పిల్లల కోసం సాహసం!
ప్రస్తుతం చెన్నై అంతా అల్లక ల్లోలంగా ఉన్న సంగతి తెలిసిందే. తుపాను కారణంగా అక్కడి రహదారులు జలమయమయ్యాయి. జనాలు బయటికి రాలేని పరిస్థితి. కొన్ని ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొంతమంది ఎక్కడికెళ్లాలో తెలియక ఉన్న చోటే ఇరుక్కుపోయారు. అక్కడికి రాకపోకలు కూడా కష్టమవుతున్నాయ్. అలాంటివాటిలో నుంగంబాక్కంలోని ‘లిటిల్ ఫ్లవర్ స్కూల్’ ఒకటి ఉంది. మూగ, చెవిటి, అంధ బాల బాలికలకు చెందిన స్కూల్ అది. అన్నపానీయాలు లేని పరిస్థితిలో అక్కడి పిల్లలు దయనీయ స్థితిలో ఉన్నారు.
ఈ విషయం ఫేస్బుక్ ద్వారా, రేడియో ద్వారా బయటికొచ్చింది. ఆ స్కూల్‌కు మోకాళ్లు లోతు నీటిలో కొంతదూరం నడుచుకుంటూ వెళ్లి, ఆ తర్వాత పడవలో వెళ్లాలి. రిస్క్‌తో కూడుకున్నదే. అయినా మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా తెగించారు. ఆహార పదార్థాలు తీసుకుని వ్యయప్రయాసలకోర్చి ఆ స్కూల్‌కి చేరుకున్నారు. పిల్లలందరికీ ఫుడ్ బాక్సులను అందజేశారు.
ఆకలి తీరుతోందన్న ఆనందం ఓవైపు, స్వయంగా ఇళయరాజా వచ్చారన్న ఆనందం మరోవైపు.. ఆ పిల్లలను కన్నీటి పర్యంతం చేసింది. చూపు లేని పిల్లలు రాజా సార్‌ని చేతులతో ఆప్యాయంగా తడిమారు. చేతులను ముద్దాడారు. కాళ్లకు నమస్కారం చేశారు. చిన్నారుల స్పర్శకు ఇళయరాజా ఉద్వేగానికి లోనయ్యారు. అప్పటికప్పుడు వాళ్ల కోసం భక్తి పాటలు పాడారు. ‘‘మీ ప్రార్థనలను దేవుడు వింటున్నాడు.
భయపడకండి’ అని పిల్లలకూ, ఆ స్కూల్‌కి చెందిన సిస్టర్స్‌కు ధైర్యం చెప్పారు. ఇళయరాజా వయసు 72. ఈ వయసులో మోకాళ్ల లోతు నీళ్లల్లో నడుచుకుంటూ వెళ్లడం, పడవ ప్రయాణాలు చేయడం రిస్కే. పిల్లల కోసం ఆయన ఈ సాహసం చేశారు. రాజా సార్ సో గ్రేట్ కదూ.