సంగీత విభావరిలో ఇళయరాజా
హైదరాబాద్: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా హైదరాబాద్‌లో తొలిసారి నిర్వహించిన సంగీత విభావరి ఆహూతులను ఉర్రూతలూగించింది. ఆదివారం రాత్రి గచ్చిబౌ లిలోని జీఎంసీ బాలయోగి స్డేడియంలో జరిగిన ఈ కార్యక్రమం మ్యూజిక్ లవర్స్‌తో కిక్కిరిసిపోయింది. చల్లని సాయంత్రం వేళ నగర జనాలు సంగీత సాగరంలో ఓలలాడారు. ఇళయరాజా సుస్వరాలకు మంత్రముగ్ధులయ్యారు. ‘జగదానంద కారకా’ అంటూ భక్తి గీతంతో మొదలైన కార్యక్రమం.. ‘హలో గురూ ప్రేమ కోసమే.. అబ్బనీ తీయనీ దెబ్బ.. ప్రేయసి రావే.. నిన్ను కోరీ వర్ణం.. తదితర గీతాలతో అభిమానులకు వీనులవిందును అందించింది.
‘నామాటే మంత్రం.. నా మనసే బంగారం’ అంటూ ఇళయరాజా స్వయంగా పాడిన పాట ఆకట్టుకుంది. సంగీత విభావరికి హంగేరి దేశస్తులు అద్భుత వాద్య సహకారం అందించారు. బిడ్డల కోసం వంట చేసిన తల్లి వాత్సల్యం గురించి వివరించే సందేశాత్మక గీతానికి వారిచ్చిన ప్రదర్శన ‘అదుర్స్’ అనిపించింది. ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ.. హార్మోనియం తన నేస్తమన్నారు. కార్యక్రమంలో చిరంజీవి, మోహన్‌బాబు సహా సినీ ప్రముఖలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment