
‘టిక్... టిక్... టిక్...’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న కె.భారతీరాజా తన మిత్రుడు ఇళయరాజాకు పాట సందర్భాన్ని వివరిస్తూ ‘పాట మధ్యలో ఒకచోట భయంకరమైన మ్యూజిక్ కావాలి. అక్కడ ప్రేక్షకులు ఉలిక్కిపడే దృశ్యం చూపిస్తాను’ అన్నాడట. ఇళయరాజా ‘సరే’ అని పాట రికార్డు చేశాడు. భారతీరాజా ఆ పాట విని మొదట తనే ఉలిక్కిపడ్డాడు. ఏమంటే భయంకరమైన మ్యూజిక్ కావాలని అతడు కోరిన చోట ఇళయరాజా ఏం చేశాడో తెలుసా? కొన్ని సెకన్ల నిశ్శబ్దం ఉంచాడు.
‘నిశ్శబ్దానికి మించిన భయమైన ధ్వని ఏముంది?’. ఆ పాట హిట్ అయ్యింది. శబ్దం, నిశ్శబ్దం తెలిసిన ఈ మహా సంగీతకారుడు గత 50 ఏళ్లుగా కోట్లమందికి తోడుగా ఉన్నాడు. అభిమానులతో సహజీవనం చేస్తున్నాడు. ఆరాధకులతో సహయానం సాగిస్తున్నాడు. మనసుకు వైద్యుడు. కలత వేళ ఏకాంత తీరాలకు మోసే వెదురు తెప్ప.
‘ప్రేమ’ సినిమా కుర్రకారు ఓపెనింగ్స్‌తో మొదలైంది. హీరో గిటారిస్ట్. క్లయిమాక్స్ జాతీయస్థాయిలో పాటల పోటీ. హీరో ఎలాంటి పాటతో అదరగొట్టి చిందులు వేస్తాడోనని అందరూ ఎదురు చూస్తే ‘ప్రియతమా... నా హృదయమా’... అని ఎంతో నెమ్మదైన మెలడీ వస్తుంది. ఇళయరాజా అలా ఎందుకు చేశాడు? పాట మరోసారి వినండి.
పాటకు ముందు మెరుపు వేగంతో గిటార్ మోతతో స్టేజ్ ఊగిపోయేలా ప్రిలూడ్ వస్తుంది. హఠాత్తుగా ఆగి స్లోగా పాట మొదలవుతుంది. హీరో పాడాలనుకున్నది ప్రిలూడ్‌కు అనువైన పాట. పాడింది ఈ పాట. కారణం? హీరోయిన్ చావు బతుకుల్లో ఉంది. దర్శకుడి కంటే ఇళయరాజాకే కథ బాగా అర్థం అవుతుంది. అందుకే అతడి పాట నిలబడుతుంది.
తెల్లవారే లేచి, కాస్త∙టీ కొట్టి, హైదరాబాద్ నుంచి చెన్నైకి కారు ప్రయాణం మీద బయలుదేరే కొందరు అమ్మో అంత దూరమా? అనుకోరు. ఇళయరాజా పాటల పెన్ డ్రైవ్ తగిలిస్తే చాలు అనుకుంటారు. ఏ శనివారం సాయంత్రమో పార్టీలో డబ్బు తక్కువై సరంజామా తగ్గినా ఊరుకుంటారు... ఇళయరాజా పాట మాత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండాల్సిందే. ప్రేమ విఫలం... ఇళయరాజా. ప్రేమ జయం... ఇళయరాజా. భావనలొకటై సాగిపోయే వేళలో.... పరువమా చిలిపి పరుగు తీయకు....
తమిళనాడు తేని జిల్లాలో మారుమూల కుగ్రామంలో రాజయ్యగా పుట్టి, రాజాగా మారి అప్ప టికే మన ఏ.ఎం.రాజా ఇండస్ట్రీలో ఉండటం వల్ల ‘ఇళయ’ చేర్చుకుని ఇళయరాజాగా ‘అన్నాకిళి’ (1976)తో ఏ ముహూర్తాన సంగీత దర్శకుడిగా జన్మించాడోగాని ఇంతకాలం తర్వాత, 1,500 సినిమాలకు 8,500 పాటలు చేశాక, 81 ఏళ్లకు చేరుకున్నాక కూడా ఆకర్షణ కోల్పోలేదు. పెరిగే అభిమానుల రాశి తప్ప అతని పాటల సూచి కుదేలైన దాఖలా లేదు. ఇసైజ్ఞాని. మేస్ట్రో. రాజా సార్. ఒకసారి వింటే చర్మానికి అంటుకుపోయే ఒడు కొలాన్ సెంట్.
1980లలో హైస్కూల్లోనో కాలేజీలోనో ఉన్నవారెవరైనా ఇతని మొగలి వనాలలో వ్యసనపరులు. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది.రావడం రావడమే కొత్త సౌండ్‌ను ప్రవేశ పెట్టిన ఇళయరాజాకు, కర్ణాటక ధోరణిని వెస్ట్రన్ తో ఫ్యూజన్ చేయాలనుకుంటున్న ఇళయరాజాకు తన పాటలు సగటు శ్రోతలకు నచ్చుతాయా లేదా అనే సందేహం తెగ పీడించింది.
ఒకరోజు సాయంత్రం వాకింగ్‌కు ఇంటి నుంచి బయలుదేరితే రేడియోలో ‘అన్నాకిళి’ (రామచిలుక)లోని ‘మావయ్య వస్తాడట’ పాట మొదలైందట! అంతే... ఆ ఇంటి ఇల్లాలు గబగబా బయటకు వచ్చి ‘ఓ సుబ్బాయక్కా... మంగమ్మత్తా... మావయ్య వస్తాడట పాట వస్తోందే రేడియో పెట్టండి’ అని అరిచిందట! ఇళయరాజా నడుస్తున్న పొడవైన వీధి. ఇక చూడండి... ప్రతి గడపా వరుసగా రేడియో ఆన్ చేస్తూ అతని పాటను అతనికే వినిపిస్తూ కచేరీ. వారిచ్చిన నమ్మకం నేటికీ!
‘సంగీతం రాదు... ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను’ అనే ఇళయరాజా ఇంత పేరు, ఖ్యాతి, సంపద తర్వాత కూడా వయసు రీత్యా విరమించుకొని ఉండొచ్చు. గర్వంతో మొద్దుబారి ఉండొచ్చు. అహంతో బంగారు సింహాసనం చేసుకుని విర్రవీగొచ్చు. కాని అతడు అవేం చేయలేదు. భారతీయ సంగీత ప్రతిభను ప్రపంచానికి చాటడానికి వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్‌లో అత్యంత క్లిష్టమైన ‘సింఫనీ’ రాసి, దానికి ‘వేలియంట్’ అని నామకరణం చేసి, మార్చి 8న లండన్ లో 85 మంది సభ్యుల ప్రతిష్ఠాత్మక రాయల్ ఫిల్‌హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ప్రదర్శన ఇచ్చాడు.
ప్రపంచ దేశాల నుంచి రాజా అభిమానులు ఈ సింఫనీకి హాజరయ్యారు. 45 నిమిషాల నాలుగు అంచెల సింఫనీని విని స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇలా వెస్ట్రన్ క్లాసికల్‌లో సింఫనీ రాసి, లండన్ లో ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి భారతీయుడిగా రాజా చరిత్ర సృష్టించాడు. మరల రాజాధిరాజుగా నిలిచాడు. వ్యక్తిగత ప్రవర్తనలో కొందరికి అభ్యంతరాలు ఉండుగాక... కాని ఇళయరాజా ఒకసారి హార్మోనియం పెట్టె ముందు కూచున్నాడంటే దేవుడు– అభిమానులకు! చేసిన పాటల కంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోరుకు ఫ్యాన్స్ ఉన్నారంటే ఏమిటి చెప్పడం!
రాజా తరగని స్ఫూర్తి. కొద్దిగా చేసి ఎంతో అనుకునేవారు, కాసింత వయసుకే డీలా పడిపోయే వారు, నాలుగు ముక్కలు చదివి మేధావులుగా చలామణి అయ్యేవారు, అద్దెలొచ్చే నాలుగు ఫ్లాట్లకు ఓనరై్లనంత మాత్రాన ఇతరులను పురుగుల్లా చూసేవారు... రాజా నుంచి నేర్చుకోవాల్సింది ఉన్నట్టే ఉంది. రాజా చెయ్యి వేస్తే... అది రాంగై పోదు లేరా!
Comments
Please login to add a commentAdd a comment