టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్‌లో కూడా ప్రస్తుతం సీక్వెల్స్ సీజన్ నడుస్తుందనే చెప్పాలి. తెలుగులో సలార్, కల్కి, దేవర చిత్రాలకు సీక్వెల్స్ ఉంటాయని ప్రకటించారు. అయితే వీటికి సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు. తమిళ చిత్రాలు విషయానికొస్తే భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన భారతీయుడు – 2 చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. అయినప్పటికీ ఈ చిత్రానికి 3వ సీక్వెల్‌ని కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా తాజాగా విడులైన సూర్య కథానాయకుడిగా నటించిన కంగువ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని పేర్కొన్నారు. కంగువ చిత్రం కూడా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దీనికి సీక్వెల్ నిర్మాణానికి కూడా కొంత సమయాన్ని తీసుకుంటున్నట్లు నిర్మాత చెబుతున్నారు.
ఇక అసలు విషయానికొస్తే శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించిన భారతీయుడు చిత్రం 1996లో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. దీంతో దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అది తెర రూపం దాచడానికి 28 ఏళ్లకు పైగా పట్టింది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నా భారతీయుడు – 3 చిత్రాన్ని కూడా ఏకకాలంలో రూపొందించారు. అయితే భారతీయుడు – 2 చిత్రం విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో పార్ట్ – 3 విడుదల సందిగ్ధంలో పడింది. ఈ క్రమంలోనే దీనిని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ప్రచారం కూడా జరిగింది.
అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయడానికి దర్శకుడు శంకర్, నటుడు కమలహాసన్ సిద్ధంగా లేరని తెలిసింది. అదేవిధంగా భారతీయుడు– 2 మాదిరిగా పార్ట్- 3 కాకూడదని వారు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయమని నటుడు కమలహాసన్ దర్శకుడు శంకర్‌కు సూచించినట్లు సమాచారం. శంకర్ కూడా అందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
రూ.100 కోట్లు ఉంటేనే..
భారతీయుడు – 3 చిత్రం కోసం ఆయన నిర్మాణ సంస్థ లైకాకు మరో రూ.100 కోట్లు బడ్జెట్‌ను సమకూర్చమని చెప్పినట్లు సమాచారం. కాగా శంకర్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ నటుడు రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన తెరపైకి రానుంది. ఆ తర్వాత భారతీయుడు– 3 చిత్ర రీషూట్‌కు శంకర్ రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment