
కారులో గంజాయి తరలింపు
● ఐదుగురి అరెస్ట్
వేలూరు: ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి రాణిపేట మీదుగా చైన్నె, బెంగళూరు ప్రాంతాలకు గంజాయి, మత్తు పదార్థాలను తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి రాణిపేట మీదుగా మత్తు పదార్థాలు తరలిస్తున్నట్లు రాణిపేట పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రాణిపేట, ఆర్కాడు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి వాహన తనఖీలు నిర్వహించారు. తనిఖీల్లో చైన్నెకి వెళుతున్న రెండు కార్లను పోలీసులు తనిఖీ చేశారు. తనిఖీల్లో గోనె సంచిలో గంజాయి, మత్తు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. కారుతో పాటు మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణ జరపగా అందులో రెండు కార్లలో 210 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో రాణిపేట జిల్లా ఆర్కాడు ప్రాంతంలో వచ్చిన ఒక కారును తనఖీ చేయగా అందులో 120 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు మూడు కార్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కారులో ఉన్న యువకులను విచారణ జరపగా ఒడిశా రాష్ట్రానికి చెందిన గుప్తా శరన్ సాహు, సుధీర్ ఆల్‌పెరియా, తోపత్తాదాస్, రోల్‌మాజీ, గౌరవ్ అని తెలిసింది. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.