నా కూతురు పోయాకే చేదు నిజం తెలుసుకున్నా.. ఇళయరాజా ఎమోషనల్‌ | Ilayaraja Emotional Comments On Daughter Bhavatharini, I Neglected My Children | Sakshi
Sakshi News home page

Ilayaraja: ఇప్పటికీ మనసులో ఆ బాధ నన్ను వేధిస్తూనే ఉంది.. కూతుర్ని కోల్పోయాకే..

Published Sun, Jan 26 2025 4:35 PM | Last Updated on Sun, Jan 26 2025 4:57 PM

Ilayaraja Emotional Comments On Daughter Bhavatharini, I Neglected My Children

కళ్లముందు కూతుర్ని కోల్పోవడం కంటే విషాదం మరొకటి ఉంటుందా? ఆ కడుపుకోతను సంగీత జ్ఞాని ఇళయరాజా అనుభవిస్తున్నాడు. గతేడాది జనవరి 25న ఆయన కూతురు, గాయని, సంగీత దర్శకురాలు భవతారిణి క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూసింది. ఆమె మొదటి వర్ధంతి సందర్భంగా కూతుర్ని తలుచుకుని ఇళయారాజా భావోద్వేగానికి లోనయ్యాడు.

నిర్లక్ష్యం చేశా..
ఇళయరాజా (Ilayaraja) మాట్లాడుతూ.. నేను ఎంతగానో ప్రేమించే నా కూతురు దూరమై ఏడాదవుతోంది. తను మాతో లేదన్న బాధ ఇప్పటికీ నన్ను వేధిస్తోంది. తను నాపై ఎంత ప్రేమ కురిపించేది.. ఎంత ఆప్యాయత చూపించేదన్న విషయం తనను కోల్పోయాకే తెలుసుకున్నాను. నా జీవితమంతా సంగీతానికే ధారపోశాను. ఈ క్రమంలో నా కుటుంబాన్ని పట్టించుకోలేదు. పిల్లల్ని నిర్లక్ష్యం చేశాను. వారికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను. ఈ చేదు నిజం నన్ను కుంగదీస్తోంది.

సంగీతంతో స్వాంతన
సంగీతం ఎంతోమందికి ఓదార్పునిస్తుందంటారు. ఇలాంటి క్లిష్ట సమయంలో అదే సంగీతం నాకూ కొంత స్వాంతన కలిగిస్తోంది. ఫిబ్రవరి 12న నా కూతురి పుట్టినరోజు. ఆరోజు నా కూతురికి నివాళిగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను. నా సన్నిహితులను, ఇండస్ట్రీ మిత్రులను అందరినీ ఈ ప్రోగ్రామ్‌కు ఆహ్వానిస్తాను. నా కూతురు ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. 

(చదవండి:సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత)

సింగర్‌గా భవతారిణి
ఇళయరాజాకు కూతురు భవతారిణితో పాటు కార్తీక్‌ రాజా, యువన్‌ శంకర్‌ రాజా అని ఇద్దరు కుమారులు సంతానం. మలయాళ త్రీడీ ‘మై డియర్‌ కుట్టి చాత్తాన్‌’ (1984) గాయనిగా భవతారణికి తొలి చిత్రం. ప్రభుదేవా హీరోగా నటించిన ‘రాసయ్య’ (1995) మూవీ ద్వారా సింగర్‌గా తమిళ చిత్రపరిశ్రమకు పరిచయమైంది. ‘భారతి’ (2000) చిత్రంలోని ‘మైలు పోల పొన్ను..’ పాటకు గాను జాతీయ ఉత్తమ గాయనిగా కేంద్ర ప్రభుత్వ అవార్డు అందుకుంది. తెలుగులోనూ పలు పాటలు పాడింది.  ‘గుండెల్లో గోదారి’ సినిమాలో ‘నన్ను నీతో..’ అనే పాటను ఆలపించింది.

మ్యూజిక్‌ డైరెక్టర్‌గానూ..
‘మిత్ర్‌: మై ఫ్రెండ్‌’తో సంగీత దర్శకురాలిగా మారారు భవతారణి. సల్మాన్‌ ఖాన్, అభిషేక్‌ బచ్చన్, శిల్పాశెట్టి ముఖ్య తారలుగా వచ్చిన హిందీ చిత్రం ‘ఫిర్‌ మిలేంగే’ (2004) సినిమాకు ఓ సంగీత దర్శకురాలిగా చేశారు. హిందీలో ఇదే తన తొలి సినిమా. దాదాపు పాతిక చిత్రాల్లో సాంగ్స్‌ పాడగా పది సినిమాలకు సంగీత దర్శకురాలిగా పని చేసింది. శబరిరాజ్‌ అనే వ్యక్తితో భవతారణి వివాహం జరిగింది.. కానీ, వీరికి  సంతానం లేదు.

చదవండి: వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం'.. 12 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement