తమిళ సినిమా: లెజెండరీ దర్శకుడ భారతీరాజా, సంగీత దర్శకుడు ఇళయరాజా 31 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక చిత్రంలో కలిసి పని చేయడం విశేషం. వీరి కాంబినేషన్లో చివరిగా నాడోడి తెండ్రల్ చిత్రం వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు దర్శకుడు సుశీంద్రన్ తన వెన్నెల ప్రొడక్షనన్స్ పతాకంపై నిర్మిస్తున్న మార్గళి తింగల్ చిత్రంతో ఈ మ్యాజిక్ జరిగింది. ఈ చిత్రం ద్వారా దర్శకుడు భారతీరాజా వారసుడు, నటుడు మనోజ్ భారతీరాజా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన తాజ్ మహల్ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే.
ఆ తరువాత పలు చిత్రాల్లో నటించిన మనోజ్ మెగా ఫోన్ పట్టి తొలి ప్రయత్నంలోనే తన తండ్రిని డైరెక్ట్ చేయడం విశేషం. భారతీరాజా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో పలువురు నూతన నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. దీని గురించి దర్శకుడు సుశీంద్రన్ తెలుపుతూ నటుడు మనోజ్ భారతీరాజాను తన చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అదనపు బలం అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇటీవల ఈ చిత్రం పాటల రికార్డింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలి చిత్రంతోనే తన తండ్రి భారతీరాజాను డైరెక్ట్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని మనోజ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment