
కాలం మారుతోంది. దానితో పాటు సినిమాను రూపాంతరం చెందుతోంది. సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధి చెందుతోంది. మ్యాన్ పవర్ తగ్గుతోందని కూడా చెప్పవచ్పు. ఇప్పుడు ఇండియన్ సినిమా హాలీవుడ్ సినిమాలకు దీటుగా ఎదుగుతోంది. ఇది సినీ విజ్ఞులు చెబుతున్న మాట. ప్రముఖ సినీ దర్శకుడు, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి ఇదే చెబుతున్నారు. ఈయన సినిమా రంగంలో 24 క్రాఫ్ట్‌లతో కూడిన దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ)కి అధ్యక్షుడు అన్న విషయం తెలిసిందే.

కాగా ఈ 24 క్రాఫ్ట్‌ల సంఘంలో మరో క్రాఫ్ట్ చేరనుంది. అదే దివా( డిజిటల్ ఇంటర్ మీడియట్ విజువల్ ఎఫెక్ట్స్ అసోసియేషన్). దీంతో ఫెఫ్సీ ఇప్పుడు 25 క్రాఫ్ట్‌స్ కలిసిన సమాఖ్య కానుంది. దివా నిర్వాహకులు చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్‌కే.సెల్వమణి, దర్శకుడు రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సెల్వమణి మాట్లాడుతూ ఇంతకుముందు తాను సినిమాను రూపొందించినప్పుడు అనుకున్నది ముందుగానే చూడడానికి కఠిన శారీరక శ్రమ, డబ్బు ఖర్చు అవసరం అయ్యేదన్నారు. అయినా రిజల్ట్ 40 శాతమే వచ్చేదన్నారు.
అలాంటిది ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఆ రిజల్ట్ 100 శాతంగా మారిందన్నారు. కె.బాలచందర్, భారతీరాజా, శ్రీధర్ వంటి దర్శకుల కాలంలో సినిమా సాంకేతిక నిపుణుల ఆధీనంలోకి వచ్చిందన్నారు. ఆ తరువాత రజనీకాంత్, కమలహాసన్ వంటి నటుల ఆధీనంలోకి వచ్చిందన్నారు. 2025 నుంచి 2050 వరకూ సినిమాను ఏలేది ఏఐ, వీఎఫ్‌ఎక్స్, సీజీ వంటి సాంకేతిక పరిజ్ఞానమేనని అన్నారు. అలాంటి దానికి ఒక సంఘం అన్నది స్వాగతించాల్సిన విషయమేనన్నారు.

మీ సంఘాన్ని ఫెఫ్సీలో చేర్చుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని సెల్వమణి పేర్కొన్నారు. అయితే వీఎఫ్‌ఎక్స్, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాతలకు భారం కాకుండా, వారితో కలిసి నడుచుకోవాలని ఆయన అన్నారు. దివా త్వరలో ఒడిసీ అవార్డుల పేరుతో భారీ ఎత్తున చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment