
తరాలు మారుతున్నా ఇళయరాజా సంగీతంపై అభిమానం ఏంతమాత్రం తగ్గదు. గత 50 ఏళ్లుగా కోట్లమందికి తన సంగీతంతో ఆయన దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఇళయరాజా 50 ఏళ్ల మ్యూజికల్ జర్నీపై తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ప్రస్థానాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తాజాగా తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు.
తమిళనాడు తేని జిల్లాలో మారుమూల కుగ్రామంలో రాజయ్యగా పుట్టి, రాజాగా ఆయన మారారు. అప్పటికే చిత్ర పరిశ్రమలో మన ఏ.ఎం.రాజా ఉండటం వల్ల ‘ఇళయ’ చేర్చుకుని ఇళయరాజాగా ఆయన పరిచయం అయ్యారు. అలా ‘అన్నాకిళి’ (1976)తో మొదటి చిత్రం చేశారు. ఏ ముహూర్తాన సంగీత దర్శకుడిగా జన్మించాడోగాని ఇంతకాలం తర్వాత, 1,500 సినిమాలకు 8,500 పాటలు చేశాక, 81 ఏళ్లకు చేరుకున్నాక కూడా ఆకర్షణ కోల్పోలేదు.

భారతీయ సంగీత ప్రతిభను ప్రపంచానికి చాటడానికి వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్‌లో అత్యంత క్లిష్టమైన ‘సింఫనీ’ రాసి, దానికి ‘వేలియంట్’ అని నామకరణం చేసి, మార్చి 8న లండన్ లో 85 మంది సభ్యుల ప్రతిష్ఠాత్మక రాయల్ ఫిల్‌హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ప్రదర్శన ఇచ్చారు. ప్రపంచ దేశాల నుంచి రాజా అభిమానులు ఈ సింఫనీకి హాజరయ్యారు. 45 నిమిషాల నాలుగు అంచెల సింఫనీని విని స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇలా వెస్ట్రన్ క్లాసికల్‌లో సింఫనీ రాసి, లండన్ (London)లో ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి భారతీయుడిగా రాజా చరిత్ర సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment