తమిళ్ సినీ నిర్మాతల మండలి, యాక్టివ్ నిర్మాతల మండలి కార్య వర్గాల్లో ఐక్యత లేదని ఫెఫ్సీ అధ్యక్షుడు, దర్శకుడు,నిర్మాత ఆర్‌కే సెల్వమణి పేర్కొన్నారు. నటుడు అశోక్ సెల్వన్, అవంతిక మిశ్రా జంటగా నటించిన చిత్రం ఎమక్కు తొళిల్ రొమాన్స్. నటి ఊర్వశి, అళగప్పన్ పెరుమాళ్, ఎంఎస్ భాస్కర్, భగవతి పెరుమాళ్, భడవా గోపి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని బాలాజీ కేశవన్ దర్శకత్వంలో టి.క్రియేషన్స్ పతాకంపై ఎం.తిరుమలై నిర్మించారు. నివాస్ కె.ప్రసన్న సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం తాజాగా చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించారు.
కాగా ఈ వేదికపై చిత్ర నిర్మాత ఎం.తిరుమలై, నటుడు అశోక్ సెల్వన్‌పై పలు ఆరోపణలు చేశారు. ఈయన పారితోషికాన్ని పూర్తిగా చెల్లించినా, చిత్రానికి సహకరించలేదని విమర్శించారు. నిర్మాతల డబ్బుతో ఎదిగిన అశోక్ సెల్వన్ నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు. తన చిత్రం ప్రమోషన్‌కు రాకపోవడం ఎంతవరకు సమంజసమో నిర్మాతల సంఘం కార్యవర్గం ఆలోచించాలన్నారు. నిర్మాతలు లేకుంటే నటీనటులు ఎక్కడ అని? నిర్మాత ఎం.తిరుమలై ప్రశ్నించారు.
కాగా ఈ వేడుకలో పాల్గొన్న ఫెఫ్సీ అధ్యక్షుడు, దర్శకుడు ఆర్‌కే సెల్వమణి మాట్లాడుతూ ఈ చిత్రం విషయంలో నిర్మాత ఎం.తిరుమలైకి, నటుడు ఆశోక్ సెల్వన్‌కు మధ్య ఏమి జరిగిందో తనకు తెలియదంటూనే వారి వల్ల చిన్న చిత్రాల నిర్మాతలు మాత్రం చాలా నష్టపోతున్నారన్నారు. చిత్రాలు హిట్ అయితే ఎక్కువగా లబ్ధి పొందేది హీరో, హీరోయిన్లేనని, ఆ తరువాత క్యూబ్ నిర్వాహకులు, సాంకేతిక వర్గం లాభపడతారని, నిర్మాతకు మాత్రం ప్రయోజనమే ఉండడం లేదన్నారు. ఈ విషయంలో నిర్మాతల మండలి కార్యవర్గంలో ఐక్యత లేదనే చెబుతానన్నారు. అదే ఉంటే ఇలాంటి ఘటనలు తలెత్తవన్నారు.
నిర్వాహకులందరూ కలిసి నిర్మాతలకు లాభం కలిగేలా ఒక పరిష్కారాన్ని చేయాలన్నారు. అందుకు ఫెప్సీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆర్‌కే సెల్వమణి పేర్కొన్నారు. నిర్మాత ఎం.తిరుమలై నిర్మించిన ఎమక్కు తొళిల్ రొమాన్స్ చిత్రం ట్రైలర్, పాటలు చూస్తుంటే వినోదకరమైన ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోందన్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment