సాక్షి, చైన్నె : అసెంబ్లీ స్పీకర్ అప్పావు శుక్రవారం చైన్నెలోని ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట తన తరఫు వాదనను ఉంచారు. గత ఏడాది చైన్నెలో జరిగిన పుస్తక ఆవిష్కరణ వేడుకలో స్పీకర్ అప్పావు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై విమర్శలు ఎక్కుబెట్టారు. జయలలిత మరణించినానంతరం 40 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు డీఎంకేలో చేరడానికి సిద్ధమయ్యారని వివరించారు. అయితే, వారిని చేర్చుకునేందుకు పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ నిరాకరించారని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల పరువుకు భంగం కలిగించేలా ఉన్నట్టు ఆ పార్టీ పరిగణించింది. స్పీకర్ అప్పావుపై అన్నాడీఎంకే తరఫున పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఎంపీ, ఎమ్మెల్యేల కేసు విచారించే ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చింది. శుక్రవారం స్పీకర్ అప్పావు ఈ పిటిషన్ విచారణ నిమిత్తం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయవేల్ ఎదుట హాజరయ్యారు. తన తరఫున వాదనను కోర్టు ముందు ఉంచారు. సమన్లను తీసుకునేందుకు తాను నిరాకరించినట్టుగా అన్నాడీఎంకే పేర్కొనడాన్ని ఖండించారు. తనకు న్యాయస్థానాలన్నా, న్యాయమూర్తులన్నా గౌరవం ఉందని, తాను సమన్లు నిరాకరించినట్టుగా పేర్కొంటున్న వ్యవహారంపై కూడా విచారణ జరగాలని ఆయన కోరారు. తనకు ఎలాంటి సమన్లు రాలేదని స్పష్టం చేశారు. వాదనల అనంతరం తర్వాత విచారణను ఈనెల 26వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.
ఎంపీకి అవమానం
● అధికారులు సారీ
సాక్షి, చైన్నె: చైన్నె విమానాశ్రయం ఆవరణలో కాంగ్రెస్ మహిళా ఎంపీ సుధాకు తీవ్ర అవమానం జరిగింది. ఆమె సామాజిక మాధ్యమం వేదికగా ఫిర్యాదు చేయడంతో విమానాశ్రయ అధికారులు శుక్రవారం సారీ చెప్పారు. మైలాడుతురై నుంచి ఎంపీగా తొలిసారిగా పార్లమెంట్‌లో ఆర్ సుధా అడుగుపెట్టారు. ఆమె మహిళా న్యాయవాది కావడమే కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. చైన్నె విమానాశ్రయం ఆవరణలో తనకు ఎదురైన అవమానం గురించి ఆమె సామాజిక మాధ్యమం ద్వారా విమానయాన శాఖ, ఎయిర్ పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం అర్ధరాత్రి తను ఢిల్లీ నుంచి చైన్నెకు వచ్చినట్టు పేర్కొన్నారు. తన కారులో వెళ్తుండగా పార్కింగ్ ఎంట్రీ వద్ద సిబ్బంది తనతో దురుసుగా వ్యవహరించారని, తాను ఎంపీ అని చెప్పినా బలవంతంగా ఫీజు చెల్లించే విధంగా చేశారని పేర్కొన్నారు. తాను ఫీజు చెల్లించే బయటకు రావాల్సి వచ్చిందని, ఎంపీకి విలువ లేదా అని ప్రశ్నించారు. ఇందుకు విమానాశ్రయ అధికారులు స్పందించారు. ఆమెకు క్షమాపణ చెప్పడమే కాకుండా ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామన్నారు. పార్కింగ్ ప్రవేశ మార్గంలో ఫీజులు వసూళ్లు చేస్తున్నది కాంట్రాక్టు సంస్థకు చెందిన వారని పేర్కొంటూ, అయినా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment