కోలీవుడ్ నటుడు, దర్శకుడు ఎస్‌జే సూర్యకు చెన్నైలోని 'వేల్స్ విశ్వవిద్యాలయం' గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. దీంతో ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. చెన్నైలోని పల్లవరంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ వేల్స్ 15వ స్నాతకోత్సవ వేడుక ఈరోజు (డిసెంబర్ 1) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఇందులో సుమారు 5 వేల మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పరిశోధక విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.
దర్శకుడు, నటుడు, నిర్మాత, గీత రచయిత, గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఎస్.జె.సూర్యను గౌరవ డాక్టరేట్‌తో 'వేల్స్ విశ్వవిద్యాలయం' సత్కరించింది. 25 ఏళ్లుగా సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గానూ గుర్తిస్తూ ఈ గౌరవాన్ని కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ పేర్కొంది. అలాగే బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధులను ఒలింపిక్ క్రీడల్లో ప్రపంచ వేదికపై విజయం సాధించేలా మార్గనిర్దేశం చేసిన కోచ్ పుల్లెల గోపీచంద్‌కు కూడా గౌరవ డాక్టరేట్ లభించింది. వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి గతేడాదిలో రామ్ చరణ్ డాక్టరేట్‌ను పొందిన విషయం తెలిసిందే.
దర్శకుడిగా కాస్త విరామం తీసుకున్న ఎస్‌జే సూర్య తమిళ, తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే బిగ్ హిట్‌గా నిలిచిన 'ఖుషి' చిత్రానికి ఆయన డైరెక్షన్ చేశారు. ఒక రకంగా ఈ సినిమాతోనే పవన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. 2001లో విడుదలైన ఈ సినిమా టేకింగ్ చేసిన తీరుకు ఎస్‌జే సూర్య పట్ల చాలామంది ఫిదా అయిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment