
పుష్కరకాలం క్రితం ఒక మునిమాపు వేళ హైదరాబాద్ నగరంలో 18 మంది అమాయకుల ప్రాణాలు తీసిన బాంబు పేలుళ్ల ఉదంతాల్లో దోషులుగా తేలిన ఆరుగురు నిందితులకూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం విధించిన మరణశిక్షను ధ్రువీకరిస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు బాధిత కుటుంబాలకు మాత్రమే కాదు, ఉగ్రవాద ఘటనలను వ్యతిరేకించే వారందరికీ ఊరటనిస్తుంది.
నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో రెండుచోట్ల జరిగిన ఈ పేలుళ్లలో మరో 131 మంది గాయాల పాలయ్యారు. వారిలో చాలామంది ఈనాటికీ ఆ గాయాలు కలిగించిన శారీరక, మానసిక క్లేశాల నుంచి కోలుకోలేకపోతున్నారు. మరణశిక్ష పడిన వారిలో రియాజ్ భత్కల్ అనే ఉగ్రవాది ఇప్పటికీ పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడు.
ఈ పేలుళ్లకు పథకం పన్నడంతోపాటు అందుకు కావల్సిన నిధుల సమీకరణ, పేలుడు పదార్థాలు, మనుషుల్ని సమకూర్చుకోవటం వగైరాలకు సూత్రధారి రియాజే. ఏవో కొన్ని ఉగ్రవాద ఘటనల ద్వారా దేశంలో అల్లకల్లోలం సృష్టించవచ్చని, దేశాన్ని బలహీనపరచవచ్చని ఈ బాపతు ఉగ్రవాదులు కలలుగంటారు.
ఉగ్రవాదం మామూలు ఉన్మాదం కాదు. అది ఎప్పుడు ఎక్కడ తన విషపుకోరలు చాస్తుందో... ఎవరిని కాటేస్తుందో అంచనా వేయటం కూడా అసాధ్యం. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలు అక్కడి సైన్యం, దాని గూఢచార విభాగం ఐఎస్‌ఐ సహకారంతో శిక్షణ శిబిరాలు నిర్వహించటం, యువకులను తప్పుడు మార్గానికి మళ్లించటం, సాధారణ ప్రజానీకానికి హాని కలిగించగల చర్యలకు ప్రేరేపించటం దశాబ్దాలుగా సాగుతోంది.
ఆ సంస్థల ప్రేరణతో సొంతంగా ఉగ్రవాద సంస్థలను నెలకొల్పి భయోత్పాతాన్ని సృష్టించటం భత్కల్ లాంటివారికి లాభసాటి వ్యాపారంగా కూడా మారిందని దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఉదంతంపై చేసిన దర్యాప్తులో వెల్లడైంది. మంగళూరు సమీప ప్రాంతాల్లో రియాజ్ భత్కల్ భారీయెత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు నిర్వహించాడని, జిహాద్ పేరుతో దేశంలోనూ, వెలుపలా లక్షలాది రూపాయలు వసూలు చేసి సొంత ఖాతాలకు మళ్లించుకున్నాడని కూడా బయటపడింది.
తమను తాము మత సంరక్షకులుగా చిత్రించుకోవటం, జిహాద్ చేస్తున్నామని మభ్యపెట్టడం భత్కల్ లాంటివారికి రివాజు. వీరి వలలోపడి అనేకమంది యువకుల జీవితాలు నాశనమయ్యాయి. జనసమ్మర్దంగల ప్రాంతాల్లో బాంబులుంచి సాధారణ పౌరుల ప్రాణాలకు హాని కలిగించే ఇలాంటి వారికి కఠినమైన శిక్ష విధించటం సమాజ శ్రేయస్సు కోసం తప్పనిసరి.
ఈ పన్నెండేళ్ల కాలంలోనూ వీరు తమ చర్యలకు పశ్చాత్తాపం ప్రకటించటంగానీ, ఇకపై సత్ప్రవర్తనతో మెలుగుతామని గానీ ఎక్కడా చెప్పలేదు. వీరిలో పరివర్తనకూ లేదా సంస్కరణకూ అవకాశమే లేదని నిర్ధారణ కొచ్చినట్టు ఉన్నత న్యాయస్థానం చెప్పిందంటే ఈ నేరగాళ్లు ఎంత కరుడు గట్టిపోయారో అర్థమవుతుంది.
ఉగ్రవాదులు మతం పేరు చెప్పుకోవచ్చుగానీ ఏ మతమూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు. ఉగ్రవాదానికి అసలు మతం ఉండదు. ఇలాంటి నేరగాళ్ల చర్యల వల్ల మాత్రమే మతం సురక్షితంగా మనుగడ సాగించగలదని అందులోని వారెవరూ విశ్వసించరు కూడా! కానీ అమాయకులను నమ్మించటానికి వీరు మతాన్ని సాధనంగా వాడుకుంటారు.
వారిని మభ్యపెట్టడం కోసం ఆధ్యాత్మి కతను ప్రబోధిస్తారు. క్రమేపీ తమ దురాలోచనను వారి మెదళ్లలోకి ఎక్కిస్తారు. అప్పటికల్లా ఆ యువకులు వీరి చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతారు. ఇలాంటివారికి చివరకు మిగిలేదేమిటో, వారి మానసిక, శారీరక స్థితిగతులు ఎలా దిగజారతాయో తెలియటానికి జాతీయ న్యాయ విశ్వ విద్యాలయ విద్యార్థులు కొందరు వారితో మాట్లాడి రూపొందించిన నివేదికే సాక్ష్యం.
భిన్న వర్గాల ప్రజల మధ్య చిచ్చురేపి దేశాన్ని విచ్ఛిన్నం చేయటానికీ, సమాజాన్ని భయభ్రాంతపరచటానికీ వీరు పాల్పడిన చర్యల వల్ల ఎక్కడెక్కడి నుంచో పొట్టకూటి కోసం ఈ మహానగరాని కొచ్చిన సాధారణ ప్రజానీకం బలయ్యారు. అందులో అన్ని మతాలవారూ ఉన్నారు. ఇంకా అమ్మ కడుపులోనే ఉన్న శిశువు మొదలుకొని స్త్రీలు, పిల్లలు కూడా వీరి మతిమాలిన చేష్టలకు బలైపోయారు.
అనేకమంది జీవితాలు అనిశ్చితిలో పడ్డాయి. మనుషులైవుండి తోటి మనుషుల పట్ల ఇంత క్రూరంగా, ఇంత దారుణంగా వ్యవహరించటం ఊహకందనిది. ఇలాంటి ఉదంతాల్లో ఆచూకీ దొరక్కుండా సులభంగా తప్పించుకోవచ్చని, నేర నిరూపణ అసాధ్యమని నేరగాళ్లు భావిస్తుంటారు. కానీ సాంకేతికత బాగా పెరిగిన ఈ కాలంలో అదేమంత కష్టం కాదని పకడ్బందీ దర్యాప్తు ద్వారా ఎన్‌ఐఏ నిరూపించింది.
అయితే ఇలాంటి కేసుల్లో ఇమిడివుండే సంక్లిష్టతల వల్ల కావొచ్చు... మన న్యాయస్థానాలకు ఉండే పెండింగ్ కేసుల భారం వల్ల కావొచ్చు విచారణకు సుదీర్ఘ సమయం పడుతోంది. ఈ ఉదంతం చోటుచేసుకున్ననాటినుంచీ చూస్తే ఇప్పటికి పన్నేండేళ్ల సమయం పట్టింది. త్వరితగతిన విచారించి శిక్షించే వ్యవస్థ ఉంటే అలాంటి బాటలో పోయేవారికి అదొక హెచ్చరికగా పనికొస్తుంది.
ఈ తరహా భయోత్పాత చర్యలకు ఒక నిరోధంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఉదంతంలో అయిన వారిని కోల్పోయినవారికీ, ప్రాణాలతో బయటపడి భారంగా బతుకీడుస్తున్నవారికీ ఇప్పటికీ ప్రభుత్వ సాయం అందలేదంటే మనసు చివుక్కుమంటుంది. కాళ్లూ చేతులూ కోల్పోయి, చూపు, వినికిడి దెబ్బతిని, కనీసం మందులు కొనే శక్తిలేక అనేకులు కష్టాలు పడుతుండటం కలచివేస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి.