కమల్ రూ.27వేలు, రజనీకి రూ.2,500
చెన్నై: 1977 నాటి మాట. ప్రస్తుత నట దిగ్గజాలు అయిన కమలహాసన్, రజనీకాంత్‌ల మధ్య స్నేహబంధం బలపడుతున్న కాలం అది. అప్పుడు వీరికి తెలియదు.. భవిష్యత్తులో సినీ కళామతల్లికి రెండు మూల స్తంభాలుగా నీరాజనాలర్పిస్తామని. అలాంటి కమల్, రజనీల అనుబంధాన్ని పెంచిన చిత్రం 16 వయదునిలే(పదహారేళ్ల వయస్సు). అవి కమల్ హీరోగా ఎదుగుతున్న రోజులైతే.. రజనీ నటుడిగా బిజీ అవుతున్న తరుణం. వీరిద్దరి కెరీర్‌ను మలుపుతిప్పిన 16 వయదునిలే చిత్రానికి సృష్టికర్త భారతీరాజా. ఈయనకు ఇది తొలి చిత్రం. ఈ చిత్ర నిర్మాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి.
నేటి ప్రముఖ దర్శకుడు, నటుడు కె.భాగ్యరాజ్ ఈ చిత్రానికి సహాయ దర్శకుడు. ‘బామ్మ గొర్రెలను పెంచింది.. కోళ్లను పెంచింది.. కుక్కను పెంచలేదు.. దానికి బదులు నన్ను పెంచుకుంది’ అనే కమలహాసన్ డైలాగ్‌కు యూనిట్ అంతా కంటతడి పెట్టిందని కె.భాగ్యరాజ్ తెలిపారు.
అదేవిధంగా శ్రీదేవి.. రజనీ ముఖంపై ఉమ్మేసే సన్నివేశంలో సబ్బు నురగ, పేస్టులంటూ ఏవేవో వేసినా దర్శకుడు భారతీరాజాకు సంతృప్తి కలగలేదు. అప్పుడు రజనీకాంత్.. శ్రీదేవిని నిజంగానే తనపై ఉమ్మేయమన్నారు. దీంతో సన్నివేశం సహజత్వంగా వచ్చిందని ఆయన తెలిపారు.
దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ 16 వయదునిలే చిత్రానికి అధిక పారితోషికం చెల్లించింది కమలహాసన్‌కే అని చెప్పారు. ఆయన పారితోషికం రూ.27వేలని, మరో ముఖ్యమైన పాత్రకు నటుడి కోసం వెతుకుతుండగా.. స్టైలిష్‌గా, చలాకీగా ఉండే రజనీకాంత్ గుర్తొచ్చారని తెలిపారు. ఆయన్ను కలసి చిన్న ఆర్‌ట ఫిలిం చేస్తున్నాం.. మీరు నటించాలని కోరగా ‘ఆర్‌ట ఫిల్మా.. కథ చెప్పండి’ అంటూ విన్నారని చెప్పారు.
రజనీకాంత్, పారితోషికం ఐదువేలు అడిగారని గుర్తు చేశారు. అయితే తాను మూడువేలు ఇవ్వగలనని చెప్పానని.. చివరకు 2,500 మాత్రమే ఇచ్చానని తెలిపారు. అందులో 500 ఇప్పటికీ చెల్లించలేదని వెల్లడించారు. ఇలాంటి పలు మధుర జ్ఞాపకాలను 36 ఏళ్లు తర్వాత ఒకే వేదికపై పంచుకున్నారు. ఆధునిక హంగులద్దుకుని మళ్లీ తెరపైకి రానున్న 16 వయసుదునిలే చిత్ర ప్రచార చిత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో వారు ఈ విషయాలను పేర్కొన్నారు.