
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ తను చేసిన సాయాన్ని బయటిప్రపంచానికి పెద్దగా చెప్పుకోడు. అయితే, కొన్ని సందర్భాల్లో ఆ సాయం పొందిన వారు ఏదో వేదిక మీద చెప్పిన తర్వాత వైరల్ అవుతుంటుంది. ఈయన ఇప్పటికే కమల్ సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేసి వందల మందికి విద్యాదానం చేస్తున్నారు. తాజాగా ఒక పేద విద్యార్థిని ఉన్నత విద్యకు సాయం అందించారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా, పాంబన్ సమీపంలోని తెర్కువాడి మత్స్యకార గ్రామానికి చెందిన శోభన అనే విద్యార్ధిని ప్లస్ –2 పరీక్షల్లో 562 మార్కులు సాధించింది.
ఈమె తండ్రి మత్స్యకారుడు. తల్లి పీతలు ఎగుమతి కంపెనీలో రోజువారీ కూలీ. కాగా తాను చదివిన ప్రభుత్వ పాఠశాలలోనే అత్యధిక మార్కులు సాధించిన విధ్యార్ధిని శోభన. ఈమెకు ఉన్నత విద్యను అభ్యసించి సివిల్ సర్వీస్ పరీక్షలు రాయాలన్నది ఆశ. అయితే కుటుంబ ఆర్థిక స్థోమత లేకపోవడంతో శోభన చదువు మానేసి ఒక బట్టల దుకాణంలో పనికి చేరింది.
ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కమలహాసన్ విద్యార్ధిని శోభనను తన కార్యాలయానికి పిలిపించి కమల్ సాంస్కృతి కేంద్రం ద్వారా ఆమె ఉన్నత విద్యకు అయ్యే ఖర్చులకు సాయం చేశారు. తను సివిల్ సర్వీస్ పరీక్షలు రాసేవరకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. తన సంరక్షణలోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆపై సివిల్ సర్వీస్‌కు కావాల్సిన వనరులు ఏర్పాటు చేస్తానని శోభనకు ఆయన మాట ఇచ్చారు. దీంతో శోభన కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. కమల్ సార్ చేసిన సాయాన్ని ఎట్టిపరిస్థితిల్లోనూ వృధా కానివ్వనని శోభన చెప్పింది. తాను సివిల్ సర్వీస్ సాధించి తప్పకుండా సమాజ శ్రేయస్సు కోసం పాటు పడుతానని మాటిచ్చింది.