దర్శకుల మధ్య మాటల యుద్ధం
కుట్రపరంపరై కథ వివాదం కోలీవుడ్‌లో ఇద్దరు ప్రముఖ దర్శకుల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తోంది.ఆ ఇద్దరు దర్శకులు భారతీరాజా, బాలా. ఆ కథ ఎవరికి సొంతం అన్న విషయంలో వీరిద్దరి మధ్య విమర్శలకు దారి తీసింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. మొత్తం మీద కుట్రపరంపరై కథను ఇద్దరు తెరకెక్కించడానికి సిద్ధపడుతుండడం కోలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది. బాలా కుట్రపరంపరై కథతో చిత్రం తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు.
భారతీరాజా ఇప్పటికే కుట్రపరంపరై పేరుతో చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.దీంతో వీరిద్దరి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం సాగుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు బాలా శుక్రవారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించాలన్నది తన అభిమతం కాదన్నారు.అయితే కొన్ని నిజాలను చెప్పాల్సిన అవసరం తనకుందన్నారు. చాలా విషయాలు మనసును గాయపరచాయన్నారు.
భారతీరాజాకు, తనకు పోరాటం వల్ల ఈ భూమికి ఒరిగేదేమీలేదన్నారు. తన కథకు, భారతీరాజా చిత్రకథకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తన ఎంగిలి దర్శకుడు బాలా తినరని భావిస్తున్నాన్న భారతీరాజా వ్యాఖ్యలు చిన్నపిల్లల మనస్తత్వాన్ని గుర్తుకు తెస్తున్నాయని,వయసు మీద పడుతున్న కొద్దీ చిన్న పిల్లల్లా తయారవుతారంటారని అందువల్ల ఆయన ఆ వ్యాఖ్యల్ని పట్టించుకోవడం లేదని అన్నారు.
తాను బాలుమహేంద్ర వద్ద మినహా ఎవరి వద్దా పని చేయలేదని వివరించారు. ఇప్పటికే తనపై అసత్య ఆరోపణలు చేశారనీ, ఇకపై అలాంటివి ఆపేయాలని లేకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సంస్కృతి, సంప్రదాయం,ఊరు, మన్ను, వీరం లాంటివి ఎన్నైనా చెప్పుకోండని జాతి, మతం విభేదాలకు పోవడం అయోగ్యతనం అని బాలా వ్యాఖ్యానించారు.