the first phase of #LokSabhaElections2024 pic.twitter.com/WtX1er0u0j — ANI (@ANI) April 19, 2024 #Sivakarthikeyan Casted his vote 👆✅ pic.twitter.com/aHI9felO1w — AmuthaBharathi (@CinemaWithAB) April 19, 2024 #WATCH | Actor Rajnikanth casts his vote at a polling booth in Chennai, Tamil Nadu. #LokSabhaElections2024 pic.twitter.com/6Ukwayi5sv — ANI (@ANI) April 19, 2024 #WATCH | Tamil Nadu: Actor and MNM chief Kamal Haasan casts his vote at a polling booth in Koyambedu, Chennai. Makkal Needhi Maiam (MNM) is not contesting the #LokSabhaElections2024📷, the party supported and campaigned for DMK. pic.twitter.com/Skw6hyAMXu — ANI (@ANI) April 19, 2024 -
టార్గెట్ ఫిక్స్.. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన విశాల్
తమళనాడులో పొలిటికల్ ఎంట్రీపై హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఇండియాలో టాప్ హీరో లిస్ట్‌లో ఉన్న విశాల్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని చాలా ఏళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలో ఓ ప్రెస్మీట్లో పాల్గొన్న విశాల్ రాజకీయ ప్రకటన చేశారు. తమిళనాడులో కొత్త పార్టీని స్థాపించి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. సరైన వసతులు లేకపోవడంతో రాష్ట్రంలోని ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారందరికీ సేవ చేయడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే తన ఉద్దేశం అని.. ఈ కారణంతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు విశాల్ పేర్కొన్నారు. ఇదే సమయంలో మరో రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా..? అని ప్రశ్నించగా.. అందుకు ఆయన నో అని చెప్పారు. ముందుగా ప్రజల్లో తాను ఏంటో నిరూపించుకోవాలని తెలిపారు. ఆ తర్వాతే ఎన్నికల పొత్తు గురించి ఆలోచిస్తానని అన్నారు. విజయ్ తర్వాత విశాల్ కూడా రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటన రావడంతో ఈ టాపిక్ ఇప్పుడు తమిళనాట భారీ చర్చలకు దారితీసింది. తమిళనాడులో విశాల్ ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ క్రమంలో తన అమ్మగారి పేరు మీద నెలకొల్పిన ‘దేవి ఫౌండేషన్’తో ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు, బాధిత రైతులకు సాయం చేస్తున్నారు. షూటింగ్‌లకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజల కష్టాలు, అవసరాలను అడిగి తెలుసుకుని వారందరికీ తగిన సాయం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వారందరికీ తన చేతనైనంత సాయం చేస్తూ విశాల్ వార్తల్లో నిలుస్తూ వచ్చిన విషయం తెలిసిందే. -
విజయ్‌పై ఎన్నికల్లో పోటీ చేస్తా.. ప్రకటించిన స్టార్ హీరోయిన్
'తమిళగ వెట్రిక్ కళగం' పేరుతో తమిళనాడులో రాజకీయ పార్టీని పెట్టారు దళపతి విజయ్. 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ బరిలో ఉంటుందని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు కూడా దూరంగా ఉంటున్నట్లు విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. విజయ్ పార్టీ పెట్టిన సమయం నుంచి తమిళనాట రాజకీయాల్లో ఉత్కంఠ పెరిగింది. 2026 ఎన్నికల్లో గట్టిపోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో హీరో విజయ్‌పై తాను పోటీ చేస్తానని సీనియర్ స్టార్ హీరోయిన్ ప్రకటించేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గ్లామర్ డాల్ నమిత.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో హీరో విజయ్ మీద పోటీ చేస్తానని ప్రకటించింది. నమిత తమిళనాడు బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరపున నమిత చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ తరఫున ఎన్నికల ప్రచారంలో ఆమె ఉంది. నీలగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎల్ మురుగన్ పోటీ చేస్తుండటంతో ఆయన తరపున నమిత ఎన్నికల ప్రచారం చేస్తుంది. దీంతో నమితను చూసేందుకు భారీగా జనాలు ఎగబడుతున్నారు. నమితకు తమిళనాడులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె కోసం ఏకంగా అభిమానులు గుడి కూడా కట్టించారు. ఈ క్రమంలో 2026 ఎన్నికల్లో తాను బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయ్‌పై పోటీ చేస్తానని చెప్పిన నమిత.. విజయ్ కూడా రాజకీయాల్లో రాణించాలని కోరుకుంది. రాజకీయాల్లో తెలివైన ప్రత్యర్థిపై పోటీ చేయాలని, అప్పుడే రాజకీయ ఎదుగుదలకు అవకాశం ఉంటుందని అనుకుంటున్నట్లు నమిత తెలివిగా సమాధానం చెప్పింది. హీరో విజయ్ మీద నమిత పోటీ చేస్తే డిపాజిట్లు కూడా ఆమెకు దక్కవని ఫ్యాన్స్ అంటున్నారు. దీంతో నమిత పేరు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. -
ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకున్న ఖుష్బూ.. కారణం ఇదేనా?
బరువెక్కిన హృదయంతో ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకుంటున్నానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సినీ నటి, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఖుష్బూ లేఖ రాశారు. తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికలలో ఖుష్బూ సీటును ఆశించిన విషయం తెలిసిందే. అయితే ఆమెకు బీజేపీ సీటు ఇవ్వలేదు. దీంతో కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు, ఎన్నికల ప్రచారాలకు ఆమె దూరంగా ఉంటూ రావడం చర్చకు దారి తీసింది. దీనికి ముగింపు పలికే విధంగా అధిష్టానం ఆదేశాల మేరకు కొద్దిరోజు క్రితమే ఎన్నికల ప్రచారానికి కుష్భు సిద్ధమయ్యారు. కొన్ని చోట్ల మమా అనిపించే విధంగా ప్రచారం కూడా చేశారు. శనివారం దక్షిణ చైన్నె అభ్యర్థి తమిళి సై సౌందర రాజన్‌కు మద్దతుగా కుష్బూ ప్రచారం కూడా చేశారు. అయితే హఠాత్తుగా ఏం జరిగిందో ఏమో గానీ ఎన్నికల ప్రచారం నుంచి బరువెక్కిన హృదయంతో తాను తప్పుకుంటున్నట్లు జేపీ నడ్డాకు ఆమె లేఖ రాయడం గమనార్హం. కారణం ఇదేనా..? 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఖుష్బూకు సీటు ఇవ్వకుండా బీజేపీ దూరం పెట్టిన విషయం తెలిసిందే.. ఇదే సమయంలో తాజాగా పార్టీలో చేరిన మరో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్‌కు బీజేపీ సీటు ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారని తమిళనాట భారీగా ప్రచారం జరుగుతుంది. ఈసారి తప్పకుండా సీటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్న ఖుష్బూకు సీటు దక్కకపోవడంతో తీవ్రమైన నిరాశకు గురైయారని వినికిడి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అన్నామలై, ఎల్.మురుగన్, తమిళిసై సౌందర్‌రాజన్, రాధికా శరత్‌కుమార్ వంటి ముఖ్యులకు సీటు కేటాయించిన విషయం తెలిసిందే. పార్టీలో సీనయర్ల అందరికీ సీటు కేటాయించిన బీజేపీ.. ఖుష్బూకు మొండి చేయి చూపించింది. వాస్తవంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖుష్బూ పోటీ చేసి ఓడిపోయారనే విషయం తెలిసిందే. దీంతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ఆమెకు కేటాయిస్తారని అక్కడి నేతలు అందరూ భావించారు. ఖుష్బూకు ఎందకు సీటు దక్కలేదనే విషయంపై తమిళనాడు బీజేపీ నేతలు కూడా పలు కామెంట్లు చేస్తున్నారు. ఖుష్బూకు ఎక్కడ ఏం మాట్లాడాలో ఇంకా తెలియలేదని వారు చెబుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం మహిళలకు ప్రతి నెలా ఇస్తున్న రూ.1000ను భిక్షగా ఆమె కామెంట్ చేసి తప్పుచేశారని పేర్కొంటున్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీకి నష్టాన్ని తెచ్చాయని చెబుతున్నారు. అది కాస్త అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించాయంటున్నారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలోని మహిళలు కూడా ఖుష్బూ పట్ల సానుకూలంగా లేరని గుర్తుచేశారు. అందువల్ల ఆమెకు సీటు ఇస్తే ఓడిపోతారన్న భావనతో కేటాయించలేదని బీజేపీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఫైనల్‌గా ఆమెకు సీటు దక్కకపోవడం.. రీసెంట్గా పార్టీలో చేరిన రాధికా శరత్ కుమార్‌కు ప్రధాన్యత ఇచ్చి సీటు ఇవ్వడంతో ఖుష్బూలో వ్యతిరేఖత వచ్చిందని అందుకే ఇక ఎన్నికల ప్రచారానికి ఆమె గుడ్‌బై చెప్పారని ప్రచారం జరుగుతుంది.