Bharathiraja
-
ముగిసిన భారతీ రాజా అంత్యక్రియలు.. ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి
దర్శక దిగ్గజం భారతీ రాజా అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని ఆయన నివాసం నుంచి తేనిలో ఉన్న ఫామ్‌హౌస్‌కు పార్థివ దేహాన్ని తరలించారు. దిగ్గజ దర్శకుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చివరి యాత్రలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. ఆయన చివరి చూపు కోసం పెద్దఎత్తున అభిమానులు ఫామ్‌హౌస్‌కు తరలివచ్చారు.అంతకుముందు సీనియర్ హీరోయిన్ భారతీ రాజా భౌతికకాయానికి నివాళులర్పించారు. భారతీరాజా సతీమణి హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు. భారతీరాజాను కడసారి చూసి వెక్కి వెక్కి ఏడ్చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దిగ్గజ దర్శకుడు భారతీ రాజాకు తుది నివాళులర్పించేందుకు విచ్చేసిన గీత రచయిత వైరముత్తు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దర్శకుడి భౌతికకాయానికి నివాళులర్పిస్తూ వైరముత్తు కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా.. తీవ్ర అనారోగ్య సమస్యలతో భారతీ రాజా జూన్ 10న కన్నుమూశారు. ఆయన చివరిసారిగా మోహన్ లాల్ హీరోగా వచ్చిన తుడరుమ్ చిత్రంలో నటించారు.VIDEO | Tamil Nadu: Actor Suhasini Maniratnam pays tributes to Bharathiraja in Theni, says “He changed the colour and character of Tamil cinema”.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/VkhkLxtFst— Press Trust of India (@PTI_News) June 11, 2026 -
నా బాధను మాటల్లో వివరించలేకపోతున్నా.. రాధిక ఎమోషనల్ పోస్ట్
దర్శక శిఖరం భారతీరాజా మరణవార్త విని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు నటి రాధికా శరత్‌కుమార్. ఆమెను హీరోయిన్గా పరిచయం చేసింది భారతీరాజానే. అందుకే అతన్ని గురువుగా భావించి, అవకాశం వచ్చినప్పుడల్లా ఆయనపై అభిమానాన్ని వెల్లడిస్తూనే ఉంటుంది. బుధవారం భారతీరాజా తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ రాధిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.‘నేను ఇలా ఉన్నానంటే కారణం ఇద్దరు మాత్రమే. అందులో ఒకరు నా తల్లి, మరొకరు నా గురువుగారు భారతీరాజా. ఒక్క ఏడాదిలోనే నాకు ఇష్టమైన ఇద్దరినీ కోల్పోయాను. నా బాధను మాటల్లో వివరించలేకపోతున్నా. ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. హృదయం బరువెక్కింది. వారి జ్ఞాపకాలు, నాకు నేర్పిన జీవిత పాఠాలు ఎప్పుడు నాతోనే ఉంటాయి’ అంటూ భారతీరాజాతో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు. ‘భారతీరాజా సర్.. మీరే నా సర్వసం. మీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అని క్యాప్షన్ పెట్టారు. కాగా, భారతీరాజాకు కూడా రాధికపై అపారమైన గౌరవం ఉండేది. తన విజయాల్లో రాధిక కూడా భాగమని చెప్పేవారు. ఇటీవల కూడా రాధిక ఆయన్ని కలవగా.. ఆమె నటించిన ‘తాయ్‌కిళవి’కి నేషనల్ అవార్డు వస్తుందని ప్రోత్సహించారు. View this post on Instagram A post shared by 𝑹𝒂𝒅𝒊𝒌𝒂𝒂𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓_𝑭𝑪 (@radikaasarathkumar_fc) -
భారతీరాజా నెరవేరని కోరిక ఇదే
తన బంధువులందరినీ ఒకే చోటికి పిలిచి, పెద్ద విందు ఏర్పాటు చేసి అందరితో కలిసి సంతోషంగా గడపాలని భారతీరాజా ఆశపడ్డారని, అయితే, ఆ కోరిక నెరవేరకుండానే ఆయన కన్నుమూశారంటూ బంధువులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తేని జిల్లాలోని అల్లి నగరం (కీరైకల్ స్ట్రీట్)లో భారతీ రాజ తల్లిదండ్రులు పెరియమాయ దేవార్, కరుత్తమ్మ నివసించే వారు. భారతీరాజా తోబుట్టువులైన చెల్లెలు భారతి తన అన్నయ్యను గుర్తుచేసుకుంటూ రోదిస్తున్నారు. ‘అన్నయ్యకు తాను అంటే చాలా ఇష్టమని, అందుకే తన అసలు పేరైన చిన్నస్వామిని మార్చుకుని.. తన పేరులోని మొదటి ముక్కను (భారతి), అన్నయ్య జయరాజ్ పేరులోని రెండో ముక్కను (రాజా) కలిపి ’భారతీరాజా’ అని పేరు మార్చుకున్నారని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే కథలు చెప్పడం, నాటకాలు వేయడం ఆయనకు అలవాటు‘ అని కన్నీళ్లు పెట్టుకున్నారు.కుమారుడి మరణం.. గుండెకోతఆయన బంధువులు సుబ్బురాజ్, రవి మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం వరకు ఆయన సొంత ఊరికి, తను చిన్నప్పుడు పెరిగిన ఇంటికి తరచూ వచ్చేవారన్నారు. గతంలో కంబమ్ ప్రాంతంలో జరిగిన ఒక కుటుంబ వేడుకకు వచ్చినప్పుడు బంధువులందరినీ చూసి ఎంతో సంబరపడ్డారని పేర్కొన్నారు. సొంత వాళ్లందర్నీ పిలిచి ఒక పెద్ద విందు ఇవ్వాలని ఎప్పుడూ అనేవారని, కుమారుడు మనోజ్ మరణించడంతో ఆయన మానసికంగా తీవ్రంగా కుంగిపోయారన్నారు. దాంతో ఆ విందు కోరిక నెరవేరకుండానే నిష్క్రమించారు అని పేర్కొన్నారు.తోటలోనే అంత్యక్రియలు..తాను మరణిస్తే తేని జిల్లాలోని దేవదానపట్టి కాట్రోడ్ పరిసరాల్లో ఉన్న తన సొంత తోటలోనే(ఫామ్ హౌస్) అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన తరచూ చెప్తుండేవారని, ఆయన చివరి కోరిక మేరకే భౌతికకాయాన్ని తేని జిల్లాకు తీసుకొచ్చి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నామని బంధువులు తెలిపారు. తాజాగా భారతీ రాజాతీ అల్లి నగరం లాంటి చిన్న పల్లెటూరులో విషాదం నెలకొంది. బంధువులు, తేని జిల్లా ప్రజలను, ఆయన అభిమానులను తీవ్ర శోకసముద్రంలో ముంచెత్తింది. ఈరోజు సాయంత్రం తేని బంగళామేడు ప్రాంతంలో జిల్లా అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించే కార్యక్రమం జరిగింది. -
దర్శక శిఖరానికి ప్రముఖుల నివాళి
ప్రముఖ దర్శకుడు భారతీ రాజా బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. అవి వారి మాటల్లోనే...భారతీరాజా గారి ప్రతిభ, ఆయన సాధించిన విజయాల గురించి అందరికీ తెలిసిందే. ఎంతో మంది నటీనటులను, దర్శకులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేసి, వారి ఎదుగుదలకు, సినీ పరిశ్రమ మనుగడకు కారణమైన మహోన్నత వ్యక్తి. ఆయన సృష్టించిన అద్భుత దృశ్యకావ్యాలను ఎప్పటికీ మరువలేం. ఆయన ఆస్పత్రిలో ఉన్నప్పుడు చూడాలనుకున్నాను... కోలుకుంటారని భావించాను. ఆయన జీవించి ఉన్నప్పుడు చూడలేక పోవడం బా«ధగా మిగిలింది. – రజనీకాంత్భారతీయ సినిమా గొప్ప కథకుల్లో ఒకరైన భారతీరాజాగారిని కోల్పోయింది. పల్లెటూరి మట్టి సువాసనలను, మానవ సంబంధాల అందాలను, ప్రేమలోని అమాయకత్వాన్ని, సామాన్య ప్రజల భావోద్వేగాలను ఆయన శాశ్వతంగా నిలిచిపోయే సినిమా కవిత్వంగా మార్చారు. భారతీరాజాగారి సినిమాలు తరాలుగా సినీ దర్శకులకు స్ఫూర్తిగా నిలిచాయి. ఆయన దర్శకత్వంలోని ‘ఆరాధన’ చిత్రంలో పులిరాజు పాత్రలో నటించే అదృష్టం నాకు కలిగింది. – చిరంజీవిభారతీరాజాగారి మరణం బాధగా ఉంది. ఆయనతో కలిసి పని చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో నా స్నేహం, ఆయన కళ ఎప్పటికీ జీవించే ఉంటాయి. – కమల్హాసన్ప్రజలకు నాతో ఎలాంటి అనుబంధం ఉందో, భారతీరాజాగారితోనూ అలాంటి అనుబంధమే ఉంది. ఈ రెండూ వేర్వేరు కాదు. దేశాన్ని, దేశ ప్రజలను, కళాకారులను ప్రేమించడమే నా జన్మ హక్కు... అంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు. – ఇళయరాజాతన సహజమైన, రాజీపడని కథనంతో సినిమా రంగంలో విప్లవం సృష్టించిన నిజమైన మార్గదర్శకులు భారతీ రాజాగారు. ఆ మరపురాని గ్రామీణ కథలు, ఆ నిర్భయమైన దృక్పథం, ఆయన వెండితెరపైకి తీసుకు వచ్చిన వాస్తవికత ఎప్పటికీ నిలిచే ఉంటాయి. ఆయన అసాధారణమైన కృషిని, వారసత్వాన్ని ప్రత్యక్షంగా చూడటం, అలాగే వాటిని వేడుక గా జరుపుకోవడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నాను. – రాజమౌళిగ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలు, టీనేజర్స్ మధ్య ఉండే ఆకర్షణలు... వంటి అంశాలను చూపించడంలో భారతీ రాజాగారి శైలి ప్రత్యేకమైనది. సున్నితమైన ప్రేమ, సెంటిమెంట్ కథలే కాకుండా ‘ఎర్ర గులాబీలు’, ‘టిక్ టిక్ టిక్’ లాంటి థ్రిల్లర్స్తోనూ ప్రేక్షకులను మెప్పించారు. – పవన్ కల్యాణ్భారతీ రాజాగారు తన దూరదృష్టి, అద్భుతమైన కథాంశాలు, భారతీయ సినిమాకు అందించిన విశేష సేవలతో ఎప్పటికీ నిలిచిపోయే ఒక నిజమైన లెజెండ్. – అల్లు అర్జున్ భారతదేశానికి అతి పెద్ద మహిళా సూపర్ స్టార్ శ్రీదేవిని అందించడమే కాకుండా, సత్యజిత్ రేగారి వాస్తవికతను, ముఖర్జీగారి పాత్రలను, చటర్జీగారి సందర్భోచిత హాస్య శైలిని అద్భుతంగా మిళితం చేశారు భారతీ రాజాగారు. అన్ని వర్గాల, అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా అన్ని రకాల జానర్స్‌లో ఎంతో సహజత్వంతో కూడిన సినిమాలను రూపొందించిన నిజమైన అద్భుత దర్శకుడు ఆయన. – రామ్‌గోపాల్ వర్మతమిళ గ్రామాల్లోని ప్రేమను, జీవకళను మీలాగా మరెవ్వరూ తెరపై ఆవిష్కరించలేరు. నా సంగీతాన్ని దక్షిణ భారతదేశంలోని మారుమూల గ్రామాలకు చేర్చినందుకు, అక్కడి ప్రజల జీవన గాథలను ప్రపంచానికి పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. – ఏఆర్ రెహమాన్నన్ను సృష్టించిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మా అమ్మ అయితే, మరొకరు నా గురువు భారతీ రాజాగారు. ఒక సంవత్సరం వ్యవధిలో ఈ ఇద్దర్నీ కోల్పోయాను. నా బాధను మాటల్లో వర్ణించలేను. నా హృదయం బాధతో భారంగా అనిపిస్తోంది. భారతీ రాజాగారి, మా అమ్మగారి జ్ఞాపకాలు, వారు నేర్పిన జీవితపాఠాలు నా జీవితాంతం నాతోనే ప్రయాణిస్తాయి. – రాధికా శరత్కుమార్భారతీరాజాగారు చనిపోయారని తెలిసినా ఓ షూటింగ్లో ఉండటం వల్ల నేను, అలీగారు చెన్నైకి వెళ్లలేకపోయాం. నా తొలి చిత్రం ‘సీతాకోక చిలుక’లో నేను, అలీగారు కలిసి పని చేశాం. ఇన్నేళ్లకు భారతీరాజాగారు మనల్ని వదిలి వెళ్లే సమయంలో మేమిద్దరం కలిసి నటిస్తుండటం మాటల్లో చెప్పలేను. ఈ రోజు ముచ్చర్ల అరుణ అనే నేను నటిగా జనాలకు తెలుసు అంటే అందుకు కారణం భారతీ రాజాగారే. – అరుణఈ రోజు నేను ఒక నటిగా ఇక్కడ ఉన్నానంటే అందుకు కారణం భారతీ రాజాగారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానుల హృదయాలపై ఆయన వేసిన ముద్ర ఎప్పటికీ చెరగదు. – రేవతినన్ను సినీ రంగానికి పరిచయం చేసిన భారతీ రాజాగారిని కోల్పోవడం ఎంతో ఆవేదనగా ఉంది. – సుకన్య -
ఆత్మబంధూ.. సెలవ్
స్టూడియో గోడల మధ్య మగ్గుతున్న తమిళ సినిమాకు నాలుగు దిక్కులా కిటికీ తెరిచిన ‘ఇయక్కునర్ ఇమయం’ (దర్శక శిఖరం) భారతీ రాజా కన్నుమూశారు.‘సీతాకోకచిలుక’, ‘తూర్పు వెళ్లే రైలు’, ‘పదహారేళ్ల వయసు’, ‘ఎర్ర గులాబీలు’... తన కథలతో వెండితెరపై కవిత్వం చేశారు. పెద్ద పెద్ద స్టార్లు ఆయన చేతిలో పాత్రలయ్యారు. విగ్గుల వేషాలు అసలు సిసలు పల్లెటూరి మనుషులయ్యాయి. నేడు భారతీరాజా లేరు. కానీ ఆయన సినిమాల్లోని పల్లెటూరి గాలి ప్రేక్షకులను తాకుతూనే ఉంటుంది. వరి చేల మీది సంగీతం వినిపిస్తూనే ఉంటుంది. ఆయన చూపిన మనిషి మనతో మాట కలుపుతూనే ఉంటాడు.‘ఎన్ ఇనియ తమిళ్ మక్కళే...’ ‘నా ప్రియమైన తమిళ ప్రజలారా’ అని తన ప్రతి సినిమా మొదట్లో పలకరించే భారతీ రాజా ఇక పై అలా పలకరించరు. దర్శకులకే దర్శకుడిగా, వెండితెరకు మట్టి పరిమళం అద్దినవాడిగా, భావుకునిగా, కెమెరాతో కవిత్వం రాసే పిపాసిగా కోట్లమంది ప్రేక్షకుల అభిమానం పొందిన భారతీ రాజా స్వర్గలోకంలో విలేజ్ కాటేజీ బయట నులక మంచం పై విశ్రమించడానికి వెళ్లిపోయారు. గొంగళిపురుగు వంటి సమాజాన్ని తన కథల స్పర్శతో సీతాకోక చిలుకగా మలిచేందుకు తపించిన భారతీ రాజా మరణంతో దక్షిణాది సినీ పరిశ్రమ ధ్రువతార లేని ఆకాశమైంది. భారతీ రాజా కథ ఎప్పుడూ పల్లెకే పరుగులు తీసింది, కానీ ఆ పల్లె అమాయకత్వానికి పూసిన పూత కాదు... ఆ పల్లెలో దుమ్ము ఉంది, దగా ఉంది, దాహం ఉంది.చిన్నసామి పెరియమాయ దేవర్ (85) 1941 జూలై 17న తమిళనాడులోని తేని అల్లినగరంలో జన్మించారు. చిన్నసామికి చిన్నప్పుడే కళలంటే మక్కువ. ఆ ఇష్టంతోనే ఆయన సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. పి. పుల్లయ్య, ఎం. కృష్ణన్ నాయర్ తదితర దర్శకుల దగ్గర దర్శకత్వ శాఖలో చేశారు. ‘16 వయదినిలే’ (1977) చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ సినిమా పోస్టర్లో చిన్నసామి పేరు ‘భారతీ రాజా’ అని ఉంటుంది. తమిళ ప్రముఖ కవి సుబ్రమణ్య భారతియార్ అంటే ఉన్న ఇష్టంతో తన స్క్రీన్ నేమ్‌ని ‘భారతీ రాజా’గా పెట్టుకున్నారు.పదహారేళ్ల వయసు ప్రేమఒక అందగత్తె, ఓ అమాయకుడికి ముడిపెట్టిన కథ ‘16 వయదినిలే’. ఈ పల్లెటూరి కథలో అందగత్తెని పొందాలని పోకిరీలు ఎదురు చూస్తుంటారు. అమాయకుడైన పశువుల కాపరికి ఆమె అంటే ఇష్టం ఉన్నా చెప్పడు. దుర్మార్గుడి చేతిలో ఆమె జీవితం బలి కాకుండా హత్య చేసి, జైలుకి వెళతాడు కాపరి. ‘తిరిగొస్తా’ అని ఆమెకు మాటిస్తాడు. ఈడూ జోడూ బాగాలేకపోయినా ఈ ఇద్దరూ ఒకటైతే బాగుండు అని ప్రేక్షకులు ఆ ప్రేమను ఫీలవుతారు. అందుకే ఈ సినిమా 175 రోజులు ఆడింది. ఎస్. జానకికి ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు తెచ్చింది. మరి... ‘సెంధూర పూవే’ (సిరిమల్లె పువ్వా...) అంటూ ఆమె పాడిన పాటను అంత సులువుగా మరచిపోగలమా! కమల్‌హాసన్ (అమాయకుడు), రజనీకాంత్ (విలన్ షేడ్ ఉన్న పాత్ర), శ్రీదేవిలకు మంచి పేరొచ్చింది. ఈ చిత్రం తెలుగులో చంద్రమోహన్, మోహన్‌బాబు, శ్రీదేవి కాంబినేషన్లో ‘పదహారేళ్ల వయసు’గా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొంది, హిట్ అయింది. హిందీలో ‘సోల్వా సావన్’గా భారతీ రాజా దర్శకత్వంలోనే తెరకెక్కి, విజయం సాధించింది.ప్రేమ ప్రయాణంఒక రైలు ఇద్దరి ప్రేమికులకు రాయబారిగా మారుతుంది. పరిస్థితులు అనుకూలించక పట్టణం వెళ్లే యువకుడు, పల్లెటూరిలో మిగిలిపోయిన అతని ప్రేయసి... ఈ ఇద్దరూ వచ్చే పోయే రైలు వెనక ప్రేమ సందేశాలు పంపించుకుంటారు. అయితే ఆ యువతి మీద బావ కన్నేస్తాడు. ఆచారం పేరు చెప్పి, ఆ యువతి నగ్నంగా గ్రామంలో తిరగాలని నిబంధన పెడతారు. అలా ఆ యువతి తిరుగుతున్న సమయంలో ఆ యువకుడు యువతితో సహా రైలు ఎక్కుతాడు. ఈ రైలు ప్రయాణంతో ప్రేక్షకుల మనసు కూడా ప్రయాణించింది. అందుకే ఈ సినిమా ఏడాది ఆడింది. కథానాయికగా పరిచయమైన రాధికకి మంచి పేరొచ్చింది. తెలుగు హీరో సుధాకర్ కూడా తమిళ ప్రేక్షకుల ప్రేమను పొందారు. ఈ చిత్రం తెలుగులో ‘తూర్పు వెళ్లే రైలు’ పేరుతో బాపు దర్శకత్వంలో జ్యోతి, మోహన్ కాంబినేషన్లో రీమేక్ అయి, ఘనవిజయం అందుకుంది. ‘పల్లె ప్రేమకథా చిత్రాలే తీయగలడు’ అని భారతీ రాజా మీద ముద్ర వేశారు. కానీ తనలో ఇంకో కోణం ఉందన్నారు భారతీ రాజా.థ్రిల్ జర్నీకమల్హాసన్, శ్రీదేవి కాంబినేషన్లో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘సిగప్పు రోజాక్కళ్’ మొదలుపెట్టారు భారతీ రాజా. స్త్రీలను ద్వేషించే ఒక సైకో కిల్లర్ వాళ్లని ప్రేమలో పడేసి, పెళ్లి చేసుకుని క్రూరంగా చంపేస్తుంటాడు. అలా ఒక అమ్మాయిని వలలో వేసుకుని, పెళ్లాడతాడు, సహజంగానే ధైర్యవంతురాలు, తెలివిగల అమ్మాయి కావడంతో తన భర్త ఒక సీరియల్ కిల్లర్ అని కనిపెడుతుంది. చివరికి తన ప్రాణాలను కాపాడుకుని, ఆ సైకో బారి నుంచి ఎలా బయటపడింది? అనేది కథ. భారతీ రాజా ‘అర్బన్ మూవీ’స్ కూడా తీయగలడని ఈ సినిమాతో అనిపించుకున్నారు. ఈ సినిమాలోని పాటల్లో ‘నినైవో ఒరు పరవై’ ఒకటి. అంటే... ‘జ్ఞాపకం ఒక పక్షిలాంటిది’ అని అర్థం. పక్షిలా ఈ సినిమా నలు దిక్కులకూ వెళ్లి, ఒక మంచి జ్ఞాపకంలా మిగిలిపోయింది. తెలుగులో ‘ఎర్ర గులాబీలు’, హిందీలో ‘రెడ్ రోజ్’గా రీమేక్ అయింది. ‘సిగప్పు రోజాక్కళ్’ తర్వాత నూతన తారలతో ‘నిళల్గళ్’ సినిమా తెరకెక్కించారు భారతీ రాజా. ముగ్గురు నిరుద్యోగ యువకుల కష్టాలను ఈ చిత్రంలో చూపించారు. ఈ సినిమాలోని పాటల్లో ‘ఇదు ఒరు పొన్ మాలైæపొళుదు’ ఒకటి. అంటే... ‘ఇదొక బంగారంలాంటి సాయంత్రం’ అని అర్థం. కలను నిజం చేసుకోవడానికి ప్రయత్నించే యువకుడు ఆశాభావంతో పాడుకునే ఈ పాటకు ఇళయరాజా ఇచ్చిన బీట్ కుర్రకారు హార్ట్ బీట్‌కి దగ్గరైంది. హాలీవుడ్ మేకింగ్ స్టైల్‌తో...కమల్‌హాసన్, మాధవిలతో ‘టిక్ టిక్ టిక్’ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ తీశారు భారతీ రాజా. అయితే ఇది హాలీవుడ్ బి గ్రేడ్ ఫిల్మ్‌లా ఉందనే విమర్శలు ఎదురయ్యాయి. కానీ మేకింగ్ స్టైల్ హాలీవుడ్ తరహాలో ఉందనే ప్రశంసలూ దక్కాయి. ఈ చిత్రంలో మాధవి ‘స్విమ్ సూట్’ ధరించడం అప్పట్లో ఓ సంచలనం.సాగర సంగమమే...సాగరంలో ఎన్నో నదులు కలుస్తాయి. విడదీయలేని కలయిక అది. కట్టుబాట్లను తెంచుకుని, విడదీయలేనంతగా తమ ప్రేమను పండించుకోవాలనుకుంటుంది ఓ జంట. అదే ‘అలైగళ్ ఓయ్వదిల్లై’ (సీతాకోక చిలుక). ఈ సినిమాలో ‘సాగర సంగమమే... ప్రణయ సాగర సంగమమే’ పాట ప్రేక్షకులతో మమేకమైపోయింది. తమిళంలో కార్తీక్, రాధ జంటగా నటించిన ఈ సినిమాలో సిల్క్ స్మితను సంప్రదాయ గృహిణిగా చూపించారు భారతీ రాజా. అలాగే బాల నటు డిగా అలీకి మంచి పేరు తెచ్చిన చిత్రం ఇది. తెలుగు ‘సీతాకోక చిలుక’తో అరుణ కథానాయికగా పరిచయం అయ్యారు. తెలుగు వెర్షన్లో జంధ్యాల సంభాషణలు ఆకట్టుకున్నాయి.మన్ వాసనైతో మరో హిట్భారతీ రాజా నుంచి వచ్చిన మరో హిట్ ప్రేమకథ ‘మన్ వాసనై’. మేనమామ, మేనకోడలి ప్రేమ నేపథ్యంలో రూపొందిన చిత్రం ఇది. గాజులు అమ్ముకుంటున్న పాండియన్ని ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశారు. రేవతి కూడా ఈ చిత్రం ద్వారానే హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఈ సినిమా తెలుగులో బాలకృష్ణ, సుహాసిని జంటగా ‘మంగమ్మగారి మనవడు’ పేరుతో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రీమేక్ అయి, ఘనవిజయం సాధించింది.ఆత్మతో ముడిపడిన ప్రేమఅప్పటివరకూ భారతీ రాజా సినిమాల్లోని ప్రేమికులు ఎన్నో ప్రేమ ఊసులు చెప్పుకున్నారు. కానీ, మనసు నిండా ప్రేమ నింపుకుని, మాటల్లో చెప్పుకోని ఓ ప్రేమ జంటని చూపించారు భారతీ రాజా. అదే ‘ముదల్ మరియాదై’. 60 ఏళ్ల వ్యక్తి, అందులో సగం వయసు కూడా లేని ఓ యువతి మధ్య ప్రేమ ఉంటుంది. ఇక్కడ భౌతికపరమైన ప్రేమ వెనక్కి వెళ్లిపోతుంది. ఆత్మతో పెనవేసుకున్న ప్రేమతో శివాజీ గణేశన్, రాధ కాంబినేషన్లో భారతీ రాజా తెరకెక్కించిన ‘ముదల్ మరియాదై’ సూపర్ డూపర్ హిట్. ‘ఆత్మ బంధువు’గా తెలుగులో విడుదలై, ఘనవిజయం సాధించింది. మరణం అంచుల్లో ఉన్న ఆ మూగ ప్రేమికుడు... ప్రేయసి కనపడ్డాకే కన్ను మూస్తాడు... ఎంత గొప్ప ప్రేమ. తర్వాతి తరంతోనూ సినిమాలు తీయడం మొదలుపెట్టిన తర్వాత కుల వివక్ష నేపథ్యంలో దగ్గుబాటి రాజా, అమల కాంబినేషన్లో భారతీ రాజా తెరకెక్కించిన ‘వేదమ్ పుదిదు’ ఓ సంచలనం. దగ్గుబాటి రాజా, మహేశ్వరితో ‘కరుత్తమ్మ’ తీశారు.తెలుగులో ‘కొత్త జీవితాలు’తో...తెలుగులో హరిప్రసాద్, సుహాసిని కాంబినేషన్లో ‘కొత్త జీవితాలు’ చిత్రాన్ని తెరకెక్కించారు భారతీ రాజా. తమిళంలో ఆయన దర్శకత్వంలోనే వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘పుదియ వార్పుగళ్’కి ఇది రీమేక్. అలాగే తమిళంలో సత్యరాజ్, రేఖ జంటగా తాను తెరకెక్కించిన ‘కడలోర కవిదైగళ్’ని తెలుగులో మాస్ హీరో చిరంజీవితో ‘ఆరాధన’గా తెరకెక్కించారు. ఒక టీచర్‌కి, నిరక్షరాస్యుడికి మధ్య సాగే ప్రేమతో రూపొందిన ఈ చిత్రం రెండు భాషల్లోనూ ఘనవిజయం సాధించింది. ఇంకా సీనియర్ నటుడు కృష్ణతో ‘జమదగ్ని’ చిత్రాన్ని రూపొందించారు. తమిళ్, తెలుగు, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాలు తెరకెక్కించారు భారతీ రాజా. దర్శకుడిగా ఆయన చివరి చిత్రం ‘మీండుమ్ ఒరు మరియాదై’ (2020). ఈ చిత్రంలో లీడ్ రోల్ చేశారు. భారత చలన చిత్ర సీమ ఒక దిగ్గజాన్ని కోల్పోయింది. భారతీ రాజాకు రీప్లేస్మెంట్ లేదు... మట్టి కథలకు ప్రాధాన్యం ఇచ్చి, మట్టి పరిమళాన్ని వెండితెరపై వెదజల్లి, భౌతికంగా తిరిగి రాని లోకాలకు వెళ్లిన భారతీ రాజా ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా ఉంటారు. ‘ఆర్’ అక్షరంతో నామకరణంవిజయశాంతి, రాధిక, రాధ, రేవతి, రేఖ, రంజిత, రతి అగ్నిహోత్రి, ముచ్చెర్ల అరుణ, ప్రియమణి... ఇలా పలువురు కథానాయికలను పరిచయం చేశారు భారతీ రాజా. ఆయన తెరకెక్కించిన ‘కల్లుక్కుళ్ ఈరమ్’తో విజయశాంతి నటిగా ప్రయాణం మొదలుపెట్టి, తెలుగులో లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగారు. అలాగే తాను పరిచయం చేసిన కథానాయికల పేరు మార్చాల్సి వస్తే... ‘ఆర్’ అక్షరం ఉండేలా చూసేవారు భారతీ రాజా.నటుడిగా...నటుడిగానూ భారతీ రాజా రాణించారు. తాను దర్శకత్వం వహించిన ‘కల్లుక్కుళ్ ఈరమ్’లో దర్శకుడి పాత్ర చేశారు. మణిరత్నం తెరకెక్కించిన ‘యువ’ సినిమాతో పూర్తి స్థాయి నటుడిగా మారారు. శింబు ‘ఈశ్వరన్’ లో, ధనుష్ ‘తిరు’ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. తమిళంలో భారతీ రాజా నటించిన చివరి చిత్రం ‘పులవర్’ విడుదల కావాల్సి ఉంది. చివరిగా ఆయన మలయాళంలో ‘తుడరుమ్’లో కనిపించారు. అలాగే విజయన్, త్యాగరాజన్, మణివణ్ణన్ వంటి వారికి ఒక్కో సినిమాకి డబ్బింగ్ కూడా చె΄్పారు. ‘కరుత్తమ్మ’లో ‘కాడు పొట్టకాడు...’ అనే పాట పాడారు. బుల్లితెరకు ‘తేకత్తి పొన్నుమ్, అప్పనుమ్ నానుమ్’ వంటి సీరియల్స్‌కి, ‘మోడర్న్ లవ్ చెన్నై’ అనే వెబ్ సిరీస్‌లోని ఓ ఎపిసోడ్‌కి దర్శకత్వం వహించారు.తనయుడి మరణంతో మనోవేదన1974లో చంద్రలీలను వివాహం చేసుకున్నారు భారతీ రాజా. కుమారుడు మనోజ్‌కుమార్, కుమార్తె జననీ వీరి సంతానం. తండ్రి దర్శకత్వం వహించిన ‘తాజ్ మహల్’ చిత్రంతో మనోజ్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. దర్శకుడిగా ‘విజిల్, పవిత్ర, మార్గళి తింగళ్’ చిత్రాలను రూపొందించారు. 2006లో తన స్నేహితురాలు, నటి నందనని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, 2025లో గుండెపోటుతో మనోజ్ కన్ను మూశారు. కుమారుడి మరణంతో భారతీ రాజా మనోవేదనకు గురయ్యారు. మనోజ్ మరణం ఆయన్ను బాగా కుంగదీసింది.దర్శక శిఖరానికి ఆరు జాతీయ అవార్డులుభారతీయ చిత్ర సీమకు చేసిన ఎనలేని సేవలకు గాను భారతీ రాజాను ఎన్నో అవార్డులు వరించాయి. ‘ఇయక్కునర్ ఇమయం’ (దర్శక శిఖరం) అనే బిరుదు ఆయన సొంతం. 2004లో భారత ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. వివిధ విభాగాల్లో మొత్తంగా 6 జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారాయన. ‘సీతాకోకచిలుక’, ‘ముదల్ మరియాదై’, ‘వేదమ్ పుదిదు’, ‘కరుత్తమ్మ’, ‘అంది మందారై’, ‘కడల్ పూక్కళ్’ చిత్రాలకు జాతీయ అవార్డులు లభించాయి. ఇంకా తమిళ నాడు రాష్ట్ర పురస్కారాలు, ఇతర అవార్డులు అందుకున్నారు. ‘సీతాకోక చిలుక’కి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు లభించింది.– డి.జి. భవాని -
'భారతీ రాజా మరణం.. రాఘవ లారెన్స్ కీలక నిర్ణయం'
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రభంజనం తర్వాత మరో స్టార్ హీరో అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. పాలిటిక్స్‌లో తన ఎంట్రీపై కీలక నిర్ణయం ప్రకటిస్తానని ఇప్పటికే రాఘవ లారెన్స్ వెల్లడించారు. ఈనెల 11న ఉదయం 9:30 గంటలకు కీలక ప్రకటన ఉంటుందని తెలిపారు. అయితే దర్శకుడు భారతీ రాజా మరణంతో తన సమావేశాన్ని 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు లారెన్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు.రాఘవ లారెన్స్ తన ట్వీట్లో రాస్తూ.. 'అందరికీ నమస్కారం.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ భరతిరాజా మృతికి సంతాపం ప్రకటించింది. ఈ నష్టం మా కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత వ్యక్తిగతంగా నన్ను బాధ కలిగిస్తోంది. భరతిరాజా చిత్ర పరిశ్రమకు చేసిన అపారమైన సేవ పట్ల గౌరవంతో.. నేను నా ప్రకటనను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నా. ఈనెల 12వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు నా నిర్ణయం ప్రకటిస్తా' అని పోస్ట్ చేశారు.కాగా.. సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నుంచి టీవీకే తరఫున రాఘవ లారెన్స్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాఘవ లారెన్స్ ప్రకటనపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. Hi everyone, I had earlier informed you that I would be making an important life decision announcement on Thursday, the 11th, at 9:30 AM.The industry is currently mourning the passing of Bharathiraja sir. This loss feels deeply personal, like losing a member of the family.… pic.twitter.com/eNfEG6LxRr— Raghava Lawrence (@offl_Lawrence) June 10, 2026 -
దర్శక దిగ్గజం భారతీ రాజాకు సినీ ప్రముఖుల నివాళి.. ఫోటోలు
-
'అనారోగ్యం, జ్ఞాపకశక్తి సమస్య.. అయినా భారతీ రాజా వినలేదు'
దక్షిణాది సినీ పరిశ్రమ ఓ సినీ దిగ్గజాన్ని కోల్పోయింది. వెటరన్ డైరెక్టర్ భారతీ రాజా(84) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా పలువురు దక్షిణాది సినీ ప్రముఖులు సినీ రంగానికి ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. తమిళనాడు సీఎం విజయ్‌తో పాటు కోలీవుడ్ స్టార్స్ భారతీ రాజాకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సినీ రంగంలో చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన కేవలం పల్లె అందాలను ప్రేక్షకులకు చూపించడమే కాదు.. నటుడిగా కూడా రాణించారు. దర్శకత్వం వహిస్తూనే తన నటనతో అభిమానులను మెప్పించారు. చివరిసారిగా ఆయన తన కెరీర్లో నటించిన సినిమా తుడురుమ్. మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. తుడరుమ్ చిత్రంలో స్టంట్ మాస్టర్ పళనిస్వామి పాత్రలో భరతిరాజా కనిపించారు.అనారోగ్యంతోనే షూటింగ్..తుడరుమ్ మూవీ సెట్స్‌పైకి వెళ్లే సమయంలోనే భారతీరాజా అనారోగ్యం, జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్నారు. అయినప్పటికీ మందులు తీసుకుంటూనే షూటింగ్లో పాల్గొన్నారు. ఆయన చిత్ర నిర్మాణ బృందానికి భారం కాకూడదని పట్టుబట్టి మరి.. తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారని తుడరుమ్ డైరెక్టర్ తరుణ్ మూర్తి వెల్లడించారు. భారతీ రాజా డైలాగులు గుర్తుంచుకోవడానికి.. రిపీట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారని గుర్తు చేసుకున్నారు.భారతిరాజా కెరీర్..దర్శకుడిగా భారతిరాజా మూవీ మేకింగ్‌ను స్టూడియోల నుంచి గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లడంతో సినిమారంగం స్వరూపాన్నే మార్చేసింది. ఆయన 1977 లో ‘16 వయతినిలే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీదేవి, రజనీకాంత్ నటించారు. తమిళ సినిమాకు 'మట్టి వాసన'ను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన తన కెరీర్లో ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. అంతేకాకుండా 2004లో పద్మశ్రీ అందుకున్నారు. -
భారతీరాజా, రజనీకాంత్ మధ్య వివాదం ఏంటి? అసలేం జరిగింది?
దిగ్గజ దర్శకుడు భారతీరాజా(84) మరణంతో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడు సీఎం విజయ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు ఆయనకు నివాళులుల అర్పించారు. మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఈ క్రమంలో భారతీరాజాకు సంబంధించిన కొన్ని విషయాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో ప్రధానంగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఆయనకు ఉన్న వివాదం గురించి చర్చిస్తున్నారు.భారతీరాజా దర్శకత్వం వహించిన తొలిచిత్రం '16 వయదినిలే' (తెలుగులో 'పదహారేళ్ల వయసు') లో రజనీకాంత్ ప్రధాన పాత్ర పోషించాడు. 1977లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత దాదాపు పదేళ్లు గ్యాప్ తీసుకొని కోడి పరాకుత్తు(1988) అనే మూవీతోనూ ప్రేక్షకులను అలరించారు. ఇలా రెండు సినిమాలు తీసినప్పటికీ విరిద్దరి మధ్య దాదాపు ఐదు దశాబ్దాలుగా సైద్ధాంతిక విభేధాలు ఉన్నాయి. రజనీకాంత్‌పై పలుమార్లు భారతీరాజా బహిరంగంగా విమర్శలు చేశారు. అసలు రజనీకాంత్‌ది అసలు తమిళనాడు కాదని.. ఆయన కర్ణాటక వ్యక్తి అంటూ ఆరోపణలు చేశాడు.కావేరీ జలవివాదంతో మొదలు.. రజనీకాంత్, భారతీరాజాల మధ్య ఒప్పుడు మంచి అనుబంధం ఉండేది. అయితే 2002లో జరిగిన కావేరి జలవివాదమే వీరిద్దరిని దూరం చేసింది. అప్పట్లో కావేరి జలాల కోసం తమిళ నటీనటులంతా కర్ణాటకకు వ్యతిరేకంగా దీక్ష చేశారు. ఈ నిరసనలకు భారతీరాజా న్యాయకత్వం వహించారు. అయితే శాంతియుతంగా చేపట్టిన నిరసనలు కాస్త ఘర్షణకు దారి తీసింది. కొంతమంది పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిని రజనీకాంత్ బహిరంగంగా ఖండించాడు. తమిళనటులు చేపట్టిన దీక్షకు కూడా మద్దతు ప్రకటించలేదు. అదే భారతీరాజా కోపానికి కారణం అయింది. కావేరీ ఉద్యమ కమిటీ కన్వినర్‌గా ఉన్న భారతీరాజా.. తమిళ ప్రజలకు రజనీకాంత్ ద్రోహం చేస్తున్నాడని బహిరంగంగా ఆరోపించాడు. ఆయనను సూపర్ స్టార్‌గా చేసిన తమిళప్రజలకు వెన్నుపోటు పొడిచాడంటూ తీవ్ర విమర్శలు చేశాడు. ఒకానొక దశలో అసలు రజనీకాంత్ తమిళవాడు కాదనీ, కర్ణాటకకు చెందిన వ్యక్తి అని ఆరోపించాడు.రజనీ రాజకీయ ఎంట్రీపై కూడా.. ఇక రజనీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్తలు వచ్చినప్పుడు కూడా భారతీరాజా ఆయనపై విమర్శలు చేశాడు. తమిళనాడు రాజకీయాల్లో ఎవరైనా పాల్గొనవచ్చని, కానీ రాష్ట్ర నాయకత్వం మాత్రం తమిళనాడుకు చెందిన వారి చేతుల్లోనే ఉండాలని ఆయన వాదించారు. కొన్ని సందర్భాల్లో సూపర్‌స్టార్ పేరును నేరుగా ప్రస్తావించకుండా, రజనీకాంత్ రాజకీయ ప్రవేశం కోసం పెరుగుతున్న డిమాండ్‌ను భారతిరాజా తీవ్రంగా ఖండించాడు. రాజకీయాల్లోకి రావాలని బయటివారిని ప్రజలు 'యాచించకూడదు' అని సూచించారు. అలాగే 2018లో జరిగిన ఐపీఎల్ నిరసన వివాద సమయంలోనూ రజనీకాంత్‌ని ‘కర్ణాటక కాషాయ రాయబారి’అని విమర్శించాడు. చివరిదశలో ఇలా.. భారతీరాజా ఎన్ని సార్లు విమర్శలు చేసినా రజనీకాంత్ మాత్రం ఆయనను ఎప్పుడు ఒక్క మాట అనలేదు. ఒకే ఒక్కసారి మాత్రం ఓ ఈవెంట్లో.. భారతీరాజాని నేను గొప్ప దర్శకుడు అని ఒప్పుకుంటాను, పొగుడుతాను కానీ ఆయన మాత్రం నన్ను నటుడిగా గుర్తించరు అని కౌంటర్ వేశారు రజనీకాంత్. భారతీరాజా కూడా తన మాటలతో కొన్ని సందర్భాల్లో రజనీకాంత్‌ని ఇబ్బంది పెట్టానని ఒప్పుకున్నాడు. అయితే తాను ఎన్ని మాటలు అన్నా..ఆయన ఒక్కసారి కూడా తిరిగి అనలేదని..అది అతని గొప్పదనం అని పొగిడాడు. ‘నేను అతడిని చాలా బాధపెట్టాను. కానీ అతను అదంతా మర్చిపోయి నాపై ఆప్యాయత చూపించాడు. అతనికి ప్రతీకార మనస్తత్వం లేదు. అతను గొప్ప వ్యక్తి’ అని ఓ ఇంటర్వ్యూలో భారతీరాజా అన్నాడు. అలా తమిళనాడులో భారతీరాజా – రజినీకాంత్ వివాదం చాలా ఏళ్ళు నడిచింది. చివరి దశలో మాత్రం భారతీరాజాని రజని పలుమార్లు కలుసుకొని ఒకర్నొకరు అభినందించుకున్నారు. -
తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా ఇకలేరు
-
ప్రభుత్వ లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు: సీఎం విజయ్
దర్శక శిఖరం భారతీరాజా అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు. తమిళ చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. భారతీరాజా(84) మరణ వార్త వినగానే విజయ్ సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం చెన్నైలోని భారతీరాజా నివాసానికి వెళ్లి పార్థీవదేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. ఆయన మృతి భారతీయ సినిమాకు తీరని లోటని సతాపం తెలిపారు. విజయ్‌తో పాటు తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్, సీనీ నటి సినీ నటి రాధికా, హీరో సూర్య కూడా భారతీరాజా నివాసానికి చేరుకొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్టాలిన్ భారతీరాజాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. -
లెజెండరీ డైరెక్టర్.. భారతీరాజా ఇకలేరు..
-
‘R’..సెంటిమెంట్, అలా ప్రేమలో పడి.. భారతీరాజా ప్రత్యేకతలివే!
భారతీయ చలనచిత్ర రంగానికి, ముఖ్యంగా దక్షిణాది సినిమాకు సరికొత్త వ్యాకరణాన్ని నేర్పిన దర్శక శిఖరం భారతీరాజా. అప్పటివరకు నాలుగు గోడల మధ్య స్టూడియో సెట్లలోనే సాగుతున్న సినిమాను, పచ్చని పల్లెటూరి పొలాల్లోకి, మట్టి రోడ్ల పైకి తీసుకెళ్లిన ఘనత ఆయనది. అందుకే ఆయన్ని తమిళ చిత్రసీమ ‘ఇయక్కునర్ ఇమయం’ (దర్శక శిఖరం) అని ఎంతో గౌరవంగా పిలుచుకుంటుంది. నేడు(జూన్ 10) ఆయన మనకు భౌతికంగా దూరమయ్యాడు. గత కొంతకాలంగా వయోసహజ అనారోగ్య సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకతలు ఏంటి? ఆయన సినీ ప్రస్థానం ఎలా సాగింది? ఓ సారి చూద్దాం. తొలి చిత్రంతోనే సంచలనం1941 జూలై 17న మదురై (తేని) జిల్లాలో జన్మించిన భారతీరాజా, 1977లో '16 వయదినిలే' (తెలుగులో 'పదహారేళ్ల వయసు') సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. స్టూడియో సెట్టింగుల యుగానికి స్వస్తి చెప్పి, అవుట్డోర్ షూటింగ్‌లకు ఈ సినిమాతోనే ఆయన శ్రీకారం చుట్టారు.తెలుగులోనూ చెరగని ముద్రఆయన తమిళంలో తీసిన ఎన్నో క్లాసిక్ సినిమాలు తెలుగులోకి అనువాదం అయ్యాయి. మరికొన్ని రీమేక్ రూపంలో వచ్చి ఇక్కడి ప్రేక్షకులను కూడా అలరించాయి. నేరుగా తెలుగులో ఆయన చేసిన 'సీతాకోకచిలుక' (1981) సినిమా ఇండస్ట్రీ హిట్ కావడమే కాకుండా నేటికీ ఒక అద్భుత ప్రేమకావ్యంగా నిలిచిపోయింది. ‘ఆరాధన’, ‘జమ్మిచెట్టు’ వంటి చిత్రాలు కూడా ఆయన సృజనాత్మకతకు అద్దం పడతాయి. కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగానూ ఆయన ప్రత్యకతను చాటుకున్నాడు. ‘ఆయుత ఎళుతు’ (యువ), ‘పాండియనాడు’, ‘తిరుచిత్రంబలమ్’ (తిరు), ఆ మధ్య వచ్చిన విజయ్ సేతుపతి ‘మహారాజా’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించారు. మోహన్‌లాల్ ‘తుడరుమ్’లో చివరిసారి తెరపై కనిపించారు. అలాగే ఆయన నటించిన ‘పులవర్’ చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది.'R' సెంటిమెంట్భారతీరాజా సినిమాల ద్వారా పరిచయమైన ఎందరో కథానాయికలు స్టార్ హీరోయిన్లుగా వెలిగారు. ముఖ్యంగా ఆయన పరిచయం చేసే హీరోయిన్ల పేర్లు 'R' అక్షరంతో (రాధిక, రాధ, రేవతి, రంజని, రేఖ) ప్రారంభం కావడం ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్‌గా నిలిచింది.ఆమెతో ప్రేమలో..పల్లెటూరి సంస్కృతిని, అక్కడి మనుషుల భావోద్వేగాలను, కుల వ్యవస్థలోని సంక్లిష్టతలను అత్యంత సహజంగా తెరకెక్కించడంలో భారతీరాజా సిద్ధహస్తుడు. హీరోయిన్లకు మేకప్ లేకుండా తెరపై చాలా సహజంగా చూపించేవాడు. దీనికి గల కారణాన్ని కూడా ఒక సందర్భంలో ఆయన వివరించాడు. ‘నేను ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డా. ఆమెను వెతుక్కుంటూ వెళ్తుటా. ఆశ్చర్యంగా ప్రతిసారి ఆమె నాకు పల్లెటూరిలోనే కనిపిస్తుంది. చాలా అందంగానూ ఉంటుంది. ఆమె ఎవరో కాదు ‘ప్రకృతికాంత’. ఆమె అందానికి నేను ఫిదా అయ్యాను. అందుకే కెమెరా పట్టుకొని ఆ అందాన్ని వెతుక్కుంటా’ అంటూ పల్లెటూరిపై తనకున్న ప్రేమను చతురతను జోడించి తనదైన శైలీలో చెప్పుకొచ్చాడు.అవార్డులు - పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం: భారతీరాజా సాధించిన విజయాలకు గుర్తింపుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అత్యున్నత పురస్కారాలతో ఆయన్ను సత్కరించాయి.చలనచిత్ర రంగానికి చేసిన విశేష సేవలకు గానూ 2004లో కేంద్ర ప్రభుత్వం ప్రద్మశ్రీ పురస్కారాన్ని అందించింది.జాతీయ చలనచిత్ర అవార్డులు: ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తమిళం, తెలుగు), సామాజిక అంశాలపై ఉత్తమ చిత్రం విభాగాల్లో కలిపి మొత్తం 6 జాతీయ అవార్డులను గెలుచుకున్నారు.నంది అవార్డు: 'సీతాకోకచిలుక' చిత్రానికి గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ దర్శకుడిగా 'నంది' పురస్కారాన్ని అందుకున్నారు. ఇతర పురస్కారాలుదక్షిణ భారత ఫిల్మ్‌ఫేర్ అవార్డులు (4), తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను (6) సొంతం చేసుకున్నారు. -
తీరని కలగానే మిగిలిపోయింది: సెలబ్రిటీల భావోద్వేగం
చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు భారతీరాజా (84) ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. గత కొన్నినెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం (జూన్ 10న) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి పలువురు తారలు భారతీరాజా పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.వెలకట్టలేనిదిభారతీయ సినిమా ఒక గొప్ప దర్శకుడిని కోల్పోయింది. పల్లెటూరి మట్టి వాసనను, మానవ సంబంధాల సౌందర్యాన్ని, ప్రేమలోని అమాయకత్వాన్ని, సామాన్య ప్రజల భావోద్వేగాలను భారతీరాజా తెరపై అందమైన కవిత్వంగా మలిచారు. ఆయన చిత్రాలు లక్షలాది హృదయాలను తాకాయి. ఎంతోమంది దర్శకనిర్మాతలకు స్ఫూర్తినిచ్చాయి.పలు జాతీయ అవార్డులు అందుకున్న పద్మశ్రీ గ్రహీత భారతీరాజాగారు ఇండియన్ సినిమాకు అందించిన సేవలు వెలకట్టలేనిది. ఆయన దర్శకత్వంలో ఆరాధన మూవీలో పులిరాజుగా పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా పట్ల ఆయనకున్న అంకితభావం, అభిరుచి నాపై ఎంతో ప్రభావం చూపాయి. ఆయన మనతో లేకపోయినా ఆయన తీసిన సినిమాలు మన మధ్య ఎప్పటికీ నిలిచి ఉంటాయి. 'ఇయక్కునార్ ఇమయం' (దర్శక దిగ్గజం) భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి, స్నేహితులకు ఇదే నా ప్రగాఢ సానుభూతి.- చిరంజీవి Indian cinema has lost one of its greatest storytellers, #Bharathiraja garu.He transformed the fragrance of village soil, the beauty of human relationships, the innocence of love, and the emotions of ordinary people into timeless cinematic poetry. His films touched millions of… pic.twitter.com/MdoUfpztji— Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2026 కలగానే మిగిలిపోయింది: ఖుష్బూమనందరికీ ఎంతో ఇష్టమైన లెజెండరీ దర్శకుడు భారతీరాజా ఇక లేరనే విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన మరణం తమిళ చిత్రపరిశ్రమకు తీరని లోటు. ఆయన సినిమాలు ఒక బెంచ్‌మార్క్‌ను సెట్ చేశాయి. భవిష్యత్తులో రాబోయే చిత్రాలకు దిశానిర్దేశంగా పని చేస్తాయి. సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరి కోసం ఆయన గొప్ప వారసత్వాన్ని వదిలి వెళ్లారు. నన్ను రెండు జడలతో చూపించాలని, కలిసి సినిమా చేద్దామని ఎప్పుడూ అంటుండేవారు. ఇప్పుడది తీరని కలగానే మిగిలిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.- ఖుష్బూ Devastated to know that our most beloved, loved and respected Director, the legendary #BharathiRaaja avl is no longer with us. His demise is a gloomy cloud in tamil cinema. His films have been bench marks and shall continue to be the actual school of film making. He leaves behind… pic.twitter.com/p5a6yhn95y— KhushbuSundar (@khushsundar) June 10, 2026ఆయన శైలి ప్రత్యేకం : పవన్ కల్యాణ్ప్రముఖ దర్శకులు భారతీరాజా గారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తమిళ, తెలుగు చిత్రాలపై భారతీరాజా గారు తనదైన ముద్ర వేశారు. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలను, టీనేజర్స్ కి ఉండే ఆకర్షణలు లాంటివి చూపించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ ఇప్పటికీ చూడదగ్గ విధంగా ఉంటుంది. ఆ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అన్నయ్య చిరంజీవితో ‘ఆరాధన’ చిత్రం రూపొందించారు. అందులో ‘అరె ఏమైంది...’ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. సున్నితమైన ప్రేమ, సెంటిమెంట్ కథలే కాకుండా ‘ఎర్ర గులాబీలు’, ‘టిక్ టిక్ టిక్’ లాంటి థ్రిల్లర్స్ తోను ప్రేక్షకులను మెప్పించారు. భారతీరాజా గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.- పవన్ కల్యాణ్నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిఒక శకం ముగిసింది: విశాల్'భారతీరాజా గారితో కలిసి పనిచేసిన ప్రతి క్షణాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఆయన మనల్ని విడిచి వెళ్లారన్న వార్త వినడం ఎంతో దిగ్భ్రాంతికరం. తమిళ సినిమా ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చిన దార్శనికుడు ఆయన. మన గ్రామాలు, ప్రజలు, భావోద్వేగాలలోని అంతరార్థాన్ని వెండితెరపై మరెవరూ చూపించలేనంత అద్భుతంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా, దశాబ్దాల తరబడి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసేలాంటి పాత్రలను అందించారు. ఆయన సినిమాలు ఎన్నో తరాల దర్శకులకు, నటులకు, సినీ ప్రేమికులకు స్ఫూర్తినిచ్చాయి. ఆయన సృష్టించిన ప్రతి ఫ్రేమ్ ద్వారా ఆయన వారసత్వం సజీవంగా నిలిచి ఉంటుంది.సృజనాత్మక దర్శకులుగా తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనుకునే వారికి ఆయన కృషి ఒక నిదర్శనంగా, చలనచిత్ర నిర్మాణంలో ఒక 'బైబిల్' (మార్గదర్శి)గా నిలుస్తుంది. ఆయన మరణంతో ఒక శకం ముగిసింది. తమిళ సినిమా గొప్ప కథకులలో ఒకరిని కోల్పోయింది. మీతో కలిసి పనిచేసిన ప్రతి క్షణాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ముఖ్యంగా #PandiyaNaadu చిత్రంలో తండ్రీకొడుకులుగా కలిసి పనిచేసినప్పుడు మీతో గడిపిన సమయం నాకు ఎన్నో పాఠాలను నేర్పింది.ఈ గొప్ప చిత్ర పరిశ్రమలో నేను కూడా ఒక భాగమేనన్న భావనను ఆ క్షణాల్లో మీరు నాకు కలిగించారు. ఎప్పుడూ ఉత్సాహభరితమైన చిరునవ్వుతో, యువకుడిలాంటి ఉత్సాహంతో మీరు వ్యవహరించిన తీరు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది' అని విశాల్ ట్వీట్ చేశారు. అలాగే దర్శకుడిగా తన మొదటి సినిమా టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. Shocking and sad to hear the news about our legendary filmmaker, Iyakunarimayam Bharathiraja sir passing away and leaving us all this morning. A visionary who changed the landscape of Tamil cinema forever, he brought the soul of our villages, our people and our emotions to the…— Vishal (@VishalKOfficial) June 10, 2026 గొప్ప పాఠాలుహిమాలయాల అంత ఎత్తుకు ఎదిగిన దర్శకుడా.. మీకు ముగింపు లేదు.. ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదిగారు. మీ పనితనం, సినిమాలే మాకు విలువైన పాఠాలు.- కాయల్ దేవరాజ్இயக்குனர் இமயமே! நீ சரியவில்லை;இன்னும் நீ உயரமான இடத்தை நோக்கி சஞ்சரிக்க சென்றுள்ளாய்! என்றும் உன் படைப்புகள் எங்களுக்கு பாடங்கள்!#LegendaryDirector #Bharathiraaja #RIPBharathiraaja Sir pic.twitter.com/ZoP6ozrmAf— Actor Kayal Devaraj (@kayaldevaraj) June 10, 2026 A director who found poetry in the soil, truth in silence, and soul in every frame. Sharing screen space with Bharathiraja Sir in Thudarum was an honour I will cherish forever.Rest in peace, Sir. Your legacy will continue to inspire generations, and your presence will be deeply… pic.twitter.com/9yP88mLtCO— Mohanlal (@Mohanlal) June 10, 2026 Our @ikamalhaasan sir pays his last respects to ace director and his friend Mr #bharathiraja after he passes away.#ripbharathiraja #kamalhaasan pic.twitter.com/WZtuTMcOku— Kamal Haasan’s Diehard Kamalians (@DiehardKamalian) June 10, 2026இயக்குநர் பாரதிராஜாவுக்கு நடிகர் ரஜினிகாந்த் அஞ்சலி | RIPBharathiraja | Rajinikanth |#RIPBharathiraja | #Rajinikanth | #IyakkunarImayam | #IyakkunarImayamBharathiraja pic.twitter.com/3NnjefQ9OL— Ilaya Bharatham (@IBharatham) June 10, 2026 చదవండి: దర్శకుడు భారతీరాజా కన్నుమూత -
భారతీరాజా మరణం కళారంగానికి తీరని లోటు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మానవ సంబంధాలను అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడు భారతీరాజా అని ప్రశంసలు కురిపించారు. ఆయన మరణం దక్షిణ భారత సినీ పరిశ్రమకు, కళారంగానికి తీరని లోటు అని వ్యాఖ్యానించారు.భారతీరాజా మృతి పట్ల వైఎస్ జగన్ స్పందిస్తూ..‘భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ జీవన విధానాన్ని, మానవ సంబంధాలను అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించి ప్రత్యేక గుర్తింపు పొందిన భారతీరాజా దర్శకుడిగా, నటుడిగా అనేక తరాల సినీ అభిమానులను ప్రభావితం చేశారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. ఇటీవల కాలంలో పలు చిత్రాల్లో విశిష్ట పాత్రలు పోషించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. భారతీరాజా మరణం దక్షిణ భారత సినీ పరిశ్రమకు, కళారంగానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సినీ పరిశ్రమకు ప్రగాఢ సానుభూతి. భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలి’ అని వ్యాఖ్యానించారు. -
సినీ దిగ్గజం భారతీరాజా కన్నుమూత
సినీ దిగ్గజం భారతీరాజా (84) ఇక లేరు. అనారోగ్యంతో బుధవారం వేకువజామున ఆయన కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు బంధువులు తెలిపారు. భారతీరాజా మృతితో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సినీ, ఇతర రంగాల ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఒకప్పుడు భారతీయ సినిమాల్లో పల్లె అంటే స్టూడియోలో వేసిన సెట్లు.. పచ్చని పొలాలు అంటే పెయింట్ చేసిన బ్యాక్‌డ్రాప్‌లు. కానీ ఆ నిర్వచనాన్నే మార్చిన దర్శకుడు భారతీరాజా. కెమెరాను నేరుగా గ్రామాల్లోకి తీసుకెళ్లి.. పల్లె మనుషుల ప్రేమ, బాధ, ఆవేదన, తిరుగుబాటును వెండితెరపై ఆవిష్కరించిన సినీ సృష్టికర్త ఆయన. మట్టి వాసనను, ప్రకృతి అందాలను, సాధారణ మనుషుల జీవితాలను సినిమాకు ప్రధాన పాత్రలుగా మార్చిన దర్శకుడిగా భారతీరాజా భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తమిళ సినిమాను కొత్త దారిలో నడిపించిన ఆయన ప్రభావం తెలుగు సహా దక్షిణ భారత సినిమా మొత్తంపైనా కనిపించింది.సినిమాల్లోకి రాకముందు భారతీరాజా హెల్త్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. అయితే కళలపై ఉన్న మక్కువ ఆయనను సినీ ప్రపంచంలోకి తీసుకొచ్చింది. ఎన్నో కష్టాలు, నిరీక్షణల తర్వాత దర్శకుడిగా మారిన ఆయన, గ్రామీణ కథలను చూపించే విధానాన్నే మార్చేశారు. అప్పటి వరకు సెట్లలో నిర్మించిన కృత్రిమ గ్రామాలే ఎక్కువగా కనిపించేవి. కానీ భారతీరాజా మాత్రం కెమెరాను నిజమైన పల్లెల్లోకి తీసుకెళ్లారు. మట్టి వాసన, పల్లె మనుషుల భాష, వారి ఆనందాలు, బాధలు అన్నింటినీ సహజత్వంతో చూపించారు. అందుకే ఆయనను తమిళ సినీ ప్రపంచం ప్రేమగా "దర్శకుల హిమాలయం"గా అభివర్ణించింది.భారతీరాజా చిత్రాల్లో ప్రేమకథలు ఉంటాయి.. కానీ అవి కేవలం ప్రేమ చుట్టూ తిరిగేవి కావు. కుల వివక్ష, సామాజిక అసమానతలు, మహిళల సమస్యలు, గ్రామీణ జీవన విధానం, కుటుంబ బంధాలు వంటి అంశాలను కూడా ఆయన బలంగా ప్రస్తావించారు. ప్రేక్షకుడు సినిమా చూస్తున్నాడనే భావన కంటే, ఒక నిజ జీవితాన్ని చూస్తున్నాననే అనుభూతిని కలిగించడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉండేది.దర్శకుడిగా మాత్రమే కాదు.. నటుడిగానూ భారతీరాజా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇటీవలి కాలంలో ఆరోగ్య సమస్యలతో బాధపడిన భారతీరాజా, తన కుమారుడు మనోజ్ భారతీరాజా మరణంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అయినప్పటికీ సినిమాపై ప్రేమను మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. కెరీర్ చివరి దశలో పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. తండ్రి, తాత, గ్రామ పెద్ద.. ఇలాంటి పాత్రల్లో ఆయన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడిగా ఎంత సహజత్వాన్ని చూపించారో, నటుడిగానూ అంతే సహజమైన అభినయంతో మెప్పించారు.భారతీరాజా మరో గొప్ప సేవ ఏమిటంటే.. కొత్త ప్రతిభను వెలికితీయడం. ఆయన చిత్రాల ద్వారా అనేక మంది నటులు, సాంకేతిక నిపుణులు సినీ రంగానికి పరిచయమయ్యారు. తర్వాత వారు భారతీయ సినీ పరిశ్రమలో అగ్రస్థానాలకు చేరుకున్నారు. ఒక దర్శకుడిగా మాత్రమే కాకుండా, ఒక గురువుగా కూడా ఆయన వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతుంది.కెరీర్భారతీరాజా.. 1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో జన్మించారు. కన్నడ దర్శకుడు పుట్టన్న కనగళ్ దగ్గర అసిస్టెంట్‌గా చేరి తన కెరీర్ ఆరంభించారు. పలువురు దర్శకుల దగ్గర పని చేసిన ఈయన 1977లో '16 వయిదినిలే' అనే తమిళ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. కిళక్కేపోగుమ్ రైలు, సిగప్పురోజాక్కళ్, టిక్ టిక్ టిక్, ముదల్ మరియాదై, కరుత్తమ్మ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. తమిళ సినిమాల్లో గ్రామీణ జీవన విధానాన్ని సహజత్వంతో చూపించడం మూలంగా ఆయనను “దర్శక ఇమయం”గా అభిమానులు పిలుస్తారు.తెలుగులోనూ..తెలుగులో సీతాకోక చిలుక, కొత్త జీవితాలు, ఆరాధన, జమదగ్ని చిత్రాలు తెరకెక్కించారు. సీతాకోక చిలుక మూవీకిగానూ నంది అవార్డు అందుకున్నారు. మంగమ్మగారి మనవడు చిత్రానికి కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్‌ప్లేను అందించారు. తన సినిమాల ద్వారా రాధ, రాధికా శరత్‌కుమార్, రేవతి, కార్తీక్ సహా పలువురు నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. భారతీరాజా దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ అనేక సినిమాలు చేశారు.ఆరు జాతీయ అవార్డులుఆరు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులతో పాటు పలు రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా తమిళ సినీ పరిశ్రమలో తన ప్రత్యేక శైలితో ప్రేక్షకులను అలరించారు. భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. భారతీయ సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారతీరాజాను 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. -
ఆస్పత్రిలో దర్శకుడు భారతీరాజా
ప్రఖ్యాత సినీ దర్శకుడు, నటుడు భారతీరాజా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఈ ఏడాది మార్చిలోనే ఆయన కుమారుడు, దర్శకనటుడు మనోజ్ కన్నుమూశారు. దీంతో మనోవేదనకు గురైన భారతీరాజా అనారోగ్యంపాలయ్యారు. వైద్య చికిత్స అనంతరం కోలుకున్న ఈయన మలేషియాలో ఉన్న తన కూతురి వద్దకు వెళ్లి విశ్రాంతి తీసుకుని ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చారు.కాగా 80 ఏళ్ల వయసు పైబడ్డ భారతీరాజా మారోసారి అనారోగ్యానికి గురి కావడంతో గత మూడు రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందని భారతీరాజా బంధువులు తెలిపారు.సినిమాభారతీరాజా విషయానికి వస్తే.. ఈయన 16 వయదినిలే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంలోనే కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవిని డైరెక్ట్ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కళక్కే పోగులు రైల్, ముదల్ మరియాదై, అలైగల్ ఓయ్వదిలై వంటి పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. రాధిక, రాధ, కార్తీక్ వంటి పలువురు నటీనటులను సినిమాకు పరిచయం చేశారు. తెలుగులో సీతాకోక చిలుక, ఎర్ర గులాబీలు, ఆరాధన, ఈతరం ఇల్లాలు వంటి పలు సినిమాలు చేశారు. -
భారతీరాజా తనయుడు మృతి.. మైత్రి మూవీ మేకర్స్ కీలక నిర్ణయం
కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు భారతీరాజా తనయుడు మనోజ్ గుండెపోటుతో మంగళవారం సాయంత్రం మృతి చెందారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన మనోజ్‌కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 48 ఏళ్లు కాగా.. ఇటీవలే ఆయనకు గుండెకు శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది.అయితే ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంతాపం వ్యక్తం చేసింది. మనోజ్ మృతితో కీలక నిర్ణయం తీసుకుంది. తమ బ్యానర్లో తెరకెక్కించబోయే ప్రదీప్ రంగనాథన్ మూవీ ప్రకటనను వాయిదా వేసింది. ఇవాళ ఉదయం 11:07 నిమిషాలకు విడుదల కావాల్సిన ఫస్ట్ షాట్ బూమ్ టైమ్‌ను మార్చినట్లు ట్విటర్ ద్వారా వెల్లడించింది.(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. దర్శకుడు భారతీరాజా కుమారుడు కన్నుమూత)కాగా.. మనోజ్ భారతిరాజా ప్రముఖ లెజెండరీ ఫిల్మ్ మేకర్ భారతిరాజా కుమారుడు. మనోజ్ తొలిసారిగా తాజ్ మహల్ (1999)మూవీలో నటించారు. ఆ తర్వాత అల్లి అర్జున (2002), కాదల్ పుక్కల్ (2001), అన్నక్కోడి, పల్లవన్, లాంటి తమిళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. గత రెండేళ్లుగా దర్శకత్వం వైపు అడుగులు వేశారు. తన తండ్రి నిర్మించిన 2023 తమిళ చిత్రం మార్గజి తింగల్‌తో దర్శకుడిగా పరిచయమయ్యారు.Due to the unfortunate passing of Manoj Bharathiraja Sir, son of legendary filmmaker Bharathiraja Sir, the #PR04 'FIRST SHOT BOOM' is postponed to a later time today. Our heartfelt condolences to the family. May the family find strength and peace in these tough times.— Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2025 -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. దర్శకుడు భారతీరాజా కుమారుడు కన్నుమూత
కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు భారతీరాజా తనయుడు మనోజ్ గుండెపోటుతో ఈ రోజు సాయంత్రం మృతి చెందారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన మనోజ్‌కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 48 ఏళ్లు కాగా.. ఇటీవలే ఆయనకు గుండెకు శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది.కాగా.. మనోజ్ భారతిరాజా ప్రముఖ లెజెండరీ ఫిల్మ్ మేకర్ భారతిరాజా కుమారుడు. మనోజ్ తొలిసారిగా తాజ్ మహల్ (1999)మూవీలో నటించారు. ఆ తర్వాత అల్లి అర్జున (2002), కాదల్ పుక్కల్ (2001), అన్నక్కోడి, పల్లవన్, లాంటి తమిళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. గత రెండేళ్లుగా దర్శకత్వం వైపు అడుగులు వేశారు. తన తండ్రి నిర్మించిన 2023 తమిళ చిత్రం మార్గజి తింగల్‌తో దర్శకుడిగా పరిచయమయ్యారు.మనోజ్ అరంగేట్రం చేయడానికి ముందు సినిమా పట్ల ఉన్న అభిరుచితో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. అంతకుముందు అతను సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ అభ్యసించారు. ఫైనల్ కట్ ఆఫ్ డైరెక్టర్ (2016) వంటి చిత్రానికి తన తండ్రికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే మనోజ్ తన స్నేహితురాలు, తమిళ నటి నందనను నవంబర్ 19న, 2006న వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. -
రాజా... రాజాధిరాజా...
‘టిక్... టిక్... టిక్...’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న కె.భారతీరాజా తన మిత్రుడు ఇళయరాజాకు పాట సందర్భాన్ని వివరిస్తూ ‘పాట మధ్యలో ఒకచోట భయంకరమైన మ్యూజిక్ కావాలి. అక్కడ ప్రేక్షకులు ఉలిక్కిపడే దృశ్యం చూపిస్తాను’ అన్నాడట. ఇళయరాజా ‘సరే’ అని పాట రికార్డు చేశాడు. భారతీరాజా ఆ పాట విని మొదట తనే ఉలిక్కిపడ్డాడు. ఏమంటే భయంకరమైన మ్యూజిక్ కావాలని అతడు కోరిన చోట ఇళయరాజా (Ilayaraja ) ఏం చేశాడో తెలుసా? కొన్ని సెకన్ల నిశ్శబ్దం (Silence) ఉంచాడు. ‘నిశ్శబ్దానికి మించిన భయమైన ధ్వని ఏముంది?’. ఆ పాట హిట్ అయ్యింది. శబ్దం, నిశ్శబ్దం తెలిసిన ఈ మహా సంగీతకారుడు (music maestro) గత 50 ఏళ్లుగా కోట్లమందికి తోడుగా ఉన్నాడు. అభిమానులతో సహజీవనం చేస్తున్నాడు. ఆరాధకులతో సహయానం సాగిస్తున్నాడు. మనసుకు వైద్యుడు. కలత వేళ ఏకాంత తీరాలకు మోసే వెదురు తెప్ప.‘ప్రేమ’ సినిమా కుర్రకారు ఓపెనింగ్స్‌తో మొదలైంది. హీరో గిటారిస్ట్. క్లయిమాక్స్ జాతీయస్థాయిలో పాటల పోటీ. హీరో ఎలాంటి పాటతో అదరగొట్టి చిందులు వేస్తాడోనని అందరూ ఎదురు చూస్తే ‘ప్రియతమా... నా హృదయమా’... అని ఎంతో నెమ్మదైన మెలడీ వస్తుంది. ఇళయరాజా అలా ఎందుకు చేశాడు? పాట మరోసారి వినండి. పాటకు ముందు మెరుపు వేగంతో గిటార్ మోతతో స్టేజ్ ఊగిపోయేలా ప్రిలూడ్ వస్తుంది. హఠాత్తుగా ఆగి స్లోగా పాట మొదలవుతుంది. హీరో పాడాలనుకున్నది ప్రిలూడ్‌కు అనువైన పాట. పాడింది ఈ పాట. కారణం? హీరోయిన్ చావు బతుకుల్లో ఉంది. దర్శకుడి కంటే ఇళయరాజాకే కథ బాగా అర్థం అవుతుంది. అందుకే అతడి పాట నిలబడుతుంది.తెల్లవారే లేచి, కాస్త టీ కొట్టి, హైదరాబాద్ నుంచి చెన్నైకి కారు ప్రయాణం మీద బయలుదేరే కొందరు అమ్మో అంత దూరమా? అనుకోరు. ఇళయరాజా పాటల పెన్ డ్రైవ్ తగిలిస్తే చాలు అనుకుంటారు. ఏ శనివారం సాయంత్రమో పార్టీలో డబ్బు తక్కువై సరంజామా తగ్గినా ఊరుకుంటారు... ఇళయరాజా పాట మాత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండాల్సిందే. ప్రేమ విఫలం... ఇళయరాజా. ప్రేమ జయం... ఇళయరాజా. భావనలొకటై సాగిపోయే వేళలో.... పరువమా చిలిపి పరుగు తీయకు....తమిళనాడు తేని జిల్లాలో మారుమూల కుగ్రామంలో రాజయ్యగా పుట్టి, రాజాగా మారి అప్పటికే మన ఏ.ఎం.రాజా ఇండస్ట్రీలో ఉండటం వల్ల ‘ఇళయ’ చేర్చుకుని ఇళయరాజాగా ‘అన్నాకిళి’ (1976)తో ఏ ముహూర్తాన సంగీత దర్శకుడిగా జన్మించాడోగాని ఇంతకాలం తర్వాత, 1,500 సినిమాలకు 8,500 పాటలు చేశాక, 81 ఏళ్లకు చేరుకున్నాక కూడా ఆకర్షణ కోల్పోలేదు. పెరిగే అభిమానుల రాశి తప్ప అతని పాటల సూచి కుదేలైన దాఖలా లేదు. ఇసైజ్ఞాని. మేస్ట్రో. రాజా సార్. ఒకసారి వింటే చర్మానికి అంటుకుపోయే ఒడు కొలాన్ సెంట్. 1980లలో హైస్కూల్లోనో కాలేజీలోనో ఉన్నవారెవరైనా ఇతని మొగలి వనాలలో వ్యసనపరులు. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. రావడం రావడమే కొత్త సౌండ్‌ను ప్రవేశ పెట్టిన ఇళయరాజాకు, కర్ణాటక ధోరణిని వెస్ట్రన్ తో ఫ్యూజన్ చేయాలనుకుంటున్న ఇళయరాజాకు తన పాటలు సగటు శ్రోతలకు నచ్చుతాయా లేదా అనే సందేహం తెగ పీడించింది. ఒకరోజు సాయంత్రం వాకింగ్‌కు ఇంటి నుంచి బయలుదేరితే రేడియోలో ‘అన్నాకిళి’ (రామచిలుక)లోని ‘మావయ్య వస్తాడట’ పాట మొదలైందట! అంతే... ఆ ఇంటి ఇల్లాలు గబగబా బయటకు వచ్చి ‘ఓ సుబ్బాయక్కా... మంగమ్మత్తా... మావయ్య వస్తాడట పాట వస్తోందే రేడియో పెట్టండి’ అని అరిచిందట! ఇళయరాజా నడుస్తున్న పొడవైన వీధి. ఇక చూడండి... ప్రతి గడపా వరుసగా రేడియో ఆన్ చేస్తూ అతని పాటను అతనికే వినిపిస్తూ కచేరీ. వారిచ్చిన నమ్మకం నేటికీ!‘సంగీతం రాదు... ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను’ అనే ఇళయరాజా ఇంత పేరు, ఖ్యాతి, సంపద తర్వాత కూడా వయసు రీత్యా విరమించుకొని ఉండొచ్చు. గర్వంతో మొద్దుబారి ఉండొచ్చు. అహంతో బంగారు సింహాసనం చేసుకుని విర్రవీగొచ్చు. కాని అతడు అవేం చేయలేదు. భారతీయ సంగీత ప్రతిభను ప్రపంచానికి చాటడానికి వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్‌లో అత్యంత క్లిష్టమైన ‘సింఫనీ’ రాసి, దానికి ‘వేలియంట్’ అని నామకరణం చేసి, మార్చి 8న లండన్ లో 85 మంది సభ్యుల ప్రతిష్ఠాత్మక రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ప్రదర్శన ఇచ్చాడు. చదవండి: వాక్కాలుష్యం.. మాటల గురించి కాస్త మాట్లాడుకుందాంప్రపంచ దేశాల నుంచి రాజా అభిమానులు ఈ సింఫనీకి హాజరయ్యారు. 45 నిమిషాల నాలుగు అంచెల సింఫనీని విని స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇలా వెస్ట్రన్ క్లాసికల్లో సింఫనీ రాసి, లండన్ (London)లో ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి భారతీయుడిగా రాజా చరిత్ర సృష్టించాడు. మరల రాజాధిరాజుగా నిలిచాడు. వ్యక్తిగత ప్రవర్తనలో కొందరికి అభ్యంతరాలు ఉండుగాక... కాని ఇళయరాజా ఒకసారి హార్మోనియం పెట్టె ముందు కూచున్నాడంటే దేవుడు– అభిమానులకు! చేసిన పాటల కంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోరుకు ఫ్యాన్స్ ఉన్నారంటే ఏమిటి చెప్పడం! చదవండి: ఆ రెండూ ఉంటే.. కావాల్సినవన్నీ ఉన్నట్టేరాజా తరగని స్ఫూర్తి. కొద్దిగా చేసి ఎంతో అనుకునేవారు, కాసింత వయసుకే డీలా పడిపోయే వారు, నాలుగు ముక్కలు చదివి మేధావులుగా చలామణి అయ్యేవారు, అద్దెలొచ్చే నాలుగు ఫ్లాట్లకు ఓనర్లైనంత మాత్రాన ఇతరులను పురుగుల్లా చూసేవారు... రాజా నుంచి నేర్చుకోవాల్సింది ఉన్నట్టే ఉంది. రాజా చెయ్యి వేస్తే... అది రాంగై పోదు లేరా! -
ప్రముఖ దర్శకనటుడు కన్నుమూత
సీనియర్ దర్శకుడు, నటుడు ఆర్ శంకరన్ (93) ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం చైన్నెలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల దర్శకుడు భారతి రాజా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన గురువు శంకరన్ మృతి తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అదేవిధంగా పలువురు సినీ ప్రముఖులు శంకరన్‌కు నివాళులు అర్పిస్తున్నారు. 1962లో విడుదలైన 'ఆడి పేరుకు' చిత్రం ద్వారా నటుడిగా పరిచయమయ్యారు శంకరన్. ఆ తర్వాత ఊరు, ఖైదీ, లీలావతి, ఖాదర్ కోట్టై తదితర చిత్రాల్లో నటించారు. కార్తీక్, రేవతి జంటగా నటించిన మౌనరాగం చిత్రంలో రేవతి తండ్రిగా చంద్రమౌళి అనే పాత్రలో నటించి బాగా పాపులర్ అయ్యారు. ఈయన చివరిగా 1999లో అళగర్ సామి అనే చిత్రంలో నటించారు. 1974లో విడుదలైన ఒన్నే ఒన్ను కన్నె కన్ను అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తేన్ సింధు దే వానం, దుర్గాదేవి, ఒరువనుక్కు ఒరుత్తి, తూండిల్ మీన్, పెరిమై కురియవన్, వేలుమ్ మైలుమ్ తున్నై, కుమారి పెణిన్ ఉళ్లత్తిలే వంటి పలు సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడు భారతి రాజా ఈయన వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారన్నది గమనార్హం. எனது ஆசிரியர் இயக்குனர் திரு.ரா.சங்கரன் சார் அவர்களின் மறைவு வேதனை அளிக்கிறது. அவரை இழந்து வாடும் அவரது குடும்பத்தினருக்கு ஆழ்ந்த இரங்கலைத் தெரிவித்துக் கொள்கிறேன். pic.twitter.com/SJmO0dApeq — Bharathiraja (@offBharathiraja) December 14, 2023 చదవండి: అది కుక్కల చేతుల్లోకి వెళ్తోంది.. వారు విషం చిమ్ముతున్నారు.. -
విజయ్ ఆంటోని కూతురు మృతితో సంచలన నిర్ణయం తీసుకున్న కోలీవుడ్
విజయ్ ఆంటోని కూతురు మీరా ఆత్మహత్యతో తమిళ చిత్రసీమ తీవ్రమైన శోకంలో ఉంది. ఆయన కూతురు మీరా ఆంటోని చెన్నైలోని తన నివాసంలో మంగళవారం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అంతకుముందే నటుడు మరిముత్తు మరణం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. అలాంటి సమయాల్లో వార్తాపత్రికలతో పాటు పలు యూట్యూబ్ చానెళ్ల కార్యకలాపాలు పలు వివాదాలకు కారణమయ్యాయి. దీంతో ప్రముఖుల మృతి ఘటనల్లో మీడియాను అనుమతించబోమని సంచలన నిర్ణయాన్ని కోలీవుడ్ తీసుకుంది. అసలు కారణం ఏంటి..? కోలీవుడ్‌లో ఈ మధ్యే జైలర్ నటుడు మరిముత్తు గుండెపోటుతో మరణించారు. ఆ విషాదం మరిచిపోకముందే విజయ్ ఆంటోనీ కుమార్తె మరణించడంతో ఇండస్ట్రీతో పాటు పలువురిని కలచివేసింది. ఈ నేపథ్యంలో వారికి నివాళిలు పలువరు ప్రముఖులు అర్పించారు. ఆ సమయంలో తమిళ ప్రముఖ మీడియా ఛానల్స్‌తో పాటు యూట్యూబ్ సిబ్బంది వ్యవహరించిన తీరు తమిళనాట చర్చనీయాంశం అయింది. నివాళులర్పించేందుకు వచ్చే సెలబ్రిటీలతో పోటీపడి మైక్‌లు పట్టుకుని ఇంటర్వ్యూలు చేసి ఆ వీడియోలకు తప్పుడు తంబ్‌నైల్స్ పెట్టి వ్యూవ్స్ కోసం పలు యూట్యూబ్ ఛానెల్‌లు పోటీపడ్డాయి. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఊహించని షాకిచ్చిన పోలీసులు) అంతేకాకుండా అంత్యక్రియల సమయంలో శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పలు ప్రశ్నలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెరపైకి వచ్చింది. మీడియా, యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఇలాంటి కార్యకలాపాలపై సినీ పరిశ్రమ నుంచే కాకుండా సామాన్య ప్రజల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళ నటులు వివేక్, మైలస్వామి, మనోబాల మృతి ఘటనల్లో కూడా మీడియా ఇలాగే ప్రవర్తించిదని వారు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి తమిళనాడు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల మృతికి సంబంధించిన సంఘటనలకు మీడియాను అనుమతించబోమని నిర్మాతల సంఘం ప్రకటించింది. ఈ మేరకు నిర్మాతల సంఘం అధ్యక్షుడు భారతీరాజా ప్రకటన చేశారు. కుటుంబ బంధాలకు విలువనిచ్చే సమాజంలో ఈ నిర్ణయాన్ని మీడియా గౌరవించాలని ఆయన కోరారు. ఒక వ్యక్తి చనిపోతే ఎక్కువ నష్టం బాధిత కుటుంబానికే ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మీడియా వారికి ఏమైనా సంబంధం ఉందా అని ఆయన ప్రశ్నించారు. పోలీసుల అనుమతి ఉన్నా కూడా చనిపోయిన వారి ఇంటి వద్దకు ఎలాంటి మీడియా వారికి అనుమతి ఉండదని ఆయన ప్రకటించారు. -
31 ఏళ్ల తర్వాత వారిద్దరి కాంబోలో మరో సినిమా!
తమిళ సినిమా: లెజెండరీ దర్శకుడ భారతీరాజా, సంగీత దర్శకుడు ఇళయరాజా 31 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక చిత్రంలో కలిసి పని చేయడం విశేషం. వీరి కాంబినేషన్లో చివరిగా నాడోడి తెండ్రల్ చిత్రం వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు దర్శకుడు సుశీంద్రన్ తన వెన్నెల ప్రొడక్షనన్స్ పతాకంపై నిర్మిస్తున్న మార్గళి తింగల్ చిత్రంతో ఈ మ్యాజిక్ జరిగింది. ఈ చిత్రం ద్వారా దర్శకుడు భారతీరాజా వారసుడు, నటుడు మనోజ్ భారతీరాజా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన తాజ్ మహల్ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించిన మనోజ్ మెగా ఫోన్ పట్టి తొలి ప్రయత్నంలోనే తన తండ్రిని డైరెక్ట్ చేయడం విశేషం. భారతీరాజా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో పలువురు నూతన నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. దీని గురించి దర్శకుడు సుశీంద్రన్ తెలుపుతూ నటుడు మనోజ్ భారతీరాజాను తన చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అదనపు బలం అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇటీవల ఈ చిత్రం పాటల రికార్డింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలి చిత్రంతోనే తన తండ్రి భారతీరాజాను డైరెక్ట్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని మనోజ్ పేర్కొన్నారు. -
ఏడు పదుల వయసులోనూ సినిమాలతో దర్శకుడు బిజీబిజీ!
సీనియర్ దర్శకుడు భారతీరాజా ఏడు పదులు దాటిన వయసులోనూ నటుడిగా బిజీబిజీగా ఉన్నారు. మరో పక్క మళ్లీ దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈయన ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దీనికి మార్గళి తింగళ్ అనే టైటిల్ నిర్ణయించారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు భారతీరాజా వారసుడు మనోజ్ భారతీరాజా దర్శకుడిగా పరిచయం అవుతుండడం విశేషం. ఈయన 1999లో తండ్రి భారతీరాజా దర్శకత్వం వహించిన తాజ్‌మహల్ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత సముద్రం, వరుషమెల్లామ్ వసంతం, అల్లిఅర్జున్ చిత్రాల్లో నటించారు. ఇటీవల శింబు హీరోగా నటించిన హిట్ చిత్రం మానాడులోనూ కీలక పాత్ర పోషించారు. అప్పుడు భారతీరాజా కొడుకును డైరెక్ట్ చేశారు. ఇప్పుడు మనోజ్ తండ్రిని దర్శకత్వం వహిస్తున్నారన్న మాట. ఈయన మెగాఫోన్ పట్టిన చిత్రాన్ని దర్శకుడు సుశీంద్రన్ తన వెన్నిలా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇందులో దర్శకుడు భారతీరాజా ప్రధాన పాత్రను పోషిస్తుండగా ఇతర పాత్రల్లో నూతన నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చిందని దర్శకుడు తెలిపారు. మార్గళి తింగళ్ చిత్ర షూటింగ్‌ను బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. చదవండి: ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ.. అంత అమాయకంగా నటిస్తున్నారేంటి: తేజ -
ఆ దర్శకుడితో నటించడానికి భయమేసింది: యంగ్ హీరో
దర్శకుడు భారతీరాజాతో కలిసి నటించడానికి భయపడ్డానని యువ నటుడు అరుళ్ నిధి చెప్పారు. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం తిరువిన్ కురుల్. దర్శకుడు భారతీరాజా ప్రధాన పాత్రను పోషించిన ఇందులో నటి ఆద్మిక నాయకిగా నటించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ద్వారా హరీశ్ప్రభు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 14వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా.. ఇందులో నటుడు అరుళ్‌నిధి మూగ పాత్రలో నటించడం విశేషం. అంతేకాకుండా చెవులు కూడా సరిగా పని చేయవు. ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని ఆయన తెలుపుతూ ఇది తండ్రి కొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. దర్శకుడు భారతీరాజా తన తండ్రిగా నటించారన్నారు. ఆయన్ని తొలిసారి షూటింగ్‌లోనే చూశానని తెలిపారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపొందించినా, ఆయనది పిల్లాడి మనస్తత్వం అని అన్నారు. భారతీరాజాతో కలిసి నటించడం మరిచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. ఇది ఎక్కువగా ఆస్పత్రిలో జరిగే సన్నివేశాలతో కూడిన కథా చిత్రమని చెప్పారు. చిత్రంలో ఈగో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. విలన్లు, పోరాటాలు అంటూ చిత్రం కుటుంబ నేపథ్యంలో భావోద్రేకాలతో సాగుతుందని తెలిపారు. తాను ఈ చిత్రాన్ని అంగీకరించడానికి కథే కారణం అన్నారు. బృందావనం తరువాత తన కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం ఇదేనని నటుడ అరుళ్‌నిధి పేర్కొన్నారు. -
ఇండియాలోనే తొలిసారిగా స్క్రిప్ట్ బ్యాంక్.. లాంచ్ చేసిన భారతీరాజా
తమిళసినిమా: సాధారణంగా డబ్బులు పొదుపు చేసుకోవడానికి, అవసరమైనప్పుడు వాడుకోవడానికి బ్యాంకులను ఉపయోగిస్తుంటాం. అలాంటిది ఇప్పుడు సినిమా దర్శక నిర్మాతల కోసం ఒక కథల బ్యాంకు ప్రారంభమైంది. స్క్రిప్ట్ టిక్ పేరుతో గీత రచయిత మదన్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధనుంజయన్ కలిసి నెలకొల్పారు. ఈ బ్యాంకును ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా శనివారం ఉదయం ప్రారంభించారు. ప్రతిభావంతులైన రచయితల కథనాలను చదివి వాటిలో మంచి కథలను ఎంపిక చేసి చిత్ర నిర్మాణానికి సిద్ధం చేసి దర్శక నిర్మాతలకు అందించే విధంగా ఏర్పాటు చేసిన కొత్త ప్రయత్నమే ఈ బ్యాంక్ అని వెల్లడించారు. ప్రస్తుతం వస్తున్న చాలా చిత్రాల్లో కథ, కథనాలు సరిగ్గా ఉండడం లేదన్నారు. అందుకే చాలా వరకు చిత్రాలు ఫ్లాప్ అవుతున్నాయన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకునే ప్రతిభావంతులైన కథా రచయితలు, దర్శకులు, నిపుణులు అందించిన కథలతో చిత్రాలు చేస్తే కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతారని అన్నారు. అలాంటి ప్రయత్నంతోనే ఈ బ్యాంకును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పలువురు ప్రతిభావంతులైన రచయితలను ప్రోత్సహించడం, వారికి తగిన పారితోషికాన్ని అందించడం తమ లక్ష్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు. నిర్మాతలు పలు కథలను విని వాటిలో ఒకటి, రెండు ఎంపిక చేసుకోవడం కాకుండా మంచి కథ మాత్రమే చదివి చిత్రాలు చేయడం వల్ల సమయం ఆదా అవుతుందన్నారు. అదే విధంగా తక్కువ సమయంలో పలు చిత్రాలు నిర్మించే అవకాశం ఉంటుందన్నారు. అలాంటి మంచి కథలను అందించడమే తమ స్క్రిప్ట్ టిక్ బ్యాంకు ఉద్దేశమని పేర్కొన్నారు. Creative initiative 👏#SCRIPTick - India's First Script Bank launched by @offBharathiraja sir - Will be valuable for script Writers & Producers Best wishes@madhankarky @Dhananjayang @karundhel @onlynikil@scriptickindiahttps://t.co/0upoHpY9x7 https://t.co/3Gf8E7Td9u pic.twitter.com/o2HdMaPtP7 — Ajay Srinivasan (@Ajaychairman) February 11, 2023 -
దర్శకుడు భారతీరాజా ఇంటికి సీఎం స్టాలిన్
సినీ దర్శకుడు భారతీరాజాను శనివారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న భారతీ రాజా రెండు వారాలు ఆస్పత్రిలో చికిత్స పొంది శుక్రవారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. చికిత్స పొందుతున్న సమయంలో సీఎం స్టాలిన్ ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి భారతీ రాజా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం సీఎం స్టాలిన్ నీలాంగరైలోని భారతీ రాజా ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. ఆయనతో పాటు డీఎంకే నాయకులు, సినీ గీత రచయిత వైరముత్తు ఉన్నారు. చదవండి: (Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత) -
డైరెక్టర్ భారతీరాజా హాస్పిటల్ ఖర్చులకు డబ్బుల్లేవా? కొడుకు ఏమన్నాడంటే..
తమిళసినిమా: సీనియర్ దర్శకుడు భారతీరాజా శుక్రవారం మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత నెల 26వ తేదీ అనారోగ్యంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి వైద్య చికిత్సలు పొందుతున్న విషయం తెలిసిందే. రెండు వారాల పాటు ఆయన ఆస్పత్రిలోనే ఉండటంతో ఆయనకు ఏమైందని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సంపూర్ణ ఆరోగ్యంతో భారతీరాజా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి స్థానిక నీలాంగరైలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన బులిటెన్ ఎంజీఎం ఆసుపత్రి నిర్వాహకులు మీడియాకు విడుదల చేశారు. అందులో దర్శకుడు భారతీరాజా అల్టెరెడ్ సెంజూరిమ్ సమస్యతో గత నెల 26వ తేదీన తమ ఆసుపత్రిలో చేరారన్నారు. ఆయనకు అత్యవసర వైద్యవార్డులో చికిత్సలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రస్తుతం భారతీరాజా కోరుకున్నారని దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. కాగా భారతీరాజా కొడుకు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి పూర్తిగా కోలుకున్నారని మునుపటి భారతీరాజాను చూడొచ్చని చెప్పారు. అయితే ప్రచారం జరుగుతున్నట్లు తన తండ్రి ఆస్పత్రి ఖర్చులకు ఇబ్బంది పడలేదని, సాయం కూడా కోరలేదని, అలాంటి అవసరం తమకు లేదని వివరించారు. గీత రచయిత వైరముత్తు, ఏసీ షణ్ముగం సలహా మేరకు తన తండ్రిని వైద్య చికిత్స కోసం ఎంజీఎంలో చేర్చినట్లు చెప్పారు. తన తండ్రి ఇంత త్వరగా కోలుకోవడానికి కారణం ఆస్పత్రి వైద్యులేనని మనోజ్ పేర్కొన్నారు. -
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజాకు ఏమైంది? మరో హాస్పిటల్‌కు తరలింపు
తమిళసినిమా: సీనియర్ దర్శకుడు భారతీరాజా అనారోగ్యానికి గురై ఇటీవల ఒక చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం కుదురుగానే ఉంది. గుండెల్లో నెమ్ము చేరడం వల్ల అనారోగ్యానికి గురయ్యారని, రెండు రోజుల్లోనే సంపూర్ణ ఆరోగ్యంతో భారతీరాజా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వైద్యులు తెలిపారు. అలాంటిది సడన్‌గా శుక్రవారం ఆయనకు మెరుగైన వైద్యం కోసం స్థానిక పోరూరులోని శ్రీరామచంద్రన్ ఆసుపత్రిలో చేర్చారు. భారతీరాజా కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి వచ్చిన గీత రచయిత వైరముత్తు అనంతరం మీడియాతో మాట్లాడారు. భారతీరాజా ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు భారతీరాజా శనివారం మధ్యాహ్నం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేరారు. అందులో ఇటీవల అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన తనకు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది మెరుగైన వైద్యాన్ని అందిస్తూ చాలా శ్రద్ధగా వైద్య సేవలను అందించడంతో తాను కోలుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆసుపత్రిలోని విజిటర్స్ ప్రవేశానికి అనుమతి లేనందున తనను చూడడానికి ఎవరూ రావద్దని కోరుకుంటున్నానన్నారు. తాను ఆసుపత్రిలో చేరిన విషయం తెలియగానే ప్రత్యక్షంగానూ, ఫోన్ ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా పరామర్శించినా, తాను త్వరలో కోలుకోవాలని ప్రార్థనలు చేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారన్నారు. అయితే భారతీరాజా అనారోగ్యానికి కారణం ఏమిటన్నది ఇప్పటి వరకు వైద్యులు గాని ఆయన కుటుంబ సభ్యులు గాని వెల్లడించలేదు. దీంతో దర్శకుడు భారతీరాజాకు ఏమైంది అన్న ప్రశ్న తలెత్తుతోంది. -
నాగ చైతన్య ద్విభాషా చిత్ర షూటింగ్ ప్రారంభం (ఫొటోలు)
-
వైరముత్తుకు సీఎం, రాజకీయ నేతలు అండగా నిలవాలి : భారతీరాజా
చెన్నై: సినీ గీత రచయిత వైరముత్తుకి సీఎం, రాజకీయ నాయకులు అండగా నిలవాలని సీనియర్ దర్శకుడు భారతీరాజా విజ్ఞప్తి చేశారు. గీత రచయిత వైరముత్తు నాలుగైదు రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. కేరళకు చెందిన ప్రఖ్యాత దివంగత కవి, గీత రచయిత ఓఎన్వీ గురుప్ పేరుతో నెలకొల్పిన ఓ ఎన్ వి జాతీయ సాహితీ అవార్డును వైరముత్తుకు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనంతరం ఆయన ఈ అవార్డును ప్రకటించడంపై మలయాళనటి పార్వతి, గాయని చిన్మయి వంటి వారు తీవ్రంగా వ్యతిరేకించారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఓ ఎన్ వి జాతీయ సాహితీ అవార్డును ప్రధానం చేయడమా? అంటూ విమర్శించారు. దీంతో ఓ ఎన్ వి సాంస్కృతిక అకాడమీ నిర్వాహకులు వైరముత్తుకు ఈ అవార్డును ప్రదానం చేయనుండటంపై పునరాలోచన చేస్తామని వెల్లడించారు. ఈ వ్యవహారం వైరముత్తుకు తీవ్ర అవమానమే అనిచెప్పవచ్చు. అయితే ఈ అవార్డును అందుకోకుండానే వైరముత్తు దాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించి మరోసారి విమర్శలకు గురయ్యారు. ఇలాంటి పరిణామాల మధ్య సీనియర్ దర్శకుడు భారతీరాజా వైరముత్తుకు అండగా నిలిచారు. ఆయన శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. భాష, రాజకీయ విద్వేషాలు కలిగి ఎక్కడి నుంచో వచ్చి మాతృభూమికి కళంకం ఏర్పరిచే విధంగా కొందరు మతం, జాతి, భాష పేరుతో విడగొట్టే దాడులు చేస్తున్నారు. ఇలాంటి చర్యలను తమిళులమైన మనమందరం పుల్‌స్టాప్ పెట్టాలి. ప్రపంచ తమిళుందరితో కవి పేరరసు అనే బిరుదుతో గంభీరంగా నిలబడే కవి మిమ్మల్ని వంచాలని ప్రయత్నించే వారి కల కలగానే మిగిలిపోతుంది. తమిళులకు ఎప్పుడు అండగా నిలబడి తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలు, ఇతర రాజకీయ వాదులు వైరముత్తుకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నానని దర్శకుడు భారతీరాజా పేర్కొన్నారు. చదవండి : వైరముత్తుకు భారీ షాక్.. ఓఎన్వీ అవార్డు వెనక్కి? లైంగిక ఆరోపణలేగా!.. మేమూ తగ్గం -
‘800’ వివాదం.. జనాలకు ఏం పని లేదా?!
చెన్నై: హీరో విజయ్ సేతుపతి క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’లో నటించవద్దంటూ నిరసనలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ విజయ్ సేతుపతికి మద్దతుగా నిలిచారు. నమ్మక ద్రోహి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న చిత్రంలో నటించొద్దని విజయ్ సేతుపతికి దర్శకుడు భారతీరాజా సూచించిన విషయం తెలిసిందే. అంతేగాక పలు తమిళ సంఘాలు కూడా దేశద్రోహి సినిమాలో నటించవద్దంటూ డిమాండ్ చేస్తున్నాయి. దీంతో రాధిక శుక్రవారం వరుస ట్వీట్లు చేస్తూ విజయ్ సేతుపతికి, చిత్ర పరిశ్రమకు సంఘీభావం తెలిపారు. రాజకీయాలను, వినోదాన్ని కలపవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. (చదవండి: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నటించొద్దు!) రాధిక ట్వీట్ చేస్తూ.. ‘జనాలకు ఏం పని లేదా.. ఒక నటుడిని, క్రికెటర్‌ను కలపడం అర్థం లేని వివాదం. ముత్తయ్య మురళీధరన్‌ను కోచ్‌గా నియమించిన ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ప్రజలు ఎందుకు ప్రశ్నించడం లేదు’ అన్నారు. అలాగే ‘‘సన్‌రైజర్స్, సన్ టెలివిజన్ ఛానెల్‌కు బలమైన రాజకీయ అనుబంధం ఉంది. అయినప్పటికి రాజకీయాలను, క్రికెట్‌ను, వినోదాన్ని వృత్తిపరంగా తగిన మార్గంలో స్ఫష్టంగా నిర్వహిస్తోంది. అలాంటప్పుడు రాజకీయాలకు దూరంగా చిత్ర పరిశ్రమను, వినోదాన్నేందుకు చూడకూడదు’’ అని ప్రశ్నించారు. అయితే తను ఈ విషయాన్ని వివాదం చేయాలనుకోవడం లేదన్నారు. కేవలం సినీ పరిశ్రమకు, నటులకు న్యాయపరమైన మద్దతునిచ్చే ప్రయత్నంలో తటస్థతకు, పక్షపాతరహితానికి సాక్ష్యం ఇచ్చేందుకే సన్‌రైజర్స్ పేరును వాడాను అంటూ రాధిక మరో ట్వీట్లో స్పష్టం చేశారు. (చదవండి: విజయ్ సేతుపతికి జంటగా నిత్యా మీనన్) #muthaiyamuralitharan biopic &asking @VijaySethuOffl not to act😡do these people hav no work??why not ask @SunRisers why he is the head coach, team belongs to a Tamilian with political affiliations?VSP is an actor, and do not curb an actor. VSP&cricket both don’t warrant nonsense — Radikaa Sarathkumar (@realradikaa) October 16, 2020 అయితే ఎమ్మెస్ శ్రీపతి దర్శకత్వంలో 800 పేరుతో శ్రీలంక క్రికెటర్ మురళీధరన్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మురళీధరన్‌గా విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలో ఫస్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రీలంక మతవాదానికి పూర్తిగా మద్దతు పలికిన వ్యక్తి ముత్తయ్య అని అలాంటి నమ్మకద్రోహి జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న చిత్రంలో విజయ్ సేతుపతి నటించవద్దంటూ దర్శకుడు భారతీరాజు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. అంతేగాక 800కు వ్యతిరేకంగా పలు తమిళ సంఘాలు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. దర్శకుడు శీను రామస్వామి, చేరన్ కూడా ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్రలో నటించొద్దని విజయ్‌సేతుపతికి విజ్ఞప్తి చేశారు. (చదవండి: విజయ్ సేతుపతికి జంటగా నిత్యా మీనన్) my intention of that tweet was not to create any room for controversies but was to support the film industry and the connected artists within prejudices. That's why I brought in #Sunrisers name as a testimony of non biased, neutral and professional approach — Radikaa Sarathkumar (@realradikaa) October 16, 2020 -
ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నటించొద్దు!
నమ్మకద్రోహి జీవిత చరిత్రతో తెరకెక్కనున్న చిత్రంలో నటించొద్దని నటుడు విజయ్‌సేతుపతికి దర్శకుడు భారతీరాజా హితవు పలికారు. శ్రీలంక క్రికెట్ క్రీడాకారుడు ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్రను 800 పేరుతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ముత్తయ్యమురళీధరన్ పాత్రలో విజయ్‌సేతుపతి నటిస్తున్నారు. ఎమ్మెస్ శ్రీపతి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ఫస్ట్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో విజయ్‌సేతుపతి నటిస్తుండడంపై తమిళ సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. భారతీరాజా 800 చిత్రంలో నటించొద్దని విజయ్‌సేతుపతికి హితవు పలుకుతూ గురువారం ఒక లేఖను మీడియాకు విడుదల చేశారు. అందులో శ్రీలంక మతవాదనకి పూర్తిగా మద్దతు పలికిన వ్యక్తి ముత్తయ్య మురళీధరన్ అని అన్నారు. ముత్తయ్య మురళీధరన్ నమ్మకద్రోహి అని పేర్కొన్నారు. అదేవిధంగా దర్శకుడు శీను రామస్వామి, చేరన్ కూడా ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్రలో నటించొద్దని విజయ్‌సేతుపతికి విజ్ఞప్తి చేశారు. -
నాకు మాటలు రావట్లేదు: భారతీరాజా
సాక్షి, చెన్నై: కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మళ్లీ తీవ్ర అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో పాటు అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ నేపథ్యంలో తమిళదర్శకుడు భారతీరాజా ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడుతూ.. కరోనాతో పోరాడి బాలు తిరిగి వస్తారని ఆశించా. కరోనాతో కోలుకుంటున్నారని అనుకున్నా.. ఆ పరిస్థితి లేదు. నా చిరకాల మిత్రుడిని ఈ పరిస్థితిలో చూసి బాధేసింది. బాధను ఎలా వ్యక్తం చేయాలో అర్థం కావడం లేదు అంటూ భారతీరాజా ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దురదృష్టవశాత్తు బాలసుబ్రహ్మణ్యం ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూశారు. -
‘కరోనా రాలేదు.. క్వారంటైన్‌కు పంపలేదు’
సాక్షి, చెన్నై: కరోనా సమయంలో సెలబ్రెటీల మీద తప్పుడు వార్తలు రోజు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తూనే ఉన్నాయి. వారు కాస్త ఆస్వస్థతకులోనైనా, ఏ కారణంతోనైనా ఆస్పత్రి దరిదాపుల్లోకి వెళ్లినా వారికి కరోనా అంటగడుతూ సోషల్ మీడియాలో వార్తలు రాస్తున్నారు. దీంతో తమకు, తమ కుటుంబసభ్యులెవరికీ కరోనా సోకలేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి సెలబ్రెటీలకు ఏర్పడింది. ఈ క్రమంలో దక్షిణాది దిగ్గజ దర్శకుడు భారతిరాజాలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనను క్వారంటైన్ సెంటర్‌కు తరలించారనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్న విషయం తెలిసిందే. దీంతో ఈ వార్తలపై తాజాగా ఆయన స్పందించారు. ‘భారతిరాజా క్వారంటైన్‌కు తరలించారంటూ వార్తలు వస్తున్నాయి. థానేలో ఉన్న మా సహోదరికి శస్త్ర చికిత్స జరిగింది. ఆమెను చూడటానికి అధికారుల నుంచి పాస్ తీసుకునే బయలుదేరాను. థానేకు వెళ్లాక నేనే అధికారులకు చెన్నై నుంచి వచ్చాను అని చెప్పాను. వారు కరోనా టెస్టులు నిర్వహించారు. నెగటీవ్ అని వచ్చింది. ఆ తర్వాత మళ్లీ చెన్నైలో టెస్టులు నిర్వహించగా నెగటీవ్ అని తేలింది. మొత్తం మూడు చోట్ల నాకు కరోనా టెస్టులు నిర్వహించగా నెగటీవ్ అని తేలింది. అన్ని చోట్లా నేనే స్వచ్చందంగా పరీక్షలు చేయించుకున్నా. అయితే పలు జిల్లాలు, రాష్ట్రాలు తిరిగొచ్చానందుకు నాకు నేను నా ఇంట్లో స్వీయ నిర్భంధంలో ఉంటున్నాను. అంతేకాని నన్నెవరూ బలవంతంగా క్వారంటైన్ సెంటర్‌కు తరలించలేదు. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నా. వదంతులు నమ్మకండి. నాపై తప్పుడు వార్తలు రాయకండి’అంటూ భారతీరాజా విజ్ఞప్తి చేశారు. చదవండి: కేటీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన ప్రకాష్ రాజ్ విష్ణు టిక్‌టాక్ వీడియో.. అద్భుతః -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన ప్రముఖ నటుడు
సాక్షి, చెన్నై: మద్యం తాగి వాహనం నడుపుతున్న ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా కుమారుడు మనోజ్‌ను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మనోజ్ నడుపుతున్న ఎస్యూవీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి, నోటీసులు జారీ చేశామని నుంగంబాక్కం పోలీసులు తెలిపారు. కాగా, భారతీరాజా దర్శకత్వంలో మనోజ్ పలు సినిమాల్లో హీరోగా చేశారు. 1999లో వచ్చిన తాజ్‌మహల్‌తో సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. సముతిరం, కాదల్ పోక్కల్, అల్లి అర్జున సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. -
దర్శక దిగ్గజంపై కేసు నమోదు
సాక్షి, చెన్నై : దర్శక దిగ్గజం భారతీరాజాపై కేసు నమోదైంది. మత ఉద్రిక్తతలు, అల్లర్లు రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జనవరిలో ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. వినాయకుడు దిగుమతి చేసుకున్న దేవుడి వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని హిందూ మక్కల్ మున్నాని సంస్థ ఫిర్యాదు చేసింది. 76 ఏళ్ల భారతీరాజాపై గతంలోనూ ఇదే తరహాలో కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయకుండా మద్రాస్ హైకోర్టు గతంలో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
రజనీ బీజేపీకి కొమ్ము కాస్తున్నారు
తమిళసినిమా: నటుడు రజనీకాంత్ బీజేపీకి కొమ్ముకాస్తున్నారని సినీ దర్శకులు భారతీరాజా, అమీర్, నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ విమర్శించారు. కావేరి మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు, ఐపీఎల్ క్రికెట్ పోటీలను చెన్నైలో రద్దు చేయాలని బుధవారం సినీ ప్రముఖులతో పాటు పలువురు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ పోరాటంలో ఒక పోలీస్ గాయపడ్డారు. దీంతో నామ్ తమిళర్ పార్టీకి చెందిన 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీనిపై స్పందించిన రజనీకాంత్ హింసకు పరాకాష్ట అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇలాఉండగా రజనీ వ్యాఖ్యలపై దర్శకుడు భారతీరాజా, అమీర్, గౌతమ్, నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావేరి మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు కోసం చేసిన ఆందోళనలో కొన్ని అనూహ్య సంఘటనలు జరిగాయని, అవేవీ హింసాత్మకం కాదన్నారు. కావేరి సమస్యపై కర్ణాటకలో తమిళ లారీ డ్రైవర్‌పై దాడి జరిగినప్పుడు రజనీకాంత్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. రజనీ వ్యాఖ్యలు ఎవరి డబ్బింగో అని పరిహసించారు. రజనీ వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై స్వాగతించడం చూస్తుంటే ఆయన బీజేపీకి కొమ్ముకాస్తున్నట్లు అర్థమవుతోందని దుయ్యబట్టారు. కేంద్రమంత్రి పొన్రాధాకష్టన్, తమిళిసై సౌందర్‌రాజన్‌లు తమిళులకు ద్రోహం చేస్తున్నారని, అరెస్ట్ చేసిన నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమది భవిష్యత్తు తరాల కోసం చేసే పోరాటం అని పేర్కొన్నారు. -
మనిషికో స్నేహం... మనసుకో దాహం ఆత్మబంధువు
తల్లిదండ్రులు ఉంటారు. వేరు. తోబుట్టువులు ఉంటారు. వేరు. జీవితంలో చాలా మంది స్నేహితులు ఉంటారు. వేరు. పెళ్లవుతుంది. భార్య వస్తుంది. పిల్లలు పుడతారు. వేరు. వీరంతా బంధువులు.. బంధాలు కలిగినవారు. వీళ్లలో ఎవరో ఒకరే ఆత్మబంధువులు. సోల్‌మేట్. అదృష్టం బాగున్నవారికి కుటుంబంలోనో స్నేహితులలోనో ఆత్మబంధువు దొరుకుతారు. ఇంకా అదృష్టం బాగుంటే భార్యే ఆత్మబంధువు అవుతుంది. కాని ఆ అదృష్టం లేకపోతే? అసలు ఆత్మబంధువు అంటే ఎవరు? హోరున వాన కురిస్తే తల మీద చేతులు కప్పుకుని నీడన పరిగెడితే అదాటున వచ్చి మన పక్కన ఒక మనిషి నిలబడతాడు. మనం ఊసుపోక విసుగు పుట్టే ఈ బతుకులోని బేజారు పడక ఉల్లాసం కోసం ఒక పల్లవి అందుకుంటే అప్పటి దాకా అలికిడి లేని ఆ ప్రాంతంలో మరొక మనిషి ఊడిపడి చరణం అందుకుంటాడు. మనం పిల్లనగ్రోవి ఊదితే ఒక మనిషి గోవులా కదలి దరికి చేరుతాడు. మనం ఒడ్డున చేపలు పడితే ఒక మనిషి బుట్ట అందుకుని ఆ సంగతి ముందే తెలుసు అన్నట్టు నిలుచుని ఉంటాడు. మనకు నిద్ర వస్తుంటే అతడు రెప్ప మూస్తాడు. మనకు దుఃఖం ఊరితే అతడు బావురుమంటాడు. మనకు అనిపించేది అనిపించడానికి ముందే అతడికి తెలుస్తుంది. మనం చెప్పాలనుకున్నది గొంతు విప్పకముందే అతడికి వినిపిస్తుంది. ఎదురూ బొదురు మౌనంగా ఎంత సేపు కూర్చున్నా మనసులు అనంత సంభాషణలు చేస్తాయి. అనంత సంభాషణల్లో కూడా ఇరువురిలో ఒక ప్రశాంతమైన మౌనం ఉంటుంది. అలాంటి మనిషే ఆత్మబంధువు. ఇది మగకు మగ అయితే సమస్య లేదు. ఆడకు ఆడ అయితే సమస్య లేదు. ఆడకు మగ, మగకు ఆడ అయితేనే సమస్య. ఈ కథంతా ఆ సమస్య. ఈ సినిమాలో శివాజీ గణేశన్ ఒక భావుకుడు. చిన్న పిచ్చిక వడ్ల చేను మీద వాలితే అతడి మనసు పులకరిస్తుంది. చేలో కలుపు తీస్తున్న వనిత గట్టున చెట్టుకు వేళ్లాడగట్టిన ఊయాలలోని పాపాయి కోసం పాట పాడితే అతడి గొంతు పురి విప్పుతుంది. ఆ నింగి అతడికి ఊరట. ఆ ప్రకృతి అతడికి తెప్పరింత. కాని ఇంట్లో భార్య అలా ఉండదు. మురికిగా, గార పళ్లతో, ఎప్పుడూ ఇంత పెద్ద గొంతు వేసుకుని కయ్కయ్మంటూ... ఆకారం ముఖ్యం కాదు... కాని ప్రవర్తనలో కొంచెం కూడా సౌందర్యం లేదే... సంస్కారం లేదే... శుభ్రంగా చేతులు కడుక్కుని బుగ్గలకు ఆనించుకుని చూసే చిన్నపాటి ముచ్చట కూడా లేదే. ఒక చేత్తో ముక్కు చీదుతూ మరో చేత్తో కంచం పెట్టే ఆ మనిషితో అతడికి ఎప్పుడూ ఏ బంధం లేదు. అతడు ఆ ఇంట్లో ఒక బంధువు వలే ఉన్నాడు. బంధంతో లేడు. కాని పక్కూరి నుంచి పొట్ట చేత్తో పట్టుకుని వలస వచ్చి, ఏటి వొడ్డున గుడిసె వేసుకుని చేపలు పట్టి అమ్ముకుని బతుకుతున్న రాధతో పరిచయం అయిననాటి నుంచి అతడిని ఏదో లాగుతూ ఉంటుంది. మనసులో ఉన్నది ఉన్నట్టు చెబుతూ బూడిదతో తోమిన వంటపాత్రలా ఏ మరకా లేకుండా ఉండే ఆ అమ్మాయి సమక్షం అతడికి హాయిగా ఉంటుంది. ఒకరోజు ఆ అమ్మాయితో కలిసి చేపలు పడతాడు. రెండుసార్లు ఒక్క చేప కూడా పడదు. మూడోసారి దోసెడు చేపలు తుండుగుడ్డలో ఎగిరెగిరి పడతాయి. అది చూసి సంతోషంతో పసిపిల్లాడిలా పెద్దపెద్దగా నవ్వుతాడు. నవ్వి నవ్వి ‘ఈ రోజు నేను చాలా నవ్వాను కదూ’ అని తనకు తానే వేదనగా మననం చేసుకుంటాడు. ఆ అమ్మాయి అంత చింత వేసి నాలుగు పచ్చి మిరపకాయలు వేసి చేపల పులుసు చేస్తే మొదట బెట్టుగా ఆ తర్వాత ఆబగా తిని ‘ఇరవై ఏళ్లయ్యింది ఈ పాటి భోజనం చేసి’ అని కళ్లనీళ్లు పెట్టుకుంటాడు. గాయాలతో నిండిపోయిన అతడి మనసుకు ఆ అమ్మాయి స్నేహం నెమలీకతో రాసిన వెన్న అవుతుంది. కాని ఊరు ఊరుకోదు. నింద వేస్తుంది. అతడికి పౌరుషం వచ్చి ‘అవును. దానిని ఉంచుకున్నాను’ అంటాడు. ఆ మాట రాధ విని ‘అది నిజం కాదా... నిజంగా నా మీద నీకు ప్రేమ లేదా’ అని అడుగుతుంది. మనసులో ఉన్నది చెప్పడం, అసలు మనసులో ఏదైనా ఆశించడం కూడా మానుకున్న నిస్సహాయ ఉన్నతుడు అతడు. ఏం చెప్తాడు? అలాగని ఆమెతో కులికే వయసా అతనిది? అలాగని ఆమెను కాదనుకునే మనసా అతనిది? ఆమె ఉండాలి. తనకు కనపడుతూ ఉండాలి. తన మీద నాలుగు నవ్వు మాటలు చెప్పి హాయిగా నవ్విస్తూ ఉండాలి. తనున్నానన్న ఒక ఆలంబనను అందిస్తూ ఉండాలి.కాని భార్య, బంధువులు కలిసి ఆ బంధాన్ని తెగ్గొడ్తారు. రాధ కావాలని నేరం చేసి జైలుకు వెళ్లిపోతుంది. అతడి హృదయం ఖాళీ. అతడి గొంతు ఖాళీ. మాటా ఖాళీ. మనిషి శూన్యం. అతడు ఊరిని త్యజిస్తాడు. ఇంటిని త్యజిస్తాడు. ఏ ఏటి ఒడ్డు ఇంట్లో అయితే రాధ ఉండేదో ఆ ఇంట్లో ఆమె కోసం ఎదురు చూస్తూ ఒక్కడే ఉండిపోతాడు. కొనఊపిరితో ఉండగా రాధ జైలు నుంచి విడుదలై వస్తుంది. అంత వరకూ అంగిట్లో ప్రాణం నిలుపుకుని ఉన్న అతడు ఆమెను చూసి మెల్లగా నవ్వుతాడు. చేతిలో చేయి వేస్తాడు. ఏనాడో ఆమె జ్ఞాపకంగా దాచుకున్న పూసల దండ చేతిలో పెట్టి ప్రాణం వదిలేస్తాడు. ఆమెకు మాత్రం తన ఒంట్లోని ఈ ప్రాణం ఎందుకు? ఆమె కూడా మరణిస్తుంది. మనిషి ఏ పాపం అయినా చేయవచ్చు. కాని ఇద్దరు ఆత్మబంధువులను విడదీసే పాపం మాత్రం చేయకూడదు. మనిషికో స్నేహం. మనసుకో దాహం. జీవితంలో ఒక్కసారైనా ఆ దాహం తీర్చే స్నేహాన్ని పొందిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా అంకితం. ముదల్ మరియాదై 1985లో వచ్చిన ‘ముదల్ మరియాదై’ ఇక శివాజీ గణేశన్ పని అయిపోయినట్టే అనుకున్నవారికి ఊహించని ఎదురుదెబ్బ కొట్టి పెద్ద హిట్ అయ్యింది. దర్శకుడు భారతీరాజా తన ఆయువుపట్టయిన పల్లెటూరి నేపథ్యాన్ని అథెంటిక్‌గా తీస్తూ పల్లెల్లో ఎన్నటికీ నెరవేరని స్త్రీ, పురుష మూగ బంధాలను ఎంతో కళాత్మకంగా చూపించడం వల్లే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. సినిమా అంతా కర్నాటకలోని ఒక పల్లెటూళ్లో తీశారు. ఇళయరాజా నేపధ్య సంగీతం, ‘పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ల నేనే’ వంటి పాటలు ఇవ్వడం మధురం. జగ్గయ్య గారు శివాజీ గణేశన్‌కు అద్భుతంగా పల్లెటూరి యాసలో డబ్బింగ్ చెప్పడం మురిపెం కలిగిస్తుంది. ముఖ కవళికలతో లోతైన భావాలను ఎలా పలికించాలో ఈ సినిమాలో శివాజీని వెయ్యిసార్లు చూసి ఏ కొత్త నటుడైనా ఆవగింజంత సాధించవచ్చు. కాని ఆయన ఎదుట రాధ కూడా నటనలో చిరుతలా తల పడిందని చెప్పవచ్చు. చాలా రోజుల వరకూ యూ ట్యూబ్‌లో దొరకని ఈ సినిమా ఇప్పుడు దొరుకుతోంది. – కె -
ఆ ఇద్దరూ ట్రెండ్ మార్చారు!
‘‘నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తొలి రోజుల్లో ఇద్దరు రాజాలు (భారతీరాజా, ఇళయరాజా) ట్రెండ్ మార్చేశారు. సహజత్వానికి దగ్గరగా సినిమాలు తీసిన భారతీరాజా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఆయన తనయుడు మనోజ్ ‘బేబి’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు సీనియర్ నటుడు సుమన్. మనోజ్ హీరోగా డి. సురేశ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘బేబి’ని అదే పేరుతో తెలుగులో అనువదించారు. శిరా గర్గ్, అంజలీరావు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను పాలపర్తి శివకుమార్ శర్మ సమర్పణలో నిర్మాతలు బీవీఎన్ పవన్‌కుమార్, కొలవెన్ను ఆంజనేయప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సతీష్, హరీష్ స్వరపరచిన ఈ సినిమా పాటలను సుమన్, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ విడుదల చేశారు. ‘‘హారర్, సస్పెన్స్ చిత్రమైనా కుటుంబ ప్రేక్షకులు చూసేలా ఉంటుంది. మేలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. -
దర్శకుల మధ్య మాటల యుద్ధం
కుట్రపరంపరై కథ వివాదం కోలీవుడ్‌లో ఇద్దరు ప్రముఖ దర్శకుల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తోంది.ఆ ఇద్దరు దర్శకులు భారతీరాజా, బాలా. ఆ కథ ఎవరికి సొంతం అన్న విషయంలో వీరిద్దరి మధ్య విమర్శలకు దారి తీసింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. మొత్తం మీద కుట్రపరంపరై కథను ఇద్దరు తెరకెక్కించడానికి సిద్ధపడుతుండడం కోలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది. బాలా కుట్రపరంపరై కథతో చిత్రం తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. భారతీరాజా ఇప్పటికే కుట్రపరంపరై పేరుతో చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.దీంతో వీరిద్దరి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం సాగుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు బాలా శుక్రవారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించాలన్నది తన అభిమతం కాదన్నారు.అయితే కొన్ని నిజాలను చెప్పాల్సిన అవసరం తనకుందన్నారు. చాలా విషయాలు మనసును గాయపరచాయన్నారు. భారతీరాజాకు, తనకు పోరాటం వల్ల ఈ భూమికి ఒరిగేదేమీలేదన్నారు. తన కథకు, భారతీరాజా చిత్రకథకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తన ఎంగిలి దర్శకుడు బాలా తినరని భావిస్తున్నాన్న భారతీరాజా వ్యాఖ్యలు చిన్నపిల్లల మనస్తత్వాన్ని గుర్తుకు తెస్తున్నాయని,వయసు మీద పడుతున్న కొద్దీ చిన్న పిల్లల్లా తయారవుతారంటారని అందువల్ల ఆయన ఆ వ్యాఖ్యల్ని పట్టించుకోవడం లేదని అన్నారు. తాను బాలుమహేంద్ర వద్ద మినహా ఎవరి వద్దా పని చేయలేదని వివరించారు. ఇప్పటికే తనపై అసత్య ఆరోపణలు చేశారనీ, ఇకపై అలాంటివి ఆపేయాలని లేకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సంస్కృతి, సంప్రదాయం,ఊరు, మన్ను, వీరం లాంటివి ఎన్నైనా చెప్పుకోండని జాతి, మతం విభేదాలకు పోవడం అయోగ్యతనం అని బాలా వ్యాఖ్యానించారు. -
ఫిలిం స్కూల్ పెడుతున్న భారతీరాజా
అనేకమంది యువ దర్శకులను తన చేతుల మీదుగా తీర్చిదిద్దిన ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఇప్పుడు కొత్తగా ఫిల్మ్ స్కూల్ ఒకదాన్ని ప్రారంభిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఈ ఫిలిం స్కూలుకు సంబంధించిన పనులు ఆదివారం నాడు ప్రారంభమయ్యాయని ఓ ప్రకటనలో తెలిపారు. డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఈ స్కూలు తాను పెట్టడం లేదని భారతీరాజా అన్నారు. దీనివల్ల రాబోయే కాలంలో సమాజానికి మంచి దర్శకులు, కళాకారులు అందాలన్నదే తన ఏకైక లక్ష్యమని ఆయన చెప్పారు. దర్శకుడిగా పలు జాతీయ అవార్డులు పొందిన భారతీరాజా.. కమల్ హాసన్, రజనీకాంత్, సత్యరాజ్ లాంటి చాలామందిని తమిళ తెరకు పరిచయం చేశారు. 16 ఏళ్ల వయసు, టిక్.. టిక్.. టిక్, అలైగల్ ఒయివతిల్లై లాంటి అనేక హిట్ చిత్రాలు ఆయన చేతుల మీదుగానే వచ్చాయి. -
గ్లామర్ పోటీని తట్టుకోలేకే..
ఎవడు కాదన్నా, అవునన్నా అధిక శాతం హీరోయిన్లు గ్లామర్ మీదే ఆధారపడుతుంటారు. అందాలారబోతలో ఈ తరం హీరోయిన్లు పోటీ పడుతున్నారు. అలాంటి పోటీని ఎదుర్కొన్న వారే నిలదొక్కుకుంటున్నారు. అనుష్క, నయనతార వంటి తారలు అభినయంతో పాటు అందాలారబోతలోనూ విజృంభిస్తున్నారు, మేటి కథానాయికలుగా ప్రకాశిస్తున్నారు. కాజల్ అగర్వాల్, సమంత, హన్సిక వంటి క్యూట్ గర్ల్స్ గ్లామర్ విషయంలో రెచ్చిపోతున్నారు. వీరితో నటి కార్తీక పోటీ పడలేక పోయిందనే ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ బ్లాక్ బ్యూటీ తమిళం, తెలుగు, మలయాళం భాషలలో ఐదారు చిత్రాలు చేసినా వాటిలో మంచి విజయం సాధించిన చిత్రం కో ఒక్కటే. తన తల్లికి గురువు అయిన భారతీరాజా దర్శకత్వంలో అన్నకొడి చిత్రంలో నటించే అవకాశం రావడంతో కార్తీక ఎగిరి గంతేసింది. నిజం చెప్పాలంటే ఆ చిత్రంలో ఈ భామ అభినయానికి మంచి పేరే వచ్చింది. అయితే చిత్రం అపజయం పాలవడంతో కార్తీక దిగులు పడిపోయింది. అంతేకాదు ఆ తరువాత అవకాశాలు రాలేదు. అదే సమయంలో ఈమె చెల్లెలు తులసి కడల్ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ చిత్రం ఆమెను నిరాశ పరచింది. ఆ విధంగా అక్కాచెల్లెలిద్దరూ నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. దీంతో కార్తీకకు పెళ్లి చేయాలనే నిర్ణయానికి ఆమె తల్లి రాధ వచ్చినట్లు సమాచారం. వరుడివేటలో పడ్డట్టూ తెలిసింది. సరిగ్గా ఇలాంటి తరుణంలో కార్తీకకు పొరంబోకు చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. దీంతో మళ్లీ ఆశలు చిగురించడంతో పెళ్లి విషయాన్ని పక్కకు పెట్టారట. అయితే ఈ చిత్రంలోనూ కార్తీక అభినయానికి అవకాశం ఉన్న పాత్రేనట. గ్లామర్‌కు అంతగా స్కోప్ ఉండదట. మరి ఈ పాత్ర కార్తీక కెరీర్‌కు ఎంతగా ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే! -
కమల్ రూ.27వేలు, రజనీకి రూ.2,500
చెన్నై: 1977 నాటి మాట. ప్రస్తుత నట దిగ్గజాలు అయిన కమలహాసన్, రజనీకాంత్‌ల మధ్య స్నేహబంధం బలపడుతున్న కాలం అది. అప్పుడు వీరికి తెలియదు.. భవిష్యత్తులో సినీ కళామతల్లికి రెండు మూల స్తంభాలుగా నీరాజనాలర్పిస్తామని. అలాంటి కమల్, రజనీల అనుబంధాన్ని పెంచిన చిత్రం 16 వయదునిలే(పదహారేళ్ల వయస్సు). అవి కమల్ హీరోగా ఎదుగుతున్న రోజులైతే.. రజనీ నటుడిగా బిజీ అవుతున్న తరుణం. వీరిద్దరి కెరీర్‌ను మలుపుతిప్పిన 16 వయదునిలే చిత్రానికి సృష్టికర్త భారతీరాజా. ఈయనకు ఇది తొలి చిత్రం. ఈ చిత్ర నిర్మాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నేటి ప్రముఖ దర్శకుడు, నటుడు కె.భాగ్యరాజ్ ఈ చిత్రానికి సహాయ దర్శకుడు. ‘బామ్మ గొర్రెలను పెంచింది.. కోళ్లను పెంచింది.. కుక్కను పెంచలేదు.. దానికి బదులు నన్ను పెంచుకుంది’ అనే కమలహాసన్ డైలాగ్‌కు యూనిట్ అంతా కంటతడి పెట్టిందని కె.భాగ్యరాజ్ తెలిపారు. అదేవిధంగా శ్రీదేవి.. రజనీ ముఖంపై ఉమ్మేసే సన్నివేశంలో సబ్బు నురగ, పేస్టులంటూ ఏవేవో వేసినా దర్శకుడు భారతీరాజాకు సంతృప్తి కలగలేదు. అప్పుడు రజనీకాంత్.. శ్రీదేవిని నిజంగానే తనపై ఉమ్మేయమన్నారు. దీంతో సన్నివేశం సహజత్వంగా వచ్చిందని ఆయన తెలిపారు. దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ 16 వయదునిలే చిత్రానికి అధిక పారితోషికం చెల్లించింది కమలహాసన్‌కే అని చెప్పారు. ఆయన పారితోషికం రూ.27వేలని, మరో ముఖ్యమైన పాత్రకు నటుడి కోసం వెతుకుతుండగా.. స్టైలిష్‌గా, చలాకీగా ఉండే రజనీకాంత్ గుర్తొచ్చారని తెలిపారు. ఆయన్ను కలసి చిన్న ఆర్ట ఫిలిం చేస్తున్నాం.. మీరు నటించాలని కోరగా ‘ఆర్ట ఫిల్మా.. కథ చెప్పండి’ అంటూ విన్నారని చెప్పారు. రజనీకాంత్, పారితోషికం ఐదువేలు అడిగారని గుర్తు చేశారు. అయితే తాను మూడువేలు ఇవ్వగలనని చెప్పానని.. చివరకు 2,500 మాత్రమే ఇచ్చానని తెలిపారు. అందులో 500 ఇప్పటికీ చెల్లించలేదని వెల్లడించారు. ఇలాంటి పలు మధుర జ్ఞాపకాలను 36 ఏళ్లు తర్వాత ఒకే వేదికపై పంచుకున్నారు. ఆధునిక హంగులద్దుకుని మళ్లీ తెరపైకి రానున్న 16 వయసుదునిలే చిత్ర ప్రచార చిత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో వారు ఈ విషయాలను పేర్కొన్నారు.


