విద్యార్థులను ఘనంగా సన్మానించిన విజయ్.. ఆమెకు డైమండ్‌ రింగ్‌ | Thalapathy Vijay Honours Tamil Nadu 2024 Top Students | Sakshi
Sakshi News home page

విద్యార్థులను ఘనంగా సన్మానించిన విజయ్.. ఆమెకు డైమండ్‌ రింగ్‌

Published Fri, Jun 28 2024 1:01 PM | Last Updated on Fri, Jun 28 2024 3:24 PM

Thalapathy Vijay Honours Tamil Nadu 2024 Top Students

కోలీవుడ్‌ టాప్‌ హీరో  దళపతి విజయ్ సాయం చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటారు. ఇప్పటికే తమిళనాడులో ఆయన అనేకసార్లు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసి ప్రసిద్ధి చెందారు.  తాజాగా మరోసారి మంచి మనసు చాటుకున్నారు విజయ్‌. ఇటీవల వెలువడిన టెన్త్‌, ఇంటర్‌ ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారిని అభినందించి వారికి బహుమతులు కూడా అందించారు. గతేడాది తమిళనాడు టాపర్‌కు డైమండ్‌ నెక్లస్‌ ఇచ్చిన విజయ్‌.. ఈ ఏడాదిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థికి డైమండ్‌ రింగ్‌ కానుకగా ఇచ్చారు.

హీరో నుంచి రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత తొలిసారి తన పార్టీ  'తమిళగ వెట్రి కళగం' పేరుతో విధ్యార్థులను అభినందించారు. తమిళనాడులోని నియోజకవర్గాల వారీగా టెన్త్‌, ఇంటర్‌లో టాప్‌ 3లో నిలిచిన విద్యార్థులకు సన్మానం చేసి బహుమతులు అందించారు. తొలి విడుతగా జూన్‌ 28న జరిగిన ఈ కార్యక్రమంలో 750 మంది విద్యార్థులతో పాటు 3500 మంది తల్లిదండ్రులు వారి సన్నిహితులు పాల్గొన్నారు. చెన్నైలోని తిరువాన్మియూర్‌లో  ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

తమిళనాడు వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్‌ ప్రతి విద్యార్థికి శాలువా, సర్టిఫికెట్‌తోపాటు రూ.5000 ప్రోత్సాహకం అందించి అభినందించారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ శాఖాహార విందును ఏర్పాటు చేశారు. వేడుకల్లో పాల్గొనేందుకు 21 జిల్లాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి, తమిళనాడు వెట్రి కజగం పూర్తి ఖర్చు భరించింది. వారిని తిరిగి తమ ఇంటికి చేర్చే వరకు విజయ్‌ అన్నీ ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి విజయ్‌ ఇలా మాట్లాడారు. 'ఇటీవలి పది, పన్నెండవ  పరీక్షలలో విజయం సాధించిన నా తమ్ముళ్లు, సోదరీమణులు వారితో వచ్చిన తల్లిదండ్రులకు నా వినయపూర్వకమైన నమస్కారాలు. ప్రతి విద్యార్థి తనకు నచ్చిన కోర్సులో చేరండి. అనుకున్నది సాధించే వరకు పోరాడండి. సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వార్తాపత్రికలు చదవండి. డ్రగ్స్‌ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. భవిష్యత్‌లో రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయంగా క్రియాశీలకంగా మారాలి.' అని విద్యార్థులను విజయ్‌ ప్రోత్సహించారు. గతేడాది కూడా విజయ్‌ ఇలాంటి కార్యక్రమమే జరిపించారనే విషయం తెలిసిందే. వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ పోటీ చేయనున్నారు.

వృత్తిపరంగా, విజయ్ ఇటీవల లియో చిత్రంలో కనిపించారు. ఇందులో త్రిష కూడా నటించింది. ఇది ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. తాజాగా  'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) సినిమా పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement